Tuesday, January 19, 2021

తిట్టుకోడం మనకు కొత్తేమీ కాదు -కర్లపాలెం హనుమంతరావు

 



అచ్చు తెనుగులో అధిక్షేపం అంటే తిట్టు. తిట్లు తెలుగువాళ్లకు కొత్త విద్యేం కాదు. బాధ, కష్టం, పగ, అసూయ, అసహ్యం లాంటి వికారాలు కలియబెడితే బండరాయిలా పడుంటాడా మనసున్న ఏ మనిషైనా! మామూలు మనుషులైతే ఏ నీళ్ల పంపు దగ్గరో తంపులు పెట్టుకుంటారు. అదే నాలుగు అక్షరమ్ముక్కలు ముక్కుకు బట్టిన పెద్దమనిషైతే ?

పద్యాలు, పాటల రూపంలో తిట్ల దండకం కురిపిస్తాడు. గొడ్డుకో దెబ్బలాగా మనిషికో మాట. ఆ మాటను తూటాలాగా వదలడం తేలికేమోగాని, నాలుగు కాలాలపాటు నలుగురూ చెప్పుకునేలా  వదరడం సులభం కాదు. రెండర్థాలు, గూఢార్థాలు, పెడసరప్పోకడలు పోయినప్పుడే  పదిమంది నోట్లో తిరిగి తిరిగి పలకగలిగేది. కష్టపడి కావ్యాలు రాస్తే మెచ్చుకోడం మాట అటు పక్కనుంచి, పనిగట్టుకుని వంకలు పెట్టే ప్రబుద్ధులు కొంతమంది ఎప్పుడూ ఉంటారు. అట్లాంటి వాళ్లని గురించి పూర్వం మన ప్రబంధాలు రాసే కవులు 'కుకవినింద' వంకన కావ్యంలోనే తమ కడుపుబ్బరం తీర్చుకొనేవాళ్లు. నన్నచోడుడు అనే కవిగారు కుమారసంభవం అనే కావ్యం రాస్తూ  ఈ తరహా కుకవులను 'దొంతులు దొర్లించే కుక్కలతో పోల్చి మరీ తన కడుపుబ్బరం తీర్చుకున్నాడు. మంచి గుణాలను దోషాలుగా ఎత్తి చూపించి ఎద్దేవా చేసే ఈ తరహా పెద్దమనుషులు ఒక్క సాహిత్యరంగంలో ఏం ఖర్మ.. అన్నింటా.. అన్ని కాలాలలో తారసపడుతుంటారు. కాబట్టే నన్నయగారంతటి మహానుభావుడిక్కూడా తన వంతు  మహాభారతంలో ఈ తరహా నిక్షేపరాయుళ్లను గురించి 'శిశుపాలుడు' పాత్రను అడ్డం పెట్టుకుని ప్రస్తావించక తప్పింది కాదు. భీష్ముడు చెప్పాడని చెప్పి ధర్మారాజు శ్రీకృష్ణుడికి రాజసూయ యాగం చేసే సందర్భంలో ఆర్ఘ్యమిస్తాడు. సాటి యాదవరాజుకు అంత లావు గౌరవం దక్కడంతో కడుపు మండిన శిశుపాలుడు, 'వసుదేవుడు అంతటి ముసిలాయన ఉన్న సభలో వాసుదేవుడికే ఎందుకు ఈ సత్కారం? ధర్మయుక్తులు తెలిసిన ద్వైపాయనుడున్న చోట ఋత్విజుడనా కృష్ణుడికి ఈ  గౌరవం?ద్రోణుడు, కృపాచార్యులు వంటి గొప్ప గురువులు ఎదుటనే ఏ గురుభావం చూసి నల్లనయ్య పట్ల ఇంత వినయం? యాదవరాజులు ఎంతో మంది అవని మీద ఘనంగా ఏలుతుండగా ఏ భూనాథుడన్న బుద్ధితో ఓ గొల్లకాపరికీ పెద్దరికం?పూజనీయులైన పురుషులింత మంది సమక్షంలో ఏ దీక్షాదక్షతలున్నాయనయ్యా ధర్మరాజా, భీష్మాచార్యుల మాట విని ఈ గొడ్లుకాచుకునేవానికి ఇంత గొప్ప పురస్కారమిచ్చింది?' అని రొష్టు పడతాడు శిశుపాలుడు.

ఇహ తెలుగు మాటకు వెటకారం నేర్పిన తిక్కనగారి కలం పోట్లను గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది. విరాటపర్వంలో తాను కీచుకుడి భయాన అనాచ్ఛిదితగా  నిండు సభామధ్యమంలోకి నాటకీయంగా జొరబడటాన్ని కంకుభట్టు వేషంలో ఉన్న మొగుడు ధర్మరాజు తప్పుపట్టడం చూసి మనసు దెబ్బతిన్న ద్రౌపది ' నా మొగుడూ నాటకాలరాయుడే! పెద్దాళ్లను బట్టే కదా చిన్నవాళ్లు నడుచుకొనేదీ?' అని ఎదురు దెబ్బకొట్టేస్తుంది. అహం మీద దెబ్బ పడితే చిన్నా పెద్దా అన్న తారతమ్యం చూడనీయదు బుద్ధి. భాగవతంలో హిరణ్యకశిపుడు వంశాచారానికి విరుద్ధంగా విష్ణుభక్తుడవుతున్నందున కన్నకొడుకు ప్రహ్లాదుణ్ణి సైతం తన అసురవంశం అనే శరీరంలో పెరిగే 'దుష్టాంగం'గా తిట్టిపోస్తాడు. మిగిలిన అంగాలను రక్షించుకునే నిమిత్తం చికిత్స కింద ఆ 'కులద్రోహి' ని అధముడిగా భావించి శిక్షించడానికైనా వెనుకాడడు. అసురలదేముంది? ఆ దేవుళ్లకే కోపాలు అదుపులో లేని సందర్భాలు బోలెడన్ని తెలుగుసాహిత్యంలో. శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో కాశీని శపించిన వ్యాసులవారి మీద పట్టరాని కోపంతో తిట్లకు లంకించుకుంటాడు సాక్షాత్తూ విశ్వేశ్వరుడు. 'ఓరి దురాత్మ నీవారముష్టిం పచాభాస యోజన గంధి ప్రథమ పుత్ర/దేవరన్యాయ దుర్భావనా పరతంత్ర, బహుసంహితా వృథా పాఠపఠన.. ' అని తిట్టిపోసినా ఆవేశం చల్లారని ఆ ఈశుడు అంత గొప్ప పంచమవేదం మహాభారతం రచించిన మహాపండితుడు వ్యాసుడిని పట్టుకుని చివరకు 'భారత గ్రంథ పండితమ్మన్య'గా తేల్చేశాడు. 'పండితమ్మన్య' అంటే పండితుడు కాని పండితుడు అని  శ్లేషార్థం.

ధూర్జటి మహాశివభక్తుడు. కానీ ఏ కారణం చేతనో రాజులు పేరు వింటే చాలు మహా రాజుకుంటుంది ఆ శైవుడి మనసు. ఒకానొక సందర్భంలో 'రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం/భోజాక్షీ చతురంతయానతురగీభూషాదు లాత్మవృథా/బీజమబుల్' అని తిట్టిపోసిన సందర్భం అందుకు ఉదాహరణ. కారణం, కర్జం ఉండి తిడితే అదో రకం. 'తగుపాటి కవులకియ్యని మొగముండల కేలగలిగె మూతిన్ మీసల్' అంటూ 'ఇయ్యగ నిప్పించగల యయ్యలకేగాక మీసమందరికేలా?' అన్న భావం గల కవిచౌడప్పల తరహా ఘంటా ఘోషంగా దాతృత్వగుణం లేనివారిని తగులుకున్న కవులూ మనకేమీ తక్కువగా లేరు. 'ఊరక సజ్జనుండొదిగి యుండిననైన దురాత్మకుండు ని/ష్కారణమోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా ' అభ్యసించే అల్పులను, లోభులను భాస్కర శతకకారుడు తరహాలో 'నూరు టంకాలు ఖరీదు చేసే చీరలు పెట్టెకు నిండుగా ఉన్నప్పుడు అవి చినిగిపోయే వరకు కొరికే చిమ్మట పురుగులతో పోల్చి  తిట్టిన కవులూ లేకపోలేదు. నిష్కారణంగా పరులకు కీడుచేసే పెడబుద్ధులను తిట్టిపోసిన కవులను లెక్కించడానికి చేతివేళ్లు, కాలివేళ్లు మనకు ఇంకెన్ని వందలున్నా చాలవు. 'అల్పుడైన వానికి అధికారమిచ్చిన,/ దొడ్డవారినెల్ల తొలగగొట్టు' అంటూ నిత్యం లోకంలో జరుగుతున్న అక్రమాలను కళ్లారా చూస్తూ కూడా వాళ్లని మన వేమన తరహాలో ఏ 'చెప్పు తినే కుక్కలతో' పోల్చి తిట్టుకోకుండా ఎలా ఉండగలం? పది నీతులతో పాటు పది బూతులనూ పద్యంతో కలిపి సభలో  ధైర్యంగా చదివినవాడే ఘనుడైన కవి అని చౌడప్పలాంటి కవులు ఎప్పుడూ వచ్చిపోతూనే ఉంటారనడానికి వెల్లువలా కురిసి వెలసిన దిగంబర కవిత ఉద్యమ ఉధృతే ఒక ఉదాహరణ. నీతి ఉపదేశం కోసమూ బూతును ఆశ్రయించడం ఒక విచిత్రమైన సిద్ధాంతంలా కనిపిస్తుంది. కాని ఆ ఉపదేశం లక్ష్యం సంపూర్ణంగా నెరవేరడం ఆలకించే నాథుడిలో వివేచన మేల్కొన్నప్పుడే. అందరూ వందిమాగదులే పోగయిన చోట  ఒక మాట ప్రత్యేకంగా వినిపించడానికి కొద్దిమంది బుద్ధిమంతులు తొక్కే  బాటను అర్థంచేసుకోవచ్చు. 'కోకిలేన కృతం మౌనం ప్రావృట్కాలే సమాగతే/ యత్రభేకపతిర్వక్తా తత్రాస్మాకం కుతో వచః'(వర్షాకాలం రాగనే కోకిల మౌనం వహించింది.మండూక రాజు ఎక్కడైతే వక్తగా వ్యవహరిస్తాడో, అక్కడ మా వంటివారికేమి మాటలుంటాయి?) అన్న18 వ శతాబ్ది నాటి వాంఛానాథుడి మహిష శతకంలోని బాధ అన్నికాలాలకూ వర్తించేదే! పశుజాతి మొత్తంలోకి అతి  నీచమైనదని భావించే దున్నపోతును  దుష్టరాజుకు ప్రతినిధిగా చూపెట్టి స్తుతించే నెపంతో  వాంఛానాథుడు  దూషించిన ఎత్తిపొడుపు శతకానిదీ ఇదే దారి మరి. తిట్టడం కోసమే రాసే రాతలను కాలం ఆట్టే కాలం పట్టించుకోదు. పద్దస్తమానం ఎవరినో ఒకరిని ఎత్తిపొడవనిదే కల ముడవని శ్రీనాథుడిని, అతగాడి మిత్రుడు అవచి తిప్పయ్యసెట్టిని మనసులో పెట్టుకుని వినుకొండ వల్లభరాయడు అనే కవి క్రీడాభిరామం పేరుతో ఒక కావ్యం సృష్టించాడు. చాలావరకు శ్రీనాథుడి పోకడలు పోతూనే కాకతీయుల నాటి ఓరుగల్లు పురవీధుల్లో తిప్పుతూ మంచనశర్మ, టిట్టిభసెట్టి అనే రెండు పాత్రల ద్వారా అన్ని కులాల, తెగల స్త్రీలను పచ్చిగా వర్ణించేశాడు. ఇప్పుడా పద్యాలన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద రసాభసా కావడం ఖాయం.  బూతు భావాలను సైతం అన్యాపదేశంగా ఎట్లా చెప్పవచ్చో ఉదాహరణగా సూచించడానికి వల్లభరాయుడు తొలిఝామున తన మానాన తాను కూసే కోడిని అడ్డం పెట్టుకుని ఎట్లా పద్యం చెప్పాడో ఈ పద్యంలో చూడవచ్చుః రాత్రంతా సంభోగ విహారంలో సంరంభంగా ఉన్న జంటలోని ఒక ప్రియుడు తొలిఝామున గొంతెత్తి కూసిన పాపానికి కోడిని ఎంతలా పడతిన్నాడో! 'ఎట్టకేలకు నలుక రేయల్ల దీర్చి యువిద/యధరామృతమ్ముగ్రోలుచున్న నాకు

/పాన విఘ్నంబుగా  మ్రోసె పాపజాతి,/జాతి ఛండాలమైన వేసడపు కోడి'.

ఇట్లా ఏదో ఒక వింతో, చమత్కారమో ఉన్నా కొంత నయం, తిట్టడం కోసమే కవిమహానుభావులు  వెలువరించిన తిట్టుకావ్యాలు మాత్రం మనకు కొదువా?తెనాలి రామలింగకవి శేషప్పవిజయం,  చిత్రకవి వెంకటరమణకవి సకల వర్ణనా పూర్ణరామాయణం, కూచిమంధి జగ్గకవి చంద్రరేఖా విలాసం, పిండిప్రోలు లక్ష్మణకవి రావణదమ్మీయం, రేకపల్లి మహాదేవకవి చిన్ని వెంకట నరసీయం.. సర్వసభ్యతలను తోసిరాజనేసిన  బూతుబుంగలు. కూచిమంచి జగ్గకవి సాధారణంగా భగవన్నామ స్మరణతో ప్రారంభమయే  మంగళాశాసనంలోనే పోయిన పోకడ ఇందుకు ఒక చిన్న ఉదాహరణ,  తన కావ్య కృతిపతి నీలాద్రిరాజును 'శ్రీకంఠుండు భుజంగభూషణుడు భస్మీభూత పంచాస్త్రు డ/ స్తోకాటోపబల ప్రతాప పురరక్షోదక్ష సంశిక్షణుం/ డాకా శోజ్జ్వల కేశపాశుడు త్రిశూలాంకుండు తా/ నీకం జింతలపాటి నీలన్పతిన్ వీక్షించు నేత్రత్రయిన్' శివుడు నీలాద్రి రాజును మూడో కన్నుతో చూడాలన్నంత(బూడిద చెయ్యాలన్నంత) కసి అన్నమాట కవికి! పూర్వకవి స్తుతిలో కూడ బీరుపోకుండా జగ్గకవి కేవలం వేములవాడ భీమకవి, తెనాలి రామకృష్ణకవి, శ్రీనాథకవి, తురగా రామకవి వంటి తిట్టుకవులను మాత్రమే స్మరించుకోవడం మరో విశిష్టత.

మాట పట్టింపు దగ్గర నుంచి మత విశ్వాసం దగ్గరి దాకా అణుమాత్రం తేడా వచ్చినా అనుమానం లేకుండా చంపమనో, నరకమనో ప్రబోధించిన సాహిత్యం సంస్కృత వాజ్ఞ్మయం నుంచి రెండాకులు ఎక్కువ నేర్చిన వాక్శూరత్వం తెలుగుపలుకుది ఒకానొకప్పుడు. 'ప్రాజ్ఞులు వేదజ్ఞులు, లో/కజ్ఞులు చేగొండ్రె గతశిఖాగాయత్రీ/యజ్ఞోపవీతనాస్తికు,/లజ్ఞులు చేగొండ్రుగాక యద్వైతమజా' అనడంతో సరిపుచ్చుకుందా .. 'శివనిందావిషయంబగు,/నవమానము సెప్పునట్టి యప్పుస్తకముల్/అవిచారంబున గాల్పగ,/నవుచెప్పెడి వానిజంపనగునీశానా!' అంటూ అద్వైతం పుచ్చకున్నవాళ్లందర్నీ, శైవం వద్దన్నవాళ్లతో ఏకంగా చంపెసెయ్యమనే దారుణం అధిక్షేపాత్మక సాహిత్య రూపంలో మల్లికార్జున పండితారాధ్యుల శివతత్వసారంలో దర్శనమిస్తుంది మరి!

కనకపు సింహాసనమున/శునకమును కూర్చుండబెడితే ఏమవుతుందో సుమతీ శతకం ఆనాడే అధిక్షేప రూపంలో బుద్ధిమంతులను హెచ్చైరించింది. పామరుడు తగిన రక్షణ లేకుండా హేమం కూడబెడితే అన్యాయంగా అది ఏ విధంగా భూమీశుల పాలవుతుందో చీమలు, పాముల దృష్టాంతంతో సవివరంగా చెప్పిన అధిక్షేప సాహిత్యం సమాజం పట్ల మొదటి నుంచి తన వంతు అప్రమత్తత బాధ్యతను  సక్రమంగానే నిర్వర్తించింది. కుమారీ, కుమార శతకాలనో, వేమన, భాస్కర, సుమతుల వంటి మకుటాలతో వెలువడ్డ వేలాది శతకాల  శ్రేణులన్నీ, కేవలం పేరులోనే కాకుండా.. చెప్పే తీరులలో కూడా నీతులను అవసరార్థం బూతుల రూపంలో కొంత ఘాటుగానే చెప్పిన మాట నిజం. నులిమితేనే నుసి తొలగి పత్తి వత్తి  మరింత ఉజ్వలంగా వెలుగుతుందన్న సద్భావనతో నాలుగు పిచ్చి మాటలతో నలుగుపెట్టి బుద్ధులు నేర్పించే అధిక్షేపం నిక్షేపంగా సదా ఆదరణియమే! అర్థ శతాబ్దం కిందట ఆంధ్రదేశంలో వీధిబళ్లల్లో చదువుకున్న బడిపిల్లలో ఎక్కువ మంది దసరా పండుగ పదిరోజులూ ఇంటింటికీ పప్పుబెల్లాల కోసం తిరిగే సమయంలో పాడుకొనే పాటలు కొన్ని ప్రసిద్ధమైనవి ఉండేవి. అందులో శేషప్పకవి విరచిత నరసింహ శతకంలోని 'మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు- మాన్యముల్ జెరుప సమర్థులంత/ యెండిన యూళ్లగోడెరిగింపడెవ్వడు-పండిన ఊళ్లకు ప్రభువులంత/యితడు పేద యటంచు నెరిగింపడెవ్వడు-కలవారి సిరులెన్నగలరు చాల.. ' అంటూ పెట్టే దెప్పుళ్లు చాలక' యిట్టి దుష్టుల కధికార మిచ్చినట్టి,/ప్రభువు తప్పులటంచును బలుకవలెను' అంటూ చిన్నిబిడ్డల నోట వినిపించే అధిక్షేపాలు అన్ని కాలాలకూ వర్తించే నిష్టూరాలే కదా!

శేషప్ప కవి నరసింహ శతకంలో మొరపెట్టుకున్న చందాన  'ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు - ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు/కనక మిమ్మని చాల గష్టపెట్టగలేదు - పల్ల కిమ్మని నోట బలుకలేదు/సొమ్ము లిమ్మని నిన్నునమ్మి కొల్వగలేదు - భూము లిమ్మని పేరు పొగడలేదు/బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు - పసుల నిమ్మని పట్టుపట్టలేదు' అంటూనే 'నేను గోరిన దొక్కటే నీలవర్ణ - చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు' అన్న స్వార్థంతో

 నమ్ముకున్న దైవాన్ని ఏ భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర' అనో పొగిడే భక్తశిఖామణులూ కద్దు లోకంలో. సొంతానికి ఆశించిన కోరికలు నెరవేరలేదన్న ఉక్రోషంతో తిట్టిపోసే లక్షణం కొందరికి మల్లే గాక, ఆరాధించేవారికి అన్నీ సమకూరడం లేదన్న చింతతో అందుకు ఆ ఆరాధ్యులనే బాధ్యులని చేస్తూ ఎత్తిపొడిచే బాధ ఈ భక్తశిఖామణులది. కాసుల పురుషోత్తమకవి శ్రీకాకుళాంధ్ర మహాకవిని ఈ రకంగానే  దెప్పుతూ చెప్పిన కీర్తి నింద పద్యాలు పరమ ప్రసిద్ధం. విధర్మీయుల బలగాలు సింహాచలాన్ని, ఆ ప్రాంత ప్రజాసమూహాన్ని చెండాడుతున్నా.. గుళ్లో రాయిలా నిమ్మళంగా పడున్నందుకు ఉక్రోషంతో తాను ఆరాధించే నరసింహావతారుని మరో అవతారం  శ్రీకృష్ణుని లీలలను గుర్తుకు తెస్తూ గోగులపాటి  కూర్మనాథకవి పెట్టిన గోడంతా ఈ అధిక్షేప సాహిత్యం కిందనే జమ. 'పాలీయ వచ్చిన భామిని ప్రాణంబు-లపహరించి చెలంగినట్లుగాదు/యాగోత్సవంబున కతిమోదమున బిల్వనంపు మామను ద్రుంచినట్లుగాదు/చేతగాక నరుచేత చుట్టంబుల నందర జంపించినట్లుగాదు/తుంగ గల్పించి యుత్తుంగ వంశద్రోహ-మాచరించి చెలంగినట్లుగాదు' పరంబలంబిది నీ ప్రజ్ఞ పనికి రాదు,/లెమ్మికను మీనమేషమ్ముల్లెక్క యిడక/ చొరవ తురకలు గొట్టగా చుక్క యెదురె,'   

    అంటూ  వైరిహరరంహ సింహాద్రి నారసింహ' అంటూ సాక్షాత్ స్వామి నరహర మూర్తినే నిర్భీతిగా ఎత్తిపొడిచే వ్యాజనింద రివాజే ఇక్కడ.

అధిక్షేప సాహిత్యానికి వేములవాడ భీమకవి నుంచి లెక్క పెట్టుకుంటూ పోతే మేధావిభట్టు, బడబాగ్నిభట్టు, శ్రీనాథ మహాకవి, ప్రౌఢకవి మల్లన, తెనాలి రామలింగడు, అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, కందుకూరి రుద్రయ్య, ఎర్రవల్లి పర్వతన్న, బొడ్డుచెర్ల వెంగన్న, రాళ్లబండి పట్టాభిరామరాజు, మోచెర్ల వెంకన్న, అడిదం సూరకవి, రేకపల్లి సోమనాథుడు, అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి వంటి కవులెంతో మంది వేటుకూరి ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్యమణిమంజరి చాటున  చటుక్కున మెరిసి మురిపిస్తారు. అందుకే 

చూసింది చూసినట్లు, తనకు తోచింది తోచినట్లు స్పష్టంగా, సూటిగా చెప్పేసే బలహీనత నుంచి బయటకు రాని మహాకవి శ్రీనాథుడు మామూలు మనిషి కానివ్వండి, మహారాజాధిరాజు కానివ్వండి, ఆఖరుకు ఆ మహాదేవదేవుడే దిగిరానివ్వండి, వాళ్ళని కడిగెయ్యటానికి అవకాశం దక్కితే ఒక్కడుగయినా  వెనకాడని  మనస్తత్వం కలవాడు కనకనే ఆధునిక కవి ఆరుద్ర నోట ప్రశంసలు పొందిన ''కొంటె పిల్లకాయలు లేని కన్నతండ్రి-గోదావరి పొంగులేని రాజమండ్రి' - హంసీయానకు గామికి న్నధమ రోమాళుల్‌ నభఃపుష్పముల్‌/సంసారద్రుమ మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట వి/

ద్వాంసుల్‌ రాజమహేంద్ర పట్టణమునన్‌ ధర్మాసనంబుండి ప్ర/

ధ్వంసాభావము ప్రాగభావ మనుచున్‌ దర్కింత్రు రాత్రైకమున్‌' అన్న  అభిశంసనకు  గురయింది అన్యాయంగా. తమ కవిత్వంలో తప్పులు వెదికేవాళ్లనో, సత్కారాలు అందివచ్చే సూచనలు అందుకుంటూ అడ్డుపుల్లలు వెసేవాళ్ల పుణ్యం వల్ల ఆ అవకాశాలు తప్పిపోయినప్పుడో, నిష్కారణంగా అపాయం తలపెట్టి వినోదించే దుష్టులు తారసపడినప్పుడో, ఎన్ని వినతులు సమర్పించినా చిన్నమెత్తు సాయం అందనప్పుడో, సాటివారినైతే నోటి దూల తీరేదాకా ఎన్నైనా పడతిట్టిపోసుకోవచ్చు. బలహీనుడు బలవంతుడిని ఎదుర్కొనే సందర్భం తటస్థించినప్పుడు నేరుగా ఎదుర్కొనే సామర్థ్యం కరవైనప్పుడు నోరూ వాయా లేని  ఏ పిల్లినో, ఎలుకనో అడ్డుపెట్టుకుని అడ్డమైన తిట్లు తిట్టిపొయ్యడమో, అదీ ప్రమాదకరమని తోచినప్పుడు కనీసం దెప్పిపొడుపులతో అయినా సరిపెట్టుకుపోవడమో అత్యంత సహజం.  అదే కాస్త హస్త లాఘవం ముదిరిన సరుకైతే కలం పట్టి మరీ రమణీయార్థంలోనో, అలంకార భరితంగానో, శ్లేషార్థంతోనో, రెండర్థాల పదాలతోనో.. సరసమాడుతున్నట్లుగానే విరసాలడేయడం.. అధిక్షేప ప్రక్రియలో అదో  విధానం. నేరుగా తిట్టినవాళ్లు, నేరకపోయి వీడితో ఎందుకు పెట్టుకున్నామా అని తలపట్టుకునేటట్లు నాలుగు పెట్టేవాళ్లు, మోజు మాటలతోనే మొరటుతనం ప్రదర్శించే ఘనులు, బండబూతుల నుండి, దండకాలు.. స్తోత్రపాఠాల రూపంలో  చెండాడుకునే దుందుడుకుగాళ్లు, చాటువులలో పెట్టి చాటుమాటు మాటలతో చాకిరేవు పెట్టేవాళ్లు, శతకాల రూపంలో సహస్రం పెట్టేవాళ్లు, కావ్యాల వంకన కడుపుబ్బరం తీర్చుకునే కవిరాయుళ్లు.. అబ్బో! అధిక్షేపానికి ఎంత పెద్ద కథ ఉందో ఇంత చిన్న వ్యాసంలో ఆ వివరాలన్నీ పరామర్శించుకోవడం కుదిరే వ్యవహారం కాదు. నిద్రపోయే ఉపపాండవులను మధ్యరాత్రిలో దాడిచేసి మట్టుపెట్టిన అశ్వత్థామను ద్రౌపది వంటి కన్నతల్లి చేత కడు సభ్యంగా తిట్టించాడు బమ్మెర పోతన్నగారు తన భాగవతంలో! 'ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం/చిద్ద్రోహంబును నీకు జేయరు బలోత్సేకంబుతో చీకటిన్/భద్రాకారుల పిన్నపాపల రణ ప్రౌఢ క్రియా హీనులన్/ నిద్రాసక్తుల సంహరింప నకటా నీ చేతులెట్లాడెనో!' అంటూ పాంచాలిలోని కన్నతల్లి హృదయం పరిపరి విధాల రోదిస్తుంది. కానీ కాలం మారిందిప్పుడు. హింసన చణకు పాపపుణ్యాల ప్రస్తావన పట్టని కాలం నడుస్తున్నది ప్రస్తుతం. మితి మీరిన ఆశల ఆబోతులు కుమ్ములాటకై కొమ్ములు ఝాడిస్తూ ముందుకు ఉరికొస్తుంటే చేత ఏ ఆయుధం సమయానికి లేని అర్బకుడు అఖరుకు నోటి నాలుకనే ఆయుధంగా సానబట్టి బరుతెగించి పోరాడక తప్పని పరిస్థితులు ప్రస్తుతానివి. తిట్టిన ప్రతీ వాడి మాడుపై మొట్టవలసిన అగత్యం లేదు కానీ.. అసందర్భంగా, స్వార్థపూరితంగా, స్వలాభం మీద మాత్రమే ఆపేక్ష ప్రదర్శించే క్రమంలో ఎవరెట్లా గోదాట్లో కొట్టుకుపోయినా ఫరవాలేదన్నట్లుగా కుపరిపాలన సాగించే ప్రభువుల మనసుల్లో కదలిక తెప్పించేపాటి పాటవం కాస్తో కూస్తో కలిగించలేని పక్షంలో ఏ అధిక్షేపమయినా ఎంత అలంకారప్రాయంగా ఉన్నా వాంఛనీయం కానేకాదు.

భాషాకాలుష్యానికి దోహదపడే తిట్టుసాహిత్యం ఎంత రమణీయకమైన పదాలతో పొదిగినా  సదా నిరాదరణీయం.   

-కర్లపాలెం హనుమంతరావు

19 -01 -2020

 

 

 

 

నాస్తికుడికే రాజకీయం కావాలి -కర్లపాలెం హనుమంతరావు

 



ఆస్తికుడికి ఏ రాముడో, దైవదూతో, అల్లా పురుషుడు ఉంటాడు.. విన్నా వినకున్నా మొరపెట్టుకోవడానికి! దేవుడి ఉనికిని కొట్టిపారేసే నాస్తికుడి నసకు చెవి ఇచ్చే నాథుడు ఎక్కడుంటాడు? ఎవడి గోల వాడిదే.. ఎవడి బతుకు బండికి వాడే సారథి.. అని విశ్వసించే నాస్తికుడి ఈతి బాధల పరిష్కారానికి రాజకీయాలే గతి. ఒక చెంప రాముడో, రహీమో, క్రైస్తవమో  మన దుఃఖ జీవన సాగరం ఆవలి తీరానికి దారి చూపించే మార్గదర్శకులు అంటూ అనునిత్యం ఘోషిస్తూనే, మళ్లా ఆ రాముళ్లను, రహీములను, క్రీస్తూదేవుళ్లను దిక్కులేని వాళ్లుగా చేసేస్తున్నారని ఒకళ్ల మీద ఒకళ్లు నిప్పులు చల్లుకుంటున్నారు ఆస్తికులు. దేవుడు మనిషిని కాపాడుతున్నట్లా, మనిషే దేవుడి రక్షణకు కంచెగా నిలబడ్డట్లా అని అడిగే నిజాయితీ ప్రశ్నకు సజావుగా బదులు ఇవ్వకుండా ముక్కు చుట్టుడు మొక్కుబడి స్పందనేదో వెలిబుచ్చేసి ఆనక దేవుణ్ణి చిన్నబుచ్చేశాడని ఆగడాలకు దిగవచ్చు, అల్లర్లు ఎన్ని ఏళ్లయినా ఎడతెరిపిలేకుండా సందు దొరికినప్పుడల్లా చేసుకొనే సౌకర్యం ఆస్తికులకు కద్దు. నిజాన్ని నిజంగా తప్ప అబద్ధంగా అంగీకరించలేని అర్భకుడు నాస్తికుడికి.. ఏ దేవుడైనా ఎందుకు సాయపదతాడు? ఆ కారణం చేత కూడా నాస్తికుడు స్వంత బాధల పరిష్కారానికి స్వంతంగానే పూనుకోవాలి. పూనుకోవడం అంటే రాజకియం చేయడం అన్న మాటకు ప్రత్యామ్నాయ పదం. ఏతావాతా   నాస్తికులు ఈ భూప్రపంచం మీద రాజకీయాలు ఒక్కటే  నమ్ముకునేందుకు వీలైన దిక్కు. కాకపోతే అతగాడి పొలిటికల్ 'ఔట్ లుక్'.. ఆస్తికుడి 'ఇన్ సైడర్ వేదాంతం' కన్నా విభిన్నంగా , రుజుప్రవర్తనతో కూడుకుని ఉంటుంది. నాస్తికుడుకి  రాజకీయాలెందుకు? అని పెడసరంగా ఆడిగే ప్రబుద్ధులకు 'ఆస్తికుడికి మించి నాస్తికుడికే రాజకీయాలతో  ఎక్కువ సంపర్కం ఉండితీరాలి. ర్రాజకీయం అన్నమాటకు అర్థం రాజ్యానికి సంబంధించి నడిచే వ్యవహారం యావత్తూ.. అయినప్పుడు ఇహలోకం జీవనం మీద చులకన భావం ఉండే ఆస్తికుడికే అవసరమైన రాజకీయం ఈ లోకమే తన అసలు లోకం అని మనసా వాచా కర్మణా నమ్మే నాస్తికుడికి అక్కర్లేదా? ఏం వింత వాదన?

రాజకీయం అంటే మనుషుల సంక్షేమం కన్నా ముందు దేవుడి బాగోగులు చూడాలన్న వాదన కాదు. దేవుడు మనుషుల్ని సృష్టించాదన్నది కేవలం ఏ ఆధారం లేని పరంపరగా వస్తోన్న ఓ విశ్వాసం మాత్రమే. తాము చేసే ఏ ప్రకటనకు నమ్మదగ్గ రుజువులు చూపించలేని ఆస్తికుడి మల్లే కాదు నాస్తికుడు. దేవుణ్ని మనిషే సృష్టించాడన్న వాదానికి సవాలక్ష ఉదాహరణలు చూపించగలడు. అన్నీసజీవమైనవి, మన కళ్ల ముందు కళకళలాడుతో కనిపించవి. నిజ జీవితంలో నిజంగా ఏదన్నా  కష్టమొచ్చి నమ్ముకున్న దేవుడు ఎలా కాపాడతాడో తరుణోపాయం చెప్పమంటే అమాయకమైన భక్తుడిని అదే  పనిగా అన్నహారాలు గట్రా మానేసి (ఉపవాసాలు) భజనలు, సంకీర్తంలు, ప్రార్థనలు, నమాజులు చేసుకోమని చెప్పుకొస్తారు ఆయా మతపెద్దలు. ఈ తరహా పలాయనవాదాన్ని ప్రోత్సహించే జిత్తులు కాకుండా నాస్తికుడు 'నీ కష్టాలకు మూలం కూడా నువ్వే. నీ పిరికితనమో, లొంగుబాటో, అత్యాశో, తాహతకు మించిన కోరికో, సమాజం ఒప్పని నీతో, నిష్కారణమైన కడుపుమంటో, ఏ ప్రయోజనమూ సాధించలేని నిరాశో, పని చేసేందుకు బుద్ధిపుట్టని బద్ధకమో, తేరగా లబకం ఊడిపడలేదన్న దుఃఖమో, అర్హత లేని గౌరవం దక్కడం లేదన్న ఉక్రోషమో, చులకనగా చూసే వస్తువు శక్తివంతంగా మారి నిలదీస్తుందన్న కసో, పక్క శాల్టీ పైకి ఎదుగుతుందన్న కుళ్లుబుద్ధో.. ఏదో అయివుంటుంది. తీరికగా కూర్చుని, ఓపికగా తరచి చూసుకుని ఆ లోపాన్ని సరిచేసుకుంటే ఏ కష్టమూ నిన్ను బాధించదు. నీవు కొని తెచ్చుకున్న రొచ్చులోకి లేని దేవుడిని  లాక్కువస్తే నీ సమస్య ఎన్నడికీ తీరదు. అంతా ఆ పైనున్న వాడే చూసుకుంటాడని  నీకు మెట్టవేదాంతం బోధించే స్వాములవారు కడుపునొప్పి వస్తే ఆ భారం భగవంతుడి ఒక్క డి మీదనే ఒదిలేయటం లేదు కదా! భక్తుల ఖర్చు మీదనో, ప్రభుత్వ పెద్దల సహకారంతోనో ఏ అమెరికా వంటి పెద్ద దేశాలకు వెళ్లి భారీ బిల్లులు చెల్లించి నయంచేయించుకుంటున్నారు కదా! ఈ లోకం కష్టాలకు ఇక్కడే పరిష్కారం అని చేతలతో చూపించే స్వాములార్ల డొల్ల వేదాంతపు మాటలు నమ్మి కాళ్లుజాపుకు కూర్చోబట్టే కష్టాలు ఎన్నటికీ తీరడం లేదు.

రాజకీయాలంటే నిజానికి ఏమిటీ? రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అంటే మనమే రాజులం. మనకు చెందిన సంగతులన్నీ రాజకీయాలకు అవసరమే. ఆలాంటి నేపథ్యంలో 'దేవుడు లేడు. అదంతా నీ ఊహ' అన్నవాస్తవం చెప్పిన పాపానికి రాజకీయాలకు దూరంగా ఉండాలా నాస్తికుడు?  ఎంత 'నాస్ సెన్స్' గా ఉంది వాదన! వాస్తవానికి అన్నీ దేవుడు చూసుకుంటాడన్న బీరాలు పలికే ఆస్తికులే రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఏ దండకారణ్యాలకో వెళ్లి ముక్కు మూసుకుని తాము పరితపిస్తున్నట్లు నటించే మోక్షం కోసం నిక్షేపంగా అన్నహారాలు మానేసి జపతపాలు చేసుకోవాలి. నగరం నడిబొడ్డున ప్రభుత్వాలు దయచేసే అత్యంత ఖరీదైన భూముల్లో భక్తుల సొమ్ముతో విలాసవంతమైన వైభోగం తాము ఆనుభవిస్తూ అడుగడుగునా రాజకియాలలో జోక్యం జనాలకు అన్యాయం చేస్తున్నది ఎవరు?

నాస్తికులందరిదీ ఒకే అభిప్రాయం .. ఎప్పుడైనా.. ఎక్కడైనా!

'నీ జీవితానికి నీవే కర్తవు.. కర్మవు. కనక క్రియా పరంగా కూడా నీ చర్యలే సమస్యలకు పరిష్కారాలు అవుతాయన్నది ఆ  అభిప్రాయం. ఆస్తికుల మధ్యనే సవాలక్ష అభిప్రాయ భేదాలు. 'నా దేవుడు గొప్ప' అని ఒకడంటే.. 'నా దైవం అధీనమే ఈ జగత్ సర్వం' ఇంకొకడి వాదన. మా భగవంతుడికి అపచారం కలిగితే లోకాలన్నీ భగభగమని మండిపోవాల్సిందే!'అని ఒక ఆస్తికుడు బెదిరిస్తే.. మా మూలపురుషుడు లేచి వచ్చేస్తే సర్వం అనంతంలో బుడుంగుమని మునిగిపోవాల్సిందే!' అని సవాళ్లు! నిరాకారుడని చెప్పుకునే దేవుడికి కోపతాపాలు ఎందుకు వస్తాయో,  శాంతి కాముకుడని కోసే భగవంతుడు ఊచకోతలు ఎందుకు ప్రోత్సహిస్తాడో? నిరంజనుడైన ఆదిదేవుడికి అన్నేసి వేల మంది స్త్రీలతో సరసాలా? తృణప్రాయమైన జీవితాలకు బంగారు గొడుగులు, హంగు ఆర్భాటాలతో ఊరేగింపులా? నిజం చెబితే నిష్ఠురం గానీ.. దైవం పేరుతో దుష్ప్రచారమయ్యే  మత విబేధాలు, కులవివక్షల వల్ల కాదూ  మనిషి బతుకు  అవుతున్నది ఇవాళ వల్లకాడు?

రాజకీయాలంటే ఉన్న దూరూహవల్లనే ఇవాళ నాస్తికుడికి రాజకీయాలతో ఉండే సంబంధం ప్రశ్నకు గురవుతున్నది. వాస్తవానికి రాజకీయం అంటే రాజ్య పాలనా నిర్వహణ. ఈ ప్రభుత్వ నిర్వహణ మూడు దశలుగా సాగడం చరిత్రలో మనం చూస్తున్నాం. రాజపాలన,  నియంతృత్వం, ప్రజలు నిజమైన పెత్తందారులుగా నడిచే ప్రజాస్వామ్యం.

రాజరికంలో ప్ర్రజలు ఎలా నడుచుకోవాలో శాసించేది శాసనాల ద్వారా రాజు. నియంతల పాలనలో ఆ పని నియంతది. ఇక్కడ ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకపోయినా పాలకులు పెద్ద నష్టమేమీ లేదు. ఎదురుతిరిగిన బలహీనుణ్ణి, బలమైన వాడైతే బలహీనుణ్ణి చేసి ఆనక ఆడ్డు తొలగించుకొనేందుకు బోలెడంత సాధన సంపత్తి, మందీ మార్బలంతో సిద్ధంగా ఉంటాడు. ఈ రెండు వ్యవస్థలల్లో సామాన్యుడి గతి బ్రహ్మాస్త్రాన్ని చూసి అణిగుండే పిచ్చుక తీరే. రాజకు రాజ వంశంలో వాడే ప్రత్యామ్నాయం. నియంతకు తాను అనుకున్న మరో నియంత ఆ లోటు భర్తీ చేస్తాడు. ప్రజాస్వామ్యంలో నిజానికి నిర్వచనం ప్రకారం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన సాధ్యమయ్యే పాలన- అనే కాని.. నిజానికి ఆ ప్రజలు ఎవరు అన్నదే కీలకమైన ప్రశ్న. డబ్బు ఉన్నవాడు, మతం మీద పెత్తనం కలవాడు, జబ్బసత్తువ ఉన్నవాడు .. ఇలా ఎవరికి వాళ్లు తామే అసలైన ప్రజలం అని ప్రచారం చేసుకుంటూ తమకు సానుకూల పడే పనులు మాత్రమే ముందుకు సాగేందుకు దోహదపడుతుంటారు. విచిత్రమేమంటే.. ఏ సమాజంలో అయినా అత్యధిక శాతంగా ఉండేది ఆర్థికంగా అంత వెసులుబాటు లేనివాళ్లే! అయినా వాళ్ల ప్రయోజనాలు, జీవితాల అభివృద్ధి ఎవరికీపట్టవు. అందుకు వేరెవరినో నిందించాలని పనిలేదు. తమ లోపల ఉండే ఎన్నో బలహీనతలు, చాపల్యాలు, కల్పనలు, మూఢవిశ్వాసాలు, అనైతిక బంధాల పట్ల మోజు వంటి దుర్గుణాల సంకెళ్లయి ముందుకు కదలనీయవు. ఇట్లాంటి బంధనాలను అన్నింటినీ ఛేదించుకుని స్వంత జీవితాలలో ఎవరికీ అభ్యంతరకరం కాని పద్ధతిలో సుఖంగా జీవించే శక్తి నాస్తికుడికి ఉంటుంది. రాజకీయాలతో సంబంధమే కాదు.. రాజకీయాలను శాసించగల శక్తీ నిజానికి నాస్తికుడికే.

లొంగుబాటు ఆస్తికుడి తత్వం. బానిస ప్రవృత్తికి ఎక్కువ ఆస్కారం కల్పించే ఆస్తికులకు అందుకే రాజరికపాలన మీద, నియంతల కర్రపెత్తనం మీద మనసులో ఉండే  మోజు అప్పుడప్పుడు మాటల్లో వెల్లడవుతుంటుంది. 'ఎవరన్నా నియంత వస్తే గాని మన బతుకులు బాగుపడవు' అని ప్రకటించే ఆస్తికవాదిని చూడవచ్చును గాని ఆ పంథాలో ఆలోచించే నాస్తికుడిని ఎక్కడా చూడబోం. నాస్తికుడు అంటేనే స్వీయ శక్తి మీదనే అపారమైన విశ్వాసం కలవాడు. వాడి వల్ల కాకపోతే మరి ఆస్తికుల వల్ల మేలైన  ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందా? ఆస్తికుడి రాజకీయాలు స్వార్థప్రయోజనాలు సిద్ధింపచేసుకోవడం కోసం. నాస్తికుడి రాజకీయాలు ఖాయంగా జనహితంగా ఉండేటందుకు మాత్రమే సాగే వ్యూహాలు. నాస్తికత్వం అంటేనే స్వతంత్ర బుద్ధి.  లొంగుబాటుకు ఛస్తే లొంగని మనస్తత్వం. రాజరికం, నియంతృత్వం అంటే అసహనం ఉంటుంది కనక.. అతగాడి రాజకియాలు ఎప్పుడూ ప్రజాస్వామ్య వికాసానికి మాత్రమే తోడుపదేవి.

పుర్వకాలపు రాజరికాలు, నియంతల రాజాలు ఇప్పుడు ఎక్కువగా కనిపించవు. ఆ కారణం చేత సమాజంలో నాస్తికుల సంఖ్య గణనీయంగా పెరిగిందనడానికి నిదర్శనం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఆస్తిక లక్షణం లొంగుబాటు తత్వమే అయినా ప్రజలలో క్రమేపీ పెరుగుతున్న నాస్తిక భావనలు మెల్లగా రాజరికపాలనలు అంతమవడానికి దోహదపడుతున్నాయి. అయినా ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రజలలో అధికశాతం నాస్తికులన్న నిర్ణయానికి రాకూడదు. ప్రభుత్వ నిర్మాణంలో ప్రధాన భూమిక వహించే సామాన్యుడు ఈ ఆస్తిక, నాస్తిక ద్వైధీభావజాలం మధ్య  ఊగిసలాదుతున్నాడని మాత్రమే మనం చెప్పగలం. మనసులో నాస్తిక భావనలు ముప్పిరిగొంటున్నా బహిరంగా అంగీకరించేందుకు సిద్ధపడని హిపోక్రసీనే ప్రస్తుతమున్న ప్రపంచవ్యాప్త రాజకీయ వాతావరణం.

మన దేశంలోని పరిస్థితి ఈ  మూడ్(mood)కి ముమ్మూర్తులా అద్దం పడుతుంది. పేరుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పటికి, వాస్తవంగా సామాన్యుడు తన జీవితాన్ని తానే సరిదిద్దుకునే స్థితిలో లేడు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఏదో ప్రజాస్వామ్య వాతావరణంలో ఉన్నట్లు ఊరట కలిగినా, ఒకసారి ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఓటరు మహాశయుడు నేరుగా రాజకీయ జోక్యం చేసుకొనే పరిస్థితి బొత్తిగా లేదు. కోరుకున్న పార్టీలకు తట్టుకుని నిలబడే శక్తి ఉండదు. బరిలో నిలబడిన పార్టీలలో అయినా జనం కోరుకోని వ్యక్తులే అధికంగా కనిపించే దుస్థితి. ఎవరో ఒకరు గెలవాలి కనుక గెలుస్తారు. ఒకసారి గెలుపొందిన తరువాత  విజేతకు ఇక మళ్లీ ఎన్నికలొచ్చిపడే వరకు జనంతో సంపర్కం ఉండనక్కర్లేని వ్యవస్థలు ఇప్పటివి.

నిజమైన నాస్తికవాది నిజమైన ప్రజాస్వామ్యప్ర్రేమిగా ఉండటం తప్పనిసరి. దిగాలుబడి కార్యంలేదు. నిందిస్తూ కూర్చున్నా  శౌర్యం అనిపించుకోదు. ఎవరూ కలసిరావడం లేదన్న నిరాశ నాస్తికుని మనస్తత్వానికి సరిపడదు. సమస్య ఏదైనా వర్ణిస్తూ కూర్చున్నందువల్ల తెమిలే వ్యవహారం కాదు. పరిష్కరించే దిశగా చర్యకు పూనుకోవాలి. అదీ తక్షణమే. ఆ భారం మరెవరి మీదనో వేసి నిబ్బరంగా ఉండకుండా మొదటి అడుగు తనదిగా ఉండేలా చూసుకోవడమే ఆసలైన నాస్తికుడి ప్రజాస్వామిక రాజకీయం.

నిజానికి నాడు స్వాతంత్ర్య సాధన దీక్ష దైవసంకల్పంతో సాగింది కాదు. మనం ఒప్పుకోం కానీ.. ఆసేతు హిమాచలం  కులమతాల తారతమ్యాలన్నింటిని తోసిరాజని మానవ సంకల్పంతో సాధించింది మాత్రమే దేశస్వాతంత్రం. స్వాతంత్ర్యం సిద్దించగానే అలవాటు బడ్ద ఆస్తికత్వంలోకి మళ్లీ తిరిగొచ్చేశాడు భారతీయుడు. బానిసత్వ లక్షణాలు తిరిగి పొడగట్టేసరికి  సరికొత్త నియంతలు ప్రజాప్రతినిధులపేరున  నెత్తికెక్కారు.  నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వాలనే మనం కోరుకుంటే ఆస్తికత్వ భావనలను పూజగది గడప దాటి రానీయవద్దు.

ప్రతి వయోజనుడి దగ్గర ఓటు అనే ఆయుధం ఒకటి ఉన్నా.. పేదరికం, బానిసత్వం వారసత్వపు ఆస్తులుగా వస్తూ ఉన్నాయి. చేతిలోఉన్న ఓటుతో కోరుకున్న జీవితం సాధించుకునే వీలున్నా దృష్టిని మళ్లించే ఆస్తికభావాలు నిత్యావసరాల జాబితోలో లేని కులాల, మతాల  మీదకు మళ్లిపోతున్నాయి.. మళ్లీ మళ్లీ! పేద జీవి ఓటు నిరుపయోగం చేసే బానిస భావాలను తొలగదోసుకుంటే తప్ప  సుఖమయ జీవితానికి అతి ప్రధానమైన విద్య, ఉపాధులు, సంక్షేమం, సౌభాగ్యం స్థానే కులం, మతం, వర్గం, వర్ణం, జాతి, నీతి వంటి అడ్డుగోడలు కూలిపోవు. చేతిలో అధిక ఓట్లు కలిగివుండీ పేరుకు పరిపాలకులే అయినా పేదలు తరాల తరబడి బానిసలుగా సమసిపోవడం, ఆస్తికవాదం బోధించినట్లు  తలరాతల వల్ల కాదు, పూర్వజన్మల ప్రారబ్దం వల్ల అంతకన్నా కాదు. గోరంతైనా ఆధారం చూపించ సాధ్యం కాని మాయామిథ్యావాదాలు కూరుతూ   చలనశీల మేధస్సును చక్కభజనల పాల్చేసుకోవడం వల్ల. పరలోక పథం పట్టిపోయిన ప్ర్రజాస్వామిక రథాన్నిప్పుడు ప్రజాకోటి భుజం మీదుగా  భూమార్గం పట్టించడమే అసలు సిసలు నాస్తిక రాజకీయ దృక్పథం. నాస్తికుల  ప్రజాస్వామికమే నిజమైన ప్రజాస్వామికం. సర్వ  మానవ సమానత్వం స్వేచ్ఛగామి ప్రజాప్రభుతకు మచ్చఅంటని  అద్దం. బానిసలు కనబడని ప్రజారాజ్యం నాస్తికుల భావజాలంతో మాత్రమే అందుకు సాధ్యం. సమానత, ప్రజాస్వామికత కలసి రావాలంతే నాస్తికుల భావ దృష్టి  పౌరలందరికీ ముందు అలవడాలి.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ ఎస్ ఎ

19 -01 -2020

 

 

 

పెద్దల జీతభత్యాలు -కర్లపాలెం హనుమంతరావు


 

సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థలో ప్రధాని అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అదే విధంగా ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి  శక్తివంతమైన నాయకుడై ఉంటాడు. దేశంలో అత్యధిక వేతనం రాష్ట్రపతికి,  ఆ తర్వాత  ప్రధానమంత్రికి.. అని ప్రజలు సాధారణంగా నమ్ముతుంటారు. వాస్తవంలో అట్లాలేదు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు ప్రధాని జీతం కన్నా ఎక్కువ.

దేశం స్వతంత్రమయే సందర్భంలో ప్రధాని జీతం నిర్ణయం కాలేదు. దేశ ప్రథమ ప్రధానిగా ఎన్నికయినా జవహర్ లాల్ నెహ్ర్రూ  ఈ జీతబత్తేల మీద మనసు పెట్టలేదు. బ్రిటిష్ వారి పాలన కాలంలో  ప్రధాని జీతం అతని  క్యాబినెట్ మంత్రుల  జీతం కంటే రెట్టింపు ఉండేది. ఇక  ఇతర ప్రయోజనాలు సరే సరి.  స్వతంత్ర  భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగి ఉండాలి న్యాయంగా అయితే. ఆ సమయంలో కేంద్ర కేబినెట్ మంత్రుల జీతం నెలకు రూ .3,000 గా అనుకున్నారు. అయినా నెహ్రూజీ తను ప్రధానిగా రెట్టింపు జీతం తీసుకొనేందుకు ఇష్టపడలేదు. తన మంత్రులతో సమానంగా మాత్రమే జీతం తీసుకునేందుకు మొగ్గుచూపారు. ఇక ప్రస్తుతానికి వస్తేః

ఇప్పటి ముఖ్య మంత్రులందరిలో తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు నెలకు 4 లక్షల 10 వేల రూపాయలు జీతం కింద పుచ్చుకుంటున్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల జీతాలన్నింటిలో ఇదే ఎక్కువ.  ఆ తరువాతి స్థానం దిల్లీ సి.యం ది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ సి.యం గా అందుకుంటున్న జీతం 3 లక్ష 90 వేల రూపాయలు. గుజరాత్ సిఎం జీతం రూ.3.21 లక్షలు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రుల జీతాలు నెలకు రూ.3 లక్షలు.

రూ.2 లక్షలకు పైగా సంపాదించే ముఖ్యమంత్రుల జాబితాలో హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఉన్నారు.

ఒక లక్ష 5 వేల రూపాయలు తీసుకునే త్రిపుర సిఎం అతి తక్కువ ముఖ్యమంత్రి జీతగాడు.

 

దేశంలో అత్యధిక జీతం ఇచ్చే జీతం ప్రయివేట్ కంపెనీలలో టెక్ మహీంద్రాది మొదటి స్థానం. ఆ కంపెనీ  సీఈఓ జి.పి.గుర్నాని  ప్రస్తుతం రూ.165 కోట్ల వార్షిక వేతనంతో పుచ్చుకుంటున్నారు. చీఫ్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు రూ.15 కోట్ల నుంచి రూ.165 కోట్ల వరకు జీతాలు ఇచ్చే కంపెనీలు మనదేశంలో చాలా ఉన్నాయి.

-కర్లపాలెం హనుమంతరావు

(27 -09 -2020 నాటి ఒక వ్యాసంలో)

 

 

Sunday, December 13, 2020

కథా సంపుటాలను గురించి ఇంకాస్త: -కర్లపాలెం హనుమంతరావు




కథా సంపుటాలు ఎవరైనా ఏవైనా ఎంచుకుని వేసుకోవచ్చు.అది వారి వారి అభిరుచుల మేరకు ఉంటుంది.. సహజంగానే! భావస్వాతంత్ర్యాన్ని ప్రశ్మించే హక్కు ఎవరికీ లేదు.. నాతో సహా! నా ఆవేదన ఏమిటి అంటే - అట్లా తయారు చేసుకున్న సంకలనాలకు  'టైమ్' బౌండడ్ టైటిల్స్ (ఏడాది .. దశాబ్ది .. శతాబ్ది .. ( " ఉత్తమ "అంటూ )పెట్టడం సరికాదు  అనే! అందరికీ అన్ని భావజాలాలతో కూడిన సాహిత్యం అందుబాటులో ఉండే అవకాశం  ఉండదు . స్వాతి కథల పాఠకులకు ' కొలిమి ' వంటి ఉత్తమ సాహిత్య పత్రికలోని కథలు  ఎంత వైవిధ్యంగా ఉంటాయో తెలిసేదెట్లా? అదే తరహాలో మరేదైనా ఆధ్యాత్మిక పత్రికలో కూడా మంచి కథలు రావచ్చు.  కాశీభట్లవారు ' ఆరాత్రి'  పేరుతో అద్భుతమైన కథ రాశారు. ఎంత మందికి తెలుసు ? ఎవరికో తెలియకపోవడం ఒక ఎత్తు . ' ఉత్తమ' కథలు శోధిస్తున్నట్లు చెప్పుకునే పెద్దలది ఒక  ఎత్తు. జొన్నవిత్తుల శ్రీ రామచంద్రమూర్తి ఒక్క  'దేవర వలస'  మాత్రమే కాదు .. ఎన్నో 'ఉత్తమ ' కేటగిరీకి చెందిన కథలు రాశారు . కాకతాళీయంగా వారి ' రండి! మళ్లీ పుడదాం ' కథానిక సాహిత్య స్రవంతిలో చదివి ఫోన్ నెంబర్ ని బట్డి పలకరిస్తే చాలా విశేషాలు చెప్పుకొచ్చారు. . ఐదారేళ్ల  కిందట అనుకుంటా .ఆ కథ కోసం వెదికితే ' కథానిలయం'లో కనిపించలేదు, కానీ  మురళీ మోహన్ గారి ' కథా జగత్ ' లో కనిపించింది మరి! ' ఆరాత్రి ' కథ గురించి అయితే ఇప్పటికీ ఎంత మందికి తెలుసునో అనుమానమే ! తమ విలువైన సమయాన్ని , ధనాన్ని , విజ్ఞానాన్ని ఎంతో ఓపికగా నిస్వార్ధంగా వెచ్చించి సంకలనాలను తెచ్చే పెద్దల విజ్ఞతను ప్రశ్మించే పాటి స్థాయి నాకు లేదు.. తెలుసును ! కానీ అవిరామంగా తాము చేస్తున్న సాహిత్య సేవ కేవలం ఏ కొద్ది మంది లబ్దప్రతిష్టతకు కరపత్రంగా మారే పరిస్థితి మీదే చింత అంతా! అల్లం శేషగిరిరావుగారి కధారచనా ప్రజ్ఞ ప్రశ్నకు అతీతమైనది. తెలుసును .కానీ వారి పాత కథ ఒకటి ఈ మధ్యన   ' శ్రీ కనక మహాలక్ష్మి హెయిర్ కటింగ్ సెలూన్ ' ( అనునుంటా) చదివాను. అది కథల కోవలోకే రాని విధంగా ఎందుకు తయారయిందో అర్ధం  కాదు! ఆ సంగతి నిర్మొహమాటంగా ఎవరూ బైటవిశ్లేషణ చేయరు. మంచిని మాత్రమే హైలైట్ చేస్తూ నాసిని బైపాస్ చేసే పక్షపాత విమర్శనాత్మక  ధోరణి వల్ల రచయితకే కాదు .. సాహిత్యానికి మనం న్యాయం చేస్త్నున్నట్లు కాదన్నది నా ఆలోచన. మంచిది  అయితే ఎందుకు మంచి అయిందో -- చెడ్డది  అయితే ఎందుకు చెడిందో సోదహరణంగా, సున్నితంగా , సమర్థవంతంగా  చెప్పగలిగితే సహృదయుడైన  ఏ రచయితా అపార్థం చేసుకోడనే నా భావన. రత్తాలు - రాంబాబు లాంటి నవలలను ఎత్తుకుని మధ్యలోనే అపేసిన రావిశాస్త్రి గారి పంథాను కాస్త సూటిగానే తూర్పారపట్టేరు ఆ రోజుల్లోనే రామకృష్ణ ( హిందూ  - కార్ట్యూనిస్ట్ సురేన్ద్ర గారి తండ్రి ). కథలను మాత్రమే చూడండి. కథకుల పేర్లను పట్టించుకోకండి! లబ్దప్రతిష్టుల ఒకే కథలను పదే పదే ఏకరువు పెట్టే బదులు కొత్తతరంలో కూడా విశిష్టమైన ప్రయత్నాలు ఎక్కడ జరుగుతున్నవో విమర్శకులు ఎక్కువ  దృష్టి పెట్టగలిగితే సాహిత్య విమర్శ క్షేత్రం నిత్య పరిపుష్టితంగా ముందుకు సాగేందుకు దోహదించినట్లవుతుందనేదే నా అభిప్రాయం.  పాత భారతులు ఓపికగా తిరగేయగల జిజ్ఞాసులకు విమర్శ దశ,దిశలను గురించి కొంత అవగాహన కలుగుతుంది. నందిని సిధారెడ్డి vs సర్దేశాయి తిరుమల సంవాదం మచ్చుకకు ఒక మంచి ఉదాహరణ. గొప్ప రచయితలు ఎల్లప్పుడూ గొప్ప రచనలే చేస్తారన్న నమ్మకం తెలుగు సాహిత్యంలో మరీ శృతి మించి పెరుగుతోంది. సొంత రచనలు సంపుటులుగా తెచ్చుకుంటూ తెలిసిన వారి చేత ( సాహిత్యం లోతులు  తెలిసిన వారి కన్న వారికే ప్రాధాన్యత ) రాయించుకునే మొహమాటం మార్క్ ' ముందు మాటలు ' పంథాలో కథల ఎంపిక ఎన్ని కోట్ల సార్లు జరిగినా సాహిత్య లక్ష్మి కి చేయించే కొత్త ఆభరణం కాబోదు. చిరంజీవి , బాలకృష్ణే కాదు .. దేవరకొండ, అవసరాల కూడా మంచి కళాకారులే ! ' సి ' క్లాస్ సెంటర్  సినిమాలను కూడా హెలైట్ చేసే  బాణీ సమీక్షలతో .. కథల ఎంపికల్లో కొత్తగా ఒరగబోయే మేలు  ఏమీ లేదు. ఆర్వీఎస్, అద్దేపల్లి , కోడూరి శ్రీ రామమూర్తి , రామకృష్ణ ,తెలకపల్లి రవి వంటి సాహిత్య సమీక్షకుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగాల్సి వుంది. అన్నింటి కన్న ముందు అందరి కన్న ముందు కథను చదివి నాణ్యత పైన తన మనసులోనే ఒక నిర్ణయానికి వచ్చేసే పాఠకుడి మనోగతం తెర మందుకు రావాల్సి ఉంది. పాఠకుడి అభిరుచికి  అగ్ర తాంబూలం ఇవ్వడమే సముచితం.ఇంకా ఎన్ని దశాబ్దాలపాటు చదువుకున్న పాత కథలను  చదువుకుంటూనే ఉంటాం! 

- కర్లపాలెం హనుమంతరావు 

12 - 12 - 2019 ; బోథెల్ ; US

Saturday, December 12, 2020

యాక్టివ్ వాయిస్ - పాసివ్ వాయిస్- ఒకటే కాదు- కర్లపాలెం హనుమంతరావు

 



యాక్టివ్ వాయిస్ - పాసివ్ వాయిస్ పేర్లు  వినని విద్యార్థులు ఉండరు. హైస్కూల్ చదువులప్పుడు   ఎయిత్ స్టాండర్లో ఇంగ్లీషు టీచర్ పరిచయం చేశారు మాకు ఈ రెండు ప్రక్రియలను.. ఇంగ్లీషు వ్యాకరణంలో భాగంగా! 

రామా కిల్డ్ రావణా- ఏక్టివ్ వాయిస్ అయితే, రావణా వాజ్ కిల్డ్ బై రామా- పాసివ్ వాయిస్ అవుతుంది. మొదటి వాక్యంలో కర్త ప్రమేయం, రెండవ వాక్యంలో కర్మ ఖర్మ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వ్యాకరణ సూత్రాల ప్రకారం ఈ రెండు జస్ట్ వాయిస్  ఛేంజెస్ మాత్రమే. రెండింటి మధ్యలో తేడా ఏమీ లేదు. తేడా లేనప్పుడు మరి ఒకే అర్థం వచ్చే రెండు వాక్యాలు నేర్చుకోవలని ఖర్మమేమిటి? అన్న ధర్మసందేహం ఆ చిన్నతనంలో రాకపోవచ్చు. కానీ, పెరిగి పెద్దవుతున్న క్రమంలో లోకం తీరును తర్కిస్తూన్న కొద్దీ ఇట్లాంటి చిత్రమైన సందేహాలు ఎన్నో పుట్టుకొస్తుంటాయి. తెలిసున్నవాళ్లెవరైనా సబబైన సమాధానం చెబితే బాగుణ్ణు- అనిపిస్తుంది. ఆ ప్రయత్నం ఫలితమే నాకు  ఈ మధ్య  చదివిన ఒక చిన్ని పొత్తం 'మెనీ క్వశ్చన్స్ - సమ్ ఆన్సర్స్ హానెస్ట్లీ'  చదివిన ఈ 'యాక్టివ్ వాయిస్ - పాసివ్ వాయిస్' లో దొరికిన వివరణ. దానికి ఇది నా కొచ్చిన తెలుగులో అనుకరణ. 

యాక్టివ్ వాయిస్ -పాసివ్ వాయిస్ తరహా క్రియలలో కర్తలను మార్చవలసిన అగత్యం మన తెలుగు వ్యాకరణానికి వాస్తవానికి లేదు. ఇదంతా ఆంగ్ల పరిజ్ఞానం వల్ల మనకు అబ్బిన అతివిజ్ఞానం. సంస్కృత వ్యాకరణంలో కూడా ఈ క్రియాపదాల ప్రమేయాన్ని మార్చే విధానం కనిపిస్తుంది. ఆ సంగతి ప్రస్తుతాంశానికి వర్తించదు కనుక అప్రస్తుతం. 

 అసలు వాక్యాన్ని తిన్నగా పోనీయకుండా, ఈ కర్తలను, వారి జోక్యాన్ని మార్చవలసిన అగత్యం ఏమొచ్చింది? అన్నది మొదటి ప్రశ్న. ఇంగ్లీషు వాడి (అతి)తెలివితేటలన్నీ వాళ్ల వ్యాకరణంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయని ఆ పుస్తకం రాసిన మహాదేశ్ పాండే సెలవిస్తారు. ఎంత దాచిపెట్టాలని చూసినా కొన్ని సంగతులు అసంకల్పితంగా అట్లా బైటపడడం ఏ జాతికైనా  సహజమే కదా ఎక్కడైనా? అన్న సందేహం కలగవచ్చు మనకు. అందరి దాచివేతలు, ఇంగ్లీషువాడి దాచివేతలకు మధ్య చాలా తేడా ఉంటుది. చరిత్రను తనకు అనుకూలంగా నమోదు చేసుకునేందుకు ఆంగ్లేయుడు తొక్కని అడ్డదారి లేదు' అన్నది అందరికీ అనుభవైకవేద్యమే కదా!  

ప్రపంచమంతా తమ చెప్పు చేతలలోనే ఉందన్నట్లు ముందు తరాలని నమ్మించాలని ఆంగ్లేయులకు మొదటి  నుంచి ఒక దుర్బుద్ధి కద్దు. అందుకోసమై కొన్ని  సందర్భాలలో ఆ 'హైడింగ్' -దోబూచులాట క్రీడ అవసరం అవుతుంది.  కొన్ని దాచడం, కొన్ని బైటపెట్టడం అన్న ప్రక్రియతోనే ఇంగ్లీషువాడు ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకొంది కూడా.  అందుచేత 'ఇంగ్లీష్ పీపుల్ డిఫీటెడ్ ది వరల్డ్ విత్ హైడ్ అండ్ సీక్ పాలసీ. (ఇది యాక్టివ్ వాయిస్సే)  అనడమే సబబు.  'ది వరల్డ్ వాజ్   డిఫీటెడ్ బై ది ఇంగ్లీష్ పీపుల్ విత్ హైడ్ అండ్ సీక్ పాలసీ.. అనడం  సబబు కాదు. కానీ, మన దేశం విషయం దగ్గరకు వచ్చేసరికి సమాధానం వేరుగా ఇవ్వవలసి ఉంటుంది అంటారు  ఆ పుస్తక రచయిత జవాబు. ఎందుకు ఇలా అంటున్నాడు అన్న సందేహానికి సమాధానం కూడా ఆయనే ఇచ్చాడా పుస్తకంలో.

ఇక్కడ ఉదాహరణకు వరల్డ్ మొత్తాన్ని తీసుకుని గందరగోళం పడే కన్నా మన దేశాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే విషయం మరింత తేటగా అర్థమవుతుంది.

మన మానానికి  మనం మన భారతీయ జీవనసరళిలో సర్దుకుపోయి జీవిస్తున్నకాలంలో ఇంగ్లీషువాడు ప్రపంచం మీద పెత్తనం చెలాయించాలన్న దుర్భుద్ధితో కొత్తగా కనుకున్న తుపాకీ మందుతో అందరి మీదకు మల్లేనే  మన దేశం మీదా వచ్చిపడ్డాడు. నిజానికి మనం గాని అప్పుడు అప్రమత్తంగా ఉండి స్వాభిమానం కాపాడుకోవాలన్న మంచి బుద్ధితో ఐకమత్యంగా  ఉండుంటే .. కలసి కట్టుగా వాడిని సులభంగా తిప్పికొట్టి వుండేవాళ్లమే. మన భూమి మీద ఎవడో పరాయివాడు ఎంత బలమున్నప్పటికీ ఎక్కడి నుంచో వచ్చి దౌర్జన్యం చేసి లొంగదీసుకోలేడు కదా.. మనలో ఏదో లోపం లేకుంటే! మనలో మనకు ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉండుంటే. మన పొరుగువాడు ఎక్కడ పైకొస్తాడోనన్న కుళ్లుతో ఎవడన్నా వచ్చి వాడిని  నాశనం చేసేస్తే కళ్ళు చల్లబడతాయనే మనస్తత్వం లేకుండా ఉండుంటే తెల్లవాడు అయేది .. వాడి జేజమ్మ అయేదీ మనలని మట్టి కరిపించడం కల్ల. కుళ్ళు బుద్ధుల వల్లనే ఇంగ్లీషువాడు ఇక్కడ మనల్ని ఓడించి రాజు మాదిరి పెత్తనం శతాబ్దికి పైడి పెత్తనం చెలాయించగలిగిందనడంలో సందేహం లేదు. దాని ప్రకారం 'ఇంగ్లీష్ పీపుల్ డిఫీటెడ్ అజ్' - అనే కన్నా 'వుయ్ వర్ డిఫీటెడ్ బై ది ఇంగ్లీష్ పీపుల్' అనడమే సబబు అవుతుంది కదా! ఓడడం అనే క్రియకు ప్రధాన ప్రమేయం ఇంగ్లీషువాడి కన్నా మనమే అవడం సూచిస్తుంది 'వుయ్ వర్ డిఫీటెడ్ బై ది ఇంగ్లీష్ పీపుల్' అన్నవాక్యం.  ఇప్పుడైనా స్పష్టంగా అర్థం అయివుండాలి యాక్టివ్ వాయిస్ కు, పాసివ్ వాయిస్ కు మధ్య ఉన్న తేడా.


రామా కిల్డ్ రావణా అనడం సరికాదు. రావణాసురుడే తన పిచ్చి పిచ్చి పనులతో రెచ్చగొట్టి రాముడి చేత చంపబడ్డాడు. కనక, రావణా వాజ్ కిల్డ్ బై రామా - అన్న పాసివ్ వాయిస్సే సబబైన పదం అవుతుందన్నమాట.

 ఇదే సూత్రం రామాయణం దగ్గరే ఆగిపోలేదు.  కలియుగంలో  ఇప్పుడు మనం ఉన్నామనుకుంటున్న  ప్రజాస్వామ్యంలో కూడా వర్తిస్తున్నది అని చెప్పడానికే రచయిత  ఇంత  సుదీర్థ వివరణ ఇచ్చింది. 

చెడ్డ నేతలు వచ్చి మనలను పరిపాలిస్తున్నారు అంటే అందుక్కారణం, ఆ నేతలు కాదు. అట్లాంటి వాళ్లని నేతలుగా తయారుచేసి వాళ్లు మన నెత్తి మీద ఎక్కి పెత్తనం చేయడానికి మనమే కారణం అవుతున్నామన్నది సారాంశం. ప్రజల పాసివ్ వాయిస్సే ప్రజాస్వామ్యం తాలూకు రియల్ స్పిరిట్ యాక్టివ్ వాయిస్ వినపించలేకపోవడానికి ప్రధాన కారణం.

మన దేశ దౌర్భాగ్యం మారాలంటే ముందు ఈ పాసివ్ వాయిస్ తప్పు అని నిరూపించుకోవలసిన అగత్యం అర్జంటుగా గుర్తించవలసి ఉందన్నది  'మెనీ క్వశ్చన్స్ - సమ్ ఆన్సర్స్ హానెస్ట్లీ' రచయిత మహాదేశ్ పాండే జీ    అభిప్రాయం.

-కర్లపాలెం హనుమంతరావు

12, డిసెంబర్, 2020

 

Friday, December 11, 2020

శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ - ' విశ్వం ' - కథానిక ; ఈనాడు ఆదివారం అనుబంధం 16 నవంబర్ 2008 సంచికలో ప్రచురించిన కథ పై నా పరామర్మ


శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ - ' విశ్వం ' - ఈనాడు ఆదివారం అనుబంధం 16 నవంబర్ 2008 సంచికలో ప్రచురించిన కథ అప్పటి కాలానికి సంబంధించిన ఆఫీసుల కంప్యూటరైజేషన్ అనే ఇతివృత్తం చుట్టూ తిరుగుతుంది. 

రచయిత కథలో ప్రదర్శించిన ' ప్రీ - కంప్యూటరైజేషన్ ' వాతావరణం మానవ సంబంధాలలోని  తళతళలు కనిపిస్తాయి. ఆఫీసుల యంత్రీకరణ  -  ఆర్థిక పరమైన భారం కుదించుకునే ఉద్దేశంతో యాజమాన్యాల వైపు నుంచి  కొత్త శతాబ్ది ఆరంభంలో మొదలైన ప్రణాళిక. ప్రారంభంలో జాతీయ బ్యాంకులు ఈ విధానం వైపు మొగ్గు చూపాయి. అప్పటికే లెక్కకు మించిన వసూలుగాని మొండి  బకాయిల భారంతో కుంగివున్న బ్యాంకులు రుణగ్రహీతలు ఉన్నత వర్గాలకు చెందిన కారణంగా సక్రమంగా లిటిగేషన్లు నడపించలేక .. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే నిమిత్తం అధిక మొత్తంలో జరిగే సిబ్బంది జీతభత్తేల చెల్లింపులను తగ్గించుకునే నిమిత్తం స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమును ప్రవేశపెట్టట౦ జరిగింది. ప్రాథమికంగా సిబ్బంది వర్గాల నుంచి ఎంతో కొంత ప్రతిఘటన  చవిచూసినప్పటికీ యాజమాన్యాలు వాలంటరీ రిటైర్ మెంట్ స్కీమును దిగ్విజయంగా అమలు చేసాయి. ఈ పరిణామాల అనంతరం సిబ్బందిని తగ్గించుకునే పద్ధతులను దాదాపు అన్ని ప్రభుత్వ ప్రయివేట్ సంస్థలు ముమ్మరం చేసిన నేపథ్యంలో నడిచినదీచంద్రశేఖర్ గారి  ' విశ్వం' కథ. 

రచయిత కథలో ప్రధానంగా చెప్పదలుచుకున్నది యంత్రీకరణ ముందు కార్యాలయాలలో సిబ్బంది మధ్య నెలకొన్న సానుకూల మానవసంబంధాల పార్శ్వం మాత్రమే. క్రమశిక్షణకు కట్టుబడి సిబ్బంది ఆఫీసుపని ఎట్లా చేసుకుపోవాలని బైటి ప్రపంచం అభిలషిస్తుందో రచయిత విశ్వం అనే ఆదర్శ పాత్ర ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. విశ్వం పనికి కట్టుబడి ఉండడమే  కాకుండా, సాటి ఉద్యోగుల మంచి చెడుల పట్ల చక్కటి 'కన్సర్న్' ఉన్న ఉద్యోగి. పనే అతనికి ప్రాణం . అయినప్పటికీ ఇంటిని నిర్లక్ష్యం చేసే తత్వం కాదు. ఇంటిపట్టునా భార్యా బిడ్డల పట్ల ఎంతో బాధ్యతగా ప్రవర్తించే విశ్వం బంధుమిత్రుల అవసరాలకు ఆదుకునేందుకు అందుబాటులో ఉండే నిమిత్తం ప్రతిభ, అవకాశం దండిగా ఉండీ  పదోన్నతులకు ఎగబడడు. స్వంత పనుల నిమిత్తం ఆఫీసు వనరులు దుర్వినియోగం చేయని ఆ చిరుద్యోగి ఆఫీసు  అవసరాలు తీర్చడం కోసం సొంత డబ్బులు వెచ్చిస్తుంటాడు ! అంతటి మంచి మనసు గల విశ్వం హఠాత్తుగా 'వాలంటరీ రిటైర్ మెంట్' కు దరఖాస్తు చేసుకుని ఆశ్చర్యం కలిగిస్తాడు. అవసర పడినప్పుడు పనిగంటలు మించి ఉచితంగా పనిచేసే విశ్వం మరో ఐదేళ్ల పదవీ కాలం మిగిలున్నా స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకోవాలనికి కారణం అందరూ ఊహించినట్లు పెరిగిన పని వత్తిడి ఒక్కటే కారణం కాదు ;  కార్యాలయంలో కంప్వూటర్ల ముందు కాలం నాటి మంచి వాతావరణం లేకపోవడం .. ఉద్యోగుల మధ్య సున్నితమైన  మానవసంబంధాలు మృగ్యమవడం ! - అంటారు రచయిత! 

ప్రభుత్వ,ప్రయివేట్ కార్యాలయాలలో కంప్యూటర్లు  ప్రవేశించిన అనంతరం కూడా పెరుగుతున్న తాత్సారాలు, పనిచేసే సిల్బుంది దురుసు ప్రవర్తనలు, సరిచేయడానికి వీలులేనంత భారీ మొత్తాలలో దోషాలు వంటివే ఎక్కువగా వినిపించే ఈ కాలంలో రచయిత విశ్వం పాత్ర ద్వారా పాఠకుడికి చెప్పదలుచుకున్న సందేశం ఏమిటి? అన్న సందేహం కథంతా చదివిన పాఠకుడికి కలగడం సహజం. 

ఉద్యోగ విరమణ అనంతరం మానసికంగా కుంగిపోయిన విశ్వం పాత్రలో తిరిగి ఉత్సాహం నెలకొల్పేందుకై  రచయితకు తట్టిన పరిష్కారం మరీ అబ్బురం కలిగిస్తుంది. జీతభత్తేలతో నిమిత్తం  లేకుండా ఆఫీసులో పనిచేసుకునేందుకు విశ్యం పాత్ర అర్జీ పెట్టుకోవడం! యాజమాన్యం అంగీకారం మీద విశ్వం తన పని రాక్షసత్వాన్ని సంతృప్తి పరుచుకోవడం! 


ముక్తాయింపుగా నా ఉద్దేశం ఏవిటంటే కథ మొత్తాన్ని ఒక ఫీల్ గుడ్ వాతావరణంలో నడిపించే ఉద్దేశంతో రచయిత ఎత్తుకున్న కథ ఆ కోణంలో వంద శాతం విజయం సాధించింది. కంప్యూటర్ల ముందు - కంప్యూటర్ల తరువాత అన్నట్లుగా చీలిపోయిన మానవ సంబంధాల వాతావరణంలో ఒక బ్యాంకు ఉద్యోగిగా పని చేసిన నాకు రచయిత అన్నీ పచ్చినిజాలే చెప్పినందుకు అభినందించాలనిపిస్తుంది. 

కానీ, విశ్వం లాంటి ఆదర్శ పాత్రల సృష్టే వాస్తవానికి చాలా దూరంగా ఉందన్నది పాఠకుడిగా నా అభియోగం.

రచయిత బహుశా ' మంచినే బోధించుము ' అన్న సూత్రానికి కట్టుబడి కథ అల్లుదామని ప్రణాళిక వేసుకున్న చందంగా ఉంది. అభినందనీయమే ! కానీ ఆ బోధించే 'మంచి'  అంతిమంగా ఏ  వర్గానికి ఎక్కువ మేలు చేస్తుంది ? అన్న అంశం మీదా రచయిత దృష్టి పెట్టి ఉండవలసింది! 

విశ్వం అనే ఒక మానవీయ  పాత్ర సృష్టి వరకు రచాయిత శ్రీ ' సి. ఎన్. చంద్రశేఖర్ నిశ్చయంగా అభినందనీయులే! 


( శ్రీ సి. ఎన్. చంద్రశేఖర్ - ' విశ్వం ' - ఈనాడు ఆదివారం అనుబంధం 16 నవంబర్ 2008 సంచికలో ప్రచురితం) 

- కర్లపాలెం హనుమంతరావు 

11, డిసెంబర్, 2020 

బోథెల్ ; వాషింగ్టన్ రాష్ట్రం 

యు ఎస్



ఏ 



Thursday, December 10, 2020

తారుమారయింది ! శ్రీ సి.వి.ఎన్. ప్రసాద్ కథానిక ' అబ్బాయి పెళ్లి ' పై నా పరామర్శ ( ఈనాడు – ఆదివారం సౌజన్యంతో )

 

ఒకానొక కాలంలో ఎదిగిన ఆడపిల్ల నట్టింట తిరుగుతుంటే లక్ష్మీదేవి నర్తిస్తున్నంత ప్రసాదంగా ఉండేది ఇల్లంతా. ఆడపిల్ల అనగానే కన్న వారికి మహా మురిపెంగా ఉండటం సహజమే గదా! ' కంటే కూతుర్నే కనాలి ' పేరుతో ఒక పెద్ద హిట్ మూవీ కూడా తీసారు ప్రముఖ దర్శకుడు దాసరి. గడచిపోయిన తమ బాల్యం నాటి కమనీయమైన పాత ముచ్చట్లన్నీ ఆడబిడ్డ రూపేణా మళ్లీ ఉన్నంతలో తీర్చుకోవచ్చని ఆ ఉల్లాసం. ఎన్ని ఆనందోత్సవాలు సంబరంగా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ చివరికి చిదిపి నట్టింట నిత్యం వెలిగించుకోవలసిన ఆ దీపం మరో ఇంటి జీవన జ్యోతిగ తరలిపోవలసిన తరుణం ఒకటి ఎలాగూ తప్పదు ఎప్పటికైనా . బంగారు తల్లులను ఎంత గారాబంతో పెంచుకున్నప్పటికీ మరో ఇంటికి ధారాదత్తం చేయబోమంటే సమాజమే తప్పు పడుతుంది కూడా . ఆడపిల్లను మరో అయ్య చేతిలో పెట్టే ఆ భారతీయ గృహస్థ జీవన విషాద సౌందర్య ఘట్టాన్ని కాళిదాసు నుంచి కాళ్లకూరి వరకు ఎందరో కవి పండితులు తమ తమ పాండితీ ప్రకర్షలతో తీర్చిదిద్ది సదా మననీయం చేసిపోయారు . కళ్యాణ శోభలో ఆఖరి అంశం అప్పగింతలు.. అది సాకారమవడానికి ముందు కొన్ని దశాబ్దాల కిందటి దాకా చాలా పెద్ద క్షోభ కథే నడిచేది; ముఖ్యంగా సగటు మధ్య తరగతి కుటుంబాలలో.
కాళ్లకూరివారు 1923 ప్రాంతాలలో ఈ ఆడపిల్లల పెళ్లిళ్ల ఇబ్బందులనే ఇతివృత్తంగా ఎంచుకొని 'వరవిక్రయం ' అనే నాటకం సృష్టించారు . ఆ రూపకం మొదటి రంగంలోనే కాళింది, కమల అన్న ఇద్దరు చక్కని చుక్కలను కన్న తల్లి భ్రమరాంబ 'కన్య నొక్కరి కొసగి స-ద్గతులు గాంతు/ మనుచు సంతోషపడు కాల - మంతరించి,/ కట్నములు పోయ జాలక - కన్య నేల/ కంటిమా యని వ్యథపడు - కాల మొదవె!'అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఒక పెళ్లి , తత్సంబధమైన కట్న కానుకల చుట్టూతానే ఆ నాటకమంతా నడిచినప్పటికీ నిజానికి ఆడపిల్లకు పిండ దశ నుండే ఎన్నో గండాలు ఎదురుగ నిలబడి ఉండేవి ఇటీవలి కాలం వరకు. ఆయా సామాజిక పరిస్థితులను పొల్లుపోకుండా, ఎక్కడా అతిశయం లేకుండా పూసగుచ్చిన చందంగా వివరించిందా ప్రబోధాత్మక నాటకం. ఆ రూపకంలో చెప్పినట్లు ఆడపిల్లల పెళ్లిళ్ల ఈడు దగ్గర పడ్డప్పటి బట్టి కన్నవాళ్ల గుండెల మీద కుంపట్లు రగలడం మొదలయినట్లే .
ఆ తరువాతా కూతుర్ని కట్టుకున్న అల్లుడు దశమ గ్రహ రూపంలో వాయిదాల పద్ధతిలో అత్తింటి వారిని వేపుకు తినడం ఒక సామాజిక హక్కు రూపంలో స్థిరపడ్డ దుస్థితి కలవరపరుస్తుంది. అందుకే కాళ్లకూరి ఇదే రూపకంలో ఆ ఆడపిల్లల తల్లి నోటితోనే - అప్పిచ్చినవాడితోను, ఇల్లు అద్దెకిచ్చినవాడితోను, జీతమిచ్చి పనిచేయించుకునే యజమానితోను , కులం పేరుతో నిందించేవాడితోను, పన్నులు కట్టించుకునేవాడితోను పిల్లను కట్టుకున్న అల్లుడిని పోల్చి మరీ కచ్చె తీర్చుకున్నారు. ఇన్ని బాధలుంటాయి కాబట్టే ఆ బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా అల్లుళ్లకు హడలి కూతుళ్లను కనడం మానుకొన్నట్లు కవిగారు అంటించినవి చురకలే అయినప్పటికీ, నిత్య జీవితంలో వ్యధకలిగించే పచ్చినిజాల నుంచి పుట్టుకొచ్చినవే ఆ వెటకారాలన్నీ . ఆడదై పుట్టే కన్నా అడవిలో మానై పుట్టడం మేలు - అన్న నానుడి ఉట్రుడియంగా పుట్టుకురాదు గదా! ' తండ్రులకు గట్న బాధయు- దల్లులకు వియోగ బాధయుదమకు నిం-కొకరి యింటిదాస్యబాధయుగల దరి-ద్రపు టాడు బుట్టువే పుట్టరాదని - బుద్ధి నెంతు' అంటూ పురుషోత్తమరావుగారి చిన్న కూతురు కమల ఆకాలంలో పుట్టింది కాబట్టి అట్లా వేదన పడ్డది. ఇప్పడా ఆవేదన పడే తంతు మగవాడి వైపుకు ఎట్లా మళ్లిందో వాస్తవంగా చిత్రించింది ఈ ' అబ్బాయి పెళ్లి ' కథ యావత్తూ.
అవిద్య, అజ్ఞానం, అబలత్వం, సంప్రదాయం, ఆర్థికపరమైన పరాధీనత, సంఘభయం వంటి ఎన్నో సంకెలలు ఇన్ని శతాబ్దాలుగా స్త్రీ జగత్తు పురోగతికి ప్రతిబంధకాలు అవుతూ వచ్చాయి. ఇప్పుడా పరిస్థితిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మారుతున్న మగవాడి పాత్ర ఆధారంగానే శ్రీ సి.వి.యన్. ప్రసాద్ సృష్టించిన చక్కని చిన్న కథ' అబ్బాయి పెళ్లి ' .
ఆకాశంలో నేనూ సగం - అన్న అంతరంగంలో అణగి పడి ఉన్న స్వాభిమానం బాహ్య ప్రకటన రూపంలో రూపాంతరం చెందే దిశగా స్వతంత్రమైన ఆలోచనలతో నేటి మహిళ అడుగులు ఎంతలా వేగంగా పడుతున్నాయో ప్రపంచం అంతటా ప్రస్తుతం విస్తృతంగా చూస్తున్నాం.
నూతన శతాబ్దిలో అంది వచ్చిన అత్యద్భుతమైన సాంకేతిక జ్ఞానం సాయంతో తన స్థాయి ఏమిటో తెలిసొచ్చి ఇప్పుడిప్పుడే స్పృహలోకొస్తున్న మహిళకు .. అంత: చైతన్య శక్తి కూడా అదే స్థాయిలో వికసిస్తున్న వేళ మునుపెన్నడూ లేనంత పెనువేగంతో మగజాతిని క్రమంగా అధిగమిస్తో ప్రగతి పథం దిశగా స్ఫుత్నిక్కుల వేగంతో దూసుకెళుతున్న వాస్తవం కాదనలేం. ఆ పెనుమార్పుల తాలూకు ప్రభావం సంస్కృతీ సంప్రదాయాలలో సైతం సృష్టంగా కనిపిస్తోంది కూడా . ప్రపంచమంతటా సంభవిస్తోన్న ఈ సాంస్కృతిక పునరుజ్జీవన పరిణామ క్రమానికి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకూ మినహాయింపుగా కనిపించక పోవడమే ఈ చిన్నకథ ప్రధాన ఇతివృత్తం.
శీలహననం జరిగితే మానమార్యాదల కోసమై నిశ్శబ్దంగా లోలోపలే శిథిలమయ్యే సర్దుబాటు ధోరణి నుంచి దుర్మార్గం నుంచి రక్షణ కోసం గానూ నిర్భయంగా, బహిరంగంగా, కలసికట్టుగా ఎలుగెత్తి ఉద్యమించే చైతన్యం సంతరించుకునే దశ దాకా ఎదిగింది ఇప్పుడు మగువ. గృహాంతర పాలన నుంచి గ్రహాంతరయానం దాకా ఎదిగిరాగల శక్తి సామర్ధ్యాలలో ఆమె తన అసమాన ప్రతిభా పాటవాలతో ఢీ కొంటున్న వైనం మగజాతిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న మాట కాదనగలమా? ఇన్ని శతాబ్దాలుగా.. పుట్టుక, పెంపకం , బాధ్యతలు , హక్కులు, ఆస్తులు పంపకాల వంటి అనేక ముఖ్య జీవితాంశాలలో సమ భాగస్వామ్య విషయకంగా జరుగుతున్న అన్యాయాలను ఇకపై సహించబోయేది లేదంటూ అనేక రకాలుగా ఏకకంఠంతో సంకేతాలను అన్ని కార్యక్షేత్రాల నుంచి బలంగా పంపుతున్నది కూడా ఇప్పటి ఇంతి. ఈ యుగసంధిలో జరుగుతున్న లైంగిక పాత్రల నిర్వహణ తారుమారులో భాగంగానే గత రెండు దశాబ్దాల బట్టి మనదేశంలోనూ మహిళల పరంగా పొడసూపుతున్న పెనుమార్పులు మగలోకపు ఊహలకు ఇప్పటి వరకు అందకుండా మును ముందుకు సాగుతునే ఉన్నాయి .
అర్ధిక క్షేత్రంలో స్వాతంత్ర్యం సముపార్జించుకున్న అనంతరం .. మునుపటి మానసిక బలహీనతలనూ తొలగ తోసుకునే తీవ్ర ప్రయాసలో నేటి మహిళ వివాహబంధం వరకు వచ్చేయడం సమాజంలో స్పష్టంగా కనిపించే విస్తుగొలిపే మార్పు .
నిన్నటిదాకా పెళ్లిని ఒక క్రీడగా భావించే లోకంలో మగవాడిదే మొదటి ఎత్తు-గా ఉండటం చూసాం. ఆ తరహా వ్యవస్థకు అలవాటూ పడిపోయాం. ఆ భావనకు ఇప్పుడు కాలం చెల్లిందంటుంది ఈ ' అబ్బాయి పెళ్లి ' కథ . నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, కాదనుకుంటే మధ్యలో తుంచుకోవడం, మనసు పుడితే మరో భాగస్వామిని అదనంగా ఉంచుకోవడం, యధేచ్ఛగా కోరిక తీర్చుకునే హక్కును ఇదేమని నిలదీసే స్వాభిమానితో బంధం తెంచుకోవడం వగైరా వికృత పోకడలన్ని గతంలో మాదిరి మగవాడికి పుట్టుకతో అబ్బిన హక్కులు కావిప్పుడు. పెళ్లి బజారులో గతం మాదిరి మగాడిప్పుడు అదనపు కట్న కానుకలు, పెట్టు పోతలు పేరుతో చెట్టుసురులకు దిగడం కుదరదు. సరికదా అసలు డౌరీ పేరెత్తే సాహసమే మగపెళ్లివారి నుంచి కనిపించడం అరుదైన సందర్భాలు అబ్బురం కలిగిస్తున్న మాట వాస్తవం .
పెళ్లిచూపుల వంకతో కాబోయే ఇంటి కోడళ్లకు కాదీ కాలంలో శల్య పరీక్షలు. . మగవాడికి ఆ శిక్షలు! అతగాడి నాలుగంకెల జీతానికి గతంలో మాదిరి క్యూలు కట్టడం లేదీకాలపు ఆడపిల్లలు ఎక్కడా ! ఐదొందల నోటొకటి వదిలితే చాలు .. ఆరేడు రకాల డిష్టులతో అప్పటికప్పుడు ఏ డీలక్సు రెస్టరెంటో లగ్జోరియస్ లంచ్ ప్యాక్ చిటికేసే లోపు డెలివరీ చేసే కాలంలో .. వంటొచ్చా ?అని ప్రశ్నేసే మగాడిని అసలు మగాడుగా ఒప్పుకునే మూడ్ లోనే ఉండటం లేదీ మోడరన్ వుడ్ బి బ్రైడ్ . చాకలి పద్దుల చదువులు, హారుమొనీ మెట్టు రాగాలు, అత్తగారి కాళ్లొత్తే వినయాలు, మామగారికి కళ్లెదుట పడలేని బిడియాలు .. టైపు ఆడపిల్లలను కలలోనైనా ఉహించడం కుదరదు. ఆస్తిపాస్తులుండటమే కాదు.. చేసుకునే పిల్లకు తోబుట్టువు లెవరూ ఉండని సంబంధాలకై ఆనాడు మగపెళ్లివాళ్లు వెంపర్లాడినట్లే .. తల్లిదండ్రులు దగ్గరుండని పెళ్లి కొడుకుల కోసం ఆడపిల్లలు ఇప్పుడు ఆరాట పడుతున్నారు! ఆ కధా కమామిషు అంతా సూచ్యార్థం శైలిలో మినోదం ముదరకుండా సహజభాషలో చెప్పుకుపోతుందీ ప్రసాద్ గారి 'అబ్బాయి పెళ్లి ' కథ.
కాలం తన మాయాజాలంతో సంసారమనే నాటకంలో పాత్రల నైజం ఎంతవింతగా తిరగరాసేస్తుందో ఆకళింపు చేసుకొనేందుకైనా ఈనాడు ఆదివారం ప్రత్యేక అమబంధం 30, ఆగష్టు, 2010లో ప్రచరించిన శ్రీ సి.వి.ఎన్. ప్రసాద్ కథానిక ' అబ్బాయి పెళ్లి ' చదివితీరాలి.
పెళ్లికెదిగిన మగపిల్లలు కళ్ల ముందు తిరిగే కన్నవారు చదివితే ఎంతో సహజంగా ఉంది అని నిట్టూర్పు విడుస్తారు. ఆ తరహా గుండెల మీద కుంపట్లు రగలుతుండని అదృష్టవంతులు చదివితే మాత్రం ' మరీ అతిశయంగా ఉంది ' అని పెదవి విరవడమూ ఖాయమే ..
పదేళ్ల కిందటి నాకులాగే!
ముక్తాయింపు: కాలంలో జరిగే మార్పులను యధోచితంగా కళా నైపుణ్యాలకు కొదువ లేకుండా నమోదు చేసే సాహిత్యంలోని ఏ ప్రక్రియ రచన అయినా ఆ ప్రక్రియ వరకు ఉత్తమ శ్రేణిలో కుదురుకున్నట్లే లెక్క. ఆ కొలమానం ప్రకారం సి.వి. ఎన్. ప్రసాద్ గారి ఈ ' అబ్బాయి పెళ్లి ' కథానికకు గుర్తుంచుకోదగిన కథల జాబితాలో స్థానం దక్కాలి న్యాయంగా ! అవకాశం ఉండీ హాస్యం కోసం ఎక్కడా అతిశయాలంకార ప్రలోభాలకు లొంగని నిగ్రహ శిల్పం కథను పాఠకుడికి మరింత దగ్గరకు చేరుస్తుంది. శ్రీ ప్రసాద్ ఇందుకు ప్రత్యేకంగా అభినందనీయులు.
☘️
రచయితకు మనసారా అభినందనలు
🙏🏻🙏🏻👏👏
- కర్లపాలెం హనుమంతరావు
08 - 12 - 2020
బోథెల్ ; యూయస్ఏ






Monday, December 7, 2020

ఓ డోలోడు - కథానిక – రచయిత పేరు తెలియదు)- సేకరణ ః కర్లపాలెం హనుమంతరావు

 చేస్తున్న పని ఆపి కాలుతున్న చుట్టను ఒక దమ్ము లాగి మళ్లా పక్కనే పెట్టాడు సుబ్బులు. నడుముకు వారుతో తగిలించుకున్న వంకీతో డోలుకున్న వారు పట్టెల్ని మరోమారు లాగాడు. నిలబెట్టుకున డోలు కుడి మూతను నాలుగైదు సార్లు తట్టి  శృతి చూసుకున్నాడు. మళ్లా చుట్ట చేతిలోకి తీసుకుని రెండు మార్లు దమ్ములాగాడు. చుట్ట అయిపోవడంతో దూరంగా విసిరేశాడు. అదెళ్లి టెంకాయ చెట్టు మొదట్లో పడి అక్కడున్న నీళ్ల తడికి సుయ్యిమంది.

డోలును ఎడం మూత పైకి వచ్చేటట్లు తిప్పాడు. డోలు పుల్ల తీసుకుని దాని మీదా కొట్టి చూశాడు. అనుకున్నట్లు మోగలేదేమో 'ఛీ! దీనమ్మ' అనుకుంటూ డోలును మళ్లీ వంకీతో లాగడం మొదలుపెట్టాడు. కుడి మూత రంధ్రం నుంచి డోలు కర్ర మీదుగా ఎడం మూత రంధ్రంలోకి దూర్చుతూ డోలు కర్ర పట్టీ చుట్టూ ఉన్న వారుపట్టీలను లూజు లేకుండా బిర్రుగా లాగాడు.

సుబ్బులకు గొంతు కింద పోస్తున్న చెమట గుండె మీద నుంచి నడుం వరకు కారుతోంది. నల్లటి శరీరానికి నిమ్మచెట్ల మీద నుంచి వచ్చే గాలి తగలడంతో హాయిగా అనిపించింది. పక్కనే ఉన్న పై కండువాతో శరీరాన్ని తుడుచుకున్నాడు.

అలా నాలుగు సార్లు శృతి చూసుకున్నాక మిగిలిన వారును డోలు అడ్డకర్రల పట్టీగా నాలుగైదు వరుసలు చుట్టాడు. సొప్ప తీసుకుని ఎడం మూత కడెంలోకి చొచ్చుకొనొచ్చిన పిచ్చులపై ఆనించి గుండ్రాయితో తడుతూ పిచ్చుల్ని ఇంకా లోపలికి కొట్టాడు. ఎండ తగిలేటట్టు ముందు రోజు తయారు చేసి ఏలాడ గట్టిన బొట్టెల్ని తీసుకొనొచ్చాడు.  మంగలి పొదిలో నుంచి గోరుగాలు తీసుకుని గోగుపుల్లల చుట్టున్న బొట్టెల్ని జాగ్రత్తగా గుండ్రంగా కోసి వాటి నుంచి బైటికి తీశాడు. వాటిని ఎడం చేతి బొటన వేలుకు మినహా అన్ని వేళ్లకు పెట్టుకున్నాడు. గోతం పట్టని సరి చేసి డోలు కొట్టడం మొదలు పెట్టాడు.. పాల వరసల నుంచి .

యుద్ధానికి సిధమయ్యే సైనికుడిలా.. కళను సృష్టించబోయే ముందు కళాకారుడి ఆత్మనివేదనలా.. తదేక దృష్టితో సుబ్బులు దానిలో మునిగిపోయాడు.

ఇంటర్మీడియెట్ చదువుతున్న సుబ్బులు చిన్నకొడుకు కాలేజీ ఫీజుల కోసం కావలి నుంచి వచ్చాడు. సిటికేసర చెట్టు కింద, పొయ్యిలోకి కరతమ్మ పుల్లల్ల్ని చిదుగులుగా కొడుతూ తండ్రి వాయించే డోలుకు తలూపుతున్నాడు.

సుబ్బులు కూతురు అత్తగారింటి నుంచి వచ్చుంది. మళ్లా పంపాలంటే చీరన్నా పెట్టాల్సిందే. దారి ఖర్చులూ ఇవ్వాల్సిందే.

సాయబ్బుల పీర్ల పండక్కి వాయిస్తే ఈ దఫాకి మీ ఇద్దరి గొడవా వదిలినట్లే అన్నాడు వారం రోజుల కిందట సుబ్బులు. కానీ ప్రతి ఏడాదిలా ఈ ఏడు పీర్ల పండగ మేళం సుబ్బులుకు ఊరకే రాలేదు. పెద్ద తిరకాసే జరిగింది.

***

ఆ రోజు సుబ్బులు బస్టాండులో ఉన్నాడు. ఎవరో వస్తే గడ్డం చేస్తున్నాడు. సాయబ్బులపాలెం నుంచి మదర్సా హడావుడిగా వచ్చాడు. 'అరేయ్ సుబ్బులూ! ఈసారి పీర్ల పండక్కి మేళాల కోసం పెద్ద రబస జరిగిందిరా! అన్ని సావిళ్లోళ్ళు ఈసారి పక్కూరి నుంచి పిలిపిద్దాం'అన్నారు. 'కొత్తపట్నం, అలకురపాటి నుంచి తెప్పిద్దాం'అన్నారు.

గడ్డం చేస్తున్నోడల్లా ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు సుబ్బులు. 'అవున్రా! మనూరోళ్ల కంటే కొత్తపట్నమోళ్ళు బాగా వాయిస్తన్నారని అంటున్నారు. ఎంత చెప్పినా వింటన్లే!'

'అదేందిరా మదర్సా! మీకు ఒడుగులైనా.. గిడుగులైనా మేమే కదరా వచ్చేది. చిన్నప్పట్నుంచి కలసి మెలసి తిరిగాం. గడ్డమైనా.. క్రాఫైనా ఎంతిస్తే అంతే తీసుకున్నాం. మన సాయబ్బులే.. మనోళ్లే.. అనుకున్నాం. ఇప్పుడేందిరా.. ఇదీ!' అన్నాడు.

'అవున్రా! నేనూ అదే చెప్పా! కానీ .. కుర్రోళ్లు .. ఎదిగొఛ్చారు కదా! ఇంటంలా! మిగతా మూడు సావిళ్లు మా చేయి దాటిపోయింది. మా సావిడి మేళం మాత్రం సుబ్బులన్నే అని గట్టిగా చెప్పొచ్చారా!' అన్నాడు.

సాయిబులపాలెం పెద్దలతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆ ఒక్క సావిడీ ఒప్పుకుని బయానా తీసుకున్నాడు సుబ్బులు.

అన్నిసావిళ్ల పని ఒప్పుకుని పక్కూళ్ల నుంచి మేళగాళ్లను తెచ్చి పని జరిపిస్తే కాస్త డబ్బు మిగులుతుంది. అది అందరికి తెలిసిందే. పక్కూరోళ్లను మేళానికి పిలిచినా అట్లాగే చేస్తారు. కానీ ఈసారి సుబ్బులుకు ఆ అవకాశం లేదు. అదే అలవాటుగా మారితే ఈ ఊరు మంగలోళ్ల పరిస్థితి ఏమిటి? మేళాలన్నీ పక్కూరికి పోతే ఈ ఊరి మీద పట్టు పక్కూరికి పోద్ది. అది జరక్కూడదంటే పక్కూరోళ్లకంటే ఈ ఊరే మేలనిపించాలి. తమ సత్తా ఏంటో పీర్ల పండక్కి చూపించాలి అనుకున్నాడు.

గొల్లోళ్ల వెంకన్న దగ్గరికెళ్లి మంచి మేక తోలు తెచ్చి ఆరకొట్టాడు. డోలు కున్న మూతలు విప్పి నానేసి తోలు విప్పాడు. ఆరగొట్టిన కొత్తతోలు కడాలు సైజుకు తగ్గట్లు గోరుగాలుతో కోశాడు. ఎడం మూత రెప్ప కోసం మంచిగా తోల్ని సిద్ధం చేసుకున్నాడు. రెండు రోజులు బక్కెట్లో నానేశాడు. మూడు పూట్ల తొక్కి తోల్ని పొదగడానికి సిద్ధం చేశాడు. చిన్నకొడుకు ఊర్రాముల చిల్లరకొట్టు ఎదురుగా చింతిత్తులు ఏరుకొచ్చాడు. గుండ్రాయితో చిన్నచిన్న ముక్కలుగా చితక్కొట్టి నానేశాడు. సుబ్బులు పెళ్లాం వాటిని మెత్తగా రుబ్బి, వండి, మైదా కలిపి బందన తయారుచేసింది.

సుబ్బులు కడేలుకు బందన పూసి తోలు అతికించాడు. గట్టిగా అతుక్కునేందుకు బిరుసు గుడ్డతో అదిమాడు. ఎడం మూత పొదగడానికి వల్లూరు జగ్గయ్య దగ్గరికెళ్లి మిషను తెచ్చాడు. కడానికి తోలు అతికించి బాగా అత్తుకునేందుకు మిషను బిగించాడు. ఆరపెట్టాడు. రెండు మూతలు ఆరాక చింతగింజలు పెట్టి మధ్య దూరం సమానంగా ఉండేటట్లు చూసి కళ్లు(రంధ్రాలు) కోశాడు. అక్కడ తోలు నానడానికి గుడ్డపీలికతో వాటిని తడుపుతూ రోజంతా ఉంచాడు. ఎడం మూత ఆరాక దానిపై రెప్పను అతికించి మళ్లా పొదిగాడు. డోలు కర్రకు గుడ్డతో నూనె పూసి బాగా సిద్ధం చేసుకున్నాడు. కుడి మూత మధ్యలో నల్లటి బూడిదరాశాడు.

 

సుబ్బులు చిన్నకొడుకు, కూతురు కలసి ఇంట్లో పాత కద్దరు గుడ్డను అంగుళం వెడల్పు ఉండేటట్లుగా పేలికలు పేలికలుగా చించారు. రెండు గోగుపుల్లల్ని జానెడంతవి నరికి సిద్ధంచేసుకున్నారు. సిమెంటు, అన్నం కలిపి మెత్తగా నూరారు. గుడ్డలేలికలకు దానిని పూసి గోగుపుల్లలకి రెండు కొసల దానిని అంటించారు.  వాట్ని ఎండలో ఆరగట్టారు. అవి ఎండాక గోగుపుల్లల్నుంచి విడదీస్తే బొట్టెలు అవుతాయి.

ఆ రోజు సుబ్బులు పొద్దున్నె అన్నిట్నీ ముందేసుకుని కూర్చున్నాడు. డోలు కర్రని నిలబెట్టి కింద కుడి మూత, పైన ఎడం మూత పెట్టి రంధ్రాల గుండా వారు ఎక్కించాడు. మూతలు బిర్రుగా ఉండి, శృతి రావడం కోసం వారు పట్టీలకు వంకీ తగిలించి లాగుతున్నాడు.

లాగుతున్నాడే కానీ, పక్కురోళ్ల గురించి, వాళ్ల డోళ్ల గురించి, సన్నాయిల గురించి,వాళ్లు వాయించే విధానం గురించి ఆలోచిస్తున్నాడు. అంతే కాదు.. సొంతూర్లో పరువు నిలబడాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాడు.

వాయించడం అయిపోయాక, అన్నిట్నీ నెమరు వేసుకున్నాక, డోల్ని మరోసారి సరిచూసుకుని పట్టెడ తగిలించాడు. గుడ్డ కప్పాడు. ఇంట్లో దేవుడి మూలనున్న పీటపై పెట్టొచ్చి ప్రశాంతంగా గాలి పీల్చుకున్నాడు. నిప్పెట్టె తీసి చుట్ట అంటించాడు. దమ్ములాగుతూ మార్కెట్లో ఉన్న పంచలోకి వెళ్లి కూర్చున్నాడు.

***

సుబ్బులూ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. పెద్దోడు సన్నాయి, రెండోవాడు .. అదే సుబ్బులు, మూడో వాడు మళ్లీ సన్నాయి, నాలుగోవాడు మళ్లీ డోలు.. వాయిస్తారు. వాళ్లయ్య చస్తూ చస్తూ ఊరిని, వృత్తిని చూపించిపొయ్యాడు. పక్కూరు మంగలోళ్లకు ఈ నలుగురు అన్నదమ్ములంటే హడల్. కాని, డబ్బులు బాగా ఇస్తారని ఈ కొత్తపట్నపోళ్లు, అలకురపోటోళ్లు ఒప్పుకున్నారు. ఈ విషయం నలుగురు అన్నదమ్ములకు తెలుసు. అందుకే వాళ్లు సన్నాయిల్ని కూడా గట్టిగా సిద్ధంచేసుకున్నారు.

పీర్ల పండగ రానే వచ్చింది. మొదట్రోజు సావిట్లోంచి పీర్లను దించడం. మామూలుగానే సాగిపోయింది. సుబ్బులు ఆ ఊరు మంగలోళ్లకున్న పీరు దగ్గరకు వెళ్లి 'మా పరువు నీవే కాపాడాల' అని వేడుకున్నాడు. పెళ్లాంతో కలిసి బొరుగులు, వేగించిన శెనగపప్పు, బెల్లం పీర్లకు ఇచ్చొచ్చాడు. తర్వాతి రోజు గుండం తొక్కడం కూడా అయింది. ఆ తర్వాతి రోజే పీర్ల ఊరేగింపు.

ఆ రాత్రి సాయిబులపాలెంలో ప్రతి సావిడి దగ్గర సినిమాలు, నాటకాలు, రికార్డింగ్ డ్యాన్సులు.. పోటీపడి వేస్తారు. వేకువ జాము మూణ్ణాలుగ్గంటలకు పీర్లు ఊరు చుట్టూ తిరుగుతాయి. ట్రాక్టర్ల మీద డూపు హీరోలు, హీరోయిన్లు ఎగురుతుంటే జనాలకు సందడే సందడి.

పదిగంటలకల్లా పీర్లు ఊరు చుట్టూ తిరుగుతుంటే నీళ్లతో వారు పోసేవాళ్లు పోస్తూనేవున్నారు. అందరు ఇళ్ల నుంచి బయటికొచ్చి చూస్తున్నారు. సాయిబుల పిల్లలు ఎగురుతుంటే దానికి అనుగుణంగా మేళం మోగుతోంది.

పీర్ల ఊరేగింపు తిరుగుతూ తిరుగుతూ ఊరి మధ్యలో ఉన్న రాంసామి మేడ దగ్గరి కొచ్చింది. పీర్లు అన్నీ వరుసగా నిలబడ్డాయి.  ఏ పీరు కాడున్న మేళగాళ్లు ఆ పీరు దగ్గర వాయిస్తున్నారు. సన్నాయిలు శృతిమించి మోగుతున్నాయి. జనాలందరూ విరగబడి చూస్తున్నారు, ఎగిరేవాళ్లు ఎగురుతూనే ఉన్నారు.

అప్పటికే మేళగాళ్లకి మందు సరఫరా అయింది. సుబ్బులుకి, వాళ్లన్నకు మందు అలవాటు లేదు. మిగిలిన పీర్లకాడ వాళ్లు తాగిన మైకంలో వాయిస్తున్నారు. అలకురపాటి ఎంకట్నర్సు రేపు చూసుకుందాం అన్నట్లు సుబ్బుల్ని చూసి తలెగరేశాడు. కొత్తపట్నం సీను సన్నాయిని గుండ్రంగా తిప్పుతూ సై అన్నట్లు చూశాడు. సుబ్బులుకు కోపం నసాళానికి అంటింది.' నా కొడుకులు వాయించేది తక్కువ.. ఊగేది ఎక్కువ' అనుకున్నాడు. నిటారుగా నిలబడి డోలు వాయిస్తున్నాడు. అట్లా పోటీ రంజుగా సాగుతుంటే 'టైం లేదు .. టైం లేదు.. పదండి.. పదండి' అంటూ సాయిబుల్లోని పెద్దలు పీర్లని ముందుకు కదిలించారు.

మరుసటి రోజు గుమ్మటాలు. అదే చివర్రోజు. గుమ్మటాలన్నీ ఊర్లోని పెద్ద బజారుగుండా సముద్రానికి వెళతాయి. అక్కడే వాట్ని కలిపేస్తారు.

ఆరు గంటలకల్లా గుమ్మటాలు సాయిబులపాలెంలో బైలుదేరాయి. ఒక్కో గుమ్మటం దగ్గర జనాలు ఇసకేస్తె రాలనంతగా ఉన్నారు. ఒకచోట ఒకరు చేతిరుమాలును పళ్ల మధ్య బిగించి నాగిని నృత్యం చేస్తుంటే, మరోచోట ఇంకోడు పులి డ్యాన్స్! ఇలా అన్ని గుమ్మటాల దగ్గరా కోలాహలం. ఊరు ఊరంతా కులం, మతం, ఆడ, మగ భేదాల్లేకుండా ల గుమ్మటాల చుట్టూరా ఉంది.

గుమ్మటాలన్నీ జాలమ్మ చెట్టు దగ్గరకు వచ్చాయి. అక్కడ బజారు పెద్దదిగా ఉంటుంది. నాలుగు గుమ్మటాలని వరసగా నిలబెట్టారు. వాటి ముందు మేళగాళ్లు.. వాళ్ల ముందు ఎగిరేవాళ్లు. పోటీ ప్రారంభమయింది అనుకున్నారు చూసేవాళ్లంతా. అప్పటికే వాయించేవాళ్లు తాగున్నారు. ఒక్కొక్కరు మోకాలి దండేసి డోలు కొడుతున్నారు. సన్నాయిని గాల్లోకి తిప్పుతు ఆకాశం కేసి చూస్తూ ఊదుతున్నారు.   రాగాలు, తాళాలు మారుమోగుతున్నాయి. ఎగిరేవాళ్లకు అనుగుణంగా వాయిస్తున్నారు.

సుబ్బులు నిశ్చలంగా నిలబడి ఒక మౌనిలా వాయిస్తున్నాడు. తాళాలన్నీ శృతికి అనుగుణంగా పడుతున్నాయి.

ఎంకట్నర్సు సుబ్బులు వంక చూసి కొత్త తాళం అందుకున్నాడు. అక్కడి సన్నాయిలూ అందుకు అనుగుణంగా మారిపోయాయి. సుబ్బులు కూడా కొత్తతాళం ఎన్నుకున్నాడు. కొత్త కళాసృజన ప్రారంభమయింది.

సుబ్బులు దుమికే జలపాతంలా మారిపోయాడు. జనాలందరూ సుబ్బులు డోలు చూడ్రా! ఎట్టా మోగుతుందో! అంటూ ఆ గుమ్మటం దగ్గరకు వచ్చేస్తున్నారు. వస్తూ వస్తూనే ఊగిపోతూ ఎగురుతున్నారు. డోలు గట్టిగా మోగుతోంది. మోగుతూ మోగుతూ ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. డోలు కుడి మూత టప్పుమని పగిలిపోయింది. సుబ్బులుఉ నిశ్చేష్టుడైపోయాడు. ముఖాన నెత్తుటి చుక్క లేకుండా పోయింది. గుండె ఆగిపోయిందనుకున్నాడు. యుద్ధం మధ్యలో అస్త్రాలు కోల్పోయిన సైనికుడిలా నిలబడిపోయాడు.

అంతలో సుబ్బులు తమ్ముడు వెంకటేశ్వర్లు తన మెడలో ఉన్న డోలు తీసి సుబ్బులు మెడలో వేశాడు.'నువ్వు ఒక్కడివి చాలు. వాయించన్నా!'అన్నాడు. పక్కనే ఉన్న సుబ్బులు అన్న సన్నాయిలో కొత్తరాగాన్ని ఎత్తుకున్నాడు. సుబ్బులు తనను తాను నిలదొక్కుకున్నాడు. ఎడం మూతపై వేళ్లను సప్తస్వరాలుగా కదిలించాడు. కుడి మూత మీద పుల్లను దానికి తగ్గట్లుగా నర్తింపచేశాడు. ఇప్పుడు మంగలి సుబ్బులు సుబ్బుల్లా లేడు. మ్స్రొ సృష్టి చేస్తోన్న బ్రహ్మలా మారిపోయాడు.

ఆ ధ్వని అందరి మనసుల్లోకి చొచ్చుకునిపోతోంది. వాళ్లల్లో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. అందరూ మంత్రముగ్ధుల్లా మారిపోయారు. అన్ని గుమ్మటాల నుంచి జనాలు వచ్చి చూస్తున్నారు. ఎగిరేవాళ్లు కూడా నిశ్చలంగా నిలబడిపోయారు. ఒక తపస్సమాధిలో ఉన్నట్లు సుబ్బులు వాయిస్తూనే ఉన్నాడు.

నిజానికి సుబ్బులు డోలు నేర్చుకోలేదు. తండ్రి వాయిస్తుంటే చూసి నేర్చుకున్నాడు. జవజీవాల్లో నిక్షిప్తమైన కళకు,  నేర్చుకున్న కళకు ఉన్న తేడా సుబ్బుల్ని చూస్తే తెలుస్తుంది.

వెంటనే వెంకట్నర్సు డోలు పక్కన పడేసి సుబ్బులు ముందు కొచ్చి 'అన్నా..' అన్నాడు. మిగతా గుమ్మటాల దగ్గర ఉన్న సాయిబులందరూ కూడా సుబ్బులు దగ్గర కొచ్చారు. మేళం రసపట్టులో ఉన్నప్పుడు ఎదుటివాడు డోలు మీద నుంచి పుల్ల తీయడమే ఒక పెద్ద అవమానం. కానీ, వెంకట్నర్సు 'అన్నా,.. మీ ఊరు మీదే!మా ఊరు మా ఊరే!' అన్నాడు ఉద్వేగంగా.

తర్వాత గుమ్మటాలు నెమ్మదిగా సముద్రం వైపు కదిలాయి. అప్పటికే సమయం రాత్రి తొమ్మిదయింది. సముద్రం నిశ్శబ్దంగా వెన్నెట్లో మెరుస్తోంది.

రచయిత (పేరు - తెలియదు) ;

(ఆంధ్రజ్యోతి ఆదివారం 16,మే, 2010 సంచికలో ప్రచురితం)

సెల్: 9848425039

సేకరణః కర్లపాలెం హనుమంతరావు

07, 12 డిసెంబర్, 2020






*** 

 

 

Saturday, December 5, 2020

వేంపల్లి షరీఫ్ కథ ' పర్దా - నా పరామర్శ - కర్లపాలెం హనుమంతరావు





ఇప్పుడే చదివాను . ముగిసిన తరువాత మనసంతా అదోలా చేదయిపోయింది . 
మనిషి జీవితంలోని  కష్టసుఖాలకు  తిండి, బట్ట, తలదాచుకునే  ఇంత నీడ .. ఇవి కరవు అవడమే కారణమనుకుంటాం సాధారణంగా. నిజమే ఇవి ప్రాథమిక అవసరాలే .. తీరనప్పుడు జీవితం దు:ఖ  భాజనం తప్పక అవుతుంది. ఇవన్నీ ఆర్థికంతో ముడిపెట్టుకుని ఉన్న అంశాలు . చాలినంత డబ్బు సమకూరితే ఇక మనిషికి  ఏ తరహా కష్టాలు  ఉండవు. కష్టాలు ఉండనంత మాత్రాన బతుకంతా సుఖమయమయిపోతుందనా అర్ధం? జీవితం ఒక ముడి పదార్థం మాత్రమే అయితే, లాజిక్ ప్రకారం  నిజవే అనిపిస్తుంది. అదే నిజమైతే మరి  బాగా డబ్బుండి ప్రాథమిక అవసరాలు అన్నీ తీరిపోయే వారికి ఇక ఏ కష్టాలు ఉండకూడదు. . కదా మరి ? కానీ వాస్తవ జీవితాలు ఆ విధంగా లేవే!  అన్నీ సదుపాయాలు సమకూరి బైటికి సలక్షణంగా జీవితం గడుపుతున్నట్లు కనిపించేవాళ్లూ లోలోన ఏవో కుంగుబాటుల్లో .. తాము పరిష్కరించుకోలేని తాము ఏర్పరుచుకోని కట్టుబాటుల మధ్య ఇరుక్కుపోయి బైటికి రాలేక... వచ్చే మార్గం తెలేక .. తెలిసిన వాళ్లు అందుబాటులో లేక  అనుక్షణం బైటికి చెప్పుకోలేని సంక్షోభం మధ్య  నలిగిపోతుండటం కనిపిస్తుంది. అట్లాంటి నిష్ప్రయోజనమైన,   నిరాధారమైన  ( మూఢ ) విశ్వాసాల మధ్య  ఇరుక్కుని నలిగిపోయే బడుగు తరగతి సంసారుల సంఘర్షణ ఇతివృత్తంగా అల్లిన వేంపల్లి షరీఫ్ 'పర్దా' కథ కరుణరసార్ద్రంగా ఉంది. 

కథలో రచయిత ప్రధమపురుషలో  వినిపిస్తున్నట్లు అనిపించే దిగువ మధ్య తరగతి పట్టణ  ముస్లిం కుటుంబ నేపథ్యంలోని ఒక ముసలి అవ్వ కథ  ఇది .  కాని, నిజానికి ప్రతి ముస్లిం పేద కుటుంబంలోనూ పొద్దు వాటారే దశలో ఉండే స్త్రీలు ఎదుర్కొనే  విచిత్రమైన సమస్యను ఈ కథకు వస్తువుగా ఎంచుకున్నందుకు రచయిత అభినందనీయుడు  .  
ఇస్లాం కుటుంబాలలో ఇప్పటికీ  ' పర్దా' పద్ధతి  స్త్రీ లోకం పాలిట ఒక పెను శాపంగానే లోలోపల రగులుతూనే  ఉంది. ప్రభుత్వం తాను తెచ్చినట్లు చెప్పుకునే   చట్టాలు నిత్య జీవితాలలో ఆమోదయోగ్యమై ఆచరణ స్థాయి దాకా ఎదిగిరావాలంటే ముందు అందుకు సంబంధించిన  సమాజాలలో మానసికపరమైన పరిణతి స్థాయి పెరగడం అవసరం .  ఆచరణ స్థాయి దాకా తీసుకురాలేని సంస్కరణలు  ఎన్ని  సంక్షేమ పథకాలు, చట్టాల రూపంలో  ప్రదర్శనకు పెట్టినా అవి కేవలం ఏ బుక్కుల్లోనో  నమోదయి .. ఉండేందుకు, మరీ అత్యయిక పరిస్థితుల్లో ' షో ' చేసేందుకు మాత్రామే  పనికివస్తాయి. 
ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉండి వెంటనే పెళ్లి చేసి పంపేయగల  తాహతు  లేని ముస్లిం కుటుంబాలలో ' పరువు ' భయం కోసం పరదాల మరుగున ఆడపిల్ల సరదా సంతోషాలకు ఓ రెండు గదుల హద్దులు గీసేయటం ఒక అమానుష దృశ్యమయితే   .. ఏ పరదాల మరుగునా తిరిగే అవసరం లేని గ్రామీణ వాతావరణంలో బిడ్డల ఎదుగుదల కోసం మత విన్వాసాలను కూడా కాదనుకుని  సంసారం నెట్టుకొచ్చిన ఒకానొక తరం నాటి  ముసలవ్వ  ఇప్పుడు ఆ పర్దా .. గోషాల మధ్య  కొత్తగా ఇరుక్కుని మసలవలసిన పరిస్థితులు తోసుకురావడం మరింత అమానుషంగా  ఉంటుంది. తెంచుకోలేని మతమూఢ  విశ్వాసాల మూలకంగా మానవ సంబంధాలు, కుటుంబసంబంధాలు, చివరికి పేగు బంధాలు కూడా ఎంతటి  కఠిన పరీక్షకు నిలబడవలసి  వస్తుందో   అతి సహజంగా చిత్రించాడు రచయిత. కధ ఆసాంతం ఎక్కడా ఏ అతిశయోక్తులు.. అలంకారాల జోలికి  పోకుండా నిరలంకారప్రాయంగా రచయిత చెప్పుకొచ్చిన శైలీ శిల్పాల  కారణంగా కథ చదివినంతా సేపే కాదు , చదిలిన తరువాతా చెదిరిన మనసును కుదుటపడనీయదు . 
కాలం మినహా మరెవ్వరూ  పరిష్కారం చూపించలేని ఈ తరహా సమస్యలను ఎప్పటికప్పుడు సాహిత్యంలో చర్చించకపోతే.. సమాజం సంస్కారయుతంగా మారాలన్న ఆలోచనే ఆరంభమయే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. 
తనకు తెలిసిన తన ప్రపంచపు తమ ఒకానొక  తీవ్రమైన సమస్యను పది మంది ముందు ఏ మెహర్చానీ పెట్టుకోకుండా చక్కని కథ రూపంలో చర్చకు పెట్టి ప్రగతిపథకాముకుల మనసుల్లో అలోచనలను ప్రేరేపించినందుకు  మిత్రుడు వేంపల్లి షరీష్ బహుధా అభినందనీయుడు! సాహిత్య లోకం నుంచి కృతజ్ఞతలకు అర్హుడు. 👏👏❤️✌️😎
- కర్లపాలెం హనుమంతరావు.
5, డిసెంబర్ 2020 
బోథెల్; వాషింగ్టన్ రాష్ట్రం 
యు.ఎస్.ఎ 
వాట్సప్: +918142283676 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...