Thursday, January 28, 2021

సామెతల సౌందర్యం -కర్లపాలెం హనుమంతరావు- - బోథెల్; యూ.ఎస్.ఎ

 

                                                                    



గంగ ఈతకు.. గరిక మేతకు అని సామెత. సృష్టిలోని ఏ వస్తువు మనిషికి ఏ విధంగా ప్రత్యేకమో సూటిగా తేటగా చెప్పే ఇట్లాంటి వాక్యాలే సామెతలు అవుతాయి. ఏదో సందర్భంలో ఎవరో వాడినా, అన్ని కాలాలకు అందరికీ సమానంగా వర్తించే   ధర్మసూక్ష్మం కలిగివుండటం ఈ సామెతల రమ్యమర్మం.  సాధారణంగా సామాన్య జనం మధ్య  నలిగినప్పుడే సామెతలు నానుడులుగా స్థిరపడేది. సామాజిక ప్రవర్తన, మనిషి మనస్తత్వం, లోకాన్ని అతగాడు అవలోకించే విధానం, లోకం అతగాడి లోకాన్ని అంచనా కట్టే పద్ధతి.. అన్నీ ఒక చిన్ని వాక్యంలో ఎంతో లయబద్ధంగా వినగానే ఆలోచనలో పడవేసే తీరులో పొదగడం ఏ మహాపండితుడూ పనిగట్టుకుని కూర్చుని బుర్రచించుకుని మరీ చేసిన విద్యత్ విన్యాసం కాదు.ఏ  పొలంగట్టు మీది పోరగాడో తన పనిపాటుల్లో  భాగంగా అలవోకగా అప్పటికప్పుడు అనేసే మాటలవి. వాటి లోని విషయం సమాజానికి అంతటకీ అతికినట్లు సరిపోయే విశేషమే అయితే అదే సామెతయి క్రమంగా విస్తరిస్తుంది. 'తరి మెడకు ఉరి' అనే మాట పల్లెపట్టుల వైపు ప్రచులితంగా వినిపించే సామెత. ‘తరి అంటే గ్రామీణుల భాషలో మాగాణి పంట’.  సామెతలలో ఎక్కువగా వినిపించే మాండలిక పదాలు  అర్థమయితే ఆ నానుడిలోని లోతు ఇట్టే బుర్రకెక్కుతుంది. వెయ్యిమాటలైనా చెప్పలేని టీకా తాత్పర్యాలు సామెతలు  చిన్ని చిన్ని పదాలతో మనసుకు హత్తుకునేటట్లు చెప్పేస్తాయి.. ఒక్కోసారి మొట్టినట్లు.. ఒక్కోసారి బుజ్జగించినట్లు.. ఒక్కోసారి చీదరించినట్లు! నానుడుల్లో నవరసాలేం ఖర్మ! అంతకు మించి ఎప్పటికప్పుడు అవసరమయే నవ్య రసం అప్పటికి సృష్టించుకునే శక్తి దాగివుంటుంది.

'చేసింది పోదు .. చేయంది రాదు' అంటారు పెద్దలు. చెయ్యని పనులు చేసినట్లు చెప్పుకునే  డబ్బారాయుళ్ల నైజాన్ని ఉతికి ఆరేసే నానుడి ఇది. అన్ని రంగాలకు సమానంగా వర్తించే లక్షణం ఉండటం అందరి నోళ్లల్లో నానడానికి ప్రధాన కారణం. భాషలో విడిగా కాకుండా, జనవ్యవహారాలలో అసంకల్పితంగా పుట్టుకొచ్చే గుణం ఉండటం సామెత  సహజతకు ప్రధాన సౌందర్యం. జనం నోళ్లల్లో తరాల తరబడి నానే పదాల సమాహారం కాబట్టి సామెత నానుడి గా మారింది.

'రోగమంటే వచ్చింది కాని.. పాలు ఎక్కడి నుంచి వస్తాయ'న్నది ఓ నానుడి. ఎప్పుడు.. ఎవరు.. ఏ సందర్భంలో పుట్టించారో!  ఇప్పటి కరోనా మహమ్మారి వాతావరణానికి  అచ్చంగా అతికినట్లు సరిపోవడం ఆశ్చర్యంగా లేదూ! అదే సామెతలోని విలక్షణత.

'పాండవులవ సంపాదన దుర్యోధనుల పిండాకూళ్లకు సరిపోదు!' ని ఓ నానుడి. చూడ్డానికి ఇది వేలడంత వాక్యమే అయినా,  అర్థం వివరణకు దిగితే దానికదే   మహాభారతమవుతుంది. యుద్ధంలో విజయం సాధించి అధికారం పొందినా పాండవులకు సుఖం లేదన్న భావాన్ని ఎంతో చమత్కారంగా జన వ్యవహారాలకు సంబంధించిన పరిభాషలో చెపితే వినడానికి  రసరమ్యంగా ఎందుకు ఉండదు!  తామే చంపినప్పటికీ దాయాదులైన కారణంగా  ఆ సోదరులు  మరణించిన తిధి ఏటా విధాయకంగా నిర్వహించడం వంటి కర్మకాండలు ఎంతటి మహారాజుల హోదా లభించినప్పటికీ నిర్వహించక తప్పదు. పరిపాలకులు కదా! ప్రజలకు ఆదర్శంగా ఉండక తప్పని ఇరకాటం. కానీ, ఆ కర్మకాండలకు అయే ఖర్చు.. రాజ్యంలో వసూలు చేసే శిస్తులను మించి ఉంటోంద’న్న ఎత్తి పొడుపు ఈ సామెతలో సుస్పష్టం. తరహా సామెత మేము పని చెసి, రిటైరై వచ్చిన బ్యాంకులకు మా బాగా వర్తిస్తుంది. కుంగతీసే  మొండి బకాయిల మూలకంగా ఏర్పడే నష్టాలు పూడ్చుకునేందుకు మరో మేలైన మార్గం వెతుక్కోవలసింది పోయి ప్రభుత్వ బ్యాంకులు కొత్త శతాబ్దిలో  సిబ్బంది.. వారి జీత భత్యాల భారం తగ్గించుకునే నిమిత్తం హ్రస్వదృష్టితో బలవంతపు పదవీ విరమణల పథకం చేపట్టింది. పని చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ దాదాపుగా సగం మంది ఆరోగ్యవంతులైన  సిబ్బందితో అప్పటికి ఆకర్షణీయమైన చెల్లింపుల విధానం ఆశగా చూపించి   పదవీ విరమణలు దిగ్విజంగా చేయించాయి. అప్పుడు చేసుకున్న ఒప్పందాల  ప్రకారం  నెలనెలా మా పింఛనుదారులకు చెల్లించే పింఛనుకే ప్రస్తుత వ్యాపారాల నుండిస్తోన్న  లాభాలు చెల్లిపోతున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాయి. ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితులకు పై సామెత అతికినట్లు సరిపోవడమే కాదు.. ఆ సామెతలోని  తుగ్లక్ చర్యల పట్ల వెటకారం కూడా కొట్టొచ్చినట్లు  తరువాత చేసుకొనే నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తుంది.

హాస్యం, వెటకారం సామెతల ప్రాణనాడులు. సాహిత్యంలోని తతిమ్మా విభాగాల నుంచి విదీసి సామెతలను విశిష్ట పీఠం పై అధిష్టింపచేసేవి కూడా ఈ తెనాలి రామకృష్ణకవి శైలీ విన్యాసాలే! 'ఎమి తిని సెపితివి కపితము' అని ఆయన ఆనాడు అల్లసాని పెద్దన వంటి అఖండుడినే ఒక సందర్భంలో వెటకారం చేసిన సందర్బానికి నకలు ఈ తరహా ఎత్తిపొడుపు సామెతలు. సామెతలు సామాజిక ప్రయోజనం కూడా కలిగి ఉండటం ప్రత్యేకంగా గుర్తించవలసిన అంశం.

బిరుదరాజు రామరాజు నుంచి.. వెలగా వెంకటప్పయ్య వంటి ప్రాజ్ఞుల వరకు ఎందరో విద్వత్వరేణ్యులు ఈ సామెతల విభాగంలో ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి చెప్పుకోతగిన సమాచారం సేకరించారు. 'తినక చవి.. చొరక లోతు తెలియవు' అని సామెత.  లోతులలోకి వెళితే తప్ప నానుడుల సాగరంలోని మణి మాణిక్యాలు బయటపడవు మరి! ఇది కొండకు పట్టిన చేతి అద్దం మాత్రమే!

సామెతల పర్వత సమగ్ర సందర్శనానికి ఈ స్థలం అభావం. విందు భోజనానికని పిలవకపోయినా ఆహ్వానించి నోళ్లు తీపి చేయకుండా వీడ్కోలు చెప్పడం మన తెలుగు సత్సంప్రదాయాలకు విరుద్ధం. కాబట్టి మచ్చుక్కి ఓ డజను సరదా నానుడులు.. వీలైనంత వరకు సమకాలీన ధర్మానికి.. అదీ రాజకీయ రంగానికి  కట్టుబడినవే! చిత్తగింజండి!

 

1.పిలిచి పెద్దపులికి పేరంటం పెట్టినట్లు

[చరిత్ర చూడకుండా ఎన్నుకుంటే నేరస్తులే నెత్తికెక్కి మొత్తుతారన్న హెచ్చరిక సుస్పష్టం]

2.దోవన పోయేదొకడు.. దొబ్బులు తినేదింకొకడు!

 [.పి. పంచాయితీ ఎన్నికల జాతర్లో ఎంపాయీస్ యూనియన్లది ఇప్పుడదే గతి]

3.పక్కలోకని ఫకీరోణ్ణి పిలిస్తే, లేవదీసుకు పోయి మసీదులో కాపురం పెట్టాట్ట!

  [మంచి చేస్తారన్న ఆశతో ఓటేస్తే.. మెజారిటీ అలుసుతో దేశం మొత్తాన్ని మతం గంగలో ముంచేసే నేటి దుస్థితి]

4.పూజ కన్నా బుద్ధి, మాట కన్నా మనసు ప్రధానం

 [జనస్వామ్య మహిమలు జపం చేసే నేతలు తప్పక అనుసరించాల్సిన లౌకిక సూక్తి]

5. మాంసం తినేవాడు పోతే .. బొమికలు తినేవాడు వచ్చినట్లు                  [అవినీతి కాంగీ కూలినా.. మతనీతి భాజపా జనం నెత్తి మొత్తుతున్నట్లు]

6. మొండి చేతితో మూరలు వేసినట్లు

  [చేసేది సున్నా అయినా..  కోసేవి కోటలు దాటుతున్న నేటి నేతలు టప్పాలు]

7.సింహం కూడా చీమకు భయపడే రోజొకటి వస్తుంది.

 [అన్నదాతల ఆందోళన]

 8.మాసిన తలకు మల్లెపూల సింగారం

 [దిగనాసిల్లే దేశ ఆర్థిక స్థితి]

9. ఒయసు తప్పినా ఒయ్యారమే

   [చంద్రబాబు]

10.పిల్లి తోక ఎద్దు ముట్టితే, పిల్లి  ఎలుక దిక్కు ఎర్రగించి 

   [కేంద్రం  చిందులేసినప్పుడల్లా జగన్ చంద్రబాబు మీద నిందలేస్తున్నట్లు]

11.రాజులకు పిల్ల నిస్తే రాళ్లకిచ్చినట్లు

  [కేంద్రంలోని పార్టీకి వేసిన ఓట్లు గుళ్లలోని విగ్రహాలకు వేసినట్లు]

12.సన్నపని చెయ్యబోతే సున్నం సున్నం అయ్యిందట

  [ఏపి మూడు రాజధానుల నిర్ణయంలో.. ప్రభుత్వానికి ఎదురవుతున్న అనుభవాలు]

***

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్,  యూ.ఎస్

28 -01 -2021

 

 

 

Wednesday, January 27, 2021

చందన న్యాయం - పదప్రయోగం - పరమార్థం - కర్లపాలెం హనుమంతరావు

చందన న్యాయం - పదప్రయోగం - పరమార్థం - కర్లపాలెం హనుమంతరావు
న్యాయం అంటే న్యాయస్థానాలలో వినిపించే చట్ట సంబంధమైన వ్యవహారం ఒక్కటే కాదు. వ్యవహారానికి, భాషకు సంబధించిన అర్థాలలో కూడా ఈ ప్రయోగాలు కనిపిస్తాయి.
ఎక్కడైనా అన్యాయం జరిగితే 'ఇదేం న్యాయం?' అని నిలదీస్తాం కదా! అక్కడ ప్రశ్నకు గురయే న్యాయం సహజన్యాయం, సామాజిక న్యాయం, వైయక్తిక న్యాయం .. మొత్తానికి నిత్యకృత్య జనవ్యవహారానికి సంబంధించిన న్యాయం.
ఆ అర్థంలో కాకుండా ఇంకో అర్థంలో కూడా 'న్యాయం ' అనే పదం వ్యవహారంలో ఉంది. కాకపోతే అది సాధారణంగా నిత్యకృత్యాలలో కాకుండా ఏ సాహిత్యానికి సంబంధించిన అలంకారం కిందనో వాడుతూ పండితులు, కవులు, చమత్కారులు మెరుగులు పెట్టారు. ఆ తరహా సాహిత్య సంబంధమైన న్యాయం 'చందన న్యాయం'. ఆ సుందరమైన తెలుగు పదప్రయోగం గురించిన కొంత సమాచారం మిత్రులతో పంచుకుందామనే ఈ టపా!
తెలుగే అసలు పెద్దగా వాడకంలో లేని ఈ రోజుల్లో 'చందన న్యాయం' వంటివి చక్కని పదాలే అయినా మూలన పడిపోయి ఎక్కడా వాడుకలో లేనప్పుడు ఎందుకు ఈ చర్చ? అని కొద్దిమంది బుద్ధిమంతుల ఆలోచన కూడా అయివుండవచ్చు! కాని, ఇంచక్కని తెలుగు రాయాలనుకునే ఔత్సాహికులకు కొన్ని కొత్త పదప్రయోగాలు (నిజానికి ఇవి పాతవే.. వాడేవారు కరవై మనకు కొత్తగా అనిపిస్తున్నాయి గాని ఇప్పుడు) వాటి అర్థాలు, తత్సంబధిత ప్రయోగాలు, అన్వయాలు అవగాహనకు వస్తే శోభ ఉట్టిపడే తెలుగుకు మళ్లీ పురుడు పోసిన తల్లులవుతారు కవులు, రచయితలని నా క్షోభ.. ఇక చర్చ తగ్గించి చందన న్యాయం పద ప్రయోగానికి వద్దాం. దాని కన్నా ముందు 'చందనం' అనే మాటను గురించి కొద్దిగా!
చందనం ఈ మధ్య కాలంలో మనకు బాగానే పరిచయం అయిన పదం. ఎర్ర చందనం దొంగ వీరప్పన్ మహానుభావుడి చలవ వల్ల అప్పట్లో ఏ దినపత్రికలో చూసినా చందనం తాలూకు వార్తలు, చర్చలే కనిపించేవి. చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయీ కాగానే (2014) తిరుపతి శేషాద్రి అడవుల్లోకి జొరబడి వచ్చేసి అక్రమంగా ఎంతో విలువైన చందనం దుంగలను మొదలంటా కొట్టుకుపోయి అమ్ముకునే ముఠా తాలూకు దొంగలను ఒక్కపెట్టున ఎన్కౌంటర్ లో ఠా అనిపించి సంచలనం చేసిన కథ గుట్టుగా సాగిందేమీ కాదు.
తెలుగు రాష్ట్రాల తాలుకు ముఖ్యమైన వనరుల్లో అత్యంత విలువైన వాటిలో ఇనుము ఖనిజాన్ని ఒక వంక గాలి జనార్దన రెడ్డి భూగర్భం నుండీ పెళ్లగించి మరీ సొమ్ముచేసుకుపోతే, మరో వంక నుంచి అంతకు మించిన ఖరీదైన చందనం దుంగలను శేషాద్రి అడవుల్లో ప్రాంతాలలో దొరికే శ్రేష్టమైన చందనం శ్రేణి దొంగదారుల్లో దారుణంగా పక్క రాష్ట్రాల గుండా విదేశాలకు తరలిపోయింది. అప్పట్లో అది మన బోటి మధ్య తరగతి చదువుకున్నజీవులకు న్యూస్ పేపర్లలో, టీ.వీలల్లో టీ కాఫీలు చప్పరిస్తూ చదువుకొనే సినిమా కబుర్లకు మల్లే వినోదం మాత్రమే కలిగించింది. తెలుగువాళ్లకు జరుగుతున్న అన్యాయం తెలుగువాడికే పట్టింది కాదు ఎప్పట్లానే! ఆ విలువైన చందనం గురించి ఒక చిన్న 'న్యాయం' ప్రబంధ కావ్యాలలో కనిపిస్తుంది. దాని పేరే 'చందన న్యాయం'.
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి ప్రతీ ఆషాఢ పూర్ణిమలో వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి మంగళ వాయిద్యాల మధ్యన సుగంధ ద్రవ్యాలను మిళితం చేసిన మూడు మణుగుల చందనాన్ని అర్చకులు సమర్పించడం ఒక ఆనవాయితీ. ఉత్సవమూర్తి అయిన గోవిందరాజస్వామికీ విశేషంగా అభిషేకాలు జరిపించి చందనాన్ని కిరీటంగా అలంకరించడం ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. చందనానికి సంబంధించి దాదాపు అన్ని దేవుళ్లకూ ఒకే రీతిలో చర్చలు, నైవేద్యాలు. ఇప్పుడు మన అంశం అది కాదు.
చందనం అనగానే 'జయదేవుని గీత గోవిందం తాలూకు అష్టపదుల్లోని 'చందన చర్చిత నీల కళేబర! పీత వసన! వనమాలీ' అనే అష్టపదుల్లోని పదం కూడా మనసులో మెదిలి తపించే మనసు ఎందు చేతనో కొంత సేదతీరుతుమ్ది. సేదతీర్చే ఔషధ గుణం బౌతికంగా కూడా చందనం ప్రత్యేక లక్షణం. మాటలోనే కాదు.. పూతలో కూడా మనసునూ, శరీరాన్ని చల్లబరిచే అరుదైన పదార్థాలలో చందనం ప్రధానమైనది!
ఇప్పుడంటే రకరకాల ఆయింట్ మెంటులు, స్నోలు, కాస్మొటిక్స్ వాడకంలోకి వచ్చాయి కాని, ఇవేవీ సామాన్య జనానికి అందుబాటులో లేని కాలంలో కాలిన గాయాలకు ముందు చందనం అరగదీసి మందులా అద్దే వారు. అందుకోసం గాను ప్రతి ఇంట్లో చందనం చక్కలు ఉండేవి. వాటి మీద కొద్దిగా నీరు పోసి బొటనవేలుతోనో , మరో చిన్న చందనం పేడుతోనో గట్టిగా పదే పదే రుద్దితే ఆ నీటిలో చందనం కలిసేది, ఆ లేపనాన్ని గాయానికి పట్టించడం ఇప్పటి మన ఫస్ట్ ఎయిడ్ చికత్సలాంటిది. చందనం పీటలు గ్రామ సంతల్లో బాగా అమ్ముడు పోయే గృహ చికిత్స పరికరాలలో ఒకటి.
చందనానికి పవిత్ర గుణం కూడా ఆపాదించడం చేత దేవుడి విగ్రహాలకు చందనం పూతలు ఒక ధార్మిక కార్యక్రమం దేశమంతటా సాగుతుంటాయి. చందన చర్చితం అంటే చందనాన్ని మెత్తని పేస్టులా వంటికి మొత్తం పట్టించడం. వాస్తవానికి మనుషులూ వంటి నిండా చందనం పట్టించుకుని కొన్ని గంటల పాటు ఆరనిస్తే వంట్లో ఉన్న వేడిమి మొత్తం దిగలాగేస్తుంది. కానీ అత్యంత ఖరీదైన చందనం మామూలు మనిషి వంటి నిండుగా ఎట్లా పట్టించుకోగలదు?
గతంలో మహారాజులకు ఆ విధమైన చికిత్సలు జరుగుతుండేవి. ఇక కావ్యాలు రాసే కవులకయితే కదిలితే మెదిలితే విరహ తాపంతో అల్లాడే నాయికల వంటికి సఖుల చేత చందనం పట్టించడమే ముందు గుర్తుకు వచ్చే గొప్ప శృంగార చర్య. ప్రబంధాల నిండా చందనం వంటి సుగంధ భరిత శృంగార పద్యాలే. వాటి ప్రస్తావన మరో సందర్భంలో చేసుకుందాం.
వంటి నిండా పట్టించక పోయినా శరీరంలో ఏ కొద్ది భాగానికి చందనం అలదితే దాని ప్రభావం శరీరం మొత్తానికి పాకి అవయవాలకు తొందరగా స్వాస్థ్యత చేకూరుతుందని ఆయుర్వేదం చెపుతుంది. ఆ విధంగానే బొటన వేలంతైనా ఉందో లేదో, అసలు ఎక్కడుందో కూడా ఉనికి తెలీని మనసు (ఆధ్యాత్మిక వాదుల పరిభాషలో ఇది అంతరాత్మ) ఆరడుగుల శరీరం మొత్తాన్ని ప్రభావితం చేయడం ప్రకృతి విచిత్రం కదూ! ఒక కాలు విరిస్తే పట్టుదల గల మొనగాడు మరో కాలు మీద నడవగలడు. ఒక చెయ్యి విరిగినా రెండో చేతితో పనులు అద్భుతంగా చేసేవారు కద్దు. అసలు చేతులే లేకపోయినా కాళ్లతో చేతులకు మించి చక్కగా పనులు చక్కబెట్టే పట్టువదలని విక్రమార్కులు మనకు అరుదుగానే అయినా కనిపిస్తారు.
శిక్షల కింద కారాగారాలలో పడవేసినా బైటికి వచ్చిన తరువాత సలక్షణంగా తమ ధ్యేయం వైపుకు సాగిపోయిన యోదులకు చరిత్రలో కొదవలేదు కదా!. మనిషిని అచేతనుడిని చేసేందుకు, చైతన్యవంతుడిగా మార్చేందుకైనా మనసు మీద ప్రయోగాలు చేసే వైద్యవిధానాలూ ఉండనే ఉండె! వ్యక్తిగత సుముఖత, విముఖతలు రెండింటికీ మనసు మీద జరిగే ప్రయోగాలు రాటుదేలిన రాజకీయాలలో 'మైండ్ గేమ్' పేరుతో విశ్వవ్యాప్తంగా పరమ ప్రసిద్ధం. ఎక్కడుందో తెలియని ఓటర్ల మైండ్ తో నేతలు గేమ్స్ ఆడటానికి కారణం ఇదిగో ఈ మైండ్ కు ఉండే ఈ ప్రత్యేక శక్తే! శత్రువర్గంలోని బంధుమిత్రులను వధించవలసిన సందర్భం ఎదుట పడేసరికి అంత మహాయోధుడు అయివుండీ పాండవ మధ్యముడు డీలా పడిపోయాడు. ఆ గాండీవుణ్ని మళ్లీ గాడిలో పెట్టడానికి పరమాత్ముడు శ్రీకృష్ణుడి బాడీ ద్వారా కేంద్రీకృతం చేసింది అర్జునుడి మనసు మీదనే అని ఆధ్యాత్మికవాదుల ప్రగాఢ విశ్వాసం. పాండవుల మీద పగ తీర్చుకునేందుకై ఎంతో పట్టుదలగా ఎన్నో విద్యలు నేర్చుకున్న కర్ణుణ్ణి సరిగ్గా యుద్ధక్షేత్రంలో నడిమధ్యలో నిర్వీర్యుదుగా మార్చిందీ అతగాడి రథంలాగే గుర్రాల పగ్గం పట్టుకుని ముందు కూర్చున్న శల్యుడి పుల్లవిరుపుడు మాటలే! రాజకీయాలలో రాటుతేలిన నేతల ధ్యాస కూడా ఎప్పుడూ పాడుచేయవలసిన ఎదుటి వాడి మనసు మీదనే!ఉంటుంది. ఆ వ్యతిరేకార్ధంలో కాకుండా సానుకూల భావంతో చూసుకుంటే చుక్కంత చందనం నుదుటికి దిద్ది శరీరం మొత్తన్ని ప్రభావితం చేసే విధానానికి నకలే ఈ మైండ్ గేమ్ ఎత్తుగడలన్నీఅనిపిస్తాయి కాదా ! గీతలో చెప్పినట్లుగా అంగుష్ఠ ప్రమాణంలో ఉండే ఆత్మ (లౌకికుల భాషలో మనసు)ను ప్రభావితం చేయడం ద్వారా మనిషి మొత్తాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునే పద్ధతినే కావ్యపరిభాషలో 'చందన న్యాయం' గా చెప్పుకొచ్చారు అలంకారికులు.
సూక్ష్మ పరిణామంలో ఉండే వస్తువు మీద ప్రయోగాలు చేయడం ద్వారా స్థూల పరిణామంలో ఉండే వస్తువు మొత్తాన్ని ప్రభావితం చేసే విధానానికి 'చందన న్యాయం' అన్న పదం అందుకే వంద శాతం సరయిన అన్వయం.
-కర్లపాలెం హనుమంతరావు
27 -02 -2021
బోథెల్, యూఎస్

Monday, January 25, 2021

జల తరంగిణి -కర్లపాలెం హనుమతరావు - ఈనాడు దినపత్రిక సంపాదకీయం

 




పంచ భూతాత్మకమే కాదు.. సహ శక్తులతో భిన్నమైన అనుబంధం కలది జలం. వాయువులో నిక్షిప్తం. అగ్నితో శత్రుత్వం. భూమికి బలిమి. ఆకాశంతో చెలిమి. భూమ్యాకాశల మద్య   రాయబారి.    'సృషికర్త పుటక, సృష్టిభర్త పడక,  సృష్టిహర్త సిగ- జలమే'అని ఒక కవి చమత్కార సమన్వయం. అమృతానికైనా.. హాలాహలానికైనా..  జలనిధే జన్మస్థలి. నిప్పు మనిషి కనిపెట్టింది. నీరు మనిషిని 'కని'పెట్టింది. ఒక్క మనిషనేమిటి.. భోగరాజువారు 'కంకణం'లో సెలవిచ్చినట్లు 'సమస్త జీవరాసులకూ నీరే  జీవనాధారం'. 'స్వాదునీరము త్రావి పద్మము కనువిచ్చె/ మోదవీచికలలో మునిగెను ద్విరేఫమ్ము/ ప్రిదిలి బీటలువారు పుడమి చేడియు మేను/ పదనుతో పులకెత్తు' అని 'వర్షారమణి'లో డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు కొనియాడిందీ జీవాధారమైన సలిల ధారల గురించే.  అన్నం  లేకపోయినా కొంతకాలం బతకవచ్చు. పానీయం లేకుంటే  ప్రాణాలు నిలబడేది కొన్నిక్షణాలే.  ఉమ్మనీరు మొదలు తులసి తీర్థం వరకు మనిషికి నీటికీ మధ్య గల బంధం అంత బలమైనది. సూది మందుకి.. సూతక స్నానానికి, తల మీదకి.. గొంతులోపలకి.. నీరే కావాలి.  దేవాలయం నుంచి శౌచికాలయం దాకా నీరు తప్పనిసరి. దాహానికి, జీర్ణానికి, రుచికి, సుచికి, అందానికి, ఆరోగ్యానికి, పంటకు, వంటకు, ఇంటికి, వంటికి..నీరు అవసరం లేనిది ఎక్కడ..ఎవరికి?  పితృదేవతల పుణ్యావహనం కోసం భగీరథుడు 'శివజటాజూటాగ్ర  గళిత  హిమమణి మిళిత శీకర కిరీటి గంగ'ను భువికి  దించాడు. కురు పితామహుల కోరిక మేరకు పాండవ మధ్యముడు 'పొగలుమిసి సెగలెగసి అడుగులలబడి మడుగు  పాతాళగంగ'ను  పైకి సాధించాడు. భాగవతంలోని రంతిదేవుని ఉదంతమో?  సర్వసంపదలు దానధర్మాలు చేయడం ఒక ఎత్తు. దారా సుతులతోసహా ఎనిమిది దినాలు పస్తులుండీ  దైవవశాత్తు దొరికిన మధురాంబులను క్షుధార్తుడికి ధారాదత్తం చేయడం మరో ఎత్తు.

జీవ ప్రాదుర్భవానికి నీటి లభ్యతే మూలం.  సేకరణ, రవాణా, విసర్జన.. జీవ రసాయన ప్రక్రియలన్నిటికి నీరే మాధ్యమం. అవయవాల సక్రమ కర్మ నిర్వహణకి  క్రమం తప్పని నీటి నిలవలు తప్పని సరి. ఆరు నుంచి ఎనిమిది  లోటాల కొలతకి  మాత్రం వెలితి పడ్డా శాల్తీ అడ్డం పడటం ఖాయమని ఆరోగ్యశాస్త్ర సూత్రం. జీవవ్యవస్థలో నీటిది విశ్వవ్యాప్త ద్రావణి పాత్ర . రసాయనాలేవైనా సరే కరిగే గుణం నీటి లక్షణం. మూడింట రెండు వంతులు మంచి నీరుంటేనే శరీరానికి వాయుపీడనం నుంచి రక్షణ. 'లోటాకి రెండువేల మేలిమి రకాల ఖనిజాలుంటేనే మంచినీరు కింద లెక్క' అంటున్నారు మానవాళి భవిష్యత్తు మీద పరిశోధనలు  సాగించే ప్రజావైజ్ఞానికులు  స్టాంఫోర్డు విశ్వవిద్యాలయ ఆచార్యులు  జాన్ మెక్కార్థీ. స్వచ్ఛమైన నీటి అవసరాలను  గురించి చాలా వివరాలే సేకరించారాయన. బాలింత దశలో  స్త్రీకి కనీసం ఏడున్నర లీటర్ల నీరు అవసరం. రోజుకు మనిషికి రెండు లీటర్లకు  మించి మంచి నీరు దొరకని పరిస్థితి ప్రస్తుతం ప్రపంచానిది. ఐరాస లెక్కల ప్రకారం రెండువందల యాభై కోట్లమంది నిర్భాగ్యులు పారిశుద్ద్యవసరాలకైనా నీరు నోచుకోవటం లేదు! శిశుమరణాలకు అతి పెద్ద రెండో గండం మురికి నీరే. నీటిరోగాల వల్ల రోజుకు నాలుగున్నర కోట్ల బడి దినాలు నష్టపోతున్నామని అంతర్జాతీయ విద్యా వేదికల  ఆవేదన. ఎదిగిన  బాలికలు చదువులకు దూరమవడానికి, చదువులకు వెళ్ళే పిల్లలు వింత రోగాల పాలవడానికి  పాఠశాలల అపరిశుభ్రతే  ప్రధాన కారణమని  ప్రతి ఏటా  సర్వేలూ మొత్తుకుంటున్నాయి. భూగోళం  వేడెక్కుతున్న కారణంగా హిమనదాలు కరిగిపోతున్నాయి. జీవనదులు తరిగిపోతున్నాయి. నేలమీది నీరు ఆవిరైపోయి తాగునీరు అందనంత ఎత్తుకి ఎగిరిపోతున్నది. 'ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది' అని ఒక తెలుగు చిత్రం పాట. నీటికున్న ఉలికిపాటైనా మనిషికి లేకపోవడమే వింత! నగరాల్లో  బోర్ల ముందు  బిందెల బారులు.  బస్తీళ్లో నీళ్ళబళ్ళ వెనక  పరుగులు. పల్లెపట్టుల్లో ఒక్క నీటిబొట్టు కోసం కోసులు కొద్దీ ప్రయాణాలు. విశ్వవ్యాప్తంగా ఇవే వీధి భాగవతాలు.

తాగుకి, సాగుకి, పాడికి, పరిశ్రమకి..  నీరే మొదటి అవసరం. సీసాలో నింపి వ్యాపారం చేసేందుకూ నీరే ముడి సరుకయింది ప్రస్తుతం! దేశాలు , రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య వివాదాలకీ నీరే కారణం. భూతలం మీద నాల్గింట మూడు వంతులు నీరే.  ఘన, ద్రవ, వాయు స్థితుల్లో విస్తారంగా దొరుకుతున్నదీ నీరే. ఐనా నీటి జాడల కోసం వేరే గ్రహాల వెంట పడాల్సిన దుస్థితి దాపురించిందెందుకు? భావి అవసరాలకి సరితూగే నీటి నిల్వలు భూమ్మీదే  భద్రపరుచుకునే తెలివి ఉండవద్దా?కరవు ప్రకృతి పరంగా ముంచుకొస్తే  ముందస్తు అదుపు  చర్యలు తప్పవు సరే.. మరి మానవ తప్పిదాల మాటేవిటి?రోజు గడిచే లోపు ఇరవై లక్షల టన్నుల చెత్త మంచినీటిని కలుషితం  చేస్తున్నది.యుద్దాలు, రహదారి ప్రమాదాలు,  ఉగ్రవాదుల దాడులు, ప్రాణాంతక వ్యాథులన్నీ కలుపుకొన్నా కలుషిత జలాలవల్ల జరిగే చెరుపుకు సరి తూగటం లేదు. ఎరువులు, పురుగుమందులు ఎడాపెడా వాడకం, బొగ్గు విద్యుత్తుకూ మంచినీరు దుర్వినియోగం.. ఎంత వరకు సమర్థనీయం? నీరు పసిడికి మించి మిడిసి పడుతున్నప్పుడు తరచు మాంసాహార విందులతో మజాలెందుకు?వరి సాగును తగ్గించి  రాగులు, జొన్నలు పండిస్తే సాగునీరు మిగులుతుందని వ్యవసాయశాఖల సూచనలు..చెవిన పెట్టేదెవరు? ఇజ్రాయెల్ దేశ పద్దతిలో బిందుసేద్యమూ   మంచి మందే. పొదుపులన్నిటిని  మింగేసే జనాభాను అదుపు చేసుకోవాలి ముందు. నీటి సరఫరా మెరుగుపడితే ఒనగూడే లాభాలో! 'అపారం' అంటున్నాయి గణాంకాలు. ఆరోగ్యవంతుడి ఉత్పాదకశక్తి స్థాయి  అత్యుత్తమంగా ఉంటుందంటుంది వైద్యశాస్త్రం. బీమా మీద ఆదా అయే నిధులు  నిర్మాణాత్మక విధులకు మళ్ళించుకోవచ్చు.  నీటిని మనిషి  ప్రాథమిక హక్కుగా పరిగణించమనడానికి ఐరాసకి ఇంకా ఇన్ని కారణాలు. తాగునీటి వృథాకి ముంబైలో జైలు శిక్షో.. జరిమానానో ఎదుర్కొనాల్సి ఉంది!   నీటి దుర్వినియోగాన్ని   నేరంగా పరిగణించే దారుణ పరిణామాలు ప్రపంచమంతటా   దాపురించరాదనే ఐ.రా.సా  ముందస్తు జాగ్రత్త. నడుస్తున్న దశాబ్దాన్ని(2005-2015) 'జీవనం కోసం జలం' దశాబ్దంగా, ఏటి అంతర్జాతీయ  జీవవైవిధ్య దినం(మే 22) అంశాన్ని 'నీటి కోసం సహకారం'గా ఐక్యరాజ్య సమితి చేసిన ప్రకటన వెనకున్న పరమార్థం ఇదే.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయం కోసం రాసినది)

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...