Wednesday, November 10, 2021

నానార్ధశివ శతకము - మాదిరాజు రామకోటీశ్వర శాస్త్రి

 

నానార్ధశివ శతకము - మాదిరాజు రామకోటీశ్వర శాస్త్రి


 



 

 

వివరణ: ఈ శతకము విద్యార్థులకు తెలుగు పదాలకు కల నానార్థాలను వివరించే విధంగా సులభమైన భాషలో రచించబడింది. ఎంతో ఉపయుక్తమైన శతకము.

శ్రీ గిరిజాప్రియనాధా

రాగక్రోధాది దోషరహితచరిత్రా

యోగీశ వినుత చరణా!

భోగివలయ రొంపిచర్ల పురవరనిలయా!

 

వ. అవధరింపుము

 

తే.గీ. తెనుగుగీర్వాణపదములు దెలియునటుల

నరసిసమకూర్చిచెప్పితి నార్యులలర

సిరులొసంగెడి నానార్ధ శివశతకము

దీని భవదంకితమొనర్తు దేవదేవా!

 

1. కం. శ్రీయనలక్ష్మియు, గీర్తియు

శ్రీయన వృద్ధియును, బుద్ధి సిరి, శారదయున్

శ్రీయన విష ముపకరణము

శ్రీయన నొకరాగమండ్రు శ్రీపతివంద్యా!

 

2. కం. అంకమన గుఱుతు, జోతును

అంకముయొడి, తప్పు, యుద్ధ మాక్షేపంబున్

అంకమన జెంతకర్ధము

అంకముయంకెయును, దొడవు నహిరాట్భూషా!

 

3. కం. అంగదయన నుత్సాహము

అంగ దుపద్రవము, గినుక నాకలియునగున్

అంగదయన దుఃఖంబగు

అంగదయన గష్టమగును నంబరకేశా!

 

4. కం. ఆత్మయన బుద్ధి, యత్నము

ఆత్మ శరీరంబు, జీవు డతులితధైర్యం

బాత్మ యనంగను బ్రహ్మము

ఆత్మయనం మనసు, బన్నగాధిపహారా!

 

5. ఇమ్మనుకూలము, యుక్తము

ఇమ్ము యుపాయంబు, విరివి యింపును, జోటున్

ఇమ్మమ నోజ్ఞము, సుఖమును

ఇమ్మనగా స్పష్టమగు, మహీధరచాపా!

 

6. కం. ఇరయన జలమును, గల్లును

ఇరయన మేరయును, మాట పృథివియు మఱియున్

ఇరువుయన బ్రక్కయిల్లగు

ఇరువనస్థానంబు, బ్రక్క యిభదైత్యహరా!

 

7. కం. ఉత్థానమనగ లేచుట

ఉత్థానము సంతసంబు యుద్ధము, సేనౌ

ఉత్థానమనగ ముంగిలి

ఉత్థానంబన సమాప్తి యురగాభరణా

 

8. కం. ఊర్మియన నొప్పి, వెల్లువ

ఊర్మి వెలుగు వ్యసనమగును నుమ్మియు, నలయున్

ఊర్మి షడూర్ములకర్ధము

ఊర్మి పరంపరయునగును యోగీంద్రనుతా!

 

9. కం. ఎగ్గన దోషముకర్ధము

ఎగ్గన నపకారమగును నెగ్గన గీడున్

ఎగ్గు ననారదమునునగు

ఎగ్గుయనం దూషణంబు నిందువతంసా!

 

10. కం. ఒఱపన సౌందర్యంబగు

ఒఱపుయుపాయంబు, దృఢము యోగ్యతయునగున్

ఒఱపు ప్రతాపంబు, తాపము

ఒఱపనగా స్థైర్యమగును నుగ్రాక్షశివా!

 

11. కం. ఓజయనవిధము, నాజ్ఞయు

ఓజ యుపాధ్యాయుడగును నుత్సాహమగున్

ఓజ క్రమమును, భయమును

ఓజయనంగ స్వభావ ముగ్రకపర్ధీ!

 

12. కం. కంకుడన గపటబాపడు

కంకుడు కఠినాత్ముడైన కాలుండునగున్

కంకుడన ధర్మరాజగు

కంకుడనం బోయవాడు కాయజదమనా!

 

13. కం. కందువ యన నేకాంతము

కందువ సంకేతభూమి జాడయు, ఋతువున్

కందువ సామర్ధ్యంబును

కందువయన దెగయు, జోటు కంఠేకాలా!

 

14. కం. కటమన నృనుగు చెక్కిలి

కటమన నతిశయము, చాప కటమనబీన్గున్

కటము ప్రతిజ్ఞయు, మొలయగు

కటమనగా నొలికిమిట్ట కంకాళధరా!

 

15. కం. కరణమన వ్రాతకాడగు

కరణము కొరముట్టు, మేను కారణమునగున్

కరణంబన రతిబంధము

కరణంబన బూత, పనియు గౌరీరమణా!

 

16. కం. కరమన నత్యంతంబగు

కరమన వడగల్లు నగును గరమన జేయిన్

కరమన గిరణము, గప్పము

కరమనగా దొండమగును గామారాతీ!

 

17. కం. కఱియన నలుపుకునర్ధము

కఱియన పశుయోనియగును కరియననేన్గున్

కరియన సాక్షి, కోతియు

కరిమేర, నిదర్శనంబు గామాథ్వంసీ!

 

18. కం. కర్కమన నెండ్రకాయయు

కర్కము సుందరము, గుండ కర్కమునిప్పున్

కర్కము తెల్లనిగుఱ్ఱము

కర్కంబన నద్దమగును గందర్పహరా!

 

19. కం. కాలికయన బార్వతియును

కాలిక ద్రౌపదియు, నాడుకాకియు, గల్లున్

కాలికయన నెలవడ్డియు

కాలిక నూగారు, తమము గఱకంఠశివా!

 

20. ఖంబన స్వర్గమభావము

ఖంబన నింద్రియము, దెలివి ఘనపట్టణమున్

ఖంబన నాకాశంబును

ఖంబన వరిమడియు, సుఖము ఖంజనిభగళా!

 

21. కం. గురువన దండ్రి, బృహస్పతి

గురువుయుపాధ్యాయుడన్న కులపెద్దయగున్

గురువన తాతయు, మామయు

గురువనగా రాజునగును గుధరజనాధా!

 

22. కం. గోవన నావును, బాణము

గోవనవజ్రాయుధంబు క్షోణియు, నెద్దున్

గోవనగ శశియు, స్వర్గము

గోవనగిరణంబు, దిక్కు గుసుమశరారీ

 

23. కం. గోపతియన నాబోతగు

గోపతియన సూర్యుడౌను క్షోణీధవుడౌ

గోపతియన దేవేంద్రుడు

గోపతియన శంకరుండు గోవాహశివా!

 

24. కం. ఘనమన బెరుగును, సమ్మెట

ఘనమనగాదిటవు, విరివి ఘనమనమబ్బున్

ఘనమన తాళపు వాద్యము

కనకాచలచాప! చంద్రఖండకలాపా!

 

25. కం. ఘనరసము జలముకర్ధము

ఘనరసమన మజ్జిగగును గర్పూరంబున్

ఘనరసము చెట్టుబంకగు

ఘనరసమన గుళిగయగును గౌరీలోలా!

 

26. కం. చక్రము కుమ్మరి సారెయు

చక్రము విష్ణాయుధంబు సైన్యము, గుంపున్

చక్రము రాష్ట్రము, జక్కవ

చక్రంబన బండికల్లు చంద్రాపీడా!

 

27. కం. చక్రియన విష్ణుకర్ధము

చక్రియనం రాజునగును జక్కవకలరున్

చక్రియనంగను గుమ్మరి

చక్రియనం సర్పమగును జంద్రార్ధధర

 

28. కం. చరణమన తినుటకర్ధము

చరణము నడవడిక, కులము చరణము వేరున్

చరణమనంగను తిరుగుట

చరణముపాదమును, తరుణ చంద్రాభరణా!

 

29. కం. చాయయన నీడ, కాంతియు

చాయయనంరంగు, సూర్యసతియున్ వరుసన్

చాయయన లవము, శోభయు

చాయయనంలంచమగును జండీనాథా!

 

30. కం. కల్లియన గొప్పువలయగు

జల్లియనం చామరంబు సవరము, గుచ్చున్

జల్లియనంగను జాలరు

జల్లియ సత్యంబునగును జగదాధారా!

 

31. కం. డంబన, గపటము, గాంతియు,

డంబన గర్వంబు, విధము డంబంబునగున్

డంబుప్రతిష్ఠకు నర్ధము

డంబనగానధికమగు షడాననజనకా!

 

32. కం. తంత్రమన శబ్దశాస్త్రము

తణ్త్రము మగ్గమును, నౌషధంబును, సేనౌ

తంత్రము హేతు వుపాయము

తంత్రము నిజరాష్ట్రచింత తరుణేందుధరా!

 

33. కం. తఱియన సమయము కర్ధము

తఱియన జేరువయు నగును తరియనమబ్బున్

తరియోడ, పొగయు, మథనము

తరియన మాగాని యగును దర్పకవైరీ!

 

34. కం. తలయన శిరమును నెత్తును

తలయన వెండ్రుకలు, గొనయు తలమొత్తంబున్

తల యెడ, సమయము, బూనిక

తలయన బక్షమును జోటి ధరరాట్చాపా!

 

35. కం. తీర్ధమన బుణ్యనదియగు

తీర్ధము యజ్ఞంబు, గురువు దీర్ధము రేవున్

తీర్ధము శాస్త్ర ముపాయము,

తీర్ధము పాత్రంబు, మంత్రి త్రిదశారినుతా!

 

36. కం. తెగయన నిశ్శేషంబగు

తెగ విధము, సమూహమగును తెగ నిడుపునగున్

తెగ యల్లెత్రాడు, పక్షము

తెగయన మోపెట్టుటగును ద్రిపురపురారీ!

 

37. కం. తోయంబన బరివారము

తోయం బొకతడవ, విధము దోయము తెగయున్

తోయము జలమున కర్ధము

తోయంబన సమయమగును ధూర్జటిసాంబా!

 

38. కం. దండమన నమస్కారము

దండము నృపశిక్ష, హయము దండును జతయున్

దండము బారయు, కవ్వము

దండము కప్పంబు, గుంపు దర్పకమదనా!

 

39. కం. దండమన దుడ్డుకఱ్ఱగు

దండమ నంచెట్టుబోదె దండము వధమున్

దండము కాడయు, గర్వము

దండమనం బీడనంబు దాక్షిణ్యనిధీ!

 

40. కం. దండియ కిన్నెర కర్ధము

దండియ వీణెయునునగును దంబుఱయునగున్

దండియ పల్లకిబొంగగు

దండియ యన ద్రాసుకోల దండధరారీ

 

41. కం. దర్శనమన నద్దంబగు

దర్శన మన బుద్ధి, తెలివి ధర్మము, కలయున్

దర్శనము చూపు, నేత్రము

దర్శనమన శాస్త్రమగు సుధాకరమకుటా!

 

42. కం. ద్రవ్యము మంచిపదార్ధము

ద్రవ్యము నిత్తడియు, భూతధనమున్, మందున్

ద్రవ్యమన లక్కకర్ధము

ద్రవ్యంబన భవ్యమగును దైత్యారిసఖా!

 

43. కం. ద్విజుడనగ భూసురుండగు

ద్విజు డనగా వైశ్యుడగును ద్విజుడనరాజున్

ద్విజరాజు యనగ గరుడుడు

ద్విజరాజన శశియు, ఫణియు ద్విజరాట్భూషా!

 

44. కం. ధర్మమన నుపనిషత్తును

ధర్మము యజ్ఞం బహింస దానంబునగున్

ధర్మము క్రమ మాచారము

ధర్మము వేదోక్త విధియు ధనదసుమిత్రా!

 

45. కం. ధామమన వెలుగు కర్ధము

ధామము చోటును, గృహంబు ధామము కాంతిన్

ధామము మేను, ప్రభావము

ధామంబన పుట్టువగును ధవళాంగ శివా!

 

46. కం. ధేనుకయన నాడేనుగు

ధేనుక పార్వతియు, గత్తి ధేనువుయు నగున్

ధేనుకయన నాడ్గుఱ్ఱము

ధేనుక మన చీరపోతు ద్విప చర్మధరా!

 

47. కం. నభమన వర్షాకాలము

నభమనగా తమ్మపడిగ నాసిక మిన్నున్

నభమన దామర తూడగు

నభమనగా మేఘమగును నగరాట్చాపా!

 

48. కం. నయమన లాభము చౌకయు

నయమన సౌందర్యమగును నయమన నీతిన్

నయము మృదుత్వము నునుపును

నయమన జూదంబు మేలు నాగాభరణా

 

49. కం. నాగమన సత్తు తగరము

నాగంబన బాము, గొండ నాగము గ్రహమున్

నాగంబొక నుపవాయువు

నాగముకరి, మబ్బునగును నగభేదిసుతా!

 

50. కం. నారాయణ యన విష్ణువు

నారాయణ రవియు, శశియు నగజాధిపుడున్

నారాయణ యన బ్రహ్మయు

నారాయణ యనగ నగ్ని నగజాధీశా!

 

51. కం. నిష్కమన మాడ, తంకము

నిష్కము పతకమును, ఫలము నిష్కము వెండిన్

నిష్కమనంగ సువర్ణము

నిష్కుటమన తలుపు, తోట నీలగ్రీవా!

 

52. కం. పటలమన నింతికప్పగు

పటలము తిలకంబు, గ్రంధ భాగంబు నగున్

పటలమన గుంపు కర్ధము

పటలము పరివార మగును భావజవైరీ!

 

53. కం. పట్టుయన బ్రయత్నించుట

పట్టన నక్కఱయు, బూత బంధుత్వంబున్

పట్టన విషయము, హేతువు

పట్టనగా బట్టుదలయు బన్నగభూషా!

 

54. కం. పట్టు నివాసస్థానము

పట్టవకాశంబు, నూత పంతంబు నగున్

పట్టన ధైర్యము, వెడలుపు

పట్టనగా ఘట్టమగును బాపవిదూరా!

 

55. కం. పణమన వ్యవహారంబగు

పణమన జూదంబు, ధనము పందెంబు నగున్

పణమన వెలయును, గూలియు

పణమనగ గవ్వయెత్తు ఫణిరాట్భూషా!

 

56. కం. ప్రణయము ప్రేమము కర్ధము

ప్రణయంబన వినయమగును బరిచయమునగున్

ప్రణయము విశ్వాసంబగు

ప్రణయంబన బ్రార్ధనంబు రజితగిరీశా!

 

57. కం. ప్రత్యయ మన విశ్వాసము

ప్రత్యయ మవకాశ మగును బ్రఖ్యాతియగున్

ప్రత్యయ మన నాచారము

ప్రత్యయ మన శపథమగును రాజాభరణా!

 

58. కం. పత్రమన నాకు కర్ధము

పత్రము చురకత్తి యగును వాహనమునగున్

పత్రము దస్తావేజగు

పత్రంబన ఱెక్క, శరము బార్వతినాధా!

 

59. కం. పత్రియన కగొండర్ధము

పత్రియనం రధికుడగును బాణంబునగున్

పత్రియన బక్షి, డేగయు

పత్రియనం మ్రానునగును బ్రమధగణేశా!

 

60. కం. పదమన శబ్దము వాక్యము

పదము ప్రయత్నంబు, బద్యపాదంబునగున్

పదమన చిహ్నము, నిరువును

పదమన గిరణంబు మఱియు పాదంబభవా!

 

61. కం. పదనుయన తడికి నర్ధము

పదననగా సమయమౌను పరిపాకంబౌ

పదనన వాడికి నొప్పును

పదడుయనం భస్మగును బర్వతధన్వీ!

 

62. కం. ప్రభయన ధనదుని పురమగు

ప్రభయన భాస్కరుని భార్య, పార్వతియునగున్

ప్రభయన వెలుగుకు నర్ధము

ప్రభయనగా దశయు నగును రాకేందుధరా!

 

63. కం. పరికర మన నుపకరణము

పరికరము సమూహమగును బరివారంబున్

పరికర మన మంచంబగు

పరికరము వివేకమగును బంచశరారీ!

 

64. కం. పరుఘ మన గడియమ్రానగు

పరిఘంబన కోటగవను, బాణంబునగున్

పరిఘము కుండయు, దెబ్బయు

పరిఘంబన నినుపగుదియ ప్రమధాధిపతీ!

 

65. కం. పరియనగను సైన్యంబగు

పరియన పంజ్తయును, గుంపు బర్యాయంబున్

పరివేష్టనముకు నర్ధము

కరిచర్మంబర త్రినేత్ర గౌరీమిత్రా!

 

66. పక్షమన ఱెక్క, బ్రక్కయు

పక్షము వారద్వయంబు బ్రభునేనుగయున్

పక్షమన శత్రు మిత్రులు

పక్షంబన బలమునగును భవణయహరణా!

 

67. కం పాదమున నడుగుకర్ధము

పాదము కిరణంబు, వేరు పాతికయునగున్

పాదమన పద్యపాదము

పాదంబన చిన్నగుట్ట భావజమదనా!

 

68. కం. పిండమన నన్నకబళము

పిండము గర్భంబు, జెండుబిందము, బలమున్

పిండంబినుము, శరీరము

పిండముగజ కుంభమగు, గుబేరసుమిత్రా!

 

69. కం. పెంపన నాధిక్యంబగు

పెంపన పాలన, సమృద్ధి, వృద్ధిక్షయమున్

పెంపు మహత్వము కర్ధము

పెంపనగా గౌరవంబు భీమకపర్ధీ!

 

70. కం. పొదియన భారముకర్ధము

పొదిమంగలియడపమగును పొదుగుయునునగున్

పొదియన నమ్ములపొదియౌ

పొదియనగా గుంపు, శేషభుజగవిభూషా!

 

71. కం. పొలమనగ పంతనేలయు

పొలము ప్రదేశంబు, నడవి పొలమనయూరున్

పొలమన జాడయు, విధమును

పొలమనగా గంచెయగును భుజగాభరణా!

 

72. కం. పోటన యుద్ధము కర్ధము

పోటు సముద్రోల్బణంబు బోటన బొడుపున్

పోటన శౌర్యంబును నగు

పోటనగా బాధయగును భూతేశహరా!

 

73. కం. ప్లవమనగ జువ్విచెట్టగు

ప్లవమనగా నీటికాకి ప్లవమనగప్పౌ

ప్లవమన కోతియు, గొఱ్ఱెయు

ప్లవమనగా తెప్పయగును బావకనేత్రా!

 

74. కం. ఫలమన నాగటి కఱ్ఱగు

ఫలము పయోగంబు, పంట, బాణాగ్రంబున్

ఫలమన బండును, లాభము

ఫలమనగా జాజికాయ ఫాలాక్షశివా!

 

75. కం. బభ్రువన కపిలగోవగు

బభ్రువనం విష్ణువగును బరమేశ్వరుడౌ

బభ్రువనంగను నగ్నియు

బభ్రువనం నాకుపచ్చ బాలేందుధరా!

 

76. కం. బరియన బార్శ్వము కర్ధము

బరిదొంగ దిగఁబరము బరిగోలయగున్

బరియనగ శత్రుండగు

బరిగీచిన గిఱియునగును భావజదమనా!

 

77. కం. బలమన నధికము కర్ధము

బలమన సైన్యంబు, రసము, బలుపునుదనరున్

బలమన రూపము గంధము

బలమనగ సత్తువగును భసితవిభూషా!

 

78. కం. బాసయన వ్రతముకర్ధము

బాస ప్రమాణంబునగును భాషయును నగున్

బాసన సంకేతంబగు

బాసయనంగను బ్రతిజ్ఞ పాపధ్వంసీ!

 

79. కం. బీజమన విత్తనంబు

బీజము వృషణమును, బలము, విత్తుటయునగున్

బీజమన గారణంబగు

బీజము రేతస్సునగును భీష్మకపర్ధీ!

 

80. కం. బ్రహ్మయన నలువ, విష్ణువు

బ్రహ్మయనంఋత్విజుండు బ్రాహ్మణుడుమఱిన్

బ్రహ్మంబన బరమాత్మగు

బ్రహ్మము వేదము, తపము భస్మవిదారీ!

 

81. కం. భగమన ధర్మము, వీర్యము

భగము మహాత్మ్యంబు, యోని, వైరాగ్యంబున్

భగమైశ్వర్యము, నిచ్చౌ

ణగమన మోక్షంబు, గీర్తి, భైరవజనకా!

 

82. కం. భోగమన సుఖము, ధనమగు

భోగము పాలనము, బడగ, భోజనమునగున్

భోగియన రాజు, మంగలి

భోగియనం భుజగమౌను బుష్పశారారీ!

 

83. మదమన నేనుగు క్రొవ్వగు

మదమన సంతోషమగును, మదమన బొగరున్

మదమింద్రియమును, గర్వము

మదమన గస్తూరియగును మన్మధవైరీ!

 

84. కం. మధువన ౠతువు వసంతము

మధువనగా చైత్రమగును మఱితేనెయగున్

మధువన బాలును గల్లును

మధువనగా నీరు, జంద్రమఃఖండధరా!

 

85. కం. మండలియన సూర్యుండగు

మండలి శునకంబు, బాము, మార్జాలంబున్

మండలియనగను రాజగు

మండలియన గుంపునగును మనసిజదమనా!

 

86. కం. మందుడన దెలివిహీనుడు

మందుడనందిరుగుబోతు మఱియల్పుండున్

మందుడు వ్యాధిగ్రస్తుడు

మందుడు నిర్భాగ్యుడండ్రు మదనవిరోధి!

 

87. కం. మాతయన తల్లికర్ధము

మాతయనం లక్ష్మియగును మాతంగియగున్

మాతయనంగను నేలయు

మాతయనంగోవు, భూతిమండితకాయా!

 

88. మాధవి పశుసమృద్ధియు

మాధవి తేనెయును, కల్లు, మాదీఫలమున్

మాధవియన జెక్కెరయగు

మాధవియన లక్ష్మియగును మారధ్వంసీ

 

89. మినుకన బంగార్నాణెము

మినుకనగా తాలిబొట్టు మినుకనవాక్కున్

మినుకన గాంతియు, గిరణము

మినుకుల నం వేదమండ్రు మేరుశరాసా!

 

90. కం. మృగమన జంతువు కర్ధము

మృగమనగా నడవియేన్గు , మృగశిరయునగున్

మృగమన జింకయు, వేడుట

మృగమన్వేషణము, వేట మృత్యువినాశా!

 

91. కం. ముఖమనగా బంచపాకయు

ముఖము యుపాయంబు, మాట, మొగమున్, నోరున్

ముఖము ప్రయత్నము కర్ధము

ముఖమొక నాటకపుసంధి మునిజనవినుతా!

 

92. కం. మెఱవడియన నతిశయమును

మెఱవడి ధైర్యంబు నగును మెఱవణియునగున్

మెఱవడియన నుద్రేకము

మెఱవడి గౌరవము, నేర్పు మహికాంశుధరా!

 

93. కం. మేలన శుభ ముపకారము

మేలనబుణ్యంబు, వలపు, మేలన గొప్పౌ

మేలువిశేషము, లాభము

మేలనగా సుకృతమలరు మీనాంకహరా!

 

94. కం. యోగము ధాన్యము కర్ధము

యోగ ముపాయంబు, గూర్పు యోగము మందున్

యోగము ద్రవ్యము, గవచము

యోగమనంగను బ్రయత్న మురగవిభూషా!

 

95. కం. రచ్చయన న్రాజమార్గము

రచ్చన మందపము, సభయు రచ్చన గోష్టిన్

రచ్చయన గలకలంబగు

రచ్చయనంగ లహమగును రతిపతిదమనా!

 

96. కం. రసమన పాదరసంబును

రసమను రాగంబు, విషము, ద్రవము బసరున్

రసమన రుచియును, జలమును

రసమనగా వీర్యమగును రాగవిదూరా!

 

97. రహియన సంతోషంబగు

రహియన నాసక్తి, దెలివి, రక్తియునునగున్

రహియన బాగుకు నర్ధము

రహియనగా విధమునగును రాజవతంసా!

 

98. కం. రాజనగ రాజ రాజగు

రాజనగ యక్షుడగును రాజన ఱేడున్

రాజన దేవేంద్రుఁడగు

రాజనగా రాచవాడు రాజవిభూషా!

 

99. కం. రుచియన సూర్యుని కిరణము

రుచియనగా నిష్టమగును రుచియన జవియున్

రుచియన గాంతికి నర్ధము

రుచికడు చల్లని వెలుంగు రుసిజనవినుతా!

 

100. కం. లతయన నెక్కుడు తీగగు

లతయన శాఖయును, గఱిక లతచీమయగున్

లత సాలెపురుగు కర్ధము

లతయన గస్తూరియగు లలాటోగ్రాక్షా!

 

101. కం. వగయన సంతాపమగును

వగయా లోచనయు నగును వగ దుఃఖంబున్

వగయన విధము, విలాసము

వగయనగా గతియునగును వైశ్రవణసఖా!

 

102. కం. వనమన దోపు నరణ్యము

వనమన బరదేశమందు వాసము, గృహమున్

వనము సమూహము, జలమును

వనమన సెలయూతయగును వ్యాళవతంసా!

 

103. కం. వర్ణమన నక్షరంబగు

వర్ణము జాతియును, రంగు, బంగారంబున్

వర్ణము యశమున్, స్తుతియున్

వర్ణమనం గుణమునగును బర్వతశయనా!

 

104. కం. వలనుయన దిక్కు, పార్శ్వము

వలను యుపాయంబు, విధము వలను శకునమున్

వలను ప్రదక్షిణమును నగు

వలను శుచిత్వంబు, నేర్పు వాసవవినుతా!

 

105. కం. వశయన భార్యకు నర్ధము

వశయన నాడేనుగ గును వనితయును నగున్

వశయన గోవును, గూతురు

వశయనగాలోకువగును బ్రద్యుమ్నారీ!

 

106. కం. వసుయన ధనముకర్ధము

వసువన రత్నమును, నగ్ని, బంగారంబున్

వసువన పలుపును, గిరణము

వసువననొక రాజుయగును బ్రణవసురూపా!

 

107. కం వంశమన గులముకర్ధము

వంశము వెన్నెముకయగును వంశముగుంపున్

వంశము బిల్లంగ్రోవియు

వంశంబన వెదురునగును వ్యాళాభరణా!

 

108. వారమన కుబ్జవృక్షము

వారము సూర్యాది సప్త వాసరములగున్

వారము వాకిలి, గుంపును

వారమనం క్షణము, తడవ ప్రణతార్తిహరా!

 

109. వాసియన తారతమ్యము

వాసి స్వస్థంబు, బాగు, బరిమితియునగున్

వాసిప్రసి ధ్యాధిక్యము

వాసియనం లాభమగును వనజాక్షసఖా!

 

110. కం. వీడనవదలుట కర్ధము

వీడన వర్ధిల్లుటగును వీడనదండున్

వీడన శిభిరము, గట్నము

వీడన బట్టణము, గుంపు విశ్వాధిపతీ!

 

111. కం. వెంటయనవిధము, మార్గము

వెంటయనంగార్యమగును వేటయునునగున్

వెంటయన తోడనుండుట

వెంటయనంవిషయమగును విషమశరారీ!

 

112. కం. వ్యసనము నిష్ఫలయత్నము,

వ్యసనమనం గష్ఠమగును, బాపమునునగున్

వ్యసన మపాయ మసూయయు

వ్యసనంబనగానపేక్ష హాలాహలాంకా!

 

113. కం. శక్త్యుత్సాహమున కర్ధము

శక్తియనం జిల్లకోల, శర్వాణియగున్

శక్తి వసిష్ఠుని బుత్రుడు

శక్తి సహాయంబు, బలము శర్వాణీశా!

 

114. కం. శిఖయన గీరణముకర్ధము

శిఖయనగా నెమలిసిగయు, సిగయున్, సెగయున్

శిఖయన శాఖయు, నూడయు

శిఖయనగా గొనయగును శ్రీవిశ్వేశా!

 

115. కం. శిఖియన నెమలియు, గోడియు

శిఖికేతుగ్రహము, నెద్దు, జెట్టును, నగ్గిన్

శిఖియన బాణముకర్ధము

శిఖిసిగ గలవాడునగును శ్రీకంఠశివా!

 

116. కం. శుచియన జ్యేష్ఠాషాఢము

శుచియనగా గ్రీష్మఋతువు శుచియనదెలుపున్

శుచి శృంగారరసంబును

శుచి పరిశుద్ధంబు, నగ్ని శుభ్రాంశుధరా!

 

117. కం. శృంగమన కొండ కొమ్మగు

శృంగము ప్రాధాన్యమగును శృంగము గురుతున్

శృంగము కొమ్ముకునర్ధము

శృంగమనం దొరతనంబు శీతాంశుధరా!

 

118. కం. సంగడియన స్నేహంబగు

సంగడియన గుంపు, జతయు, సామీప్యంబున్

సంగడి పార్శ్వముకర్ధము

సంగడి వెనుకయును, విధము సర్వాభరణా!

 

119. కం. సంగర మంగీకారము

సంగరమాపదయు, విషము, సమరంబునగున్

సంగరమనగా బ్రతిజ్ఞయు

సంగరమన జమ్మిపండు సౌరీమిత్రా!

 

120. కం. సంజ్ఞయన రవితలోదరి

సంజ్ఞయనం దెలివియగును సైగయునునగున్

సంజ్ఞయనం గాయిత్రియు

సంజ్ఞయనం బేరు, శీతశైలజనాధా!

 

121. కం. సంతతియన గులమగు ధర

సంతతియన వరుసయగును సంతానమగున్

సంతతి పారంపర్యము

సంత్యతియన విరివియగును శైలనిశాంతా!

 

122. కం. సమయమన బుద్ధి, నాజ్ఞయు

సమయము కాలము, బ్రతిజ్ఞ, సంకేతంబున్

సమయము సిద్ధాంతంబగు

సమయంబన శపథమగును షణ్ముఖజనకా!

 

123. కం. సాధనమన నుపకరణము

సాధనము యుపాయమగును, సాధించుటగున్

సాధనము ధనము, గమనము

సాధనమన మరలబాటు సైన్యంబీశా!

 

124. కం. స్కంధమన చెట్టుబోదెయు

స్కంధము దేహంబు మఱియు సమరంబునగున్

స్కంధము మూపునకర్ధము

స్కంధంబన గుంపునగును గాళీనాధా!

 

125. కం. హంసుడన విష్ణుకర్ధము

హంసుడన సూర్యుడగును, నభవుండునగున్

హంసుడనంగను జీవుడు

హంసుడనం యోగ్యుడైన నధిపుడు సాంబా!

 

126. కం. హరియన రవిశశికిరణము

హరి సింహము, వజ్రి, కప్ప, హయమున్, పామున్

హరియనగ గాలి, విష్ణువు

హరియనగా జిలుక, కోతి, యముడున్ భర్గా!

 

127. కం. క్షారమన నుప్పుకర్ధము

క్షారమనం బూడిదయును, గారమునునగున్

క్షారము యుమ్మెత్తయగును

క్షారమనం గాజుయగును గైలాసపతీ!

 

128. కం. ఈరమ్యశతక మిద్ధర

నారూఢిని మిగులజెంది హరిఖరకర భూ

తారకమై తారకమై

తారకమేగాతభక్త తతులకు నభవా

 

గద్యము.

ఇది శ్రీవేంకటేశ్వరవరప్రసాదలబ్ధకవితావిచిత్ర రా

మభక్త కంచర్లసూర్యనారాయణ కటాక్ష వీక్షా

పాత్రయాజ్ఞవల్క్యశాఖోత్తంస శాండిల్యసగోత్ర

పవిత్ర మాదిరాజు బుచ్చిరాజ పౌత్ర

సుబ్బమాంబా లక్ష్మీకాంత పుత్ర

సుజనవిధేయ రామకోటీశ్వర

శర్మనామధేయప్రణీతంబైన

నానార్ధశివశతకము

సంపూర్ణము.

 

Posted by Subrahmanyam Devarakonda at 10:26 AM

Email ThisBlogThis!Share to TwitterShare to Facebook

Labels: Sataka sAhityaM, SatakAla paTTika, నానార్ధశివ శతకము, మాదిరాజు రామకోటీశ్వర శాస్త్రి, శతకసాహిత్యం

E" but not 'E-go

 


 



"E" is the most Eminent letter of the alphabet.
Men or Women don't exist without "E".
House or Home can't be made without "E".
Bread or Butter can't be found without "E".
"E" is the beginning of "existence" and the end of "trouble."
It's not at all in 'war' but twice in 'peace'. It's once in 'hell' but twice in 'heaven'.
"E" represents 'Emotions' hence all emotional relations like Father, Mother, Brother, Sister have 'e' in them.
"E" also represents 'Effort' & 'Energy' hence to be 'Better' from good both "e" added. 
Without "e", we would have no 'love', 'life', 'wife' or 'hope' & 'see', 'hear', 'smell', or 'taste' as 'eye' 'ear', 'nose' & 'tongue' are incomplete without "e".
Hence Go with "E" but without E-GO.
(via Facebook/ Gorenka Manjula/ Learning Petals)

___________

పదండి వెనక్కు ( సరదాకి ) - కర్లపాలెం హనుమంతరావు

పదండి వెనక్కు ( సరదాకి ) 

- కర్లపాలెం హనుమంతరావు 

మార్నింగ్ గుడ్!

ఏడాదిలో మూడు వందల అరవై నాలుగు రోజులు ముందుకే కదా నడుస్తాం! ఒక్క రోజు కాస్సేపు కాస్త వెనక్కు నడవమంటే ఎందుకలా మిర్రి మిర్రి చూడడం! ఈ కొత్త వెర్రి ఏమిటా అనా?

జనవరి 30 వెనక్కి నడిచే రోజు అమెరికాలో!

మనదగ్గరయితే  ఈ వెనక నడక మరీ కొత్త చోద్యమేం  కాదు! అప్పులోడు ఎదురు పడితే అడుగు ముందుకు పడదు. ఎదురొచ్చిన సందు మరీ పాతబస్తీ మోడల్లో ఉంటే వెనక్కి నడిచి ఏ మలుపులోకి తప్పుకొంటేనే మానం దక్కుదల!

'పదండి ముందుకు!.. పదండి ముందుకు!' అంటూ మహాకవిశ్రీ శ్రీ మరీ కాళ్లకిందలా నిప్పులు ఎందుకు పోస్తారో! 'వెనక చూసిన కార్యమేమోయి/మంచి గతమున కొంచెమేనోయి/మందగించక ముందు అడుగేయి/వెనుకపడితే వెనకే నోయి' అంటూ  గురజాడవారిదీ అదే గత్తర! ఇహ  మన ఏ.పీ చంద్రబాబుగారైతే మరీ విడ్డూరం! పద్దస్తమానం పెద్దానికీ  'అలా ముందుకు పోదాం' అంటూ ఒహటే తొందర ఆయనకు! ముందుచూపుమీదే అందరి చూపైతే మరి  మనకి  వెనక తీసే గోతుల గతి పట్టించుకునే పరంధాముడు ఎవరంట! బొక్కబోర్లా పడ్డా తట్టుకొని లేవచ్చు. వెల్లికిలా పడ్డమంటే మళ్లీ తేలేది కైలాసంలోనే సుమా!

ఎవరెంతమంది వైతాళికులు ముందు నడకకే తాళమేసినా మన శ్రీమాన్ గిరీశంగారు మాత్రం 'అటునుంచి నరుక్కు రమ్మని' దొడ్డిదారి చూపించారు! కొంత నయం! నేటి మెజారిటీకీ ఆ దారే రహదారి! సంతోషం!

మాటవరసకేదో అనుకుంటాం గానీ..  వాస్తవంగా మన నడక ఇప్పుడు వెనక్కికాక ముందుకుందా! ఎప్పుడో వెనక తాతలు తాగిన నేతుల వాసన మనమిప్పుడు  మూతులు ముందుకు చాపి చూపించుకుంటున్నామా లేదా! దేశానికి స్వేచ్చాస్వాతంత్రాలొచ్చిందే  తన వెనక తరం తాతయ్య నెహ్రూ వల్లని ఇటలీ బ్లడ్ రహుల్ బాబు ఇప్పుటికీ డప్పులు కొట్టుకుంటున్నాడు!  పేదల పాలిటి పెన్నిధని అత్త ఇందిర పేరు చెప్పుకొంటూ కోడలుగాంధీ పల్లకీ మోయించుకోడంలా! ఏనాడో  చరిత్రపుటల్లోకి ఎగిరి వెళ్ళిపోయిన.. మహానేత వై ఎస్ పేరు మోసుకుంటూ  జగజ్జేత  కావాలనుకోడంలా జగన్ జీ! ‘అచ్చేదిన్’ వచ్చేదింకా ఎంతో దూరంలో లేదంటూనే.. వెనకటినాటి రామరాజ్యం మళ్లీ తెస్తామంటోంది మోదీ సర్కార్! వెనకచూపును చిన్నచూపు చూస్తున్నదెక్కడ! ముందుకు కదలాలంటే వెనక చూపు ఎంతో అవసరం. 

ఆ చూపు లోపిస్తే బతుకెంత దుర్బరమో ఒక్క రామాయణంలోనే బోలెడన్ని ఉదాహరణలు!   బంగారులేడి మాయదారిదని తెలిసీ   శ్రీరామచంద్రుడు   వచ్చినదారి  పట్టక అష్టకష్టాల పాలయ్యాడు! వ్యాస మహర్షులవారు రాసి పారేసిన అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, భారత భాగవతాదుల్లో ఒక్కడంటే ఒక్కడికైనా వెనకచూపు లేకపోవడం విచిత్రమే కాదు.. విచారకరంకూడానూ! 

బ్యాక్ టు ఫ్యూచర్ పెద్ద హిట్ పిక్చర్ హాలివుడ్లో! బ్యాక్ టు స్కూలు అమెరిన్  స్కూళ్ళు తిరిగి తెరిచే  సందర్భం! ఎన్నికల వేళ మన ప్రజానిధులు వాడవాడల్లో చెడ తిరుగుతారే.. అదీ ఓ రకంగా ‘బ్యాక్ టు నియోజకవర్గం’ పథకం కిందే లెక్క!  అంగారకుడిమీద పరిశోధనలు చేసే నాసా రోవర్ ‘క్యూరియాసిటీ’  వంద  మీటర్ల దూరం వెనక్కి నడిచినప్పుడు అంతరిక్ష పరిశోధకుల ఆనందం అంతా ఇంతా కాదు!

వెనకనుంచి చదివే లిపి పార్శీ. కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు తప్పనిసరిగా  వెనక్కి నడవాలి! చిన్నబళ్ళో పంతుళ్ళు ఎక్కాలను వెనకనుంచి ఒప్పచెప్పించేవాళ్లు. రాకెట్లు అంతరిక్షంలోకి వదిలేముందు అంకెలు వెనకనుంచి లెక్కిస్తారు! లియొనార్డో డావిన్సీ పేరు విన్నారా! ఆయన వెనకనుంచి ముందుకు రాసుకుపోవడంలో సుప్రసిద్ధుడు!

 రామకృష్ణ విలోమ కావ్యం.. 14వ శతాబ్దంది..  మొత్తం 36 శ్లోకాలు.. ముందు నుంచి చివరికి చదువు.. రామాయణం, వెనకనుంచి మొదటికి రా! భారతం! ‘చిరం విరంచి: న చిరం విరంచి:/సాకారతా సత్య సతారకా సా / సాకారతా సత్య సతారకా సా /చిరం విరంచి: న చిరం విరంచి:’ సాహిత్యంలో కవులు  పద్యాలు ఇలా  వెల్లికిలా వల్లెవేస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేస్తాం. కాకతీయులుకూడా విలోమ పద్ధతుల్లో  వివాహాలు చేసుకున్నారయ్యా అంటే విస్తుపోయి చూస్తాం! అన్నయమంత్రని  రుద్రమాంబ రెండో బిడ్డ  చేసుకుంది. ఇంత పాండిత్యం విని తట్టుకోలేనంటే చిన్న ఉదాహరణ ఒహటి తగిలించి వదిలేస్తా! 'దడిగాడువానసిరా'ని తిరగేసి రాసి చూడరా! 'రాసినవాడు గాడిద' అవుతుంది అవుతుందా లేదా! గురుస్వామిలాంటి స్వాములు  సినిమాపాటలు వరస చెడకుండా  వెనకనుంచి పాడితే భలే అర్థమవుతాయి  కదా!  చేతులు నొప్పుట్టేట్లు చప్పట్లు కొట్టికూడా అభినందిస్తావూ! వెనకటి కథలే మళ్ళీ మళ్ళీ తాజాసినిమాలుగా మారి  రీసైకిల్ కిల్ చేస్తున్నా  'ఇదేంట’ని ఈసడించుకోవు  సరికదా.. మొదట్రోజు మొదటాటలోనే తల మోదుకొనేందుకు   తయారయిపోతావ్!  మనదగ్గరంటే ఆసే.తు హిమాచల పర్యంతం  దాదాపు ఒకే సమయం నడుస్తుంది. అమెరికాలాంటి అఖండ ఖండాల్లో  అడుక్కో రకం గడియారంనడక! ఆరునెల్లకి ఓ గంట అటుకో ఇటుకో సర్దుబాటు! గడియారాలే  వెనక్కీ ముందుకీ నడవంగా లేనిది   మనమో నాలుగడుగులు అవసరాన్ని బట్టి వెనక్కి నడిస్తే వెక్కిరింతలెందుకూ! 

ఈ పండితుల గోల మనకెంకుగ్గానీ  మామూలు రాజకీయాలు    చూసుకొందాం.  వెనక చూపంటూ లేకుంటే చొక్కామీద వెనకనుంచి ఎవరు ఎప్పుడు ఏ సిరాచుక్క చక్కా విదిలించి పోతారో ఎలా తెలుస్తుంది! ఒలంపిక్సు పరుగుపందేల్లో ఎలాగూ కప్పులు తెచ్చే ఒకప్పటి  గొప్ప ఆటగాళ్ళు    పిటి ఉష.. అశ్వినీ నాచప్పల ఇప్పుడు లేరు.  కనీసం కంచుకప్పులైనా కొట్టుకు రావాలంటే వెనక్కి పరుగెత్తే  పందేలు పెట్టించి వాటిలో మన కుర్రబ్యేచికి తర్ఫీదివ్వాలి.. తప్పదు మరి! పురచ్చితలైవి జయలలిత.. లాంటి నేతలు మనముందుంటే వెనక్కి తిరిగి నడవడం  వీలుండదుగానీ గుళ్లో అయినా   పృష్టభాగం చూపించకుండా ప్రదక్షిణాలు చెయ్యడం కుదరదు గదా!  వెనక నడకంటే ఇంకా పస్తాయింపులెందుకు!

వెనకనడక వల్ల బోలెడన్ని లాభాలుకూడానూ! కవిసమ్మేళనాలప్పుడు  వెనక బెంచీల్లో కూర్చుంటే కవితాగానం జరిగేటప్పుడు  నిశ్శబ్దంగా బైటికి పోవడం సులభమవుతుంది. పెద్దపెద్దవైద్యులు నొక్కి చెప్పే ప్రకారం పీల్చిన గాలిని  వెనక్కి వదిలేయడమంటే వంట్లోని మలినాలను బయటకు తరిమేయడమే! అదే యోగానిపుణులు చేయమని మొత్తుకొనే విలోమ యోగాసనం! పద్మాసనంలో కుదురుకొని  కుడిముక్కు మూసుకో! ఎడం ముక్కుతో  గాలి  పీల్చి వెనక్కి వదిలేయ్! లోపలికి లాక్కోవడమేగానీ బైటకు వదిల్లేని బలహీనత ఇక్కడా ప్రదర్శిస్తే ప్రమాదం! భీష్మాచార్యులవారికి మల్లే అంపశయ్యమీదే ఆఖరి శ్వాస వదిలేయాల్సొస్తుంది!  

 


 

'ముందు మున్సిపాలిటీ అయినా వెనక పర్శనాలిటీ'  చాలామంది సుందరాంగులకి. మనీ పర్శుకూడా వెనకజేబులోనే కదా దోపుకొనేదీ! ఇక మడమ తిప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా బజారులో బేరాలు చేసేది ఎలా? ఆడవాళ్లను చూసైనా ఇంగితం  తెచ్చుకోవాలి! ముందు.. వెనక బేధం ఉండదు సింగారానికి. నీలవేణుల వెనకున్న వాల్జడలు చూసే చాలామంది కవులు  సంపూర్ణంగా మతులు పోగొట్టుకున్నారు! శ్రీరాములవారి సహాయము కావలెను- అని కాదు రాసుకోవాల్సింది.  కనీసం ఇవాళైనా 'నులెవ కాము యహా సరివాలము రాశ్రీ' అని తిరగేసి రాసి చూడండి!  పట్టించుకోకుండా పోయిన భాగ్య సంపదలు  ఠక్కున వెనక్కి  రాకపోతే  అప్పుడు అడగండి!


ఈ వెనక పండుగ రోజున ఏం చేయాలని సందేహమా! ఊహ ఊండాలేగానీ ఆకాశమే హద్దు! చొక్కా తిరగేసి తోడుక్కో! తొక్కతిని అరటి గుజ్జు వదిలేయ్! చెప్పులు కాళ్లు మార్చి వేసుకొని నడువు! కళ్లజోడు నెత్తికి పెట్టుకొని ఊరేగు! సెల్ఫోన్ రింగవంగానే 'బై' అని మొదలెట్టి 'హాయ్'  అని ముగించు! టీవీని వెనకనుంచి విను! 

గాడిదలకు మాత్రం వెనగ్గా పోవద్దు సుమా! లారీల వెనక నిలబడ వద్దు! ఆడపిల్లల వెనక్కూడా పడవద్దు. బివేరాఫ్ ‘షి’ టీమ్స్! ప్యాంటు పైన అండర్ వేర్ అంటే సూపర మేన్ వరకు ‘ఓ. కే’ నే గానీ  ఎంత ‘వెనక్కి తిరిగే దినోత్సవ’మే అయినా కుక్కలకు ఆ విషయాలేవీ తెలీవు కదా! వెనకబడగలవు! శ్రీకారం చివర్లో.. స్వస్తి మొదట్లోనే చెప్పేవరకూ బాగానే ఉంటుంది..కానీ 'శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ../..గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ/కంబపువ్వు మీద కాకారీ పూఛాయ' అంటూ నడిరాత్రి మేలుకొలుపులుగానీ లంకించుకున్నావనుకో .. పండగ స్వారస్యం తెలియని పక్కింటి సూర్యనారాయాణ నిజంగానే గడకర్ర పుచ్చుకొని గడపముందుకొచ్చేయచ్చు! 'పసిడి పాదుకలూని పడతి సీత కేలూని/ పవళింప వేంచేయు సమయము స్వామీ!' అంటూ నిద్రపుచ్చే పాటలకు పరగడుపునే తగులుకుంటే ఎదురింటి పవనకుమారుడుగారు  తన మజిల్ పవరు చూపించగలరు! తస్మాత్ జాగ్రత్త! ‘బేక్ వర్డు డే’ కదా అని యోగా చేస్తూ వెనక్కి వంగితే నడుం పట్టేయచ్చు. భద్రం! 

'మరల నిదేల రామాయణం బన్నచో,/ నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ/తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు/ తన రుచి బ్రదుకులు తనివి గాన/చేసిన 

అన్నారు మహాకవి విశ్వనాథ సత్యనారాయన గారుకూడా!  విలోమ దినం విశిష్టతేంటో ప్రభుత్వాలక్కూడా తెలిసొచ్చినట్లుంది! ఆదివారమని కూడా చూసుకోకుండా ప్రచారానికొస్తున్నారు పాపం   ఎన్నికల అభ్యర్థులు!. రోటీనుకి భిన్నంగా ‘గ్రేటరు’ వాళ్లూ రోజంతా వాటరిస్తున్నారు. కరెంటిస్తున్నారు. రోజూ తాగి వచ్చి, భార్యను తంతేగాని నిద్రపట్టని తాతారావుకూడా ‘ఈ ‘వెనక్కి తిరిగే దినోత్సవ సంబరాన్ని పురస్కరించుకొని ఎప్పట్లా కాకుండా  రాత్రినిద్ర బైట కానించి.. పొద్దున్నే వచ్చి  తన్నుడు కార్యక్రమం మొదలు పెట్టాడు!

తెలుగు దేశం మళ్లీ  అధికారంలోకి రావాలని అన్నవరంనుంచి తిరుపతి వరకు వెనక నడకన యాత్ర చేసాడొక తమ్ముడు ఈ మధ్యనే! రొటీన్ కి భిన్నంగా మోదీజీ ప్యారిస్ నుంచి తిరిగొస్తూ కాబూల్ లో దిగిపోయారా మధ్య! రొటీన్ కి భిన్నంగా ఎన్నికలప్పుడు పార్టీలే ఓటర్ల చిరునామాలు వెదుక్కొంటూ తిరుగుతున్నాయి! పురస్కారాలు  ఈ వెనక పండక్కి చాలా ముందునుంచే రివర్సులో తిరిగి ఇచ్చే ఉద్యమం మొదలయింది! ఇప్పుడు మళ్లీ అకాడమీ తిరిగి వెనక్కి ప్రదానం చేసే కార్యక్రమంలో ఉంది. ఇప్పటి వరకు భారత్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో విదేశాలకు తరలి వెళుతున్నారా! ఈ సారే వనక్కి తిరిగి వచ్చేస్తున్నారు! 

‘పీచే ముడ్!.. ఆగే బడ్!’ లలో ఏది ఎప్పటికి  శ్రేష్టమో అదే అప్పటికి అనుసరించడం ఉత్తమ రాజకీయవేత్త లక్షణం.  చైనా, జపాన్లు వెనక్కి నడవడాన్ని ఓ కళగా అఅభివృద్ధి చేస్తున్నాయి!

మనమూ కొన్ని రంగాలలో వెనకబడేమీ లేమనుకోండి! ఇక్కడ  రైళ్లు, బస్సులు  నడుస్తుంటాయి. విమానాలు కూడా వి ఐ పి లు పిలిస్తే ‘ఓయ్’ అంటూ చక్రాలు వెనక్కి తిప్పుకుంటాయి!. రూపాయి వెనక్కి నడుస్తుంది. పాపాయి రూపాయిని చూస్తే వెనక్కి నడుస్తుంది.  వెనక తింటున్న కందమూలాలనే మళ్లీ మనం  తింటున్నది.. ఆరోగ్య స్పృహ మరీ పెరిగిపోయి. వెనక ఆదిమయుగం మానవులు కట్టిన పిక్కల్లోకి వచ్చే దుస్తుల్నే మళ్లీ మన ఆడవాళ్ళు ఇవాళ ఆదరిస్తున్నది!  వెనక వాడిన రుబ్బురోళ్ళు.. రోకళ్ళు.. బుడ్డి దీపాలే మళ్లీ ఆరోగ్యదృష్ట్యా మంచివని ఇళ్లల్లో ప్రత్యక్షమవుతున్నాయి.  ముందుకు పోయే వేగం పెరుగుతుందని వెనకబడిన తరగతుల్లో చేర్చమని కొన్ని వర్గాలు ఉద్యమాలుకూడా జోరుగా చేస్తున్న దేశం మనది. ఐదేళ్లకోసారి ‘మమ’ అనిపించే ఎన్నికల్లో  మనం ఓట్లేసి గెలిపించే  ప్రజాప్రతినిధి ముందుచూపుతో నాలుగురాళ్లు వెనకేసుకొంటున్నాడే అనుకోండి! అతగాడిని  మళ్లీ వెనక్కి పిలిపించేందుకు అవకాశం ఉందా మన ప్రజాస్వామిక పాలనావిధానంలో!  ప్రగతి పథంలొ ముందుకు దూసుకుపోయే ప్రజాస్వామ్య వ్యవస్థకైనా సరే వెనక చూపు అందుకే తప్పనిసరి అనేది!


!గో బ్యాక్!’ అని వూరికే నినాదాలు చేస్తే ఏమొస్తుంది! సమయం సందర్భం చూసుకొని వెనక్కి నడిచినప్పుడే ముందుకు పోయే అవకాశం చేజిక్కించుకొనేది!

ఈ క్షణంనుంచే వెనక్కి నడవడం ఆరంభిద్దాం!

పదండి వెనక్కు!.. సారీ.. క్కునవె డిందప!

***

- కర్లపాలెం హనుమంతరావు 

01 - 03-2021 

 

 


 


దుర్భాషా సాహిత్య ప్రయోజనం - సరదా కథ - కర్లపాలెం హనుమంతరావు




ఉండేలు సుబ్బారెడ్డికి గుండెల్లో కలుక్కుమంది. లేచెళ్ళి కాసిని మంచినీళ్ళు తాగొచ్చి మళ్లీ పనిలో పడ్డాడు. ఐదు నిమిషాలు గడిచాయి. మళ్ళీ గుండెల్లో కలుక్కు! ఈ సారి కాస్త ఎక్కువగా! నొప్పికూడా  పెరుగుతున్నట్లు అనిపిస్తోంది.   కడుపు ఖాళీగా ఉన్నా గ్యాస్ ఎగదన్ని గుండెల్లో పట్టేసినట్లుంటుందని ఎక్కడో విన్నాడు. ఫ్రిజ్ లోనుంచి ఓ అరటిపండు తీసాడు. సగం పండుకూడా తినలేదు..  వళ్లంతా ఒహటే చెమటలు! కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లనిపించి  మంచంమీద కూలబడ్డాడు.

గుండెల్లో నొప్పి  తెరలు తెరలుగా వస్తూనే ఉంది.

‘హార్ట్ ఎటాక్?!’ అనుమానంతో  గుండె కొట్టుకొనే వేగం  మరింత హెచ్చింది.

ఇప్పుడేం చేయడం?

సమయానికి ఇంటి దగ్గరా ఎవరూ లేరు. అందర్నీ తానే ఊరికి తరిమేశాడు. ఏదో  పత్రిక్కి పోటీకని నవలేదో రాస్తున్నాడు. గడువు దగ్గర పడుతోంది.. ఇంట్లో పెళ్ళాం.. చంటి పిల్లలిద్దరూ చేసే అల్లరితో.. మూడ్ స్థిరంగా ఉండటం లేదని.. బలవంతాన భార్యని పుట్టింటికి పంపించాడు.. వారం రోజుల తరువాత తిరిగి తనే   తీసుకు వస్తానని వాగ్దానం చేసి మరీ. ఇప్పుడిలా అవుతుందని కల కన్నాడా? ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగుంటే తగిన  జాగ్రత్తల్లో ఉండేవాడే కదా!

కిం కర్తవ్యం? యమకింకరులొచ్చి పడే ముందే..  వైద్యనారాయణాస్త్రం అడ్డమేసెయ్యాలి. డాక్టర్ల నెంబర్లకోసం వెదికితే.. ముగ్గురు ఆపద్భాందవుల ఫోన్ నెంబర్లు దొరికాయి. డాక్టర్ గోవిందు. డాక్టర్ బండ కోదండం. డాక్టర్ దూర్వాసిని.

డాక్టర్ గోవిందు నెంబర్ కి రింగ్ చేసాడు ముందు.

గోవిందో  గోవింద!.. గోవిందో గోవింద!' అంటూ రింగ్ టోన్ అదే పనిగా మోగుతోంది.  అయినా   ఉలుకూ ఉప్పురాయీ లేదు అవతలి వైపునుంచి.  సెల్ కట్ చేద్దామనుకొనే లోపు ‘గుర్.. గుర్’ మంటూ గొంతు వినిపించింది.

హలో!.. ఎవరూ?'

డాక్టర్గారూ!.. అర్జంటర్జంట్సార్!.. గ్గుండెల్లో... న్నొప్పిగా..వ్వుంది.. చ్చా..ల్సే.. ప్ప..ట్నుంచీ'

అవతలి వైపునుంచి బిగ్గరగా నవ్వు! 'సారీ సార్! అందర్లాగా మీరూ నన్ను వైద్యం చేసే డాక్టరనుకున్నారా?'

'కాదా?'

కాదండీ బాబూ! మంది పంగనామం విశ్వవిద్యాలయం నుంచి వచ్చి పడ్డ డాక్టరేట్  ‘బెల్లం సాగుతో అధికాదాయం సాధించే నవీన విధానాలు’ అనే అంశంమీద   పరిశోధన చేసినందుకు..’  సుబ్బారెడ్డి ఫోన్ ఠక్కుమని కట్ చేసేసాడు. ‘ఇప్పుడా సోదంతా వినేందుకు టైమెక్కడేడ్చిందీ?’

రెండో నెంబరుకి డయల్ చేసాడీసారి. అదృష్టం.. నెంబర్ వెంటనే కలసింది.

యస్ ప్లీజ్! ఎవరూ? ఏం కావాలి?'

ఉండేలు సుబ్బారెడ్డి ఉన్న పరిస్థితినంతా గుండెలవిసి పోయేలా  వివరించాడు. ఆసాంతం  తాపీగా విని.. ఓ సుదీర్ఘ ఉఛ్ఛ్వాసం  తీసుకొని మరీ 'సారీ! మిత్రమా! వైద్యం.. వంకాయ.. మన లైను కాదు. నా డాక్టర్ పట్టా సాహిత్యానికి సంబంధించింది బ్రో! ‘ప్రాచీనకాలంలో జంతువుల జీవన  విధానాలు.. ప్రబంధ సాహిత్యంలో వాటి ప్రధాన  పాత్ర' అనే అంశంమీద కుంభకోణం విద్యాపీథం వారిచ్చిన స్నాతకొత్సవానంతర  పట్టా! ‘బండ కోదండం’ అన్న పేరు విన్న తరువాతైనా మీకు నా గురించి  అర్థం కాకపోవడం విఛారకరం..' ఉండేలు  సుబ్బారెడ్డికీ సారి పెద్ద బండరాయితో బాదేసినట్లు  గుండెలు కలుక్కుమన్నాయి.  ఫోన్ కట్ చేసేసాడు.

'మిగిలిందిక డాక్టర్ దూర్వాసిని.  సమయం చూస్తే అర్థరాత్రి దాటి అర్థ గంటయింది. న్యూసెన్సు కేసనుకొని న్యూసెన్సు చేసేస్తే!  సంకోచిస్తూనే నెంబర్ రింగ్ చేసాడు  సుబ్బారెడ్డి మార్గాంతరం లేక.

చాలాసేపు చడీ చప్పుడు  లేదు.. ఊరికే రింగవడం తప్పించి! అదే పనిగా ప్రయత్నించిన మీదట  అవతలవైపునుంచి రెస్పాన్స్ వచ్చిం దీసారి! ఎత్తుకోవడం ఎత్తుకోవడమే సూరేకాంతం గొంతులో సూరేకారం పోసినంత రౌద్రం! సుబ్బారెడ్డి గుండె దుస్థితి వివరణ నివేదిక   సమర్పించడం సగం కూడా కాలేదు అవతలి వైపు  శాల్తీ కాళికా దేవి అవతారమే ఎత్తేసింది.

'ఎవర్రా నువ్వు? నీకు అసలు బుద్ధుందిట్రా? ఇంతర్థ రాత్రి పూటా వెధవా..  కాల్  చేసేది?  కాలూ చెయ్యీ తీసేయిస్తానొరేయ్! ఇవతలున్నది ఓన్లీ లేడీసనుకోకు? ఎక్కడ్రా నీ ఇంటడ్రస్సు? ఏవిఁట్రా నీ ఒరిజినల్ ప్లాటు? నువ్వవసలు పేషెంటేవన్న గ్యారంటీ ఏంటి? నిజంగా నీది గుండె నొప్పేనని రుజువేంటి? నొప్పుంటే మాత్రం నువ్ కాల్ చేసుకోవాల్సింది ఏ ఆసుపత్రికో.. అంబులెన్సుకో!  నేరుగా ఇలా  ఇళ్ళమీదకొచ్చి పడతారట్రా స్కౌండ్రల్స్?  పెట్టేయ్ ఫోన్! మళ్లీ నా సెల్ రింగయిందా నీకు పోలీస్ స్టేషన్  సెల్లే గతి! నీ కొంపకు పోలీసుల్ని పంపిస్తా.. బీ కేర్ ఫుల్!' ఠక్కుమని ఫోన్ కట్టయి పోయింది.

సుబ్బారెడ్డిట్లా  నేరుగా డాక్టర్లనే తగులుకోడానికి కారణం లేకపోలేదు. రాతకోసం  ప్రశాంతత కావాలని వేధిస్తుంటే  ఫ్రెండువెధవ తననీ అడ్రసు తెలీని  అజ్ఞాతంలో వదిలేసి పోయాడు రాత్రి.  మళ్లీ తెల్లారి వాడొస్తేగానీ.. తానున్నది ఎక్కడో.. చిరునామా ఏంటో  తెల్సిచ్చావదు! ఈ బిల్డింగుకి పేరుకో వాచ్ మెన్ ఉన్నా.. అతగాడెక్కడో ఫుల్లుగా  మందుగొట్టి  గొడ్డులా పడున్నాడు.  తనదగ్గర సమయానికే  ఆసుపత్రుల నెంబర్లూ  ఉంచుకోలేదు. ఇప్పటిదాకా ఇట్లాంటి అవసరమేదీ  పడక.

ఉన్న  మూడు నెంబర్లూ  బెడిసి కొట్టేసాయి. ఇప్పుడేం గతి?!

పాలుపోవడం లేదు సుబ్బారెడ్డికి. అంతకంతకూ గుండెల్లో నొప్పి ఎక్కువై పోతోంది. చెమటలూ ధారగా కారి పోతున్నాయి. అక్కడికీ    నొప్పినుంచి దృష్టి మళ్ళించుకోడానికి సెల్ ఫోన్లోని   న్యూస్ చానెలేదో ఆన్ చేసాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డ ట్రంప్.. హిల్లరీల ప్రచారానికి సంబంధించిన వార్తలేవో ధారాపాతంగా వచ్చి పడ్తున్నాయి.  ట్రంపు మహాశయుడు హిల్లరీమ్యాడమ్మీద పడి  అడ్డమైన కారు కూతలూ అడ్డూ ఆపూ లేకుండా కూసేస్తున్నాడు! అదే స్థాయిలో హిల్లరీ అమ్మగారి భాషా ప్రయోగాలు కూడా!

మామూలు సమయాల్లో అయితే మనిషన్నవాడికి రాజకీయాలమీద విరక్తి పుట్టించే దుర్భాషలవన్నీ. కానీ.. కష్టాల్లో ఉన్న సుబ్బారెడ్డికిమాత్రం హఠాత్తుగా  తారక మంత్రం దొరికినట్లయింది.  మెరుపులాంటి ఆలోచనలతో అతగాడు  సెల్ ఫోన్ అందుకున్నాడుమళ్లీ డాక్టర్ దూర్వాసిని  బెడ్ రూంలోని  సెల్ మొరుగుడు మొదలు పెట్టింది అదే పనిగా.  ఎన్ని సార్లు నోరుమూసేసినా   మళ్లీ మళ్లీ మొరుగుతుండటంతో  దూర్వాసనమ్మగారి పక్కనే పక్కలో గుర్రుకొడుతున్న  మొగుడుగారు గయ్యిమని లేచారు మేడమ్గారిమీద 'మీ ఆసుపత్రినుంచీ యమర్జెన్సీ కాలేమో! అటెండవక పోతే ఎట్లా?  ఆనక సమస్యలొచ్చి పడతే సర్ధిపెట్టలేక చచ్చేది నేనే. ముందా ఫోన్ చూడు!' అంటూ.  


భర్త హెచ్చరించరికలతో ఇహ తప్పదన్నట్లు చిరాగ్గా లేచి   సెల్  అందుకొంది డాక్టర్ దూర్వాసనమ్మ.


 …


సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రిలో ఆఖరి నిమిషంలో జరిగిన అర్జంటు చికిత్సతో ఉండేలు సుబ్బారెడ్డి యమగండంనుండి బైటపడ్డాడు  చివరికి ఎట్లాగైతేనేం!


పోలీసులు సమయానికి వచ్చి  కలగచేసుకోక పోయుంటే కాబోయే ప్రముఖ రచయిత   సుబ్బారెడ్డి  ఈ పాటికి పై లోకాల్లో కూర్చుని ప్రశాంతంగా   నవల పూర్తి చేసుకునే పనిలో ఉండేవాడు. డాక్టర్ దూర్వాసిని ఇచ్చిన అర్థరాత్రి 'న్యూసెన్ కాల్' ఫిర్యాదుని  'షి'  టీం సీరియస్ గా తీసుకోబట్టి గుండెనొప్పితో లుంగలు  చుట్టుకుపోయే  సుబ్బారెడ్డిని 'సగం  నిర్మాణంలో ఉన్న ఊరిబైటి భవంతిలో గాలించి మరీ పట్టుకొన్నారు పోలీసులు.   అత్యవసర ఆరోగ్య పరిస్థితిని గుర్తించి.. అప్పటికప్పుడు ఆగమేఘాలమీద పోలీసులే  దగ్గర్లో ఉన్న పెద్దాసుపత్రిలో చేర్పించడం వల్ల సుబ్బారెడ్డి కథ సుఖాంతమైంది.

అసలు విషయం అర్థం చేసుకున్న డాక్టర్ దూర్వాసిని సైతం న్యూసెన్సు కేసులో మరింక ముందుకు పోదల్చుకోలేదు.

వాస్తవానకి మనం మెచ్చుకోవాల్సిందిక్కడ సుబ్బారెడ్డిని.. అతగాడి సమయస్ఫూర్తినా? అతగాడు అట్లా అర్థరాత్రి ఒక ఆడకూతుర్ని వేధించేందుకు సరిపడా దుర్భాషా సాహిత్యాన్ని సృష్టిస్తోన్న నేతా గణాన్నా?

రాజకీయాల్లో నీతి.. మర్యాదలు అంతరించిపోతున్నాయని వూరికే  దురపిల్లే  ఆదర్శవాదులు.. దుర్భాషా సాహిత్య ప్రయోజనాన్నికూడా గుర్తించాల్సి అవసరం ఉందన్నదే ఈ కథ నీతి!

-కర్లపాలెం హనుమంతరావు


(తెలుగిల్లు- అంతర్జాల పత్రిక ప్రచురితం)


Thursday, October 7, 2021

అనువాద కవిత: అనేకుల కది! - రవీంద్రనాథ్ ఠాగోర్-తెనుగు సేత : శ్రీ విద్వాన్ విశ్వం సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 


క్రొవ్విరులను గూర్చిన 

నీ మువ్వపు  మాలికను

కంఠమందు వైతువా 

పువ్వుంబోణీ!    అయినచో  


క్రొవ్విరులను గూర్చిన 

నీ మువ్వపు  మాలికను

కంఠమందు వైతువా 

పువ్వుంబోణీ!    అయినచో 

ని వ్విరి సరమునకు 

బదులు నే నేమిత్తున్ ? 


నే గట్టిన తో మాలను 

నీ కొక్కర్తుక కె 

యొసగ నెట్లు పొసగు? 

నో రాకా  హిమకర వదన! 

అనేకుల కిది

వారి నెల్ల నెటు వర్జింతున్ ? 


ఉన్నారు భావుకులు : 

మన కన్నుల కగపడని 

చోట్ల గలవారెవరో 

ఉన్నారు; కవుల పాట 

సన్నిహితులు ఉన్నవారు 

చాలమందియె

ఇందరికై ఈ మాలిక 

నందమ్ములు జిలుక కట్టినాడ

గావునన్‌; 

కుందరసమదన ! 

నీకే చెందించుట 

నెట్లు పడును? 

చెప్పుము నీవే. 


నీ యడదకు   

నా  యడద నుపాయనముగ 

నడుగు  సమయ మది 

గతియించెన్; 

తోయజ నయనా 

ఎపుడో పోయిన దా   

కాలమెల్ల  గతియించెన్ 

పూర్వగాథయై.


పరిమళమంతయు 

లోపలి యరలోనె 

దాచు కొన్నయట్టి

మొగ్గతో సరియై , 

నా జీవిత - 

మొక పరియై యుండెను-  

పోయె నట్టి ప్రాప్తము 

పడతీ!  


ఉండిన తావిని 

దిక్కుల నిండా 

వెదజల్లి వేసి

నే  నుంటిని; 

ఏ పండితు డెరుగును 

పోయినదండి వలపు 

మరల చేర్చి, దాచు 

మంత్రమున్ . 

సారస నయనా 

నీ హృన్నీ రేజాతమ్ము 

నొకరి నెయ్యమునుకే

ధారాదత్తము సేయగ నేర! 

ననేకులకు 

దాని నియ్యగ వలయున్ . 

- బెంగాలీ - రవీంద్రుడు 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

07 - 10 - 2021 

బోథెల్ ; యూ. ఎస్. ఎ

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...