Saturday, December 4, 2021

ఈనాడు - గల్పిక ఎవరు గొప్ప? కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- 24 - 04 - 2009

 



ఈనాడు - గల్పిక

ఎవరు గొప్ప? 

కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- 24 - 04 - 2009 


ప్రచారాలు ముగిశాయి. ఎన్నికలు పూర్త య్యాయి. 


ఊరూవాడా తిరిగి తిరిగి అలిసిపో యిన నేత పడకమీద పడి కలత నిద్రలో ఉన్నాడు. 


అలవాటుగా అవయవాలన్నీ సభ పెట్టాయి. 


' మేం లేకపోతే గురుగారికి గుర్తింపే లేదు. ఎవరెన్ని రథయాత్రలు చేసి రాష్ట్రం మొత్తం టముకులు కొట్టొచ్చినా పాదయాత్రతో వచ్చిన పేరు ముందు అవన్నీ బలా దూర్‌ . సారుకి మేమంటేనే ప్రేమ' అని వాదన మొదలు పెట్టాయి పాదాలు బడాయిగా. 


'హలో' అంతొద్దు! తమరొట్టి కాళ్లు గారే. మేం మోకాళ్లం. మీకన్నా ఒక మెట్టు పైనే ఉన్నామని గుర్తుపె టుకుంటే మంచిది. తిరిగింది తమరే అయినా అరిగింది మేమే అన్నా! అప్పుడే మా త్యాగాలను మరిచిపోతే ఎట్లా? బాసుకి మేమంటేనే భయం. కావాలంటే బోడిగుండు నడ గండి!' అంది మోకాలు . 


నుదురు కిసుక్కుమని నవ్వింది, ' మోకాలికి బోడిగుండుకీ లంకె అంటే ఇదే' అంటూ.


బుర్రకు ఉక్రోషమొచ్చింది. 'బోడి... బోడిగుండని ఊరికే తీసి పారేయద్దు. అందరి నాయకుల బుర్రలూ ఒకేలా ఉంటాయి... టోపీలే తేడా, తెలుసా?'


చప్పట్లు కొట్టి అన్నాయి చేతులు- 'గ్రేట్! గుండు బ్రహ్మాండంగా చెప్పిందిగానీ, అందరూ ఒకటి గుర్తుంచు కోండి! దండం పెట్టాలన్నా, అభయహస్తం చూపెట్టాలన్నా, నెత్తిమీద చెయ్యి పెట్టాలన్నా గురూగారికి కావా ల్సింది మేమే. అందుకే హస్తాన్ని పార్టీ గుర్తుగా కూడా పెట్టుకున్నారు. అర్ధమయిందా మా లెవెలూ బాబులూ !'


వేళ్లకు పొడుచుకొచ్చింది 'బాబు బాబు అంటూ డాబు కొడుతున్నావు.  మీ బాబుగారు అస్తమానం హస్తాన్ని గాల్లోకి ఊపుతూ మా వేళ్లనే చూపిస్తుంటారు! విజయా నికీ, ఉత్సాహానికి మా రెండు వేళ్లే కొండగుర్తు... తెలిసిందా?


' ఆ వేళ్లకు గోళ్లు లేకపోతే టోపీలేని నెహ్రూగారిలాగా ఎవరూ గుర్తు పట్టలేరు' అంటూ గోరు ముక్తాయించింది. 


' వేలెడంత లేరు. గోరుగారు కూడా మాట్లాడేవారే! అవునులే.. ఎన్నికల కాలం గదా! ... ఆమాత్రం గోరోజనం లేకపోతే జనాల్లో గుర్తింపొచ్చేదెలా?' అని నోరు నవ్వింది.


'గోరు గోరని  అలా తీసి పారెయ్యద్దు... రేప్పొద్దున్న ఓడినవాడు గిల్లుకుంటూ కూర్చోవాల్సింది గోళ్లనే కదా!' అంది నొసలు ఎద్దేవాగా. 


కడుపుకి మండింది. 'మీకసలు బుద్ధుందా? బకాసురుడిలాగా నేనిక్కడొక పెద్దదాన్ని పడున్నానని ఎవరికైనా గుర్తుందా? మనస్వాములు భూములు, గనులు, ప్రాజె క్టులు, ఎయిరుపోర్టులూ, కేరిడార్లూ, కంపెనీలూ అంటూ ఎక్కడెక్కడి సొమ్మునూ గుటకాయస్వాహా చేస్తుంటే చోటు పట్టకున్నా .. నా లోపల భద్రంగా దాచుకొస్తున్నానా! నన్ను పట్టించుకోనంటే ఎలానర్రా! రాజాగారికి ఎలాగైనా నేనంటే ప్రియం... భయం. ముందాసంగతి తెలుసు కోండి!'


'కడుపా! మరీ అంత చించుకోకు... కాళ్ళమీద పడి

పోగలవు' అంది గుండెకాయ.


'నీ అవస్థ చూస్తుంటే నిజంగానే గుండె

తరుక్కుపోయే ట్టుందన్నయ్యా! నిరాహారదీక్ష వేళ కూడా నీకూ నాకూ క్షణం విరామం దొరకదాయె' అంది నోరు అరిగిపోయిన గొంతుతో. 


'నేనున్నవాడికే రాజ్యం, సభలో . బైట కూడా  సారుగారు నన్ను పెట్టుకునే బతుకున్నారు. అదీ నా గొప్పతనం అధ్యక్షా! ఒప్పుకొని తీరాలెవరైనా' అంది నోరు. 


'మహా గొప్ప' అని గొణుక్కుంది నాలుక. 


'ఎవరా సణిగేది?' అంది చెవి. 


' గర్జనల దెబ్బకు నీకు దిబ్బెళ్లు పడ్డట్టున్నాయిగా! ... నేనేలే నాలుకని అంది నాలుక. 

' అదే.. ఏ నాలుకని? '


' సెటైరా? మేమింతమంది నాయికలం  ఉండబట్టే సాబు పొద్దున చెప్పింది. . సాయంకాలానికల్లా  చెప్పలేదని తప్పించుకోగలుగుతున్నారమ్మా! రాజకీయాలలో  ఒకే నాలికంటే తేలికయిపోతా రెవరైనా! కావాలంటే ఇదిగో.. మన మెదడు గారి నడిగి చూడరాదా! '


' మెదడా? అదెక్కడుంది?.. అహ.. తలలో కనబడకపోతేనూ.. లేదనుకున్నామే! | అన్నాయి రెండు కళ్లూ. 


' లేకుండా పోవటానికి అదేమన్నా సిగ్గా... శరమా? మోకాలు దగ్గరికి షికారుకెళ్ళినట్లుంది పాపం' అంది ముక్కు ఎకసెక్కంగా. 


'ముక్కా' మరీ అంత సూటిపోటీలొద్దమ్మా! కాస్త మూసుకొంటేనే నీకూ బాసుకూ మంచిది' అన్నాయి కళ్లు. 


' ఈ ఎన్నికలైన తరువాత అది చేసే పని ఎలాగూ ఆదే గానీ"  ముందు నీ సంగతి చూసుకొంటే మంచిది. . నెత్తికెక్కి కూర్చున్నావు ' అంది నోరు. 


'ఎక్కడుంటే ఏంటిలే! మాలో  ఇన్ని నీళ్లు గిర్రున తిరిగితే చాలు. .  ఎక్కడికక్కడ సానుభూతి వచ్చి పడుతుంది. వద్దనుకున్న వాళ్లే టికెట్లిచ్చిపోవాలి... వరసలో నిలబడి మరీ జనం ఓట్లేసి పోవాలి .  చూపుతోనే కాల్చేసే పవరు బ్రదర్సూ  మా కళ్లదీ! అందుకే మన బాసుకి మామీదే అందరికన్నా ప్రేమ అదుర్సు'


తొడలు అదిరిపడి లేచాయి. 

మీసాలు రోషంగా ముందుకు దూకాయి. 


బాసు పడుకున్న పడక మొత్తం టికెట్టిచ్చే ముందు పార్టీ కార్యాలయం మాదిరి గడబిడగా తయారైంది .' మేము గొప్పంటే ... మేం గొప్ప ...  బాసుకు మేమంటేనే  అందరికన్నా ఎక్కువ ఇష్టం. మేమంటేనే సారుకు అందరికన్నా ఎక్కువ భయం కూడా! '  అంటూ  చట్టసభ తరహాలో రభస మొదలుపెట్టాయ్. 


ఆ గలభాకి  నేత లేవనే లేచాడు.


అవయవాల గోల ఓపికగా  విన్నాడు. 


చివరకి నిదానంగా పెదాలమీదకు  అదోరకమైన అలవాటు నవ్వును అలవోకగా  పులుముకొని అన్నాడూ  . . 'ఇంకా నయం. కార్యకర్తలంటే నాయకుడికి భయమెందుకూ ? నయానో, భయానో ఎవరినైనా దారికి తెచ్చుకునే శక్తి లీడర్ సాంతం .  కలర్ టీవీ ఇస్తే కళ్లు లొంగిపోతాయి. సెల్ ఫోన్‌ బహుమతిస్తే  చెవులు పొంగిపోతాయి. మందుబాటిలిస్తే నోరు మూతబడిపోతుంది. వెయ్యి   నోటు చూపిస్తే కడుపు చల్లబడిపోతుంది. ఇదిగో..  దేనికీ లొంగనిది .. ఓటరుగాడి  మనస్సులో దాక్కుని ఉండేది ఈ  అంతరాత్మే. అదిగానీ నిద్రి లేచిందా... మా బోటి నాయకుల పని గోవిందా! సో అంతరాత్మే పాలిటిక్సులో అందరికన్నూ ది మోస్ట్ పవర్ ఫుల్ ! 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- 24 - 04 - 2009 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం శరభ శరభ - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక - 02-03-2004 - ప్రచురితం )

 




ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

శరభ శరభ 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక - 02-03-2004 - ప్రచురితం ) 


దేవుళ్ళూ దేవుళ్ళూ అని ఊరికే లెంపలు వాయించుకుంటాంగానీ... ఒక్కోసారి వీళ్లూ మామూలు మనుషులకన్నా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు బాబాయ్! 


పండుగపూట ఈ దైవదూషణ ఏంటిరా బాబూ, ఉన్న కష్టాలు చాలకనా- ఇంతకీ నీ ఫిర్యాదు ఏమిటి?


శివుడూ అల్లుడేగదా! యజ్ఞం చేసుకునే ఆ దక్షుడు అందర్నీ పిలిచి సొంతబిడ్డను పిలవకపోవడమేమిటి? పిలవని పేరంటానికి సతీదేవి పోవడమేంటి? ఆ తరవాత అందరికీ ముక్కుమీద కోపాలేమిటి? నిరాకారులూ నిరంజనులూ అని పొగిడించుకునేవాళ్లూ ఇలా పంతాలకు, పట్టింపులకూపోయి దాడులకు ఎదురుదాడు లకూ దిగితే ఇక వాళ్ళు మనకన్నా దేనిలో మిన్న?  మామూలు వాళ్ళకు ఎవరు రక్షణ? 


నిజమేరా నాయనా! ఈ మధ్యనే ఎక్కడో విన్నాను. కర్నూలు జిల్లా నెరుకుప్పలనే ఊళ్ళో కాళమ్మ అనే దేవత వెలసిందట. ఆమె వీరభ ద్రస్వామిని ప్రేమించి పెళ్ళిచేసుకోమని వెంటబడితే, ఆ మహానుభావుడు ఏ కళనున్నాడో- కుదరదు పొమ్మన్నాడట! ఈవిడగారు ఉక్రోషంతో పిడకలు విసిరిందట. దాన్ని వేడుకగా అక్కడ ప్రతి ఏడాదీ భక్తులు జరుపుకొంటున్నారు?


అంటే బురద జల్లుకోవడమూ ఇవాళ కొత్తగా మనం కనిపెట్టిన విద్య కాదని తేలి నట్లేగా! 


ఏవీ ఎప్పుడూ కొత్తగా పుట్టుకురావురా నాయనా! అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయి.... అని ఊరికే అన్నారా! శివరాత్రి పేరు చెప్పుకొని మనం ఇప్పుడు చేసుకునే ఉపవాసాలూ, జాగారణలు మాత్రం మనకు కొత్తవా! 


అవును బాబాయ్! కిలో యాభై పెట్టినా కందిపప్పు మంచిరకం దొరకడంలేదు. బియ్యం ఓ మాదిరివి కొనా లన్నా పాతిక కక్కక తప్పడంలేదు. పేరుకేదో కంచం ముందు కూర్చుని లేస్తున్నాంగానీ, రోజూ చాలామంది చేస్తున్నది ఉపవాసాలే.


జాగారం సంగతి చెప్పు. కరెంటు కోతలతో కంటిమీద కునుకు ఉండటంలేదు. నగరం నడిబొడ్డున జరిగే దొంగ తనాల గురించి వింటుంటే ఇక కళ్ళేం మూతపడతాయి! అదిసరే, ఎప్పుడూ లేనిది నువ్వు ఈసారి ఉపవాసాలు, జాగారాల బాట పట్టావేంటి?


మన ప్రణబ్ దాదా  ఏమన్నా బోళాశంకరుడి బాపతా! ఇన్ని నీళ్ళు చిలకరించి, చిటికెడు బూడిద పూస్తే ఉబ్బి పోయి కల్పవృక్షాన్ని మన పెరట్లో పాతేసి, కామధేనువును దానికి కట్టేసి పోవడానికి! 


మరి, ఆ నల్లధనం కూడేసిన దొంగదొరల మీద మూడోకన్ను తెరిచి బూడిద చేయమని కోరుకొంటున్నావా ఏంటీ? ... అవన్నీ మీడియా వాళ్ళు సంచలనాలకోసం పడే తంటాలు . ఏ గొడవలూ లేకుండా కనీసం ఏ నెల జీతం ఆ నెల అయిదో తారీకులోపలో  వస్తే చాలు. సిద్ధి, బుద్ధి శివుడి కోడళ్లట గదా! వాళ్ళిద్దర్నీ పంపి మన పెద్దమనుషుల బుర్రల్ని శుద్ధి చేయించమని వేడుకోవాలని అనుకుంటున్నా. 


స్వామి సర్వాంతర్యామి.  అయినా ఆ టూజీ అయ స్కాంత తరంగాల కుంభకోణాలను ఆపగలిగాడా? ఎంత పంచభూతాల్లోకి చొచ్చుకు వెళ్ళే చొరవ ఉన్నా- మన పెద్ద మనుషుల మనసుల్లోకి జొరబడే శక్తి లేదనుకుంటా!


నిజమే బాబాయ్ ! పెద్దకొడుకు వాహనం, తన మెడ లోని ఆభరణం, సొంత వాహనం, భార్య ఎక్కి తిరిగే పెద్దపులి, రెండోవాడి నెమలి... వేటికీ ఒకటంటే మరోదా నికి ఏమాత్రం పొసగదు . అయినా అందర్నీ కలిపి ఉంచి, అంత హాయిగా సంసారం చేసే మహానుభావుడు- ఆ మంత్రమేదో మనవాళ్ళ చెవుల్లో కూడా ఊడిపోవచ్చుగా... అందరం సుఖపడిపోతాం గదా!'


'చెవుల్లో ఊదడానికి ఆయనేమన్నా మనం పెట్టుకున్న సలహాదారుడా! మనమే అన్నీ చూసి నేర్చు కోవాలిగానీ, జగదీశ్వరి ప్రేమించి పెళ్ళిచేసు కోమని అడిగితే ' నా ఇల్లు శ్మశానం. వృత్తి భిక్షాటన, కట్టుకోవడానికి పట్టుపీతాంబరాలు గట్రా  లేవు' అంటూ నిజం చెప్పుకొన్న తిక్కశంకరయ్య ఆయన.  ఆ నిజాయతీలో ఒక్క శాతమైనా మన నాయకులకు ఉండిఉంటే- ఎన్నికల ముందూ తరవాతా ఇన్నిన్ని హామీలు, నివేదికలు, ప్రాజెక్టులు, ప్రణాళికలంటూ జనాలను అయోమయంలో పడేసేవారా?


అవును బాబాయ్! తమ్మిపూలూ, ఆకులురాలే శిశిర రుతువూ, చలీ, మంచూ కలిసిన తెల్లారుఝాము, చిమ్మచీ కటి నిండిన కృష్ణ చతుర్దశి తిథి, భస్మం, రుద్రాక్షలు, పుర్రె, ఏనుగుతోలు లాంటి వస్తువులను తాను ఉంచుకుని... మల్లెలు, వసంత రుతువు, నిండుపున్నమి. మంచి గంధం, నవరత్నాలు, చీనిచీనాంబరాలు వంటి మంచి వస్తువులను అన్నింటినీ మనకు వదిలేసిన తండ్రి ఆయన. మరి మనం ఎన్నుకున్న నేతలో? అందుకు పూర్తిగా విరుద్ధం. ఇన్ని చేసినా ఏ ఆర్భాటాన్ని కోరుకోని మహానుభావుడు ఇన్ని నీళ్లతో అభి షేకం చేస్తేచాలు- పొంగిపోయి అష్టశ్వర్యాలను ప్రసాదిస్తాడంటారు. ఏమిచేయకపోయినా నోట్లకట్టలతో దండలు వేయించుకునేందుకు, దారికి అడ్డంగా విగ్రహాలు పెట్టించుకునేందుకు తయారవుతున్నారు మన నేతలు!


అవును, అమ్మ వాక్కు అయితే ఆయన అర్ధం అంటారు. మరి అర్థంపర్థంలేని పిచ్చి మాటలతో నేతలు మన చెవులకు తూట్లు పొడిచేస్తున్నారు. మనమీద కనికరం ఉంటే ముందు  వాళ్ళకు వాకుృద్ధి కలిగించకూడదా!


అర్ధాంగికి శరీరంలో సగభాగం ఇచ్చి గౌరవించిన గౌరీ పతి ఆయన. చట్టసభలో సాటి స్త్రీలకు మూడోవంతు ఇవ్వడానికి మీనమేషాలు లెక్క పెట్టే ఈ నాయకులకు సద్బుద్ది కలిగించాలి. 


బద్ధకస్తులను, పశువులను, మచ్చపడినవాళ్ళను రెండు నాలుకలవాళ్ళను. ఆ మహానుభావుడు మంచి దృష్టితో చేరదీస్తే, మన మహానాయకులు సొంత లాభంకోసం చేరదీస్తున్నారు. అదే మన దౌర్భాగ్యం. 


చీమల్లాంటివాళ్లం. మనం చేయగలిగింది ఏముంది?


 కుట్టడానికి ఆజ్ఞ ఇవ్వమని వేడుకొందాం. అవకాశం వచ్చినప్పుడు కుట్టిపారేద్దాం!


కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక - 02-03-2004 - ప్రచురితం ) 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం ప్రజలతో పనేంటి? రచన: కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- 16/09/2009 ) ప్రచురణ )

 



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

ప్రజలతో పనేంటి? 


రచన: కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 16/09/2009 ) ప్రచురణ ) 


"పెళ్ళినాడు విడిదింటికి పంపిన ఉప్మా వేడిగా లేదని, జీడి పప్పు దండిగా పడలేదనీ పెళ్ళానికి ఇన్నాళ్ళకు విడాకులిస్తానంటున్నాడు  మా తోడల్లుడి అల్లుడు!''


'పెళ్ళయి మూడేళ్ళయింది. ఇప్పుడా ఆ పట్టింపులు! " 


' ఎప్పుడోపోయిన జిన్నాను ఇప్పుడు మంచివాడన్నాడని జెస్వంత సింగు ను  'ఛీ .. పో' అనలేదా భాజపా? ' 


' అదేరా నేననేది!  పెద్దవాటిమీద చిన్నచూపూ, చిన్న చిన్న వాటిమీద పెద్ద చూపూ!  చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికీ ఇలా బాగా అలవాటైపోతుందేమిటా అనే నా బాధ! కోట్లు ఖరీదు చేసే దేవుళ్ళ సొమ్ములు మాయమైపోతున్నాయి. అవేమై పోతున్నాయో చూడండి మహాప్రభో... అన్నా నిన్నటిదాకా పట్టించుకున్న నాథుడే లేడు. వరదనీరు మనదాకా రాకుండా పొరుగు రాష్ట్రాలు ఆనకట్టలు వరసగా కట్టేసుకుపోతుంటే మనవాళ్ళకు చీమకుట్టినట్లయినా లేకపాయె ! మొన్నటికి మొన్న పైవాళ్ళు ఏదో మూడు నాలుగు ముష్టి రాళ్ళు మన మొహాన విసిరేస్తే  ముప్పైమూడు మంది ఎంపీలున్నా ఇదేంటని గట్టిగా నిలబడి అడిగినవాడు లేడు! పెద్ద పెద్ద విషయాలేవీ మనకు పట్టవు . ఎప్పటి పింగళి వెంకయ్య... ఇప్పుడా తపాలాబిళ్ళ విడు దలయ్యేది! ఎంత పురాతనమైనదీ మన కమ్మటి తెలుగు భాష ! ప్రాచీన హోదా రావడానికి ఇన్ని ఆపసోపాలా?....


'మన జనాలు కూడా అలాగే ఉన్నారులే అన్నా! పొగతాగడం ఆరో గ్యానికి హానికరమని పెట్టె మీదుంటే పట్టించుకుంటున్నారా! ముందు సీటుపై కాలు పెట్టరాదని రాసుందని సినిమాహాల్లో ఎవడైనా ముడుచుకు కూర్చుంటున్నాడా? శిరస్త్రాణం పెట్టుకుంటే శిరోవేదన, సీటు బెల్టు పెట్టుకుంటే కడుపునొప్పి, నిదానంగా పోకపోతే ఎదుటివాడికన్నా ముందు మనమే పైకిపోయేదని పోలీసులెంత మొత్తుకున్నా పట్టించు కుంటున్నామా! ఎడమకు నడవమంటే కుడికి నడుస్తాం. ఆసుపత్రి పరి ధిలోనన్నా హారను మోగించరాదన్న ఇంగితం ముందు మనకే ఉండదు. అంబులెన్సుకైనా  దారివ్వటం నామోషీ  మనకు! ' 


' దుష్యంతుడు శకుంతలను పట్టించుకోలేదు. వాళ్ళకు పుట్టిన భరతుడి వారసులమే గదా మనం ! ' 


' పట్టించుకోక పోవడమనేది అందుకే మనకు రాజకీయాల్లాగా, వ్యాపారా ల్లాగా, సినిమా అవకాశాల్లాగా వారసత్వంగా వచ్చినట్లుందన్నా! ' 


' మనకేకాదు- మన దేవుళ్ళకీ ఈ బలహీనత ఉన్నట్లుంది. భృగు మహర్షిని బ్రహ్మరుద్రాదులు పట్టించుకోకపోబట్టేగదా శాపాల పాలయ్యారు! విదురుడి నీతులు ధృతరాష్ట్రుడు పట్టించుకున్నాడా? స్వతంత్రమొచ్చిన తరువాత జాతిపిత మాటలనే మననేతలు పట్టించుకున్న పాపానపోలేదు.' 


' పిల్లకాయలు పెద్దవాళ్ళను, శిష్యులు గురువుల్ని, పెళ్ళాలు మొగుళ్ళను పట్టిం చుకునే కాలం పోయిందన్నా! సినిమాలు విలువల్ని, బస్సులు ప్రయాణికుల్ని, వ్యాపారులు బ్యాంకులను ..  ఖాతాదారుల్ని, పోలీసులు నేరగాళ్ళను పట్టించుకుంటూ కూర్చుంటే కుదిరేపని కాదని అనుకునే కాలమొచ్చింది. 


జనానికి పర్యావరణాన్ని, పాఠ్యపుస్తకాలకు అచ్చుతప్పుల్నీ, ప్రభుత్వానికి కరవునీ పట్టించుకోవటం తప్ప వేరే పనేమీ లేదా? 


అంవర్గ  ఇంత చిన్న విషయాల్ని పట్టించుకుంటే ఏం బావుంటుంది చెప్పు!

అని అడిగితే మరి నీ దగ్గర సమాధానముందా, ముందది చెప్పన్నా!' 


వేళాకోళానికి  వేళా పాళా లేదా ? ... ఇంతకూ నువ్వనేది ఏందిరా? ?


'కంది ధర వంద దాటింది. బంగాళ దుంపలూ బరువెక్కుతున్నాయి. పెట్రోలు ధర ఏ పూట ఎంతుంటుందో ఆ పుట్టించినవాడికైనా తెలీటం లేదు. కరెంటు కోతలు తప్పటం లేదు. రోజు మార్చి రోజైనా నీళ్ళు రావటం లేదు. ఆడపిల్లలు యాసిడ్ దాడులకు, తల్లిదండ్రులు పిల్లల చదువు ఫీజుల దెబ్బలకు కుదేలవుతున్నారు. వానలు లేక కరవులు . చినుకుపడితే రోడ్లు చెరువులు.  సన్న బియ్యం దొరకవు. ప్రతిభ ఉన్నా మంచి కళాశాలలో సీట్లు దొరకవు..' 


సరేరా .. ఎప్పుడూ ఉండే సోదేకదా ఇదీ! మన మెదళ్ళు ప్రభుత్వ కార్యా

లయాల్లోని సలహాలపెట్టెల్లాగా, భవన సముదాయాల్లోని నిప్పునార్చే యంత్రాల మాదిరి అలంకారప్రాయాలుగా మారాయనేగా నీ ఫిర్యాదు ? ఆస్కార్ వాళ్ళు మన సినిమాల్ని పట్టించుకోవడంలేదనీ, ఎంసీయే సీట్లు ఎవళ్ళకి అక్కర్లే కుండా పోయాయనీ, ఒలింపిక్స్ లో మనకు పతకాలు రాక పోతున్నా ఆటగాళ్ళకేమీ పట్టటంలేదనీ, చంద్రయానం విఫ లమైనా శాస్త్రవేత్తలు పెద్దగా బాధపడటంలేదనీ, తెలుగు యాంకర్లు వత్తులు పట్టించుకోవడం ఇంకా మొదలు పెట్టలేదనీ, విదేశాలలో  మన పిల్లలలా బాధలుపడుతున్నా ఎవరికీ చీమ కుట్టినట్లన్నా  లేకుండా పోయిందనీ, క్రికెట్ని తప్ప మరో ఆట మనవాళ్ళు ఆడటంలేదనీ, సినిమా పాటల్లో సాహిత్యాన్నేమీ పట్టించుకోకుండా సంగీతం మింగేస్తోందనీ, వంకాయల్లో పుచ్చులు ఎక్కువగా వచ్చేస్తున్నాయనీ, టీవీలో వంకర నృత్యాలెక్కువ వచ్చాయని, ఓజోన్ పొర చిరిగి ఒళ్ళు మండే ఎండలు విపరీతంగా కాస్తున్నాయనీ, వేతనాల సమీక్షా సంఘమింకా నివేదిక ఇవ్వలేదనీ... కవులూ, విలే కరూ, ఆడవాళ్ళూ, పిల్లకాయలూ తప్ప ఎవరూ ఎవర్నీ ఏమీ అసలు పట్టించుకోడంలేదనీ... పట్టించుకునేటట్లుగా కూడా లేరనీ, ఇలాంటివేగా నీవనబోయేది? '


' కాదు. ఒకవంక మహమ్మారి మాయదారి స్వైన్ఫ్లూ, డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక జబ్బులు ముంచుకొచ్చి రోజు కొకరో ఇద్దరో పిట్టల్లా రాలిపోవటం మొదలై పదిరోజులు పైనే అయినా... మూడు నెలలకు ముందే ప్రమాద సంకేతాలు అందటం మొదలైనా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి పట్టం ఎవరి కెప్పుడు ఎలా కట్టబెట్టబోతున్నారోననేది మరీ ముఖ్యమైనట్టు మంత్రులూ సామం తులూ మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఆందోళనపడిపోతున్నారే! ' 


'అందుకే నేననేది... పెద్దవాటి మీద చిన్న చూపు. చిన్నవాటి మీద పెద్ద చూపూ చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికీ అలవాటైపో యిందని.' 


'అయితే, ఆ తప్పంతా నీదేనన్నా! గతంలో నువ్వు గెలిపించినవాడు అయిదేళ్ళపాటు నిన్నేమీ పట్టించుకోకపోయినా.. మళ్ళీ ఓటడగటానికి నీ గడపదాకా వచ్చినప్పుడు నువ్వదేమన్నా పట్టించుకున్నావా? నువ్వు పట్టించుకుంటేనే ఎవరైనా నిన్ను పట్టించుకునేది. అది ప్రజాస్వామ్య సూత్రం. అదిగో వదిన ఎందుకో అరుస్తూ వస్తుంది... ముందది చూడన్నా!'


'ఏందయ్యో! ప్రాణం బాగాలేదు, ఆసుపత్రికెళ్ళాద్దామన్నా పట్టించుకోకుండా ఈడ ముచ్చట్లు పెట్టుకుని కూకున్నావా ! పద! పద!' అంటూ పరుగులాగా నడి చొచ్చింది ఆ వదినమ్మ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 16/09/2009 ) ప్రచురణ ) 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం తెల్లని కాకులు - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 14-09-2002 - ప్రచురితం )

 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

తెల్లని కాకులు 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 14-09-2002 - ప్రచురితం ) 


మేటర్  చీపుగానే వున్నా.. పేపర్ కాస్ట్ లీ  గానే వుందీ...!' అన్నాడు వెంకట్రావు వెటకారంగా. 


చదువుతున్న ఆర్టిక చటుక్కున పక్కన పారేసి 'ఈ తెల్లకాకుల థీరీ ఏంటిగురూ! కొత్తగా వుందీ!' అన్నాడు తెల్లబోయి చూస్తూ.


వైటెలిఫెంట్సంటూ వున్నప్పుడు... వైట్ క్రోస్ మాత్రమెందుకుండ కూడదూ ? అని నా పాయింట్.


వైటెలిఫెంటంటే ఐరావతమని అర్థం. ఫ్యూరల్లో వాడితే ఏదో గవర్నమెంటెంప్లాయీస్ లాంటివాళ్లని సరిపెట్టుకోవచ్చు. అల్లుని మంచితనంబు... తెల్లని కాకుల్లాం టివి లేనేలేవని కదా సుమతీ శతక్కారుడు పదమూడో శతాబ్దం నుండీ మొత్తుకొంటున్నాడు!'


'అల్లుని మంచితనాన్ని గురించి బద్దెనగా రికి అంత పెద్దనుభవం లేక అలా అని ఉండొచ్చేమోగానీ మొన్నటిదాకా మంత్రిగా చేసిన మామగారొకాయన 'మా అల్లుడు బంగారం' అనేశాడే ఆ మధ్యన ! ... అదేదో కాగి తాలు... కార్బన్ పేపర్ల కుంభకోణం గొడవల్లో. 


'రాజకీయాలను పరమపవిత్రంగా ఎంచే మహామంచి ప్రజాప్రతినిధిగారు ఒక ఆ వంక మామల్ను కిడ్నాపులు చేసే అల్లుళ్లున్న గడ్డుకాలంలో కూడా 'మా అల్లుడు దేవుడు' అని ఊరికే ఎందుకంటాడూ!'


'ముడుపులంటే ఇష్టపడతాడు కనక అల్లు డినలా కనపడే దేవుడని పొగిడుండొచ్చు కదా!


' కాదు. స్టేషనరీ స్కాము టైములో సనిన్లా అసలు స్టేషన్లోనే లేడని కదా ఆయన వాదన..  వేదన. నిజానికి, తనల్లుడు నోట్లో వేలు పెడితేనే కొరికేంత అమాయకుడని ఆయన భావన. తాను మారువేషాల్లో ఇసక లారీలను మసకచీకట్లో పట్టుకోవటం లాంటివి గిట్టని వాళ్లెవళ్లో కుట్ర పన్నుంటారని అంటున్నారాయన. గాంధీగారు కలలు కన్న పంచాయతీ రాజ్యంలో ఇంత పంచా యతీ జరుగుతుంటే దోషుల్ని పట్టుకోటం తన విధి కనక, ప్రజాప్రతినిధికి ప్రతినిధిగా అల్లుడుగారధికారులను తనదైన శైలిలో బుజ్జ గించే ప్రయత్నంలో... వాళ్ల పెళ్లాల మెళ్ల లోని తాళిబొట్ల నొక్కసారి గుర్తుచేయటం తప్పా!... పెద్ద పెద్ద అధికారులందరూ క్యూలో నిలబడి తమ తప్పుల్ని పేపర్లమీద కూడా ఒప్పుకొనేట్లు చేసిన తనజామాత భూమాతంత సహనశీలుడనీ, న్యాయవిచారణలో. .  నిజానికి ఎలుగుబంటి వంటి వాడని ఆయననేకసార్లు కితాబిచ్చారు కూడా!' 


'అదేంటీ' ... అల్లుడుగారినలా ఏకంగా భల్లూకంతో పోల్చేశాడాయన? ' 


'ఎలుగుబంటి ఒంటి కంటితో నిద్రపోతుంది కదా! ఎంత ఆదమరిచివున్నా ఎదుటి వాళ్ల మీద ఓ కన్నేసి వుంచేవాళ్లను ఎలుగు బంటితోనే పోల్చాడు శ్రీకృష్ణదేవరాయలు... తన ఆముక్తమాల్యదనే కావ్యంలో. అయి దొందలేళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్ లో జర గబోయే ఈ కాగితాల, కవర్ల  కుంభకోణాన్ని ముందే ఊహించి చక్కని కధలా  కూడా చెప్పుకొచ్చాడాయన... 

ఆ శూలపృధువణి న్యాయాన్ని చెప్పమంటారా? ' 


' కతలు  చెప్పటం నీకలవాటేగా... కానీయ్! ' 


'అనగనగా ఒక అవకతవకల రాజ్యం. దానిలో తెలివితక్కువ రాజు. అతాగానికో  అతి తెలివి మంత్రి.  రటమతం సేనాపతి.... మందమతి భటవర్గం! 


ఓసారి జోరున కురిసిన్  వానలో ఇంటి కన్నం వేయటానికి చూరుకింద చేరిన దొంగమీద మట్టిగోడపడి బాగా గాయాలయ్యాయి. 


దోషిని శిక్షించాలని రాజుగారి దగ్గర మొరపెట్టుకున్నాడు దొంగగారు. 


' ఇంటి యజమానిని వెంటనే ఉరితీయండ' ని  ఉరిమాడా ధర్మప్రభువు. 


' నేరం నాది కాదు మహాప్రభో! జోరున కురిసే వానదికదా!' అని అతగాడు వేడుకోగా 'అదీ నిజమే... అయితే వాననే ఉరితీస్తేపోలా!' అనుకొని తన తీర్పు నప్పటికప్పుడు సవరించేసుకున్నారు రాజు గారు


 'వానిప్పుడు లేదుకనక... మేఘాన్నైనా ఉరితీయొచ్చ'ని మరింత సవరణ చేయిం చారు మంత్రిగారు. 


మేఘం ఆఘమేఘాలమీ దొచ్చి 'కుండలు ఆవం పెట్టిన పొగవల్లే కదా వానకురిసిందీ! కనక... పొగ పొగరే అణచా లని' ప్రాధేయపడితే పొగనెలాగూ ఉరితీయ లేము కనక... పొగబెట్టిన కుమ్మరిని పట్టుకు రండ'ని సేనాపతిగారు సెలవిచ్చారు. 


'అయ్య వారింట్లో పెళ్ళికని అరవేణి కుండల ఆవం పెట్టాను. ఈ దారుణానికి కారణం పెళ్ళికొ డుకే కదా! ' అని కుమ్మరి వేడుకుంటే ఉదార బుద్ధిగల భటులు పాపమని కుమ్మరినొదిలేసి, పెళ్ళిపీటల మీదున్న పెళ్ళికొడుకును ఆర్భా టంగా ఈడ్చుకొచ్చారు. 


మోకు లావుగా ఉంది. పెళ్ళికొడుకు మెడ బక్కగా ఉంది. ఉరి జారిపోతుందేమోనని దారినపోయే ఒక లావుపాటి వ్యాపారిని పట్టుకొచ్చి తల తీసేసి ఒక పనయిందనిపించాడు తలారి. 


వ్యాపారి లంచం ఇస్తానన్నా సమయం మించిపో యింది . విషయం రాజుగారిదాకా పాకింది.  ఈసారికి మాత్రం ఉరితోనే సరిపె ట్టుకో ! అని వాపోయాడట, పాపం, తలారి! '


' తలారి వృత్తి ధర్మదృష్టి ఐదొందల సంవత్స రాల తరవాత కూడా ప్రభుత్వానికిలా స్ఫూర్తినివ్వటం ప్రశంసనీయమ'ని అనాలా.. వద్దా అని నేను సంశయిస్తుంటే


 'ఇంక నువ్వీ రాతలూ, కోతలూ కట్టిబెట్టి.. ఒక మైకు సెట్టు పెట్టుకుని , బాడుగ రిక్షాలో నాలుగు రోడ్లలో తిరుగుతూ, ఏ కూడల్లోనో నీ ఈ ఐడియాలు... అవీ వినిపించటం బెటరనిపి స్తుంది గురూ!' అనేశాడు. వెంకట్రావు.


ఆ మాటా నిజమే. షీటు ఐదు రూపా యలు! రెండు గుండు పిన్నులు రెండ్రూపా యలు!! అంటుకున్నా... అంటుకోకపోయినా ఈ గవర్నమెంటు గమ్ బాటిల్  నూటిరవై రూపాయలు!!! 


పంచాయతీరాజ్ అంతా పంచాయితీ అయిపోయింతరవాత మావీధి చివరి పుస్తకాలమ్ముకొనే వీరాస్వామి కూడా గవర్నమెంటు కొన్న రేటుకు తప్ప తక్కువకు అమ్మమంటున్నాడిప్పుడు!


'అందుకే మన ముఖ్యమంత్రిగారు పేపర్ లేని ఆఫీసులు కావాలని కలవరిస్తుంటారెప్పు డూ! ' 


'కంప్యూటర్ వ్యవహారాల్లో మాత్రం ఈ కంపు లేదంటావా? అంతా వైటెలిఫెంట్స్ మాయ సుమా! అందుకే... తెల్లేనుగులు న్నంత కాలమూ... తెల్లకాకులు కూడా ఉండాలని నా థియరీ! 


ఇంటి గుట్టు పట్టుకోవ టానికి... ఇలాంటి ఫీట్లు తప్పవని 

ఆముక్త మాల్యదలో కూడా రాయలువారు ఏమూలో ముక్తాయించుంటారు. ముఖ్యమంత్రిగారా ముక్కలు కాస్త చెవికెక్కించుకుని తెల్లని కాకుల్లాంటి మంచి అల్లుళ్లున్న పవిత్ర ప్రజా ప్రతినిధులకే మంత్రివర్గంలో చోటిస్తే... ఇదిగో... ఈ స్కాములు గట్రా బైటపడినప్పుడు... దోష నిర్ధారణలో ప్రభు త్వానికి శ్రమ బాగా తగ్గుతుందని నా అభిప్రాయం.


సుమతీ శతకం రాసినాయనకు ఇంత చిన్న సూత్రం ఎందుకు తట్టలేదు సుమా! ... తెల్లని కాకులే లేవనేశాడూ...!' అని ఆశ్చర్యపోయాడు వెంకట్రావు . 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 14-09-2002 - ప్రచురితం ) 



సూర్య - గల్పిక- హాస్యం- వ్యంగ్యం చిల్లర గోడు -కర్లపాలెం హనుమంతరావు ( సూర్య - కాలమ్ - 14 -09-2017 - ప్రచురణ )



సూర్య - గల్పిక- హాస్యం- వ్యంగ్యం 

చిల్లర గోడు


-కర్లపాలెం హనుమంతరావు

( సూర్య - కాలమ్ - 14 -09-2017 - ప్రచురణ ) 



బ్యాంకోళ్ల కన్నా బంకోళ్ెళ్ళే  బెటరబ్బీ! బిచ్చగాడిని చూస్తే చాలు. బిల్లర 'గాడ్' ను చూసినంతగా పొంగిపోతారు. 


యాచకులం. మాదేవన్నా  నీచకులవా? ఆ మాటకొస్తే ఈ జంబూద్వీపంలో జంపకానా పర్చుకుని అడుక్కోని జమీందారు ఒహడన్నా ఉన్నాడా?  అడుగడుక్కి ఓ అడుక్కునే డబ్బాగాడే! 


ఉద్యోగాలు అడుక్కుంటున్నారు. ఉపాధులు అడుక్కుంటు న్నారు. ' నిధుల మొర్రో'  అంటూ ముఖ్యమంత్రులే వేడుకొంటున్నారు. సర్కారాఫీసుల్లో గిట్టుబాటు పోస్టులకు  పెద్దమనుషల మాట కోసం బెగ్గింగు! జానా బెత్తుండడు. . బడి గుంటడూ  జాంపంఉండి   ఆడబిడ్డ  వెంటబడి 'ప్రేమ భిక్ష' అడుక్కుంటాడు! కేడీలకూ క్షమాభిక్షలే! రౌడీలకూ ప్రాణభిక్షలే! ఇహ రాజకీయాల్లోళ్ల కత చెప్పాల్నా!  కొత్త తప్పులకోసం ముందస్తు బెయిళ్లు అడిగేదొహడు !  రూపాయో... అర్థో ధర్మంగా అడుక్కునే అమాయకులం మేమొక్కళ్లం!  మాకూ ఎన్ని  అగచాట్లు? ఎండననకా , వాసనకా, చలికీ, మురిక్కీ , ముక్కీ మూలిగి, తినీ తినకా ఇంత మిగుల్చుకుంటున్నందుకా మా చిల్లర బిళ్లలమీ దింత కంటు బ్యాంకోళ్లక్కూడా! !


గొప్పోళ్లెంత ప్రమాదకరవో తెలిసి కాస్తంత కనికరించి కరచాలనం చేసేసినా చాలు.. 'హి. హి' అంటూ ఉహూ తెగ ఇచ్చకాలు పోతుంటారు బ్యాంకోళ్లు! వాళ్లు లోళ్లకు లోళ్లు కరెన్సీ నోట్లు గోతాల్లో కుక్కి తెచ్చి దొంగ లాకర్లు సంపేస్తుంటారని కాబోలు! ఆ డేరా బాబాగాడు ఎంత డేంజరు బాబులూ? ఆ బాపతు కీచక యోగులకన్నా యాచకులం.. అభాగ్యులం మేమెందులో బిలో యావరేజి వినియోగ దారుల లైన్లో ఉన్నట్లో? దారుణంగా మంది సొమ్ము దోచేసే బడా బాబులక్కూడా ఏడేదో చేసేసే బ్యాంకులోళ్లు.. ఏదో అడ్డమైన చోటా నానా గడ్డీ గాదం కలిచి కూడేసుకున్న మా 'చిల్లర’ సొమ్మును చూస్తే మాత్రం.. '...' అంటూ ఓ సైడుకు నెట్టేస్తారు! గుమ్మం గేటు దాటైనా లోనికి రానీయరు! ఇదేనా సమాన ధర్మమంటే? రిజర్వు బ్యాంకోళైనా సమాధానం దెబుతారా? ఊహూ.. నోరే విప్పరు!


అడుక్కు తినే వాళ్లమనా అంత లోకువా? మ్యాన్! లోకంలో మా కన్నా తక్కువ 'తినే' జెంటిల్మేనెక్కడున్నారో కమాన్.. చూపించండి! సాక్ష్యాత్తూ మన విత్తశాఖామాత్యులవారే స్వయంగా పెద్దపెద్దోళ్ళే బ్యాంకుల్ని నిండా ముంచేస్తున్నారు. మొండి బకాయిల్ని కొండల్లా పెంచేస్తున్నారం టోసెలవిచ్చారా లేదా మొన్నీ మధ్యనే మన హైద్రాబేడ్ మీటింగులో? వెరీ బ్యాడ్! ఇక్కడ తేరగా బ్యాంకు సొమ్ము తెగ బొక్కేసి ఎక్కడో పక్క దేశం ఏ.సీ.లాడ్జీల్లో లార్డ్ లిన్లిత్ గో లివింగ్ వారసులకులక మల్లే పక్కలు పర్చుకు బబ్బున్న బకాసురుల జాబితా ఏ J వీకీలీక్సు అసాంజే బాబో బైటకు తీస్తే తప్పు.. బ్యాంకు అప్పుల వంకతో 'చిల్లర పన'క్కక్కుర్తి పడే షికారు బ్యాచీలెక్కువో... 'చిల్లర' బిళ్లలేరుకు బతికే మా బికారుగాళ్ల మదుపులెక్కువో లెక్కలు తేలవు! పోనీ.. పనామా లెక్కలకైనా పంగనా మాలెట్టకుండా కుండబద్దలు కొట్టే గుండె దిటవేవరికైనా ఉందా అంటే.. ఊహూ... ఎక్కడి కక్కడే లోపాయికారీ పంచాయితీలు!


ఆ మాటకొస్తే బ్యాంకోళ్ళ యాపారం మాత్రం మా బిచ్చగాళ్ల యాయవార సూత్రం కన్నా గొప్పదా? గుడి మెట్లమీద మేం జోలె పర్చుక్కూర్చుంటే.. గాజద్దాల వెనకాల గా తెల్ల కాలరు బాబులు డాబుగా జోగుతుంటారు! గంతే తేడా! కాజీకి.. ఏగాజీకీ 'ఏ'జి.ఎస్.టి' టాక్సులు గట్రా గోలల్లేకుండా ఫ్రీగా 'ధర్మం' ఫ్యామ్లీ ప్యాకేజీ రూపంలో దయగా ప్రసాదించే ఉద్గారకులం మేం. ఉద్ధరంగా ఒక్క చిల్లి పైసా అయినా మదుపుకు అదనంగా విదిల్చ బుద్ధికాని ఎక్స్ట్రా బ్యాంకు సర్వీస్ టాక్సు' మోతగాళ్ల కంజూస్ ఇంగిలి పింగీస్ గేప్ బీస్ జంగాళ్ల బ్యాం కోళ్లు బాసులూ!


కోట్లు కుమ్మరించి ఆడే వన్ డే క్రికెట్టు వండరైనా ఓ 'వన్ రుపీ కాయిన్' గాల్లో ఆడితే గానీ తరువాయి తమాషాకి తెర లేవడు కదా! చిల్లర బిళ్లలన్చెప్పి ఇంకా మా సంపాదనమీదింత డెప్పులు, చిర్రుబుర్రులెందుకంట బ్యాంకోళ్లకు? చిరగవు బిల్లులు పడవు. చెవట గబ్బు కొట్టవు. చీపు రాతలుండవు. కాస్తంత బరువు ఎక్కువనే కానీ.. పరువు తక్కువ పేపర్ కరెన్సీకన్నా కాపర్ మనీనే ఎన్నందాల పోల్చినా మన్నికైనది. ఎన్ని చేతులు మారినా వన్నె తగ్గనిది. బిల్లర బిళ్లలంటే మరెందుకంట బ్యాంకోళ్లూ మీకంత వళ్లు మంట?!


కరేబియన్ దీవుల్లో ముద్దర్లేసు కొనొచ్చినా నిద్దర మత్తులో గభాల్న డిపాజిట్టు చేసేసుకొంటారు! కాస్తంత పెద్దనోటుగా కనిపిస్తే చాలు.. డద్దర్లాడిపోతూ కళ్లకట్టేసుకొని మరీ కాతాల్లో కాత్రంగా జమేసేసుకొంటారు. పక్క పాకిస్తానోడి జిరాక్సు నోటుక్కూడా 'నో' చెప్పనంత ఉదారుడు కదా మన బ్యాంకు సోదరుడు! మరి 'మేకిన్ ఇండియా' సరుకు మా చిల్లర నాణేలంటేనే ఎందుకో అంతలేసి చిర్రాకు?!


దొంగ నోట్లుంటాయేమో కాని.. దొంగ బిళ్లలుంటాయా చెప్పు సోదరా! ఇహ సత్తు బిళ్లలంటారా? కలరు జిరాక్సుకో రెండ్రూపాయిల కాయిన్ పారేసినా చాలు.. రెండువేల కొత్తనోట్లో రెండు మూడు వందలు... కట్టలు కట్టలుగా బైటికి తన్నుకుంటూ వచ్చే రోజులు చచ్చు సత్తు బిళ్లలెవరండీ బాబూ చచ్చీ చెడి తయారు చేసేదీ కరువుల్లో? రాటు దేలిన స్మగ్లర్లకే సర్క్యులేటు చేసే జబ్బ సత్తువ లేనప్పుడు ఇహ మా సత్తెకాలం సత్తెయ్యలకా ఆ ఉపరి ఓపికలేడ్చేదీ? సిల్లీ!


మాట వచ్చింది కనక మనలో మన మాట! సూటు కేసుల్లో డబ్బు దాచే కేటుగాళ్లక్కూడా చిల్లర నాణేలే సూటు, కాస్తంత చోటు ఎక్కువ కావాలి తప్పిస్తే.. ఏ కక్కసు దొడ్డి అడుగున ఎన్నేళ్లు కుక్కిపెట్టినా చెత్త నోట్ల మాదిరి చెదలు పట్టవు. అధాటున ఏ ఆదాయం పన్ను యమకింకర్తొచ్చి వాలినా కౌంటింగుకొక పట్టాన లొంగవు చిల్లర కాయిన్లు లెక్కలు తేలాల్సిందేనని మరీ అంత జగమొండికి దిగే జె.డి. లక్ష్మీనారాయణ బాపతు జీళ్ళపాకాలూ ఉంటారంటారా! ఇహ వాళ్ల ఖర్మ.. పేళ్లు కొంకర్లు పోవడం తప్ప తప్పులు ఛస్తే బైట పడనే పడవు. ఆ మతలబులేవీ వంటబట్టకే ఆ డేరాబాబు పబ్లిక్ ముందంతలా ఖరాబైయిపోయింది స్వాములూ!


ఏనగడుతోనైనా ఎసుంటి నగా సట్రా యవ్వారాలసలు బొత్తిగా పొసగవని ఢిల్లీ సర్కారోడే ఎప్పటి కప్పుడు జెల్లకాయలు కొట్టేస్తున్నప్పుడు.. కొత్తవైతే ఏంటంటా.. రెండువేల నోట్లు జేబీల్లో పెట్టుకు దర్పంగా తిరగడానికి తప్ప కొట్లో ఇంత జిలేదీ చుట్ట కొని నోట పెట్టుకోటానికైనా అక్కరకొస్తుందంటావా అక్కా? ఎక్కడ చూసినా మూత బడ్డ ఏటియంలే మతి పోగొట్టేస్తుంటే ఎనీ టైం మనీ నీడ్సుకి ఇహ మీదట మా


బ్యాంకోడికి మల్లే బిచ్చగా రూ.


బొబ్చెడౌన్సమ్మెకు ది జనేది దొరక్క ముంబయ్ ఎక్సేంజయినా ఢమాలని షవడం రా నా యనా! ఖబడ్డార్ ! బుకీల సంగతే వో గాని బాబులూ.. బికారులం మేం కరువైతే మాత్రం బుల్లియన్ మార్కెటైనా 'బేల్' మంటూ కుప్ప కూలక తప్పదు తమ్ముళ్లూ! తస్మాత్ జాగ్రత్త సుమా!కార్లో పెట్రోలుకోసం టూరౌంజడేవన్నా పచేస్తుందేవో కానీ.. కారుటైర్లో గాలికి మాత్రం టూ రూపీ కాయినే కంపల్సరీ రైతు బజార్లో బడి రోజంతా చక్కర్లు కొట్టు తల్లి! పిబడి పచ్చనోటుకో ఉల్లిగడొచ్చినా ఒట్టే! వందనోట్లు వందున్నా ఒస్ రుపీ కాయిన్ కన్నంలో పడితే గానీ ఏ శాల్తీ బరువునూ వెయింగ్ మిషను తూయడు! మీ పిలగాడి పీచు మిఠాయి కోరిక ఏ పిచ్చి పచ్చనోటూ చేస్తే తీర్చదు. చిల్లర చేతిలో లేందే పైకెక్కద్దని ముందే హూంకరిస్తాడు బస్ కండక్టర్. హుండీలో హండ్రెడ్ రుపీస్ నోటేసేపాటి భక్తి ఎంత ఘనాపాటి భక్తుడికైనా ఉంటుందా ఏవిటీ? లక్ష్మీపూజ రోజు లక్ష్మీ మిట్టలైనా బిల్లర బిళ్లల కోసం దేవుళ్లాడాల్సిందే కదా! బ్యాంకులోళ్లు ఎట్లుగూ నోరెళ్ల బెట్టడం ఖాయం. దేవుళ్ల ముందు ఆ సంకట స్థితిలో భక్తులు అప్రతిష్ట కాకుండా కాపాడేది గుడి చిడీలమీద తిషే'సుక్కూర్చునే మా మాదా కబళం తిరిపిగాళ్ల నండీ బాబులూ! బిచ్చగాడంటే చిల్లర ప్రసాదించే 'గాడ్'. గుళ్లో దేవుళ్లు కూడా హారతి పళ్లెంలోకో రూపాయి బిళ్లను మించి ఆశించనప్పుడు బ్యాంకులోళ్లకే మరెందుకో మా చిల్లర జమల మీదంత మజాకు ఏ సర్కారోడూ మా గోడు వినిపించుకోడు. ఏ రిజర్వు బ్యాంకోడూ మా మొర ఆలకించుకోడు. కనకనే మా కాంచన్రాయి దాసు బాసు ఆ కలకత్తా హై కోర్టు తలుపు సంత గట్టిగా తట్టింది. ఏ నెగోషియబుల్ యాక్టు కోడైనా న్యాయాధీశుల బుద్ధికి తట్టక పోతుందా? తోడూ నీడా లేని మా కు చట్టం తోడుగా రాకపోతుందా అనే మా గోడు అన్నట్లు మాయాచ'కుల' పోళ్లందరం కలసి ఆ వకీలు బాబుకు వకాల్తా ఫీజుకింద సమర్పించుకున్నదేంటో తెలుసా సార్లూ! అక్షరాలా రెండు నిండు బస్తాల ఘట్టి రూపాయి బిళ్లలే మ్యాడమూ!


-కర్లపాలెం హనుమంతరావు

( సూర్య - కాలమ్ - 14 -09-2017 - ప్రచురణ ) 

ప్రేమ పార్టీ .. జిందాబాద్! - ఆంధ్రప్రభ - గల్పిక - హాస్యం - వ్యంగ్యం

 



సూర్య - గల్పిక- హాస్యం 

ప్రేమ పార్టీ జిందాబాద్ 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ దినపత్రిక  - సంపాదక పుట - కాలమ్ - సుత్తి మెత్తగా - 10 -02 -2018 న ప్రచురితం ) 


' ప్రేమే దైవం యువతే లక్ష్యం ' 


' ఇదివరకు సేవే లక్ష్యం. అన్నట్లు గుర్తు' 


"అది ముగిసిపోయిన పార్టీ పొట్టి కేషన్ బాబాయ్! ఇది ముందుకు దూసుకొస్తోన్న పార్టీ కొత్త స్టోగన్ . మాది దక్షిణాది రాష్ట్రాల మార్కు యాక్షన్ పార్టీ! అదేమో ఉత్తరాది రాష్ట్రాల మార్కు ప్రేమ పార్టీ! మాధుర్ నాథ్ చౌధురి గుర్తున్నాడా?


' మర్చిపోదగ్గ మహాను భావుడా బాబూ? పాఠాలు చెప్పమని ఉద్యోగమిస్తే ప్రేమ పాఠాలు వల్లించి మరీ ఓ పిల్ల శిష్యురాలిని ఏకంగా పెళ్లి పీటల మీదకు ఎక్కించిన మన్మథుడు! అప్పట్లో అదో సంచనలం. చాలా ఘన సన్మానాలు కూడా జరిగినట్లు గుర్తు పాత చెప్పులు వగైరా గజమాలలతో! ' 


' చెప్పు పడ్డంత మాత్రాన గొప్పతనమేమన్నా తరిగిపోతుందా? ఆ మాటకొస్తే ఇప్పుడున్న గొప్ప నేతల్లో చెప్పు మీదపడని వారెవరున్నారో చెప్పు! 


 'సర్సరే' ఇప్పుడీ పాత పురాణాలన్నీ ఎందుగ్గానీ  నువ్ చెప్పాలనుకొన్న కొత్త కహానీ ఎదో చప్పున చెప్పేయ్ రా నాయనా! ' 


' ఆ మాధుర్ చౌధురి అప్పట్లో ప్రేమ పార్టీ ఓటి పెట్టేసి హృదయం గుర్తుతో బరిలోకి దిగినట్లే వచ్చే ఎన్నికల్లో మేమూ మరో ప్రేమ పార్టీతో దడదడలాడించబోతున్నాం బాబాయ్! ఇప్ప ట్నుంచే దేశ మంతా టూర్లతో హోరెత్తించే ప్రయత్నాల్లో ఉన్నాం'


ఎన్నికల జాతర్లు కనుచూపు మేరలో ఉంటే ఇట్లాంటి గారడీలు ఇంకెన్ని చూడాల్నో ! ఇన్నాళ్ల బట్టి జనాల గోడు అసలు పట్టించు కోకుండా ఇవాళ పరగడుపునే పక్క  దిగొచ్చేసి  జడి వానలా ఇలా ప్రేమలు కురిపించేస్తానంటే తడిసి ముద్దయేందుకు జనాలేమన్నా చిన్నబడి కెళ్లే బుడతకాయల్రా? బడా బడా నేతలు, బడబడవాగే అధినేతలకే చుక్కలు చూపించే తెలివి తేటలు వాళ్లవి. ' 


 'బాబోయ్! టీవీ చర్చా కార్యక్రమాల్లోలా ఆ భాషేంటి బాబాయ్! ఈ వయస్సులో కూడా నీకే వంట్లో ఇంత పులుసుంటే.. ఇహ ఈడు మీదున్నోళ్లం మా నోళ్లెలా  మూసుక్కూర్చుంటాం? ' 


' నా సంగతులు ఇప్పుడెందుగ్గానీ, నీ ప్రేమ పార్టీ చేసే ఘనకార్యాలేంటో కొద్దిగా విప్పి చెప్పు బాబూ విని తరిస్తాం!' 


' దేశాన్నిప్పుడు పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలేంటీ? '


' ఇంకేముంటాయ్! ఏడు దశాబ్దాల పై బట్టి రెండే ప్రారబ్దాలు. కూడూ నీడా! 


 'ఒక్క ఓటుతో ఆ రెండు ప్రారబ్దాలనీ పటాపంచలు చేయబోతోంది మా ప్రేమ పార్టీ. ప్రేమకు ఆకలి దప్పికలుండవు కదా! తిండి తిప్పలు ఇహ ఒహ సమస్యగానే ఉండబోదు . రూపాయిక్కిలో బియ్యంలాంటి గారడీలు ఇంకేమీ చెయ్యాల్సిన ఖర్మ పట్టదు. తాగునీరో.. రబీ సీజనో అంటూ నీటి వాటాల కోసం కొట్టుకు చచ్చే దౌర్భాగ్యాలిక ముందు మా పాలనలో రాబోవు. ప్రేమలో పడ్డవాళ్లంతా ఎదుటి వాళ్ల గుండెల్లో కాస్తంత చోటు దక్కితే అదే పది వేలను కుంటారు గదా బాబాయ్! ఇంకీ డబుల్ బెడ్రూంలు, ఆవాస యోజనాల్లాంటి ప్రయోజనాల్లేని  పథకాల కోసం వీసమెత్తైనా  ఆందోళనలు

చేయాల్సినా  అవసరముండదు . ప్రేమికులకు మన మామూలు భాషతో పనే పడదు బాబాయ్! వాళ్లవన్నీ మూగ సైగలు! సింగర్ సైగల్‌  కాలం నాటి బొంగురు గొంతు పాటలతో భాషాసమస్యలన్నీ ఇట్టే సమసిపోతాయ్!  ప్రేమ త్యాగాన్ని తప్ప మరేదీ కోరుకోదు కదా! కొడుకులకు, కూతుళ్లకు కూడబెట్టివ్వాలన్న తాపత్రయం తగ్గిపోక తప్పదు. కుంభకోణాల ఊసే జనం శాశ్వతంగా మర్చిపోవచ్చింక హాయిగా! వారసులే దేశాన్నేలి తీరాలన్న పెద్దల వరస వల్లనే కదా ఇప్పుడిన్ని రాజకీయాలూ  రాద్దాంతాలూ! ఆ అరాచకాల జోలికింకే నేతకూ, అధినేతకూ వెళ్లబుద్ధికాదు. కుంభకోణాలు, కుమ్ములాటలు, వెన్నుపోట్లు. వెన్న రాయడాల్లాంటివన్నీ ఇహ గత పాలకుల ఖాతాల్లోనుంచి హఠాత్తుగా నిద్ర లేచొచ్చే పిశాచాలు కాబోవు . ప్రేమ పార్టీ విస్తరించే కొద్దీ'  అది కావాలి. . ఇది కావాలి' అనే డిమాండ్లు వాటంతటవే అణిగిపోతాయి. పైపెచ్చు ' ఇదిచ్చేస్తాం.. అదిచ్చేస్తాం! పుచ్చుకోకుంటే చంపి పాతరేస్తాం' లాంటి త్యాగనినాదా లే

కర్ణభేరులదిరి పోయేటట్లు మిన్ను ముట్టేది. ఇప్పుడు జరిగే హక్కుల పోరాటాలన్నీ ఠక్కుమని ఒక్కసారే మూతబడితే.. ఆ శాంతి భద్రతల్ని చూసి నీ లాంటి సీనియర్ సీజనల్ పొలిటీషియన్సు పాపం.. తట్టుకుంటారో లేదో! వుయ్ పిటీ యూ బాబాయ్!'


'గురజాడగారి గిర్రాయి టైపు లెచ్చర్ల తంతుగా ఉందిరా నీ

వాగుడంతా! ఇన్నేసి న్యూసు పేపర్లు, న్యూసెన్సు టీవీ ఛానల్సు క్రమం తప్పకుండా చూసే నాకే గుండె బేజారయేట్లుందే నీ భావి భారత రాజకీయ ఊహా చిత్రం! ఇహ కామ్ గా పోయే మామూలు ఆమ్ ఆద్మీ మీ బోటి ప్రేమ మాయగాళ్ల ధాటికి ఎట్లా తట్టుకుంటాదో పాపం!మీ మాధుర్ చౌధురీ మాజీ ప్రేమ పార్టీయే పెద్ద గూడుపుఠాణీరా బాబూ! ఆ మాయల మరాఠీనా మీకు  మూవింగ్  ఇన్స్పిరేషన్? మూవీ, టీవీ మార్కెట్ల కంటే కాదల్ ఓ కే . మా బాగా అమ్ముడయ్యే మంచి సరుకే! మూడు పూటలా మెక్కి మంచమెక్కి తెల్లారే దాకా తొంగునే వీలుంటే  తప్ప బతుగ్గడవని  బక్కోళ్లకు ఈ ప్రేమలూ దోమల పార్టీలేంట్రా పిచ్చిగాకపోతే! ' 


' ఏళ్ల బట్టీ బూర్జువా పార్టీల తత్వం వంటబట్టిన నీ బోటి ముసలి డొక్కులకి ప్రేమంటే ముందులో కాస్తంత డోకే వస్తుందిలే! వుయ్ డోంట్ కేర్! బోల్డుగా చెబుతున్నా. నిజానికి జనాలకి మా ప్రేమ పార్టీ వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు. ఓపిగ్గా వింటానంటే ఓపెన్ చేసి మరీ వినిపిస్తా మా 'ది బెస్ట్' మ్యానిఫెస్టో! ' 


ఓటేసే జనాలం.  వద్దంటే మాత్రం వదిలేస్తారట్రా; ఊ .. బాదేయ్!' 


'ఇప్పుడు నడిచేవన్నీ కులరాజకీయాలే కదా బాబాయ్! మత ప్రాతిపదికనేదే లేకుండా మంత్రాంగం నడవని రాజకీయాలు మనవి.  ప్రేమ జీవులకసలు కుల మతాలతో ప్రమేయమే ఉండదు.  జాతి పురోగతికి అందుకే మా ప్రేమ పార్టీనే చివరికి గతి. ఎవరెవరితోనో పొత్తులంటూ తొత్తులుగా మారే కన్నా మా ప్రేమ పార్టీతో చేతులు కలిపమనండి!

ఏడాదిలోగా అధికారం దోరమగ్గిన పండులా వళ్లోకొచ్చి వాలకుంటే అప్పుడడగండి. మా లక్ష్యాలు నెరవేరడానికి మేం ఎవరితోనైనా ఖత్తు కలిపేందుకు ఎవర్రెడీ ' 


 ' ఏంటి బాబూ అంతలా మీ లక్ష్యాలు?' 


' ప్రేమ కోసం జీవితాలను ఫణం పెట్టిన అమర జీ వులు దేవదా.. పారు; ఏంటొనీ..  క్లియోపాట్రా!  వారి భారీ విగ్రహాలని పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్టించాలి. పసివగ్గులక్కూడా ప్రేమకథలను గూర్చి ఉగ్గుపాలతో మరీ రంగరించి పోయాలి. సిగ్గు ఎగుల్లేకుండా ప్రేమించుకోవాలంటే ప్రాథమిక దశ నుంచే లైలా మజ్నూల్లాంట్టి లవ్ బర్డ్స్  చరిత్రలు పాఠ్యప్రణాళికల్లో చేర్చి తీరాలి. ప్రేమ కథా చిత్రాలను మాత్రమే నిర్మించే విధంగా సినిమాటోగ్రఫీ చట్టాలలో సవరణలు చేపట్టాలి. ప్రేమను కించపరిచే ఏ కళారూపాన్నైనా పర్మినెంటుగా బహిష్కరించే సెక్షన్లు ఐపిసి కోడుల్లో చేర్పించాలి. ప్రేమ విరోధులకు విధించే శిక్షలు తతిమ్మా ప్రణయద్వేషులకు వణుకు పుట్టించేటంత తీవ్రంగా ఉండి తీరాలి.  ప్రేమ వివాహాలను ప్రభుత్వాలే స్వంత ఖర్చుతో భారీగా ప్రతి ప్రేమికుల దినం రోజూ  జపించాలి.

ప్రేమపక్షుల విహారానికి అనుకూలమైన స్థలాలను ప్రభుత్వాలే సేకరించాలి. పార్కులుగా అభివృద్ధి పరచాలి. విఫల ప్రేమికులకు సరికొత్త ప్రేమికులు దొరికే వరకు ప్రభుత్వాలే 'వియోగ భత్యం' కింద మందూ మాకులకు నెల నెలా ఇంతని చెల్లించాలి. ప్లాపైన ప్రేమ చిత్ర నిర్మాతలకు ఉద్దీపన పథకాలు, రేంటింగు తగిన ప్రేమ సోపులకు భారీ సబ్సిడీలు బడ్జెట్లల్లో కేటాయించాలి. విఫల ప్రేమికులు పునఃప్రేమకు తాము చేసే సర్వ ప్రయత్నాలు పునః విఫలమై పూర్తి విరక్తితో ఆత్మాహుతి తలపడితే దూకి చచ్చేందు కు సరిపడా లోతైన కాలువలు తవ్వించాలి. తల పెట్టుకుని పడుకునేందుకు ప్రత్యేక రైలు పట్టాలు ఏర్పాటు చేసి, వేళకు రైళ్లు ఆ ట్రాకుల మీదుగా పోయే ఏర్పాట్లు చేసితీరాలి. ప్రేమికుల చేత పళ్లు రాలగొట్టించుకొనే ఔత్సాహిక ప్రేమికులకు 'ప్రేమశ్రీ' పథకం కింద ఉచిత చికిత్సలు, దంత వైద్యశాలలు తక్షణమే ఏర్పాటు చేయాల్సుంది. అన్నట్లు నూతన ప్రేమికులకు పరిమితి లేని ఉచిత సెల్ ఫోన్ కాల్స్ సౌకర్యం విధిగా ప్రభుత్వాలే కల్పిస్తే మరీ మంచిది'


'అసల్ది  మరిచావురా భడవా ప్రేమ మైకంలో పడి . ప్రేమ గుడ్డిది . మీది కళ్లు లేని కబోదుల పార్టీ కదా! పిచ్చాసుపత్రుల్లో బెడ్డు కూడా మరిన్ని పెంచాలని డిమాండు పెట్టడం మర్చి పోయావ్!' 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ దినపత్రిక  - సంపాదక పుట - కాలమ్ - సుత్తి మెత్తగా - 10 -02 -2018 న ప్రచురితం ) 

ఈనాడు - హాస్యం - గల్పిక - వ్యంగ్యం అప్పుల మోత - రచన: కర్లపాలెం హనుమంతరావు




 ఈనాడు - హాస్యం - గల్పిక - వ్యంగ్యం

అప్పుల మోత

రచనకర్లపాలెం హనుమంతరావు

 ఈనాడు - హాస్యం - గల్పిక - వ్యంగ్యం 

అప్పుల మోత 

- రచన: కర్లపాలెం హనుమంతరావు



'సెల్ చేతిలో ఉందని సంబరపడ్డానేగానీ, సెల్లో పడ్డానని తెలు సుకోలేకపోయాను బాబాయ్! ఎక్కడి సింగపూరు... ఎక్కడి బెంగుళూరు? సింగరాయకొండ  చవుడు భూములు చవగ్గా ఇప్పిస్తాం ..  కొంటావా... చస్తావా!' అంటూ అర్ధరాత్రీ , అపరాత్రీ  అని చూడకుండా గంటకోసారి ఠంగ్ ఠంగ్ మంటూ బెది రింపులు!' 


'ఎవర్రా?' ఆ టెలీ విక్రమార్కులేనా? మన ప్రధాని మన్మోహన్ సింగు గారికే తప్పటంలేదీ చెవినొప్పులు. సామాన్యులం మనమెంత? నా అనుభవం కూడా అలాంటిదేరా బాబూ! సెల్ కొన్న మర్నాటి నుంచీ రోజుకో సిటీనుంచి ఏజెంట్ల తలనొప్పి. ఎలాగైనా ఏదైనా ఓ పిచ్చి పాలసీ అంటగ ట్టేదాకా ఆగదనుకుంటా ఆగం.... ' 


' అయినా లాభంలేదు బాబాయ్! ఓ పదిసార్లు కాల్సు చేసేసి ఓ పాలసీ మన పేర్న తీసేసి మన కార్డు డబ్బులు దానికి దోచి పెట్టేసి ఆనక వడ్డీతో సహా అసలు వసూలు చేసుకుర మ్మని రికవరీ ఏజెంట్ల ముసుగు లేసేసి యమకింకరులను మన మీదకు తోలిపారేసి తమాషా చూస్తుంటారీ టెలీ మార్కెటింగ్ వీరులు. మనం ఫోన్లు పెట్టించుకు న్నది ఈ కాలాంతకుల చేత బాధించుకునేందుకే లాగుంది బాబాయ్! ప్రాణాలు తోడేస్తున్నారనుకో! ' 


' ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలంటేనే వాళ్లకు లెక్క లేదు. ముఖర్జీ అయినా ముఖేశ్ అంబానీ అయినా ఆ ఫోన్ రాకాసులకు.... కేవలం- ఓ ఫోన్ నెంబర్ కిందే లెక్క. కిషన్‌ రెడ్డి అయినా కృష్ణపరమాత్మ అయినా వాళ్లు కాల్ అంటూ చేసి నాక చచ్చినట్లు పలకాల్సిందే స్వామీ! వారెన్ ఆండర్సన్ నెంబరు మన హోం శాఖ దగ్గర ఉండకపోవచ్చుగానీ, కాల్ సెంటర్ వాళ్ళ దగ్గర ఆయన జాతకమంతా నమోదై ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫోన్ డైరక్టరీలన్నీ రోజుకోసా రన్నా తిరగేయనిదే సిబ్బంది ఇళ్ళకు వెళ్ళరాదని వాళ్ల రూలురా నాన్నా!' 


' అడిగినా  ఎంగిలి చేయికూడా విదిలించని వాళ్లే అధికంగా ఉన్న ఈ కాలంలో, అడక్కపో యినా అప్పులు, ఇళ్ళు, బళ్లు ఊరికే ఇప్పించి పారేస్తామని ఎందుకలా అందరి వెంటపడుతుంటారో  దేవుడికే తెలియాలి. ఆయనే ఈ తుంటరులను  అదుపు చేయాలి...'


'సర్లే! ఆ దేవుడూ అదుపు చేయలేని ఆకతాయిలురా వీళ్ళు! 

స్వర్గలోకం ప్యాకేజీ తమ దగ్గర తీసుకుంటే, 'తులసితీర్థం'' ఉచితమంటూ చివరిశ్వాస తీసుకునేదాకా పోయే రోగినీ విడవకుండా వేధించే ఈ కాల్ మార్కండేయులను అదుపుచేసే 'అజెండా' మన టెలీ రాజావారి దగ్గర మాత్రం ఏముందా అనేదే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజురో అయిదుసార్లు వాళ్ళలా పలకరిస్తే  ఆర్థిక శాఖ మంఅకే హార్టెటాక్ వచ్చే పరిస్థితి! ' 


'తనదాకా వస్తేగానీ తత్వం తల కెక్కదని తాతలు ఊరికే అన్నారా? ఆ పెద్దాయనకు  ఎవరు కాల్ చేశారోకానీ, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిమీద జల్లుకోవాలి. ఇదే చిట్కా మన ప్రధానిమీదా ఎవరన్నా ప్రయోగిస్తే ఎంత బాగుంటుంది? పరగడుపునే నిద్ర లేపి చేతికో సంచీ ఇచ్చి బజారుకలా వెళ్ళి నాలుగు రకాల కూరగాయలు తెమ్మని వాళ్ల చేతనైనా చెప్పిస్తే ధర వరలు ఈ ధరాతలాన్ని వదిలి ఎంతెత్తుకు వెళ్లాయో తెలిసొస్తుంది  ! ' 


'నిజమే బాబాయ్! పోలీసోళ్ళకి, పొలిటీషియన్లకి, టీవీ సీరియళ్లకి భయపడనివాళ్లక్కూడా బెదరని ధీర్ణు  ఈ టెలీ మార్కెటింగ్ మాయగాళ్ళ ఫోన్ రింగు వినపడితే చాలు  ఎందుకంతలా బెంబేలెత్తుతుందో ఇప్పుడిపపుడే బుర్ర కెక్కుతొంది! మన ప్రజాప్రతినిధుల్ని కలుసుకోవాలంటే మనమే వంతులవారీగా నిమిషానికి ఓ సారి  వాళ్ళకలా  రివర్సు కాల్సు చేస్తూనే ఉండే   ఉద్యమం చేపడితే ఎలాగుంటుందంటావ్? ' 


' అవునవును ! ఈ పరిస్థితులు బాగుపడే దాకా; సెల్ఫోన్ ఎలాగూ కొన్నాను గనుక దీన్ని గంగలో పారేసే లోపల ఒక్కసారి  మన రాష్ట్ర ప్రతిపక్షనేత తరపున చవాన్ గారికీ హాల్ నైట్ కాల్సు చేస్తూనే ఉంటా !


ఏమని బాబాయ్? బాబ్లీగేట్లు కూల్చేస్తావా ! లేదంటే- నీ సెల్ నెంబరు అయిదారు టెలీమార్కెటింగ్ కంపెనీలకు  లీకు చేయమంటావా' అని...' 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదకీయ పుట - ప్రచురితం ) 

ఈనాడు - గల్పిక- వ్యంగ్యం - హాస్యం పెట్టని గోడ రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- సం.పు- 08 -07 - 2002 న ప్రచురితం )

 






ఈనాడు - గల్పిక- వ్యంగ్యం - హాస్యం 

పెట్టని గోడ 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- సం.పు- 08 -07 - 2002  న ప్రచురితం ) 


భారత దేశమునకు ఉత్తరమున హిమాలయ పర్వతములు పెట్టని గోడవలె ఉన్నవి- అని చదువుతూ చదువుతూ హఠాత్తుగా పెట్ట నిగోడ అంటే ఏంటి మమ్మీ అనడిగాడు మా చిన్నాడు.


పక్కనే కూర్చుని వాడి హోమ్ వర్క్ చేస్తున్న వాళ్ళమ్మ' ఎవరూ కట్టకుండానే  ఉన్న గోడ అన్న మాట - అంది. 


ఎవరూ కట్టకపోతే గోడెలా వస్తుందనలు. నిలదీశాడు  మళ్ళీ.  


వెదవ ప్రశ్నలు మానేసి  ముందు పాఠం చదువు - అని విసుక్కుంది వాళ్ల అమ్మ . 


పిల్లల ప్రశ్నలకి విసుక్కోకుండా సమాధానం  వాళ్ళ కర్ధమయ్యే విధంగా  చెప్పటం పెద్దల విధి. 


అబ్బో!  నీతులకు తక్కువలేదు. ఒక్క పూట వాడిపక్కన కూర్చుని పాఠం చెప్పండి .. తెలుస్తుంది' అంది శ్రీమతి ఉక్రోషంగా. 


పోనీ..  మీరు చెప్పండంకుల్!  పెట్టని గోడ అంటే  ఏమిటో-  అన్నాడు అప్పుడే వచ్చిన పక్కింటి  పరమేశంగారబ్బాయి. వాడు మా పెద్దాడి క్లాస్ మేట్ .  చనుపుకొద్దీ మా ఇంటికి వస్తుంటాడు. 


కాంట్రాక్టర్లు సిండికేట్లు, కంకరా సిమెంటూ గట్రాల గోల లేకుండా ఎత్తుగా తయారయిన ఒక కట్టడమనుకో- అన్నాను. 


  భలే చెప్పారంకుల్.... ఇంకా చెప్పండి- అని చప్పట్లు కొట్టాడు ఎంకరేజింగ్ గా . 


ఈ పిట్టలదొర కబుర్లే  నచ్చాయా  నీకు...? అంది శ్రీమతి ఈ పిల్లాడితో . 


ఎలాగూ పిట్టల దొర అని బిరుదిచ్చావు కాబట్టి ఈ పెట్టని గోడ మీద ఒక పిట్ట కథ కూడా చెబుతాను .. వినండి- అన్నాన్నేను.


నేను ఒక పల్లెటూర్లో బ్యాంకులో పనిచేస్తున్నప్పటి సంగతి.  వెంకయ్య అని ఒక పల్లెటూరు పెద్దాయన మా మేనేజరు దగ్గరికొచ్చి గోడకట్టుకోవటానికి ఒక పదివేల రూపాయలు లోను కావాల్సార్- అని అడిగాడు.  


మా మేనేజర్ రూల్స్  మనిషి . ముక్కుసూటిగా 'గోడలు కట్టుకోవటానికయితే లోన్ దొరకదు... ' అనేశాడు. 


ఒకవంక మేధావులంతా  మనిషికి మనిషికి మధ్య వున్న గోడలు కూల్చేయ్యం డయ్యా అని గోల పెడుతుంటే ఈ వెంకయ్యేందయ్యా గోడలు కడతానంటాడు: - అన్నాడు నాతో . 


వెంకయ్య బుర్ర బరబరా గోక్కుంటూ'మడిసికి మడిసికీ మధ్యకాదయ్యా నా చేనికీ , పుల్లయ్య చేనికీ  మధ్య గుట్ట కట్టుకుంటానన్నాడు.


గుట్ట అనూ పుట్ట అనూ  నీవే పేరైనా పెట్టుకో! అది గోడే కదా.... రూల్సొప్పుకోవు- అన్నాడు మేనేజరు మళ్లీ . 


వెంకయ్య వెర్రిమొగవేసుకుని బైటికొస్తుంటే నేనే వెనక్కి  పిలిచి విషయమేమిటని అడిగా.  


వెంకయ్య పొలం మెరకమీదుంది . పుల్లయ్య పొలం పల్లంలో వుంది. వర్షం కురిస్తే నీళ్లు తన పొలం నుండి పులయ్య పొలంలోకి వెళ్ళ కుండా మధ్య గట్టుమీద కాస్త ఎత్తుగా ఏర్పాటు చేసుకుందామనుకున్నాడు ఈ పిచ్చి మానవుడు.  


మా చాదస్తం మొగుడికి రూల్సు  తప్ప ఇంకేమీ పట్టవు. వెంకయ్య చెవిలో నేనొక మంత్రం ఊదాను. 


మర్నాడు పొద్దున మళ్ళీ వెళ్ళి అదే మేనేజరు దగ్గర - పదివేలు

కాదు .. పాతిక వేలు లోను సంపాదించుకున్నాడు వెంకయ్య . 


మీరేం మంత్రం ఊదారంకుల్ వెంకయ్య చెవిలో ? - పరమేశంగారబ్బాయి ప్రశ్న . 


పొలం మెరకలో వుంది. చదునుచేయాలి. కాలువ పూడిపోయింది. పూడిక తీయాలి- అని చెప్పించా.  ఠప్పుమని పాతికవేలు లోను శాంక్ష నయింది.


గోడ కట్టుకోడానికి, కాలువ పూడిక తీయటానికి ఏమిటి సంబంధం? 


ఉంది. చదునుచేసిన మట్టి పూడికతీసిన ఇసుక గట్టుమీద ఎత్తుగా పోస్తే అదే గోడ.. పెట్టని గోడ . 


భళ్లుమని  నవ్వాడు పరమేశం కొడుకు


ఇంకా ఏమన్నా ఇలాంటివే చెప్పండంన్నాడుత్సాహంగా. 


ఈ పిల్లాడి జ్ఞానతృష్ణ ఇగిరిపోకముందే ఎప్పటినుంచో నా మనసులో ఉన్న రెండు  ముక్కలు చెబుదామనుకున్నాను.


పెట్టనిగోడ అనేమాట  మన వాళ్ళకి చాలా ప్రెటీ  వర్డ్  .  హిమాలయ పర్వతాలే కాదు. ఇలాంటి పెట్టని గోడలు  చాలానే ఉన్నాయి మన సంస్కృతిలో.  కులం పేరుతో, మతం పేరుతో మనిషి మనిషికి మధ్య పెరిగిన  ఈ పెట్టని గోడలు  హిమాలయాలంత అనాదివి. ఇది చాలదన్నట్లు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ, ఈ నేల ప్రభావమేమో. . ఈ గాలి తీరే అంతో.. తమ పరిపాలనా  సౌలభ్యం కోసం మరిన్ని పెట్టని గోడలు సృష్టించిపోయారు. 


ఇంగ్లీషువాడు పోతూ పోతూ ఇండియాను రెండుగా చీల్చి ఇద్దరి 

మధ్య నా విద్వేషమనే పెట్టనిగోడను శాశ్వతంగా సృష్టించిపోయాడు. ఇవిగాక వర్గం .. లింగం .. పేరుతో మరిన్ని పెట్టనిగోడలు! మా చా దస్తపు మేనేజరు చెప్పింది ఈ  గోడల సంగతే. 


గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కన్నా మన పెట్టని గోడల్నే ప్రపంచవింతల్లో ఒకటిగా పెట్టి  ఉండాల్సింది- అన్నాడు పరమేశం కొడుకు. 


ఈ గోడలన్నింటినీ కూల్చేయటం పెద్ద కాంట్రాక్టే .  మీలాంటి వాళ్ళు పదవిలోకొస్తే టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్ట్ నాకిప్పించండకుల్ .  ఉత్తరాన పెట్టనిగోడ ఉందన్న  భరోసాతో మన నాయకులు గాఢనిద్రలో ఉన్నారు. ముష్కరులెవరైనా  ఆ కలుగుల్లోంచి దూరొస్తే  డేంజర్ . ఆ ప్రమాదం రాకుండా   పనిలోపనిగా అంతా ప్లాస్టరింగ్ కూడా చేయిస్తా.. కంట్రీ సేఫ్ -  అంటూ హుషారుగా వెళ్ళిపోయాడా అబ్బాయి .


పిట్టలదొర కబుర్లయిపోయాయా! - అంటూ  లోపలికొచ్చింది శ్రీమతి.  . అప్పటిదాకా పెరట్లో పిట్టగోడ దగ్గరిచేరి పొరుగుమ్మతో కబురు చెబుతున్నామె కాస్తా  . 


పెట్టనిగోడ అంటే ఏంటి?  అని అడిగిన మా బడుద్ధాయి మాత్రం పిట్టగోడ మీదెక్కి  పక్కింటివాళ్ల జామపిందెల్ని తెంపటంలో మునిగివున్నాడు.


ఆ పరమేశం కొడుకును చూసి బుద్ధి తెచ్చుకోండిరా!  ఎంత జ్ఞానతృష్ణా!  అన్నాను మెచ్చుకుంటూ . 


గోంగూర కదూ  ! వాడీ రోజు స్కూల్లో పిట్టల దొర వేషం వేస్తున్నాడు . ఐడియాల కోసం నన్ను వేపుకు తింటుంటే  నేనే వాడిని ఇక్కడకు పిలిపించా! - అన్నాడు మా పెద్ద ప్రబుద్ధుడు! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- సం.పు- 08 -07 - 2002  న ప్రచురితం ) 


ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం గురువులకు చదువులు

 




ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

గురువులకు చదువులు 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సం.పు- 25-07-2013  న ప్రచురితం )


బండెడు పుస్తకాలకు బస్సెడు గురుబ్రహ్మలు తోడైన కొత్త విద్యావిధానం వచ్చేసిందా! 


ఒక ఉపాధ్యాయుడికి నలభై మంది శిష్యపరమాణువులు అనే సిద్ధాంతం ఇహ పాతబడినట్లేనా! ఒక విద్యార్థికి నలభై మంది గురువర్యులన్న కొత్త ప్రణాళిక  మొదలుకాబోతోందా!


నవీన విధానం


విద్యుత్తు బుగ్గ, ఆకాశవాణి, చరవాణి లాంటి ఆవిష్క రణలకైతే పనిగట్టుకొని పనులు మానేసి పెద్దబుర్రలు తలలు బద్దలేసుకున్నారు! కేవలం మన రాజకీయవే త్తలు, అధికారంలేని అధికార వర్గాలు, ఉద్యోగ సంఘాల బుద్ధికుశలతవల్ల మనకిప్పుడు ఓ సరికొత్త విద్యావిధానం దొరికిందోచ్...


చదువు సాములు మెరుగుపడాలని, బడిపిల్లగాడి అవ సరాలకు తగ్గట్లు అభ్యసన విధానం మారాలని అభ్యు దయ భావాలతో సర్కారు పెద్ద హేతుబద్ధీక రణకు 'సై' అంటోంది. ప్రభుత్వం బుద్ధికుశలతకు మించిన కొత్త పద్ధతులు బాలల విద్యావిధానంలో వచ్చే స్తున్నాయ్! పాఠ్యప్రణాళిక శుద్ధంగా అమలు చేయాలంటే బస్సెడు ఏం ఖర్మ... జంబో విమానమంత గురుసైన్యం తయారు కావాలి.


తెలుగులో అచ్చులు నేర్పించడానికి ఓ ఉపాధ్యా యుడు, హల్లులు వల్లె వేయించేందుకు మరో గురువు గారు, గణితంలో ఒంట్లు పిల్లాడి ఒంటికి పట్టించేందుకు ఒక పట్టుదలగల పంతులు, ఎక్కాలు బుర్రల్లోకి ఎక్కిం చేందుకు ఇద్దరు పెద్ద బుర్రలు- ఒకరు పైనుంచి కిందికి నేర్పిస్తే... మరొకరు కిందనుంచి పైకి చదవడం నేర్పిం చేందుకు ; 


ఆంగ్లంలో మూడు బళ్లు ఏడ్చినప్పుడు ఒక్కో బడికి ఒక్కో గట్టిపిండం అవసరమే గదా! 


సాంఘిక శాస్త్రంలో పర్యావరణమనే కొత్త అంశం పుట్టుకొచ్చింది. పిల్లకాయలను తోటలవెంట దొడ్లవెంట తిప్పుతూ ప్రకృతి తిరకాసును విప్పిచెప్పే మాస్టార్ల అవసరం ఎంతైనా ఉంది. 


మోరల్ క్లాసులు పీకేందుకు మోటా జ్ఞానంగల పెద్దల  సహకారం అవసరం. 


సామాన్య శాస్త్రం మాత్రం సామాన్యంగా ఉందా? 


భౌతిక, రసాయన శాస్త్రాల సూత్రాల వివరణ... ప్రయోగశాలలో వాటి సత్యనిరూ పణ- మొత్తంగా నలుగురు సైన్సు మాస్టార్లు సిద్ధంగా ఉండాలి.


చిత్రకళ, సంగీతం వంటి విశేషాలను పిల్లకాయల చేత కాయించి వడగట్టించేందుకు ఎంతమంది కళాకారులు కావాలి? 


ఇక పరుగెత్తడం, గెంతడం, దూకడం, గుద్దులా డుకోవడం వంటి విద్యలు, విన్యాసాలు నేర్పడానికి డ్రిల్లు మాస్టార్లూ తప్పనిసరి! 


ఇవన్నీ పిల్లకాయలకు అవసరమా అన్న సందేహం మంచిది కాదు. 


జీవించడానికి అవసర మైన కీచులాటల్లో లాఘవం రావాలంటే బాల్యంనుంచే కండబలం చూపించే ఇలాంటి విద్యలూ అవసరమే. 


అవ సరాలకు తగిన శిక్షణ పిల్లలకు ఇవ్వాలనేగా హేతుబద్ధీక రణకు సర్కారు 'సై' అన్నదీ!


గురువులకు కరవు లేదు. తరగతి గదిలో చుక్కల్లో నల్లపూసలా మెరిసే ఒక్క విద్యార్థికి ఒకే సమయంలో ఒక్క నాలుగు గంటల్లో విద్య గరపటమెలా అన్నదే సమస్య. 


 సంక్షోభం వచ్చినప్పుడే సమస్యకు పరిష్కారం బయటప డేది! గతంలో నల్లబల్ల దగ్గర యమకింకరుడి మాదిరిగా

టీచర్ బెత్తంతో విద్యార్థిని వణికించే ఉపాధ్యాయుడు..  కిందకు దిగి, బెంచీల మీద బుద్ధిగా కూర్చుంటాడు. 


నిష్పత్తిలో ఒక్క శాతంగా ఉన్న విద్యార్థి పైకెక్కి బల్లముందు కూర్చుంటాడు. మారిన కొత్త విద్యాభ్యాస విధానంలో విద్యార్థి వేసే హాజరుకు ఉపాధ్యాయులంతా 'జీ' హుజూర్ అన్న తరువాత విద్యాభాసం మొదలవుతుంది. 


బిడ్డ కళ్ళు మూసుకొని వేలు ఎవరివైపు చూపిస్తే ఆ పంతులుకు పాఠం చెప్పే సువర్ణావకాశం దక్కుతుంది.


శిక్షణ సమయంలో పక్క గురువులు కక్షతోనో, కడుపు మంటతోనో అల్లరికి తెగబడితే పిల్లవాడు వేసే శిక్షలు దారుణంగా ఉంటాయి. 


ఆ పూట పాఠం చెప్పే అవకాశం కోల్పోవడమే కాకుండా... బెంచీ ఎక్కడమో, గోడకుర్చీ వేయడమో తప్పనిసరి. అల్లరి మరీ మితిమీరితే బయట ఎండలో నిలబడటమూ తప్పదు గురువులకు . 


పాఠం వినే సమయంలో సాధార ణంగా ఏ పిల్లవాడూ పెదవి విప్పడు. తెలివితక్కువ వెధవ ఎవడైనా ఖర్మగాలి సందేహం వెలిబుచ్చితే పంతులు నోటి నుంచి ఠక్కున  బదులు రావాలి. వివరణ లు సంతృప్తికరంగా లేకపోతే గురువుకు గుంజీలు తప్పవు. శిష్యుడి చేతిలో బెత్తం ఆడుతున్నంత సేపూ గురువుల గుండెల్లో మెట్రో రైళ్లు పరుగెత్తుతుంటాయ్! 


ఇంటి దగ్గర పాఠం సరిగ్గా తర్పీదు కాకుండా వచ్చే అయ్యవారి పని గోవిందే! 'ఐ నెవ్వర్ టెల్ ఎనీ లెసన్' లాంటి పలకలు పంతుళ్ల మెడలో వేలాడదీసినా ఎదురు అడిగే విధానం కొత్త పద్ధతిలో పూర్తిగా రద్దయినట్లే! 'వ్యాపారంలో విని యోగదారుడే రాజు అయినట్లే మారే కొత్త విద్యావిధానంలో విద్యార్థే  రారాజు!


సర్కారు వారి విద్యారంగం హేతుబద్ధీకరణను హేళన చేయకుండా ఇలాంటి 'జంబలకిడిపంబ' సూత్రం అమలు చేస్తే తప్పేముంది? కాకపోతే కొద్దిగా తయారీరంగంలో మార్పులు అవసరం. 


ఉపాధ్యాయులకు ముందస్తు శిక్షణ ఉన్నట్లే, ఇకపై కొత్త పద్ధతిలో విద్యార్థికీ శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. 


ఒక్క గురువు వేధింపులకే తట్టుకోలేక పసివాళ్లు అఘాయిత్యాలకు ఒడిగడుతు న్నారు. ఇంతమంది యమ గురువులను ఒకేసారి ఒకే చోట ఎదుర్కొనే సామర్థ్యాలను బడికి పంపేముందే విద్యార్థికి శిక్షణ రూపంలో అలవరచాలి.


పిల్లనటులు పెద్ద దర్శకులను అదుపులో పెడుతు న్నారు. బొడ్డూడని పసిపిల్లలు కన్నవారిని కనుసన్నల్లో ఆడిస్తున్నారు. సర్కారు కార్యాలయ అజమాయిషీ మొత్తం అధికారులు చేతుల మీదుగానే సాగిపోతోంది. కార్యకర్తల ఆదేశాలమీద రాజకీయ నేతలు పార్టీ గోడలు దూకుతున్నారు. పూజారుల లెక్కల ప్రకారమే ఆ ఏడు కొండలవాడూ నామాల పొడుగు సరిదిద్దుకుంటున్న ప్పుడు, పిల్లకాయలు బెత్తం ముందు పాఠాలు చెప్పే గురు వులు చేతులు కట్టుకుని నిలబడి ఉంటే దోషమేముంది?


మీడియా హోరు, చిత్రాల బోరు, సీరియళ్ల జోరు ముందు బేజారు కాకుండా గట్టిగా నిలబడాలంటే చిన్న బడి నుంచే పెద్ద గురువులను అదుపుచేయడంలో తర్ఫీదు పొందాలేమో! 


ఎన్నికలవేళ వందలాది నేతలు వేలాది హామీలను ఒకేసారి గుప్పిస్తారు . ఓటరుగా ఆ నొప్పిని సహించాలన్నా, విద్యార్థి దశనుంచే సమాయత్తం చేయవలసిన అవసరం చాలా ఉంది . 


హేతుబద్ధీకరణ అసలు ఉద్దేశం కూడా అదే కావచ్చు! ఏమంటారు పిల్లలూ! 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సం.పు- 25-07-2013  న ప్రచురితం )

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...