Wednesday, December 29, 2021

వ్యాసం ప్రబంధాలలో పండుగ భోజనాలు - ఉత్పల సత్యనారాయణాచార్యులు ( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు .

 వ్యాసం 


ప్రబంధాలలో పండుగ భోజనాలు 

- ఉత్పల సత్యనారాయణాచార్యులు 

( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు .

                29-12- 2021 



తెలుగు సాహిత్యమున ఏదో యొక విందునో భోజనమునో పురస్కరించుకొని తెలుగువారి వంటకాలను విస్తరించి వర్ణించిన కవులలో ప్రముఖులు   శ్రీనాథుడు, శ్రీకృష్ణ రాయలు, పింగళి సూరన్న, తంజావూరు నేలిన విజయ  నాయకుడు. 


ఆయా కవులు తమ కులాచారములకును, అభిరుచులకును దగిన భోజన సదా ర్థములను వర్ణించియుండిరి. రాయలుమాత్రము  బ్రాహ్మణ..  బ్రాహ్మణేతర భోజనముల రెంటిని లెస్సగా నెఱిగినవా డగుట శాకాహార మాంసాహార భోజనముల జక్కగా వర్ణించి సమకాలపు సాంఘిక జీవనమును మనకు సాక్షాత్కరింప జేసి యున్నాడు. 


విస్సనమంత్రి పంక్తిని గూర్చుండి శ్రీనాథుడు హేమ పాత్రాన్న మారగించెడివాడు. అతని భోజనము సాధారణ మైన దైయుండదు. ఒకప్పుడు పల్నాడులో నొకరింట జొన్న న్నము పెట్టి, చింతచిగురు, బచ్చలాకు కలిపిన యుడుకు కూర వడ్డించిరట. కప్పురభోగి వంటకమున కలవాబుపడిన కవిసార్వ భౌమున కది యెట్లు రుచించును?


ఫుల్లసరోజనేత్ర ! యల పూతన చన్నుల చేదు ద్రావి నా 

సల్ల దవాగ్ని మ్రింగితి న టంచును నిక్కెద వేమొ తింత్రిణీ

పల్లవయు క్తమౌ యుడుకు బచ్చలి శాకము జొన్నకూటీతో 

మెల్లగ నొక్క ముద్ద మ్రింగుము నీ పస కాననయ్యెడిన్


అని పరిహాసము చేసినాడు. సన్నన్నము సున్నయైన పల్నాటి సీమను హేళన చేసి 'రసికుడు పోపడు పల్నాడు' అచట 'కుసు మాస్త్రుండైన జొన్నకూడే కుడువవలసి వచ్చు' సని యెఱుక పఱిచినాడు. ఆ కాలమున పూటకూలి ఇండ్లలో ముఖ్యముగా  లక్ష్మణవజ్ఝల నొక్క రూకకు చక్కని భోజనము లవారింట లభించెడిదట.


కప్పురభోగి  వంటకము కమ్మని గోధుమ పిండివంటయున్ 

గుప్పెడు పంచదారయునుక్రొత్తగ గాచిన యాలనే పెస 

ర్పప్పును గొమ్మున ల్లనటి పండ్లను నాలుగు నైదు నంజులున్ లప్పలతోడ త్రొంబెరుగు లక్ష్మణవజ్ఝల యింట రూకకున్.


తెలుగువారికి ముఖ్యముగా గుంటూరు మండల వాసులకు గోంగూర తగనియిష్టమను వాడుక యున్నది. ఆ ప్రాంతము వాడేయయిన శ్రీనాథు డేలనో గోంగూరను గొనియాడిన వాడు కాడు. ఇది చింతింపదగిన విషయమే మఱి ! ఆ కాలమున భోజనపరాక్రమము గల ఏ రామయమంత్రియో 'గోంగూర వంటి కూరయు గాంగేయునివంటి ధన్వి, నభూతోన భవిష్యతి' యని ప్రస్తుతించియుండవచ్చును. 'మా రామయమంత్రి భోజన పరాక్రమ మే మని చెప్పవచ్చు ఆ స్వామి యెఱుంగు తత్కబళ చాతురి తాళఫల ప్రమాణమున్ ' శ్రీనాథుడు, గోంగూరను గొనియాడకపోయినప్పటికి అరవవారి విండ్లను నిరసించియుండుట చేత నాంధ్రత్వమును నిల్పినవాడై నాడు. 


తొలుతనే ఒడ్డింత్రు  దొడ్డ మిర్యపుజారు చెవులలో పొగవెళ్లి చిమ్మి రేగ

బ్రహ్మరంధ్రము దాకా  బాఱు నావ పచ్చళ్లు మున్నగు అరవ పచ్చళ్లత నికి నచ్చవు. ఈ కవి సార్వభౌముడు కన్నడదేశమున కరిగియచ్చట 'రుచులు దోసంబంచు పోనాడి' నిస్పృహచెందిన వాడు. కావ్యపా కాలలో శ్రీనాథుడు నేటికాలపు రమ్యతయు రుచియు తెలిసిన రసికుడు ఇడైనలకు తన కావ్యమున చో టిచ్చిన యీ కవి నేటి నవనాగరిక యుగమున నుండదగినవాడు.


రాయలు ఋతుపర్ణనలో నాయా కాలములకు దగిన పంటక ములను బేర్కొనియున్నాడు. బ్రాహ్మణభోజనమును గూర్చి చెప్పుచు రాయలు పొరివిళం గాయలను బేర్కొ నెను. వేపుడు బియ్యపు పిండి బెల్లపు పాకముతో జేసిన యుండ లవి. పెరుగువడియములు, పచ్చివరుగులు - వాన కాలమున గలమాన్నము ఒల్చిన పప్పు, నాలుగైదు పొగపిన కూరలు - వేసవి కాలమున నులివెచ్చని యన్నము, తియ్యని చారులు, మజ్జిగపులుసులు, పలుచని యంబలి, చెఱకుపాలు, ఎడనీళ్లు, వడపిందెలు, ఊర గాయలు, నీరుచల్ల – ఇక చలికాలమున మిరియపు పొళ్లతో గూడిన వెచ్చవెచ్చని కూరలు, అవపచ్చళ్లు, చేయి చురుక్కను నేయి, ఇవురగాచిన పాలు బ్రాహ్మణు లారగించెడివారట.


తారుణ్యాతిగ చూతనూత్న ఫల యుక్తాలాభిఘార స్వన 

ద్ధారాధూపిత శుష్యదంబు హృత మాత్స్యచ్ఛేద పాకోద్దతో ద్గారంపుంగనరార్చు భోగులకు సంధ్యావేళలం గోళికాం 

తారాభ్యంతర వాలుకాస్థిత హి మాంతర్నారికేళాంబువుల్


మాంసాహారులైన ధనికులు వేసవి కాలమున చేపల తునకలలో మామిడి కాయముక్కలు వేసి తాళింపు పెట్టి మధ్యాహ్న వేళలం దల్పాహారముగా బుచ్చుకొనెడివారట. ఆ పిమ్మట స్నాన శాల దాపున దడియిసుకలో బూడ్చి పెట్టిన కొబ్బరిబొండములు దీసి ఎడనీరు త్రాగి చేపల కనరును పోగొట్టుకొనెడివా రట. శాకాహారపు అల్పాహారముగూడ నిండకు దక్కువైనది కాదు. పనసతొనలు, దోసబద్దలు, తియ్యదానిమ్మలు, గసదాడి అరటి పండ్లు పానకములు బ్రాహ్మణులు సాపడుచుండెడివారట.


శ్రావణ మాసమున ఆకుకూర అధికము. ఆకాలమున సామాన్యులైన రెడ్లు చెంచలి, తుమ్మి, లేత తిగిరిసాకు తఱగి చింతచిగురు కలిపి నూనెలో వేయించి పొడికూర చేసికొనెడి వారు.


గురుగుం జెంచలి దుమ్మి లేదగిరి సాకుం దింత్రిణీ పల్లవో 

త్కరముం గూడ దొరంటి సూనియలతో గట్టావి కుట్టారు

గిరముల్ మెక్కి తమిన్ బసుల్ పొలము వో గ్రేపుల్ మెయుల్నాక మే 

కరువు గుంపటి మంచ మెక్కిరి ప్రభు త్వైకాప్తి రెడ్లజ్జడిన్.


పెద్ద నార్యుడు శ్రీనాథుని వంటి అనుభవ రసికు డయ్యును నారని కేలతో వంటకములపై బుద్ధిపోలేదు. ఆయనకు 'ఆత్మ కింపయిన భోజన' మున్న జాలు. కప్పురభోగి పంటకముకన్న పెద్దన్నకు కప్పురపు ఏడెమే ముఖ్యము. 


పారిజాతాపహరణప్రబంధమున నంది తిమ్మన్న 'శాక పాకంబుల చవులు వక్కా ణించుచు' శ్రీకృష్ణుడు భుజించినట్లు వర్ణించి యుండెనే కాని, ఆ శాక పాకములను మనదాక రానిచ్చిన వాడు కాదు.


కమ్మనై కారమై నేతను పండంబొల్చి, త దుమురై పాఱుటల్ లేక సద్యోజనితంబుల్ వోలెఁ జాలు జపులోదవునవి కండచక్కెర పాకమున దయారయినవియు సగు అప్పాలను తెనాలి రామకృష్ణుడు వర్ణించెను. ఇచ్చట కార మనగా ఘాటని అర్థము. పింగళి సూరనార్యుడు తన కథానాయకుడై న క ళాపూర్ణునకు బ్రాహ్మణ భోజనమే పెట్టించెను.


పట్లు మండిగలు బొబ్బట్లు వడలు కుడుములు సుకియలు గడియంపుటట్లు వె

కల వంటకములు బూరెలు తేనె తొలలు చా న్నప్పాలు వడియంబు లప్పడాలు బొంగరములు సొజ్జెబూరె కాగుల సేవె లుక్కెర లరిసెలు చక్కిలములు.


తంజాపు రాంధ్ర నాయక రాజైన రఘునాథ భూపాలుడు శ్రీనాథుని కప్పురభోగి పంటకములను చవిచూచినవా డగుటచే గాబోలు తన కాలపు దొరల భోజనములను గూర్చి రఘునాథ రామాయణమం దిట్లు వర్ణించెను.


కప్పురభోగి పంటకము కమ్మగనే పడియున్ భుజించి మేల్

దుప్పటులట్లు మూరగల తోరవు పచ్చడముల్..

కప్పుకొచెడి వారట! ఈ రఘునాథ భూపాలుని కుమారుడైన విజయ రాఘవ నాయకుని రఘునాథాభ్యుదయ ద్విపద కావ్యమం దానాటి వంటకములలోని విశేషము లెన్నేనియు గ్రహింప వచ్చును. ఈ కవిరాజు భోజన మిషతో నాటి మహారాజుల మహానసమున ఘుమఘుమలాడు వంటకములను బెక్కింటిని పేర్కొని యున్నాడు.


ఒక వేదండయాన కై దండ యుసగ దిగి బంగరు పీటమీద గూర్చుండిన పట్టపు రాజు పళ్లెరమున దొలుతగా “గిలుకు టం దెలు మ్రోయ గీరసల్లాప కులుకుచు పచ్చడులు గొని వచ్చినదట ! వడ్డన మొదలుకొని స్వీయ సంప్రదాయమునే వర్ణించి నాడు విజయ రాఘవుడు.


"అప్పడాల్ నువు పొడి హవణించినట్టి 

కప్పురపుకోడి యొక్క లతాంగి తెచ్చె

 తురిమిన టెంకాయ తునియలు గూర్చి కరివేప పొడిచల్లి కమ్మని నేత

పొంకంబుగా దాల్చి పొదిగినయట్టి కుంకుమకోడి గై కొనివచ్చె నొకతి"


ఈ వంటకములలోని పదార్థములనుబట్టి ఇవి శాక సంబం ధములే యనియు, నేటి పకోడీలవంటివే కప్పురపుకోడి మున్నగు నవి యనియు, నాటి బ్రాహ్మణులుగూడ నిట్టివి చేయుచుండెడివా రనియును జెప్పవచ్చును. కాని బ్రాహ్మణులు దీనిని కప్పురపు కోడి, కుంకుమకోడి, కస్తూరికోడి, పాలకోడి, కట్టుకోడి అని పేర్కొనకపోవచ్చును. పదార్థ మొక్కటియయ్యును వ్యవహారమునందును, పేర్లలోను కొద్దిపాటి భేద ముండవచ్చును. కో ళ్లన్నియు బోయి పకోడీలు మాత్రము నిలిచినవి. 


నీరుమజ్జిగయనగ మనము సాధారణముగా మజ్జిగ తేట యని భ్రమపడుదుము. అది కాదు.


"సారమౌ జంబీర సారంపు రుచుల 

మీఱంగ లవణంబు మితముగా గూర్చి 

మేలైన సొంటితో మిళిత మైనట్టి 

ఏలకి పొడివైచి యింపు దీసింప 

దగు వట్టివేళ్లచే తావులు గట్టి 

మగువ యొక్క తె నీరుమజ్జిగ దెచ్చె"


ఇవి కాక మనము మఱచిపోయిన సారసత్తులు, పేణీలు మున్నగు ఈ కవి తన ప్రబంధమున నిబంధించి మనకు రుచి చూపించుచున్నాడు.



- ఉత్పల సత్యనారాయణాచార్యులు 

( ఆంధ్ర ప్రదేశ్ - మాప - జనవరి, 1961 ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు .

                29-12- 2021 

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్


 



చార్లెస్ ఫిలిప్ బ్రౌన్


( జననం : నవంబరు 10, 1788)


నూరార్లు లెక్క చేయక

పేర్లెక్కిన విబుధ వరుల బిలిపించుచు వే

మార్లర్థ మిచ్చు వితరణి 

చార్లెసు ఫీలిప్సు బ్రౌను సాహెబు కరుణన్.


ఎవరయ్యా ఈ చార్లెసు ఫిలిప్సు బ్రౌన్ సాహెబు? 


పేర్లెక్కిన విబుధవరులను ఎందుకు పిలిపించేవాడు? అర్థ వితరణం ఎందుకు చేసేవాడట? 


మన దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిస్తూ ఉండిన కాలంలో ఆ కుంఫినీ కొలువులో ఉండి కడప, మచిలీపట్నం మొదలైన చోట్ల చాలా సంవత్సరాల పాటు జడ్జీగా  పనిచేసిన ఇంగ్లీషు దొర-  బ్రౌన్. 


ఎందరు దొరలు మన దేశానికి రాలేదు? ఎందరు ఇక్కడ కొలువు చేయలేదు? తమ దేశం కొలువు చేస్తూ మనదేశాన్ని కొల్లగొట్టలేదు? ఐతే ఈ బ్రౌన్ దొర విశేషం ఏమిటి?


ఈ బ్రౌన్ దొర తన దేశాన్ని కొలుస్తూ ఆ కొలువుకు ఏమాత్రమూ భంగం కలగకుండా అంతకంటే ఎక్కువగా తెలుగు దేశపు కొలువు చేశాడు. మనలను కొల్ల గొట్టలేదు సరికదా తన డబ్బే విస్తారంగా మనకోసం వెచ్చించాడు. నిస్వార్థంగా తెలుగు భాష సేవలో, తెలుగు సాహిత్యం ఉద్ధరణకోసం ఎన్నో ఉత్తమ గ్రంథాలను చెదపురుగుల నోట పడకుండా కాపాడాడు. అనేక కావ్యాల వ్రాత ప్రతులను సంపాదించి తప్పుల కుప్పలుగా ఉన్న వాటిని శ్రద్ధగా పరిశీలించి సంస్కరించి ముద్రింపించాడు. తెలుగు ఇంగ్లీషు నిఘంటువును, ఇంగ్లీషు తెలుగు నిఘంటువును కూర్చాడు.  ఈ మహా భాషా సాహిత్య వ్య యానికి ఆయనే మదుపు పెట్టాడు. మదుపు పెట్టిన దానికి ఆయన ఆపేక్షించిన ప్రతిఫలం ఆంధ్రుల విజ్ఞానమూ, వికాసమూను. 


మరి ఆ భాషా సేవలో తనకు సహాయ పడడానికోసమే బ్రౌన్ దొర పేరెక్కిన విబుధ వరులను పిలిపించి తాను పోషించాడు. వేతనాలు ఇచ్చి ఆయన వేమార్లరమిచ్చు వితరణి కూడా. 


కష్టంలో ఉన్న ఒకాయన కొంత పాండిత్యం ఉన్నవాడై ఉండాలికూడా తనకు సహాయం చేయవలసినదిగా బ్రౌన్ దొరగారిని అర్థిస్తూ దొరగారు పండితుడు కనుక ఆయనను కొంచెం మెప్పించినట్లవుతుందని భాగవతం గజేంద్ర మోక్ష ఘట్టంలోని పద్యం వ్రాసి పంపించాడట!


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపన్ దగున్ రావే యీశ్వర కావవే వరద సంరక్షించు దీనునిన్ భద్రాత్మకా


బ్రౌన్ దొర కొంత సొమ్ము ముట్టజెప్పాడట. ఆ వచ్చిన పద్యపు అర్జీమీద పద్యంలోనే ఒక ఎండార్స్ మెంట్  కూడా వ్రాశా డట. ఆ పద్యంకూడ భాగవతంలోనిదే:


ఏను మృతుండ నౌదునని యింత భయంబు మనంబులోపలన్ 

మానుము సంభవంబుగల మానవకోటికి చావు

నిక్కమౌ గాన హరిం దలంపు ఒక గందు జన్మము నీకు ధాత్రిపై

మానవ నాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్ .


బ్రౌన్ దొర పండితుడు. పండితాభిమాని, న్యాయమూర్తి. రావణ దమ్మీయ ద్వ్యర్థికావ్యాన్ని రచించిన పిండిప్రోలు లక్ష్మణ కవి మేనల్లునికి ఒక వ్యాజ్యెంలో అన్యాయం జరిగింది. న్యాయాధి కారి లంచం తీసుకొని అన్యాయమైన తీర్పు చెప్పాడు. అప్పుడు రాజమహేంద్రవరంలో జిల్లా జడ్జీగా ఉన్న బ్రౌన్ దొర దగ్గరికి అప్పీలు వచ్చింది. లక్ష్మణ కవి దొరగారిని దర్శించి ఒక పద్యం చెప్పాడు.


మధువైరికిన్ వనమాలికి గౌస్తుభ

హారునకును సంశ్రితావసునకు రాధికా ప్రియునకు రామసోదరునకు 

జగదీశునకు దయాసాగరునకు 

శ్రీ నాథునకును రక్షిత దేవ సమితికి 

బ్రౌఢ భావునకు నారాయణునకు 

నురగేంద్ర తల్పున కరి శంఖ ధరునకు 

దొగల రాయని గేరు మొగము దొరకు 

రణ నిహత దుష్ట రాక్షస రమణునకును 

గాన మోహిత వల్లవీ కాంతునకును

రిపు విదారికి హరికి శ్రీ కృష్ణునకును 

కిల్పిషారికి నే నమస్కృతి యొనర్తు.


శ్రీ కృష్ణునికి నమస్కారం అని చెప్పిన ఈ పద్యం ప్రతి పాదంలోని మొదటి అక్షరాలను వరసగా చదివితే 'మహారాజశ్రీ బ్రౌన్ దొరగారికి' అని అవుతుంది. 


జరిగిన అక్రమాన్ని ఆలకించి న్యాయమూర్తి బ్రౌన్ దొర న్యాయం చేకూర్చాడట.


విదేశీయులు తెలుగు నేర్చుకోవడానికి సహాయపడే తెలుగు వ్యాకరణాన్ని రచించాడు బ్రౌన్. తెలుగు వారికి ఎంతగానో ఉపకరించే తెలుగు ఇంగ్లీషు నిఘంటువును, ఇంగ్లీషు తెలుగు నిఘంటువును తయారు చేశాడు.


బ్రౌన్ దొర అభ్యుదయ వాది. ఛాందస పండితులు పట్టు కొని వ్రేలాడే అర్ధానుస్వార శకట రేఫాలు వాడుక నుండి ఏనాడో నిష్క్రమించిన అర్థరహితమైన సంజ్ఞలు అని ధైర్యంగా చెప్పగలి గాడు. 


ఆయన తరువాత దాదాపు ఒక శతాబ్దానికి కాని గిడుగు రామమూ ర్తి పంతులు గారి కృషి ఫలితంగా వ్యావహారిక భాషకు మన్నన కలుగలేదు. బ్రౌన్ దొర ఏనాడో వ్యావహారిక భాషకు గౌరవం కలగజేశాడు.


బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పాఠశాలా పరీక్షలలో తరుచు అడుగుతూ ఉండే ప్రశ్న ఒకటి ఉండేది. 

 "బ్రిటిష్ పాలన వలన మనకు కలిగిన లాభములేవి"? అని. 


రైళ్ళు, తపాలా ఆఫీసులు వగైరా ఏవేవో విద్యార్థులు జవాబుగా వ్రాస్తూ ఉండేవారు. 


వాటి మాట ఎలా ఉన్నా బ్రిటిష్ పరిపాలన వలన తెలుగు దేశానికి కలిగిన ఒక పెద్ద ప్రయోజనం..  చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని నిస్సం దేహంగా చెప్పవచ్చు


- ఎన్. శివనారాయణ

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక బెక బెక రాజకీయం రచన - కర్లపాలెంహనుమంతరావు ( ప్రచురితం - 12 - 03-2014 )


 



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక 

బెక బెక రాజకీయం 

రచన - కర్లపాలెంహనుమంతరావు

( ప్రచురితం - 12 - 03-2014 ) 


'కప్పుల బెకబెకలు మరీ ఎక్కువైపోతున్నాయి. రాత్రుళ్లే కాదు. పగలూ నిద్రపట్టడం లేదు ఈ కప్పుల గోలకు' '


అకాల వర్షాలు కదన్నా! కప్పల సందడి ఆ మాత్రమన్నా ఉండదా? 


ఆ కప్పులు కాదురా వెంగళప్పా నా గోల ! ఈ రాజకీయ గోదురు కప్పుల గురించిరా బాబూ!  ఇప్పటిదాకా ఏ రాళ్ల కడుపుల్లో వెచ్చగా బబ్బున్నాయోగానీ, నాలుగు చినుకులు పడేసరికి బొబ్బలు మొదలు పెడుతున్నాయి.


వానలన్నాక కప్పలు, ఎన్నికలన్నాక రాజకీయ కప్పలు సహజమే కదన్నా! కాకపోతే లోపల ' కాక ' మరీ ఎక్కువైనట్లుంది . ఈసారి ఎప్పటికన్నా కాస్త ఎక్కువగా బయటపడుతున్నాయి.


కొత్త కప్పలు  కూడా ఎక్కడెక్కడినుంచో పుట్టుకొస్తున్నాయప్పా !  అంతంత గొంతులేసుకుని గంతులేస్తున్నాయి. గోకప్పల్ని మించి ముదిరిపోతున్నాయి. దురు


ఇప్పట్నుంచే కప్పల్ని తిట్టుకుంటూ కూర్చుంటే లాభమేముం చెప్పన్నా! కప్పల్ని కన్నా ఆకాల వర్షాల్ని అనాలి గాని! నిన్నమొన్నటి దాకా ఎక్కడా ఒక్క వాన చుక్క కనిపించలేదు. గంగానమ్మ జాతర్ల నుంచి గాడిదల జంటలకు పెళ్ళిళ్ల దాకా దేన్నీ వదిలిపెట్టింది లేదు కాదా మనవాళ్లు!  అందుకేనేమో చాలా కాలం తరువాత వానలు దంచి  కొడుతున్నాయి .


వట్టి వానలైతే ఫర్వాలేదురా అబ్బీ ఒకవంక ప్రాణాలు తీసే వడగళ్లతోపాటు కప్పుల గోలా  మాలావుగా ఉంది . మరోవంక ఎన్నికల మీద ఎన్ని కలు జనాలు నెత్తిన పిడుగుల్లా వచ్చి పడి కష్టం రెట్టింపైంది. ఎన్నికలనేవి అసలు లేకుండా పోయుంటే, ఈ రాజకీయ కప్పుల వంగుళ్లు దూకుళ్ల గోలన్నా తప్పిఉండేది కదా!


ఉగ్రవాదుల మాదిరిగా వాదిస్తున్నావేందన్నా! ఎన్నికలు ఉండబట్టే గదా మనలాంటి ఓడమల్లయ్యలున్నా రని పెద్దమనుషులకు తెలిసొచ్చేది! .నియంతృత్వం మీదకానీ మోజు పెరుగుతోందా ఏంది నీకు! 


అక్కడికి ఇప్పుడు నడుస్తున్నదంతా పెద్ద ప్రజాస్వా మ్యమే అయినట్లు!  నాకు తెలీక అడుగుతా, రెండింటికీ తేడా ఎక్కడుందిరా? ఓట్టేసి అనక నోర్మూసుకుని ఉంటాం. నియంతృత్వంలో.  నియంతల పాలనలో  ఆ ఓట్ల పాట్లూ  ఉండవు అంతే! 


సే భాషలో నువ్వేం చెప్పినా, ఎన్నికలనేవి ఉండబట్టే మనకు ఈ మాత్రమైనా మంచి జరుగుతోంది. నగదు బదిలీ రోగం వదిలిందా ! వంటగ్యాస్ సిలిండర్లు మళ్ళీ గతంలోలా పన్నెండు వరకూ దిగిందా! చిల్లర వ్యాపా రాలు చేసుకునేవాళ్లకు పోలీసు మార్కు  సత్కారాలు తప్పుతు

న్నాయా! కోరలున్నా లేకపోయినా లోక్ పాలు  బిల్లంటూ ఓటి ముందుకు కదిలిందా! ఎన్నికలే  లేకుంటే ఈ మాత్రమైనా జనం గురించి ఆలోచించేవాళ్లీ  గద్దెల మీది  పెద్ద ప్రభువులు? 


ఎన్నికలపై నాకూ తప్పుడు అభిప్రాయమేమీ లేదురా అబ్బీ!  జరుగుతున్న తంతు గురించే నా దిగులంతా ! ఎన్నికలనేసరికి ఎక్కడలేని హడావుడి .. హంగామా!  వేడివేడి పెసరట్టులాగా ఉదయాన్నే వార్తలొచ్చేస్తాయి. ఈ అల్పాహారం రుచికి అలవాటు ఓటరు పౌష్టికాహారం పూర్తిగా పక్కన పెట్టేస్తాడన్నదే నా బాధ. అభివృద్ధి గురించి గానీ, నిలబెట్టుకోవాల్సిన సంపద గురించి గానీ  ఎక్కడైనా ఒక్క చక్కని చర్చ జరుగుతోందా? ఎన్నికలకు వందరోజుల ముందు మాత్రం విరుగుడు మంత్రంగా మందులేస్తే ఈ దేశానికి పట్టిన పెద్దరోగం నయమవుతుందా? మాయదారి రాజకీయాల మూలంగా కాదూ, మనం వద్దని  ఎంత మొత్తుకున్నా విదేశాల తుక్కు అణుపరిశ్రమలు మన నెత్తిమీదకు వచ్చి పడింది! మనదగ్గరే వీధికొక చిల్లర దుకాణం చల్లగా వ్యాపారం చేసుకుంటున్నా ఏం ఉద్ధరించాలని బలవంతంగా పరాయిగడ్డ దుకాణాలను రుద్దబోయింది। వద్దన్న చోట సెజ్జులు! కావాలన్నా ఇవ్వరు పరిశ్రమలు ! జనం మాట నిదానంగా ఆలకించి ఆచరించిన పాపాన పోయారా మనం ఓట్లేసి గెలిపించిన నేతలు?  


ప్రజాస్వామ్యం అంటే అదేదో పచ్చి కాకరకాయ చేదు అన్నంత వితండంగా వాదిస్తున్నావేందన్నా?  ఎప్పుడో ఒకప్పుడన్నా ఎన్నికలొచ్చి పోయే  సదుపాయం చిన్నదా.. చిత కదా ? ఉత్తప్పుడు ఎంత చెల, రాజకీయాలకు పాల్పడ్డా  , కనీసం ఎన్నికల ముందైనా అంత రాత్మ అంటూ ఒకటి ఏడ్చిందని, , దానికీ అంతో ఇంతో ఆత్మాభిమానం ఉంటుందని, తగిన గుర్తింపు ఇవ్వకుంటే  మొత్తం రాజకీయాలని  తారుమారు చేసేస్తుందని  తెలుస్తుంది గదా! ప్రభుత్వాలని  నడపటం ఎలా, సామాన్యుడి జీవితాన్ని గాడిలో పెట్టడం ఎలా అని ఊరికే ఇంట్లో ఓ మూల కూర్చుని కాగితాలు నలుపు చేసుకునే మేధావులకూ చిన్నదో చితకదో ఒక పార్టీ అంటూ పెట్టుకునే గొప్ప తరుణం ఎన్నికలంటూ ఉండబట్టేగదా వచ్చేదీ! 


అవును . నిజమే పాత పార్టీల్లోంచి కొత్త పార్టీలు పుటుకొస్తున్నాయి.  ఆ కొత్త పార్టీల్లో కొన్ని చీలి, మళ్ళీ పాత పార్టీలో కలుస్తున్నాయి. అవి ఇవి కలకలిసిపోయి, చివరకు కొత్తపార్టీ ఏదో, పాత పార్టీ ఏదో అర్ధమవకుండా పోతుంది . ఇందులోనివారు అందులోకి..  . అందు లోనివారు ఇందులోకి దూకుతున్నారు. వారూ వీరూ ఉమ్మడిగా  ఇంకెందులోకో గెంతుతున్నారు. ఈ దూకపళ్ళు చూసి, కప్పరే తమ స్పెప్పులు  మరచిపోయేట్టున్నాయి. 


ఆగన్నా ఆగు... నాకు తల తిరిగిపోతోంది.


ఈ ఒక్క నాలుగు ముక్కలకే నీకు ఇలా తలా మొలా తిరిగిపోతుంటే, మరి మామూలు మనిషికి ఇంకెంతలా తిరిగిపోవాల్రా... ఆలోచించు!  ధరల పెరుగుదల జోరు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పెట్రోలు బంకుల్లో, బ్యాంకుల్లో బయటపడుతున్న మోసాలు ఇప్పటికిప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవైతే కావు. ఇవాల్టి కివాళ ఆగిపోయేవీ కావు.. విద్యుత్ కోతల సమయం రెట్టింపైంది. ఉద్యోగాలు ఉపాధులు ప్రకటనలకే పరిమితం.  వాస్తవంగా ఒక్కటన్నా వచ్చి ఒరగబెట్టిందేమీ లేదు. చదువులు సాగటం లేదు . సరిగ్గా ప్రైవేటు బస్సులు, బళ్లు జనాల మీదపడి చేసే నిలువుదోపిడికి అడ్డూ ఆపూ లేదు. సైనికుల వాహనాల నుంచి జనతాకు పంచే చిల్లర సరకుల సంచుల దాకా కుంభకోణాలు.  అయినా, ఆ అక్రమార్కులే మళ్ళీ జనం మధ్యకు వచ్చి వాహనాలపై నిలబడి నిజాయతీ గురించి ఉపన్యాసాలు దంచేస్తారు. . జనాలు చప్పట్లు బాదేస్తారు . ఓట్లు రాబట్టుకోవడానికేనా ఎన్నికలు? 


కప్పదాట్లన్నీ  ఓట్లకు సీట్లకు కాకపోతే.. మరెందుకన్నా! 


రచన - కర్లపాలెంహనుమంతరావు

( ప్రచురితం - 12 - 03-2014 ) 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం పదకొండో అవతారం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 23-03-2009 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

పదకొండో అవతారం 


రచన- కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23-03-2009 ) 


' దేవుడు భక్తులకు వరాలివ్వటం రివాజు. దేవుడిమీదే వరాల జల్లు కురిపిస్తున్నారు మీ భక్తులు ఈ రోజు'  అంది పతిదేవుడి పాదాలు నొక్కుతూ లక్ష్మీదేవి.


దేవుడు ముడుపులకు పడిపోతాడా?' అనడిగాడు శ్రీమన్నారాయణుడు చిద్విలాసంగా అరమోడ్పు కన్నులతో నిద్రను అభినయిస్తూ.


'ద్వాపరంలో తమరు మణిమాణిక్యాలను కూడా కాదని వట్టి తులసిదళానికే దాసులైపోలేదా స్వామీ! అందుకే ఈ కలికాలంలో కూడా ఏ టీవీ పెట్టో, వందనోట్లు పెట్టో దాసోహం చేసుకోవాలని చూస్తున్నారు తమ భక్తులు' అంది లక్ష్మి దెప్పుతున్నట్లు.


దేవుడి నాడి పట్టుకోవడం అంత సులభమా దేవీ! పక్క పార్టీవాళ్ళ రెక్కపుచ్చుకుని లాక్కొచ్చుకున్నంత తేలికని భ్రమ! 


పోయినసారి పదవీ స్వీకారమప్పుడు తమమీదే ప్రమాణం చేశారు గదా దేవా మన భక్తులు.... ఏమైంది? రామవారధి శ్రీరాములవారే కట్టలేదంటున్నారు ఇప్పుడు। అయోధ్యలో ఆలయం కడతామన్న మాటలు టమాటాలంత విలువైనా చేయటం లేదు. 


నిజమే దేవీ ! బెజవాడ దుర్గ విగ్రహానికే నకిలీ బెడద తప్పలేదు. మాటామంతీ నేర్పిన మన విధాతా సతీమణి వాణినే మాతృభాష అని చులకన మంత్రులూ... నాయకులూ' చేస్తున్నారు.


ఆడదానిమీద మీ మగాడికెప్పుడూ శీతకన్నేగా స్వామీ! తమరు కూడా మినహాయింపు కాదు. ఎన్ని యుగాలబట్టి మీ పాదాల దగ్గర ఇలా పడున్నాను... గజేంద్ర మోక్షం నాడు గభాలున అలా చెప్పా పెట్టకుండా లేచెళ్ళిపోయారు। వరాలిచ్చే వేళైనా ఒక్కసారైనా నా సలహా తమరు తీసుకున్నారా? యథా 'దేవా తదా భక్తా! ' . మనిషి మాత్రం మరోలాగా ఎందుకుంటాడు !  అందుకే ' ఆకాశంలో సగానికి పైగా మేము ఉన్నా చట్టసభల్లో మాత్రం అవకాశాలు సున్నా' అంది లక్ష్మి శ్రీవారి పాదాలను మరింత కసిగా మర్ధిస్తూ,


చట్టసభల్లో మాదిరి ఈ కొట్టుకోవటాలేమిటి తల్లీ! అక్కడ మీ గుళ్ళనూ, గుడిలో లింగాలనూ మింగే రాక్ష సులు మళ్ళా పదవుల్లోకి రావాలని యజ్ఞాలు  చేస్తు న్నారు. యాగాలు మీకు.. భోగాలు వాళ్ళకు.  మీ ఆల యాలు అవినీతికి నిలయాలుగా మారాయి నారాయణా! మీ భూమినీ సొమ్మునూ పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రసాదాల్లా పంచుకుంటున్నారు. విడిది గృహాలను విచ్చలవి డిగా వాడుకుంటున్నారు. మీరిలాగే కళ్ళు మూసుకుని తన్మయత్వం నటిస్తుంటే గర్భగుళ్ళలోనూ  తమ పిత్నదేవుళ్ల  విగ్రహాలు ప్రతిష్టించుకునేట్లున్నారు'  అన్నాడు. . అప్పుడే వచ్చిన నారదుడు హడావుడి పడిపోతూ.


నారదుడు చెప్పింది నిజం స్వామీ! తిరుమలలో మనం పవళించే వేళనీ చూడకుండా పైవాళ్ళకు ప్రత్యేక దర్శనాలి వ్వమని వేధించే నాయకులు ఎక్కువైపోతున్నారు. ఏవేవో కల్యాణాల పేర్లు చెప్పి రెండు పట్టుచీరెలు, పంచలూ మన మొహాన కొట్టి ఇన్ని ముత్యాల తలంబ్రాలు తలమీద పోసి పోతే తమ తప్పులకు తలాడిస్తామనుకుంటున్నారు. పండగల వంకలో పేపర్ల నిండా మాది దేవుడి పాలన అని రెండేసి పేజీల ప్రకటనలిచ్చి బ్రహ్మాండంగా ప్రచా రాలు చేసుకుంటున్నారు' అంది లక్ష్మి ఆవేదనగా,


అంతేనా! వేళకు వానలు పడితే వరుణదేవుడు వాళ్ళ పార్టీలోకి మారాడనీ, రెహమానుకి ఆస్కారవార్డు వస్తే అదంతా వాళ్ళ మహిమేననీ, అణు ఒప్పందానికి మీ ఆమోదముద్ర ఎప్పుడో పడి పోయిందనీ, గాంధీగారి కళ్ళజోళ్ళూ.. కాలిజోళ్ళు వాళ్ళు చెబితేనే మీరు వాళ్ళ దేశానికి ఇప్పించారనీ, క్రికెట్లో ఓవరుకు ముఫ్ఫైయారు పరుగులు వాళ్ళ మాటమీదే మీరు యువరాజ్ చేత చేయించారని తెగ డప్పులు కొట్టేసుకుంటున్నారు మహాత్మా! సర్వసాక్షివి నీ పేరునే వాళ్ళు పత్రికలకీ, టీవీలకి వాడుకొంటూ సర్వం నాశనం చేస్తున్నారు. 'అభయహస్తం' అంటేనే జనం భయపడుతున్నారు. దొరకని బియ్యం కిలో రెండు .. దొరికితే ఉల్లి కిలో ఇరవై ! నీళ్ళు లేకుండానే డాములు కడతామంటున్నారు. నకిలీ పైపులు  పగిలి జలయజ్ఞానికన్నా ముందు జలప్రళయం ముంచుకొస్తుందేమోనని జనం వణికి చస్తున్నారు. గుండెనొప్పి వస్తే ఆసుపత్రివైద్యం... ఆకలినొప్పికి మాత్రం కల్తీ మద్యమే వైద్యమట... చోద్యం! ఆణా వడ్డీ నారాయణమంత్రంలాగా అదేపనిగా పదేపదే జపిస్తున్నారు. క్షమాభిక్షలతో రాక్షసులు బైటికొచ్చారు. అక్రమార్కుల మీద సర్కారు జీఓల మంత్రజలం చల్లి విక్రమార్కులుగా మార్చి దేశంమీదకు వదిలేశారు. ధరలు దిగిరాకపోయినా, ఉద్యో గాలు ఊడిపోతున్నా, ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతున్నా ఆడవాళ్ళమీద అఘాయిత్యాలను ఆపలేకపోతున్నా, ఆపద్బాంధవుడిలాంటి తమ నామధేయాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. మహాత్మా! రెండువేల పన్నెండులో ప్రపంచానికి ప్రళయం వస్తుందంటున్నారు. ఈ వరస చూస్తే ఈ దేశానికి మూడేళ్ళు ముందుగానే ముంచుకొచ్చేటట్లుంది గోవిందా?


అన్నీ వింటున్న శేషశయనుడు కనులు తెరిచి అడిగాడు ఆఖరికి


'వేదాల కోసం మత్స్యావతారం, భూదేవికోసం వరాహావతారం, అమృతం కోసం కూర్మావతారం, ధర్మాల కోసం నరసింహావతారం, దానాలకోసం వామనావతారం, మర్యాదకోసం రామావతారం, విజయాలకోసం పరశురామావతారం, మంచి రాజకీయా లకోసం కృష్ణావతారం, బుద్ధికోసం బుద్ధావతారం... ఆఖరికి ఆకలికోసం కలికి అవతారం కూడా ఎత్తేశాను గదా నారదా! పది అవతారాలూ వృథాయేనా? అన్ని అవలక్ష ణాలతో మళ్ళీ జన్మ ఎత్తిన ఈ దుష్టరాజకీయాన్ని శిక్షిం చటానికిప్పుడు మళ్ళీ ఏమి చేయాలి?


పదకొండో అవతారం ఎత్తాలి పరంధామా! ఓటరు జన్మ ఎత్తి 'బ్యాలెట్' ఆయుధాన్ని అందుకోవాలి నారా యణా! అప్పుడే సర్వజనావళికి సంక్షేమం- అన్నాడు నారదుడు రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ. 


'నిజమే నాథా! ముందు లేవండి!' అంది లక్ష్మి నారదుడి మాటలకు  మద్దతుగా పాదసేవ అప్పటికి ఆపి. 


కర్లపాలెం  హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 23-03-2009 ) 

ఈనాడు - సంపాదకీయం క్రీడా స్ఫూర్తి ... రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 )

 


ఈనాడు - సంపాదకీయం 

క్రీడా స్ఫూర్తి 


...

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 ) 


'క్రిందు మీదెఱిగి కృతకార్యుడగువాడు/ చేయు కార్యమెల్ల సిద్ధి బొందునన్న' ది  మడికి సింగన పద్మపురాణ ప్రవచనం. తండ్రి తొడలపై కూర్చుండనీయలేదని చిన్నారి ధ్రువుడు దృఢదీక్షకు దిగి శ్రీమన్నారాయణుడిని ప్రసన్నం చేసుకున్న కథ పోతన భాగవతంలో కనపడుతుంది. బాల ధ్రువుడికి కార్యదీక్ష లక్షణాలను వివరిస్తూ నారదులవారు చేసిన బోధ- సర్వకాలాలకు వర్తించే కార్యదక్షత పాఠం 'యుద్ధ సమయంలో బంధుమిత్ర పరివారాన్ని సంహరించడం ధర్మకార్యమేనా? ' అంటూ పార్థుడిలాగా సందేహ డోలికల్లో ఊగిసలాడేవాడికి విజయం- చెట్టుమీద ఉన్నా కొట్టలేని పిట్టలాంటిదే. ' చిత్తము చిక్కబట్టుము; త్యజింపు బేలతనమ్ము; మోము పై/ కెత్తుము, ధైర్యము జెదరనీకుము కొంపలు మున్గునయ్య నీ/ తత్త రపాటు నీ ముఖ విధంబు పరుల్ పసిగట్టిరేని' అంటూ హితవా క్యాలు పలికే నారాయణుడు నిజానికి మన గుండెల్లోనే కొలువై ఉంటాడు. శ్రీనాథుడి హరవిలాసంలోని హంసతూలిక పాన్పుపై ' నలరు మొగ్గ/ యెత్తునను మేను గలిగిన నీలోత్పలాక్షి' పార్వతి పశుపతిని తనపతిగా చేసుకునేందుకు శైల పాషాణ పట్టికా స్టండి లమున' పవ్వళించింది. ముత్తాతల పుణ్యగతుల కోసం దివిజ గంగను భువికి దింపిన భగీరథుడు- శివుడినుంచి జహ్నుమహర్షి వరకు  పెట్టిన పరీక్షలను తట్టుకుని నిలబడిన తీరు చాలు, ధీరోదా త్తుడికి ఉండవలసిన ముఖ్యగుణమేదో తెలుసుకునేందుకు .


ఏనుగు లక్ష్మణకవి సుభాషితంలో చెప్పినట్లు- కార్యసాధకుడు దుఃఖాన్ని సుఖాన్ని మదిలో లెక్కకు రానీయడు. పుట్టినప్పటినుం ఏ తన కన్నతండ్రికి పట్టం కట్టించేదాకా కన్నయ్యకు ఎదురైన కష్టాలు కడలిలో కెరటాలకు మించినవి. కందుకూరి వీరేశలింగం నీతికథామంజరిలో బోధించిన విధంగా '  కష్టపడునట్టివారు లోకంబు తోడ/ మొర్రపెట్టరు తమ కష్టములను గూర్చి వట్టివారలె యరతురు మిట్టిపడుచు'. అరుపులు గొడ్డు గేదెలకే గాని మనుషులకు గొప్పకాదని వీరేశలింగం అభిప్రాయం. వాస్తవానికి పశుపక్ష్యా దులూ నిశ్శబ్దంగానే తమ పనులు చక్కబెట్టుకుంటాయి. నల దమయంతుల మధ్య నడిచిన ప్రేమ వ్యవహారం ఫలవంతం కావడానికి రాయంచ కడదాకా చూపించిన కార్యకుశలతే ప్రధాన కారణం. దారిపొడవునా దృశ్యాలు తరచూ గతిమారిపోయే తరుణంలోనూ సైబీరియన్ పక్షులు గడబిడ పడకుండా సుదూర ప్రాంతాలకు దారితప్పకుండా చేరడాన్ని కార్యశూరతకు ఉత్తమ ఉదాహరణగా చెప్పుకోవాలి. అసూయపడితే చాలదు... ప్రకృతినుంచి మనిషి చాలా పాఠాలు నేర్చుకోవాలి. 'పనులను ప్రయత్నము చేతన, కావవి బహు మనోరథములున్నంతన్' అని విక్రమదేవవర్మ సూక్తి. ఇసుక బొరియల్లో నుంచి బయటపడే వేళ సముద్ర  తీరప్రాంతాలు తాబేళ్లకు పూర్తిగా అపరిచితం. చిటికెన వేలంత లేని ఆ జీవాలు అట్లాంటిక్ సముద్ర జలాలను దశాబ్దంపాటు అన్ని అడ్డంకులు దాటి ఈదుకుంటూ తిరిగి క్షేమంగా స్వస్థలాలకు చేరుకుం టాయి. ఎవరు శిక్షణ ఇచ్చారు వాటికి?  లక్ష్యంమీద గురితప్ప కుంటే ఏనాటికైనా విజయం సాధ్యమే! బలమైన బంధనాల నిర్బంధం మద్యే ఎదిగిన ఏనుగు మామూలు మోకునూ ఛేదించే ప్రయత్నం చేయదు. ఆత్మవిశ్వాస లోపమే మనిషి పాలిట పెనుమోకు. విజయసాధనకు సులభమార్గం తెలుపమని ఓ జిజ్ఞాసి సోక్రటీసును సందర్శించాడు. జిజ్ఞాసి తలను చెరువు నీటిలో బలవంతంగా ముంచి ఉంచి లేపి బతికి తీరాలన్న కోరిక ఇప్పుడు ఉన్నంత బలంగా ఎప్పుడూ ఉంటే విజయం తనంతట తానే వచ్చి వరించి తీరుతుందన్న సోక్రటీస్ గురుబోధను మరవరాదు.


మూడువందల కోట్ల డాలర్ల వ్యాపారం చేసిన జేమ్స్ బాండ్ చిత్రానికి రచయితగా ఇయాన్ ఫ్లెమింగ్ కి దక్కింది ఆరువందల డాలర్లే. నిస్పృహతో కలం పారేసి ఉంటే బాండ్ సృష్టికర్తగా ఆయన చరిత్రలో మిగిలి ఉండేవాడా! ప్రమాదంలో కాలు కోల్పో యినా కృత్రిమ పాదంతో మయూరిగా తిరిగి వచ్చిన సుధా రామ చంద్రన్ ది  విజయకాముకులందరూ ప్రేరణపొందే స్ఫూర్తిగాథ. మొదటి విద్యుత్ బుగ్గ పనిమనిషి పాలబడి పగిలిపోయిన క్షణంలో నిరాశకు గురై ఉంటే ఎడిసన్ గొప్ప ఆవిష్కర్తగా నమోదై ఉండేవాడే కాదు. విజేత జీవిత పదకోశంలో ఓటమి అంటే అర్థం గెలుపు సోపానం. సైకిల్ రిక్షా వ్యాపార నష్టాలకు చెక్కుచెదరనందుకే ఉక్కు ట్రక్కులకు టాటా కొలబద్ద కాగలిగాడు. పదాలు సరిగ్గా పలకలేని ఐన్ స్టీన్ ప్రముఖ వక్తగా మారగలిగాడంటే- పట్టు దలే ప్రధాన కారణం. తుపానులొస్తాయని ఓడలను ఒడ్డున కట్టేసి ఉంచగలమా? విపత్కర పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించే ధీరులే కావాలి మనకిప్పుడు. బీజింగ్ ఒలింపిక్స్ లో  చేజా రిన పతకం లండన్ మైదానంలో దొరకబుచ్చుకున్న సైనా నెహ్వా ల్ లు  నేడు దేశావసరం. భారతావనికి తనవంతుగా మొదటి పతకం అందించిన గగన్ నారంగ్ రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించి తీరతానని సగర్వంగా ప్రకటించుకున్నాడు. ఇద్దరు బిడ్డల తల్లయి ఉండీ మేరీకోమ్ బాక్సింగ్ లో  సాధించిన విజయం ముందుతరాలకు ఆదర్శం. ప్రతికూల వాతావరణంలోనూ విజయ్ కుమార్ సాధించిన రజతపతకం విలువ దేశవాసులందరికీ బంగారాన్ని మించినంత విలువైనది. సైనా గురువు గోపీచంద్ ఈమధ్య భాగ్యనగరంలో జరిగిన భారీ సన్మానసభలో దేశం తర పున ఆడే క్రీడాకారులందరి పక్షాన చేసిన వాగ్దానం- 'ఇది ఆరంభం' మాత్రమేనన్నది. క్రీడా ప్రేమికులందరూ సంబరపడవలసిన  గొప్ప సంకేతమది. క్రీడాకారులందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన గొప్ప సందేశమూ అందులో ఇమిడి ఉంది!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఇది ఆరంభమే - పేరుతో ' ప్రచురితం - 12 -08-2012 ) 


Tuesday, December 28, 2021

కథ తలవంచని పూవులు రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


కథ 

తలవంచని పూవులు 

రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి 

సేకరణ  - కర్లపాలెం  హనుమంతరావు

28 -12-2021

బోథెల్ ; యూఎస్ ఎ  

                  

( భారతి - అక్టోబర్, 1957 సంచిక ) 


విక్రమ ధనంజయా ! వీరనారాయణా! జయీభవ ! విజయీభవ! విద్యాభోజ ! విదర్భ రాజా ! విజయీభవ ! దిగ్విజయీభవ !


వండియాగధులు వెండిదుడ్లతో ప్రవేశించి పక్కకు తిప్పుకొన్నారు. మాలవ మహారాజులుంగారు రత్నఖచిత  సువర్ణ సింహాసవంమీద ఆసీనులు ఆయి సామంత, దండనాథాదులూ, యావత్ప్రజానీకమూ ఆ వెనుక యథాస్థానాల్లో కూర్చున్నారు. ఇసుక వేస్తే రాలకుండా ఉన్నారుజనం..


ఏటేటా జరిగే శారదా ఉత్సవాల్లో ఆరోజు చివరిది.  దేశదేశాగత నట, విట, కవి, గాయక , వైతాళికులతో ఆనగరం తొమ్మిదిరోజులనుంచీ నిండిపోయింది. అన్ని రోజుల ఉత్సవ సారమూ ఆరోజున మూర్తికట్టి అక్కడికి చేరినట్టుంది.


సూర్యకాంతి ప్రాసాదంలో ఆనాడు వినోద ప్రదర్శనం. ముందు ఆస్థాన వైణికుడు వీణ మీద పట్టు బురఖాతీసి శ్రుతి సవరిస్తున్నాడు. జనం సుకుమార వీణాగానానికి ఎదురుచూస్తున్నటులేదు. విచ్చుకత్తుల రాజభటులు ఎర్రని చూపులతో ఎంత అదలిస్తున్నా కోలాహలం అణగటం లేదు.


దాక్షిణాత్య శిల్పి చంద్రమౌళి ఒక ప్రక్క నిల్చున్నాడు. అతడెప్పుడూ రాజసభలు చూడలేదు. నాగరికుల తళుకు  బెళుకులకు ఆతని  అమాయక హృదయం అలవాటుపడలేదు. హృదయాలను సైతం కరిగించి అమృత మూర్తులుగా మలచగల అతనికి పాటి మానవులను పలకరించి ప్రసన్నులను చేసుకోవడం ఎట్లాగో తెలియలేదు. ప్రాసాదం చివర ఒక స్తంభాన్ని ఆనుకొని తెల్లబోయి చూస్తున్నాడు. 


నగర జనుల నిష్కారణ భంగిమలను, ఒయ్యారాలను చూచి  సహజంగా ఉండవలసిన మానవులు ఎందుకిట్లా బిగువులు పోతారో అతనికి అర్థం కాలేదు.


వీణ ప్రారంభం అయింది. ఆ సిద్ధహస్తుడు అమృత వాహిని పలికిస్తున్నాడు. శ్రోతలు ఇంకెందుకో చూస్తున్నట్టుంది. మంత్రి హస్తసంజ్ఞతో వీణ ఆగి పోయింది.


ఇక ఇంద్రజాలం అన్నారు. ఒక పొట్టివాడు ముందుకువచ్చి మహారాజు ఎదుట భూమికి మూడు సారులు సమస్కరించి నిలుచున్నాడు. శుద్ధ శ్రోత్రియంగావున్న ముఖంలో చంద్రవంకలా గంధపుచారలుంచి దానిమీద ఎర్రని కుంకుమబొట్టు పెట్టాడు. చేతిలోని నెమలీకుంచె ఆకాశం మీద మూడుసార్లు తిప్పాడు. జలజల పువ్వులు రాలాయి. 'గగన కుసు మాలు ప్రభూ చిత్తగించండి' అన్నాడు. ప్రజలు విరగబడి నవ్వారు. 


నెమలిపింఛం గాలిలో సున్నా లుగా చుట్టాడు. అందులో కన్నులు మిరుమిట్లు గొలుపుతూ బలిష్టమైన రెండు వానరవిగ్రహాలు బయలు దేరి యుద్ధం చెయ్యడం ప్రారంభించాయి. “వాలి సుగ్రీ వులు" భూలోక దేవేంద్రా!' అన్నాడు. ప్రధాని చూపుతో ఆగి, పక్కకు తొలగిపోయాడు. వీణకన్న దీనితో కొంచం ప్రజలముఖాలు కలకలలాడాయి.


ఒక మహాకాయుడు  నడిచే నల్ల రాతి విగ్రహంలా సభామధ్యానికి వచ్చాడు . ప్రజల్లో కలకలం బయలు దేరింది. ఉన్న చోటునుంచి ముందుకు త్రోసుకువస్తున్నారు. రాజోద్యోగులు సర్దలేక  తొక్కిడిపడుతున్నారు. '



' అడుగో బ్రహ్మదేశపు బలశాలీ' అనేమాటలు సభలో గుప్పుమన్నాయి. అతనికి కావలసిన యేర్పా ట్లన్నీ చరచర చేయించారు. మహారాజు సింహాసనం మీద సుఖస్థితిలో సర్దుకుని కళ్ళల్లో కుతూహలం కనపరచారు. మహాకాయుడు మెడలు తిరగని బింకంతో మహారాజువై పు తలవూపి సమస్కారం అభినయించాడు. ఇద్దరు భృత్యులు రెండుబాహువుల పొడవూ, రెండంగుళాల మందమూగల ఒక ఇనుప చువ్వను తెచ్చి అతని ముందుంచారు. అతడు అవలీలగా ఏనుగు తామర  తూడును అందుకున్నట్టు దాన్నందుకుని కుడిచేతి వేళ్ళ మధ్య రెండు నిమిషాలు గిరగిర తిప్పి భూమిపై నిల బెట్టాడు. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అతడు దానిని పొట్లకు ఆనించి కండరాలు పూరించి ఇటు ఊగి అటు ఊగి కొంతసేపటికి పూర్ణానుస్వారంగా వంచి  ఆ వలయాన్ని నిర్లక్ష్యంగా ఎదుటికి పడవే శాడు. ప్రజలు చప్పటవర్షం కురిపించారు. ప్రభువు ముఖంలో చిరునవ్వు వెలిగింది. ప్రధాని ఆజ్ఞ రాజ భృత్యులు వేయిదీనా రాలు వెండిపళ్లెరంలో పోసి అతనికి బహూకరించారు. మహారాజులుం గారు లేచారు . అతన్ని చూడడానికి జనం విరగబడి వెంటబడ్డారు . 


రాజమార్గంలో జనప్రవాహం పొంగిపోయింది. చంద్రమౌళి  జనుల ఒత్తిడికి ఆగలేక తూలి ఘంటాపసంమీద పడ్డాడు. అతని పెదవిమీద, వాడి లేకులూడిన పువ్వులా చిరునవ్వుపుట్టి చెదరి అదృశ్యమయింది.



సాయంకాలం చంద్రకాంత సౌధంలో మహా సభ అన్నారు. మధ్యాహ్నం నుంచి సభాభవనం ఆలంకరిస్తున్నారు. సభాస్థలి భూలోక స్వర్గంలో ఉంది. మాలవసుహారాజు  వైభవానికి అది ప్రదర్శనశాల గాబోలు • రంగురంగుల తలపాగాలతో సకల సామంత రాజులూ సభలోకి వేంచేస్తున్నారు.


చంద్రమౌళి  ఒక పట్టుసంచీ చేతితో పట్టుకొని చంద్రకాంత సౌధం చలువరాతి మెట్లమీద నిలుచున్నాడు. నేటి సభలో ప్రవేశం ఎట్లాగా అని తెల్లని అమాయకపు కళ్ళతో ఆలోచిస్తున్నాడు. 


ఎక్కడి దక్షిణదేశం? ఎక్కడి విదర్భనగరం? రెండు దూర దూర దేశాలను రెండు దూరదూర మానవ హృదయాలను దగ్గరగా చేర్చి స్నేహపూరితం చేసే శక్తి లోకోత్తరమైన తన శిల్పకళకు లేదా? అనుకున్నాడు.


మహాకవిగారు సపరివారంగా వస్తున్నారు. ఆయన తెల్లని బట్టతల, చుట్టూ రెల్లుపూలు పూచిన గోదావరిలంకలా ఉంది. చెవులకు బంగారు కుండలాలు, చేతులకు సింహతలాటం మురుగులు. పెద్దరకం కుంకుమ రంగు కాశ్మీరు కాలువ భుజాలను కప్పింది. వెంటవచ్చే ఆశ్రితకవుల కైవారాలతో ఆయన హృదయం మత్తెక్కి ఉంది. ఆయన చూపునకు మరింత ఒదిగి, తన అల్పత్వం ఒప్పుకొన్న బట్టుమూర్తికి ఆకోటలో కనకాభిషేకం - కాదని తలయెత్తినవాడికి దేవిడీనున్నా. ఆ కోట బురుజులు ఆయనకోసం కట్టినవి. వాటి మధ్యకు తనకు తెలిసి సంతవరకూ ఏ ప్రతిభాశాలినీ రానివ్వలేదు. వచ్చినా ఆ - పరిధి దాటి ఎక్కడికీపోడు. తన పద్యాల అర్థం తానే - చెప్పాలి. మహారాజే ఆనందించాలి. తక్కిన కవీశ్వరు లకు మహారాజుకూ ఆయన ఆనకట్టు.


చంద్రమౌళికి సరిగా నమస్కరించడం చాతకాలేదు. అయినా చేతులు జోడించి మెట్టుమీద నిలుచున్నాడు. మహాకవిగారు నిర్లక్ష్యంగా నిలువునా చూసి 'ఎవరయ్యా నువ్వు' అన్నట్టు కళ్లను ఎగర వేశారు. 


"చాలా దూర దేశంనుంచి వచ్చానండి” 


" మం... చి పనిచే... శావు"


"మాలవ ప్రభువు మిక్కిలి రసజ్ఞులనీ, కళా సౌందర్య వేత్తలనీ మా వైపు గొప్పవాడుక”


"ఎవరు కాదన్నారు?” 


" ఆ రసిక ప్రభువు దర్శనం చేస్తేనే నా కళ చరితార్థం; ఆ నే నమ్మకంతో ఎన్ని కష్టాలైనా లెక్క చెయ్యకుండా వచ్చాను..." 


"అబ్బా!”


" కళాజీవి  బాధా, రసజ్ఞ సందర్శనం కోసం పడే తహతహా  మహాకవీంద్రులు తమకు తెలియనిది కాదు. " 


ఈ చివరిమాటతో కవిగారి వికారం కొంత ఉపశమించినా ఆయన అహంకారానికి తగిన ఆహారం పడలేదు. “


" నా కళను ప్రభువులవద్ద ప్రదర్శించే అవకాశం.. " 


"ఇంతకీ... ఏమంటావు?"


" .. కలిగించ వలసిందని కోరుతున్నాను.." 


“మధ్యను నేనెవరు? నువ్వేమో మహాకళావేత్తవు , ఆయనేమో  మహా రసజ్ఞులాయె! ఆలస్యం ఎందుకు ప్రభువులు సభకు వేంచేసే వేళ అయింది. వెళ్ళి దర్శనం చెయ్యి.”


"ఒక దేశాంతం ఆగంతకుడికి ఈ మాత్రం సహాయము చెయ్యలేరా? మీ ప్రభువు కళాప్రియత్వానికి ఈమాత్రం వన్నె పెట్టలేరా ?”


" ఈ మధ్య కొత్తమాటలు నేర్చారు. చిన్నప్పటి నుంచీ వేల  పద్యాలు రాసి పోశాను. మహాకవి అనిపించుకున్నాను. అంతేగాని ఈ కళ యేమిటి? కళాయి యేమిటి?...కవిత్వం ఏమైనా చేసి తెచ్చావా?" 


" లేదండి."


"అయితే...ఈ ఉపన్యాసమంతా ఏమిటి? మాకు చాలా తొందరపని ఉంది. ఇప్పుడు కవుల సభ. నువ్వేమో కనివి కావు. ఇంక నీ కళా ఏమిటి?


“మనవి చేస్తున్నాను. కవిత్వం అంటే నాకు తెలియదు. నేనేమీ మాటాడలేను. కాని నేను తెచ్చిన ఆపూర్వ వస్తువు పలుకుతుంది. మాటాడుతుంది. రసజ్ఞుల  మనస్సును లాలించగలరు. ఒక్క త్రుటి ... ప్రభువు ఎదుట నిలుప గలిగి తే... " 


“అబ్బో!... ఏదీ ఆ వస్తువు?"


"క్షమించండి. ప్రభు సమక్షంలో తప్ప పైకి తియ్యను. అది నా కళామర్యాద. ఆయన కానుకను ఆయనే తొలిసారి చూడాలని నా కాంక్ష . ఈ ప్రభు గౌరవాన్ని మీరు కూడా ఆమోదిస్తారనే నమ్ముతున్నాను.” 


మహాకవి గారి కుండలాలు ఊగాయి. అవమానం జరిగింది. కళ్ళల్లో మంటలు రేగాయి. తన ప్రాముఖ్యం కోసం  ఇంతవరకూ  చేతులు జోడించుకు తిరిగేవాడేగాని ఎదిరించి మాటాడిన వాడు లేకపోయాడు. శిల్పివైపు చురచుర చూసి జారే కాశ్మీరు శాలువాను మరింత పైకి లాగి  చరచర పరివారంతో నడిచి వెళ్ళిపోయారు. 


చంద్రమౌళి తన తప్పేమో  తెలియక తెల్లబోయాడు. కర్తవ్యం ఏమిటి?


లోపల సభ ప్రారంభమయింది. మహాకవి గారి శుష్క సమాసాలు సాగిసాగి వినిపిస్తున్నాయి. ఇటు నుంచి చదివితే రాజు పేరు, అటునుంచి విదివితే తన పేరూ ఇందులో ఉందని ఒత్తి ఒత్తి చెబుతున్నారు . 


చంద్రమౌళి ఇంత దూరం వచ్చి రాజ దర్శనం చెయ్యకుండా వెళ్ళకూడదనుకున్నాడు. చర్రున  సభలోకి దూసుకువెళ్లాడు.  సభాస్థలి చేరకుండా రాజభటు లడ్డగించారు. 


"ప్రభుదర్శనం చెయ్యాలి! " 


" అనుజ్ఞ నుండి తీరాలి" 


"ఇది మీ ప్రభువారికి కానుక. పాదపీఠం దగ్గర ఉంచివస్తాను. వెళ్ళి నివ్వండి.”


"అడుగు కదిలితే .. మెడ  మీద తల ఉండదు"


"మీ ప్రభువు సరసతా, మీ యోగ్యతాఇంతటి వేనా ? " 


ఒక రాజభటుడు చటుక్కున  వచ్చి ఆ మహాశిల్పి మెడమీద చెయ్యి వేసి ఒక్క ఊపున గెంటివేశాడు. 

అతడు చలువరాతి  మెట్లమీదనుంచి దొర్లి   నేలమీద పడ్డాడు. చేతిలోని  పట్టు సంచీ  దూరంగా పడ్డది. 


చంద్రమౌళి నెమ్మదిగా లేచి సంచీ  తీసుకుని నీరునిండిన కళ్ళతో ఒక్కసారి రాజభవనంకేసి చూసి చరచర కోట వెలుపలికి నడిచాడు. 


రాజవీధి నిర్మానుష్యంగా ఉంది. తన లోకోత్తర శిల్పాన్ని పైకి తీసి తినివితీరా  చూసుకున్నాడు. దాని వెనక ఉన్న కథ అతని తడికళ్ళల్లో తిరిగింది.


3


ఒక నాడు తన పల్లె కుటీరంలో చంద్రమౌళి ఉలిని ఒక మంచిగందపుముక్క మీద నడుపుతున్నాడు. 


అతని తీయని  ఊహలు సున్నితమైన ఉలి నుంచి  జారి  చందన ఖండంలో సుందర రేఖలుగా విడుతున్నాయి. శిల్ప సౌందర్యమో, చందన  హృదయమో  ఆ రేఖల్లో పరిమళాలు నింపుతున్నాయి. 


సుందరేశ్వరుని ముందు కృశాంగి హైమవతి, ఆయన కళ్ళల్లో ప్రేమ భిక్ష . ఆ కులపాలిక అరమోడ్పు కన్నుల్లో చిక్కని సిగ్గులు.   ఉలి కన్నా వేగంగా మనసు పరిగెత్తుతున్నది . ఆ శిల్పంలో కలిసిపోయి తానున్నట్టే  మరచిపోయాడు ఆకళా తపస్వి. 


తన కుటీరం వాకిట్లో ఏదో అలజడి. అయినా  అతను తలయెత్తలేదు. ఇంకా   కర్రగుండెలో నుంచి కళను పిండుతూ నే ఉన్నాడు.  


భార్య 'ఆశ' ఆలజడిగావచ్చి ఎదుట నుంచుంది. ఐదేళ్ళబిడ్డ కళ వెక్కి వెక్కి యేడుస్తూ ఉండగా  చంద్రమౌళి ఆలయెత్తి చూచాడు.


తపబిడ్డకంటినుంచి జారే నీలాలు చూచిన అతని చేతిలోని ఉలి జారిపోయింది. తపోభంగంలా శిల్పం ఆగిపోయింది. 'ఏమిటి సంగతి' అన్నాడు విధిలేక. 


ఆశ ఎర్రబముఖంలో చెప్పడం పెట్టింది.—“పాపం, 'కళ? యేమీ చెయ్యలేదు సుమండీ —మన పొగడ చెట్ల క్రింద పువ్వులేరుకుంటూ ఆడుకుంటున్నది. ఆ ధనవంతుల బిడ్డలేదూ శేషగుణి, ఆ పిల్ల, కళను పిలిచి తీసుకువెళ్ళింది. ఇద్దరూ చాలా సేపు ఆడుకున్నారు. ఆ పిల్ల మెడలోని  రత్నాలహారం దీని మెడలో వేసి 'నీకిచ్చేశాను తీసుకో'  అందిట. కళ నిజమనుకుని ఇంటికి పరుగెత్తుకువస్తూఉంటే ఆ అమ్మాయి ఏడుస్తూ కళ హారం ఎత్తుకు పోతున్న తాన  తల్లితో చెప్పింది. వెంటనే ఆవిడ పరుగెత్తుకువచ్చి 'దొంగబుద్ధులు, దొంగపిల్లలు . లేనివాళ్లతో స్నేహాలు వద్దంటే మా పిల్ల వినదు ' అని ఈ పిల్లను గుంజి హారం తీసుకుని వెళ్ళిపోయింది. 


" ఇదేనా  మర్యాద ? చూడండి. కూటికి పేదలమైతే గుణానికీనా?" అని ఆమె బరువుగా నిట్టూర్చింది, చురచురము నే కళ్ల తో. 


చంద్రమౌళి అన్నాడు నెమ్మదిగా — "పిచ్చిదానా నీకూ ధనవంతులం టే వ్యామోహం. వారి తళతళలాడే   నగలూ, మిలమిల లాడే చీరలూ దూచి ఎంత ఆకర్షణ నీకు! వారిలాగే మెరిసి పోవాలని ఎంత ఆరాటపడతావు ! ఆ కోరిక ఎప్పుడో మనల్ని శాపమై మొత్తుకుంది. ఈ సడిస్తుంది. అని నీకు తెలియ లేదు. ఇంక ఊరుకో " అని మళ్లా శిల్పాన్ని అందుకున్నాడు. 


ఆశ ఊరుకోలేదు.


" ఆపండి ఆ పని. ఆలుబిడ్డలు సుఖించని ఈ చెక్క డాలు శిల్పాలూ ఎందుకూ? చేతులో ఇంత నేర్పుండి ఏం లాభం? తలుచుకుంటే అట్లాంటి రత్నహారాలు పది సంపాదించగలరు. నన్నూ  బిడ్డనూ అలరించి అలంక రించగలరు. కళను చూచి మెచ్చి ఇచ్చే ప్రభువులు దేశంలో లేకపోలేదు. వచ్చేవి కారణోత్సవాలు. మీ చెయ్యిసోకి తే

రాళ్ళుమాటాడతాయి. ఒక్క శిల్పంతో ఆ మాలవరాజును సంతోష పెట్టలేరా? కాంక్షతో  తీవ్రంగా వెలిగే  ఆశ కళ్ళకు అతడు లొంగిపోయాడు.


ఆనాడే దీక్ష వహించాడు. ప్రశస్తమైన ఏనుగు దంతం సంపాదించారు. చంద్రవంకలా ఉన్న ఆ దంత  ఖండాన్ని నిలువునా పూలదండగా  మార్పివెయ్యా లను కున్నాడు . ఉలి ఆమోఘంగా పని చెయ్యడం ప్రారంభించింది. 


ప్రతీ రాత్రి ఎదురుగా కూర్చునేది. ఆమె కళ్ళ అందం ఆతని  శిల్పానికి దీపం అయింది. ఆమె ఎర్రని పెదవుల చిరునవ్వు అతని కల్పనకు జీవంపోసింది. ఆమె ఒక్కొక సుందర భంగిమ అతని చేతిని పరుగులెత్తించింది. ముప్పది రోజులు అహోరాత్రాలు పని చేశాడు.


ముక్కలు చెయ్యలేదు. అతుకు లేదు. ఏనుగు దంతం హఠాత్తుగా మల్లెపూలదండగా  మారిపోయింది. రేకురేకునా సహజమైన మధురిమలు. ముడత ముడతలో  అచ్చమైన నొక్కుల సొగసులు. కొన్ని పూర్తిగా విడిన మల్లెలు, కొన్ని అరవిచ్చినవి . చివర ఒక బొడ్డు మల్లె కొలికి  పూస. 


ఒక్కొక్క పువ్వుకూ ఒక్కొక్క నెత్తురుబొట్టు ఖర్చు పెట్టాడు.


చిక్కిపోయిన చెక్కిళ్ళతో తృప్తిగా నవ్వి అతిని గుండె  పూచిన పూలమాలను ఆశ ఎదుట  సగర్వంగా ఎత్తి పట్టుకున్నాడు. ఆశ కళ్ళల్లో ఆనందజలం చిమ్మింది. 


ఒక ముహూర్తాన ప్రభు సందర్శనంకోసం మూటకట్టుకు బయలుదేరాడు.



చంద్రమౌళి రాజవీధిలో వేడిగా నిట్టూర్చి తన  శిల్పం వైపు ఇంకొక సారి చూశాడు. ఆ తెల్లని పువ్వులు తనని  చూసి పకపక నవ్వినట్లనిపించింది. ప్రతి పువ్వూ తీసకోసం దీనంగా ఎదురు చూసే  ఆశ ముఖం జ్ఞాపకం చేసింది. అమాయకపు కళ్ళల్లో నీరు కార్చి తన బిడ్డ కళ పరుగెత్తుకొనివచ్చి కాళ్లు  చుట్టు వేసుకున్న ట్టనిపించింది.


పొంగివచ్చే కన్నీళ్లను ఆపుకుని నగరం వెలుపలి శూన్యంలోకి వచ్చి ఒక రావి చెట్టుకింద నిలుచున్నాడు. అమోఘమైన తవ శిల్పాన్ని ఊచిపుచ్చుకుని చెట్టు మొదటికి విసిరి వేశాడు. అది పోయి ఒక రాతికి తగిలిన చప్పుడయింది.


నివ్వెరపోయి చెట్టు మొదట పరిశీలించాడు. ఆశ్వయుజమాసపు వెన్నెల వెలుగుల్లో స్పష్టంగా కనబడుతున్నది. 


ఆ పుష్పమాల ధ్యానముద్రలో ఉన్న బుద్ధదేవుని పాదాల ముందు పడింది.


అతనికి నవ్వు వచ్చింది.


“సింహాసనంమీది విగ్రహానికి సమర్పించదలచిన ఆపూర్వ పుష్పమాల ఈ జీమా దయామూర్తి పాదాలను పూజించిందా? ఎంత ధన్యుణ్ణి! 


చంద్రమౌళి నిమీలిత నేత్రాలతో బుద్ధదేవుని పాదాలముందు నిలువునా మోకరిల్లాడు. 


బుద్ధ జీవుని ఒక శీతల హస్తం అతని వెన్నుపై నిమిరినట్లయింది !



రచన - కీ.శే ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి

 ( భారతి - అక్టోబర్, 1957 సంచిక ) 


సేకరణ  - కర్లపాలెం  హనుమంతరావు

28 -12-2021

బోథెల్ ; యూఎస్ ఎ  

                  


ఈనాడు ' హాసం వ్యంగ్యం గల్పిక బొంకుల దిబ్బ రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 16-07-2016 ,


 


ఈనాడు ' హాసం వ్యంగ్యం గల్పిక


బొంకుల దిబ్బ

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 16-07-2016 , 


అబద్ధాలు ఆడాలంటే ఎంతో నిబద్ధత కావాలని, గోడ కట్టినట్లుగా ఉండాలని బుద్ధిమంతుల బోధ. ఆపద్ధర్మంగా ఇటునుంచి అటు దూకినట్లే... అవసరార్థం మళ్ళీ రేపు అటు నుంచి ఇటు దూకేందుకు వాటంగా ఉండాలి  నిజం చెప్పాలంటే. నిజం మీద నిలబడటానికి అట్టే నిజాయతీ అవసరం లేదు. ఆడిన అబద్ధానికి కట్టుబడి ఉండాలంటేనే ఆటుపోట్లు తట్టుకునే గుండె నిబ్బరం ఉండాలి. అది లేకే సత్యం రాజు, అమెరికా బిల్ క్లింటన్ అన్ని కడగండ్ల పాలైంది. అందరూ హరిశ్చంద్రులకు చుట్టాలైతే ఈ చట్టాలెందుకు?


పనామా పత్రాలు విడుదలైనా, అందులోని పంగనామాల పెద్దలెవరూ పెదవి విప్పడమే లేదు! ఎన్నికల యుద్ధంలో నిలబడినప్పుడు అభ్యర్థ యోధులంతా ఎన్నెన్ని అబద్ధాలకు అందమైన హామీ చమ్కీ దండలు తొడిగి మరీ ప్రచార పర్వాలు రక్తి కట్టిస్తారో!  ఆడిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ అడేసి  ఎన్నుకునే జనాలకు అన్నీ పచ్చి నిజాలేనన్న భ్రమ కలిగించడం అన్నిచోట్లా రాజ కీయాలలో  పండే సాధారణ చమత్కారమే!


నిజానికి, నిజం మీద నిలబడేందుకు ప్రతిభతో పని లేదు. ఒక్క అమా యకత్వం ఉంటే చాలు.. ఆడిన మాట అబద్ధమని ఒప్పేసుకుని కన్నీళ్ళు పెట్టుకోవడానికి! పశ్చాత్తాపంతో కన్నీళ్ళు పెట్టుకోవడానికేగా  అబద్ధాల సృష్టి జరిగింది?


అబద్ధాన్ని  నిజమని నమ్మించేందుకు 'అమ్మతోడు' ఒట్లు సహా కాణిపాకం గుళ్ళో దీపాలార్చేయడం వంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి. గురజాడ కన్యా శుల్కంలో గాయత్రి పట్టుకుని ప్రమాణం చేసిన వాడొకడైతే, దీపాలార్వేసి, ప్రమాణం చేసిన ఘనుడు ఇంకొకడు.  అందుబాటులో ఉన్న సవాలక్ష ఉపాయాలను ఉపేక్షించి ఆడిన అబద్ధాలకు పశ్చాత్తాపాలు ప్రకటించు కుంటూపోతుంటే, చేజేతులా భవిష్యత్తు పటానికి పూలదండలు వేసుకొన్నట్లే!


గోడ దూకేటప్పుడు లీడరన్నవాడు గోడ కట్టినట్లు అబద్ధాలాడతాడని అడి పోసుకుంటాం. తెరచాటున జరిగే బేరాలన్నీ యథాతథంగా చెప్పుకొంటూ పోతే ప్రజాసేవకుడి కథ ముగిసినట్లే కదా! నమ్ముకున్న కార్యకర్తల ఉసురు పోసుకోకూడదన్న సదుద్దేశమే నాయకుడి నోటితో అబద్ధాలాడించేది... అర్థం చేసుకోవద్దూ!


'నిజం చెప్పమంటారా. అబద్ధం చెప్పమంటారా? ' అని రాజునే అడుగుతాడు పాతాళభైరవి సినిమాలో ఎన్టీఆర్.  అపరిమితమైన లాభాలు ఏవో ఆశించేగదా వేన్ పిక్  మోపిదేవి, సుబ్రతోరాయ్ నుంచి శారదా ఫండ్ దాదాల దాకా, ఆగ్రిగోల్డ్ నుంచి కింగ్ ఫిషర్ వరకు నల్ల వ్యాపారాలని కూడా చూడకుండా నిలువెత్తు బురదలోకి దిగబడిపోయింది, నష్టాలు నెత్తికి చుట్టుకుంటాయని తెలిసీ నిజాలను నమ్ముకుంటారా తెలివున్న పెద్దమనుషులెవరైనా! గురజాడవారి గిరీశం అడుగుజాడల్లో నడిచే మహాశయులు అన్ని రంగా లోనూ ఇప్పుడు అందలాలెక్కి ఊరేగుతున్నారు. కాదంటే, అదే ఓ పెద్ద శుద్ధ అబద్ధం.  అవును కన్యాశుల్కం ఆసాంతం శుద్ధ అబద్ధాల పుట్ట. ప్రపంచంలోని ఏ అబద్దపు వ్యవహారమైనా 'కన్యాశుల్కం'లో తప్పకుండా ప్రత్యక్షమై తీరవలసిందే. మన రాజకీయాల మాదిరిగా అయినా, ఆ నాటకంలో జరిగిందంతా నిజమేనని, అయస్కాంతాలు పెట్టి గాలించినా అబద్ధమనేది అణువంతైనా కనిపించదని  అందరం అమాయకంగా నమ్ముతుంటాం. ఆ చమత్కారమే యథాతథంగా రాణించే రంగం- రాజకీయం.  అందుకే రాజకీయాలు ఇవాళ ఇంతలా అబద్ధాల దుకాణాల మాదిరి కళకళలాడిపోతున్నది . 'నిజం బొమ్మ అయితే, అబద్దం బొరుసు" అన్నవాడికి రాజకీయ గోతుల లోతులు బొత్తిగా తెలియవని అనుకోవాలి. రెండువైపులా ఉన్నవి బొరుసులే అయినా బొమ్మలే అన్నట్లు కథ నడిపించగల సమర్థులే  రాజకీయ రంగంలో రాణించేది. అబద్ధాన్ని నిజంగా..  నిజాన్ని అబద్ధంగా  చేసేస్తాం' అని డబ్బాలు కొట్టుకుంటాడు కన్యాశుల్కంలో బైరాగి. అ  మార్కు గడుసుపిండాలకే ఎంత నిజాయతీ పార్టీలో ఉన్నా మంచి మార్కులు పడేది.


నిజాయతీపరులెవరూ రాజకీయాల జోలికి రావద్దు. వచ్చినా రాహుల్ బాబులా నాలుగు కాలాలు మాగినా పండటం కుదిరే పనికాదు .  'కన్యాశుల్కం' మార్కు 'బొంకుల దిబ్బ' సెట్టు లాంటివే రాజకీయాల రంగుల లోకం.  నిజాన్ని నమ్ముకుని మాత్రమే రాజకీయం నడపాలనుకొన్న  లోక్ సత్తా  జేపీ రథం పరుగుపందెంలో వెనక ఎందుకు పడిందో అర్ధం చేసుకుంటే చాలు- నేటి రాజకీయాలు నిజమైన అబద్ధపు స్వరూపం కళ్లకు కట్టినట్లు అవగతమవుతుంది. సత్యం మీదే బొత్తిగా ఆధారపడటం రాజకీయాలతో పెద్ద అడ్డంకి. 


ఈ రాజకీయ సూత్రం అర్థంకాని అమాయకులెవరైనా ఇంకా మిగిలి ఉంటే మారిపోవాలి. '  ట్రూ రిపెంటెన్సుకి ట్వంటీ ఫోర్ అవర్చు చాలు' అన్నాడు గిరీశం మహాశయుడు. ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్నికలు ముంచుకొచ్చే వస్తున్నాయి. నార్కో ఎనాలసిస్ టెస్టులకయినా  నాలిక మడతలు అందకూడదు. లై డిటెక్టర్ల ముందు మతులు పోగొట్టుకోకూడదు. టికెట్ల కోసం ఎన్ని కోట్లయినా పొయ్యి , పోలీసు రికార్డుల్లో ఎంత రికార్డుస్థాయి నేర చరిత్రయినా  ఉండనీయి ..   స్వల్ప ఆస్తులు, స్వచ్ఛమైన చరిత్ర ప్రక టించే గుండెదిటవు అవసరం.


కడుపు నుండిన జనం చెప్పులు విసిరినా దడుపు  దాచుకొనే ఒడుపు ఒక్కటి ఒడిసి పట్టుకుంటే చాలు- ఏ పార్టీ టికెట్ మీదైనా ఇట్టే టిక్కు పెట్టించుకోవచ్చు. అబద్ధాలు రంగరించి బిడ్డలందర్నీ గద్దెలెక్కించాడు లాలూజీ.  రాజకీయాల్లో నాలుకలు ఎన్ని చీలికలైనా నో ప్రాబ్లమ్ . అవి మొద్దు బారకుండా పదునుగా ఉంచుకుంటే  చాలు.  సత్యహరిశ్చంద్రుడి కథ మర్చిపోయేటంత కీర్తి ప్రతిష్ఠలతోపాటు, వారసులందరికీ చెక్కు చెదరని స్విస్ బ్యాంకు ఖాతాలు సాధించుకోవచ్చు.  ఏ ప్రజా సేవకుడి అంతిమ లక్ష్యమైనా అంతకుమించి మరేముంటుంది?


- రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 16-07-2016 , 


ఈనాడు- సంపాదకీయం జాతీయ పానీయం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 )

 



ఈనాడు- సంపాదకీయం 


జాతీయ పానీయం

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 ) 


ఉల్లాసంగా ఉండాలనుకున్నప్పుడు, ఒంటరితనం వేధిస్తున్నప్పుడు.... ఎప్పుడైనా సరే, కావాలనిపించేది కుదిరితే ఓ కప్పు తేనీరు. థేంక్ గాడ్! టీ కనిపెట్టిన తరువాతే నేను పుట్టాను' అనుకున్నాడట ప్రముఖ రచయిత సిడ్నీ స్మిత్. మదిరానికి అలవాటుపడి అనవసరంగా ప్రాణా లమీదకు తెచ్చుకున్నాడు గానీ... తేనీరు రుచి తెలుసుకుని ఉంటే ఉమర్ ఖయ్యాం మరిన్ని రుబాయీలు మనకు మిగిల్చి ఉండేవాడు. సుమతీకర్త కాలం నాటికి చాయికి  ఇంత ప్రాచుర్యం లేదు. ఉంటే అప్పిచ్చువాడు, వైద్యుడు వంటి అత్యవసరాల జాబితాలో తాజా తేనీరూ చేరి ఉండేదే. 'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష' అన్న మన పెద్దలు తేనీరు ప్రస్తావన ఎందుకు తేలేదో! తాగేవాడి హోదానుబట్టి పానీయం పేరు మారే విధానాన్ని నన్నెచోడుడు కుమారసంభవంలో చెప్పనే చెప్పాడు! 'అమరులు త్రావుచో అమృతమందురు దీని, వహిప్రజంబ జప్ర ముని గోనియానుచో నిది రసాయనమందురు' . ఆ క్రమంలోనే ఈ కలియుగంలో మర్త్యులు  పడిచస్తున్న పానీయం పేరు ' తేనీరు' ఎందుకు కాకూడదు? ' పెరుగును శరచ్చంద్ర చంద్రికా ధవళం'తో పోల్చిన కాళిదాసు తేనీరు రుచి కనుక తెలుసుకుని ఉంటే- ఏ తేనె పట్టు బొట్టుతోనో సరిపోల్చి ఉండేవాడు. శ్రీనాథుడి జమానాలో ఈ చాయ్ గొడవలు లేకగాని... ఉండి ఉంటే హరవిలాసంలో ' చిరుతొం డనంబిని చేగానుగాడి చెరుకుం/ దీగె రసంబును' జంగముడు తెమ్మ న్నట్లు'  ఏ అల్లం కొట్టిన సుగంధ తేనీరో కావాలని దబాయించకుండా ఉండేవాడా! నాటి కవులకన్నా మనం అదృష్టవంతులం. నేటి జనాభాలో నూటికి ఎనభైమంది తేనీటి ప్రియులేనని అఖిలభారత తేనీరు సంఘం తాజా గణాంకాలు తేల్చి చెబుతున్నాయి మరి. 


పని ఒత్తిడినుంచి పలాయనం చిత్తగించడానికి ఏనాడో ఓ చీనా వైద్యుడు కనిపెట్టిన చిట్కా తేనీరు. నాగరికులు చాయ్ రుచి మరిగేందుకు మరో పది శతాబ్దాలు పట్టింది. వినిమయ విధాన వాణిజ్యంలో భాగంగా తేనీటి కోసం విలువైన దుస్తులను , వెండినీ ఆంగ్లేయులు వదులుకున్నారంటే దాని రుచికి వేరే వివరణ ఎందుకు?  చైనాతో తెల్లవాడికి చెడటం భారతీయులకు కలిసివచ్చింది. అస్సాం సాగుమీదకు ఇంగ్లిషువాడి దృష్టి మళ్ళటం మన అదృష్టం. ప్రపంచ తేనీటి అవసరాలను తీర్చే ప్రముఖ దేశాల జాబితాలో భారతదేశానిదే ఇవాళ ప్రథమస్థానం. ఉత్పాదన లోనే కాదు.. వినిమయంలోనూ భారతీయులదే అగ్ర తాంబూలం. పడక దిగినప్పటినుంచి రాత్రి శయన మందిరం చేరే దాకా  భారతీయులు సగటున పదకొండు కప్పుల టీ సేవిస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రుచికి ఆరోగ్యానికి సాధారణంగా చుక్కెదురు. 'మది రాపానము చేయువానికిని సన్మానంబులే సిగ్గు లే/ వదనాలంకరంబు  లే సుగతి లే వాక్పుష్టి లే వాంఛ లే ' అంటూ ఓ ఆధునిక కవి ఏకరువు పెట్టనే పెట్టాడు. కవివరుడు, భిషగ్వరుడు వేంకట నరసిం హాచార్యులవారు 'విశంగాదిరసం', 'రేపు మాపును మనుజుండు బదరీ పల ప్రమాణము సేవిస్తే వాత గుల్మాలు, జ్వరాలు, సంధి ప్రకోపాలు, ధాతు నష్టాలు వంటి ఎన్నో రుగ్మతలు దూరంగా పారిపోతాయని చికిత్సగా చెప్పుకొచ్చారు . ఖరీదైనది ఆ ఔషధం. అంతకన్నా అధిక ప్రయోజనాలను కలిగించే కారుచవుక ఔషధం తేనీరు. కేన్సరుకు తేనీరు విరుగుడు అంటారు. టీలోని బి కాంప్లెక్స్ విటమిన్లు, నికోటిన్, కెఫైన్  ఉత్తేజకరమైన శక్తి ఉత్ప్రేరకాలు రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరచే శక్తిమంతమైన ఔషధాలలో  టీ కి  మరొకటి సాటి లేదు. రక్త పోటు, చక్కెరవ్యాధి, దంత క్షయాలకు గొప్ప నిరోధకంగా పనిచేసే ఔషధం తేనీరు. దేవతలకు అమృతం ఉందో లేదో తెలియదు . మానవులం అదృష్టవంతులం. మనకు సర్వరోగ నివారిణి తేనీరు దొరికింది!


కొప్పరపు సోదరులు ఒక అష్టావధాన పద్యంలో చెప్పినట్లు ' ప్రభు భటులు, నైష్ఠికులు  గార్య పరత నేగ .. గొక్కరో కోయనుచు' కోడి కూయాలి. ఆ కోడికన్నా ముందే లేచి ఇంటి ఇల్లాళ్లు చాయ్ నీళ్లను  మరగబెడుతున్న రోజులివి. పొట్టలో టీ చుక్క పడనిదే పడక దిగనని మొరాయించే జనాభా పెరుగుతోంది. చైనా, జపాన్లలో తేనీటి సేవనం ఒక ప్రత్యేక ఉత్సవం. నిమ్మరసం టీ వారి ప్రత్యేకత. టిబెట్టులకు ఉప్పు టీని కొయ్యకప్పులో తాగడం సరదా. ఆఫ్రికన్లు టీ కషాయాన్ని చిలికి ఆ నురగ తాగుతారు. పశ్చిమాసియాలో యాలకుల తేనీరంటే ప్రాణం పెడతారు. భారతీయులు అన్నిరకాల తేనీటినీ ఆదరించే పానప్రియులు. గుజరాతీలకు మసాలా టీ మీద మనసైతే, కాశ్మీరీదేశవాసులు వట్టి కషాయంలో బాదం, యాలకులు కొట్టి వేసి ' కాహ్వా' అనే టీని 'వాహ్వా  వాహ్వా' అంటూ సేవిస్తారు. తేనీటి సేవనానికి వయసుతో నిమిత్తం లేదు. విద్యార్థి లోకానికి టీ నిద్రకాచే చిట్కా.  వయసు పైబడినవారికి శక్తినిచ్చే ఔషధం. ఉపవాసాలకూ నేడు తేనీరు నిషిద్ధం కాదు. అతిథి మర్యాదల్లో తేనీరు ప్రధాన అంశం. జీవనానికి నీరు ఎంత అవసరమో, చాయి  అంతకన్నా ముఖ్యావసరమైన రోజులు వచ్చాయి. మారుమూల పల్లెనుంచి మహా పట్టణం దాకా చాయ్ దుకాగాలు  కనిపించని చోటు భూమండలమంతా గాలించినా దొరకదు. టీ కప్పుల చప్పుళ్లు లేని సభలు, సమావేశాలు చప్పగా సాగినట్లే లెక్క.  సమరావేశాన్ని చప్పున చల్లార్చగల మహత్తు గుప్పుమని పొగలు గక్కే వేడి తేనీటికే కద్దు . ఎన్ని విభిన్న దృక్పథాలైనా ఉండనీయండి.... వందకోట్లకు మించిన మన జనాభా ముక్తకంఠంతో ' జిందాబాద్'  అనే  ఒకే ఒక్క పానీయం- తేనీరు. అసోమ్ లో  తొలుత తేయాకు సాగు చేసిన సిపాయిల తిరుగుబాటు వీరుడు మణిరాయ్ దేవన్ 212వ జయంతిని పురస్కరించుకొని తేనీటికి  జాతీయ పానీయం హోదా కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. వాణిజ్యంపై నియమించిన పార్లమెంటరీ స్థాయీసంఘమూ తేనీటికి  జాతీయ హోదా కల్పించవలసిందని  సిఫార్సు చేయడం తేనీటి ప్రియులందరికీ తీయని కబురు.


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - ప్రచురితం - 19 -08 -2012 ) 


Monday, December 27, 2021

కథ ఆప్తబంధువు - ఏల్చూరి విజయరాఘవరావు సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 కథ 

ఆప్తబంధువు 

- ఏల్చూరి విజయరాఘవరావు 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


“ధన్ ధనా- టక్ టకా - ధన్ ధనా- ట౯కా- తక తకిట తకతకిట--- తకతకిట తకతకిట 

ఖండజాతి లయలో..  శరవేగంతో పరిగెత్తుతోంది రైలు బండి. 

బెజవాడ రావడానికింకా ఎనిమిది గంటలన్నా పట్టచ్చు. పానకాల్రావుకు నిద్ర రావడంలా. 


అమావాస్య చీకటి రాత్రుల్లో చెట్లూ, చేమలూ, గుళ్ళూ- గోపురాలూ, పల్లెలూ- పట్నాలూ, గతంలోకి మాటుమణిగి పోతుంటే, ముందు రాబోయే స్టేషన్లన్నీ భవిష్యత్తులో పొంచి కూర్చున్న ఆశల్లా వువ్విల్పూరిస్తూ పానకాల్రావు మనస్సును పదే పదే పీకుతున్నాయి. .  గమ్యం దగ్గర కొస్తున్న కొద్దీ! 


అతని తొండర వాటికేం తెలుసు మరీ! ఇవ్వాళన్నా యీ మాయదారి రైలును మరికాస్త తొందరగా పరిగెత్తించే నాధుడే  లేడా? 


తెలుసు. అల్లా జరగడం అసంభవమని. అయినా బాణం తగిలిన జింకలా కొట్టుకుంటున్న పానకాల్రావు గుండెల్లో తర్కశక్తి నెప్పుడో మింగేసింది ఆవేశం!


' మదర్ సీరియస్... కమ్ సూన్' మామయ్యిచ్చిన టెలిగ్రామిది... 


ఇదమిదం తెలియడంలో అలాంటి పరిస్థితిలో పానకాల్రావేమిటి , పాపారావైనా, పార్వతమ్మయినా ఆ సందిగ్ధావస్థలో .. ఎవరైతేనేం తడబడక తప్పుడు గదా! 


ప్రాణాలతో తల్లిని చూసి తీరాలి. "నాన్నా! ఎల్లా వున్నావురా? ఎన్నాళ్లయిందో నిన్ను చూచి!..." అంటూ ఆప్యాయంగా తల్లి బుజ్జగిస్తూ పలికితే, తను గంగా యమునా సరస్వతు లీదుకుంటూ వొడ్డు చేరుకుని, స్వర్గానికి నిచ్చెనకట్టి , గంధర్వగానంతో అప్సరసలు నృత్యం చేస్తున్న ఇంద్రసభలో జారిబడ్డట్టు మురిసిపోడూ మరి! 


ఏమిటో!


రాత్రింబవళ్ళూ కవిత్వం రాసే పిచ్చితో ఇలాంటి వూహలే. రైల్లో కూర్చున్నా! 


తెల్లగా 'ధగ' 'ధగ'లాడే గడ్డం, లాల్చీ, ధోవతీ- 'ఫట్టు 'మని పరాయి వాళ్ళు చూస్తే, విశ్వకవి టాగూరు గారి వేలువిడిచిన తమ్ముడిలా కనిపిస్తాడు పానకాల్రావ్! 


పత్రికలో పని చేస్తున్నాడు. సబ్ ఎడిటర్. "క్షణం తీరిక లేదు. దమ్మిడీ ఆదాయం లేదు" అంటుంటాడు పదే పదే . అయినా చేసే పనిలో మామిడికాయ రసం తాగుతున్నట్లు సంతృప్తి కనబడడంతో, “మనసు గుర్రం' కళ్ళాలింకా చేజారి పోలేదు! 


ఎన్నాళ్ళ నుంచో " అమ్మ"ను చూడాలనుకుంటూ, ఢిల్లీ నుంచి బెజవాడకు పోయే విమానాలవీ, రైళ్ళ "టైమ్ టేబుల్స్" రోజూ తన పత్రికలో అచ్చవుతుంటే బట్టీ పెట్టడం తప్ప. పని కల్పించుకుని టిక్కెట్టుకొని బెబవాడ వైపు ప్రస్థానం  చేసే ఘడియలిల్లా తల్లి అనారోగ్యంతో తన్ను పీక్కుతినబోతున్నాయని అతను కలగన లేదెప్పుడూ...


"ధన్ ధనాటకకా.." 


రెండవ తరగతి పెట్టె కిక్కిరిసి, నిండు  చూలాల్లా కదలలేక కదులుతున్నట్టు తూలుతోంది. అర్థ నిద్రతో వున్మీలితమైన కొందరు ప్రయాణీకుల కళ్ళల్లో రైలు....


ఈ మధ్య టీ. పీ. జోరుకదా! ఆదివార మొస్తే "మహాభారతం” తప్పదందులో కొందరు ప్రయాణీక ప్రేక్షకులకు! కానీ రైల్లో ఎల్లా?! 


సొంత జీవితపు "భారతం"లోని వొడుదుడుకులు మరిచిపోవడానికి "మహా భారతం" పుస్తకం చదువు కుంటున్నాడు పానకాల్రావు... 


అనుకోకుండా వచ్చిన ప్రయాణం గనక "అన్ రిజర్వుడు" పెట్టెలో ఎలాగో కాళ్ళు ముడుచుకుని కాలక్షేపం చేస్తున్నాడు. 


బెజవాడ రావాలి. స్టేషన్లో మామయ్య కనపడి "అమ్మకేం ప్రమాదం

లేదులే, భయపడకు పానకాలూ" అనాలి.... "


నజాయతే మ్రియతేవా కదా చిన్నాయంభూత్వా

భవితా వాసభూ యా ః..." 


భగవద్గీత" పేజీలు తిరుగుతున్నాయి.....


"వాట్ ఎ రాటెన్ రష్?” సూటూ బూటూ, 'ఫెదర్' హ్యాటూ, చేతిలో ఎ.ఐ.పి. ఫాన్సీ బ్యాగూ, అర్థరాత్రయినా 'ఆరంజీ కలర్' కూలింగ్ గ్లాసులూ.... మిగలక మిగలక మిగిలిన అర ఇంచీ ఖాళీ స్థలం వైపు పానకాల్రావును "జరగమ"ని "ఫారిన్ జంటిల్మన్" ఠీవితో సంజ్ఞ చేస్తూ, ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునే లోపలే బిత్తర చూపులు చూస్తున్న పానకాల్రావు పక్కన "దఢీలున" కూర్చుండి పోయాడొక   ఆగంతకుడు!! 


సంగీత సాహిత్యా లెవరినైనా మనస్కుల్ని శాంతింప  చేస్తాయేమో! హఠాత్తుగా జరిగిన అన్యాయానికి బాధపడుతూ కూడా నెమ్మదస్థుడైన పానకాల్రావు "ఏమనాలో" తెలీకుండానే"నమస్తే" అనేసి. ఇంకొంచెం జరిగి కూర్చున్నాడా పెద్ద మనిషి “వసతి" కోసం!


"అతిథి దేవో భవా!"


ఇది మన భారతీయుల నిండుతనం! 


" ఎందాకా?" తన పై వుద్యోగస్తుడిలా ప్రశ్నించాడా పెద్దమనిషి!


"బెజవాడ."


"ఇంకేం. నేను బెజవాడే. ఎప్పుడూ విమానంలో తప్ప ప్రయాణం చేయలేదు. అమెరికా నుంచి మేం దిగి నాల్గు రోజులైనా కాలా. అబ్బ! ఇలాంటి చెత్త రైళ్ళల్లో మీరెలా ప్రయాణం చేస్తారర్రా! ఇట్ ఈజ్ ఎ షేమ్! మా వూళ్ళో ఇంట్లో కన్నా రైల్లోనే కమ్మటి  నిద్దరొస్తుంది! వాషింగ్టన్ లో  పడుకుంటే న్యూయార్క్ లో బెహరా వొచ్చి కాఫీ యిచ్చి లేపిందాకా మూసిన కన్ను తెరవపన్లా ! .... అది సరేగాని, ఏమిటా పుస్తకం?"


" మహా భారతం."


పానకాలావు కయోమయంగా వుంది. అయినా ఈయన లెక్చర్లు వింటూ ఎలాగోలా రాత్రి గడిచి కొంప జేరుకొంటే కొంత ఆదుర్దా తగ్గుతుందేమో! మరి వేరే గత్యంతరం?


"మీకు థ్రిల్స్ కావాలంటే “మహా భారతం" చదివేం లాభమండీ! ఇదిగో "గాన్ విత్ ది విండ్" నేను ముఫ్ఫయ్యొకటో సారి చదువుతున్నా. మనం బెజవాడ చేరే లోపల మళ్ళీ చదువడం పూర్తయితే మీకిస్తా లేండి... అయినా యీ రైళ్ళల్లో ఫ్యాన్లు బాగు చేసే నాథుడే లేడాండీ! ఇక్కడ గాలిరాదు.  కిటికీ తెరవాలంటే సుత్తితో కొట్టినా బిగుసుకు పోయి కదలదు ! చూశారా ఆ "బల్బు"లన్నీ ఎలా పగిలి పోయాయో! వెనక పెట్టెలో బాత్రూమ్లో నీళ్ళబొట్టు లేదు. అందుకే ఇక్కడి కొచ్చా. మిమ్మల్ని ఇబ్బందిపెడుతూ - పాపం! మీ ఇండియా ఇంకా, స్టోన్

ఏజ్ కాలంలోనే నిద్రపోతున్నట్టుంది! ఇప్పుడు తెలుసా మీకు?" చంద్రలోక మేంటి "- "సూర్యలోక మేంటి " "అంగారక లోకమేంటే"- చివరకు "బ్రహ్మలోకం"లో కూడా చక్కర్లు కొట్టి , పొద్దున భూమి మీద "టీ" త్రాగి వెళ్ళిన వాళ్ళం, మళ్ళీ భార్యాబిడ్డల్తో  బాతాఖానీ కొట్టడానికి రాత్రి భోజనాల వేళ కిల్లు చేరుకోగలం!! గణితమండీ! అంతా శుద్ధ గణితం మహిమంటే నమ్మండి! అదీ అమెరికా అంటే! అలాంటి లెక్కలు  తెలిసిన మహానుభావు డొక్కడైనా మీ వూళ్ళో పుట్టాడా చెప్పండి?


వొళ్ళు మండుకొస్తోంది ఆవేశంతో పానకాల్రావుకు. ఒక్కుమ్మడిగా లేచి "రామానుజం రామానుజం" అంటూ మన మేథమేటిక్స్ మేధావి పేరు తలుచుకుంటూ, పక్కవాడి పళ్ళు రాలేట్టు చంప చరుద్దామనుకున్నాడు... కానీ...


తనలో నివురుగప్పిన నిప్పులా. .   భూమిగర్భంలో బంగారంలో దాక్కున్న సాహిత్య సంస్కారమలా చేయనిస్తుందా! 


 వీడెవడు? మన భారతీయుడేనా? చూడ్డానికి మాత్రం అలాగే వున్నాడే! అదేమి ? పచ్చి తెలుగు మాట్లాడుతుంటే! ఎరువుకు తెచ్చుకున్న సూటూ బూట లాగేస్తే..  కళ్ళూ, కాళ్ళూ.. ముక్కూ. నోరూ- అన్నీ, మనలాగే వున్నాయి మరి! అయితే ఇంత "దర్జా వాగుతున్న పెద్దమనిషి తనతో  "రెండో తరగతి" (అదీ. అన్‌ రిజర్వ్ డ్‌!)లో దేని కిరుక్కున్నట్టు?!! 


పోనీ తనకెందుకీ గొడవంతా? తనకున్న దిగుళ్ళు చాలకనా! ఇలాంటి "బేవార్సు" వాళ్ళని పదిమంది వెతుక్కుపోతుంటే... 


అయినా, అతన్ని "బేవార్సు" వాడనుకోవడం తన పొరపాటే అయితే?!! 


తను మాత్రం విమానంలోనో, ఫస్ట్ క్లాస్ రైలు పెట్టెలోనో

ప్రయాణం చేయగల అర్హత లేనివాడా మరి! అనుకోకుండా తనూ యీ "గరీబీ " పెట్టి "గలీజు" లో కళ్ళు మూసుకుని కాలక్షేపం చెయ్యాల్సిరాలా?! 


అతనికీ, అలాంటి అవసర ప్రయాణం కాకతాళీయ న్యాయంగా తటస్పంచిందేమో .. పాపం!


నెమ్మదిగా అడిగాడు పానకాల్రావు " మీదసలే వూరండీ?"


" కొన్నాళ్ళు జపాన్లో వుండే వాళ్ళం. మా ఫ్యామిలీలో సగం మంది కెనడాలో పెద్ద పెద్ద పుద్యోగాల్లో హేమాహేమీల్లా  పని చేస్తున్నారు. నాకో రెండేళ్ళ క్రితం అమెరికాలో వరల్డ్ బ్యాంకులో కి ట్రాన్స్ఫర్ అయింది. మీ ఆంధ్రా గవర్నమెంటు వాళ్ళు "బీదల కోసం ఇళ్ళు కట్టించే పథకం" కింద మా దగ్గర నాలుగు మిలియన్ల డాలర్ల అప్పు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ సందర్భంలోనే, మీటింగ్ కోసం బెజవాడ వెళ్తున్నా. "సీదా ప్లేన్ లేదు. రైలే తొందరగా చేరుతుందని ఎవరో చెప్పారు. అందుకూ యీ రభస!"


న్యాయంగానే వుందతని వుదంతం! కానీ తన అసలు ప్రశ్నకు జవాబు రాలేదింకా. "ఇతను స్వతః తెలుగువాడా, కాదా" అని. ఈ ధర్మసందేహం తీర్చుకుని తీరాలి... అనుకున్నాడు పానకాల్రావు .


"అవునండీ! రైల్లోనే  నయం. ఈ రోజుల్లో విమానాలైనా మనల్ని "టైమ్"కు అందించి చస్తాయి గనకనా... ఒక్క మాట .. మీరు తెలుగు ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. తెలుగు వాళ్ళేనా?"


ఇంగ్లీషులో సమాధానమిచ్చాడాయన.


"యస్. బేసికల్తీ వుయ్ ఆర్ ఆంధ్రాస్, బట్ నౌ వుయ్ ఆర్ అమెరికన్ సిటిజన్స్".


ఏమైనా, అతనికీ విషయం మీద చర్చ రుచించినట్లు లేదని, అతని ముఖ కవళికలే చెబుతున్నాయ్! 


"ధనాధనా టక్ టకా ”


మేం మేం మాట్లాడుకుంటున్నా రైలుకేం బట్టింది! శరవేగంతో 'కాలం'లా పరుగెడూనే వుంటుందది! 


బెజవాడ సమీపిస్తున్న కొద్దీ  పానకాల్రావు  పక్క మనిపి దౌర్జన్యంగా  తన సగం సీటు లాక్కుని, వారి వింతలన్నీ ఏకరువు పెడుతూ, సోది కబుర్లు చెబుతున్న మాటే మరిచిపోయి తన కోసం పంచప్రాణాలు ధారబోసె  మాతృదేవతను గురించే "వదే పదే" ఆలోచిస్తూ, ఆమె ఆయురారోగ్యాల కోసం భగవంతుణ్ణి ప్రాధేయపడుతూ, మళ్లీ ప్రయాణ బడలికలో మగత నిద్ర ముంచెత్తుకొచ్చే లోపల, "మహాబారతం" లోంచి "భగవద్గీత" పేజీలు తిప్పడం మొదలెట్టాడు అటు కన్నతల్లి అనారోగ్యపు అశాంతికీ ఇటు యీ ఆగంతకుడి "మాతృదేశ విమర్శ "దాడికీ", "కృష్ణార్జున సంవాద' మే శరణ్యమని నమ్మిన పానకాల్రావు. 


ఇంతలో ఆయనన్నాడు "అవర్ డెస్టినేషన్ ఈజ్ నియరింగ్ . ఇంతలో బాత్రూమ్ కెళ్లొస్తా ; నా బ్యాగ్ లో  ఫారిన్ ఎక్చేంజి కొల్లలుగా వుంది. కాస్త జాగ్రత్తగా చూస్తుండండేం'' 


పానకాల్రావు కాశ్చర్యమేసింది. తలా తోకా తెలియని తన మీద ఎంత “భరోసా" ఈయనకు! " ఆ డబ్బు బ్యాగ్ లోపలికే తీసుకు పోదురూ" అందామనుకుంటున్న తన సమాదానం వినకుండానే జనాన్ని తోసుకుని బాత్రూంలో కెళ్లి పోయాడా

" పారెన్ రిటరన్ !"


నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః I

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 


ఇలా చదువుతూ, చదువుతూ ఎంత సేపైందో! 


మైమరచి బాహ్య ప్రపంచంతో సంబంధమే లేనట్టు గాఢమైన సుషుప్తిలోకి చొచ్చుకు పోయింది పానకాల్రావు మనస్సు . 


మధ్య మద్య ఎక్కేవాళ్లూ. దిగేవాళ్లూ "నీడ నీడ"గా కనబడుతున్నారంటే ఒకసారి టికెట్ కలెక్టరొచ్చి చెక్ చేసి పోతూ పోతూ టాగూర్ అందమైన గడ్డంతో, అపురూపమైన వదనారవిందంతో "మాంచి". పెద్దమనిషిలా  కనబడుతున్న పానకాలావు నడిగాడు కూడా " ఇక్కడెవరన్నా టిక్కెట్టు లేకుండా ఎక్కి మిమ్మల్ని అవస్థ పెట్టలేదు కదా సార్? అన్ రిజర్వుడు కంపార్టుమెంట్లలో  మాకు రోజూ ఇదే గొడవ కదా! అందుకే అడుగుతున్నా"


"ఎబ్బె! ఏం లేదండీ!" మాట వరసకనేశాడు పానకాల్రావు టిక్కెట్ కలెక్టర్ కు  ' థాంక్స్'  చెప్పి


 "ధన్ ధనా- టక్ టకా.." 


తెల్లవారుతోంది. ఈ స్టేషను గాక, ఇంకొక్కటి దాటితే బెజవాడ! 


 "ఇడ్లీ..  కాఫీ అరుపులు ! " ప్లాట్ ఫోరమ్ నిండా మోగుతున్నాయి.


తన ఎలాగో  వూగుతూ వూగుతూ, వోరబడి కాస్తో కూస్తో  నిద్రకు దిగి  లేచాడు పానకాల్రావు.  బాత్రూమ్ లో  గంటకు పైగా గడిపి, ముస్తాబై వచ్చిన పారిన్" పెద్దమనిషి' " బెజవాడ వచ్చేస్తోంది.  మీరూ బాత్రూమ్ వగైరా వెళ్లొచ్చి ప్రెష్ గా కూర్చోరాదూ?" 


ఆప్యాయంగా సొంత చుట్టంలా ఆయన అలా అంటే “వద్ద”న బుద్ధేయలేదు .  పయనమైనాడు పానకాల్రావు కాలకృత్యాలు తీర్చుకోవడానికి. 


ఖండలయలోంచి ఆదితాళంలోకి దిగి, చివరకు తాళం తప్పినట్లు రైలు రొద ఆగింది నెమ్మది నెమ్మదిగా. 


"బెజవాడ వచ్చింది’' 


అమ్మను చూడాలి! మామయ్య నాకోసం వెతుకుతున్నాడేమో!" 


అసలు రైలాగినా ఆదుర్దాతో  పానకాల్రావ్ గుండెల్లో కొత్త కొత్త రైళ్లు పరుగెడుతున్నాయి! 


బాత్రూమ్ తలుపు తీసుకుని, దిగే జనాన్ని తోసుకుంటూ సొంత సీటు దగ్గర చేరేడు. 


తన పెట్టే, బెడ్డింగూ కూచున్న చోట శూన్యం! 


ఆ పారిన్ పెద్దమనిషి లేడక్కడ! 


పరిగెడుతున్న గుండెకాయ, ఒక్కసారిగా  కొట్టుకోడమే మానేసి నట్టయింది. 


సామాను పోతే పోయింది అమ్మకు తెచ్చిన మందులన్నీ, అందులో నే వున్నాయి! 


ఏం చేయడమో ఆలోచించే లోపల మామయ్య గొంతు వినిపించింది.


“పానకాలూ- పానకాలు-"


ఇద్దరూ. కొత్తగా పెళ్లయిన  భార్యాభర్తలు పడగ్గదిలో కౌగలించుకున్నట్లు  కౌగలించుకున్నారొక్కసారి! 


" మామా” అమ్మెలా వుంది? " 


"గండం తప్పిందోయ్! నీ కోసమే కలవరిస్తోంది .. పద ! కూలీని పిలుస్తా..  సామానేదీ?"


చావు కబురు చల్లగా చెప్పమంటారు. అయినా తల్లిని ప్రాణాలతో చూడగలుగుతున్నానన్న ఆశలో పానకాల్రావుకు సామాను పోయిన దుఃఖం కించిత్తు కూడా బాధపెట్టలేదా క్షణంలో . 


గొంతులోంచి చేదు కాకరకాయ కక్కేసినట్టు "దబా" "దబా" సామాను పోయిన వ్యవహారమంతా మామయ్యతో చెప్పేశాడు.


"ఆరి నీ తస్సదియ్యా!  పట్నాల్లో కాపురం జేస్తూ ఆమాత్రం జాగ్రత్త లేకపోతే యెల్లాగోయ్! రైలు కదిలే లోపల త్వరగా .. పదమరి రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ మనవాడే. గోపాలంగారు.... నడూ ! చెప్పిచూదాం! " ఇంకాయేమేమిటో అంటున్నాడు మామయ్య. 


ఈ లోపల కిందటె  స్టేషన్లో అవతరించిన “టక్కెట్ కలెక్ట"రే, మన "ఫారిన్ గెస్టు" నొక పోలీసు బంట్రోతుతో సహా నెట్టించుకొస్తూ, వీళ్ళ పెట్టి దగ్గరికి చేరుకున్నాడు!


"ఏమండీ! ఈయన టిక్కెట్టు మీ దగ్గరుందా? " 


"అదేమిటీ? ఆయన టిక్కెట్టు నా  దగ్గరెందుకుంటుందండీ?!


"అయితే ఆయన మీ "బావమరిది" కాడా మరి?" .


మామయ్య, పానకాల్రావు దిగాలుపడి చూస్తున్నారు! 


వరల్డ్ బ్యాంకు మెంబరు గారి ముఖాన కత్తి వేస్తే నెత్తురు చుక్క లేదు. 


"ఈ కొత్త బావమరి దెక్కడ దాపరించాడో" అని మామయ్య నిర్ఘాంతపోతున్నాడు! .


అప్పుడు అన్నాడు పోలీసు బంట్రోతు "మరి అతని చేతిలోని యీ పెట్టి మీది మీ చిరునామా.. మీ వుద్యోగ వివరాలూ, పేరూ వూరూ, అన్నీ అతనికి ఎంతో పరిచయంలా, గోపాలంగార్ని నమ్మించేశాడండీ! ఆ వొక్క  టిక్కెట్ట ముక్క చేతిలో లేకపోబట్టి గోపాలంగారి కనుమాన మొచ్చి. . సరిగ్గా యీయన గేటు దాటేసుకుంటున్న సమయానికి లంకించుకుని, వాకబు చెయ్యమని మమ్మల్నిలా పంపారండీ!"


"ఓరి భగవంతుడా నా పెట్టా, బేడా పాకుండా రక్షించడమే కాకుండా నాకొక కొత్త ' ఆప్తబంధువు ' ను  కూడా సృష్టించావు గదరా! ప్యాన్ లు పని చేయని, బల్పులు పగిలి, కిటికీలు

బిగుసుకుపోయిన భారతదేశపు రైళ్లల్లో హిమాలయాల నుంచి కన్యాకుమారి ప్రతిక్షణం వేలాది భారతీయులు దైనందిన కృత్యాల్లో ముగ్ధులై ప్రయాణం చేస్తూనే వుంటారు.  అవి మన కోసం- మనం వాటి కోసం జీవిస్తూనే కాలం గడుస్తుంది. 


అయితే వాటిల్లోనే, "అమెరికా, ఇంగ్లండు" వగైరాలూ, "అంగారక గ్రహం"- "బ్రహ్మలోకం" వగైరాలూ, చక్కర్లు కొట్టి ఎప్పుడోప్పుడు  తిరిగొచ్చే సమయానికి టికెట్ లెస్  ట్రావెల్ కోసం శ్రీకృష్ణ జన్మసానం పోబోతూ, మన మన "బావమరుదు" లయ్యే సదవకాశం, ఎంత మందికి దక్కుతుందో మరి! '' అనుకుంటూ “దేశపు అమ్మనూ", "కడుపున కన్నతల్లినీ"- ఇద్దర్నీ తలుచుకుంటూ, మధ్య మధ్య తన విచిత్ర ప్రయాణపు కబుర్లతో సతమత మవుతూ, మామయ్యతో సహా గుర్రబ్బండెక్కాడు పానకాల్రావ్. 

***

- ఏల్చూరి విజయరాఘవరావు 


( ఆంధ్రసచిత్రవారపత్రిక - 31-8-1990 ) 

సేకరణ : 

కర్లపాలెం హనుమంతరావు 

27-12-2021 

బోథెల్; యూఎస్ ఎ 






మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...