Sunday, August 13, 2017

కన్నయ్య నల్లనయ్య ఎలా అయ్యాడు?-బమ్మెర



నిజంగానే ఏమీ తెలియక, ఎవరైనా ఏమైనా అడిగితే ఏదో ఒకటి చెప్పేసి చెల్లుబాటు కావచ్చు. కానీ, అన్నీ తెలిసి తెలిసే కావాలని అడుగుతుంటే ఏమనుకోవాలి? మన లోతెంతో తెలుసుకోవడానికి అలా అడిగారనుకోవాలా? ఒకవేళ తెలిసినా హఠాత్తుగా ఇప్పుడది గుర్తుకు రాక అడిగారనుకోవాలా? అయినా, ఆ ఆడిగింది సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడే అయితే, ఎవరికైనా ఇంక మాటలెలా వస్తాయి! కాకపోతే ఆ అడిగింది తల్లి యశోదనే కాబట్టి, లోకానికి చక్రవర్తే అయినా, తల్లికి కొడుకే కాబట్టి, ఆమేదో సమాధానం చెబుతుంది. 1978లో విడుదలైన సత్యం-శివం-సుందరం సినిమా కోసం విఠ్ఠల్‌ భాయ్‌ పటేల్‌ రాసిన ఈ పాటలో ఈ తల్లీ కొడుకుల సంభాషణల స్వారస్యమే కనిపిస్తుంది. లక్ష్మీకాంత్‌- ప్యారేలాల్‌ స్వరరచనకు లతా మంగే ష్కర్‌ గాత్రం నిజంగా ప్రాణమే పోసింది.
యశోమతీ మైయా సే బోలే నంద్‌లాలా
రాధా క్యోఁ గోరీ.... మై క్యో కాలా?
(నందకిశోరుడే అడిగాడు యశోదమ్మని...
 రాధ ఎందుకు ఎరుపు? నేనెందుకు నలుపని?)
తనకు తెలిసిందేదో తెలిసే ఉంటుంది. తనలో కదిలే ప్రశ్నలకు తనవైన సమాధానాలు ఉండే ఉంటాయి. అయినా ఆ ప్రశ్నలకు ఎదుటి వాళ్ల నుంచి ఏం సమాధానం వస్తుందో చూద్దామనే కదా ఆ ప్రశ్నలు వేయడం! అయితే ఏ ప్రశ్నకైనా అందరి నుంచీ ఒకే సమాధానం రాదు. ఎందుకంటే ఎవరి అనుభవాలు వారివి! ఎవరి జీవితం వారిది! మొత్తంగా చూస్తే ఒక్కొక్కరికీ ఇక్కడ ఒక్కో వేరు వేరు ప్రపంచం ఉంటుంది. అందరి రక్తం ఒకటే కదా అన్నట్లు, స్థూలంగా అందరి జీవితాలూ ఒకేలా అనిపించవచ్చు. కానీ, అత్యంత సూక్ష్మమైన లోలోతుల్లోకి వెళితే హృదయానికీ, హృదయానికీ మధ్య, జీవితానికీ జీవితానికీ మధ్య అనంతమైన వ్యత్యాసం కనిపిస్తుంది. దీనికి తోడు, అసలు సమాధానం ఒకటైతే, దాన్ని వక్రీకరించడం మరొకటి. అందుకే ఒకే ప్రశ్నను వేరు వేరు వ్యక్తులను అడగడం ద్వారా ఒక ప్రశ్నకు చెందిన వేయి సమాధానాలు దొరుకుతాయి. ఒకే సత్యానికి చెందిన వేయి ముఖాలు తెలుస్తాయి.





బోలీ ముస్కాతీ మైయా లలన్‌ కో బతాయా
కారీ అంధియారీ ఆధీ రాత్‌ మే తూ ఆయా
లాడ్‌లా కన్హయ్యా మేరా కాలీ కమ్‌లీ వాలా
ఇసీ లియే కాలా / యశోమతీ మైయా/
(ముసిముసిగా నవ్వుతూ అమ్మ ముద్దుల కొడుకుతో అంది...
నడిరాత్రి కారు చీకట్లో కదా! నువ్వు జన్మించింది.
అందుకే ఓరి కన్నా! నువ్వు నల్ల కలువవయ్యావు.. నువ్వు అందుకే నలుపు..)
నేనెందుకు నలుపని కన్నబిడ్డే నిలదీసి అడుగుతుంటే కన్నతల్లిగా సమాధానం చెప్పాలి కదా! నిజమే కానీ, ఏ పరిణామానికైనా లోకంలో ఒకే ఒక్క కారణం ఉండదు కదా! ప్రతి పరిణామం వెనుక పైకి కనిపించేవీ, కనిపించనివీ అనేకానేకమైన కారణాలు ఉంటాయి. అలా అని అన్ని కారణాల్నీ ఒకేసారి చెప్పడం కూడా అన్నిసార్లూ కుదరదు . అందుకే ఒక కారణంగా యశోద ’’నాన్నా! అర్థరాత్రి వేళ అదీ కటిక చీకట్లో నువ్వు పుట్టావు. ఆ చీకటి ప్రభావంతోనే నువ్వు నల్ల కమలానివయ్యావు.. నీ నలుపు అలా వచ్చిందే కన్నా’’ అనేసింది. ఆ సమాధానంతో సంతుష్టుడు కాని కృష్ణుడు అది కాదు సమాధానం అంటూ మారాం చేశాడు. ‘‘నా నలుపు సంగతేంటో తేల్చ’’మని తిరిగి ప్రశ్నించాడు.
 బోలీ ముస్కాతీ మైయా సున్‌ మేరే ప్యారే
 గోరీ గోరీ రాధికా కే నైన్‌ కజ్‌రారే
 కాలే నైనో వాలీ నే ఐసా జాదూ డాలా
 ఇసీ లియే కాలా / యశోమతీ మైయా/
 (ఆ తల్లి మందహాసం చేస్తూ, ఓ ముద్దుతండ్రీ!
ఎర్రనైన రాధికవి నల్లనల్లని కాటుక కళ్లు!
 ఆ నల్లకళ్ల అమ్మాయే ఆ మంత్రమేదో వేసింది.
 నువ్వు అందుకే నలుపు)
మరో సమాధానంగా యశోద ‘‘రాధ తన కాటుక కళ్లతో నిన్ను అదే పనిగా చూడటమే నువ్వు నలుపు అయిపోవడానికి అసలు కారణం’’ అనేసింది. చూసినంత మాత్రాన్నే మనుషులు నలుపెక్కుతారా? అంటే ఏమోమరి! ఆమె ఎన్నిసార్లు, ఎంత తీక్షణంగా చూసిందో ఎవరికి తెలుసు? అందులో ఏదో నిజమంటూ లేకపోతే, కన్నకొడుకుతోనే అలా ఎందుకంటుంది! అనుకుంటూ మనమేదో మన మనసుకు సర్ది చెప్పుకోవచ్చు. కానీ, ఆ తల్లికి అలా చెప్పాల్సిన అవసరం ఏముందో ఎవరికి తెలుసు? అయినా ముందు ఒక కారణం చెప్పి ఆ తర్వాత మరో కారణం ఎందుకు చెప్పినట్లు! అంటే అసలు నిజం చెప్పడం ఆమెకు ఇష్టం లేకేనేమో ఇలా దాటేయడం? కాకపోతే, తన కొడుకు ఔన్నత్యం గురించి చెబితే లోకానికి కంటగింపుగా ఉంటుందని కూడా ఆమె అసలు నిజం చెప్పకపోవచ్చు.

ఇత్‌నే మే రాధా ప్యారీ ఆయీ ఇఠ్‌లాతీ
మైనే నా జాదూ డాలా, బోలీ బల్‌ ఖాతీ
మైయా కన్హయా తేరా జగ్‌ సే నిరాలా
ఇసీ లియే కాలా / యశోమతీ మైయా /
(అంతలోనే ప్రియమైన రాధ... హొయలొలుకుతూ వచ్చింది
 అలక వహిస్తూ నేను ఏ మంత్రమూ వేయలేదు
అమ్మా నీ కొడుకు లోకానికే అతీతుడు.. అందుకే నలుపు అంది)
కన్నతల్లి ఏం చెబితే నేమిటి? అసలు నిజం దాచేయాలని ఆమె ఎంత ప్రయత్నిస్తేనేమిటి? అదంతా బట్టబయలు చేసింది రాధ. కాదా మరి! కృష్ణుడి రంగు నలుపెక్కడానికి తన కాటుక కళ్లే కారణమని చెప్పేస్తుంటే తానెలా ఊరుకుంటుంది.? అందుకే అంది.... ‘‘యశోదమ్మా! నీ కొడుకు నలుపు రంగుకు నేనెలా కారణమవుతాను తల్లీ! నావి ఎంత కాటుక కళ్లు అయితే మాత్రం నా చూపులకే నీ కొడుకు నలుపెక్కుతాడా?అసలు విషయం ఏమంటే... నీ కొడుకు లోకానికే అతీతుడు అతని నలుపు రంగుకు అసలు కారణం ఇదే! కాదనగలవా అమ్మా!’’ అంటూ అటు నుంచి విసురుగా వెళ్ళిపోయింది రాఽధ. అవునూ! అతీతుడు కావడానికీ, శరీర వర్ణం నలుపు కావడానికీ ఏమిటి సంబంధం అనిపిస్తోంది కదూ! అందులో వింతేమీ లేదు. అనంతమైనవే ఎప్పుడూ అతీతంగా ఉంటాయి. అనంతమైనవే నలుపు ( నీలం) రంగులో ఉంటాయి. అనంతమైన సముద్రం నలుపు రంగులో ఉంటుంది. అనంతమైన ఆకాశం నలుపురంగులో ఉంటుంది. అలా చూస్తే అనంతమూర్తులైన రాముడూ నలుపే, కృష్ణుడూ నలుపే. అందుకే నలుపు రంగు అనంతత్వానికీ, దివ్యత్వానికీ ప్రతీకే తప్ప మరొకటి కాదు. రాధ మాటల్లోని ఆ అతీత తత్వం, పరమ సత్యమే తప్ప వేరేమీ కాదు.
- బమ్మెర

(ఆంధ్రజ్యోతి- దినపత్రిక- నవ్య- 14-08-2017)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...