Wednesday, August 23, 2017

తొండపు స్వామీ... దండము నీకు!-ఈనాడు సరదా గల్పిక



గణాధిపతి హాస్య రసానికి అధిపతి. చందమామయ్యే పాపం ఎందుకో అలా నీలాపనిందలపాలయ్యాడు కానీ, ఆ బొర్ర దేవుణ్ని చూస్తే నవ్వు రానిదెవరికి? హాయిగా చవితి పండుగ ముందునాడు, వినాయకుడి ముచ్చట్లు చెప్పుకొందాం. అదే పుణ్యం పురుషార్థం కూడానూ!
జాజి, జవ్వాజి అంటూ పత్రులు ఇరవయ్యొక్క రకాల్తోనా గజాననుడికి పూజా పునస్కారాలూ? అన్నేసి రకాల ఆకులు ఈ కరవు రోజుల్లో దొరుకుతాయనే! కరివేపాకు రెబ్బ కూడా కాడ పది కాడ నిలబడి కిందికి దిగిరానంటుందబ్బా రైతు బజార్లల్లో! జనాలేవన్నా ఆ అదానీ, అంబానీలకు దగ్గరి చుట్టాలా పక్కాలా? బీదా బిక్కీ ఒక్కపూట బొక్కేందుకే ఇంత బలుసాకు రెక్క దొరక్క బిక్కచచ్చి బతకతా ఉంటే- మళ్లా ఇదేం విపరీతమయ్యా మహానుభావా!
గారెలు, బూరెలు, వడపప్పు, పాయసాలంటూ చేంతాడంత పట్టీలు పట్టుకు చందాలకని ఇల్లిల్లూ తిరిగి వేపడం, ఉండ్రాళ్ల మీదకు దండు గొలుపమంటూ ఆ బొజ్జ గణపయ్యను ­రికే రెచ్చగొట్టొద్దు బాబోయ్‌! దినం గడవడమే గండంగా ఉందిగదా ఇక్కడ మహాశయా!
ఏ దినుసుమీద ఎంత జీఎస్‌టీ వాతో... కొన్న తరవాత కానీ తేలడం లేదు రాత! ఏదో విధాయకం కనక భాద్రపద చవితికి సరదాగా వినాయకుణ్ని ఓసారి వచ్చి పొమ్మనడమే కాని- చూసీచూడనట్లు సర్దుకుపోవాలని ఆ లంబోదరుడికి మాత్రం తెలీదా?
సరే, ఎలాగో ఆ ఎలుక వాహనుడు వాలిపోతున్నాడు కాబట్టి, కొన్ని హెచ్చరికలు ముందస్తుగా మనమూ చెప్పక తప్పదు. శ్రీ గజాననా... శ్రద్ధగా విను నాయనా! గుళ్లల్లోని దేవుళ్లే నేరుగా భక్తుల ఇళ్లకు వెళ్లొచ్చే కొత్త రోజులు వచ్చి పడ్డాయిప్పుడు. కుడుముల మీద మరీ అంత యావుంటే కుదరదు. ఏ భక్తుడి బీరువాలోనో లటుక్కుమని ఇరుక్కునే ప్రమాదం కద్దు. జర భద్రం జగన్నాయకా!
పోయిన ఏడాది మాదిరే పూజలో వెయ్యి నోట్లు విసిరితే ఉబ్బి తబ్బిబ్బు కావద్దే! ఆ చెల్లని నోట్లతో నిన్ను బోల్తా కొట్టించేసి, నీ నుంచి వరాలు దండుకొనే పథకాలు దండిగా తయారవుతున్నాయ్‌ నీ పూజా పందిళ్ల వెనక వినాయకా! అమాయకంగా ఎవరి మాయలోనూ పడిపోవద్దు. ఆనక ఏ ఈడీ కేసులోనో ఇరుక్కుంటే మీ డాడీవచ్చి విడిపించాలన్నా- ఫలితం సున్నా!
కోరిన విద్యలకెల్ల ఒజ్జవని బుజ్జగించి మరీ ఏ చెత్త బడులకో అనుమతులు రాబట్టేస్తారండోయ్‌ విద్యా వ్యాపారుల దండు. ఆ అడ్డా సరకుతో జర భద్రంగా ఉండాలి జగన్మాత తనయ! అత్యున్నత న్యాయస్థానాలే నిదానంగా పోయే విధానాలతో ఉంటే, నీకు మరీ అంత అత్యుత్సాహం తగదు! ఆనక జరిగే తగాదాల్లో పార్టీ కావద్దు!
పుట్టిన రోజు వేడుకలకని అంత ఉల్లాసంగా వచ్చేస్తున్నావు. మంచిదే కానీ, ఎన్నికల వేడి నీకన్నా ముందస్తుగానే వచ్చి పడిందిప్పుడు వాడవాడలా! పాడు నేతలు నీ అభయ హస్తాన్ని ఎంతలా వాడుకుంటారోనన్నదే మా భయం. ఎచ్చులకుపోయి ఎవరి ఉచ్చులోనూ ఇరుక్కుపోకుండా ఉండటానికే ముందస్తుగా నీకీ హెచ్చరికలు!
మాదక ద్రవ్యాల వినియోగం మహజోరుగా సాగే సీజన్లోనే వచ్చి పడాలా నీ చవితి పండుగ సంబురాలు శంభు తనయా! పూజా పత్రిలో రవ్వంత గంజాయి ఆకు దొరికినా చాలు- కైలాసగిరికి నువ్వు తిరిగి వెళ్లే మాట కల్ల! జర భద్రం జగన్నాయకా!
పుస్తకాల సంచి బరువు బాధల నుంచి బడి పిల్లకాయలను కాపాడాలని రెండు తెలుగు ప్రభుత్వాలూ తెగ తంటాలు పడిపోతున్నాయి. భారీ కాయమాయె నీది! ఏ ఆకతాయితనానికో పసిపిల్లకాయల భుజంమీదకు ఎక్కుతావోనని భయం!
అడుగడుగునా అభివృద్ధికి అడ్డు తగులుతూ చెడ తిరిగే దున్నపోతులకీ దేశం గొడ్డుపోలేదు. వాటి మీద ఎక్కి, వాళ్ల వంకర బుద్ధులనన్నా తిన్నం చెయ్యి స్వామీ- నీ చవితి పండగకు అప్పుడు ఓ చక్కని సార్థకతా ఏర్పడినట్లు ఉంటుంది.
అన్నట్లు, ఆఖరుగా నిమజ్జన దృశ్యం ఉంటుంది. ఎప్పట్లా ట్యాంకుబండ్‌ మీదే అది తప్పనిసరా స్వామీ? బోలెడంత జనం సొమ్ము ధారపోస్తేగాని ఆ మాత్రమైనా పరిశుద్ధమైంది కాదీ సాగరు జలాలు! మళ్ళీ మురికి చెయ్యడమంటే ఎవరి ముల్లెకో లాభం చేకూర్చడమన్న మాటే! నీ భక్తులకు నువ్వే నచ్చజెప్పాలి. న్యాయస్థానాల తీర్పుల్ని గౌరవించడం నువ్వే నేర్పించాలి విఘ్నేశ్వరా!
నీ మూషిక వాహనాన్నే నమ్ముకుని రావయ్యా గణనాయకా! నామోషీ ఏం లేదులే. కాకుంటే మా కొత్త పాయింట్లపద్ధతికి కాస్త నీ కొంటె మూషికం అలవాటు పడాలంతే! ఏనుగు చెవులని ఏమంత బేఫర్వా వద్దు. ఎన్నికల మధ్యలోకదా నీ చవితి పండుగ వచ్చి పడిందీ! మా బూత్‌రాజకీయాలకి ఓ బేలు దూదుండలు తప్పనిసరి. గుర్తుంచుకొని వెంట తెచ్చుకో... పండుగ తొమ్మిది రోజులూ రెండు చెవుల్లో దోపుకొందువుగాని!
ఉచిత ఫోను సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంత విపులంగా నీతో ముచ్చటించడానికి వీలైంది. చివరగా చిన్న విన్నపం. నీతోపాటు సిద్ధిని, బుద్ధిని వెంట తీసుకురావయ్యా! వాళ్లిద్దరే మా పెద్దమనుషులందరికీ ఇప్పుడు అత్యంత అవసరమని మా మెజారిటీ సామాన్యుల తిరుగులేని తీర్మానం!

- కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...