Wednesday, April 22, 2020

హిమానీ హృది- వేగుంట మోహన ప్రసాద్ - కర్లపాలెం హనుమంతరావు


ఇదీ పద్యం : 
రాఉడూ! వేసెయ్! తలుపులు వెసెయ్!
ఆ కిటికీ రెక్కకు చిడుత లేదల్లే ఉంది!
పోనీ, ఏదైనా రాయైనా అడ్డం పెట్టు.
ఇదేవిట్రా రాఉడూ! ఇవ్వాళిట్లా
వడగాలిలా, సుడిగాలిలా ఈ చలిగాలి!
నా హృదయం అనే ఎయిర్ కండిషన్డ్ రూంలో
వెచ్చగ ముసుగు వేసి మూడంకె వేసి
హృదయాంతరాళపు రుధిర ప్రవాహంలో
నాలో నేనుగ పడుకొన్నాను కద!
ఇంకా ఏమిటిరా ఈ చలి , మరీ ఆగడం.
కాశ్మీర్లో చచ్చే చలి గనుకనే
అన్నన్ని ఉన్ని శాలువాలు.

రాఉడూ నా ఈ కవోష్ణ హృదయంలో
చేతులు కొంగర్లు పోయ,
పై పెదవికి కింది పెదవికి పోట్లాడ రాగ, దవడలు చప్పట్లు కొడుతూంటే
పులకరించిన దేహం చూస్తూ ఊరుకుంటూంటే
మంచుముక్కలా పడుకున్నాను కద!
ప్రపంచం మరీ ఇంత నీళ్లు గారిపోతున్నదేం?
కళ్ల ముందు ఏమిటీ పొగమంచు!
భ్రాంతి అనే ఎండమావిలా ఈ మంచుపొగ!
ప్రపంచమనే యువతి వేసుకున్న మేలిముసుగు!
నాకే ఇంత చలి వేస్తున్నదే,
వీళ్ల కెంత చలో మఱి!
రాఉడూ! నా యీ కళ్లనే కుంపట్లలో  
కాస్తంత నిప్పు రాజేయరా బాబూ!
కనుపాపలనే ఈ రెండు రాక్షసిబొగ్గులు
రాజుకుంటేనన్నా ఈ చ లా గుతుందేమో!
నీ శ్వాస అనే విసనకఱ్ఱతో
యీ పొయ్యూదు!
మన ఇంట్లో కొబ్బరినూనె సీసాలో నూనె 
గడ్డకట్టుకు పోయింది కదూ?
కాస్త నా కళ్ల సెగన పొయ్యి సెగన పెట్టు దాన్ని!

ఈ రాత్రి నెవరురా వారు?
"నీ యింట్లో, నీ హృదయంలో  యీ నైటుకి కాస్త
తలదాచుకోనియ్యి" అంటారు!-వీల్లేదని చెప్పు!
రాఉడూ! తలపు తియ్యకు! తీశావో,
చలిగాలి 'ఉ హు హు' అని వణుకుతూ వచ్చి
తన చలి తీర్చుకోవడానికి నన్ను కౌగలించుకుంటుంది.
హృదయం అంటే సామాన్యమా! కర్మ!
నాలోని నవనాడులూ కలిసే చోటు.
ఆత్మకూ దేహకూ పేచీ వచ్చేదిక్కడనే.
'ప్రేమ' అనే ఆ దరిద్రపు గుడ్డి దీప వెలిగి కొండెక్కేదిక్కడనే!
హత్యకు ఆత్మహత్యకు ఇదే బలిపీఠం.
స్వర్గసీమ వల్లకాడు రెండూ ఇదే.
ఇక్కడే జీవి చనిపోయేదీ, చావు బ్రతికేదీను.
అసలూ నీవూ నేనూ ఉన్నదే ఇక్కడ.
మనకున్న యీ ఒకే ఒక్క దుప్పటిని నీవు కూడా పంచుకో.

రాఉడూ! చూడు చూడు! ఏవిటా గాజుల సవ్వడి!
జలపాతంలో అందెల మువ్వల చిందులు!
అందాలరంగవల్లి రా ఎవరావిడ?
బొమ్మల పెళ్ళిలో లక్క చిట్టిలా ఎవరు?
రాఉడూ! తీసెయ్! తలుపు బార్లా తీసెయ్!
(భారతి- 1960, మే సంచిక ప్రచురితం)

నా పరామర్శ: 

చిడతలు ఊడిన రెక్కల కిటికీ తెరిచిపెట్టవద్దని కవిగారు ఒహటే మొత్తుకోలు! వడగాలిలా, సుడిగాలిలా ఆ వేళ  చలిగాలి రివ్వున వీయడంతో ఆయనగారి  కవోష్ణ హృదయంలో చేతులు కొంగర్లు పోవడం,  పై పెదవికి కింది పెదవికి పోట్లాట మొదలయినా అదేదో వినోద ప్రదర్శనలా ఆయనగారి స్వదేహమే పులకరించిపోతూ తిలకించడం! కవిగారికి ఇప్పటి వరకు తన హృదయమనే  ఎయిర్ కండిషన్డ్ గదిలో వెచ్చగ మునగ దీసుకుని మూడంకె వేసి పడుకునే విద్య ఒక్కటే తెలుసును.   రాయైనా కిటికీకి అడ్డపెట్టలేనంత వేగంగా వీచే వడగాలి చలిగాలికి  ఇప్పుడేం చేయాలో ఊహామాత్రంగానైనా తోచని అయోమయం. బైట ఎట్లాంటి కష్టాలు, కడగండ్లు చెలరేగినా  ఈ తరహా హృదయవాద కమలకు తమ సోదేదో తమదే! వేగుంటగారికి  తన  హృదయాంతరాళపు  రుధిర ప్రవాహంలో  తనలో తానుగా ముడుచుకుని పడుకోవడమొక్కడే తెలుసును లాగుంది. అందుకె అక్కడెక్కడో వీచే కాశ్మీర్ చచ్చేచలి గాలులకు పనికొచ్చే ఉన్ని శాలువాలను గూర్చి అసందర్భపు ఊహలు..  ఊహల  వెచ్చదనం కోసం కవిగారు పడే తాపత్రయాలు!   తాను తట్టుకోలేని పొగమంచు మంచుపొగను ఎండమావి అనుకున్నంత మాత్రాన వళ్లేమైనా వెచ్చబడేనా?  భ్రాంతి కాకపోతే! అంత కష్టంలోనూ ఆ పొగమంచును ప్రపంచమనే పడుచు కప్పుకున్న  మేలిముసుగుగా  వర్ణించి మురుసుకోవడం కవిగారిలోని పురుషపుంగవుడికే చెల్లబ్బా!  చలిగాలికి గాని మతి చలించేదేమోకవిగారికి ! మనసులోని భావాలు ఒకచోట నిలకడగా నిలబడని చంచల స్థితి గమనిస్తే ఆలాగునే అనిపిస్తుంది మరి! ' రాఉడూ! నా యీ కళ్లనే కుంపట్లలో ..కాస్తంత నిప్పు రాజేయరా బాబూ! కనుపాపలనే ఈ రెండు రాక్షసిబొగ్గులు రాజుకుంటేనన్నా ఈ చ లా గుతుందేమో! నీ శ్వాస అనే విసనకఱ్ఱతో యీ పొయ్యూదు!' అంటూ గోల పెట్టే శాల్తీ.. మళ్లీ  'ఇంట్లోని కొబ్బరినూనె సీసాలో గడ్డకట్టుకు పోయిన నూనె  తెచ్చి కాస్త తన  కళ్ల  పొయ్యి సెగన పెట్టమనడం ఏంటి? ఏంటో.. ఈ కవులు ఎవరికీ అర్థం కారు. ఈ మాదిరి మార్మిక కవులలో 'మడత పేచీ ' అదే! ఈ పేచీ కోరు వ్యవహాదాలకు ఆశపడే నా బోటి అర్భక పాఠకుడు కవిగారి మీద ఆరాధనలో పడిపోయేది. అక్కడి కది వదిలేద్దాం లే సార్!కనీసం స్వంత వంట్లోని రాఉళ్లకైనా అంతుబట్టే రీతిలో కలవరించని  కవులను ఎవరం మాత్రం ఏం రిపేర్ చేస్తాం! 
ఇంత గందరగోళంలోనూ ఎవరో తలుపు తట్టి 'ఇంట్లో, వంట్లో  ఆ  నైటుకి కాస్త చోటడిగినట్లు'  కవిగారి  ఊహ చూసారూ; అదీ మహావిచిత్రం. ఊహ మీద ఊహ మరో ఊహ ! 'కుదర్దని' కుండలు బద్దలుకొట్టి' తన సచ్చీలతను ప్రకటించుకున్నట్లు బడాయిలు కూడాను! రాఉడు తొందరపడి తలుపు తీస్తే చలిగాలి వణుక్కుంటూ వచ్చి తన చలితీర్చుకోడం కోసం కవిగారిని కావలించుకుంటుందని బెంగట! ఏం ఓవర్రా బాబూ!  ఆ ఓవర్లోనే ' అధివాస్తవికత'  అనే పోయిటిక్ ఎలిమెంట్ సూదంటురాయి మాదిరి నా బోటి దుర్బలులకు అంటుకునేది. we love Surrealism and Surrealistic thoughts. 
కవిగారితో కాస్త డైరక్ట్ స్పేచ్ లో మాట్లాడాలి! దయచేసి తమరంతా  కాస్త అసుంటా నిలబడండి!
 " అయ్య! వేగుంట కవిగారూ1, మీ రాఉడి కెలాగూ నోరూ వాయా పెగలదు కానీ! మార్మిక కవులు కదా మీరు! మీరే పెదవి విప్పి చెప్పండి ! మీకో హృదయం ఉంది. దానితో వేగడం మీ వల్ల కాని పని. ఆ మర్మం మీకూ బాగా తెలుసు.  అవును సార్!  మీరన్నట్లు హృదయం నవనాడులూ కలిసే జంక్షనే! ఆత్మకూ దేహానికీ అస్తమానం దెబ్బలాటయ్యే  టెంక్షన్ పాయింటూ ఇదే ! ఏమాట కామాటే చెప్పుకోవాలి మాష్టారూ! ప్రేమని ఓ గుడ్డి దీపంతో పోల్చడమే కాకుండా,  ఆ దరిద్రం వెలిగి కొండెక్కేది చోటు కూడా ఇదేనని పసిగట్టడంలోనే ఉంది సుమా మీ  రసరహస్య గ్రహణ ప్రజ్ఞ సర్వస్వం ! హత్యకు, ఆత్మహత్యకు గుండె మాత్రమే ఎందుకు మీకు బలిపీఠం అనిపించిందో.. స్వర్గానికి వల్లకాడు రెండింటికి కూడా  ఇదే కేరాఫ్ అడ్రసని ఎందుకు తోచిందో మీరు వేరే వివరించకుండానే  మీ లాస్ట్ లైన్ పంచ్ లో తేల్చేసారుగా!  హాట్సాఫ్ టూ యూ! 
'ప్రేమ' అనే ఆ దరిద్రపు గుడ్డి దీపం వెలిగి కొండెక్కేదిక్కడన్న మాట ఎంతో అనుభవం మీద చెప్పిన మాటయుంటుందిగా మాష్టారూ ! స్వర్గసీమ వల్లకాడు రెండింటికీ ఇదే కేరాఫ్ అడ్రస్ అని.. ఆహాఁ! ఎంత గొప్పగా చెప్పారు సార్! ఇట్లాంటి  వేదాంతం పలుకులు జీడిపప్పు ముక్కల్లా మీ మర్మ కవిత్వ పాయసం మధ్య మధ్యలో పంటికి తగుల్తాయనే మీ కవిత్వం  వెంటబడేది! 
జీవి చావుకూ, చావు బతుకు కూడా ఈ హృదయమే కరెక్ట్ స్పాట్ అన్న ఒక్క భారీ వాక్యం చాలు  సారూ  ఈ  'హిమనీ హృది'ని జన్మంతా గుండెల మీద పెట్టుకుని ఇష్టంగా ఈజీగా మొసెయ్యడానికి! హ్యాట్సాఫ్ అనడానికి అసలు పాయింట్ ఇప్పుడు చెప్పాల్నా  గురూజీ!

ఒకే దుప్పటి మీ బైరాగి రాఉడితో పంచుకోవడానికి సిద్ధపడిన వైరాగ్యంలో కూడా.. బైట గాజుల సవ్వడి వినబడగానే ఎట్లా ప్లేట్ ఫిరాయించేసార్సార్! హ్హా.. హ్హా.. హ్హా! మనిషి మనసులోని చపలత్వం సర్వం రూపుకట్టించేసారుగా ఆ ఒక్క ట్విస్టులో ! ఏ బొమ్మల పెళ్లి లక్క చిట్టో జలపాతంలా అందెల మువ్వలతో చిందులేసుకొంటూ అందాల రంగవల్లిలా మీ గుమ్మం ముందు చేరి తలుపు తట్టినట్లుగా  మీకై మీరే  మహా సందడిగా ఆనందపడి పోయారు ! మంచులా కరిగిపోయింది గదా  ఒక్క మువ్వల సవ్వడికే మీ దీనత్వం, వేదాంతం .. ధీరత్వం సర్వం! 
మనిషి చపలత్వాన్ని  మొహమాటం లేకుండా చివరి రెండు వరసల్లో వివస్త్రను చేసి  ప్రదర్శించేసినందుగ్గాను. . మీ లెస్ హీరోక్రసీకి ఫ్లాట్! 
కర్లపాలెం హనుమంతరావు
21 -04 -2020

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...