Saturday, April 25, 2020

రా.. నిజంగా రా! -కర్లపాలెం హనుమంతరావు




ఇంట్లో కూర్చుని ఈ పాతకాలపు పేపర్ల కట్టలోంచి నా కానాడు తెగ నచ్చేసిన నీ పింక్  చీర  అంచు బొమ్మ  మీద నేను పెన్సిల్తో గుర్తుగా పెట్టి రాసింది కవిత్వమో, ప్రశంసో,  మెచ్చుకోలో నాకు ఇప్పుడు గుర్తు రాక దాని కోసం వెదుకుతుంటే…

అనుకోకుండా అంబారీ ఊరేగింపులో సాంబ్రాణి ధూప దీప సహిత బొత్తుల అగరొత్తుల పొగల మెలికల మధ్యన అడ్రసు అడగడానికైనా సందు లేని సందట్లో అల్లంత దూరంగా నీ దారిన నువ్వెళుతూ.. వెళిపోతూన్న మరో బొమ్మ దర్శనమిచ్చింది. అందులోనూ మళ్లా ఎందుకో  ఓరగా నా వంకనే  చూసావనిపించింది...

చేసే చేసే పేపరు కటింగ న్వేషణ నో పక్కకు తోసేసి గూగుల్ గుబురులో దూరి  మన అలనాటి దూధ్ పేడా బ్యాచ్ ఎక్కడైనా  కంటబడి ఇంకొన్ని వివరాలు వెళ్లగక్కుతుందేమోనని.. రాత్రంతా.. తెల్లారేదాకా.. కాకులు కావు కావుమని దొడ్లోని జాం చెట్టు మీంచి చెండుకు తింటం మొదలెట్టి చంపే దాకా మీటలు నొక్కుతూనే ఉన్నానా! అయినా, ఫలితం సున్నా!

తెల్లారింతరువాత వంటింట్లో ఎప్పట్లా కాఫీ కలుపుకుంటూ పంచదార ఎప్పట్లానే ఎక్కువేసుకున్నానో తక్కువేసుకున్నానో  తెలీకుండా వేసేసుకుని నన్ను నేను తిట్టుకుంటూ, తాగాల్నా వద్దా.. తాగి మంచినీళ్ళు తాగాల్నా.. ముందే తాగేస్తే ఎక్కిళ్లొచ్చినప్పుడు మళ్లీ  ఎక్కడి కెళ్ళి ఎవర్నడుక్కొని తెచ్చుకోవాలో ఉన్న కాసిని మంచి నీళ్లు అవజేసుకుంటే ఇప్పుడే ఎట్లా? అనే కొత్త సందేహం మొదలయింది!  యుగాల బట్టి ఓటి ఖాళీ కుండల మధ్య ఎగిరే  ఒంటరి  పక్షి కుంకని కదా.. అన్నీ శంకలే.. నీ ఉనికి మీదిప్పటి ఎన్ క్వయిరీలకు మల్లేనే! దేనికి సవ్యమైన సమాధానం దొరికి చచ్చింది గనుక జీవితంలో? ఎప్పట్లానే అర్థాంతరంగా  కాఫీ చెక్కర డౌటు సందేహం పక్కన పెట్టి  ఎట్లాగో అతి తక్కువ చెక్కెర కాఫీతో సోఫాలో కూలబడి టీవీ మీట ఆన్ చేస్తినా ..

ఏ ఛానెల్ వీధిలో ఆగాలో తెలీని చేతి వేళ్లు ఎప్పట్లానే సంతలో కుక్కల్లా తిరుగుతున్న సందులో.. ఓ పేరు చదవడం రాని ఒడియా ఉర్దూ స్టేషన షాయిరీ గ్రూపులో రాహత్ పక్కన తబలా వాయిద్యగాడి వెనక తలూపుతూ కంజీరా వాయిస్తూ కనిపించేవ్ సుమా  నువ్! ‘మై అప్నీ లాష్‌ లియే ఫిర్‌ రహా హూఁ కాంధే పర్‌..యహాఁ జమీన్‌ కీ కీమత్‌ బహుత్‌ జ్యాదా హై’ అని విన్నందుకు క్కాదు.. ప్రాణాలు జివ్వు మన్నది.. అనుకోకుండా నువ్వట్లా దర్శన మిచ్చేసరికి..  హఠాత్తుగా బిక్క చచ్చి!

ఆహాఁ.. ఏవిఁ .. నా సౌభాగ్యవూ! అనిపించింది. కానీ అంతలోనే  నిజంగా అది నా దౌర్భాగ్యవూఁ అనిపించింది! కాకపోతే ఏవిఁటి? కలల్లో కనిపిస్తావ్? రోడ్డు మీద సాగే ఊరేగింపుల్లో కనిపిస్తావ్? పాత పేపర్ల ఆడ్వర్టయిజ్ మెంట్ బోర్డర్ల కింద పేరులా వూరిస్తూ కనిపిస్తావ్? ఇక్కడీ చెత్తపోగులో గజం భూమి రేటు కూడా ఆకాశాన్నంటుందని కదూ.. నా జ్ఞాపకాల శవాన్ని భుజం దింపకుండా కాస్మోల వెంటబడి పిచ్చికుక్కులా తిరిగేస్తోంది!

మళ్లా అప్పుడా  రోదసీలోకే  ఆ మధ్య  నువ్వేదో కొత్తగా   వ్యోమగామ నౌక తోలుకెళ్లే ఆడపిల్ల పక్కన నిండా వ్యోమగాము లేసుకొనే డ్రస్సేసుకుని వెళిపోతున్నావ్!  ఆ పొయ్యేది నువ్వో కాదో తేల్చుకునే లోపల్నే చటుక్కున మళ్లిపోయే ఆ రాకెట్లో కెళ్ళిపోతూ  ఎన్ టి. వీ లో ఫ్లాష్ లా తల వెనక్కి తిప్పుతూ నువ్ కనిపించావ్? కానీ..

బిక్కచచ్చిన నా జవజీవనాన్నింటినీ పిన్నీసుతో బ్లౌజుకి గుండీ ఊడిన ప్లేసులో గుచ్చేసుకున్న అప్పటి ఆ    నీ సంపెంగ మగువతనం కదా నేను వాస్తవంగా  ఇన్ని   లక్షల కోట్ల దివారాత్రాల బట్టి పలవరిస్తున్నది!

రోజూ కల్లో కొచ్చి  ఊరించే తీరులో నడి నిశి రాత్రి  వంటిగా నా పడగ్గది మంచ మంచున  చేరి  సాగించే గుసగుసల మధ్యన ఉండుండి గుండెల పై సుతారంగా .. గుద్ది ..గుద్ది గుద్ది.. గుద్ది గుద్ది గుద్ది.. ఇక గుద్దే ఓపిక లేక  సోలిపోతావనే ఊహ!  ఊహల్లోనే   తప్ప స్పృహలో ఆ పిడిగుద్ధుల మర్దన అదృష్టానికి  నేనెందుకు నోచుకోనో! నన్నేడిపించే జగన్నాటకంలో నువ్వూ నీ దేవుడూ ఇద్దరూ కూడబలుక్కుని కావాలని ఈ జగన్మోహినీ అవతారం చేష్టలకు పూనుకోలేదు కదా.. ఓ డౌట్!  

నువ్వా తమలపాకంటి  అరచేతిని అంత సుతారంగా నా  ఇరుచెంపల పై నట్లా  ఒకటికి రెండు సార్లు ముందుకీ వెనక్కీ పామి, ఓ సారి  వేళ్ల చివరి చివుళ్లతో బుగ్గపోటు పొడిచినా మహద్భాగ్యవేఁ! ఈ అర్భక సన్నాసిని   గొంతులో ఆ అమ్రుతం బొట్టుకు బదులు చిక్కటి జిడ్డు విషం పోసినా హాయిగా త్రేన్చే దాకా తాగి చావడానికి సిద్ధవేఁ! ఒక్కసారి నిజంగా రారాదూ! వస్తే ఎంత బావుణ్ను!

ఎట్లాగూ ప్రతి గ్రహణానికీ  నాగాల్లేకుండా రాహువు పక్కన కేతువులా నిన్ను మింగి ఊసి మింగి ఊసి కల్పాంతాల దాకా నీతో సరసాలాడేందుకు  సిద్దపడ్డవాడినే గదా! ఎన్ని లక్షల కోట్ల చావులు చచ్చి మళ్లీ బతికిరావడానికైనా నేను  రడీగానే ఉన్నాను గదా! పున్నాగ చెట్టు పూసిన పున్నాగ పువ్వుల్నన్నిట్నీ జలజలా రాల్చేసుకున్నట్లు అప్పుడెంత వింతగా నవ్వే దానివి నువ్వు అన్యాయంగా న్యాయంమైన ఏ కారణం పాడూ ఏదీ లేకుండానే! అప్పట్లోనే  వళ్లంతా కళ్లు చేసుకుని కొయ్యబొమ్మలా చూస్తూ కూర్చుండే బదులు.. కోటి నోళ్లు చేసుకునైనా నిన్నక్కడికక్కడే  చుక్కయినా మిగల్చకుండా తాగేసేయాల్సింది.. తప్పయిపోయింది. చచ్చు పుచ్చు రొచ్చు బుద్ధిమంతరికం నటించడం నిజంగా పెద్ద తప్పే! ఇప్పుడీ రంపపు కోతకు ఆ బుద్ధితక్కువ కుర్రబుద్ధే  అసలు కారణమేమో.. అందుకేనా ఇప్పటికీ  తీరని అప్పటి నీ అలకంతా?

ఏదో ఐపోయింది. అయిపోయిందేదో ఐపోయింది. ఇప్పుడ్రారాదూ మళ్లీ! రా .. ఆ పాత పేపర్ల ముక్కల బోర్డరు గీతల మీంచి అమాంతం గెంతేసి   నాకేసి ఒక్క సారి రా నా హృదయ రాకాసీ!  నే గీసిన నా పెన్సిలు లక్ష్మణరేఖలనన్నింటినీ  నేనే ఎప్పుడో చెరిపేస్తిని గదా! ఆ టీవీ పెట్టెల  గోడల నుంచి దూకేసి  ముందుకు రా!

రా.. ఈ సారి  ఆ ఊరేగింపులో సాగి వస్తున్నప్పుడు చడీచప్పుడు లేకుండా చప్పున ఏనుగు అంబారీ నుంని జారిపోయేసి రా!  నా పక్క మీద నీ పక్క చూపుల్తో  నన్ను డొక్కల్లో పొడుస్తూ  ఆటపట్టించేందుకైనా గుప్పుమనే సంపెంగ సువాసనలతో నన్చంపేసి పోడానికైనా రా కాపుకాసే ఆ భటులందర్నీ చంపేసి రారాదా రక్కసీ!

రా.. టీవీ చానళ్లల్లో  ఆ రాహత్ గుంపులో తలాడించుకుంటూ ఎందుకట్లా? మునపట్లా నన్ను నారలుగా సాగదీసి నీ లంగా బొందులకు వాడుకుందువు గానీ..  రారాదా.. వంటిగా!

ఆ వ్యోమగామి డ్రస్సేంటి అసహ్యంగా? కంటికి ఎంతో  వికారం ఉంది.. వెంటనే విడిచెయ్ తల్లీ! అయినా ఆ  ఆకాశపథ పలాయన మాలోచనలతో నీ లాంటి భూలోక సుందరికి అవసరమేంటి? తుడిచెయ్ ముందా తిక్కాలోచన!

నువ్వు నీ జల్తారు చమ్కీ ఆ బెనారస్ పింకీ  వెండి మెరుపు పోగుల చీర కుప్ప మధ్యలోనే ఉమర్ ఖయ్యాం చాచిన పానపాత్రలో మధువు నింపే సఖిలా ఉండి తీరాలి! మధిర  పాత్రలా ఏపుగా  ఉండి ఎప్పట్లా ఓ చిరువంపుతో  జిహ్వ జివ్వుమనిపిస్తూ ప్రాణాలు తోడేయడమే నీకు సూటవుతుంది! ఆ తుంటర్తతనంతోనే నువ్వు వింటర్ హాయినిస్తావ్ తెల్సా  సఖీ నాకు నడి వేసంగి మిడి మధ్యాహ్నం వేడి గాద్పుల మధ్య కూడా నీ తలపంటే వట్టివేళ్ల తడికల చెమ్మతనం గాలంత కమ్మదనం!  

చందనం చెక్క మీదరగదీసి పోసిన మిసిమి పచ్చని ఆ పొగరు రాశి, కుప్ప పోసిన ఆగరు ధూప దీపకాంతుల గర్వమంతా  నీ సొంతమే కదా? ఏమయిందా ఆస్తి సర్వం?  ఏ చాకలింటికి ఇస్త్రీకని   వేసేసావా నీ ఆభిజాత్య కుసుమ పరాగ సరాగాలన్నింటినీ? వాపసడిగి తెచ్చుకొచ్చేసెయ్ వెంటనే! వేసుకుని రా! మేచింగ్సంటూ ఆ ‘లో’ లు, ఈ  ‘హై’ లు.. హైహీళ్లూ.. నెక్ జాకెట్ ఎత్తు లోతు గుండెల బాడీలన్నీ  నీ పెరటి బావిలోనో గిరాటేసెయ్! నీ కా దిక్కుమాలిన గిల్ట్ అందాల తొడుగుల చెత్తాచెదారం అవసరం లేత్తల్లీ! ప్రతీ రాత్రీ  నా కల్లోకొచ్చినట్లే  వాస్తవంలోకూడా వచ్చేసెయ్ మళ్లీ!

 రా! ఈ పడగ్గది  నీకేమన్నా కొత్తదా? కల్లోలానే   ఇట్లా వచ్చి ఈ మెత్తలంచును పావనం చెయ్! నీకే కదా ఇదంతా..! ఈ గదంతా! కాదు కాదు.. నాకే! నాకేలే తల్లీ ఈ గది! నాకోసమేలే  తల్లీ ఈ సుత్తి సొదంతా! ఏంటో అంతా గంద్రగోళం! ఎమోషన్లతో ఏ మోస్తరు బేలెన్సు తప్పినా కంగాళీ.. ఎప్పుడూ ఇదే తంటా.. అప్పుడూ ఇదే తంటా! సరే.. సరే! నాదీ కాదు.. నీదీ కాదు.. ఇద్దరిదీనూ!  వదిలేయరాదమ్మీ ‘అదీ ఇదీ.. నాదీ నీదీ’ ఈ సోది ఊసులన్నీ! ఎద సొదలు మాత్రమే కదలబారే పడకల గదిలో రామాయాణాన పిడకల వేటలెందుకులేవే!  లేవ్వే! లేచి రా!

హ్హా.. హ్హా.. హ్హా! మళ్లీ గుద్దులా! తప్పైపోయిందని చెప్పినా గుద్దులా! ఓకే.. నేను సిద్ధం! చెప్పాగా! నువ్వెన్ని కోటాను కోట్లసార్లీ గుండెల మీద గుద్ది, రక్కి, గీరి, కొరికి గుద్దినా నో ప్రాబ్లమ్! నీ చప్పిడి   గుద్దు ఒక్కటి తిని చావడానికి ఈ బండ గుండెకాయ ఎప్పుడూ సిద్ధం! ఎట్లాగూ దింపావు కదా రొంపిలోకెప్పుడో..  చంపి ఉప్పు పాతరేసిపోడానికీ ఇదే చక్కని సమయం. సమయం, సందర్భం వచ్చింది కదా ఇప్పుడు.. మరి  చప్పున వచ్చెయ్! వస్తావా! రా!

నిజంగా వచ్చేస్తావా? నన్ను చంపి కరుణిస్తావా? నా సమాధి పైనింత మన్ను జల్లి  ఏ పిచ్చి మొక్క విత్తనమో నాటేస్తావా?సరే! అప్పుడూ చెట్టులానే ఏపుగా మొలిచి  ఓపిగ్గా నీ కోసమే  ఒంటిగా ఈ మంటి దిబ్బ మీదనే ఒంటి కాలి మీద నీ నామ జపం చేస్తూ యుగయుగాంతాల పర్యంతం ఎదురుచూస్తూనే ఉంటా. నువ్వూ మళ్లా ఎక్కడో ఓ బంగారు వడ్రంగి పిట్ట పొట్ట నుంచో బైటికి రావాలని న కోరుకుంటా. నా కరకు బెరడు పైన  నీ ములుకు ముక్కుతో మళ్లా కొన్ని వేల కోట్ల సార్లు   నీ పేరే పొడవాలని వేడుకొంటున్నా!

వస్తావా ఈ సారైనా? వట్టి జగన్మోహనిగా మోసం చేయడానికి  కాకుండా..  నిజం విషపు పానపాత్రతో నిజంగా వస్తావా.. రా!
-కర్లపాలెం హనుమంతరావు

24 -04 -2020




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...