Showing posts with label Andhra Prabha. Show all posts
Showing posts with label Andhra Prabha. Show all posts

Sunday, December 12, 2021

గుండు జాడీ - సరదా కథానిక (తర్కం లేదు) -కర్లపాలెం హనుమంతరావు

'ఆవగాయ అయిపోయింది. మీ అల్లుడిగారికి ముద్ద దిగడం లేదు. అర్జంటుగా ఓ చిన్నగుండు జాడీడైనా పమ్మిం'చమని మా తోడల్లుడుగారి మూడో కూతురు ఉత్తరం రాసింది.

ఆ పిల్ల మొగుడు వినాయకరావుకు అదేదో బ్యాంకులో ఉద్యోగం. ఈ మజ్జెనే బెజవాడ బదిలీ అయింది.

కృష్ణలో మునగాలనీ, కనక దుర్గమ్మను చూడాలనే వాంఛితం వల్ల నేనే బండెక్కా జాడీ పట్టుకుని.

తెనాలి దగ్గర ఓ ఎర్ర టోపీ పెట్టెలో కొచ్చింది. 'పేలుడు సామాను బండిలో ఉండకూడద'ని పేచీ పెట్టుక్కూర్చుంది సీటు కిందున్న జాడీ చూసి. అది పేలే పదార్థం కాదని నచ్చచెప్పడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.

లంఖణాల బండి ముక్కుతూ మూలుగుతు బెజవాడ చేరేసరికి చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి.

అదెక్కడి ఫ్లాట్ ఫారం! పెళ్లిపందిరిలా వెలిగిపోతో ఉంది. ఏవిఁ జనాలూ! ఎంత హడావుడీ! మా వూరి సంతే అనుకుంటే అంతకు పాతిక రెట్లు ఎక్కువగా ఉందీ వింత! ఈ సందోహంలో మావాణ్ణి ఎట్లా పసిగట్టడం? అసలా శాల్తీని గుర్తుపట్టడమే కష్టం. పదేళ్ల కిందట పెళ్ళిపందిరి పెట్రోమాక్సు లైట్ల వెల్తుర్లో చూడ్డవేఁ. ఇంకా అట్లాగే ఈకలు పీకిన కోడిలా ఉంటాడా?

అయోమయంగా జాడీ పట్టుకుని నడి ప్లాట్ ఫామ్మీద తచ్చాట్టం మొదలుపెట్టాను. ఓ కాఖీవాలా..  రైల్వేపోలీసనుకుంటా.. కర్రకొట్టుకుంటూ వచ్చాడు.

'అగ్గిపెట్టుందా?'

ఇచ్చా.

'సిగిరెట్టూ?'

నాకు చుట్టలు పీకడం అలవాటు. 'లేద'న్నాను. అంతే, ఆరాలు మొదలు!

'సిగిరెట్టు లేకుండా వట్టి అగ్గిపెట్టెందుకుందీ? ఎక్కడ అగ్గిపెట్టబోతున్నావ్? నీ వాలకం అనుమానంగా ఉంది. నీ చేతిలో అదేంటీ? టైం బాంబా?'

'బాంబు కాదండీ! ఆవగాయ జాడీ!'

'ఆవగాయా? వో క్యా హైఁ! ఖోల్దో!'

ఏందో పోలీసోడి గోల!

జాడీక్కట్టిన వాసెన విప్పి చూపించక తప్పింది కాదు.

లోపలికి తొంగి చూసి ఉలిక్కిపడ్డాడు.

'అమ్మో! రక్తం.. రక్తం!.. ఖూన్.. భూన్!' అరుపులు

'తెలుగు వాడై ఉండడు. ఆవగాయంటే అర్థమవడంలేదు ఆ ఉత్తరాది శుంఠకు.

'కూను కాదండీ! నూనె!' నమ్మించడానికి జాడీలో వేలు ముంచి ఆ పోలీసోడి నాలిక మీదింత రుద్దా.

అంతేఁ! ఎగిరి గంతేశాడు.

'పేలింది. గూబ్బేలింది' అంటు చెవులు రెండూ పట్టుక్కూర్చున్నాడు.

నష్టపరిహారం కిందో వంద రూపాయలు అచ్చుకుంటే గాని వాడు నన్ను వదల్లేదు.

వినాయకరావిక రాడు. కార్డంది ఉండదు. ఇట్లాంటి ఉపద్రవాలన్నీ ముందే ఊహించబట్టే అతగాడింటి ఆరాలన్నీ వివరంగా రాయించి కాయితం రొంటిన కట్టుకునుంది.

స్టేషన్ బైట సగం మెట్ల మీదుండంగానే ఓ కుంకొచ్చి నా జాడీ మీద పడ్డాడు. ఇంకా చాలామంది ఆ బాపతు సరుకే అవకాశం కోసం చుట్టూతా మూగిపోయారు. అంతా కలసి నా చంకలోని జాడీని గుంజేసుకుంటున్నారు.

బూతులు!.. గోల!

'ముందు నేనూ.. పట్టుకుంది. ఇది నాదీ!'

'ముందు నేన్చూశానెహె! జాడీ నాదీ..'

'కాదు నేం జూశాన్రా లం.. కొడకా!'

'ఇలాగిచ్చీసెయ్యండి సార్ .. జాడీని'

నా జాడీని పట్టుకుని ‘నాది.. నాద’ని వాదులాడుకునే వాళ్లను చూసి ముందు నేను బెంబేలెత్తింది నిజవేఁ! బెజవాడ మనుషులు ఎంతకైనా తగుదురని మా బామ్మర్ది చెప్పిన మాటలు గుర్తుకొచ్చి బలం కొద్దీ పరుగెత్తా జాడీతో సహా!

వెనక నుండి ఈలలు.. గోల! బూతు మాటలు కూడా!

 నవ్వుల్తో కలిసి! వాళ్లంతా రిక్షావాళ్లట! తర్వాత తెలిసింది!

ఆదుర్దాలో ఎంత దూరం పరుగెత్తుకొచ్చానో నాకే తెలీదు. కుదుపులకు జాడీ మీద మూత కదిలినట్లుంది. వాసెనక్కట్టిన గుడ్డ ఆవనూనెకు  ఎరుపు రంగుకు తిరిగింది. మాడు కూడా కొద్దిగా మంటెత్తుతోంది.

ఇహ నడక నా వల్ల కాదు. ఎంత దూరవఁని నడుస్తా మీ దిక్కూ మొక్కూ లేని బస్తీలో! అందునా మా వినాయకరావుండే 'ఆంజనేయ వాగు' ఆనవాలు బొత్తిగా లేకపాయ!

దార్న పోయే రిక్షా పిలిచా. వాడు దగ్గర దాకా వచ్చి జాడీని చూసి ఝడుసుకున్నట్లున్నాడు.. అదే పోత.. ఓ మాటాలేదూ..  పలుకూ లేదూ!

అతి కష్టం మీద మరో బండిని పట్టుకున్నా! వాడి క్కొంచెం గుండె ధైర్యం జాస్తీవే సుమండీ!

'ఎక్కడికీ?' అనడిగాడు మిర్రి మిర్రి చూస్తూ.

ఫలానా 'వాగు’ లోకి. ఇది కూడా ఉందని జాడీని చూపించా ఎందుకైనా మంచిదని.

వీడూ ఝడుసుకున్నాడు. 'ఏంటదీ? ఎర్రంగా కార్తా ఉంది? మడిసి తలకాయ కాదు గందా?' అనడిగాడు.. నా వంక అదోలా చూస్తూ!

ఈ గుండు జాడీ నా కొంప ముంచేట్లుందివాళ!

'ఏడు రూపాయలివ్వండి!  మూడో కన్నుక్కానకుండా వాగులోకి దింపించేత్తాను. రగతంతో రిసుకు మరి!' అన్నాడు దగ్గరి కొచ్చి గొంతు తగ్గించి.

‘నెత్తురు కాదు..ఆవకాయరా బాబూ! అని అక్కడికీ నెత్తి కొట్టుకుంటూ చెప్పిచూశా. ఊహూఁ!  నమ్మడంలే! అట్లాగని వదలటవూఁ లేదు. ఇట్లాంటి సాహసాలు ఇంతకు ముందు ఇంకెన్ని చేశాడో ధీరుడు! ఇప్పుడు వణకడం నా వంతు కొచ్చింది.

'బెజవాడలో రిక్షా రేట్లు దారుణంగా ఉంటాయి. రిక్షా తొక్కే వాళ్ల వాలకం అంత కన్నా దారుణం. సాధ్యవైఁనంత వరకు పబ్లీకు మధ్యన బస్సుల్లో తిరగడవేఁ మేలు' అని హెచ్చరించివున్నాడొకప్పుడు మా తోడల్లుడు. ఆ ముక్కలు ఇప్పుడు ఠక్కున గుర్తుకొచ్చాయి. రిక్షావాణ్నక్కడే వదిలేసి అప్పుడే వచ్చిన బస్సు దిక్కు పరుగెత్తాను.

అది ఇరవై నాలుగో నెంబరు బస్సు.

అమ్మాయి ఉత్తరంలో రాసిన నెంబర్లు కటిక్కిన గుర్తుకు రాడంలే! ఎవర్నైనా అడుక్కోక తప్పేట్లు లేదు. అక్కడే నిలబడి తాపీగా చుట్ట పీక నల్చుకుంటున్న పెద్దమనిషొకతను కనిపించాడు.

'ఈ బస్సెక్కడికి పోతుంది?' ఆడిగా.

'నువ్వేడకి పోవాల్నా?' ఎదురు కొచ్చెను. ఎవుడికీ సూటిగా మాట రాదనుకుంటా ఈ కృష్ణమ్మ నీళ్లకు.

'వాగులోకి'

'ఇది కాటికి పోయేదయ్యా సామీ! అల్లదిగో! ఆడాగి వుందే చూడూ.. నాలుగో నెంబర్దు,, ఆ బస్సెక్కు..  పో! తిన్నంగా వాగులో దింపేత్తది.. బేగి పో' ఉత్తరాంధ్ర సరుకులాగా ఉంది.

బెజవాడ కదా! అని యాసలోళ్లూ గుమిగూడ్తార్లాగుంది. పట్నవాఁ.. మజ్జాకానా!

నాలుగో నెంబర్ బస్సు నిద్దట్లో గురకపెడుతూ తాగుబోతోడికి మల్లె ఒహటే..  వూగిపోతావుంది వెనక్కీ.. ముందుకీ!

బస్సంతా కోళ్ల గంపలా కిక్కిరిసుంది లోపల. అయిస్కాంతం అంచుల దగ్గర ఇనప తుక్కు పేరుకున్నట్లు రెండు డోర్ల దగ్గరా జనాలు ఒహటే పొర్లిపోతున్నారు.

అయినా మనిషికి మనిషికీ మధ్యన ఇంకా సందుండిపోయిందని మధన పడిపోతున్నాడు బస్సు కుర్రాడు.

'రావాలండీ .. రావాల! మార్కెట్ పంజా కాలేజ్ జండా వాగు చిట్నగర్ లంబాడీ.. రావాలండీ.. రావాలా.. మార్కెట్ పంజా కాలేజ్ జండా.. వా..’

చెవి తెగ్గోసిన మేకకి మల్లే ఒహటే అరుస్తున్న ఆ కుర్రాడి దగ్గరికెళ్లి అడిగా 'వాగులో కెళతందా?'

అంతే! మాటా పలుకూ లేకుండా నా పెడ రెక్కలట్లా పట్టేసుకున్నాడో బస్సులోకి ఈడ్చేసుకున్నాడు భడవా! నా భుజం మీది జాడి పక్క మనిషి నెత్తి మీదకెక్కేసిందా కుర్రాడి గత్తర్లో!

రామాయణంలోని పుష్పకవిమానం దారి తప్పొచ్చి బెజవాడ వీధుల్లో తిరుగుతునట్లుంది. ఎంత మందిని కుక్కినా బస్సోడికి తృప్తి కలగడం లేదే!

'.. ఎదరకు జరగండయ్యా బావూఁ.. ఎదరకు జరగండి! ముందుకు పదండి.. ఊఁ ఊఁ.. పదండి ముందుకు .. పదండి ముందుకు..'

మనస్ఫూర్తిగా మనల్నింకా ముందుకు పదమనే వాళ్లింకా దేశంలో మిగిలున్నందుకు మహా ముచ్చటేసింది కానీ.. అదా స్థలం? సందర్భం?

చినుక్కీ చినుక్కీ మధ్య నుంచి గుర్ర్రం తోల్తూ బాణాలేసే పురాణపురుషుడి ఎవరో ఒకాయనున్నాడు కదా! ఆ మహానుభావుడి చాకచక్యం మించి పేసింజర్స్  భుజాల మీద నుంచే పాక్కొస్తూ, బూతులు కూస్తో,  టిక్కెట్లు కోస్తోన్న కండక్టర్ని నిజంగా అభినందించాల్సిందేనండీ! ఇట్లాంటి ఆటలు ఆ ప్రపంచ కప్పు పోటీలల్లో ఎందుకు పెట్టరో! బెజవాడ బస్సోళ్ళు కప్పులు కొట్టేస్తారని కుళ్లేమో!

నిద్రలో నడిచేవాళ్లా బైల్దేరిన బస్సుకు ఏం మూడిందో, మూడు నిమిషాల్లో ముక్కుతాడు తెంచుకున్న గుర్రంలా పిచ్చ పరుగందేసుకొంది. మజ్జె మజ్జెలో సకిలింపులు!.. బస్సు కుర్రాళ్ల రంకెలు!

వెనకమాల్నుంచి ఇంకో మదమెక్కిన బస్సుగుర్రం తరుముకొస్తా ఉందట.. ఎవరో రెచ్చగొడతా ఉన్నారు బస్సు డ్రైవర్ని!

అప్పుడు చూశానండీ.. డ్రైవర్ సీటుకు సరిగ్గా నడి నెత్తి మీద పెద్దక్షరాలతో రాసున్న హెచ్చరిక బోర్డు 'దేవుని స్మరింపుము'

ప్రస్తుతం నే చేస్తోన్న పని కూడా అదే!  నేనూ, జాడీ క్షేమంగా వాగులోకి దిగితే అదే పదేలు!

గవర్నమెంటాసుపత్రి ముందు అయిష్టంగా ఆగింది బస్సు.

కండక్టరు అరుస్తోన్నాడు 'ఆసుపత్రి కెవరెళతారండీ!;

ఈ బస్సిట్లా ఇంకో పది నిముషాలు గెంతితే అందరం అక్కడికే పోవాల్సి వాళ్లమే!

ప్రస్తుతానికి ఓ భారీ కాయం మాత్రం ఆపసోపాలు పదుతూ సీట్లోంచి లేచింది.

ఆ కాయాన్ని ఆస్పత్రి పాల్జేయడానికి అయిన ఆలస్యం కవరవ్వద్దూ! డ్రైవరంచేత స్టీరింగ్ మీంచి చేతులు పూర్తిగా ఎత్తేశాడు. పెడలు మీది కాళ్ళకూ రెస్టు కాబోలు.. మొత్తానికి బస్సు మెత్తంగా గాలిలో తేలిపోతోందీ సారి. బోడెమ్మ సెంటర్ దగ్గర బ్రేకేయక తప్పింది కాదు.

'బోడెమ్మ ఎవరండీ? బోడెమ్మ ..బోడెమ్మా?' కండక్టర్ రంధి.

'నేనేనండీ!' అంటూ లేచిందో పునిస్త్రీ.

'నువ్వంకాళ్లమ్మంటివి కదమ్మా? 'అంకాళమ్మగుడి స్టాప్' అని కండక్టరుగారి ధ్వని!

'నేను కాదయ్యా అంకాళమ్మ! నా ఈపరాలు. ఇదిగో ఈడనే కునికిపాట్లు పడతా ఉండాది మడిసి. బోడెమ్మ నేనూ!'

ఆ శాల్తీని బస్సులో నుంచి కిందకు తోసేసి బెల్లుకొట్టాడు కండక్టర్.

పీ’రు చెట్టు’ దగ్గర ‘పీరెవరో లేచి రమ్మం’టే  ఓ శాస్త్రులు గారు దిగడానికి తయారయ్యారు. 'గాంధీబొమ్మ' దగ్గర అట్లాగే కండక్టర్ 'గాంధీ.. గాంధీ ఎవరు బాబూ.. గాంధీ' అన్న గావుకేకలకు ఓ తాగుబోతు 'ఆయ్' అంటూ ఇద్దరు పేసింజర్ల చేతి సాయంతో తూలుకుంటూ దిగిపోయాడు.

హఠాత్తుగా     బస్సొక్కక్షణం ఆగిపోయింది!  మరుక్షణమే వెనక్కి నడవడం మొదలెట్టింది!! పేసింజర్లందర్నీ ఇందాక ముందుకు పొమ్మని తోసిన కుర్రాడే బస్సు వెనక్కి నడుస్తూంటే ఇప్పుడు ‘రైట్.. రైట్..’ చెప్పేస్తున్నాడు!

'అందరూ దిగాలి. దిగాలి. బస్సింక ముందుకు పోదు' అని అరుపులు లంకించుకున్నాడు కండక్టరు కూడా!

వెనక బస్సుతో పోటీ తట్టుకోడానికి తటాల్మని  ఇట్లా దారి మళ్లించెయ్యడం బెజవాడ బస్సులకు ఎప్పట్నుంచో అలవాటైన ముచ్చటేనంట! 

అదేమని అడిగితే 'ష్ష్! మెడ మీద చెయ్యేసి తోసేస్తారు, బెజవాడ బసులోళ్లు యములోడికైనా జడవరు' అంది అప్పటి దాకా నా గుండు జాడీ మోసిన గుండు శాల్తీ.

అందర్తో సహా నేనూ దడదడా బస్సులోంచి  బైటకు దూకేశా.

ఎత్తు మీంచి దూకడంతో మడమ చిట్లింది. జాడీ కూడా  బీటలిచ్చింది. నెత్తి జుత్తంతా ఆవ జిడ్డుతో ముద్ద ముద్ద! నుదుటి మీంచి జారిన ఆవనూనె మరకల్తో మొహమంతా చారికలు! కాళ్ల నుంచి కళ్ల దాకా.. వళ్లంతా మంటలు మంటలు!

చీకట్లో ఎవరూ చూదకుండా మావాడిల్లు కనుక్కోడానికి అష్టకష్టాలు పడాల్సొచ్చింది.

అప్పటికే అర్థరాత్రి దాటింది.

బాడీ, జాడీ వెరసి శరీరమంతా బట్టలతో రక్త సిక్తం. చంకలోని గుండు జాడీ ఖండిత శిరస్సును తలపిస్తోంది.

ఎవరైనా చూస్తే హంతకుణ్నని వెంటబట్టం ఖాయం.

చలి వల్ల వణుకు..

ఆకలి వల్ల నీరసం..

ఆవగాయ వల్ల  మంట..

ప్రయాణం వల్ల అలసట..

నిద్ర వల్ల మత్తూ..

వళ్లు తూలిపోతూంటే, కాళ్లు వణికిపోతో ఉంటే, ఆ నడి రేత్రి చీకట్లో ఎట్లాగైతేయేం వినాయకరావిల్లు పట్టుకున్నా!  తలుపులు దబదబా బాదేస్తున్నా.

ఐదు నిముషాలగ్గాన్నీ మెల్లిగా తలుపు తెరుచుకుంది కాదు. అదీ ఓరగా!

'ఎవరూ?' అడిగిందో ఆడగొంతు మెల్లిగా.

'నేనమ్మా! పెదనాన్నను.  ఇదిగో! ఆడిగావుగా! తెచ్చా నీ కోసం!' అంటూ గుండు జాడీని గడప మీదకు దింపా! అంతే..

 'కెవ్వుఁ!' కేక! ఒకసారి కాదు.. వరసగా ఏ పది సార్లో!

ఆ పిల్ల అమాంతం అల్లాగే విరుచుకుపడిపోయింది.

భగవంతుడా! ఇప్పుడేం చేయడం!

పారిపోడమా! ఉండిపోయి దెబ్బలు తిండమా!

తేల్చుకునే లోగానే..  గదిలోంచి  బైటికొచ్చిన వినాయకరావు ఒక్క క్షణం తెల్లబోయాడు. మరుక్షణం మ.. మ్మా..  'మర్డర్! మర్డర్!' అంటో వీధిలోకి పరుగేట్టి వీరంగాలేయడం  మొదలెట్టాడు.

అరవడానికి పోగైన వీధి కుక్కలు చీకట్లో ఆవగాయ బద్దల్నే మాంసం ముక్కలనుకున్నాయో.. ఏంటో.. పాడు! ఖర్మ .. ఆవురావురమని మెక్కేస్తున్నాయి.

అమ్మాయికని తోడల్లుడు శ్రద్ధగా చేయించిన కొత్తవగాయ మొత్తం  చెత్త వీధి కుక్కలపాలు!

అవునూ!.. కుక్కలు ఆవగాయ ముక్కమెక్కుతాయంటారా.. మరీ విడ్డూరం కాపోతే? అని సొడ్డు నా మీద మాత్రం వేసేయకండి మహాప్రభో!

ఇది బెజవాడ!

అప్పుడూ ఇప్పుడూ .. బెజవాడలో జరిగే విచిత్రాలు బ్రహ్మంగారికే అంతుబట్టలేదు! సామాన్యులం ఇహ మీకూ.. నాకూనా?! ఎంతేడుపొచ్చే అనుభవాలు ఎదురై చచ్చినా ఇది ఇట్లా నవ్వుకుంటూ  దులపరించుకు పోవాల్సిందే!

-కర్లపాలెం హనుమంతరావు

***

(ఆంధ్రప్రభ వారపత్రిక సెప్టెంబర్, 1982 (తేదీ ఖచ్చితంగా తెలీదు-  రికార్డులో 16  -09 -1982 అని ఉంది) ' కొండయ్యగారి గుండు జాడీ'శీర్షికతో ప్రచురితం)

Wednesday, December 8, 2021

కథకుడి కథ - కథానిక - కర్లపాలెం హనుమంతరావు - ఆంధ్రప్రభ ( 01 - 10 - '80)

కథానిక : 
కథకుడి కథ 
- కర్లపాలెం హనుమంతరావు 
( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ( 01 - 10 - 1980) ప్రచురితం)  

సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి —

అలవాటుగా తెల్ల చీర కట్టుకుని, మల్లె పూలు పెట్టుకొని, చిరు నవ్వులు చిందిస్తూ గుమ్మంలో నిలబడి ఉండవలసిన అలివేణి, నట్టింట్లో నేలవిద మీద అమ్మ లక్కల మధ్య అశోకవనం కింద సీతాదేవిలా ఉన్న దృశ్యం! 

నా రాకతో ఆడంగులందరూ భుజాల నిండుగా కొంగులు సర్దుకుంటూ బిలబిలా  గది ఖాళీ చేసేశారు.

అలివేణి మాత్రం భంగమ  మార్చలేదు. చింకి చాపవిూద మరింత
ముడుకుని  కూర్చుంది. 

ఏదో జరగరానిదే జరిగింది. "అలివేణీ!” అని పిలిచాను. పలుకులేదు , ఉలుకు లేదు. వంటింట్లోకి జొరబడి, రెండు కప్పులు  కాఫీ కలుపుకు వచ్చాను .

వేడి కాఫీ వాసనకు వాతావరణంలో టెన్షన్ కొద్దిగా సడలింది. 
మూడ్ వచ్చినట్లుంది . కాఫీ అందుకుని, మొహం ఇంత చేసుకొని, "ముందు నా కిది చెప్పండి- మీరా ముదనష్టపు కథలు వ్రాయటం మానతారా? నన్ను పుట్టింటికి పొమ్మ న్నారా?" అని బావురుమంది. 

"అస లేమయింది? " అనడిగాను చిరాకుగా.

“ఇంకేం కావాలి? పోయిన వారం కథల పోటీలో మీరు వ్రాసిన కథకు బహుమతి వచ్చి, మీ ఫోటోతో సహా అచ్చు కావటం కాదు కాని నాకు చచ్చే చావొచ్చి పడింది" అని మళ్ళీ రాగం అందుకుంది.

 “దానికి ఏడుపు ఎందుకు ???

*ఏడుపు కాక ఏమిటి నా ముఖానికి! మీ కేం? మీరు బాగానే ఉన్నారు.
ఆ కథలో మొగుణ్ణి ఆరళ్ళు పెట్టే పెళ్ళాన్ని నన్ను చూసే వ్రాశారని, పెళ్ళానికి బుద్ధి చెప్పటానికి పొరుగింటి అవిడతో సరసాలాడటం మీరు అనుభవం మీదే వ్రాశారని, నా కాపరం గుండమవపోతుందని సానుభూతి చూపించటానికి వచ్చా రండీ వీళ్ళంతా!"

నాకు నవ్వాగలేదు.

“మరయితే కొంప తీసి నువ్వూ అలాగే అనుకుంటున్నావా అలివేణీ?" అని అడిగాను నాటక ఫక్కీలో. 

"ఏమో! ఎవరికి తెలుసు? నేను పుట్టింటికి పోయినప్పుడు, ఎక్కడెక్కడ వూరేగారో  నేను చూశానా?" అంది అనుమానంగా.

"అయితే ఒక పని చేయి. నీ వసలు పుట్టింటికే వెళ్ళకు."

"ఆలాగయి తే మీ రిక కథలు వ్రాయకండి!" అంది ప్రాధేయపూర్వకంగా..

"అది నా వల్ల కాదు.'' 

“పోనీ, ఇలాంటి కథలు వ్రాయకండి, బాబూ! వ్రాసినా, ఫోటోతో సహా అచ్చేయించుకోవద్దు " అని రాజీకి వచ్చింది. 

" సరేలే" అన్నాను. అలివేణిని  తాత్కాలికంగా  శాంతింప చేయటానికి.

కానీ, నిజంగా ఈ బహుమతి  కథతో నాకు పెద్ద చిక్కే వచ్చి పడింది. 

మరునాడు ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఆచారి హఠాత్తుగా కావలించేసుకున్నాడు. 

కారణ మేమిటంటే "అదృష్ట వంతుడివంటే నువ్వే, గురూ! కథలు వ్రాసి పేరుకు పేరూ, డబ్బుకు డబ్బూ కొట్టేయటమే కాకుండా, పక్క ఇంటి పిట్టల్ని కూడా పట్టుకుంటున్నా వన్నమాట!" అదీ వీడి ఏడుపు! 

దాదాపు స్టేఫులోని  మగాళ్ళందరి జెలసీ అదే! వీళ్ళ కేం చెబుతాను ? 

మునుపు కాస్త చనువుగా, సరదాగా ఉండే లేడీసయితే  నన్ను చూసి ఇప్పుడు పూర్తిగా బెదిరిపోయారు. మధ్య మధ్యలో మా ఆవిడీని గురించి జాలితో కామెంట్సు పాస్  చేసుకోవటంకూడా విన్నాను.

ఆ రోజు సాయంత్రం మేనేజర్  నన్ను తన గదిలోకి పిలిచాడు.

"చూడు, మిస్టర్ ఆనంద్! మన స్టాఫ్ లో  మీ లాంటి రచయిత ఉండటం నిజంగా నాకు గర్వ కారణం "అని ఒక పది నిమిషాలు తైరు కొట్టి, కాఫీ తెప్పించి. . తాగిన తరువాత మరో పది నిమిషాలు నీతి నియమాల మీద లెక్చరిచ్చి చివరికి అసలు విషయం బయట పెట్టాడు. "మీ రింత కాలం రచయిత అని  తెలియదు. మీ అమూల్యమయిన సమయాన్ని నా డాటర్  ట్యూషన్ కు వెచ్చిచడం ద్వారా వేస్ట్ చేయటం నాకు నచ్చలేదు . అందుచేత తనకు వేరే  అరేంజ్ మెంట్  చేశాను . " అనేశాడు. 

ఇతగాని  మనస్తత్వం ఈ విధంగా బయట పడింది. తన కూతుర్ని ఎక్కడ అంటుకుంటానోనని ముందస్తు జాగ్రత్త అన్న మాట! 

అలివేణి పుట్టింటికి పోయింది. ఇంతకు  ముందు అలాగే నేనొక్కణ్ణీ  ఇంట్లో వండుకుంటే ఇరుగు పొరుగు అమ్మలక్కలు "అన్నయ్యా! ఈ కూర తీసుకోండి!". . 
" మగవాళ్లు  మీ రేం చేసుకుంటారు? మా ఇంట్లో భోజనం చేయండి" అనే వాళ్ళు. 

ఈ సారి ఇటు వైపు కన్నెత్తి చూడలేదు సరికదా — నన్ను చూడగానే మైలు దూరం ఒదిగిపోయి నడిచి పోతున్నారు.

నాకూ ఈ వాతావరణం చికాకనిపించి హోటల్లో భోజనం చేయటం మొదలు పెట్టాను. 

ఒక రోజు హోటల్లో భోజనం చేసి సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వచ్చి గది తలుపులు తీస్తూంటే ఎదురింటి పానకాలరావు భార్యను చితకబాదటం కనిపించింది. ఎంత వద్దనుకున్నా వాళ్ళ తగవు మధ్య నా పేరు వివపడటంతో ఆగిపోయాను. " చెప్పు ! ఈ పుస్తకం నీ దగ్గర కెట్లా వచ్చిందే? అసలు వాడి  గదిలో కెందు కెళ్ళావు? నీ మొహానికి తోడు ఇద్దరు మెగుళ్ళు కావలసి వచ్చారటే?".

నా రక్తం ఉడికి పోయింది. ఒక్క ఉదుటున పోయి వాడి జుట్టు పట్టు కున్నాను. అనుకోని ఈ హఠాత్పరిణామానికి   పానకాలరావు   నివ్వెరపోయాడు కాబోలు, నోట మాట రాకుండా నిలబడి పోయాడు. 

అతని భార్య  నుదురు చిట్లి రక్తం కారుతుంటే బాధతో ఏడుస్తూంది. 

ఇంకొక్క క్షణం అక్కడ ఉండలేక ఆ పుస్తకం తీసుకుని వచ్చేశాను. 

అది నాదే. అలివేణి ఉన్నప్పుడు ఈవిడ తీసుకు వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఈ అనుమానపు పిశాచి కంటబడి ఇంత ఘోరం జరిగింది.

మరునాడు ఉదయమే ఇల్లు గలాయన వచ్చాడు " ఈ నెలాఖరికి ఇల్లు ఖాళీ చేయం "డంటూ. 

ఎందుకు అని  అడగలేదుఅతని వెనకాలే నిలబడి ఉన్న పానకాల రావును చూసి అంతా అర్థమయింది.

ఆ రోజు నుండి ఇళ్ళ వేట ఆరంభించాను.

నా పేరు ప్రఖ్యాతలు ఇంత త్వరగా ఈ వూళ్ళో వ్యాపించాయని నా కప్పుడే తెలిసింది.

నా పేరు విని నన్ను కొంతమది ఇల్లు ఖాళీ ఉండికూడా లేదన్నారు.

కొంతమంది హమాటం లేని వాళ్ళయితే "మంచి  ఫామిలీస్ కే ఇస్తాం" అన్నారు.

మరీ మొహమాటం  ఉన్న వాళ్ళయితే " వలందు మీ ఆడవాళ్ళను వచ్చి చూసి పొమ్మనండి. అప్పుడు మాట్లాడుకుందాం!" అన్నారు. 

అడిగి అడిగి కాళ్ళు నొప్పులు పుట్టడమే కాని ప్రయోజనం లేకపోయింది. 

అద్దె కొద్దిగా ఎక్కువ ఇస్తానన్నా ఆశ పడి ముందు ఒప్పుకున్నా ఒక ఆసామి రెండవ రోజు డబ్బు ఇవ్వటానికి వెళితే కొత్త 'వంక' చెప్పి ఇల్లు ఖాళీ లేదన్నాడు.

స్టాపు మెంబర్లందరకీ  చెప్పి చూశా. చూస్తామన్న వాళ్ళే కాని చూసిన వాళ్ళెవరూ లేరు. వాళ్ళ ఇళ్ళ పక్కన చేరితే వాళ్ళ సంసారాలకేం మూడుతుందోనని భయమనుకుంటా. 

ఒక రోజు వామన మూర్తి లంచ్ంలో నన్ను కలుసుకుని, "మీరు ఇళ్ళ కోసం వెతుకుతున్నారు గదా? మా పక్క వాటా ఖాళీ  అయింది. మీ కిష్టమయితే చేరండి" అన్నాడు. 

అమృతం దొరికినంత ఆనందమయింది. వామనమూర్తితో నాకు ఆట్టే పరిచయం లేకపోయినా అతని మంచితనం నన్ను ఆకట్టుకుంది. 

అలివేణి రాగానే ఆ ఇంటికి మారిపోయాను .

రోజులు  అలా అలా సాగుతున్నాయి . నా రచనా వ్యాసంగం మాత్రం మానలేదు, ఎవరెన్ని విమర్శలు చేసినా! 

అలివేణికి, వామనమూర్తి భార్య వైదేహికి మంచి స్నేహమయింది. మా రెండు కుటుంబాల మధ్య రాకపోకలు తరుచుగా జరుగు తున్నాయి.

ఆ రోజు అలివేణి పిన్ని కూతురు పెండ్లి అని వూరు వెళ్ళింది. ఖాళీగా ఉండటంతో అంతకు ముందెప్పుడో సగం వ్రాసిన కథ పూర్తి చేద్దామని కూర్చున్నాను. 

గడియారం పది గంటలు ఎప్పుడు కొట్టిందో తెలియలేదు. తెలుపు దగ్గర చప్పుడయితే తల ఎత్తి చూశాను. వైదేహి లోపలికి వచ్చి తలుపు వేసింది. 

ఒక్క క్షణం నా కర్థంకాలేదు. వామనమూర్తి ఆఫీసు పని మీద  కాంపుకి వెళ్ళి ఉన్నాడు. 

ఆవిడ నవ్వుతూ వచ్చి నా పక్కను కూర్చోబోయింది. నేను దిగ్గు ప లేచి నిలబడ్డాను.

అవిడ కంగారు పడింది. "మీ కిష్టం లేదా?" అని అడిగింది తడబడే గొంతుతో ! 

“నా కిష్టముందని ఎవరు చెప్పారు?" అన్నాను కటువుగా.

"మరి మీ కథలు?! "

నాకు పిచ్చి ఆవేశం ముంచుకు వచ్చింది. గబగబా బీరువా తగ్గిరికివెళ్ళి కథ అచ్చయిన పుస్తకాన్ని  బయటికి తీసి  ఆ కాగితాల్ని బయటికి లాగి, "ఆదిగో! దీనివల్లే కదా మీ రంరూ నన్నిలా షేమ్ చేస్తున్నారు” అంటూ కసిగా పర్ పర్ మని  కాగితాలని  చించేశాను. ఆవిడ బిత్తరపోయింది . 

తడబడే అడుగులతో వడివడిగా తలుపు గడియ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది.

ఇక శాశ్వతంగా కథలూ కాకరకాయలూ రాయకూడదని ఆ క్షణమే నిశ్చయించుకున్నాను. 
... 

ఆ రోజు జ్వరం ఫీలింగుతో తలనొచ్చుతుంటే పర్మిషన్ తీసుకుని  మధ్యాహ్నం మూడింటికే ఇంటికి వచ్చేశాను. 
లోపల గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. .  అలవేణి  అంటోంది "వైదేహీ! నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. ఆయనగారి రోగానికి నీ మందు బాగా పనిచేసిందే! చిన్ననాటి స్నేహాతురాలివి . ఇదీ కష్టం అని చెప్పగానే.. నా కోసం చాలా పెద్ద రిస్కే తీసుకున్నావే ! ' 

వెంటనే వైదేహి గొంతు ' అలివేణీ! నీవు ఎంతో అదృష్టవంతురాలివే! నిజం చెప్పాలంటే అ్నయ్యగారు ఆణిముత్యం . మరో మగాడు అయితేనా.. ! అమ్మో .. తలుచుకుంటేనే వణుకొస్తుంది . నీవన్నప్పపుడు నేను ఒప్పకోలేదు.. కానీ మీ అన్నయ్యగారి ప్రోద్బలం మీదే ఈ సాహసం చేయగలిగాను . కేంపు కెళ్లారని మీ వారితో బొంకాను .. కానీ.. పక్క రూములో ఆయన లేకపోయుంటే ... చచ్చినా ఈ పిచ్చి పని చేసుండే దాన్ని కాదు.. నువ్వెంత ప్రాణ స్నేహితురాలివైనా! ' 

' సారీనే! నీ మనసు  చాలా కష్టపెట్టాను . ఏమిస్తే నీ రుణం తీర్చుకోను? ' 

' అలివేణీ! అడిగావు కాబట్టి చెబుతున్నా! అన్నయ్యగారు విలువైన రచయిత! ఈ కాలంలో అంత నిజాయితీతో అందరి మేలూ  కోరుకుంటూ రాస్తున్నవాళ్లు తక్కువ. నీ అనుమానంతో సంఘం  నుంచి ఒక మంచి  కథకుణ్ణి దూరం చెయ్యకే ... అంటోంది వైదేహి . 
***

***
- కర్లపాలెం హనుమంతరావు 
( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ( 01 - 10 - 1980) ప్రచురితం ) 

Wednesday, December 4, 2019

రాధమ్మ పెళ్లి జరిగిపోయింది- ఆంధ్ర ప్రభ కథానిక

కథానిక : 
రాధమ్మ పెళ్లి జరిగిపోయింది 
- కర్లపాలెం హనుమంతరావు
( 28 -07 - 1982 నాటి ఆంధ్రప్రభ వారపత్రిక - ప్రచురితం ) 

రాజు, రాధా ప్రేమించుకున్నారు.
ప్రేమం టే?!
ఏమో నాకూ అట్టే తెలీదు. "

' ప్రేమ .. అమావాస్య చందమామ. . అందుకొనే దెంతమంది? .. వంద తక్కువ నూరు  మంది!' అన్నాడో కవి! 

అయితేనేం  పాపం, రాజూ, రాధా ప్రేమించుకున్నారు. 

ప్రేమం టే వాళ్ళకూ తెలుసన్న మాట అనుమానమే. అయినా ప్రేమించుకున్నారు.  పోనీ, కనీసం అలా అనుకుంటున్నారు. వాళ్ళు మేధావులు కాదు కనక. 

సాధారణంగా అందరి లాంటి యువతీ యువకులే గనక 'ప్రేమంటే ఏమిటి?' అంటూ ఆరా తీస్తూ కూర్చోలేదు. 

ఏదో హాయిగా అలా కాలక్షేపం చేస్తున్నారు. కాలక్షేపమంటే అదే... ఏదో కొద్దిగా సరదాగా గడిపేయడం. 

సరే వాళ్లు మాత్రం  వూరికే అలా ఎంతకాలం చూసుకుంటూ కూర్చుంటారు ? 

బోర్ బోర్! 

కడుపు నిండేనా, కాలు నిండేనా? 

ఒక శుభ ముహూర్తంలో పెళ్ళికూడా అయిపోతే  'శుభమస్తు ' కార్డు పడిపోతుంది కదా వాళ్ల ప్రేమ కథకు కూడా! 

' చేసేసుకుందాం .. పెళ్లి ' అని ప్రమాణాలు ఎక్స్ ఛేంజి చేసుకున్నారు. 

వాళ్ళయితే అనుకున్నారు... కుర్ర కారు.  మరి ఇరుపక్షాల పెద్దలు? 

"పెద్దవాళ్లు ఒప్పుకుంటా రంటావా, రాజూ!" అని అడిగింది రాధ.. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగానే ఏకాంతంలో కూర్చున్నప్పుడు పెళ్ళి ప్రస్తావన తవే ముందు తెచ్చి.

" ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను" అన్నాడు రాజు.. అనుమానాన్ని కూడా ధ్వనింపజేస్తూ

" ఒకవేళ ఒప్పుకోకపోతే?”

“ఒప్పుకోకపోనూవచ్చు. ఇంత దూరం వచ్చిన తరువాత వెనక్కు తగ్గుతాననుకున్నానా, రాధా!".

"అబ్బే... అలా అని కాదు. వూరికే అడిగేనులే. మరి మీదేమో బ్రాహ్మణ కులం. మేమేమో నాయుళ్ళం. కులాంతరమంటే మీ వాళ్లు అంతా తొందరగా ఒప్పుకుంటారా అని "

" మరి మీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవద్దూ కులాంతర వివాహావికి?"

" మా సంగతి వేరు, రాజూ! మా నాన్న గారు కులాంతర వివాహం చేసు కున్నారు. మా అమ్మ ఆ రోజుల్లో కొద్దో గొప్పో పేరున్న నటి. ప్రసక్తి వచ్చింది గనక చెబుతున్నా.  అమ్మది వడ్రంగి కులం. అయితేనేం, మా నాన్న గారు నాయుళ్ళయి ఉండీ ఆదర్శ వివాహం చేసుకోలేదూ! నేను గ్యారంటీ ఇస్తున్నాను, రాజూ. మన పెళ్ళికి మా వాళ్ళు ఎంతమాత్రం అభ్యంతరం చెప్పరు. మా బ్రదర్ పోయి నేడు ఫారిన్ నుండి తిరిగొస్తూ అమెరికన్ అమ్మాయిని  పెళ్ళాడి మరీ వచ్చాడు తెలుపా?" 

"మీ వాళ్ళది చాలా విశాల దృక్పథం, రాధా! ఐ యామ్ రియల్లీ హ్యపీ!  ... మా వాళ్ళే ఒట్టి చాందసులు. మా చెల్లెలు శాంత.. అదే బ్యాంకులో పనిచేస్తుందే .. తను తన కోలీగ్ ను చేసుకోవాలని చాలా పాకులాడుతోంది . శాఖాంతరమని మా వాళ్లే పడనీయడం లేదు " 

"మరి నువ్విప్పుడు ఏకంగా కులానికే ఎసరు పెట్టేస్తున్నావుగా: అడిగి చూడు! పెద్దల ముందుగా వద్దన్నా సరే, అంగీకారం కోరటం మన డ్యూటీ. నేనూ ఈ రోజే ఇంట్లో విషయం కదుపుతాను."

"ఏ విషయం. రేపు ఆదివారం సాయంత్రంలోగా ఇక్కడే తేలిపోవాలి.. విష్ యూ బెస్సాఫ్ లక్.." అని నవ్వుతూ లేచాడు రాజు. రాధ రాజు చెయ్యి పట్టుకుని పైకి లేస్తూ , "విష్ యూ  ది సేమ్ ...' అని నవ్వింది. 

రాజు కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరు. రాధ ఉమెన్స్ కాలేజీలో  డిగ్రీ మూడో ఏడు చదువుతూంది. కాలేజీకి దగ్గరే ఆఫీసు, ఇద్దరూ తరచూ ఒకే కేంటీన్ లో కలుసుకోవటంతో పరిచయం కలిగి .. అది ప్రణయంగా మారింది. అందుకు ఇద్దరూ అభిమానించే సినిమాలు, ననలలు బోలెడంత దోహదం చేశాయి. 

అనుభవంలేని వయసు పాంగొకటి తోడైంది.  ప్రణయం ముదిరి పాకాన పడింది.

రాజుకు శాంత అనే పెళ్ళి కాని చెల్లెలుతో పాటు, రాఘవ అనే ఉద్యోగం లేని  గాడ్యయేట్  తమ్ముడూ, పించను   ఇంకా సెటిల్ కాని రిటైర్డు టీచరు తండ్రి. చాదస్తం వదలలేని  పాతతరం తల్లి .. కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ఇంటికి దిక్కు రాజు జీతమే . శాంత జీతం మాతం కట్నం కోసమని దాస్తున్నారు. 

ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడూ అరవ కాకి లాగా బయట పడి తిరిగే   రాఘవకూడా ఒంట్లో నలత కారణంగా ఇంటి పట్టునే ఉన్నాడా పూట. 

భోజనాల దగ్గర పెళ్ళి ప్రస్తావన ఎత్తాడు రాజు. 
నా అంత ఎత్తు ఎదిగిన  వాడివి నీకేమని బుద్ధి చెప్పను! ఇంటి పెద్ద కొడుకుగా నీకూ  కొన్ని బాధ్యత లున్నాయన్న విషయం మరిచి పోయావురా?” అన్నాడు తండ్రి నిష్ణురంగా .

 “నే నంత కాని పనేం చేశామ, వాన్షా! ఆ అమ్మాయి చాలా గుణవంతు రాలు. “

" గుణమొక్కటే చాలుతుందా ? కులం?"

రాజు మాట్లాడలేకపోయాడు. 

తండ్రే అందుకున్నాడు "నువ్వు చెప్పక పోయినా మాకు తెలుసు లేరా ! నాయుళ్ళ సంబంధం చేసుకుంటే శాంతకు మళ్ళీ ఈ జన్మలో పెళ్ళవుతుం దంటావా?"

"ఈశ్వరావు నాకు బాగా తెలుసు. నేను కులాంతరం చేసుకున్నా తను శాంతను వదులుకునే పాటి మూర్ఖుడు కాదు. శాఖాంతరముని మీరే రాద్ధాంతం చేస్తున్నారు గానీ! " 

"ఏమో నాకీ సంకరజాతి వెళ్ళిళ్ళు ఇష్టం లేదురా! మేం మళ్ళీ అందరిలో  తలెత్తుకు తరగాలా. . వద్దా  ?” అని అందుకుంది తల్లి.

" రాధ వాళ్ళ కుటుంబం సంగతి మీకు తెలీక అలా అంటున్నారమ్మా! ఆయనతో వియ్యమందటానికి బిజినెస్ మేగ్నెట్లతో సహా ఎంతమంది క్యూలో  ఉన్నారో తెలుసా ? రాధ తండ్రి డబ్బున్న కాంట్రాక్టర్. ఎన్నికలలో ఈ దఫా కూడా పోటీ చేయబోతున్నాడు. గెలిస్తే, మంత్రి పదవి  ఖాయమంటున్నారు.  గెలవక పోయినా అధికార పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషించే అంతస్తు . అలాంటి వాల్లాయి సంబంధం ఎన్నటికీ తలవంవులు కాబోదు. గొప్ప కింద లెక్క .  అందుకే మీ మహదేవన్నయ్య  ఇన్ని సిద్ధాంతావా వల్లించి చివరకు కొడుక్కోసం  రాధ తండ్రి చుట్టూతా  తిరుగుతున్నాడు. అంత పెద్ద రాజకీయ నాయకు డికి లేని సంకరతనం ' మనకెందుకమ్మా?" 

" ఏమో! బాబూ! కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి .. ! "  

"అది కాదమ్మా! తమ్ముడు ఎంత కాలంగా  బియ్యస్సీ ఫస్టుక్లాసులో ప్యాసయ్యీ ఖాళీగా ఉంటున్నాడు? ఇంకింత కాలం ఉన్నా వాడికి ఉద్యోగం రావటం డౌటే. ఏ సిఫార్సో , మూటో లేకపోతే  ఉద్యోగాలు వచ్చే రాజులా ఇవి? వీడి సంగతి ఒక్కసారి ఆయన చెవినబడింబా చిటెకెల మీద  ఉద్యోగం రెక్కలు కట్టుకు వాలిపోతుంది.”

రానీయరా! అప్పుడే చూద్దాం” అంటూ విస్తరి ముందు నుంచి లేచాడు రాజు తండ్రి. 

ఆయన మెత్తబడినట్లు  తెలుస్తూనే ఉంది. రాఘనకు ఉత్తేజ మొచేసింది. ఉద్యోగ మొస్తుందన్న ఆశ తోటి. "అయినా ఈ రోజుల్లో కులం గిలం అట్టే ఎవరు పట్టించుకుంటున్నారే, అమ్మో! ఇందాక 
నువ్వు పెద్ద ఆచారాలను గురించి  చెబుతున్నావు కదా ! నువ్వు మొన్న , స్కూళ్ళ ఇన్ స్పెక్టరు గారు క్రిస్టియనైనా నట్టింట్లో నాన్నగారి పక్కన అకేసి అన్నం పెట్ట లేదూ? అప్పుడెక్కడికి పోయిందో కులం? ఆయన అధికారి. పింఛను  వ్యవహారం తొందరగా సెటిల్  చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ మీరు తాత్కాలికంగా కులం సంగతి మరిచిపోయారు. అందరూ ఈ రోజుల్లో అలాంటివి ఆవసరమయితే తప్ప ఎవరూ పట్టించు కోవటమే లేదు.”

"ఏమోరా, బాబూ! అవ్యక్తపు మనిషిని. నన్నెందుకు చంపుతారు ! అయినా చూస్తూ చూస్తూ ఆ అంట రాని పిల్లని వంటింట్లోకి ఎట్లారా  రానీయడం? " 

శాంత అందుకుంది: “అంటరానితనం ఏ కులంలో లేదే ఈ రోజుల్లో! మొన్న నువ్వూ, నేనూ రామలక్ష్మి కూతురు పుట్టిన రోజు పండుగకు పిలిస్తే ..  మనవాళ్ళే గదా.. అని వెళ్ళామా! ఏమయిందీ? నిన్ను ఆ పసిపిల్లను ముట్టు కోనిచ్చారా ? మర్యాదగా పలకరించారా? ఎందు కొచ్చావిక్కడికి  అన్నట్లు మాట్లాడలేదూ! వాళ్ళు మరి మన కులం వాళ్ళేగా! ఎందుకు మరి నిన్ను అంటదానివాళ్ళుగా చూశారు? నాళ్ళకు లాగా సినిమా హాల్సు, రైసు మిల్లులు లేవనేగా ? బీద బడిపంతులు భార్యవనేగా!" 

"మీ అందరూ చదవేసిన వాళ్ళు, తల్లీ! తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని అయినా చెయ్యగలరు.  తల్లితండ్రులం, మేం కోరుకునేదేమిటి?  మీరు చల్లగా ఉండటం కావాలి మాకు.  మీ కిదే ఇష్టమనుకుంటే అట్లాగే కానీయండి. లోకం మారిందంటున్నారుగా!  రాఘవగాడికన్నా ఉద్యోగమొస్తే అదే పది వేలు - ఆదే
మాకు పెద్ద బెంగయిం దిప్పుడు” అనేసి కంచాలు తీసుకుని వెళ్ళి పోయింది రాజు తల్లి. 

" హిప్ హిప్ హుర్రే ” అని అరిచాడు రాఘవ సంతోషం పట్టలేక.
" పెద్ద వాళ్ళను  ఇబ్బంది పెట్టకుండా పెళ్లి జరిగి పోతుంది" అని తృప్తిగా నిట్టూర్చాడు రాజు.

ఈశ్వరావుతో జరగదనుకున్న  పెళ్ళి మళ్ళీ ఖాయమయ్యే పరిస్థితి వచ్చేసరికి  శాంత కళ్ళ లోకి మెరుపులు  వచ్చేశాయి. 

రాజు ఆ సాయంత్రమే రాధ కోసం పార్కు కెళ్ళాడు ఎంతో ఉత్సాహంతో. 

కానీ, రాధ పార్కుకు రానేలేదు. ఎంత నిరుత్సాహం కలిగిందో! 

మరునాడు కేంటీన్ లోను కనిపించ లేదు. కాలేజీలో వాకబు చేస్తే క్లాసుకే రాలేదన్నారు. 

అయోమయం అనిపిం చింది రాజుకు . . రాధ ఇంటికి వెళ్ళాడు.  తలుపుకు వేసి ఉన్న తాళం కప్ప వెక్కిరించింది. 

వారం రోజులయింది.  కానీ , రాధ జాడ  అంతు పట్ట లేదు. పిచ్చెపోయినట్లయింది రాజుకు. 

ఆ రోజు పోస్టులో రాజాకు  కవరొచ్చింది. ముత్యాలు పేర్చినట్లుండే దస్తూరిని చూడగానే ఆనందంగా అనిపించింది. రాధ దగ్గర నుంచే సందేశం, 

ఆత్రుతగా   కవరు ఓపెన్ చేశాడు.  రాజు. 

శుభలేఖ బయట పడింది. జలాగా చిన్న ఉత్తరమూ
ఉంది! 

రాజ గారికి! 
 అర్థమయిందనుకుంటాను. 
నా పెళ్ళి నిశ్చయమై పోయింది. 
పరుడు మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు ఇప్పించాల్సిన  రాజకీయ నాయకుడి ఏకైక పుత్రరత్నం. 
మన విషయం ఆ రోజు ఇంట్లో కదిలించిన రోజు మా వాళ్ళ నిజస్వరూ పాలు బయట పడ్డాయి. 
'నీ పెళ్ళి మీద నేను బోలెడన్ని ఆశలు పెట్టు కున్నాను, తల్లీ! అవి కల్లలయిపోవటానికి లేదు. వియ్యానికైనా, కయ్యానికైనా  సమ ఉజ్జీ ఉండాలి' అని నాన్న గారు కొట్టి పారేశారు. 

నా మొండితనం తెలిసి మా వాళ్ళు నిర్బంధంగా నన్ను  విశాఖపట్నం తీసుకొచ్చారు. వారుడుది ఈ  ఊరే. 
ఈ పెళ్ళితో మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు దొరుకుతుంది. అన్నయ్యకు పెద్ద కంపెనీలో జనరల్ మానేజరు పోస్టు దక్కుతుంది. అమ్మకు డాన్స్ స్కూలు పెట్టుకోవటానికి పర్మిషన్, ఫండ్సూ దొరుకుతాయి. 

మరి నాకో...? ఏం దొరుకుతుంది? జ్ఞానం. మనం అభిమానించే సినిమాలల్లో, నవలల్లో ఉండే ఊక దంపుడు  ఉపన్యాసాల తాలూకు కులాలు, మతాలు వాటి మధ్య అసమానతలు, దోపిడి, ఘర్షణ అంతా ఆచరణలో పట్టవలసిన సందర్భం వస్తే  ఫార్స్  అనీ, మనిషికీ మనిషికీ మధ్య పెరుగుతున్న అసమానతలు  అన్నిటికి కారణం ఏకైక పదార్థం ఒక్కటే. . అదే 'ఆర్థికం' అనే జ్ఞానం మాత్రం మిగులుతుంది రాజూ! వీలైతే నిన్ను క్షమించు; 

ఇట్లు, 

... 

రాజుకు సవ్వొచ్చింది. 'క్షమించటానికి తనెవరు? రాధ తల్లి తండ్రులను తప్పు పట్టటానికి తన కెక్కడ నైతికంగా హక్కుంది? తమ్ముడికి ఉద్యోగం వస్తుం దనీ, తండ్రి సమస్య తీరుతుందనీ, సంఘంలో మరో మెట్టు పైకి ఎక్క గలమనీ నచ్చచెపితే గదా . . తన తలి దండ్రులు కులం అడ్డును కూడా  కాదని ఒప్పుకుంది! 

అదే మార్గంలో  రాధ తల్లిదండ్రులూ వెళ్లారు. 

రాధ నాన్నగారు కులాంతర వివాహం చేసుకుందీ, రాధ అన్న అమెరికన్ అమ్మాయిని చేసుకుందీ, పెళ్ళిని 

ఈశ్వరావుతో తన తల్లిదండ్రులు నిరాకరించిందీ, తన పెళ్ళిని రాధతో అంగీకరించనిదీ.  అన్నీ  ఒకే  ఆలోచనతోనే కద! అన్నిటికి ఆర్థిక కొలమానమే ప్రమాణమయింది గదా .. పెళ్ళిళ్ళకూ... ఆఖరికి ఆదర్శ వివాహాలకు కూడా! 

శాంత కిందివాడు పైమెట్టుకు ఎగబాకాలని చూస్తే, ప్లైవాడు ఇంకా ప్లైమెట్టుకు పాకులాడుతూ ఈ 'గాప్' ను సదా రక్షించు కోవటానికే చూస్తున్నాడు. అడుగున ఉన్న మనిషి పైన ఉన్న వాడి కాళ్ళు పట్టుకుని ఎగబాకాలని చూస్తుంటే, ఆ పైన ఉన్నవాడు క్రింది వాడి నెత్తి మీద కాలు పెట్టి ఇంకా  పైకి ఎగబాకాలని చూస్తున్నాడు! 

మనసులకు సంబంధించిన 'పెళ్ళి' వ్యవహారంలో కూడా ఇంతే.. ఇంతే! 

ఏమయితేనేం.. రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది— రాజుతో మాత్రం కాదు.

***
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్ర ప్రభ వారపత్రిక - 28-07-1982- ప్రచురితం)  

Thursday, February 14, 2019

రాధమ్మ పెళ్లి జరిగిపోయింది - ఆంధ్రప్రభలోని నా కథానిక

రాధమ్మ పెళ్లి జరిగిపోయింది - ఆంధ్రప్రభ (29-07-1982  నాటి) వారపత్ర్రికలోని నా కథానికః
ఎన్ని కమ్మని ప్రేమ కబుర్లు పోటీ కొచ్చినా జీవతమనే  పరుగుపందెంలో ఆఖర్న బంగారు పతకం సాధించేది,, విచ్చు రూపాయే! ఆర్థిక సంబంధాల ప్రాబల్యం అప్పటికీ ఇప్పటికీ,, ఇంకెప్పటికీ ఎవరూ పడగొట్టలేని వస్తాదే బతుకుగోదాలో అని మరో సారి చెప్పిన చిన్న కథ.. రాధమ్మ పెళ్లి జరిగిపోయింది! 

రాధ నాన్నగారు కులాంతర వివాహం చేసుకుందీ, రాధ అన్న అమెరికన్ అమ్మాయిని చేసుకుందీ, పెళ్ళిని ఈశ్వరావుతో తన తల్లిదండ్రులు నిరాకరించిందీ, తన పెళ్ళిని రాధతో అంగీకరించనిదీ.  అన్నీ  ఒకే  ఆలోచనతోనే కద! అన్నిటికి ఆర్థిక కొలమానమే ప్రమాణమయింది గదా .. పెళ్ళిళ్ళకూ... ఆఖరికి ఆదర్శ వివాహాలకు కూడా! 

శాంత కిందివాడు పైమెట్టుకు ఎగబాకాలని చూస్తే, ప్లైవాడు ఇంకా ప్లైమెట్టుకు పాకులాడుతూ ఈ 'గాప్' ను సదా రక్షించు కోవటానికే చూస్తున్నాడు. అడుగున ఉన్న మనిషి పైన ఉన్న వాడి కాళ్ళు పట్టుకుని ఎగబాకాలని చూస్తుంటే, ఆ పైన ఉన్నవాడు క్రింది వాడి నెత్తి మీద కాలు పెట్టి ఇంకా  పైకి ఎగబాకాలని చూస్తున్నాడు! 

మనసులకు సంబంధించిన 'పెళ్ళి' వ్యవహారంలో కూడా ఇంతే.. ఇంతే! 

ఏమయితేనేం.. రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది— రాజుతో మాత్రం కాదు.

***
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్ర ప్రభ వారపత్రిక - 28-07-1982- ప్రచురితం)  

రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది - కథానిక

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...