Wednesday, December 8, 2021

కథకుడి కథ - కథానిక - కర్లపాలెం హనుమంతరావు - ఆంధ్రప్రభ ( 01 - 10 - '80)






కథానిక : 
కథకుడి కథ 
- కర్లపాలెం హనుమంతరావు 
( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ( 01 - 10 - 1980) ప్రచురితం)  

సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి —

అలవాటుగా తెల్ల చీర కట్టుకుని, మల్లె పూలు పెట్టుకొని, చిరు నవ్వులు చిందిస్తూ గుమ్మంలో నిలబడి ఉండవలసిన అలివేణి, నట్టింట్లో నేలవిద మీద అమ్మ లక్కల మధ్య అశోకవనం కింద సీతాదేవిలా ఉన్న దృశ్యం! 

నా రాకతో ఆడంగులందరూ భుజాల నిండుగా కొంగులు సర్దుకుంటూ బిలబిలా  గది ఖాళీ చేసేశారు.

అలివేణి మాత్రం భంగమ  మార్చలేదు. చింకి చాపవిూద మరింత
ముడుకుని  కూర్చుంది. 

ఏదో జరగరానిదే జరిగింది. "అలివేణీ!” అని పిలిచాను. పలుకులేదు , ఉలుకు లేదు. వంటింట్లోకి జొరబడి, రెండు కప్పులు  కాఫీ కలుపుకు వచ్చాను .

వేడి కాఫీ వాసనకు వాతావరణంలో టెన్షన్ కొద్దిగా సడలింది. 
మూడ్ వచ్చినట్లుంది . కాఫీ అందుకుని, మొహం ఇంత చేసుకొని, "ముందు నా కిది చెప్పండి- మీరా ముదనష్టపు కథలు వ్రాయటం మానతారా? నన్ను పుట్టింటికి పొమ్మ న్నారా?" అని బావురుమంది. 

"అస లేమయింది? " అనడిగాను చిరాకుగా.

“ఇంకేం కావాలి? పోయిన వారం కథల పోటీలో మీరు వ్రాసిన కథకు బహుమతి వచ్చి, మీ ఫోటోతో సహా అచ్చు కావటం కాదు కాని నాకు చచ్చే చావొచ్చి పడింది" అని మళ్ళీ రాగం అందుకుంది.

 “దానికి ఏడుపు ఎందుకు ???

*ఏడుపు కాక ఏమిటి నా ముఖానికి! మీ కేం? మీరు బాగానే ఉన్నారు.
ఆ కథలో మొగుణ్ణి ఆరళ్ళు పెట్టే పెళ్ళాన్ని నన్ను చూసే వ్రాశారని, పెళ్ళానికి బుద్ధి చెప్పటానికి పొరుగింటి అవిడతో సరసాలాడటం మీరు అనుభవం మీదే వ్రాశారని, నా కాపరం గుండమవపోతుందని సానుభూతి చూపించటానికి వచ్చా రండీ వీళ్ళంతా!"

నాకు నవ్వాగలేదు.

“మరయితే కొంప తీసి నువ్వూ అలాగే అనుకుంటున్నావా అలివేణీ?" అని అడిగాను నాటక ఫక్కీలో. 

"ఏమో! ఎవరికి తెలుసు? నేను పుట్టింటికి పోయినప్పుడు, ఎక్కడెక్కడ వూరేగారో  నేను చూశానా?" అంది అనుమానంగా.

"అయితే ఒక పని చేయి. నీ వసలు పుట్టింటికే వెళ్ళకు."

"ఆలాగయి తే మీ రిక కథలు వ్రాయకండి!" అంది ప్రాధేయపూర్వకంగా..

"అది నా వల్ల కాదు.'' 

“పోనీ, ఇలాంటి కథలు వ్రాయకండి, బాబూ! వ్రాసినా, ఫోటోతో సహా అచ్చేయించుకోవద్దు " అని రాజీకి వచ్చింది. 

" సరేలే" అన్నాను. అలివేణిని  తాత్కాలికంగా  శాంతింప చేయటానికి.

కానీ, నిజంగా ఈ బహుమతి  కథతో నాకు పెద్ద చిక్కే వచ్చి పడింది. 

మరునాడు ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఆచారి హఠాత్తుగా కావలించేసుకున్నాడు. 

కారణ మేమిటంటే "అదృష్ట వంతుడివంటే నువ్వే, గురూ! కథలు వ్రాసి పేరుకు పేరూ, డబ్బుకు డబ్బూ కొట్టేయటమే కాకుండా, పక్క ఇంటి పిట్టల్ని కూడా పట్టుకుంటున్నా వన్నమాట!" అదీ వీడి ఏడుపు! 

దాదాపు స్టేఫులోని  మగాళ్ళందరి జెలసీ అదే! వీళ్ళ కేం చెబుతాను ? 

మునుపు కాస్త చనువుగా, సరదాగా ఉండే లేడీసయితే  నన్ను చూసి ఇప్పుడు పూర్తిగా బెదిరిపోయారు. మధ్య మధ్యలో మా ఆవిడీని గురించి జాలితో కామెంట్సు పాస్  చేసుకోవటంకూడా విన్నాను.

ఆ రోజు సాయంత్రం మేనేజర్  నన్ను తన గదిలోకి పిలిచాడు.

"చూడు, మిస్టర్ ఆనంద్! మన స్టాఫ్ లో  మీ లాంటి రచయిత ఉండటం నిజంగా నాకు గర్వ కారణం "అని ఒక పది నిమిషాలు తైరు కొట్టి, కాఫీ తెప్పించి. . తాగిన తరువాత మరో పది నిమిషాలు నీతి నియమాల మీద లెక్చరిచ్చి చివరికి అసలు విషయం బయట పెట్టాడు. "మీ రింత కాలం రచయిత అని  తెలియదు. మీ అమూల్యమయిన సమయాన్ని నా డాటర్  ట్యూషన్ కు వెచ్చిచడం ద్వారా వేస్ట్ చేయటం నాకు నచ్చలేదు . అందుచేత తనకు వేరే  అరేంజ్ మెంట్  చేశాను . " అనేశాడు. 

ఇతగాని  మనస్తత్వం ఈ విధంగా బయట పడింది. తన కూతుర్ని ఎక్కడ అంటుకుంటానోనని ముందస్తు జాగ్రత్త అన్న మాట! 

అలివేణి పుట్టింటికి పోయింది. ఇంతకు  ముందు అలాగే నేనొక్కణ్ణీ  ఇంట్లో వండుకుంటే ఇరుగు పొరుగు అమ్మలక్కలు "అన్నయ్యా! ఈ కూర తీసుకోండి!". . 
" మగవాళ్లు  మీ రేం చేసుకుంటారు? మా ఇంట్లో భోజనం చేయండి" అనే వాళ్ళు. 

ఈ సారి ఇటు వైపు కన్నెత్తి చూడలేదు సరికదా — నన్ను చూడగానే మైలు దూరం ఒదిగిపోయి నడిచి పోతున్నారు.

నాకూ ఈ వాతావరణం చికాకనిపించి హోటల్లో భోజనం చేయటం మొదలు పెట్టాను. 

ఒక రోజు హోటల్లో భోజనం చేసి సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వచ్చి గది తలుపులు తీస్తూంటే ఎదురింటి పానకాలరావు భార్యను చితకబాదటం కనిపించింది. ఎంత వద్దనుకున్నా వాళ్ళ తగవు మధ్య నా పేరు వివపడటంతో ఆగిపోయాను. " చెప్పు ! ఈ పుస్తకం నీ దగ్గర కెట్లా వచ్చిందే? అసలు వాడి  గదిలో కెందు కెళ్ళావు? నీ మొహానికి తోడు ఇద్దరు మెగుళ్ళు కావలసి వచ్చారటే?".

నా రక్తం ఉడికి పోయింది. ఒక్క ఉదుటున పోయి వాడి జుట్టు పట్టు కున్నాను. అనుకోని ఈ హఠాత్పరిణామానికి   పానకాలరావు   నివ్వెరపోయాడు కాబోలు, నోట మాట రాకుండా నిలబడి పోయాడు. 

అతని భార్య  నుదురు చిట్లి రక్తం కారుతుంటే బాధతో ఏడుస్తూంది. 

ఇంకొక్క క్షణం అక్కడ ఉండలేక ఆ పుస్తకం తీసుకుని వచ్చేశాను. 

అది నాదే. అలివేణి ఉన్నప్పుడు ఈవిడ తీసుకు వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఈ అనుమానపు పిశాచి కంటబడి ఇంత ఘోరం జరిగింది.

మరునాడు ఉదయమే ఇల్లు గలాయన వచ్చాడు " ఈ నెలాఖరికి ఇల్లు ఖాళీ చేయం "డంటూ. 

ఎందుకు అని  అడగలేదుఅతని వెనకాలే నిలబడి ఉన్న పానకాల రావును చూసి అంతా అర్థమయింది.

ఆ రోజు నుండి ఇళ్ళ వేట ఆరంభించాను.

నా పేరు ప్రఖ్యాతలు ఇంత త్వరగా ఈ వూళ్ళో వ్యాపించాయని నా కప్పుడే తెలిసింది.

నా పేరు విని నన్ను కొంతమది ఇల్లు ఖాళీ ఉండికూడా లేదన్నారు.

కొంతమంది హమాటం లేని వాళ్ళయితే "మంచి  ఫామిలీస్ కే ఇస్తాం" అన్నారు.

మరీ మొహమాటం  ఉన్న వాళ్ళయితే " వలందు మీ ఆడవాళ్ళను వచ్చి చూసి పొమ్మనండి. అప్పుడు మాట్లాడుకుందాం!" అన్నారు. 

అడిగి అడిగి కాళ్ళు నొప్పులు పుట్టడమే కాని ప్రయోజనం లేకపోయింది. 

అద్దె కొద్దిగా ఎక్కువ ఇస్తానన్నా ఆశ పడి ముందు ఒప్పుకున్నా ఒక ఆసామి రెండవ రోజు డబ్బు ఇవ్వటానికి వెళితే కొత్త 'వంక' చెప్పి ఇల్లు ఖాళీ లేదన్నాడు.

స్టాపు మెంబర్లందరకీ  చెప్పి చూశా. చూస్తామన్న వాళ్ళే కాని చూసిన వాళ్ళెవరూ లేరు. వాళ్ళ ఇళ్ళ పక్కన చేరితే వాళ్ళ సంసారాలకేం మూడుతుందోనని భయమనుకుంటా. 

ఒక రోజు వామన మూర్తి లంచ్ంలో నన్ను కలుసుకుని, "మీరు ఇళ్ళ కోసం వెతుకుతున్నారు గదా? మా పక్క వాటా ఖాళీ  అయింది. మీ కిష్టమయితే చేరండి" అన్నాడు. 

అమృతం దొరికినంత ఆనందమయింది. వామనమూర్తితో నాకు ఆట్టే పరిచయం లేకపోయినా అతని మంచితనం నన్ను ఆకట్టుకుంది. 

అలివేణి రాగానే ఆ ఇంటికి మారిపోయాను .

రోజులు  అలా అలా సాగుతున్నాయి . నా రచనా వ్యాసంగం మాత్రం మానలేదు, ఎవరెన్ని విమర్శలు చేసినా! 

అలివేణికి, వామనమూర్తి భార్య వైదేహికి మంచి స్నేహమయింది. మా రెండు కుటుంబాల మధ్య రాకపోకలు తరుచుగా జరుగు తున్నాయి.

ఆ రోజు అలివేణి పిన్ని కూతురు పెండ్లి అని వూరు వెళ్ళింది. ఖాళీగా ఉండటంతో అంతకు ముందెప్పుడో సగం వ్రాసిన కథ పూర్తి చేద్దామని కూర్చున్నాను. 

గడియారం పది గంటలు ఎప్పుడు కొట్టిందో తెలియలేదు. తెలుపు దగ్గర చప్పుడయితే తల ఎత్తి చూశాను. వైదేహి లోపలికి వచ్చి తలుపు వేసింది. 

ఒక్క క్షణం నా కర్థంకాలేదు. వామనమూర్తి ఆఫీసు పని మీద  కాంపుకి వెళ్ళి ఉన్నాడు. 

ఆవిడ నవ్వుతూ వచ్చి నా పక్కను కూర్చోబోయింది. నేను దిగ్గు ప లేచి నిలబడ్డాను.

అవిడ కంగారు పడింది. "మీ కిష్టం లేదా?" అని అడిగింది తడబడే గొంతుతో ! 

“నా కిష్టముందని ఎవరు చెప్పారు?" అన్నాను కటువుగా.

"మరి మీ కథలు?! "

నాకు పిచ్చి ఆవేశం ముంచుకు వచ్చింది. గబగబా బీరువా తగ్గిరికివెళ్ళి కథ అచ్చయిన పుస్తకాన్ని  బయటికి తీసి  ఆ కాగితాల్ని బయటికి లాగి, "ఆదిగో! దీనివల్లే కదా మీ రంరూ నన్నిలా షేమ్ చేస్తున్నారు” అంటూ కసిగా పర్ పర్ మని  కాగితాలని  చించేశాను. ఆవిడ బిత్తరపోయింది . 

తడబడే అడుగులతో వడివడిగా తలుపు గడియ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది.

ఇక శాశ్వతంగా కథలూ కాకరకాయలూ రాయకూడదని ఆ క్షణమే నిశ్చయించుకున్నాను. 
... 

ఆ రోజు జ్వరం ఫీలింగుతో తలనొచ్చుతుంటే పర్మిషన్ తీసుకుని  మధ్యాహ్నం మూడింటికే ఇంటికి వచ్చేశాను. 
లోపల గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. .  అలవేణి  అంటోంది "వైదేహీ! నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. ఆయనగారి రోగానికి నీ మందు బాగా పనిచేసిందే! చిన్ననాటి స్నేహాతురాలివి . ఇదీ కష్టం అని చెప్పగానే.. నా కోసం చాలా పెద్ద రిస్కే తీసుకున్నావే ! ' 

వెంటనే వైదేహి గొంతు ' అలివేణీ! నీవు ఎంతో అదృష్టవంతురాలివే! నిజం చెప్పాలంటే అ్నయ్యగారు ఆణిముత్యం . మరో మగాడు అయితేనా.. ! అమ్మో .. తలుచుకుంటేనే వణుకొస్తుంది . నీవన్నప్పపుడు నేను ఒప్పకోలేదు.. కానీ మీ అన్నయ్యగారి ప్రోద్బలం మీదే ఈ సాహసం చేయగలిగాను . కేంపు కెళ్లారని మీ వారితో బొంకాను .. కానీ.. పక్క రూములో ఆయన లేకపోయుంటే ... చచ్చినా ఈ పిచ్చి పని చేసుండే దాన్ని కాదు.. నువ్వెంత ప్రాణ స్నేహితురాలివైనా! ' 

' సారీనే! నీ మనసు  చాలా కష్టపెట్టాను . ఏమిస్తే నీ రుణం తీర్చుకోను? ' 

' అలివేణీ! అడిగావు కాబట్టి చెబుతున్నా! అన్నయ్యగారు విలువైన రచయిత! ఈ కాలంలో అంత నిజాయితీతో అందరి మేలూ  కోరుకుంటూ రాస్తున్నవాళ్లు తక్కువ. నీ అనుమానంతో సంఘం  నుంచి ఒక మంచి  కథకుణ్ణి దూరం చెయ్యకే ... అంటోంది వైదేహి . 
***






***
- కర్లపాలెం హనుమంతరావు 
( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ( 01 - 10 - 1980) ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...