Showing posts with label Culture. Show all posts
Showing posts with label Culture. Show all posts

Sunday, March 7, 2021

గీత ఓ అందే ద్రాక్ష పండు! -కర్లపాలెం హనుమంతరావు -

 



 కార్పణ్య దోషోప హత స్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ నమ్మూఢ చేతాః

యచ్ర్ఛెయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తే౨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్

భారతీయులు ఆరాధనాభావంతో పఠించే భగవద్గీతలో ఈ సాంఖ్యయోగం - ఏడో శ్లోకంలో పెద్దలు ఎప్పుడూ గుర్తుంచుకుని అనుసరించదగ్గ ఓ గొప్ప  సూక్తి ఉంది

అభిమానం పరిమితులకు మించి పెరిగిపోయినప్పుడు సహజ స్వభావానికి విరుద్ధమైన ప్రవర్తన సంభవిస్తుంది. ధర్మసంబంధ విచక్షణ  పక్కనుంచి సామాజికపరంగా అయినా ఆమోదనీయం కాని సమతౌల్యతను మనసు కోల్పోవడమే ఇందుకు కారణం. సమాజంలోని  ప్రతీ వ్యక్తికీ ఈ సంకట స్థితి ఏదో ఓ సందర్భంలో తప్పదు. అయితే,  జీవితం నేర్పిన పాఠాల సారం వంటబట్టిన కొందరు గుంభనగా ఈ  స్వ స్వరూప సంభంధమైన వైవిధ్యం స్వయంగానే గ్రహింపుకు తెచ్చుకుని  ఆ  వైపరీత్యం నుంచి బయటపడే ప్రయాసలు ఆరంభిస్తారు! ఆ పైన జీవ సంస్కారాన్ని బట్టి జయాపజయాలు!


కానీ, జీవితమనే మల్ల యుద్ధం గోదాలోకి అప్పుడే  పాదం మోపిన పిన్న వయస్కులు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవలసిన  సందర్భం తటస్తించినప్పుడు నరుడు నారాయణుణ్ణి ఉచిత మార్గ దర్శనార్థం  ఎట్లా దేబిరిస్తాడో అట్లా దేబిరించడం నామర్ధాగా భావిస్తారు.  అన్నీ తమకే తెలుసనుకుని దుందుడుకుగా ముందుకు దూసుకుపోతారు. కలసిరాని సందర్భంలో చతికిలపడే దుస్థితి దాపురించినప్పుడు బేలతనంతో ఆ పిన్నలు తమ సహాయ సహకారాలు, సముచితమైన సలహాలు యాచించే స్థితికి వచ్చే వరకు కన్నవారు ఓపికతో వేచ్చిడాలి.. అదే పెద్దరికం.. అని ఈ శ్లోకం సారాంశం.

మహాభారతంలో అర్జునుడు  యుద్ధరంగం మధ్య ప్రేమానురాగ బద్ధుడై కర్తవ్య విమూఢత్వం ఆవరించిన సందర్భం ఒకటుంది. తన వైరాగ్యానికి కారణం బంధుప్రీతి అనో, పెద్దలు.. గురువుల మీద భయభక్తులనో, విజయసాధనానంతరం అనుభవంలో కొచ్చే రాజభోగాల మీది కాంక్ష ధర్మసంబద్ధం కాదనో.. ఇలా రకరకాల కారణాలు వెతికే దుస్సాహసానికి సర్వలోకసంరక్షకుడి ముందు  దిగే దుస్సాహసానికి పూనుకుంటాడు. కానీ ఈ శ్లోకం దగ్గరకొచ్చేసరికి విజయుడికి తన పరిమితులు తెలిసివచ్చాయి.  తన సహజ రాజస్వభావానికి విరుద్ధమైన కరుణ, జాలి వంటి గుణాలే ఈ సంక్లిషతకు కారణమని  అవగాహన ఏర్పడింది. ఆ భావన కలిగించింది అప్పటి వరకు తాను కేవలం మిత్రుడిగా భావించిన యదువంశ సంజాతుడు శ్రీకృష్ణుడే. ఎదుట ఉన్న ఆ వ్యక్తి తన బాంధవుడిగా మాత్రమే భావించి తన మనోభావాలని యధేచ్ఛగా పంచుకున్నావాడల్లా జగద్గురువన్న ఎరుక కలిగిన మరుక్షణమే అతనని తన మార్గదర్శుగా ఎంచుకున్నాడు. తగిన కార్యాచరణ సూచించమనే స్థాయి వరకు  దిగివచ్చాడు.  తనను శాసించే సర్వాధికారాలు సమర్పించే దాసస్థితికి ఆ నరుడు చేరువ అయినప్పుడుగాని ఆచార్యుడు కర్తవ్యబోధకు పూనుకోలేదు. 

నరుడికి ఓపిక లేకపోవచ్చును గాని.. నారాయణుడిలోని పెద్దరికనికి  ఎందుకుండదు! పెద్దలూ, పిన్నలతో గీతలోని ఆచార్యుని ర్తీలోనే  సాగాలని  ఈ శ్లోక సారం. 

పండు పిందె దశలో ఎలా వగరుగా ఉండి రుచికి హితవుగా ఉండదో.. పిల్లల ప్రవర్తనా ప్రాథమిక దశల్లో సమాజపోకడలకు విభిన్నంగా సాగుతూ సబబనిపించదు. పిందె పచనానికి పనికి రాని విధంగానే పిల్లలూ బాల్యదశలో పెద్దల మార్గానికి భిన్నమైన దారుల్లో పడిపోతూ ఇబ్బందులు కలిగిస్తారు.  తమ శక్తి సామర్థ్యాల, శక్తియుక్తుల పరిమితులు గ్రహణకొచ్చిన తరువాత తప్పక పెద్దలను ఆశ్రయిస్తారు. ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం భారతంలోని కృష్ణపరమాత్మునికి మల్లే సద్వినియోగం చేసుకోవడమే పెద్దల కర్తవ్యం- అని ఈ శ్లోకం ప్రబోధిస్తుంది.


గీత కేవలం భగవానుని ఉవాచ మాత్రమే కాదు. ఆ ఆధ్యాత్మిక కోణంతో పాటు అదనంగా వ్యక్తిత్వ వికాస సంబంధమైనదని కూడా ప్రపంచం క్రమంగా గుర్తిస్తున్నదిప్పుడు. నిత్య జీవితానికి అక్కరకొచ్చే సూక్తులని గ్రహించి ఆచరణలో పెట్టే వారందరికీ 'గీత' ఎప్పుడూ అందే  ద్రాక్షాపండే!

 -కర్లపాలెం హనుమంతరావు

బోథన్, యూఎస్ఎ

07 -03 -2021

Tuesday, March 2, 2021

ఆటలు- సేకరణ కర్లపాలెం హనుమంతరావు



 

తాటికాయలకు పుల్లగుచ్చి దర్జాగా దొర్లించుకుంటూ వెళ్లే రెండు చక్రాల బండి, ఒకరి చొక్కా మరొకరు పట్టుకొని క్షణాల్లో సృష్టించే పొగలేని రైలుబండి, ఒకటి నుంచి వంద ఒంట్లు లెక్కబెట్టిన బుజ్జి దొంగ కళ్లు తెరిచి చేసే భీకర వెతుకులాట, ఝుమ్మని తిరిగే బొంగరం, కూత ఆపకుండా గోదాలో నిలిచే ఆటగాడి పనితనం, పెచ్చులుగా పగిలే గోళీలు, పెరటి కొమ్మలకు ఊగే ఊయలలు, వరండాల్లో అష్టాచెమ్మా, వీ«థుల్లోన కుందుడుగుమ్మా... మన ఆటలు నిజంగా బంగారం. మన పిల్లల కోసం సంప్రదాయం సృష్టించిన తెలుగుదనపు సింగారం.

బొద్దుగా ముద్దుగా ఉండే కుమారరత్నం పొద్దున లేస్తే టీవీకి అతుక్కుపోతాడు. నోరు తెరిస్తే పవర్‌ రేంజర్స్, పొకెమాన్‌ మాట్లాడతాడు. అవసరమైతే బేబ్లేడ్‌లు అడుగుతాడు. కాదంటే చాక్లెట్‌ ఫ్యాక్టరీ చదువుతానంటాడు. అమ్మాయికి ఎస్‌ఎంఎస్‌ల పిచ్చి. చాటింగ్‌లో తప్ప క్లోజ్‌ ఫ్రెండ్‌ ఎదురుగా నిల్చున్నా మాట్లాడదు. టైముంటే ట్వంటీ ట్వంటీ, నో అంటే టామ్‌ అండ్‌ జెర్రీ.

వీళ్ల ఇష్టాలు వీళ్లవే. వీళ్ల కోసం పిజ్జాలు బర్గర్‌లు కాదనక్కర్లేదు... కాకపోతే అప్పుడప్పుడన్నా మన సద్దిబువ్వ సంగతి తెలియాలి. వాటర్‌ పార్కులు, హారర్‌ హౌస్‌లు ఎంజాయ్‌ చేయాల్సిందే... కానీ ఏడాదికోమారన్నా వరిచేల మీద నుంచి వీచే చల్ల గాలి వీళ్ల ఒంటికి తగలాలి. అమ్మమ్మ కలిపే ఆవకాయ ముద్ద నోటికి అందాలి. మట్టివాసన తెలియని వాళ్లకి మరే పరిమళం అంటదంటారు. మన సంస్కృతి తెలియనివారికి మరే సంస్కృతైనా అర్థం అవుతుందా? తెలుగు భాష తీయదనం పిల్లల నాలుకకు తగలాలని ఉద్యమిస్తున్నట్టే తెలుగు ఆటల రుచి వారికి చేరువ కావాలని ఎందుకు ఉద్యమించకూడదు?

ప్రతిదీ ఒక ముచ్చట...

పిల్లలంతా గోలగా మూగుతారు. జట్లు జట్లుగా పంటలు వేస్తారు. ఒక్కొక్కరూ ‘పండు’గా మారి చివరకు ఒకరిని దొంగ చేస్తారు. ఆ దొంగతో దాగుడుమూతలు ఆడతారు. ఆ దొంగతో కోతి కొమ్మచ్చి ఆడుతారు. ఆ దొంగను కుంటుకుంటూ వచ్చి కుందుడుగుమ్మలో అందరినీ పట్టుకోమంటారు. ఆ దొంగ మెడలు వంచి ‘ఒంగుళ్లూ దూకుళ్లూ’ వినోదిస్తారు. ప్రతిదీ ఒక ముచ్చట. జీవితంలో గెలుపోటములను నేర్పే కళ. అందని వాటిని అందుకోవడం, దొరకనివాటిని వెతుకులాడటం, అనువుకాని చోట తలను వంచడం, అడ్డంకులు ఉన్న చోట ఒంటికాలితోనైనా సరే గమ్యాన్ని చేరుకోవడం... మన ఆటల్లో నిగూడార్థాలు... నిబ్బరాన్ని నింపే రహస్య సూచనలు.

ఖర్చు లేని వినోదం...

ఒక క్రికెట్‌ కిట్‌ కొనాలంటే ఎంతవుతుంది? ఒక టెన్నిస్‌ రాకెట్‌కు ఎంత వెచ్చించాలి. ఒక సాయంత్రానికి షటిల్‌కాక్‌లు ఎన్ని సమర్పించాలి? వీడియో గేమ్స్‌ వెల ఎంత? కానీ మన ఆటల్లో ఎంత ఖర్చవుతుంది? చింతపిక్కలు, ఇటుక ముక్కలు, వెదురుకర్రలు, రూపాయికి ఇన్నేసి వచ్చే గోళీలు... అందుబాటులో వున్న వస్తువులనే క్రీడాసామాగ్రిగా చేసుకొని ఖర్చులేకుండా వినోదించడం మన గ్రామీణులు నేర్చిన విద్య. బాదం ఆకులు కుట్టుకోవడం తెలిసినవాడు పేపర్‌ప్లేటు వచ్చేదాకా తలగీరుకుంటూ నిలుచోడు. గమనించి చూడండి... మన ఆటలన్నీ ఇలాంటి నేటివ్‌ ఇంటెలిజెన్స్‌ను పెంచేవేన్మళ్లీ చిగురించాలి...

సమిష్టి తత్వాన్ని, సామూహిక జీవితాన్ని, అనుబంధాలను, పరస్పర ప్రేమానురాగాలను పెంచేవే గ్రామీణ క్రీడలు. నేడు గంటల తరబడి టీవిల ముందు కూర్చొని సీరియల్స్ చూడడం, ఆట ఆడడం కన్నా ప్రేక్షకుల్లా, శరీరం కదలకుండా చూడడమే మనకు ఆటపాట అవుతుంది. ఇది చాలదన్నట్లు యువత వీడియోగేమ్స్ రూపంలో తీరిక లేకుండా ఉంది. గత కాలంతో పోల్చిచూస్తే గ్రామీణ క్రీడలకు ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుతం గ్రామీణ క్రీడల్లో చాలావరకు మాయమై ఒకటి, రెండు మాత్రమే మిగిలాయి. వస్తువులు మాయమైనట్లే, మనుషులతోపాటు మమతలు దూరమైనట్లే ఆటలు కూడా వాటిని అనుసరించాయి. గ్రామీణ క్రీడలు మన శరీరానికి, మానసిక వికాసానికే కాక వినోదానికి కూడా ప్రాధాన్యత ఇస్తాయి. తార్కిక బుద్దికి ఎత్తుకు పైఎత్తులు ‘పుంజీతం’ నేర్పితే, ముందువాడిని వెనక్కునెట్టి రాజు కావడం ఎలానో ‘పచ్చీసు’ వివరిస్తుంది. ఇటువంటి ఆటలు గ్రామీణ క్రీడలుగా చెబుతున్నప్పటికీ ప్రతి ఆటలోని మనవాళ్లు ఐక్యతకు పెద్ద పీట వేశారు. ఈ క్రీడలు ఆటకైనా, బ్రతుకు ఆటకైనా నిబంధనలుంటాయని తెలుపుతాయి. సృజన వ్యక్తిగత ప్రతిభ నుండి పుట్టి సమాజగతమవుతుందని ఈ క్రీడలు నిరూపిస్తాయి. చిన్నారులు ఆడే గోలీల ఆటతో వారిలో చక్కని స్నేహబంధాన్ని చూడవచ్చు. మనిషి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న తరుణంలో పిల్లలు గోళీల ఆట ఆడి అధికంగా గోళీలు సంపాదిస్తే వారు పొందిన ఆనందానికి అవధులుండవు. ఐదువేళ్లు కలిపి ఆడే అచ్చనగిల్ల చేతివేళ్లకు వ్యాయమంతోపాటు బాలికలలో దాగి ఉండే సృజనాత్మక శక్తిని వెలికి తీసేదిలా ఉంటుంది. శరీర వ్యాయామానికి తొక్కుడుబిళ్ల ఆట దోహదపడుతుంది. గతంతో తీరిక సమయాల్లో గ్రామాల్లోని కూడలి వద్ద అష్టచమ్మ, దాడి, వామనగుంటలు లాంటి ఆటలు గ్రామస్తులు అధికంగా ఆడేవారు. చిన్నచిన్న పందాలు కాస్తూ ఆటకు రక్తికట్టించేలా వారు క్రీడల్లో పాల్గొనేవారు. గ్రామీణ క్రీడలు ఎటువంటి ఘర్షణ వాతావరణానికి తావివ్వకుండా ఐక్యత వాతావారణంలో కొనసాగేవి. ఇంతేకాకుండా గోడిబిళ్ల, చెడుగుడు, కబడ్డీ క్రీడలు దేహధారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా మనిషిలోని సహజస్థితి, కలసికట్టు తనానికి నిదర్శనంగా ఉంటాయి. ప్రస్తుత సెల్‌యుగంలో ఈ గ్రామీణ క్రీడలు అంతరించిపోతున్నాయి. గ్రామాల్లో ఐక్యత వాతావరణం దెబ్బతిని కక్షపూరిత వాతావరణం పెరుగుతుంది. ప్రశాంతతకు భంగం వాటిల్లిన పల్లెలు సౌభాగ్యాన్ని పూర్తిగా కోల్పోతున్నాయి. కబడ్డీ మోటయింది. గోలీలు మూలనపడ్డాయి. దాగుడుమూతలు దగాకోరు ఆటగా ఎదిగింది. గ్రామీణ క్రీడల స్థానంలో క్రొత్త క్రీడలు వచ్చాయి. క్రికెట్, టేబుల్‌టెన్నిస్, గోల్ఫ్, స్నూకర్ తదితర పాశ్చాత్య ఆటలను ప్రస్తుతం అనుకరిస్తున్నారు. ప్రశాంత గ్రామీణ వాతావరణంలో ఆడాల్సిన క్రీడలను మరచిపోయి పాశ్చాత్య ఆటలను కొనసాగిస్తున్న గ్రామీణ ప్రజలు ఒకరినొకరి మధ్య ఎటువంటి ఐక్యత లేకుండా గడపాల్సిన దుస్థితి రోజురోజుకీ పెరుగుతుంది. ప్రభుత్వం గ్రామీణ క్రీడలు ప్రోత్సహించేందుకు గ్రామాల్లో క్రీడలు నిర్వహిస్తున్నప్పటీకి వాటికి గురించి ప్రజలను చైతన్య పరచడంలో విఫలమవుతుంది. ప్రతి పాఠశాలలో గ్రామీణ క్రీడలు విద్యార్ధులకు నేర్పించే విధంగా చర్యలు తీసుకొని, ఐకత్య వాతావారణం చోటు చేసుకునేలా ప్రయత్నించాలని క్రీడకారులు కోరుతున్నారు.

కోటీశ్వరుడైనా మంచి ఆరోగ్యం లేకపోతే గరీబే అన్నది నానుడి. ఆరోగ్యంతోనే జీవితం ముడిపడి ఉంది. చిన్ననాటి నుంచి క్రీడలు, వ్యాయామం, యోగా వంటివి అనుసరించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. నేటి రాకెట్‌ యుగంలో విద్యార్థులకు చదువులో పోటీ పడుతూ ఆరోగ్యాన్ని పెంచే ఆటలను విస్మరిస్తున్నారు. తరాలు మారాయి, అంతరాలు పెరిగాయి.. పల్లెటూళ్లు పట్నం వైపు పరుగులు ఆగడం లేదు.. ఆధునికతను సంతరించుకోవాడానికి చేస్తున్న ప్రయత్నంలో కంప్యూటర్లు, ఇంటర్‌నెట్లు, ముఖ పుస్తకం (ఫేస్‌బుక్‌), వాట్సాప్‌, టీవీలు చిన్నారుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నాయి. తాతయ్య, నానమ్మలు చెప్పిన నీతి కథలు, అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకున్న సంప్రదాయ ఆటలు క్రమంగా దూరమయ్యే పరిస్థితులు వచ్చాయి. మేధస్సును పెంచుతూ సత్ప్రవర్తనను పెంచే అలవాట్లను వదిలి సాంకేతిక సామగ్రితో కుస్తీ పడుతూ తెలియని ఒత్తిడికి గురవుతోంది నేటి బాల్యం.

**చరవాణుల్లో ఆటలు, రోజంతా పుస్తకాలతో కుస్తీ పడుతూ చిన్నారులు సృజనకు దూరమవుతున్నారు. అయితే ఇవన్నీ ఒకవైపు మాత్రమే. నాటి సంప్రదాయాలకు పల్లెలూ, పట్టణాల్లో కొంత ఆదరణ కనబడుతోంది. పల్లె నుంచి పట్నం వెళ్లి ఆధునికతకు అలవాటు పడినా సంస్కృతిని ప్రతిబింబించే ఆటలపై ఆసక్తి పెరుగుతోంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో ప్రతి వీధిలో క్రికెట్‌ బంతికి బదులు కర్రా బిళ్లా కనిపిస్తుంది. చెట్ల కిందకు చేరి కోతి కొమ్మచ్చి, ఇంట్లోనే కూర్చుని బొమ్మలతో ఆడే అష్టాచమ్మా, మేధస్సును పెంచే చదరంగం, గోళీలాట, దుకుడు, బాలికలు ఆడే తొక్కుడు బిళ్ల వంటి ఆటలు నేటికీ దర్శనమిస్తున్నాయి. పాఠశాలల్లో ఆరోగ్య విద్యను నేర్చుకున్న చిన్నారులు వేసవి, విశ్రాంతి సమయాల్లో ఆటలు ఆడటం వల్ల నాయకత్వ లక్షణాలు పెంచుకుంటున్నారు.

**‘దూకుడు’ ఆట

ఒకరిని ఒంగొని ఉంటే పరిగెత్తుకుని వచ్చి పైనుంచి దూకే ఆట ఇది. కోతి కొమ్మచ్చి-పల్లెల్లో ఈ ఆటను కాలు కింద కర్ర అని  పిలుస్తుంటారు. చెట్టు నీడన దీనిని ఆడటంతో పిల్లలు త్వరగా అలసిపోకుండా ఉంటారు. భళారే గోళీకాయలు

పల్లెల్లో నేటికీ ఎక్కువగా చిన్నారులు ఆడే ఆట గోళీలాట. పిల్లల నుంచి యువకుల వరకు ఈ ఆట అంటే ఇష్టపడతారు. గోళీని విసిరి గురి చూసి కొట్టి మరలా జాన దూరంలో గోళిని వేయాలి. లక్ష్యం మేరకు గురి చూసి కొట్టి విజేతగా నిలవడం ఈ ఆటలో ప్రత్యేకత. ఆనందాల అష్టాచెమ్మా..

ఇది 25 అడుగుల చతురస్రాకారపు  నలుగురు వ్యక్తులు  నాలుగు కాయలు పెట్టుకుంటారు. చింతగింజలు, గవ్వలతో గాని పందేలు వేస్తారు. ఒకటి నుంచి ఎనిమిది వరకు లెక్కిస్తారు. అష్ట పడితే 8, చెమ్మ పడితే నాలుగుగా గుర్తించి ఆడతారు. పడిన పందెం ప్రకారం కాయలను తామున్న గడి నుంచి ముందుకు కదుపుతారు. ఎవరి కాయలు ముందుగా మధ్య గడిలోకి చేరితే వారు గెలిచినట్లు. గిల్లీ దండా (గూటీబిళ్ల) ఓడిపోతే దండనే..

పాశ్చాత్య క్రీడ అయిన క్రికెట్‌ రాకముందే అనాదిగా గిల్లీ దండా (గూటీబిళ్ల) అందరికీ సుపరిచితమే. క్రికెట్‌ మాదిరిగా ఉండే ఈ ఆటలో కూడా పలు రకాలున్నాయి. ఎంతమందైనా ఆడే అవకాశం ఉంటుంది. ఒక జట్టు వారు కర్రను గోతిలో పెట్టి కొడతారు. కర్రను అలా కొడుతూ ప్రత్యర్థులను దొరక్కుండా కొనసాగిస్తారు. ఎక్కడైతే బిళ్లను కొట్టలేకపోతారో అపుడు వారు ఓడిపోయినట్లు గుర్తిస్తారు. అపుడు అవకాశం రెండో జట్టుకు వస్తుంది. మేధస్సును పెంచే చదరంగం

ఎత్తుకు పై ఎత్తు వేస్తూ మన సృజనాత్మకతను పెంపొందించే ఆట చదరంగం. కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మేధస్సుతో ఆడే ఈ ఆట అంటే చిన్నారులు ఎంతో ఇష్టపడతారు. చదరంగా బాగా ఆడేవాళ్లు చదువులోనూ ముందుంటారని పలువురు నిరూపిస్తున్నారు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం ఇందులో ప్రధానంగా ఉంటుంది. ఏనుగు, గుర్రం, శకుని, మంత్రి, రాజు, భటులు ఉంటారు. పావులు కదుపుతూ రాజుకు చెక్‌ చెప్పకుండా ఆడటమే ప్రధానం.

- సేకరణ ; కర్లపాలెం హనుమంతరావు

Tuesday, February 23, 2021

చిన్న వ్యాసం : ఆడవాళ్లూ ! ముందు మీరు మారండి! -కర్లపాలెం హనుమంతరావు




అశోకుడు తన సువిశాల సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసుకుని పరిపాలించిన సంగతి అందరికీ తెలిసిందే. దక్షిణ భాగంలోని ఆంధ్రరాష్ట్రానికి సువర్ణగిరి రాజధానిగా ఉండేది.  కాలానుగతంగా అది జొన్నగిరి అనే చిన్ని గ్రామంగా కుచించుకుపోయింది.
కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా గుత్తికి దగ్గర్లో ఉన్న ఈ జొన్నగిరికి చేయి దూరంలో   ఎఱ్ఱగుడి  రాతి బండల మీద అశోకుడు చెక్కించిన కొన్ని ధర్మలిపులు.. సుమారు రెండువేల రెండు వందల ఏళ్లపాటు ఎండకు ఎండుతూ , వానకు తడుస్తూ ఉండిపోయినవి.. భూగర్భ శాస్తజ్ఞుడు ఎస్. ఘోష్  ఖనిజాల వేటలో ఉండగా కాకతాళీయంగా బైటపడ్డాయి. పురాతత్వ శాస్త్రజ్ఞులు (దయారాం సహానీ, హరప్రసాద్ శాస్త్రి) ధృవపర్చిన మీదట 1929, జూన్ , 11 వ తేదీ నాటి పత్రికలలో అధికారికంగా ప్రకటింపబడ్డాయి. 
ప్రముఖ తెలుగు చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరు వేంకట రమణయ్యల పుణ్యమా అని అవి  ఎస్టాంపేజ్ పత్రాల రూపంలో గుట్టు చప్పుడుకాకుండా  చెన్నపట్నం చేరడం,  1929, సెప్టెంబర్ నాటి భారతిలో దొరికిన రెండు లఘురూపాలు, పథ్నాలుగు పెద్ద సైజు  ధర్మశాసనాల వివరాలు లోకం విశదంగా తెలుసుకోవడం సాధ్యమయింది.
ఆ శాసనాల మూలకంగా అశోకుడి కాలం నాటి రాజకీయ వ్యవస్థకు ఇప్పటి మన రాజకీయ  వ్యవస్థకు మధ్య కొన్ని పోలికలున్నట్లు అర్థమవుతుంది. పాటలీపుత్రం ప్రధాన రాజధానిగా ఉన్నప్పటికీ అశోకుడికీ  నాలుగు ప్రాంతీయ రాజధానులు విడివిడిగా ఉండడం, రాజధానిలోని రాచరిక వ్యవస్థ తీరునే ఉన్నట్లే, ఉపరాజధానుల్లోనూ ఉపరాచకీయ వ్యవస్థ ఉండటం గమనార్హం. ఉపరాజులు రాజుకు తోబుట్టువులయి ఉండాలనేది, తతిమ్మా పరిపాలనాంగాలు సైతం రాజబంధువుల కనుసైగలలో మాత్రమే నడవాలనే  నియమమూ ఉన్నట్లనిపిస్తోంది. ఈ ఉపరాజు కుటుంబీకులంతా రాష్ట్రీయులుగా ప్రసిద్ధులని శాసనాలు తెలియచేస్తున్నాయ్.

రాజధాని దారిలోనే ఉపరాజధానిలోనూ న్యాయవ్యవస్థ ఒకటి రజ్జుకులు, మహామాత్రలు, అంతమహామాత్రలు, ఉపమాత్రల ఆధ్వర్యంలో నడవడం గమనార్హం. ఇప్పటి మహిళా కమీషన్ తరహాలోనే అశోకుడి కాలంలో కూడా స్త్రీల కొరకు స్త్రీల చేత మాత్రమే నిర్వహింప బడే మహామాత్రలు ఉండటం చెప్పుకోదగ్గ మరో గొప్ప విశేషం.

అశోకుని ధర్మలిపుల వల్ల రెండువేల రెండు  వందల ఏళ్ల కిందట ఆంధ్రదేశంలోని స్త్రీల జీవన స్థితిగతులు ఏ విధంగా సాగాయో రేఖామాత్రంగా తెలుసుకునే అవకాశం లుగుతుంది. పదమూడో శిలా శాననం చెప్పిన విధంగా 'ఏదో ఒక మతమును అనుసరించని జనముండు దేశమే లేదు'. అన్న తీరులోనే నేటికీ లోకతంత్రం నడుస్తున్నది కదా!
శాసనాల వల్ల నాటికాలం సమాచారం ఆనవాలు పట్టడం సులభమవుతుంది. ఈ పై అనుశాసనాల వల్ల ఆ కాలంలో జంతుబలులు, జాతర్లు జరిగేవన్న విషయం సుస్పష్టం. తెలుగు సాహిత్యం  కూడా ఇదే విషయాన్నే నొక్కిచెబుతుంది. 'అంబోధరము క్రింద నసిమాడు/నైరావతియు బోలె సిడి ప్రేలె దెఱవయోర్తు' అంటూ తెనాలి రామకృష్ణకవి పాండురంగ మహాత్యం మూడో అశ్వాసం, డెబ్భైఏడో  పద్యంలో గంగజాతర్లలో స్త్రీలు పడే హింసాకాండ సమస్తాన్ని వళ్లు గగుర్పొడిచే రీతిలో వర్ణిస్తాడు. క్రీ.శ. 15 వ శతాబ్దంలో దక్షిణ హిందూ దేశంలో పర్యటించిన పోర్చుగీసు చరిత్ర కారుడు బర్బోసా కూడా గ్రామదేవతల కొలువులలో జరిగే హింసను విశదంగా వర్ణిస్తూ 'ఈ దేశంలోని స్త్రీలు దైవారాధన దగ్గర ఎంతటి ఆత్మహింసకైనా తెగించడం విచిత్రం' అని రాసుకొచ్చాడు. తాను ఇష్టపడ్డ ప్రియుడు తననూ ఇష్టపడే విధంగా మనసు మార్చే శక్తి స్త్రీ దేవతలకు ఉంటుందన్న నమ్మకం .. స్త్రీలను ఈ తరహా దుస్సాహసాలకు పురిగొల్పుతుదన్నది మనస్తత్వవేత్తసిద్ధాంతం.
చిన్న ముల్లు  వంట్లో దిగినా ఓపలేని సుకుమారి సైతం సిడి ఉత్సవాల నెపంతో వంటి రక్తాన్ని  సిడి మాను(పెద్ద స్తంభం)కి కట్టిన ఏతం లాంటి వాసం ఇనుప కొక్కెం గాలాన్ని వీపుకు తగిలించుకుని గాలిలో గుండ్రంగా తిరగుతూ గొప్ప ఆత్మానుభూతి పొందడాన్ని ఏ విధంగా చూడాలి మనం? ఈ విధమైన హింసాకాండకు ఆ కాలంలో   అమితాదరణ ఉండబట్టే  అహింసా మూర్తి అశోక చక్రవర్తి మొదటి శిలాశాసనంలోనే
'ఇచ్చట ఏ సజీవ ప్రాణిని బలి ఇవ్వకూడదు'
'ఇచ్చట ఏ విధమయిన వేడుక సమూహము కూడా నిషేదిద్ధము'
'అట్టి సమావేశము వలన హాని కలుగునని దేవానాం ప్రియుని అభిప్రాయం' అంటూ మూడు ఆదేశాలు  జారీచేసివుంటాడు .
శాసించిన మాత్రాన జనం పాటించేదుంటే  పరిస్థితులు ఇప్పటంత అధ్వాన్నంగా ఎందుకుంటాయి? జాతి తన పాటికి తాను  తన ఆచారవ్యవహారాలను  కొనసాగిస్తూనే ఉంటుంది. నోములూ, వ్రతాలూ చేసుకోవడం, ఇంట్లో అనారోగ్యాలు కలిగితే మొక్కుకోవడం, కోరిన కోరికలు తీర్చమని ఇష్టదైవాలకు మొక్కుబళ్లతో ఆశపెట్టడం వంటివన్నీ మానసిక భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు. ఎంత మహాచక్రవర్తయినా   మనసులను అదుపు చేయలేడు. కాబట్టే అశోకుని 9వ శిలాశానసంలో
1.   దేవానాం ప్రియుడు ఈ విధముగా దెల్పెను.
2.  జనులు అనారోగ్యముగా ఉన్నప్పుడు, గృహములందు వివాహాది శుభకార్యములు జరుగుచున్నప్పుడు మంగళ ప్రధానమయిన క్రతువులు చేయుచుందురు.
3.  ఆయా సందర్భాలలో శుభాకాంక్షులై పుణ్యకార్యములు చేయుట కూడా కలదు.
4. అందు ముఖ్యముగా స్త్రీలు నిరుపయోగమైనట్టి, అర్థరహితమైనట్టి పనులెన్నో చేయుటయు కలదు.
5.   శుభప్రదమయిన కార్యములను తప్పక చేయవలసినదే.
6.  కానీ సాధారణముగ మనము చేయు కార్యములు తగినంత ప్రయోజనకరములు కావు.  - అని చెప్పడం జరిగింది.

అశోకుడు రెండున్నర సహస్రాబ్దాల కిందట చెప్పిన మాటలు అక్షరాలా ఇప్పటికీ వర్తిస్తాయి. అశోకుడి కాలమేం ఖర్మ, అధర్వణకాలంలోనూ ఈ మంత్ర తంత్రాలు, యజ్ఞయాగాదులు దండిగా ఉన్నాయి. ఆ వేదానికి అనుబంధంగా ఉండే సర్పవేదం, పిశాచవేదం, అసురవేదం.. వగైరాలు మనిషిలోని భయాలను, ఎదుర్కొనే ప్రమాదాలను,  వాటికి  తగిన  విరుగుళ్లను తెలియచేస్తాయి. జ్వరం, పరుస జ్వరం, పసరికలు, అజీర్ణం, జలోచరం, కుష్టు, వ్రణాలు, పురుగులు పడడం, పశురోగాలు, విషప్రయోగాలు.. ఇత్యాదుల నివారణకు అధర్వణ వేదంలో మంత్రాలు కనపడ్డమే ఇందుకు ఉదాహరణ.

ఆరోగ్యం నిర్లక్ష్యం చేసే అంశం కాదన్న మాట అక్షరాల వేదం చెప్పే పన్నాకి సమానమైన సుభాషితమే. రోగ నిరోధానికి, వస్తే.. గిస్తే నిదానికి, శాశ్వత నివారణకు ఏ తంత్రమో, మంత్రమో శాస్త్రీయంగా (ప్రయోగ ఫలితం మీద) ఆచరించి తీరవలసిందే. ఔషధాల మీద నిషేధాలను ఎవరూ కోరుకోరు.  పెళ్లిళ్లు, పురుళ్లు వంటి శుభకార్యాలకు ఉత్సవాలు వద్దనడాన్ని ససేమిరా ఒప్పుకోరు.  అయితే, అన్నీ పద్ధతి ప్రకారం  చేసుకోవాలనుకుంటే,  ఏడాది మొత్తం ప్రతీ రోజూ     వ్రతం నిర్వహించుకునే విధంగా మన సంప్రదాయాలలో మన పూర్వీకులు. ఏదో ఒక ఏర్పాటు చేసిపెట్టారు  అవన్నీ తు.చ తప్పకుండా ఆచరించడం ఈ కలికాలం, కరవుకాలం, ఏ రోజుకారోజు కడుపు నింపుకునేందుకు బతుకు తెరువు కోసం వెదుకులాడుకునే కాలంలో ఎంత వరకు ఆచరణ సాధ్యం?!
సంప్రదాయం మీద వీరాభిమానానికి తోడు, హేతువుకు అందని ఆలోచనలు సహజంగానే అధికంగా ఉండే స్గ్త్రీల చిత్త ప్రవృత్తి వల్ల  సమయం అధికంగా నిరుపయగమవుతుందనేదే ఆనాటి  అశోకుడి నుంచి నేటి అభ్యుదయవాదుల వరకు అందరి    ప్రధాన బాధ,

వీరేశలింగంగారి మాటలే మరో సారి మననం చేసుకోదగ్గ  మంచి సందర్భం ఇది. ఆ కాలమందెల్లవారికిని దయ్యములయందలి విశ్వాసములు అధికముగా నుండెను. స్త్రీలలో నొకప్పుడును దయ్యము పట్టని వారెక్కడనో గాని లేక యుండిరి. ఎవ్వరికే వ్యాధి వచ్చినను  వైద్యుని ఇంటికి మారుగా ముందుగా భూతవైద్యుని ఇంటికో, సోది చెప్పువాని ఇంటికో  పరుగెత్తుచుండిరి'
 
అధర్వణవేదం కాలంలో కానీయండి, అశోకుని కాలంలో కానీయండి, తెనాలి రామకృష్ణకవి కాలంలో కానీయండి, వీరేశలింగంపంతులుగారి కాలంలో కానీయండి.. స్త్రీలందరూ ఒకే విధంగా ఉన్నారా?  అధునాతున కాలం ఇదని గొప్పలు పోతున్నాం.. పోనీ ఇప్పుడైనా  వందకు వంద శాతం స్త్రీలు మార్పు చెందారా?మారారంటున్న  ఆ కొందరిలో అయినా నూటికి నూరు శాతం  మార్పు వచ్చిందా?
నాటి  తెలుగునగరం సువర్ణగిరి దగ్గర రెండువేల రెండు వందల సంవత్సరాల కిందట 'స్త్రీలు  నిరుపయోగకరమైనట్టిఅర్థరహితమైనట్టి పనులెన్నో చేయుట కలదు' అని అశోకుడు వేయించిన శిలాశాసనంలో అక్షరాలే శిలాశాసనాలై మిగులుతాయా?'అన్న ప్రశ్న వచ్చినప్పుడు..
వ్యవస్థ మారితే తప్ప స్త్రీల దురవస్థ మారదు. స్త్రీలు మారిపురుషులను మారిస్తే  తప్ప వ్యవస్థ అవస్థలో ఏ మంచి మార్పూ సాధ్యం కాదు.. అని సమాధానం చెప్పుకోక తప్పదు  .. ఎవరెంత నొచ్చుకున్నప్పటికీ!

            ***
        - కర్లపాలెం హనుమంతారావు
(సారంగ అంతర్జాల పక్షపత్రికలో ప్రచురితం)





Monday, February 22, 2021

(ఈనాడు ఆదివారం అనుబంధం, 1, డిసెంబర్ 2002 ప్రశకునం -కథానిక -కర్లపాలెం హనుమంతరావు-చురితం)

 

 



పున్నారావు చచ్చిపోయాడన్న వార్త చెవినబడగానే 
 కొంత మంది
'అయ్యో' అన్నారు. కొంతమంది 'అమ్మయ్య!' అనుకున్నారు. 'అయ్యో'.. ' కు అమ్మయ్య' కు మధ్యనే మనిషి సాధించుకునే కీర్తి ప్రతిష్ఠలంతా. 

పున్నారావు ఒక ముఖ్యమైన గవర్నమెంటు ఆఫీసులో అతి ముఖ్యమైన సీటులో చాలా ఏళ్ల బట్టి పనిచేస్తున్న ప్రజాసేవకుడు. గవర్నమెంటాఫీసంటున్నావు!.. పనిచేస్తున్నాడంటున్నావు.. ప్రజాసేవకుడంటున్నావు! .. ఇదెలా సాధ్యమయ్యా పెద్దమనిషీ! అని  గద్దిస్తారని తెలుసు. ఎంత ప్రభుత్వ కార్యాలయమైనా ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు.. ముత్తెమంత దస్త్రమయినా ముందుకూ వెనక్కూ కదిలించకపోతే ప్రభుత్వపాలన ఎట్లా నడిచినట్లు లెక్కా? అట్లా 'పని' చేసే వర్గం ప్రజాసేవకుడు కాబట్టే పున్నారావు పోయిన వార్త విన్న వెంటనే 'అయ్యో' అని కొంత మంది 'ప్రజలు' కంగారుపడింది. ఆఫీసు పనికి అతగాడు కుదిర్చిన రేటు అఫర్డ్ చేసుకునే శక్తిలేని దద్దమ్మలేమైనా 'అమ్మయ్య' అనుకోనుండవచ్చు. ఈ కథకు వాళ్లతో కాకుండా 'అమ్మయ్య' వర్గంతోనే ప్రసక్తం.ఆ 'అమ్మయ్య' అనుకున్న వర్గంలో ఇంకో రకం కూడా ఉన్నారు. వాళ్లను గురించే ఈ కథంతా!

***

యమధర్మరాజుగారు విగత జీవుల పాపపుణ్యాల లెక్కలను బేరీజు వేసుకుని  ఆత్మలకు స్వర్గమో, నరకమో మంజూరు చేస్తారన్న విశేషం అందరికీ తెలిసిందే! కాకపోతే ఈ మధ్యకాలంలో పాపుల సంఖ్య పగిలిన  పుట్టలోని చీమలకు మల్లే  పెరిగి పెరిగి నరకం నరకం కన్నా హీనంగా తయారైంది. పుణ్యాత్మల సంఖ్య మరీ పలచనయిపోయి వంద మంది పట్టే పుష్పక విమానం కూడా తొంభై తొమ్మిది మంది నిండేందుకే వందలొందల ఏళ్లు తీసుకుంటుంది. విమానం పూర్తిగా నిండితే తప్ప అది గాలిలోకి ఎగిరే ఏర్పాటు లేదు. ఎక్కువ మందిని ఒకే ట్రిప్పుల్లో తొక్కి స్వర్గానికి తోసేయకుండా విశ్వకర్మ చేసిన కొత్త ఏర్పాటది.  ఎంత మందెక్కినా ఇంకొకరికి అవకాశం ఉండే పాతకాలం ఏర్పాటు విమర్శల పాలవడం చేత విశ్వకర్మ కొత్త మోడల్ పుష్పకంలో త్రిమూర్తుల సలహా మీద ఈ తరహా ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడీ కొత్త పద్ధతే పుణ్యాత్మల ప్రాణానికి సంకటం మారిన పరిస్థితి! మన్వంతరాల తరబడి విమానం ఎప్పుడు నిండుతుందా? అని కళ్లు చిల్లులు పడేటట్లు.. ఎక్కి కూర్చున్న పుణ్యాత్మలు ఎదురుచూడడమంటే.. మాటలా మరి! కాళ్లు పీక్కు పోయేటట్లు విమానంలోనే పడుంటం కన్నా నరకం మరేముంటుంది! 'స్వర్గం పీడాబాయిరి! తెలీక పుణ్యం చేసి చచ్చాం!' - అంటూ తలలు మోదుకునే ఆత్మలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి చిక్కుపోయిన విమానంలో.

ఆత్మల ఘోష విని తట్టుకోలేక అక్కడికీ పాపాల చిట్టాలో నుంచి చాలా అఘాయిత్యాలను కొట్టిపారేయించారు యమధర్మరాజుగారు. ఇదివరకు పద్ధతుల్లోనే చాదస్తంగా పాపులను నిర్ధారిస్తు కూర్చుంటే  నరకం నడవడం ఎంత కష్టమో అనుభవం మీదట గానీ తెలిసిరాలేదు పాపం.. సమవర్తిగారికి. ఏదో  విధంగా అయినా వందో పుణ్యాత్మ దొరక్కపోతుందా అని ఆయన ఆశ. 

అందుకే ఇద్దరు పెళ్లాలుండటం ఇది వరకు లెక్క ప్రకారం మహానేరం. ఇప్పుడు.. ఆ ఇద్దర్నీ చక్కగా చూసుకుంటే పుణ్యాత్ముడి కిందే లెక్క. అబద్ధాలాడడం గతంలో పెద్ద శిక్షకు ప్రథమ దండన. ఇప్పుడు వంద కాదు.. అవసరమైతే అంశాల వారీగా  అవసరాన్ని బట్టి వెయ్యి వరకు హాయిగా ఎన్ని అసత్యాలైనా అలౌడ్. మరీ అవసరమయితే అసలు అసత్యమనేదే శిక్షార్హమైన నేరమేమీ కాదనే ఆలోచన చేసే ప్రతిపాదనా ఆలోచనలో ఉంది. సరుకుల్ని కల్తీ చెయ్యడం, శాల్తీలను మాయం చేసేయడంలాంటి పాపాలు చేసే కిరాతకులు గుడి కెళ్లి హూండీలో ఓ పదో పరకో  పడేసొస్తే చాలు.. పాప విముక్తులయే కొత్త శాసనం ఒకటి  జారీ అయివుంది. దొంగనోట్లు ముద్రించేవాళ్లూ, చెలామణీలో పెట్టేవాళ్లు ద్రవ్యోల్బణం  ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడుతున్న పుణ్యాత్ముల కింద స్వర్గానికి వెళ్లే అర్హులలో ప్రత్యేక కోటాగా  ట్రీట్ చెయ్యబడుతున్నారీ మధ్య కాలంలో!  ప్రశ్నపత్రాలు లీక్ చేయించడం, దొంగ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలిప్పించడం, మారుపేర్లతో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి విదేశాలకు తరలించేసెయ్యడం లాంటి అమానుష కార్యాలన్ని ఇప్పుడు విశ్వకళ్యాణార్థం నడుం బిగించి చేసే ప్రజాసేవ పద్దు లోకే మారిపోయాయి.

పున్నారావు పైసల కోసం కక్కుర్తి పడితే పడ్డాడు కానీ, ఒప్పుకున్న పనిని సాధ్యమైనంత నిజాయితీతో పూర్తిచేయడంలో నిబద్ధత పాటించే మనిషి. ఫేక్ స్కాలర్ షిప్పులు సృష్టించి ఎంతో మందిని ఆదుకున్నాడు. సర్కారు భూముల కూపీలు లాగి వాటిని తగు మొత్తంలో ప్రయివేట్ పార్టీలకు అప్పచెప్పాడు. చేసే ఏ పనిలో అయినా పిసరంత ప్రజాకళ్యాణం తొంగిచూస్తుండటంతో ఫోర్సులో ఉన్న రూల్సు ప్రకారం పున్నారావు కచ్చితంగా 'పుణ్యాత్మ' కేటగిరీలోకే రావడం న్యాయం. అందుకే పున్నారావు చచ్చిపోయాడన్న కబురు చెవినబడగానే పుష్పక విమానంలోని పుణ్యాత్మలన్నీ ముక్తకంఠంతో 'అమ్మయ్య' అనుకున్నాయి. మన్వంతరాల తరబడి విమానంలో  దిగబడిపోయిన పుణ్యాత్మలంతా ఇహనైనా తమకు విమాన విమోచనం ప్రాప్తించబోతున్నందుకు పరమానందంతో గంతులేశాయి.

***

పున్నారావు యమధర్మరాజుగారి ముందుకు రాగానే చిత్రగుప్తుడు చిట్టా తీశాడు. పై నుంచి కిందికి పుట నంతా భూతద్దాల కింద నుంచి ఒకటికి రెండుసార్లు పరిశీలించి తృప్తిగా తల ఆడించి 'ప్రభూ! ఇతగాడిని నిస్సందేహంగా పుష్పక విమానం ఎక్కించేయచ్చు. చిత్తగింజండి!' అంటూ పుట నొక్క సారి ప్రభువులవారికి అందించారు.

యమధర్మరాజులూ ఎంతో రిలీఫ్ ఫీలయ్యారు. చివరాఖరుకు 'వందో పుణ్యాత్మ' లభించినందుకు ఆయనకు అపరిమితమైన ఆనందం కలిగింది. విమానంలోని పుణ్యాత్మలూ తృప్తిగా సర్దుకుని కూర్చుని ప్రయాణానికి సంసిద్ధమైపోయాయి. పున్నారావు పెట్టే బేడా సర్దుకుని (కొత్త నిబందనల ప్రకారం భూలోకంలో కూడబెట్టిన ఆస్తిపాస్తుల్లో ఒక శాతం వెంట తెచ్చుకునే కొత్త సౌకర్యం ఆత్మలకిప్పుడు దఖలు పడింది) గర్వంగా విమానం వేపుకేసి బైలుదేరేందుకు సిద్ధమయాడు. పైలెట్ కింకరుడు కాక్ పిట్ లో కూర్చుని చివరి నిమిషం ఏర్పాట్లవీ పూర్తిచేశాడు. ఇంజన్ స్టార్ట్ చేసి ఇహ యమధర్మరాజుగారి ఆఖరి మౌఖిక ఆదేశమొక్కటే తరువాయ  అన్నట్లు సన్నివేశం క్లైమాక్సు కొచ్చిన సందట్లో...

***

'మ్యావ్ఁ' మంటూ అరుస్తో ఎక్కడి నుంచొచ్చిందో.. ఓ గండు పిల్లి పున్నారావు ఆత్మ గుండు మీద  కొచ్చిపడింది అకస్మాత్తుగా. పిల్లి మీద పడగానే పున్నారావు గుండె గతుక్కుమంది. ఉద్రేకమాపుకోలేకపోయాడు. పక్కనే ఉన్న కింకరుడి చేతిలోని ఈటె లాక్కుని పిల్లి వెంటపడ్డాడు. పిల్లి అంటే పున్నారావుకు అంతలావు అసహ్యం.. జుగుప్స!

'ఎక్కడికైనా బయలుదేరినప్పుడు పిల్లి గాని ఎదురయితే ఆ పని ఇంకావేళ  దుంపనాశనమయినట్లే లెక్క' అంటూ చిన్నప్పటి బట్టి ఆయన నాయనమ్మ నూరి పోసిన ఉద్బోధ ఫలితం! పెద్దయిన తరువాత కూడా ఆ ప్రభావం జిడ్డు అతగాడిని అంబాజీపేట ఆవదంలా వదిలిపెట్టింది కాదు. చచ్చి పైకొచ్చిన తరువాతా అతగాడి ఆత్మను 'పిల్లి ఫోబియా' వదిలిపెట్టలేదనడానికి .. ఇదిగో ఇప్పుడు పున్నారావు ప్రదర్శించే విచిత్రమైన మనస్తత్వమే ప్రత్యక్ష సాక్ష్యం.

శరీరాన్ని వదిలి వేసిన ఆత్మకు ఏ వికారాలు ఉండవంటారు. మరి  పున్నారావు ప్రవర్తనకు అర్థమేంటి?

యమధర్మరాజుగారికి మతిపోయినట్లయిందీ సంఘటన చూసి. 'మధ్యలో ఈ మార్జాల పితలాటకం ఏమిటి మహాశయా?' అన్నట్లు చిత్రగుప్తుల వైపు గుడ్లురిమి చూశారు యమధర్మరాజుగారు.

చిత్రగుప్తుడూ యమ కంగారుతో గబగబా చిట్టా తిరగేశాడు. 'చిత్రం మహాప్రభో! ఈ పిల్లి కూడా చచ్చి ఇక్కడి కొచ్చిన మరో ఆత్మే! పున్నారావు తరువాత విచారించవలసిందీ ఆత్మనే. పిలవక ముందే ఎందుకు హాజరయిందో మరి.. అర్థమవడం లేదు!'అన్నాడు మిణుకు మిణుకు చూస్తూ. పిల్లి వైపు గుడ్లెర్రచేసి చూశారు యమధర్మరాజు.

'క్షమించండి మహాప్రభో! మీ సమక్షంలోనే న్యాయానికి ఘోర పరాజయం జరుగుతుంటే చూస్తూ గమ్మునండలేకపోయాను. తొందరపడక తప్పిందికాదు'  మ్యావ్( అంది పిల్లి పిల్లిభాషలో. యమధర్మరాజులవారికి అన్ని భాషలూ కరతలామలకం. కనక ఇబ్బంది లేకపోయింది. 'వివరంగా చెప్పు' అని ఉరిమిచూశారాయన.


పిల్లి తన గోడు చెప్పుకోడం మొదలుపెట్టింది. 'రోజూ లాగే ఆ రోజూ నేను పెందలాడే  నిద్ర లేచి ఎలుకల వేటకని బైలుదేరాను మహాప్రభో! వాకిట్లోనే ఈ పున్నారావు మహాశయుడు ఎదురయ్యాడు. 'చచ్చాంరా! ఇవాళేదో మూడింది నాకు.' అని భయపడ్డాను. పొద్దున్నే లేచి ఈ పున్నారావులాంటి త్రాష్టులను చూస్తే మన కారోజు అన్నీ కష్టాలే!' అని మా అమ్మ చెప్పేది నాకు. ముందు నేను నమ్మలేదు, కానీ, రెండు మూడు దృష్టాంతాల తరువాత నమ్మక తప్పింది కాదు. ఈ మహానుభావుడు ఎదురయిన రోజున నాకు సరయిన ఆహారమైనా దొరికేది కాదు. లేకపోతే కుక్కల బారినన్నా పడేదాన్ని ఖాయంగా. అందుకని వీలయినంత వరకు ఈ పెద్దమనిషి ఎదురు అవకుండా తప్పించుకుని తిరిగడం అభ్యాసం చేసుకున్నాను. కానీ, ఆ రోజు నా ఖర్మ కాలింది. ఒక పొగరుబోతు ఎలుక వెంటబడిపోతూ  పొరపాటున ఈ మనిషికి ఎదురొచ్చేశాను.

వెనక్కు తిరిగి వెళ్లిపొదామనుకునే లోపలే నా వెన్ను మీద ఇంత పెద్ద ఇనుపరాడ్ తో బాదాడు ఈ కిరాతకుడు.   అది తగలరాని చోట తగిలి చాలా రోజులు విలవిలాకొట్టుకుంటూ .. చివరకు.. ఇదిగో  ఇప్పటికి ఇక్కడ  ఇలా తేలాను.. తమ సమ్ముఖంలో విచారణ ఎదుర్కోవడానికి. చూశారుగా! తమరి  సమక్షంలోనే ఈ రాక్షసుడు ఎంత అమానుషంగా ప్రవర్తించాడో! అభం శుభం తెలియని నన్ను, నా మానాన నా పనేదో నేను చేసుకుపోయే జంతువును.. నిష్కారణంగా నిర్దయగా చంపిన పున్నారావును ఎక్కడ పుణ్యాత్మ కింద లెక్కేసి విమానం ఎక్కించేస్తారో అన్న  కంగారులో ఆవేశపడి మీ ముందుకు దూకేశాను. క్షమించండి!' అని మ్యావ్ మంది పిల్లి.

యమధర్మరాజుగారు ఆలోచనలో పడ్డారు.

పుష్పకవిమానం ఇంజన్ రొద పెడుతోందవతల. ఆపమన్నాడాయన.  ఒకసారి స్వర్గం ల్యాండ్ టచ్ చేస్తే గానీ ఈ ఇంజన్ ఇక ఆగదు మహాప్రభో! ఇదీ ఈ విమానం లేటెస్ట్ మోడల్ ప్రత్యేకత' అంటూ తన నిస్సహాయతను  వెల్లడించాడా పుష్పకం నడపాల్సిన పైలెట్ కింకరుడు. వందో సీటు నిండితే గాని వాయువాహనానికి ఎగిరే యోగం లేదు. చూస్తూ చూస్తూ పున్నారావును విమానం ఎక్కించ  బుద్ధేయడంలేదు దర్మవర్తికి. పిల్లి కథ విన్న తరువాత ఆయన మనసు పూర్తిగా మళ్లిపోయింది.

'ఇప్పుడేంటి దారి మరి?' అన్నట్లు చిత్రగుప్తుడి దిక్కు మిణుకు మిణుకు చూశారాయన.

'నిందితుడి తరుఫు వాదనా విందాం మహాప్రభో! అదే న్యాయం కదా మన రాజ్యాంగం ప్రకరాం!' అని విన్నవించుకున్నాడు చిత్రగుప్తుడు.

పున్నారావు పిల్లి చెప్పిన ఉదంతం  మననం చేసుకునే ప్రయత్నం చేశాడు.

ఆ రోజూ ఎప్పటిలానే తాను ఆఫీసుకు బైలుదేరుతున్నాడు. ఈ దిక్కుమాలిన పిల్లే కాబోలు నా పనంతా సర్వనాశనం చేసేందుకు ఆ రోజు నాకు ఎదురుగా తయారైంది. బామ్మ చెప్పినట్లే ఇంటి నుంచి బైలుదేరినప్పుడు పిల్లి గాని ఎదురయిన రోజున పనులన్నీ సర్వనాశనమవడం ఖాయం. మూఢ నమ్మకం కింద కొట్టిపారేసేందుకు లేదు. ఒక సారైతే సరే.. ప్రతీ సారీ  పిల్లి శకునం నిజం కావడంతో పిల్లి భయం నుంచి బైటపడలేకపోయాడు తను.

ఆ రోజు ఆఫీసులో తనకు ఒక పెద్ద పార్టీతో ఫైనల్ డీలింగ్ ఉంది. దాదాపు లక్ష రూపాయల వ్యవహారం. సవ్యంగా సాగితే ముడుపు చెల్లిస్తానని దేవుడిక్కూడా మొక్కుకుని మంచి ముహూర్తం చూసుకుని ఇల్లు దాటి కాలు బైటపెట్టాడు తను.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి గడప దాటి కాలు బైటపెట్టేవేళకు ఎక్కడ నుంచి తగలడిందో.. ఈ శనిగ్రహం పిల్లి సరిగ్గా గుమ్మం ముందు నిలబడి మిర్రి మిర్రి చూస్తోంది తన వంకే. కోపం పట్టపగ్గాలు తెంచుకోదా మరి ఎంతటి శాంతపరుడికైనా అట్లాంటి క్షణాలలో! అందుకే అందుబాటులో ఉన్న ఇనప రాడ్ తో వెనక్కి తిరిగి అది వెళ్లిపోతున్నా కసి ఆపుకోలేక దాని నడ్డి  మీద శక్తినంతా కూడదీసుకుని ఒకట్రెండు గట్టిగా వడ్డించుకున్నది.  ఆ దెబ్బలకే ఇది చచ్చి ఇక్కడకు వచ్చి విచారణ కోసమై ఎదురుచూస్తున్నదన్న విషయం తనకెలా తెలుస్తుంది? ఎప్పుడో మర్చిపోయిన సిల్లీ పిల్లీ ఇన్సిడెంట్  ఇది. సరిగ్గా విచారణ పూర్తయి  స్వర్గానికి వెళ్లే పుష్పకం ఎక్కేందుకు పర్మిషన్ వచ్చే చివరి క్షణంలో ఇట్లా వెనక నుంచి వచ్చి హఠాత్తుగా మీద తన మీద పడేసరికి యమధర్మారాజుగారి ముందే మళ్లీ తన పాత ప్రవర్తన బైటపెట్టుకున్నాడు! పిల్లి రంగ ప్రవేశంతో ఇక్కడా మళ్లీ ఎప్పటిలానే పని సర్వనాశనం!. ఇహ తనకు స్వర్గలోక ప్రాప్తి హుళక్కి- అన్న విషయం అర్థమయిపోయింది పున్నారావుకు. మాటా మమ్తీ లేకుండా నిలబడిపోయాడు దర్మరాజుగారి సమక్షంలో.

రెండు నిమిషాలు గడచినా పున్నారావు నుంచి తగిన సంజాయిషీ రాకపోయేసరికి మౌనం అర్థాంగీకారంగా తీసేసుకున్నారు యమధర్మరాజుగారు.

'చుస్తూ చూస్తూ ఒక కిరాతకుడిని స్వర్గానికి పంపించడం ఎట్లా? పైలట్ అవతల ఒహటే గత్తర పెట్టేస్తున్నాడు. ఇంజను ఆపటం దానిని పుట్టించిన విశ్వకర్మ తరమే కానప్పుడు ఇహ కేవలం ధర్మాధర్మ విచక్షణాధికారాలు మాత్రమే కలిగిన తన వల్ల ఎలా అవుతుంది? వందో పుణ్యాత్మను గాలించి పట్టుకునే దాకా ఈ రొద ఇలాగే సాగితే త్రిమూర్తులకు తను ఏమని సమాధానం చెప్పుకోవాలి? విమానంలోని ఆత్మలు పెట్టే ఘోషకు పిచ్చెత్తిపోయేటట్లుంది అంత లావు ధర్మమూర్తికి కూడా!

ఇన్ని యుగాల విధినిర్వహణలో ఇంత ధర్మసంకటం ఎన్నడూ ఎదురయింది కాదు! దిగాలుగా ఆయన సింహాసనానికి అతుక్కుపోయి కూర్చోనుండగా.. వందో పుణ్యాత్మ కోసమై చిత్రగుప్తులవారు చిట్టా మొత్తం తెగ  గాలించేస్తున్నారు మహా అయాసపడిపోతూ.

అయిదు నిమిషాల పాటు ఆ మహాగ్రంథాన్ని అటూ ఇటూ తిరగేసి ఆఖరులో 'హుర్రేఁ!'అంటూ ఓ వెర్రి కేక వేసేశారు చిత్రగుప్తులు.

నివ్వెరపోయి చూస్తున్న ప్రభువులవారి ముందు అమాంతం ఆ గ్రంథరాజాన్ని అలాగే ఎత్తి ముందు పెట్టి ఓ పుట వేలుతో చూపించారు.

అదీ పున్నారావు పాపపుణ్యాల పేజీనే!

ఒక్క క్షణం పాటు దాని వంక ఆసాంతం పరికించి చిరునవ్వుతో మార్జాలం వంక తిరిగి 'మార్జాలమా! ఎగిరివెళ్ళి వెంటనే ఆ విమానంలో కూర్చోమని మా ఆజ్ఞ!' అని ఆదేశించారు యమధర్మరాజు.

మ్యావ్ మంటూ పిల్లి విమానంలోకి గెంతటం, మరుక్షణంలోనే పుష్పకమూ గాలిలోకి లేవడమూ  జరిగిపోయాయి! పుణ్యాత్మలంతా సంతోషంతో కేరింతలు కొడుతుండగా పుష్పక విమానం స్వర్గధామం వైపు దూసుకుపోయింది.

కనుమరుగయిపోయిన విమానం వంక చూస్తూ పున్నారావు ఖిన్నుడయాడు. తనకు దక్కవలసిన స్వర్గవాసం చివరి నిముషంలో పిల్లి కొట్టేసింది. అయినా.. తన పాపపుణ్యాల పేజీ చూసి పిల్లి పుణ్యాన్ని నిర్దారించడం ఏమిటి? .. వింతగా ఉంది!

'యుగాలబట్టీ సమవర్తిగా కీర్తి గడించిన యమధర్మరాజులవారు నా విషయంలో సవ్యమైన తీర్పు చెప్పలేదనిపిస్తోంది!' అంటూ ప్రొటెస్టుకు దిగాడు పున్నారావు.

'మానవా! ఇది మీ భూలోకం కాదు. ఇక్కడ నీవు పనిచేసిన ప్రభుత్వాఫీసులలో మాదిరి అపసవ్యంగా  పనులు సాగవు. ఇది యమధర్మరాజులవారి న్యాయస్థానం. న్యాయం ఏ మూలన పిసరంతున్నా పసిగట్టి దానికి ధర్మం చేయడమే యుగాలుగా మేం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ధర్మకార్యం' అన్నాడు చిత్రగుప్తులవారు సమవర్తి తరుఫున వకాల్తా పుచ్చుకుని.

'నాకు దక్కవలసిన స్వర్గం సీటును బోడి పిల్లికి ఎందుకు ధారాదత్తం చేసినట్లు వివరం సెలవిప్పించగలరా?' తెగించి అడిగాడు పున్నారావు.

'నువ్వు నిందవేసినట్లు ఇది 'బోడి'పిల్లి కాదు పున్నారావ్! నీ మర్యాద మంట కలవకుండా ఎంతో కాలంగా నిన్ను కాపాడిన నీ ఇంటి దేవత' అన్నాడు చిత్రగుప్తుడు

'అదెలాగా?!' ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టడం పున్నారావు వంతయిందిప్పుడు.

'ఆ రోజు నువ్వు ఆఫీసుకు బైలుదేరిపోతున్నప్పుడు ఎదురైందన్న కోపంతో పిల్లిని చావగొట్టటం ఒక్కటే కాదు.. మరో ఘనకార్యం కూడా చేశావు. నీకు గుర్తుందా?'

'లేకేం! ఇహ ఆ రోజు పని తలపెడితే దుంపనాశనం అవుతుందన్న భయంతో ఆఫీసుకు డుమ్మా కొట్టి ఇంటి పట్టున ముసుగేసుకు పడుకుండిపోయాను. అయితే..'

 'అ రోజే  సిబిఐ వాళ్లు నీవు పని చేసే ఆఫీసు మీద దాడి చేశారు పున్నారావ్! నువ్వు గాని సీటులో ఉండుంటే ఏమయివుండేదో తెలుసుగా? నీ  పార్టీతో నువ్వు కుదుర్చుకున్న బేరసారాల భారీ మనీతో సహా నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడుండేవాడివి. మీ నాయన చేసిన ఇట్లాంటి పరువుతక్కువ పనికే మీ అమ్మ నీ చిన్నతనంలో చెరువులో పడి ప్రాణాలు తీసుకుంది. నీ భార్యకూ అలాగే ఏ గ్యాస్ సిలెండర్ గతో పట్టించకుండా  'పిల్లి మీద నీకు ఉండే పనికిమాలిన మూఢనమ్మకంనిన్ను కాపాడిందయ్యా పున్నారావ్!

 నీ పసిబిడ్డలు తల్లిలేని బిడ్దలుగా జీవితాంతం బాధలు పడకుండా కాపాడిన పిల్లి పుణ్యాత్మురాలా? ఉత్తి పుణ్యానికి ఒక జంతువును పొట్టన పెట్టుకుని ఎన్నో పిల్లిపిల్లలను తల్లిలేని పిల్లలుగా మార్చిన నువ్వు పుణ్యాత్ముడివా? .. ఇప్పుడు చెప్పు! ఎవరికి పుష్పకంలో ఎక్కే అధికారం ఎక్కువగా ఉంది?' అని ముగించాడు చిత్రగుప్తులవారు.

"శకునం వంకతో నిష్కారణంగా ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నందుకుగాను నీకు నరకమే  గతి!.. నెక్స్ట్' అని హూంకరించారు యమధర్మరాజుగారు పున్నారావుకు మరో మొండి వాదన లేవదీసేందుకు అవకాశం ఇవ్వకుండా!

 

పున్నారావును కాలుతున్న ఇనుప స్తంభానికి కట్టేస్తూ 'వచ్చే జన్మలో అయినా ఈ పిచ్చి పిచ్చి  శకునాలు.. అవీ మానేస్తావనుకుంటా  జీవా!' అన్నాడు యమకింకరుడు వెటకారంగా నవ్వుతూ.

'ఎట్లా మానడం కింకరా? విమానం ఎక్కి స్వర్గానికి పోవాల్సిన రాత  దిక్కుమాలిన పిల్లి తగలడ్డం మూలానే కదా ఇట్లా కాలే కాలే ఇనప స్తంభాలని కావలించుకోనే గతికి తెచ్చిందీ!' అన్నాడు పున్నారావు కసి కసిగా!

***

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు ఆదివారం అనుబంధం, 1, డిసెంబర్ 2002 ప్రచురితం)

 

 




 

Thursday, February 18, 2021

మహాత్ముడూ మామూలు మనిషే! కానీ మన కళ్లాకు కాదు! వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 

 


 

గాంధీజీ పోరాటం చేసింది తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా. ఆయన తపించింది తెల్లవారితో సమరం చేసే సమయంలో హింస వైపుకు మళ్లరాదనే నియమం కోసం. గాంధీజీని క్రమంగా బాపూజీగా..  మహర్షిగా మార్చివేసింది భారతీయులలో అతని పట్ల పెల్లుబుకుతూ వచ్చిన వ్యక్తిగత ఆరాధన. అదే చివరికి  దైవభావనగా మారింది. బాపూజీ బతికి ఉన్నరోజుల్లోనే ఈ తరహా ఓవర్ భావోద్వేగాలు పొడసూపినా తన దృష్టికి వచ్చిన ప్రతీసారీ గాంధీజీ నిర్ద్వందంగా ఖండించేవారు.   అయినా ఆయనకు మరణానంతరం ఈ దైవరూపం తప్పిందికాదు.

కానీ.. జాతికి ఇంత సేవ చేసిన గాంధీజీకి  ఇన్ని కోట్ల మంది   భారతీయులలో  కనీసం కృతజ్ఞతగా ఒక్కరికైనా  చక్కని చలనచిత్రం ద్వారా నివాళి అర్పిద్దామన్న మంచి ఆలోచన తట్టలేదు! చివరికి బాపూజీకి  వెండితెర మీద దర్శన భాగ్యం కల్పించింది ఒక తెల్లవాడే .. అటెన్ బరో! స్వదేశీ ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపించిన  గాంధీజీని ఆ పాత్రలో మెప్పించింది ఒక విదేశీయుడు.. బెన్ కిన్స్ లే! అదొక పారడాక్స్!  కాని ఒకందుకు  అదే మంచిదయిందనిపిస్తుంది. 

అటెన్ బరో 'గాంధీచిత్రం బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఆ సినామా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం పేద,వృద్ధ కళాకారులు ఎందరికో నెల నెలా పింఛనులా ఆర్థికసాయం అందించారు చాలా కాలం. బాపూజీ ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పోయిన తరువాత కూడ కొంత మంచి పని జరిగిందన్న తృప్తికి ఆస్కారం కల్పించారు అటెన్ బరో బృందం. అదే భారతీయుల ఆధ్యర్యంలో గాని చిత్ర నిర్మాణం జరిగి వుంటేనిర్మాతలు భారీ బడ్జెట్ అయిందన్న మిషతో వినోదప్పన్ను కోసం లాబీయింగ్ చేసుకోవడంలో బిజీగా ఉండిపోయేవారు. చిత్రం విజయవంతం అయివుంటే  ఆర్థిక లాభాలలో ఒక్క పైసా అయినా పేదవర్గాలకు నలిపి నామం పెట్టి ఉండేవాళ్ళు కాదన్న మాట  గ్యారంటీ!

వీటికి మించి చెప్పవలసిన మరో ముఖ్యమైన విషయం బాపూజీని చిత్రంలో చిత్రీకరించే విధానంలోని తారతమ్యం. విదేశీయుల చేతిలో నిర్మాణం అయింది కాబట్టి పూర్తిగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగా మొదలై .. బాపూజీగామహర్షిగా వికాసం చెందిన క్రమాన్ని సహజ పరిణామ దశల పద్ధతిలో నప్పేలా తీసే ప్రయత్నం చేసారు. ఎక్కడా 'సూపర్ఫిషియల్అన్న భావనకు ఆస్కారం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. 

గాంధీ అందరిలాంటి మనిషే. అందరిలానే చదువుకుని పెళ్లి చేసుకునిఇద్దరు పిల్లలను కన్న తండ్రి ఆయన.  ఉపాధి కోసరంగాను  అందరిలానే విదేశాలలొ అవకాశాల కోసం వెదుకులాడుకుంటూ వెళ్లిన  యువకుడు. అక్కడ ఎదుర్కొన్న జాతి వివక్షకు సంబంధించిన అవమానాలను ఎదుర్కొని పోరుసలపాలన్న దీక్షతో ముందుకు వెళ్లి విజయవంతమైన తరువాతనే ఒక గౌరవప్రదమైన వ్యక్తిత్వంతో భారతదేశానికి తిరుగుముఖం పట్టింది. 

దక్షిణాఫ్రికాలో తెల్లవారి దెబ్బలకు గాయపడ్డ పూట  గాంధీ ఇంట్లో కస్తూరి బాయితో కలసి చేసిన ఒక సన్నివేశంలో దర్శకుడు గాంధీని ఏ విధంగా చిత్రించదల్చుకున్నాడో.. స్పష్టంగా అర్థమవుతుంది. బుగ్గ మీద అంటించిన టేపు బాగా గుంజుతోంది తీయమని కస్తూరి బా ను అడుగుతాడు గాంధీ. కస్తూరి బా భర్త మంచం మీద కూర్చుని అటు తిరిగి    ఆ టేపును తీసే సందర్భంలో గాంధీజీ ఆమె వీపు మీద చేతులు వేయడం చూపిస్తాడు దర్శకుడు. ఆ సమయంలో గాంధీజీ కళ్లల్లోని ఎరుపు జీర మీద ఫోకస్ చేయడం అత్యంత సహజంగా  వచ్చిన సన్నివేశం. 'బ్రహ్మచర్యం పాటిస్తానన్నారుగా?' అని అడుగుతుంది కస్తూరి బా అప్పటికీ! ఒక్క క్షణం మౌనం. (తప్పు జరిగిన తరువాత అని కాబోలు అర్థం) 'రేపు ఒక రోజుకి ఉపవాసం ఉంటాను'అంటాడు గాంధీ. ఒక తప్పుకు ఒక పూట ఉపవాసంతో సరి అని కాబోలు గాంధీ భావం! 'మరీ ఎక్కువ ఆనందించకండి.. రెండు రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుందిఅంటుంది కస్తూరిబా. ఆ తరువాత గాంధీ కస్తూరి బాయిని ఆనందంతో ముంచెత్తుతాడు.  ఆ సన్నివేశం మనకు భారతదేశంలొ కనిపించదు. చూడాలంటే విదేశీ వెర్షన్ చూడకతప్పదు. 

మనిషి నుంచి మహాత్ముడిగా  గాంధీజీ ఎదిగిన క్రమం చూసే భాగ్యం బైటదేశాలవారికే అన్నమాట. మన వాళ్లకు బాపూజీని మానవ మాత్రుడుగా చూపించడం పెద్ద దోషం. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు జాతి భావించాలన్నది కాబోలు.. సెన్సారు సార్ల్ ఉద్దేశం. 

బాపూజీ కూడా కోరుకోని వీరాభిమానం ఇది. అలా దైవ భావన ఆపాదించుకునేదుంటే 'సత్యంతో నా ప్రయోగాలుఆత్మకథలో మరీ అన్ని పచ్చి నిజాలు దాచకుండా నిర్భీతిగా ఎందుకు పెట్టడం?! 

ఈ తరహా దౌర్భాగ్యం ఒక్క బాపూజీకే కాదు..   రాముడుసీత,ఆంజనేయుడు వంటి ఎన్నో పౌరాణిక  పాత్రలకూ తప్పడం లేదు. రామా అంటే బూతు కూత కూస్తున్నారంటూ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవడం ఈ మధ్యన మరీ ఎక్కువయింది! అందుకే ఈ ఉదాహరణను ఇక్కడ విజ్ఞుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆలోచించవలసిన అవసరం ఇహ పైన బుద్ధిమంతులదే! స్వస్తి!

-కర్లపాలెం హనుమంతరావు

19 -02 -2020

(ఓంకార్ ‘ఆల్ ఇన్ వన్’ ఆధారంగా)

***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...