Thursday, February 18, 2021

మహాత్ముడూ మామూలు మనిషే! కానీ మన కళ్లాకు కాదు! వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 

 


 

గాంధీజీ పోరాటం చేసింది తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా. ఆయన తపించింది తెల్లవారితో సమరం చేసే సమయంలో హింస వైపుకు మళ్లరాదనే నియమం కోసం. గాంధీజీని క్రమంగా బాపూజీగా..  మహర్షిగా మార్చివేసింది భారతీయులలో అతని పట్ల పెల్లుబుకుతూ వచ్చిన వ్యక్తిగత ఆరాధన. అదే చివరికి  దైవభావనగా మారింది. బాపూజీ బతికి ఉన్నరోజుల్లోనే ఈ తరహా ఓవర్ భావోద్వేగాలు పొడసూపినా తన దృష్టికి వచ్చిన ప్రతీసారీ గాంధీజీ నిర్ద్వందంగా ఖండించేవారు.   అయినా ఆయనకు మరణానంతరం ఈ దైవరూపం తప్పిందికాదు.

కానీ.. జాతికి ఇంత సేవ చేసిన గాంధీజీకి  ఇన్ని కోట్ల మంది   భారతీయులలో  కనీసం కృతజ్ఞతగా ఒక్కరికైనా  చక్కని చలనచిత్రం ద్వారా నివాళి అర్పిద్దామన్న మంచి ఆలోచన తట్టలేదు! చివరికి బాపూజీకి  వెండితెర మీద దర్శన భాగ్యం కల్పించింది ఒక తెల్లవాడే .. అటెన్ బరో! స్వదేశీ ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపించిన  గాంధీజీని ఆ పాత్రలో మెప్పించింది ఒక విదేశీయుడు.. బెన్ కిన్స్ లే! అదొక పారడాక్స్!  కాని ఒకందుకు  అదే మంచిదయిందనిపిస్తుంది. 

అటెన్ బరో 'గాంధీచిత్రం బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఆ సినామా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం పేద,వృద్ధ కళాకారులు ఎందరికో నెల నెలా పింఛనులా ఆర్థికసాయం అందించారు చాలా కాలం. బాపూజీ ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పోయిన తరువాత కూడ కొంత మంచి పని జరిగిందన్న తృప్తికి ఆస్కారం కల్పించారు అటెన్ బరో బృందం. అదే భారతీయుల ఆధ్యర్యంలో గాని చిత్ర నిర్మాణం జరిగి వుంటేనిర్మాతలు భారీ బడ్జెట్ అయిందన్న మిషతో వినోదప్పన్ను కోసం లాబీయింగ్ చేసుకోవడంలో బిజీగా ఉండిపోయేవారు. చిత్రం విజయవంతం అయివుంటే  ఆర్థిక లాభాలలో ఒక్క పైసా అయినా పేదవర్గాలకు నలిపి నామం పెట్టి ఉండేవాళ్ళు కాదన్న మాట  గ్యారంటీ!

వీటికి మించి చెప్పవలసిన మరో ముఖ్యమైన విషయం బాపూజీని చిత్రంలో చిత్రీకరించే విధానంలోని తారతమ్యం. విదేశీయుల చేతిలో నిర్మాణం అయింది కాబట్టి పూర్తిగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగా మొదలై .. బాపూజీగామహర్షిగా వికాసం చెందిన క్రమాన్ని సహజ పరిణామ దశల పద్ధతిలో నప్పేలా తీసే ప్రయత్నం చేసారు. ఎక్కడా 'సూపర్ఫిషియల్అన్న భావనకు ఆస్కారం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. 

గాంధీ అందరిలాంటి మనిషే. అందరిలానే చదువుకుని పెళ్లి చేసుకునిఇద్దరు పిల్లలను కన్న తండ్రి ఆయన.  ఉపాధి కోసరంగాను  అందరిలానే విదేశాలలొ అవకాశాల కోసం వెదుకులాడుకుంటూ వెళ్లిన  యువకుడు. అక్కడ ఎదుర్కొన్న జాతి వివక్షకు సంబంధించిన అవమానాలను ఎదుర్కొని పోరుసలపాలన్న దీక్షతో ముందుకు వెళ్లి విజయవంతమైన తరువాతనే ఒక గౌరవప్రదమైన వ్యక్తిత్వంతో భారతదేశానికి తిరుగుముఖం పట్టింది. 

దక్షిణాఫ్రికాలో తెల్లవారి దెబ్బలకు గాయపడ్డ పూట  గాంధీ ఇంట్లో కస్తూరి బాయితో కలసి చేసిన ఒక సన్నివేశంలో దర్శకుడు గాంధీని ఏ విధంగా చిత్రించదల్చుకున్నాడో.. స్పష్టంగా అర్థమవుతుంది. బుగ్గ మీద అంటించిన టేపు బాగా గుంజుతోంది తీయమని కస్తూరి బా ను అడుగుతాడు గాంధీ. కస్తూరి బా భర్త మంచం మీద కూర్చుని అటు తిరిగి    ఆ టేపును తీసే సందర్భంలో గాంధీజీ ఆమె వీపు మీద చేతులు వేయడం చూపిస్తాడు దర్శకుడు. ఆ సమయంలో గాంధీజీ కళ్లల్లోని ఎరుపు జీర మీద ఫోకస్ చేయడం అత్యంత సహజంగా  వచ్చిన సన్నివేశం. 'బ్రహ్మచర్యం పాటిస్తానన్నారుగా?' అని అడుగుతుంది కస్తూరి బా అప్పటికీ! ఒక్క క్షణం మౌనం. (తప్పు జరిగిన తరువాత అని కాబోలు అర్థం) 'రేపు ఒక రోజుకి ఉపవాసం ఉంటాను'అంటాడు గాంధీ. ఒక తప్పుకు ఒక పూట ఉపవాసంతో సరి అని కాబోలు గాంధీ భావం! 'మరీ ఎక్కువ ఆనందించకండి.. రెండు రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుందిఅంటుంది కస్తూరిబా. ఆ తరువాత గాంధీ కస్తూరి బాయిని ఆనందంతో ముంచెత్తుతాడు.  ఆ సన్నివేశం మనకు భారతదేశంలొ కనిపించదు. చూడాలంటే విదేశీ వెర్షన్ చూడకతప్పదు. 

మనిషి నుంచి మహాత్ముడిగా  గాంధీజీ ఎదిగిన క్రమం చూసే భాగ్యం బైటదేశాలవారికే అన్నమాట. మన వాళ్లకు బాపూజీని మానవ మాత్రుడుగా చూపించడం పెద్ద దోషం. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు జాతి భావించాలన్నది కాబోలు.. సెన్సారు సార్ల్ ఉద్దేశం. 

బాపూజీ కూడా కోరుకోని వీరాభిమానం ఇది. అలా దైవ భావన ఆపాదించుకునేదుంటే 'సత్యంతో నా ప్రయోగాలుఆత్మకథలో మరీ అన్ని పచ్చి నిజాలు దాచకుండా నిర్భీతిగా ఎందుకు పెట్టడం?! 

ఈ తరహా దౌర్భాగ్యం ఒక్క బాపూజీకే కాదు..   రాముడుసీత,ఆంజనేయుడు వంటి ఎన్నో పౌరాణిక  పాత్రలకూ తప్పడం లేదు. రామా అంటే బూతు కూత కూస్తున్నారంటూ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవడం ఈ మధ్యన మరీ ఎక్కువయింది! అందుకే ఈ ఉదాహరణను ఇక్కడ విజ్ఞుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆలోచించవలసిన అవసరం ఇహ పైన బుద్ధిమంతులదే! స్వస్తి!

-కర్లపాలెం హనుమంతరావు

19 -02 -2020

(ఓంకార్ ‘ఆల్ ఇన్ వన్’ ఆధారంగా)

***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...