Showing posts with label Life. Show all posts
Showing posts with label Life. Show all posts

Monday, February 15, 2021

' ఛుక్‌ ఛుక్‌ రైలు ' - కథానిక - కర్లపాలెం హనుమంతరావు - కథానిక - రచన కథాపేఠం పురస్కారం


 

ఒక ప్రముఖ చినపిల్లల మాసపత్రికవాళ్ళు ఆ సంవత్సరం బాలల దిఓత్సవం సందర్భంగా గేయ కథల పోటీ నిర్వహిస్తున్నార్రు.సెలెక్షన్ కమిటీలో నేనూ ఒక మెంబర్ని.

దాదాపు మూడువందల ఎంట్రీలు వచ్చాయి. మొదటి వడపోతలో ఒక వందదాకా పోయినా.. ఇంకా రెండువందలవరకు మిగిలాయి.

పిల్లలకోసం ఇంతమంది రాసేవాళ్ళు ఉన్నారంటే సంతోషం కలిగింది. రచనలు పంపించినవాళ్ళలో లబ్దప్రతిష్ఠులూ ఉండటం ఆనందం కలిగించింది. అన్నింటికంటే వింతగొలిపే విషయమేమిటంటే కొత్తగా రాస్తున్నవాళ్లలో కొంతమంది ఎంతో చురుకుగా రాసారు! నిజానికి ప్రముఖుల రచనలకన్నా అవి ఎందులోనూ తీసిపోవు. కొన్నయితే మిగిలిన వాటికన్నా  బాగున్నాయి. సెలక్షను చాలా కష్టమయింది. మొత్తంమీద అందరం కలసి కూర్చుని అన్ని కోణాల్లోనూ పరిశీలించి  ఫైనల్గా ఒక పది రచనలను ఎంపిక చేసాం. వాటిలో ఒకటి, రెండు, మూడు బహుమతుల ఎన్నికను సంపాదకులకే వదిలేసాం. మిగిలిన వాటిని మాత్రం సాధారణ ప్రచురణకి తీసుకోవచ్చని సలహా ఇచ్చాం. అట్లాంటీ సాధారణ ప్రచురణకు ఎన్నికైనదే 'ఛుక్ ఛుక్ రైలు'. గేయ రచయిత సి. ఆంహనేయులు, దేశాయిపేట.

దేశాయిపేట మా ఊరికి దగ్గర్లోనే ఉంటంది. మా ఊర్లో హైస్కూలున్నా దేశాయిపేటలో చదువు బాగుంటుందని మా నాన్న ఎస్సెల్సీలో  నన్ను అక్కడ చేర్చాడు. నాకెప్పుడూ ఫస్టు ర్యాంకే వస్తుండేది. క్లాసులో కృష్ణగాడికి రెండో ర్యాంకు. వాడి అన్నయ్యే ఆంజనేయులు.

ఆంజనేయుల్ని చూస్తే మాకు ఎడ్మైరింగుగా ఉండేది. ఆయన ప్రతిభ అలాంటిది. మాకు కొరుకుడు పడని లెక్కల్ని సులభ పద్ధతిలో ఎలా చెయ్యాలో చెప్పేవాడు. సోషల్ సబ్జెక్టులో సంవత్సరాలు, యుద్ధాలూ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. అదే పనిగా బటీ పడుతుంటే.. అలా చేయడం తప్పనీ.. గుర్తు పెట్టుకోవడానికి ఉపాయాలున్నాయని చెప్పి చూపించేవాడు. ఇప్పుడు మా పిల్లలు 'రిటెన్షన్ ఆఫ్ మెమరీ పవర్' అనే 

టెక్నిక్కు ఆన్ లైన్లో కోచింగ్ తీసుకొంటున్నారు. అందులో చెప్పిన సూత్రాల్లో కొన్ని నలభై ఏళ్లకిందట ఆంజనేయులు చెప్పినవే! అతఏమీ కోర్సులు చదువుకోలేదు. వాళ్ల నాన్న ఒక మామూలు బడిపంతులు, వాళ్లకంత స్తోమతూ లేదు.

కృష్ణగాడితో కంబన్డు స్టడీసుకని నేను వాళ్ళింటికి వెళుతుండేవాణ్ని. ఆంజనేయులుకి ఇంకా చాలా విద్యలొచ్చు. పేపర్లను కత్తిరించి బొమ్మలు తయారుచేసెవాడు. రంగుపెన్సిళ్లతో బ్రహ్మాండంగా బొమ్మలేసేవాడు. ఎప్పుడూ ఏదో ఓ కొత్తపని చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. చేయడానికేమీ లేదనుకొన్న రోజున పేపరూ, పెన్నూ పటుకుని కూర్చునేవాడు. కథలు రాసేవాడు.కవితలల్లి వినిపించేవాడు. మా స్కూలు యానివర్సిరీకీ మా కోసం ఒక హాస్యనాటిక రాసి తనే డైరెక్టు చేసి మెప్పించాడు.గ్రీన్ రూంలో మాకు మేకప్ చేసిందికూడా ఆంజనేయులే. ఆ మేకప్ సామాను స్వయంగా తయారు చేసుకొన్నాడు. 

 మాఅన్నయ్య అమెరికాలో పుట్టివుంటే చాలా గొప్పవాడయివుండేవాడు' అంటుండేవాడు కృష్ణ ఎప్పుడూ.

అమెరికా సంగతేమోగాని.. ఆంజనేయులు నిజంగా గొప్పవాడే. పెద్దయిన తరువాత అతను చాలా మంచిపేరు తెచ్చుకొంటాడు అనుకొనేవాళ్లం. కానీ అతనికి చపలత్వం ఉండేది. ఏ పనీ స్థిరంగా చేసేవాడు కాదు. చదువుకోవాల్సిన వయసులో ఆడుకొనేవాడు. ఆటలాడుకోవాల్సిన సమయంలో కవిత్వం రాస్తుండేవాడు. ఊళ్ళో వాళ్లెంత మెచ్చుకొంటున్నా ఇంట్లోవాళ్లచేత తిట్లు తింటుండేవాడందుకే. కృష్ణకున్న స్థిమితంలో పాతికోవంతు  ఆంజనేయులుకున్నా నిజంగా చాలా మంచిపేరు తెచ్చుకొనుండేవాడే.

నేను డిగ్రీ చదువులకని మా తాతగారి ఊరికెళ్ళిపోయిన తరువాత ఆంజనేయులు సంగతేమయిందో పట్టించుకోలేదు.

 

నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నరోజుల్లో ఓ రోజు ఆంజనేయులు నన్ను వెదుక్కొంటూ వచ్చాడు. వయసు అతనిలో ఆట్టె మార్పు తీసుకురాలేదు. కూర్చున్న పదినిమిషాల్లో వంద విషయాలను గురించి మాట్లాడాడు. మనది వాస్తవంగా లౌకిక ప్రజాస్వామ్యమేనా? అన్న అంశంనుంచి.. పారలల్ సినిమా వరకు.. అన్ని అంశాలమీద అడక్కుండానే  సుబ్బారావు. చనువున్నవాళ్లు సుబ్బు అంటారు. ఆంజనేయులికి హిపోక్రసీ అన్నది తెలీదు. అదే అతనిలో నాకు నచ్చే గుణం.

అతను ఇచ్చిన కథ ఎడిటరుగారికి నచ్చింది. 

ప్రచురించబడిన తరువాత నేనే అతనికి స్వయంగా కబురు చేసాను. ముందు ముందు ఇంకా మంచి కథలు రాస్తుండమని సలహాకూడా ఇచ్చాను.

రెండు నెలల తరువాత ఒక నవల పంపించాడు. బాగుంది. కొద్దిమార్పులతో ప్రచురించడానికి అంగీకారమయింది. 

క్రమంగా ఆంజనేయులు రచయితగా మిగతా పత్రికల్లోకూడా కనిపించడం మొదలుపెట్టాడు.

రేడియోలో అతను రాసిన  నాటకాలూ రావడం మొదలుపెట్టాయి.

కవి సమ్మేళనాల్లో అక్కడక్కడా కనపడుతుండేవాడు. 

ఒక నాటకపరిషత్తులో పోటీ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. 'రివ్యూ'కోసం పత్రిక తరుఫున నేనే హాజరవుతున్నాను. రెండో రోజున భుజాన వేళ్లాడే సంచీతో  ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయులు. నరసరావుపేట నుంచి  నాటకం తయారు చేసుకొచ్చాట్ట! అక్కడికి దగ్గర్లోనే ఒక స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. నాటకం బాగా పండింది. ఆంజనేయులు మూగవాడిపాత్రలో అద్భుతంగా నటించాడు. దర్శకత్వం అతనిదే. రచన సంగతి  సరేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డు ఆ సంవత్సరం ఆంజనేయులికి దక్కింది. 'అందుకేనన్న మాట ఈ మధ్య పత్రికల్లో ఎక్కువగా కనిపించడం లేదు' అన్నాను అతన్ని అభినందిస్తూ. 

చిన్నగా నవ్వాడు ఆంజనేయులు 'సుబ్బూ! ఒకసారి నువ్వు మా ఊరు రావాలి!' అన్నాడు.

'ఏమిటీ విశేషం?'

'అఖిల భారత స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాం. నువ్వూ ఒక జడ్జిగా ఉంటే బాగుంటుంది'

'అమ్మో! పాటల గురించి  నాకు ఏబిసిడిలు కూడా తెలీవన్నా!'

మేమందరం ఆంజనేయుల్ని 'అన్నా' అనే పిల్చేవాళ్లం కృష్ణతోపాటే.

'అలాంటివాళ్ళే నిజమైన న్యాయనిర్ణేతలవుతారు. నీకెందుకు నువ్వు రా!' అంటూ అడ్రసూ డేటూ ఇచ్చి వెళ్ళిపోయాడు. 

ఆంజనేయులు నిజంగానే పాటల పోటీని భారీ ఎత్తున నిర్వహించాడు. అది చిన్న ఊరే అయినా ఆంజనేయులు  టీచరుగా వెళ్ళిన తరువాత  ఊరు పరిస్థితుల్లో చాలా మంచి మార్పులు తెచ్చాడని చెప్పారు అక్కడి జనం. ముఖ్యంగా కుర్రకారులో అతనికి మంచి ఫాలోయింగుంది. పెద్దవాళ్లలో గౌరవమూ ఉంది. పిల్లకాయల పోరంబోకు తిరుగుళ్ళు తగ్గాయి అన్నారు పెద్దవాళ్ళు. ఊరిపెద్దల సహకారం లేనిదే అంత పెద్ద కార్యక్రమం చెయ్యడం బైటివాళ్లకు సాధ్యం కాదు. మొత్తానికి నేను ఆ ఊళ్లో ఆంజనేయులు మరో అవతారం చూడగలిగాను. అప్పటి దాకా  చూడని అవతారం.. సోషల్ వర్కర్ అవతారం!

ఊళ్లో ఉచితవైద్యం చేస్తున్నాడు. అందుకోసం పుస్తకాలు తెప్పించుకొని చదువుతున్నాడు. రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేయడం నేరం కదా  అనడిగితే కలకత్తా బ్రాండ్ 'ఆర్ ఎం పి' సర్టిఫికేట్ చూపించాడు. మొత్తానికి అతని ఆశయం సేవే. లాభార్జన కాదు. చిన్న చిన్న రోగాలకే వైద్యం చేస్తున్నది.. ఉచితంగా. 'కొద్దిగా కాంప్లికేటేడ్ గా ఉన్నా పట్నం పొమ్మంటా' అన్నాడు ఆంజనేయులు. 

ఊళ్ళో ఓ చిన్న గ్రంథాలయం కూడా  పెట్టించాడు. 

అన్నింటికన్నా ముఖ్యమైనది ఊరిసమస్యలని పరిష్కరించే విధానం. బోరింగుల్లోకి నీరు రాకపోయినా, వీధిదీపాలు వెలక్కపోయినా, వినాయక చవితి, శ్రీరామనవమిలాంటి పండుగలకి ఉత్సవాలు ఏర్పాటు చేయాలన్నా, పంచాయితీ బోర్డు వరండాలో కూర్చుని పబ్లిగ్గా  అందరిముందు చర్చించుకొనే అలవాటు చేయించాడు. ఆంజనేయులు ఒక్క టీచరే కాదు.. ఊరి పెద్దల్లో ఒకడూ ముఖ్యుడూ అయికూర్చున్నాడు.

'ఇన్నిపనులు చెయ్యటానికి నీకు టైమెక్కడిదన్నా?' అనడిగాను ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు. 

'ఇల్లు పట్టకుండా తిరుగుతుంటారు. నువ్వైనా చెప్పు బాబూ! ఆరోగ్యం సంగతి చూసుకోవద్దూ !' అంది ఆంజనేయులు భార్య,

ఆమె కంప్లయింటు సమంజసమైందే అనిపించింది. కానీ నేను ఆంజనేయులుకి చెప్పేటంతటివాడినా!

'ఇప్పుడంటే ఫరవాలేదు. ఇంట్లోకి ఒక బిడ్డ వచ్చిన తరువాత  కూడా తిరుగుతానంటే ఎట్లా?' అందామె.

'అప్పటి సంగతి చూద్దాంలేవోయ్  !' అని నవ్వి ఊరుకొన్నాడు ఆంజనేయులు.

అప్పటికి ఆంజనేయులు భార్య గర్భంతో ఉంది. అదీ ఆవిడ భయం.

ఆంజనేయులు ఇంట్లో లేనప్పుడు అందామె 'నువ్వూ మా కృష్ణలాంటివాడివే బాబూ! నీకు కాకపోతే మరెవరికి చెప్పుకోవాలి నేను? వినేందుకు ఎవరున్నారు గనక! నన్ను చేసుకొన్నారని ఆయన్ని వాళ్ల వాళ్లు వెలేసినంత పని చేసారు. ఎవరూ ఇటువైపు రారు. మా వాళ్లు మరీ మొరటువాళ్లు' అని కన్నీళ్లు పెట్టుకొందావిడ.

ఆంజనేయులు ఇంతకుముందు పనిచేసిన ఊళ్ళోనే ఈ పెళ్ళి చేసుకొన్నాడు. కులాంతర  వివాహం. ఎవరు వారించినా వినకుండా చేసుకొన్నాట్ట! ఆయన బ్రాహ్మడు. ఈవిడది షెడ్యూల్డ్ కులం. ఇరువైపుల పెద్దలకూ ఈ వివాహం ఇష్టంలేకపోయింది. ఆ ఊళ్లోవాళ్ల బాధపడలేకే ఇక్కడికి బదిలీ చేయించుకొన్నాడు ఆంజనేయులు.

ఆంజనేయులు కులాంతర వివాహాలను గురించి కొన్ని కథలు రాసాడు. తను రాసిందే   ఆచరించి చూపించాడు. రియల్లీ గ్రేట్! ఆంజనేయులు ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకొన్నాను ఆ క్షణంలో.

 తరువాత నేను ఉద్యోగం మారి ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే దాదాపు మూడు దశాబ్దాలు ఉండిపోయాను. పెల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్లయిపోయారు. మధ్య మధ్యలో ఆంధ్రా వస్తున్నప్పుడు ఆంజనేయుల్ని గురించి వాకబు చేస్తుండేవాణ్ణి. ఉద్యోగాల రీత్యా అతనెక్కడెక్కడో ఉంటుండేవాడు. ప్రతిసారి ఏదో కొత్త ఆడ్రసు చెప్పేవాళ్ళు.

ఒకసారతన్ని మాచర్లలో పట్టుకోగలిగాను. మనిషిలో చాలా మార్పు వచ్చింది. ఇద్దరు పిల్లలు. పెద్దది పాప. సెకండ్ క్లాసు. రెండో వాడు యూ.కె.జి. చాలా చురుకుగా ఉన్నారిద్ద్దరూ. అచ్చు తండ్రి చురుకుతనమే. కదిలిస్తే చాలు ఇంగ్లీషులో  రైమ్సు.. తెలుగులో పద్యాలు గడ గడ చదివేస్తున్నారు. పిల్లలిద్దర్నీ డ్యాన్సు స్కూల్లో చేర్పించారు. 

'మైత్రికి పెయింటింగ్ కాంపిటీషన్లో టౌన్ మొత్తానికీ ఫస్టొచ్చింది.  ఇదిగో ప్రైజ్. చిన్నాడుకూడా చిచ్చర పిడుగే. వీడికీ సీతారామరాజు ఫ్యాన్సీడ్రెస్ కాంపిటీషన్లో ప్రయిజొచ్చింది. సంగీత్సం కూడా  నేర్పించాలని ఉంది. క్లాసులో ఇద్దరూ ఫస్టే!' అన్నాడాంజనేయులు.  అక్కడున్నంత సేపూ మొగుడూ పెళ్ళాలు తమ పిల్లల్ని గురించే మాట్లాడారు. 

'నువ్వేమన్నా వేరే ఏక్టివిటీస్ చేస్తున్నావా అన్నా?' అనడిగాను.

లోపలికి వెళ్లి ఓక ఫోటో ఆల్బమ్, రెండు పుస్తకాలు పట్టుకొచ్చాడు. అల్బంనిండా వాళ్ళ పిల్లల ఫోటోలే, రకరకాల భంగిమల్లో.. రకరకాల చోట్ల తీసినవి.

'వీళ్ళకోసం ఫొటోగ్రఫీ నేర్చుకొంటున్నాను. ఈ ఫోటోలన్నీ నేను తీసినవే!.. బాగున్నాయా?' అనడిగాడు.

నిజంగా ఫోటోలు బాగా వచ్చాయి. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ తీసిన స్థాయుకి ఏమాతం తగ్గవు అవి. ఆంజనెయులు చెయ్యి ఎందులో పడినా అంతే! బంగారం! అందులోనుంచి మచివి రెండు ఏరి ఇచ్చాడు. 'నీకు తెలిసిన పత్రికలు వీలుంటే వేయించు' అన్నాదు.

'పాటలు  రాశాను కొన్ని.  బాలల గేయాలు.. గేయ కథలు ఉన్నాయనుకో! మా పిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి నోరు తిరిగే    రీతిలో బాణీలు కట్టి రాసినవి. మైత్రీ! ఒక పాట పాడమ్మా! 'ఛుక్ ఛుక్ రైలు వస్తోంది..' అంటూ అందించాడు. వెంటనే ఆ పాప ఆ పాట అందుకొని దాదాపు ఐదారునిమిషాలు ఆపకుడా పాడుతూ పోయింది. మధ్య మధ్యలో చిన్నపిల్లవాడు అక్కకు తోడుగా గొంతు కలపడం..!

'వీళ్ళు పాడే పాటలన్నీ నేను రాసినవే. వీళ్లకోసమే రాసాను. వీటిని కేసెట్టుల్లోకి ఎక్కించాను. ఇందులో ఏమన్నా పనికొస్తయేమో చూడు!'  అంటూ కేసెట్టూ.. పుస్తకమూ అందించాడు. మొత్తానికి అక్కడ కూర్చున్న రెండుగంటలూ ఆంజనేయులు తన పిల్లల్నిగురించి తప్ప వేరే విషయాల జోలికి పోలేదు. మధ్యలో ఎప్పుడన్నా పొరపాటున వేరే టాపిక్ లోకి వెళితే ఆయన భార్య   సవరించేది. వాళ్ల ప్రపంచమంతా ప్రస్తుతం ఆ ఇద్దరి పిల్లలతోనే నిండిపోయిందని తెలుస్తూనే ఉంది. 

'తమ పిల్లలకు అందుబాటులో లేనిదేదీ ఊహించే స్థితిలో లేడు ఆంజనేయులు' అనిపించిందా  క్షణంలో. 

నాకు పరిచయమున్న పత్రికకు అతనిచ్చిన ఫొటోలు, గేయాలు పంపించాను. రెండు ప్రచురించారు. మంచి స్పందనా వచ్చిందని చెప్పారు. 

'పిల్లల శీర్షికలకన్నా రెగ్యులర్ గా కాంట్రిబ్యూట్ చేయమ'ని ఎంకరేజింగ్ గా సలహా ఇస్తూ ఆంజనేయులకి ఉత్తరం రాసాను.

కొన్నేళ్ళు ఆంజనేయులు రెగ్యులర్ గా రచనలు పంపించాడుట. 'మంచి క్వాలిటీ ఉంటుంది. ప్యూర్ అండ్ ఒరిజినల్' అని మెచ్చుకొన్నారు ఎడిటరుగారు నేనొకసారి ఆయన్ని కలిసినప్పుడు. '.. కానీ ఈ మధ్య ఏవో కామిక్సు పంపిస్తున్నాడు. అవి అంత ఒరిజినల్ కాదు. అయినా ఫరవాలేదనుకొని కొన్ని ప్రచురిస్తున్నాం' అన్నాడాయన. అంటే ఆంజనేయల  పిల్లలు హైస్కూలు చదువులకు వచ్చారన్నమాట..' అనుకొన్నాను, 'ఇంకొద్దికాలంపోతె ఇవీ రాయడు చూడండి! సస్పెన్సు.. క్రయిం  థిల్లర్ టైపు నవలలొస్తాయి' అన్నాను ఆ ఎడిటరు మిత్రునితో.

మరో ఐదేళ్ళ తరువాగ్త ఆ మిత్రుడు ఓ పెళ్ళిఫంక్షనులో కలిసాడు. ఆ

 మాటా ఈ మాటా అయిన తరువాత టాపిక్ నవలలమీదకు మళ్ళింది. 

'అన్నట్లు.. మర్చిపోయా!.. మన ఆంజనేయులు ఈ మధ్య ఒక క్రైం థిల్లర్ పట్టుకొచ్చాడు. అగాథ క్రిస్టీకి నకలుగా ఉందది. అతని దగ్గర్నుంచి రావాల్సిన నవల కాదది. వేస్తే పత్రిక్కూ, అతనిక్కూడా  ప్రేరు పోతుంది. చూస్తాలే.. అని పక్కన పెట్టేసాను' అన్నాడు. 

ఈ మలుపు నేనూహించిందే అయినా.. ప్రాణం ఉసూరుమంది. ఆంజనేయుల్లో ఎంత టేలెంటుంది! ఎంత వెర్సటాలిటీ ఉంది!  ఏమయిందా ప్రతిభంతా?!

తరువాత కొంతకాలానికి ఆంధ్రా వైపొచ్చానుగాని.. పని వత్తిడివల్ల అతన్ని కలుసుకోవడానికి కుదరలేదు.  

తరువాత ఎప్పుడో అనుకోకుండా ఓ పెళ్ళిలో కృష్ణ కలిసాడు. చాలా ఏళ్ల తరువాత కలుసుకొన్నాం. గంటలకొద్దీ మాట్లాడుకున్నా కబుర్లు తరగడం లేదు.

'ఇట్లా కాదు.. ఒకసారి మా ఇంటికి భోజనానికి రారా!' అని బలవంతాన ఇంటికి తీసుకువచ్చాను మర్నాడు. రాత్రి భోజనాలయిన తరువాత ఇద్దరం డాబామీద  కూర్చొని కబుర్లలో పడ్డాం. టాపిక్ అటు తిరిగి ఇటు తిరిగి ఆంజనేయులుదగ్గరికొచ్చి ఆగింది. 

నేనే అన్నాను 'మీ అన్నయ్య నిజంగా ఎంత టేలెంటు ఉన్నవాడూ! సిన్సియర్! కులాంతర వివాహం చేసుకొన్నాడని మీరంతా ఆయన్ని దూరం పెట్టడం ఏం బాలేదురా! ఇంట్లో వాళ్లంతా వెలి వేస్తే   ఆ లోటు పూడ్చుకోడానికి ఆ రోజుల్లో అతను చేసిన సోషల్ సర్వీసు అపూర్వం.  అట్లాంటివాడు పిల్లలు పుట్టేసరికి అప్పటివరకూ తాను సేవించిన సొసైటీనికూడా పూర్తిగా మర్చిపోయి .. ఆ పిల్లలలోకంలోకి వెళ్ళిపోయాడు!..  ఎంత విచిత్రమైన మనిషో!

కృష్ణ అందుకొని మిగతా భాగం పూర్తిచేసాడు '.. అన్నయంటే ఇంట్లో అందరికీ అభిమానంగానే ఉండేది. వేరే కులం పిల్లని చేసుకొన్నాడని ఇంత్లో వెలేయకపోతే చెల్లెళ్లకు పెళ్ళిళ్ళవడం కష్టమయేదిరా! ..పోనీ అక్కడన్నా స్థిరంగా ఉన్నాడా అంటే..  అదీ లేదు. నువ్వు చెప్పిందీ నిజమే ! పిల్లలే లోకంగా మసిలేవాడు. వాళ్లమీదే ఆశలన్నీ పెట్టుకొన్నాడు. వాళ్ళకోసమే తను ఇంతకాలంగా ప్రేమించి పెంచుకొన్న కెరియర్ని కాదని కాలదన్నుకొన్నాడు. కానీ.. చివరికేమైందీ!..'

'ఏమైందీ?!' నా మనసేదో కీడు శంకింస్తోంది.

'కూతురు  అమెరికా పోయి తనలాగే వేరే దేశంవాడిని పెళ్ళి చేసుకొంది. సంబంధాల్లేవు  . కొడుకిక్కడే ఉన్నాడుగానీ.. తండ్రిపొడ గిట్టదు. తాను కోరుకొన్న కోర్సులో  చేర్పించలేదని అలిగి ఇంట్లోనుంచి వెళ్ళిపోతే వెదికి తెచ్చుకొన్నాడా ఉద్ధారకుణ్ణి. ఉన్నదంతా వాడి చదువులకు సమర్పించుకొన్నాడు. చివర్రోజుల్లో బికారిగా మారాడు. వదిన చచ్చిపోయింది. కొడుకూ కోడలే ఆధారం ఇప్పుడు. వాళ్ళు చీదరించుకొంటున్నా పడుండక తప్పని దౌర్భాగ్యం'

'మరి ఈ మధ్య ఏదో గేయం చూసానే! ఏదో పోటీకి పంపించిందీ?!' అనడిగాను ఆశ్చర్యంగా. 

'పంపే ఉంటాడులే! కొడుకూ, కోడలూ ఉద్యోగాలకు వెళుతున్నారుగదా! పసిపిల్లల్ని వీడి మీద  పడేసి  పోతున్నారు. ఆ పసివాళ్లకోసం  పాటలూ.. గట్రా ఏవన్నా  కడుతున్నాడేమో మళ్ళీ! అదేగా వాడి బలం.. బలహీనతా!' అన్నాడు కృష్ణ   


'శాపవశాన తన శక్తి తనకు తెలీని హనుమంతునివంటి వాడు ఆంజనేయులు. జాంబవంతుడికా  శాపం తెలుసు. కనకనే రామాయణ ధర్మకార్యానికి అతన్ని యుక్తియుక్తంగా ఉపయోగించుకొన్నాడు. అసమాన ప్రతిభా సామర్థ్యాలున్న ఆంజనేయుల్లాంటి వాళ్లను సద్వినియోగించుకొనే జాంబవంతులు సమాజంలో, వ్యవస్థలో క్రమంగా  తరిగి పోతుండమే ప్రస్తుతం పెను విషాదం' అనిపించింది నాకు..


-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూఎస్ఎ 


***

( ' అడుగో ఆంజనేయులు ! జాంబవంతుడెక్కడ ? ' పేరుతో రచన మాస పత్రిక  2003- ఫిబ్రవరి- 'కథాపీఠం' పురస్కారం; 

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము- తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ వారు శీ తారణ ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రచురించిన  'తెలుగు వెలుగు' 

లో ప్రచురితం)

 

 


Sunday, February 17, 2019

ఎన్నటికీ ఒంటరులం కాలేం - కవిత



ఒంటరులం కాలేం!

1
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎప్పటికీ  ఒంటరులం కాము
             
2
పూల మీద నడుస్తున్నా
పాదం కందకుండా కింద
అమ్మ అరచేయి అడ్డు పెడుతుంది


ఉట్టికెగిరేటప్పుడు
రెక్క తెగి- నువు కింద పడకుండా
నాన్న నీడ పహరాగా నిలబడి ఉంటుంది          
             
4
తోబుట్టువులనే
తోటి చేపలతో
బతుకు తొట్టి
ఈత కొలనుగా
ఎప్పుడూ సందడిగానే ఉంటుంది!

5
నీ రాలి పడే నవ్వులకు
ఒడి పట్టి వెంటబడే లోకం అంటావా
నీతోనే తన లోకం అంటుంది

6
కన్నీరైనా  ఒంటరిగా వదలుతుందా నిన్ను!
చెక్కిలి తడి కానివ్వదు
చెలిమి హస్తం చాచే ఉంటుంది

7          
చింతల గుంతన అయినా
ఏకాంతంగా   వదలదు.
నీ వ్యథలో అర్ధం తనదే
అటుంది నీ ఆత్మ అర్థభాగం
             
 8
ఇక అమావాస్య నాటి
వెన్నెల పక పకలకు మల్లే
పిల్లా జెల్లా ఎల్లకాలమూ
నీ వెనకాలే!

9
చావుతోనే అంతా అయిపోయిందనుకోడం
శుభం కార్డు పడితే
మరో ఆట లేదనుకోడం

10
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎప్పటికీ  ఒంటరులం కాము
కాలేం*
హామీ పత్రంః' ఒంటరులం కాలేం' కవిత నా స్వంతం.దేనికీ అనువాదం/అనుకరణ కాదు.అముద్రితం.ఏ ఇతర పత్రికలలోనూ పరిశీలనలో లేదు అని హామీ ఇస్తున్నాను.

-కర్లపాలెం హనుమంత రావు
17-09-2012


Saturday, March 4, 2017

నా నచ్చిన పుస్తకం లోని నాకు నచ్చిన చిన్న కథ- కాదేదీ నా కబుర్ల కనర్హం


ఒక అడవిలో మూడు చెట్లు. మూడింటికి మూడు కోరికలు.
మొదటి దానికి ఒక అందమయిన రాకుమారిపడక గదిలో అద్దం దగ్గర ఆమె తన విలువయిన ఆభరణాలు దాచుకునే అందమయిన నగిషీలు చెక్కబడిన చెక్క పెట్టెలాగా మారి అందరి దృష్టిని ఆకర్షించాలని అభిలాష .
రెండో చెట్టుకి ఒక బ్రహ్మాండమయిన నౌకలాగా మారి రాజులూ రాణులు విహరించే లాహిరి లాహిరి ఊయలగా మారాలని కోరిక.ప్రళయం వచ్చినప్పుడు జనాల ప్రాణాలను కాపాడే అవకాశం రావాలని కూడా దాని ఆశ .
మూడో దానికి మాత్రం ఈ ప్రపంచం లో అందరికన్నా ఏపుగా ఎదిగి తన జాతికి పేరు తీసుకురావాలని ఆశయం .
కొంత కాలానికి చెట్లు కొట్టేవాళ్ళొచ్చి అన్నింటి తో పాటు వాటినీనరికి తీసుకుని పోయారు.
మొదటి చెట్టు కొయ్య జంతువులకు ఆహారం పెట్టే చెక్క పెట్టె గా చెక్కబడింది.రెండోది చేపల తొట్టి. మూడోదాన్ని మరీ అన్యాయంగా చిన్న చిన్న పేళ్ళు గా కొట్టేసారు.
మూడు చెట్లు తమ దురదృష్టానికి దుఃఖపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేక పోయింది. 
కొంత కాలానికి జంతువుల కొష్టం లోకి ఒక ఆడమనిషి ప్రసవించటానికి వచ్చింది.పుట్టిన బిడ్డను ఆ గడ్డి తొట్టెలో పడుకోబెట్టింది.ప్రపంచం లోకెల్లా అత్యంత విలువయిన నిది తనలో వున్నట్లు తెలిసి ఆ చెక్క పెట్టె మురిసిపోయింది.
చాలా ఏళ్ల తరువాత ఆ బిడ్డ పెరిగి పెద్దయి ఒక నది వడ్డుకి వెళ్లి అక్కడి పడవలో పడుకున్నాడు.ఇంతలో పెను తుఫాను ఆరంభమయింది.పడవలోని మనిషి ప్రకృతి వైపు చూసి 'శాంతి శాంతి 'అని ఆదేశించాడు. ప్రకృతి శాంతించింది. ఆ క్షణంలో పడవకు అర్ధమయింది -తనలో పడుకున్నవాడు రాజు కాదు రాజులకు రాజు వంటి వాడని.
మరి కొంత కాలానికి అదే వ్యక్తిని శిలువ వేయటానికి కొయ్య పేళ్ళను ఏరుకుని వెళ్లారు కొంత మంది సైనికులు.
జీసస్ ను శిలువ వేసిన తన చెక్కలతో సహా చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయినందుకు 
ఆ మూడో చెట్టు అందరికన్నా ఎక్కువగా మురిసిపోయింది.
ఆ రకంగా మూడు వృక్షాల ఆకాంక్షలను దేవుడి బిడ్డే స్వయంగా వచ్చి తీర్చాడు.
-యండమూరి వీరేంద్రనాథ్



దేవుడు వున్నాడా లేడా?... జీసస్ దేవుడి బిడ్డ అవునా కదా ? అని చర్చల లోకి వెళ్ళటానికి కాదు ఈ కథ ఇక్కడ ప్రస్తావించింది..
కల్పించే వూహా శక్తి వుండాలే కానీ...చెయ్యి తిరిగిన రచయిత దేనినయినా ఎంత అందంగా సమన్వయం చేయగలడోనని చెప్పటానికి!

(యండమూరి వీరేంద్రనాథ్ 'విజయానికి ఆరో మెట్టు' లో ఈ కథ కనిపించినప్పుడు ముందుగా నాకూ తట్టిన ఆలోచన ఇదే ! .ఇలాంటి చిత్రమయిన చిన్నచిన్న కథలు..ఆలోచనలను రేకెత్తించేవి ఆ పుస్తకం నిండా కోకొల్లలు. ఆసక్తి వున్న వాళ్ళు తప్పకుండ చదవదగిన వ్యక్తిత్వ వికాస సబంధంయిన మంచి ఉపయుక్తమయిన  పుస్తకం 
ఏది ఎలా వున్నా యండమూరివారి దగ్గరనుంచి మనం చాల చక్కని తెలుగు భాషను నేర్చుకోవచ్చు. ఇది .చదివేవారి సమయం వృధా పోదు  నాదీ గ్యారంటీ
-కర్లపాలెం హనుమంతరావు

Sunday, January 22, 2017

తొలి కలల ప్రేమలేఖ- ఈనాడు ఆదివారం సంపాదకీయం


ప్రణయభావం హృదయ సంబంధి. నిండు నూరేళ్ల జీవితానికి రసాలందించే ఆ ప్రేమఫలం చవిని పసగల రెండు మూడు పదాల్లో పొదగాలంటే ఎంత అనుభవం కావాలి? 'ప్రేమంటే ఒక తికమకలే. అది వేధించే తీపి కలే' అన్నాడో ఓ సినిమా కవి. ఎద సడిని సరిగమపదనిసలుగా మలచి పాడే ఆ గడసరి- పిడికిలంత గుండెలో కడలిని మించిన హోరును పుట్టించగల జగడాలమారి. 'మ్రొక్కి మొక్కించుకొనునట్టి చక్కదనము/పొగిడి పొగిడించుకొనునట్టి ప్రోడతనము/దక్కి దక్కించుకొనునట్టి దంటతనము/ దానికేకాక కలదే యే చానకైనా?' అని ముద్దుపళనివారి మాధవుడు తలపోసింది రాధిక గురించే. నిజానికి ఆ శాపనార్థాలన్నీ అన్యాపదేశంగా అశరీరుడి ఆగడాలమీద గురిపెట్టిన శరాలే! సదా గోపాలపాద చింతనామగ్న అయిన గోపకాంత ఒకతె చెంతవాలిన చంచరీకాన్నే ప్రియుడు పంపిన ప్రేమదూతగా భావించుకొని ఆలపించిన భ్రమరగీతాలూ ఈ ధోరణిలోనే సాగే తంతు. తనను మన్మథ వేదనపాలు చేసిన విధాత నిర్దయను వ్రేపల్లె గొల్లభామ పడ తిట్టిపోస్తుంది- పోతన భాగవతంలో. 'కత్తిలేని ఒరకు కాంతి లేనట్టుగా ప్రేమలేక యున్న బ్రతుకు సున్న' అని దాశరథి వంటి కవులు భావిస్తూనే ఉన్నారంటే ఆ కొంటెతనమంతా ఈ మిటారితనంలోనే ఉందనేగా! 'ప్రణయ వధువు నొక రాతిరి త్రాగినాను/ప్రళయ దినము దాక నిషా వదలదు నన్ను' అంటూ పారశీక గజల్ కవి మీర్ పదాలు పాడింది ఈ పాడు తీపి ప్రణయ మధువు గమ్మత్తు మత్తు గురించే!

ప్రేమంటే మోకాలి లోతు దుఃఖం. పీకల దాకా సుఖం. ముల్లు ముల్లుకీ మధ్యనే పువ్వు విచ్చుకున్నట్లు, పువ్వు పువ్వుకీ మధ్య ముల్లూ పొడుచుకొని ఉంటుంది. ప్రేమలో కన్నీళ్లు వద్దనుకుంటే ఎలా? మెరుపు లేకుండా, చినుకు రాకుండా చిగురు పుడుతుందా? రాధికా సాంత్వనంలోని కథానాయిక బాధే ఏ మదన పీడితులకైనా. 'కంటికి నిద్రరాదు, వినుకాంతుని బాసిన నాటి నుండియున్/వంటకమింపు గాదు, పెఱవార్తలు వీనుల సోకలేదు నే/డొంటిగ బ్రొద్దుపోదు, మరులూరక యుండనీదు, తొల్లినే/జంట బెనంగు వారిగన జాలక చాల కరంగ గంటినో' అంటూ పెంపుడు చిలుక ముందు కంటనీరు పెట్టుకొంటుంది రాధిక ఒంటరి తుంటరి ఒంటిబాధ భరించలేక. సుభద్రను తొలిరేయి సమాగమానికి స్వయంగా అలంకరించి భర్త వద్దకు పంపిన తాళ్ళపాక తిమ్మక్కవారి 'ద్రౌపది'దీ అదే హృదయ వేదన. 'విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా!' అంటూ పింగళి వంటివారు ఎంత వూరించినా నండూరివారి నాయుడు బావకిలా గుండె గొంతుకలో కొట్లాడుతుండే కూకుండనిస్తుందా కూసింతసేపు?! 'ఒక ముద్దుకోసం యుగాలైనా ఆగుతాను/ తన పొందుకోసం యోజనాలు సాగుతాను' అని బీరాలు పలికే ప్రేమదాసులు మూడుముళ్లు పడితేచాలు... తొలి రేయిదాకానైనా తాళలేరు. 'ఆలుమగల మధ్యగల ఆ అనుబంధం కాలం గడిచేకొద్దీ బలమైన స్నేహబంధంగా మారితేనే ఆ సంసారం సరస సుధాసారం... ఆ జంట లోకం కనులపంట' అంటాడు ఉత్తర రామచరిత్రలో భవభూతి. ఈ తరం యువతరం తొందరపాటు, కలిసి నడవడంలోని తడబాటు, నూతన దంపతుల్లోని ఎడబాటును మరింత వేగంగా పెంచుతోందని మానసిక శాస్త్రవేత్తలిప్పుడు ఆందోళన చెందుతున్నారు.

'ఆమె కడలి తీరపు దీపం. కాకపోతే... అతను సంసార సాగరంలో జాడ తెలియని ఓడ. అతను సాగర హృదయ వైశాల్యం కాకపోతే ఆమె సంగమ సాఫల్యం అందని నదీసుందరి' అంటాడొక ఆధునిక కవి. ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో కుమారీ శతకం ఏనాడో తెలియజెప్పింది. భర్తకు భోజనం వడ్డించేటప్పుడు తల్లిలా, పవళింపు సేవలో రంభలా, ఆలోచనల వేళ మంత్రిగా, సేవించేటప్పుడు దాసిగా మెలగాలంటుంది. మరి, భర్త ఎలా ఉండాలి? ఆలుమగలు ఆకాశం, భూమిలాగా- హృదయవైశాల్యం, సహన సౌశీల్యం అలవరచుకుంటేనే ఆ దాంపత్యం వాగర్ధ ప్రణయైకమత్యమంత ఆదర్శప్రాయమవుతుంది. 'ఆత్మ సమానత్వం పొందిన జీవిత భాగస్వామి ముందు మోకరిల్లటం ఆత్మనమస్కారమంత ఉత్తమ సంస్కారం' అని కదా మల్లినాథహరి కిరాతార్జునీయంలోని ఒక ఉపకథాసారం! 'పొందనేర్తునె నిన్ను పూర్వజన్మ / కృతసుకృత వైభవమున దక్కితివి నాకు' అని ఆమె అనుకోవాలి. 'ఎంత మాధుర్యమున్నదో యెంచగలనె! / సలలిత కపోల నీ మృదుసూక్తిలోన' అని అతను మనస్ఫూర్తిగా భావించి పైకి అనాలి. పెళ్ళినాటి సప్తపదిలో ముందు నాలుగడుగులు వధువు వరుణ్ని నడిపిస్తే, మిగిలిన మూడడుగులు వరుడు వధువు చేయిపట్టుకొని నడిపించేవి. పెళ్ళిపీటల మీద అగ్నిసాక్షిగా పరస్పరం చేసుకొన్న ప్రమాణాలు కాళ్ల పారాణి పచ్చదనం తడి ఆరకముందే నేటితరానికి మరపునకు రావడం విచారకరం. పెరుగుతున్న విడాకులకు విరుగుడుగా పొరుగున చైనాలోని బీజింగ్ తపాలాశాఖ ప్రేమలేఖల చిట్కా ప్రవేశపెట్టింది. మూడుముళ్లు పడిన మరుక్షణంలోనే వధూవరులు తమ జీవిత భాగస్వాముల మీదున్న ప్రేమనంతా ఒలకబోసి రాసిన ప్రేమలేఖలను ఆ శాఖవారు భద్రపరచి ఏడేళ్ల తరవాత తిరిగి ఇస్తారట! పెళ్ళినాటి ప్రమాణాలు మళ్ళీ గుర్తుకొచ్చి ఎడబాటు ఆలోచనలు తగ్గుముఖం పడతాయన్నది వారి సదాలోచన. కలకాలం కలిసే ఉండాలన్న కోరికలు మరింత బలపడితే శ్రీ గౌరీశ్వర సాన్నిహిత్యంలా వారి దాంపత్యం కళకళలాడుతుందన్న ఆలోచనే హర్షణీయం. అందమైన సంసారాలను ఆశించే వారందరికీ అది ఆచరణీయం.

(06-10-2011నాటి ఈనాడు సంపాదకీయం)

Wednesday, April 27, 2016

చావడానికి ఎందుకురా తొందర?!- చావుమీద ఓ సరదా వ్యాఖ్య

చావనేది లేకుండా ఉండేందుకు పూర్వకాలంలో రాక్షసులు తపస్సులు చేస్తుండేవాళ్ళుట. అమృతంకోసమే గదా అంత ఘోరమైన వైరాన్నికూడా పక్కన పెట్టి దేవదానవులు క్షీరసాగర మధనానికి పూనుకున్నదీ! కోరుకొంటే మినహా మృత్యుదేవత మహాత్ములను ఆవహించేది కాదని మనకో నమ్మకం. మహాభారతంలోని భీష్మాచార్యులవారు స్వఛ్చంద మరణం వరంగా పొందివున్నా  తన కర్తవ్యపాలన పూర్తి అయేవరకు అంపశయ్య వదిలి  పారిపోలేదుబ్రహ్మంగారివంటి సిద్ధులు సైతం తమ పాత్రపోషణ సంపూర్ణమయిన తరువాతే  సజీవసమాధికి సిద్ధమయింది. మృత్యుపాశంనుంచి తప్పించుకునేందుకు భక్త మార్కండేయుడు పడ్డ అవస్థలు తెలిసీ నేటి యువతరం ప్రాణాలు తీసుకొనేందుకు ఎందుకంతలా ఆరాటపడుతున్నారో అంతుపట్టకుండా ఉంది! కాటికి కాలు చాచుకుని కూర్చున ముసలీ ముతకా సైతం.. మనుమలు.. మనవరాళ్ళందరికీ పెళ్ళీ పేరంటాలయి పిల్లా పాపా పుట్టుకొస్తేగాని చూసి హరీమనేది లేదని మొండికేసే రోజుల్లో.. పసిమొగ్గలు అలా ఉత్తిపుణ్యానికి ఉసురు తీసుకోడం ఉసూరుమనిపించే విషయమే గదా!
యాండీ రూనే అనే ఆంగ్లరచయిత చావును గురించి ఓ చక్కని వ్యాసం ప్రచురించాడు. 'ఫలానా రోజున పైకి పోబోతున్నావన్న సమాచారం తెలిపే  కవరుగాని వస్తే దాన్ని తెరిచి చూసేందుకుకైనా ఎవరూ సాహసం చేయలేరు'అని యాండీ థియరీ! తప్పని పరిస్థితుల్లో గనక తెరిచి చూడవలసివస్తే.. చావు ఘడియలు దగ్గర పడ్డాయన్న దుఃఖవార్త తెలిసిన ఆ అభాగ్యుడు ఆఖరిక్షణాల్లో ఎలా ప్రవర్తిస్తాడన్న అంశంమీద యాండీ రాసిన ఆ వ్యాసం చాలా అసక్తిదాయకంగా ఉంటుంది. నవ్వు పుట్టిస్తుంది. నిజమేగానీ ఎవరి  ప్రాణాలైనా  అలా ఆర్థాంతరంగా గాల్లో కలిసిపోవడం నవ్వులాట వ్యవహారం కాదు గదా!
చావు దగ్గర పడ్డవాడు- ఆలుబిడ్డల్ని గురించి.. కన్నవారిని గురించి ఆలోచించకుండా ఉండగలడా? తన తదనంతరంకూడా తనవారి  బతుకులు కుదుపులేవీ లేకుండా సాగాలని కోరుకోకుండా ఉండగలడా! డబ్బున్నవాడైతే వీలునామాలాంటిదేదో రాసి పడేసి వివాదాలకు తావులేకుండా    చూసుకుంటాడు.
ఏ ఏ ఆస్తిపాస్తులకు సంబంధించిన పత్రాలు ఏ బ్యాంకులాకర్లలో మూలుగుతున్నాయో.. అంత బాధలో కూడా ముక్కుతూ మూలుగుతూ అయినా నమ్మదగ్గవాళ్ళ దగ్గర చెప్పుకొంటాడు. పిల్లల చదువులు.. పెళ్ళి పేరంటాలు.. వాళ్ళ పిల్లలకు పెట్టవలసిన పేర్లతో సహా తాను ఏమేం కోరుకొంటున్నాడో  అంత గుబుల్లోనూ ఓ టైంటేబులు వేసి మరీ అప్పగించడం మర్చిపోడు. కుటుంబ యావ బొత్తిగా లేకపోతేనేమి.. చావు క్షణాలు దగ్గర పడ్డాయన్న విషయం తెలిసిన మరుక్షణంనుంచి పడమటి దేశాల పౌరుడైనా సరే.. ఉన్న క్రెడిట్ కార్డుల లిమిట్లన్నీ  గుట్టుగా వాడేసుకొనే గుటుక్కుమనాలని చూస్తాడని యాండీ ఆలోచన.
ఎలాగూ పోతున్నాం గదా.. అని ఇంత కాలం ఉగ్గపటుకొన్న  మందు.. పొగల్లాంటి పాడు అలవాట్లు మళ్ళీ మొదలెట్టే మహానుభావులూ లేకపోలేదని ఆయనగారి  మరో ఎద్దేవా. జుత్తు కత్తిరించుకొనే ఖర్చు మాత్రం అందరికీ ఒకే విధంగా వృథా  అనిపిస్తుందని హాస్యంకూడా ఒలకపోసాడా యాండీ తన వ్యాసంలో. ఇష్టమైన పబ్బులు..  మసాలా మూవీలు ఎంత దూరంలో ఉన్నాసరే వెళ్ళి చూసి తరించాలని ఉవ్విళ్లూరే  విలాసవంతుల లీలలయితే ఇహ వేరే చెప్పల్సిన అగత్యమే లేదుట. తిండియావ ఉన్నవాళ్లయితే ముప్పూటలా మేతమీదనుంచి ధ్యాస మళ్ళించరని  యాండీ చమత్కారం. ఏది ఏమైనా ఫ్వూనరల్ ఏర్పాట్లు స్వీయాభిరుచుల ప్రకారం  దగ్గరుండి మరీ చేసుకొనే సౌకర్యంమాత్రం ఆ దురదృష్టవంతులకు ఒక్కళ్లకే సొంతం కదా! ఆహా! ఎంత అదృష్టంహఠాత్తుగా ప్రాణాలు తీసుకొనే ఆవేశపరులకు కనీసం ఆ వెసులుబాటైన దొరకదు! ప్చఁ.. దురదృష్టం!
నిజానికి ప్రాణాలు తీసుకోవడం ప్రాణాలు పోయేటంత బాధాకరంగా ఉంటుంది. ఇంతకాలం ఎంతో శ్రద్దాసక్తులతో పెంచి పోషించుకొన్న కుక్కా,, మొక్కా వదిలి పోవడం ఎంత బాధాకరం! ఏ సంసార ఝంఝాటం వద్దనుకొని ..బైరాగిలా బతుకు వెళ్లదీసే బాపతు సన్నసైనా తెల్లారితే బతుకు తెల్లారిపోతుందని తెలిస్తే తెల్లవార్లూ కుమిలి పోకుండా ఉండగలడా! చేతిలో చిల్లిగవ్వ లేకపోతేనేమి.. అన్నీ పక్కమీదనే  జరిపించుకొనే  రోగిష్టిమారి జీవి అయితేనేమి.. ప్రాణాలు పోతున్నాయని తెలిస్తే సంతోషంతో గంతులేస్తాడంటే నమ్మలేం. అవుట్ రైట్ గా 'అసలే జన్మా వద్దు .. పొమ్మ'ని సన్యాసులు అనే మాటలన్నీ  మాట వరసకనే మాటలుగానే తీసుకోవాలి. న్నో బాధలు పడే అభాగ్యుడికైనా సరే.. వచ్చే జన్మలో ఏ బిల్గేటు కొడుగ్గానో.. మోదీలాంటి పిడుగ్గానో.. మహేష్ బాబుకి మోడలుగానో పుడితే బాగుణ్నన్న బలీయమైన వాంఛ మనసు అట్టడుగు  పొరల్లో ఎక్కడో దాగి ఉంటుంది. మరలాంటప్పుడు చేతిలో ఉన్న విలువైన మానవజన్మను చూస్తూ చూస్తూ వదులుకోవడం ఏమంత తెలివైన ఆలోచన!.. విడ్డూరం కాకపోతే!
ఈ మద్య ఏ వార్తాపత్రిక తిరగేన్తున్నా.. ఏ టీ.వీ చానెల్ తిప్పి చూస్తున్నా.. చావు వార్త కళ్లబడకుండా ఒక్క పూటైనా చల్లంగా గడుస్తున్నదా! ఓపికున్న వాళ్ళెవరైనా ఈ దిక్కుమాలిన చావువార్తలు  లెక్కలు తీసి చూడండి! భూమి పుట్టినప్పట్నుంచీ పోయినవాళ్లే ఉన్నవాళ్ళకన్నా ఎన్నో రెట్లు అధికమన్న చేదునిజం  బైటపడుతుంది. బాధ పుడుతుంది.
అంతుబట్టని రోగాలతో..  ఆహారపరమైన లోపాలతో.. గర్భస్రావాలతో.. పురిటి బాధలతో.. ఫ్యాక్షనిస్టుల కక్షలతో..  వాతావరణ కాలుష్యాలతో.. . వడదెబ్బలతో.. పరువు హత్యలతో.. మందుతో.. కల్తీ మందులతో.. హరి హరీ.. ఇదీ అదీ అనేమిటి.. చివరికి  చిటికెన వేలంత లేని దోమలతో.. దూకుడుగా తిరిగే వాహనాలతో  సైతం  'హరీ' అనే వారి సంఖ్య రోజు రోజుకూ మరీ మరీ ఎక్కువవుతున్నాయి!అగ్నిప్రాఅదాలు.. భూకంపాలు.. వరదలు..కరువులు వ్హాలకు  ఇప్పుడు అదనంగా సొంతంగా వింత వింత కారణాలతో ఎవరి గొంతులు వాళ్ళే నులుముకోవడాలు ఒకటి..  మితిమీరిపోతున్నాయి.. కలవరం కలిగిస్తున్నాయి! ప్రకృతి సమతుల్యం దీని మూలకంగా దెబ్బతింటే బతికి ఉన్నవాళ్ళకీ చచ్చే చావే!
రైతు పురుగుమందు మింగితే బీడువారిని పొలం మళ్లీ చిగురిస్తుందా? ఆకలికి తట్టుకోలేక నేతపనివాడు చెట్టుకు ఉరి వేసుకొంటే బతికి ఉన్న అతని కుటుంబానికి మేత దొరుకుతందా? ముక్కు మూసుకున్నంత మాత్రాన అప్పుల తిప్పలు ఎవరికీ తప్పిపోవు. మిగిలున్న అతగాడి వారసులను చుట్టుముటి ముప్పతిప్పలు పెడతాయి! ఉన్న ఉద్యోగం ఉద్వాసన పలికిందనో.. వైద్యానికందని రోగం వంటిమీదకొచ్చి వదలడం లేదనో.. చేస్తున్న కంచిగరుడ సేవకు పెద్దల గుర్తింపు కరువయిందనో.. వ్యాపారం ఎక్కిరాక అప్పులపాలు చేసి తిప్పలుపెడుతున్నదనో.. పరీక్షల్లో, ప్రేమలో విఫలమయ్యామనో.. సీనియర్ల ర్యాగింగుల్లో మానవీయకోణం కూడా బొత్తిగా కరువయిందనో.. ఉపాధ్యాయులో.. ఇంటిపెద్దలో విపరీతంగా  మందలించారనో.... అభిమాన తారకు/తారడుకి వేరే వారితో పెళ్లయి పోయందనో.. ఆరాధ్యనేతలు అవినీతి కేసుల్లో చిక్కి చెరసాల పాలయ్యారనో.. కోరుకొన్న రాష్ట్రం ఎంత పోరినా వచ్చి ఓళ్ళో వాలడం  లేదనో.. సెల్ టావర్లు క్కి.. టాంకుబండునుంచి దూకి.. వంటిమీద గ్యాసునూనె ఒలకబోసుకొని... పురుగులమందు మింగి.. ఫ్యానురెక్కలకు ఉరి వేసుకొని.. కన్నవారికి కడుపుకోత మిగల్చడం.. తాము కన్నవారిని అనాథులు చేయడం.. ఎంత తెలివిమాలినతనం! చావడానికిలా తొందరపడడం ఎంత చిచారకరం!
రాజుల ఆట కట్టించేందుకు బంటులు చావడం చదరంగం రూలు. నిజ జీవన రంగంలో  ఎన్ని కోట్లబంటులు ఆత్మార్పణ చేసుకొన్నా రాజుల ఆట కట్టదు. ఆగదు.. చచ్చేందుకు సవాలక్ష దారులు. చావుఘడియ ముంచుకొస్తే.. ఏ మున్సిపాలిటీ చెత్తకుప్పయినా  చాలు.. మీద పడేందుకు! నోరు మూయని బోరుబావో.. మ్యాన్ హోలో చాలు.. లోపలికి లాక్కునేందుకు! ఫలానా రోజున మరణం ఖాయమన్న వర్తమానం అందినా సరే.. ఆఖరి క్షణం వరకు మనిషిగా మెలగడమే మనిషి చేయతగిన పని. బతికేందుకున్నది ఒక్కటే దోవ. గుండె దిటవు.  బతికి తీరాల్సిందేనన్న పంతం ఉంటే చాలు.. అర్థాంతరంగా చావడం ఎంత తొందరపాటో అర్థమవుతుంది. చావడానికి ఎందుకు తొందర?   
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక- 'చుట్టు పక్కల చూడరా' కాలమ్ లో ప్ర
చురితం)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...