ఒంటరులం కాలేం!
1
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎప్పటికీ ఒంటరులం కాము
2
పూల మీద నడుస్తున్నా
పాదం కందకుండా కింద
అమ్మ అరచేయి అడ్డు పెడుతుంది
౩
ఉట్టికెగిరేటప్పుడు
రెక్క తెగి- నువు కింద పడకుండా
నాన్న నీడ పహరాగా నిలబడి ఉంటుంది
4
తోబుట్టువులనే
తోటి చేపలతో
బతుకు తొట్టి
ఈత కొలనుగా
ఎప్పుడూ సందడిగానే ఉంటుంది!
5
నీ రాలి పడే నవ్వులకు
ఒడి పట్టి వెంటబడే లోకం అంటావా
నీతోనే తన లోకం అంటుంది
6
కన్నీరైనా ఒంటరిగా వదలుతుందా నిన్ను!
చెక్కిలి తడి కానివ్వదు
చెలిమి హస్తం చాచే ఉంటుంది
7
చింతల గుంతన అయినా
ఏకాంతంగా వదలదు.
నీ వ్యథలో అర్ధం తనదే
అటుంది నీ ఆత్మ అర్థభాగం
8
ఇక అమావాస్య నాటి
వెన్నెల పక పకలకు మల్లే
పిల్లా జెల్లా ఎల్లకాలమూ
నీ వెనకాలే!
9
చావుతోనే అంతా అయిపోయిందనుకోడం
శుభం కార్డు పడితే
మరో ఆట లేదనుకోడం
10
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎప్పటికీ ఒంటరులం కాము
కాలేం*
హామీ పత్రంః' ఒంటరులం కాలేం' కవిత నా స్వంతం.దేనికీ అనువాదం/అనుకరణ కాదు.అముద్రితం.ఏ ఇతర పత్రికలలోనూ పరిశీలనలో లేదు అని హామీ ఇస్తున్నాను.
-కర్లపాలెం హనుమంత రావు
17-09-2012
No comments:
Post a Comment