Showing posts with label religion. Show all posts
Showing posts with label religion. Show all posts

Thursday, November 28, 2019

కుమతవాదం- వ్యాసం

మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి ప్రసరించుగాక .. అనే వేద సూక్తిని ఉద్బోధిస్తూనే వర్ణ వ్యవస్థ మిషతో సాటి మనిషిని అమానుషంగా అధిక సంఖ్యాక  మతవాదులు గతంలో హింసించిన మాట వాస్తవం కాదని ఎవరం చెప్పలేం.  భారతీయాన్ని .. హైందవాన్ని కలగాపులగం చేసి బుకాయించే ధోరణులను తార్కిక దృష్టితో నిలదీసిన ప్రతీ సందర్భంలోనూ మొదట తార్కిక దృక్పథాన్నే తప్పు పట్టడం .. కొంత దవ్వు సాగిన పిదప విచక్షణకు ఎదురు నిలబడే బలిమి సన్నగిల్లి పాశ్చాత్య ఆలోచనా ధోరణుల మూల అంశం అంటూ  హేళన చేయ బూనడం  .. అబ్బో.. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి సాగుతున్న మత తతంగమే ఇదంతా ! వర్ణ, కుల, విశ్వాసాలనే పొరలతో నిర్మితమైన సమాజం మీద ఆధిపత్యం  కోసం .. నిమ్న కులాలని హింసించిన వాస్తవం పక్కన పెట్టినా .. బ్రాహ్మణవాద విశ్వాసుల మధ్యనే (ఉదా: శైవులు .. వైష్ణవులు .. మళ్లా ఈ విశ్వాసుల మధ్యా  ముద్రాంకితాల మీద కక్షతో కూడిన అంతర్గత పోరులు!) శతాబ్దాల తరబడి విధ్వంస కాండలు సృష్టించిన వైనాల మీద విదేశీయులు తమ పర్యటనల సందర్భంగా ఎన్నో పర్యాయాలు వివిధ వ్యాఖ్యలు చేసినట్లు చరిత్ర చెబుతోనేవుంది.  వాటిపైనా ఏదో మిషతో బురద పులమడం .. ఎప్పుడూ కనిపించే ప్రహసనాలే! 
మనువు అనని మాటలను మనువుకు ఇప్పటి అర్థ సత్యవాదులు అంటగడుతున్నారన్నది కొద్దిమంది హిందూ బుద్ధిమంతుల బాధ. ఆ మాటా  నిజమే! అయితే మాత్రమేం? మను మహానుభావుడు అన్నట్ల్లుగా అధునాతన  హిందూవిశ్వాసులు  ఒప్పుకొనే సూక్తులు (?) చాలవా .. నిమ్న జాతులని పేరుతో కొన్నివృత్తుల వారిని  .. అటరానివారుగా  దూరంగా ఉంచారనడానికి  .. ఇంటి పనికి, వంటి పనికి అవసరమైనప్పుడు కరుచుకుని .. అక్కర తీరిన తరువాత దూరంగా జరగమని ఆడవారిని కరవడానికి! 
ముసల్మానుల వల్ల చెడు జరిగిన మాట కొట్టి పారేయలేం. కానీ వారి మధ్యప్రాచ్య  సంస్కృతి, సాహిత్యాలతో, శిల్ప,  భవన  నిర్మాణాదుల వైభవాలతో  మన భారతీయ సంస్కృతీ మరో విశిష్టమైన కళాకోణం సంతరించుకొన్న మాటా వాస్తవమే.  మంచిని మంచిగా , చెడును చెడుగా విశ్లేషించుకొనే వజ్ఞత  వివేకవంతులైనా ప్రదర్శిస్తుంటే ఇప్పుడు ఓ క్రమపద్ధతిలో పెచ్చరిల్లుతున్న 'సర్వం హిందూమయం' సిద్ధాతం అయోమయానికి. కొంతైనా తాత్విక చర్చ తోడయి ఉండేది . ఖండ ఖండాలుగా ఉండి నిత్యం హిందూ  రాజులు చేసుకొనే అంతర్గత యుద్ధాలతో జనసామాన్యం  శక్తియుక్తులు , జాతీయ వనరులు   వృథా అయే తరుణంలో మధ్యప్రాచ్య పాలకులు అప్రతిహతంగా సాగించిన వరుస విజయాలతో దేశానికి ఒక అఖండత్వం  సాధ్యమైంది.  ఆ విధంగానే ఆంగ్లేయ పాలకుల పెత్తనాల ప్రభావం వల్లా మన స్వాతంత్ర్య ప్రతిపత్తికి పెద్ద దెబ్బ తగలడం, జాతీయ వనరులు సముద్రాలు దాటి తరలిపోవడం వరకు వంద శాతం వాస్తవం. రెండో వాదన  లేదు.  కానీ అదే సయయంలో స్వేచ్ఛా ప్రవృత్తిని బాగా ఇష్టపడే ఆంగ్లేయ సమాజం నుంచి ఇంగ్లీషు భాష , తద్వారా సిద్ధించిన ఇంగితం ద్వారా మన భారతీయ  చింతనాపరులు ఎంతో మందిలో అప్పటి సమాజానికి అవసరమైన సంస్కరణలకు సంబంధించిన ఆలోచనా బీజాలూ పడిన మాటా వాస్తవమే. హిందూమతం మీద మాత్రమే ఏక పక్షంగా  అపేక్ష చూపించే మతతత్వవాదులు ఈ నిజం ఒప్పుకోకపోయినా 'ఓపెన్'  గా యోచించగల ఆలోచనాపరులైనా అంగీకరించవలసి ఉంది. మత విస్తరణ కోసమే ముసల్మానులు , క్రైస్తవులు బడుగు వర్గాలను చేరదీసారు కానీ ప్రత్యేకమైన అభిమానమేమీ కారిపోయికాదు అన్నది హిందూమతవిశ్వాసుల ఫిర్యాదు. నిజమే. కాదనం లేం. జైనులను, బౌద్ధులను .. శైవులు, వైష్ణవులు తన్ని తగలేసినప్పుడు ఆ ధర్మం అధర్మంగా ఎందుకు అనిపించింది కాదో? 
లక్ష్యం ఏదైతే ఏం .. మతం మార్చుకోవడం ద్వారా కొంత ఆత్మసమ్మానం సాధించుకోవడం.. అతిహైందవ బిశ్వాసుల అమానుషు దాడుల నుండి తమను తాము కొంత రక్షించుకోవడమయితే వాస్తవం. హిందూమతం నుంచి కొంతైనా  ఆదరణ లభించి కనక ఉండివుంటే కనీసం కొన్ని వర్గాలయినా ఈ పాటికి మూల మత విశ్వాసం వైపుకు మళ్లి ఉండేవే. ఇప్పటికీ గోమాంస భక్షకుల పేరున అన్నెం పున్నెం ఎరుగని పాత వృత్తులతో పొట్టపోసుకొనే బక్కజీవులను వెంటాడి వేధిస్తుంటిరి! ఇదేమని నిలదీసే మానవతావాదులను పాశ్చ్యాత్య  భావదాస్యులని కించపరుస్తుంటిరి?! 
సౌదీలో ఆడవారికి ఓటు హక్కు కల్పించిన సందర్భంగా ఈనాడు ఆదివారం సంపాదకీయం రాసాను నేను. ఆ టపాను  ఫేస్ బుక్ లో పెట్టినప్పుడు  వయసు సంగతి వదిలేయండి, వాదనలోని సారాంశానికయినా వీసమెత్తు విలువ ఇవ్వకుండా వ్యాఖ్యల పేటికలో అసభ్యమైన వ్యక్తిగత దూషణల పరంపర వెల్లువెత్తింది ఒకానొక సందర్భంలో! ఈ తరహా అతిమతతత్వవాదుల అసహనం గత ఎన్నికలలో  ప్రో-హిందువాదుల చేతికి అధికార పగ్గాలు అందినప్పటి నుంచి క్రమంగా పెచ్చు మీరుతున్నది. 
పెరుగుట విరుగుట కొరకే అన్న మన తెలుగు నానుడిని ఒక అత్యంత పురాతన జాతీయ స్థాయి పార్టీ ఎలాగూ తన వికృత చేష్టల ద్వారా రుజువు చేసుకొని ఉన్నది. చరిత్ర చెప్పే పాఠాలను పట్టించుకొనే అలవాటులేని మరో జాతీయ పార్టీ అదే బాటల్జొ ప్రస్తుతం  ఉరకలు వేస్తో పతనం వైపుకు అత్యుత్సాహంగా పరుగులు పెట్టేస్తున్నది! 
భశుమ్!

Wednesday, May 23, 2018

ప్రార్థనా స్థలాలు.. చరిత్రలో 1




పుట్టటం.. గిట్టటం తప్పవని ప్రకృతిని చూసి గ్రహించాడు ఆదిమానవుడు. విత్తు నుంచి మొలకెత్తిన పిలక పెరిగి వృక్షంగా మారి కాసే పూలు కాయలుగా పండి రాలిన తరువాత వాటి పొట్టవిప్పి చూస్తే కనిపించేవి మళ్లా ఆ విత్తులే. భర్త తన భార్య కడుపున  పుత్రుడుగా జన్మిస్తాడన్న నమ్మకం పెరగడానికి ఇలాంటి దృష్టాంతాలు  సృష్టిలో చాలా కనిపించాయి మనిషికి. కాబట్టే చనిపోయిన తన మనిషి కళేబరాన్ని భద్రం చేయడం అవసరంగా భావించాడు.
మరీ అతి ముతక కాలంలో మృత శరీరం ఏ కుక్కలు, నక్కలు తినకుండా తామే తినేసేవారు  మృతదేహం పరిశుద్ధత నిలబెట్టడం కోసం. తరువాతి దశలో పార్థివ దేహం నేల మీది చీమల, పురుగుల పాలవకుండా ఎత్తైన ఏ చెట్టు కొమ్మల మీదో వదిలేసేవాళ్లు. 'కాకులకు గద్దలకు' వేయడం అనే సామెత అట్లా పుట్టిందే! (మహాభారతం విరాటపర్వం అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలను మూట కట్టి జమ్మి చెట్టు మీద వదిలేసి.. దారే పోయే వాళ్ళను చనిపోయిన తమ తల్లి శరీరమని నమ్మిస్తారు). పక్షులు పీక్కు తినగా మిగిలిన బొమికలను ఏరుకొని ఏ గంగలోనో కలిపే తరువాతి సంస్కారం ఒక పద్ధతైతే.. ఆ అస్తికలను మూటగట్టి ఒక ప్రత్యేకమైన నూతిలో పారేస్తారు. (నేటికీ పార్శీలది ఇదే పద్ధతి). అసలు నేరుగానే శవాలను గంగా ప్రవాహానికి వదిలేయడం మరో విధానంగా ఉండేది. కర్మకాండలలోకెల్లా గంగలో కలపడం ఉత్తమ సంస్కారంగా ఇప్పటికీ భారతీయులు నమ్మడం వల్ల దహనం చేసిన తరువాత ఆ చితాభస్మాన్ని కాశీ వెళ్లి మరీ గంగలో కలిపి వస్తున్నారు సంప్రదాయం నమ్మేవాళ్ళు. నాగరికత అభివృద్ధి చెందిన తరువాత శవదహనం  సంస్కారంగా మారింది. ద్రవిడ సంస్కృతిలో సామాన్యంగా ఖననమే ప్రధాన సంస్కారం.
పూడ్చినా కాల్చినా ఆ కాండ జరిగిన స్థలాన్ని పవిత్రంగా భావించేవాళ్లు బంధువులు. ఆ స్థలానికి గుర్తుగా ఒక రాయి పెట్టడం.. దుష్టశక్తుల కట్టడికి గాను చుట్టూతా రాళ్లు పేర్చడం జరుగుతుండేది. ఆ ప్రదేశాన్ని 'చైత్యం'గా పిలిచేవారు. ఆ చైత్యానికి దగ్గర్లోనే ఒక చిన్న కట్టడం కట్టడం ఒక పద్ధతి. ఆ స్థలం మీదో మొక్కను  నాటడం మరో పద్ధతి. తులసి కోటలు కట్టే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. శ్మశానాలను 'పితృవనాలు' గా పిలవడానికి ఇదే కారణం.
ప్రముఖులు మరణిస్తే ఖననం చేసినా, దహనం చేసినా ఆ స్థలాన్ని స్మృతిస్థలాలుగా మార్చే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. జనకళ్యాణం కోసం జీవితాంతం కృషిచేసిన వైతాళికులకు, మంది కోసం ప్రాణ త్యాగం చేసిన పరిత్యాగులకు, యుద్ధాలలో వీరమరణం పొందిన యోధులకు (వీరగల్లులు), శీలరక్షణ కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ స్త్రీలకు గుర్తుగా  చిన్ని చిన్ని  కట్టడాలు, స్తూపాలు, ఆయతనాలు కట్టే ఆచారం ఉంది. ఆ తరహా  ద్రవిడ సంస్కృతి ఆచరించే ప్రాంతాలన్నింటా ఇప్పటికీ ఆ కట్టడాలు కనిపిస్తాయి.
బుద్ధుడి మహాపరినిర్యాణం క్రీస్తుకు పూర్వం 498లో. ఆ అస్తికలను భద్రపరిచిన పాత్ర మీద సమాధి నిర్మించి శాసనం వేయించారు బుద్ధుని సగోత్రీకులు శాక్యులు.
'ఇయం సలిల నిధానే బుధవ భగవతే సకియానాం
సుకుతి ఛటినాం సభగినకం సపుత దలనం'
(బుద్ధ భగవానుని ఈ శరీర నిధానం దేవుని సుపుత్ర భగనీకులు శాక్యులచే నిర్మించబడింది) అని ఇప్పటికీ కనిపిస్తుంది. ప్రాచీన కట్టడాల మూలకంగా అప్పటి నాగరికతలను గురించి తెలుసుకొనే అవకాశం పురాతత్వశాస్త్రానికి లభిస్తుంది,
బౌద్ధం, జైనంలో చనిపోయినవారి సమాధులకు సమీపంలో చిన్న ఆరామాలు నిర్మించడం ఆనవాయితీగా ఉండేది ఒకానొకప్పుడు. ఆ ఆరామాలనే విహారాలుగా వ్యవహరించేవాళ్లు. బౌద్ధ సన్యాసులు, జైన సన్యాసులు జనపదాలలో నివాసం ఉండేవాళ్లు కాదు. ఈ తరహా ఆరామాలలో నివాసం ఏర్పాటు చేసుకొని  భిక్షకు మాత్రం గ్రామాలలోకి వెళ్లి వస్తుండేవాళ్లు. ఆ కారణం చేత ఆరామాలు సాధారణంగా జనపదాలకు, వ్యాపార మార్గాలకు దగ్గరగానే ఉండేవి. బౌద్ధుల, జైనుల జీవహింస నిషేధం వల్ల పశుసంపద వృద్ధి అవడం, వ్యవసాయం ఊపందుకోవడం, వ్యావసాయిక ఉత్పత్తుల లావాదేవీలకు నెలవైన వ్యాపారాలు అభివృద్ధి చెందడం జరిగింది.  బౌద్ధులకు, జైనులకు కృతజ్ఞతా పూర్వకంగా తృణమో, ఫణమో సమర్పించుకొనే అలవాటు అప్పుడే మొదలు. భూస్వామ్య వ్యవస్థ పుంజుకొని, పెత్తందార్లు, రాజులు బలమైన వర్గంగా ఏర్పడేందుకు ఈ రెండు మతాలు చాలా దోహదం చేసాయనే చెప్పుకోవాలి. అందుకే రాజులు అప్పట్లో ఆ రెండు మతాల వైపు అధికంగా మొగ్గు చూపించేవాళ్లు.
మత విశ్వాసులు ఇచ్చే కానుకలతో జైనులు, బౌద్ధులు ఆర్థికంగా బలపడ్డారు. వారు నివాసముండే ఆరామాలకు కళ పెరిగింది. మత పెద్దల మెప్పు కోసం రాజులు, వ్యాపారులు ఆరామాలను కళలకు కాణాచిగా ఎంత ఖర్చైనా వెచ్చించి మరీ తీర్చి దిద్దేవాళ్లు. ఆ అలంకరణల్లో భాగంగానే ఆరామాల గోడల మీద అందమైన ప్రకృతి దృశ్యాలు, స్త్రీల చిత్రాలు, ఆనందాన్ని ప్రేరేపించే కామకార్యాలు చిత్రీకరణలు క్రమంగా పుంజుకున్నాయ్. ఆరామాల కుడ్యాల మీద కనిపించే పోర్నోగ్రఫీ క్రమంగా దేవాలయాలకు ఎలా పాకిందో మరో సారి..!
-కర్లపాలెం హనుమంతరావు
***

Sunday, May 20, 2018

హిందూ పదం.. మతానికి సూచిక కాదు. అది ఒక సంస్కృతికి సంకేతం - వ్యాసం




'సప్త ద్వీపా వసుంధరా'. భూమి ఏడు ద్వీపాల సంపుటం. ద్వీపం అంటే నీటి మధ్యలో ఉండే భూభాగం. 'జంబూ ద్వీపే, భరత ఖండే, భరత వర్షే' అనే మంత్రం పూజాదికాలలో వింటూ ఉంటాం. జంబూ అనే ఓ ద్వీపం మధ్య ఉన్న భరత ఖండంలోని ఒక భాగం భరత వర్షం(దేశం). అంటే పురాణాల ప్రకారం చూసుకున్నా మనం ఉన్నది హిందూదేశం కాదు. భారతదేశం. మరి ఇప్పుడు తరచూ మారుమోగే ఈ 'హిందూ' పదం ఎక్కడ నుంచి   దిగుమతయినట్లు? కాస్త చరిత్ర తిరగేస్తే ఈ అనుమానం సులభంగా నివృత్తి అవుతుంది.
'హిందూ' పదం నిజానికి ఒక మతాన్ని సూచించదు. అది ఒక సంస్కృతికి సూచిక.
స్వాతంత్ర్యం సాధన తరువాత లౌకిక ప్రజాతంత్ర విధానంలో పాలన జరగాలని తీర్మానించుకున్న మనం  రాజ్యాంగంలో 'హిందూ' అన్న పదానికి పాలనాపరంగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని స్థానే 'భారత్' 'భారత్ దేశ్' అనే పదాలు కనిపిస్తాయి.
యురోప్ ఖండంలో మన దేశానికి 'ఇండియా'గా గుర్తింపుంది. ఆ పాపం తెల్లవాడి వల్ల. 'ఇండికా' 'ఇండిగో' అంటే నల్లమందు అని అర్థం. నల్లమందు కోసం వెతుక్కుంటూ వచ్చిన తెల్లవాళ్లకు ఇక్కడ ఆ నీలిమందు పుష్కలంగా పండే భూములు కనిపించాయి. పాడి- పంట చేసుకు బతికే అన్నదాతల చేత బలవంతంగా నీలిమందు సాగుచేయించిన బీహార్ 'చంపారన్' కథ మనందరికీ తెలుసు. అక్కడి రైతులు బాపూజీ ఆధ్వర్యంలో చేసిన ప్రతిఘటనతోనే మన మలిదశ స్వాతంత్ర్యపోరాటానికి బీజం పడింది.
రాజ్యాంగం 'హిందూ' పదాన్ని గుర్తించలేదు. అటు సంస్కృతీ, ఇటు రాజ్యాంగమూ రెండు గుర్తించని ఈ 'హిందూ' పదానికి మరి ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు పెరుగుతున్నట్లు? ఇంకాస్త లోతుకుపోయి తరచి చూస్తే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయ్!
ఇప్పుడున్న భావన ప్రకారం ఈ దేశంలో అధిక సంఖ్యాకులు ఆచరిస్తున్న మతం 'హిందూ మతం'. అలాంటి ముద్ర వేసిపోయింది ఆంగ్లపాలకులు.  స్వార్థప్రయోజనాల కోసం రాజకీయాలలోకి 'హిందూ' పదాన్ని ఒక మత రూపంలో చొప్పించి పబ్బం గడుపుకుపోయిన మహానుభావులు ఆంగ్లేయులు.
నిజానికి భారతదేశానికి ఒక మతమంటూ పత్యేకంగా లేదు. భారతీయత ఒక తాత్వికత.. అంటే ఓ ఆలోచనా రూపం. వేదాల నుంచి పుట్టిన భావుకత కూడా కాదు. వేదాలే భారతీయనుంచి రూపు దిద్దుకొన్న వాఙ్మయం. గతాన్ని గురించి స్మరించినా.. వర్తమానమే భారతీయతకు ప్రధానం. ఆదీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరంతరం కొత్త వికాసమార్గాలలో ప్రస్థానిస్తుంది భారతీయం. ఒక  ప్రాంతానికో, ప్రజలకో పరిమితం కాకుండా సమస్త మానవాళి కళ్యాణం కోసం పరితపిస్తుందది. మానుషధర్మం నుంచి పక్కకు తొలగకపోవడం భారతీయతలోని విశిష్ట లక్షణం. ఇందుకు చరిత్ర నుంచి ఎన్నైనా ఉదాహరణలు చూపించవచ్చు. ముందు ఈ 'హిందూ' పదం పుట్టుపూర్వోత్తరాలను గురించి కాస్త తెలుసుకొందాం.
తురుష్కులు ఈ దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు  ముందుగా వాళ్ల కంటబడ్డది సింధునది. సింధూని వాళ్లు హిందూగా పిలుచుకున్నారు. ఈ దేశాన్ని హిందూదేశం, ఇక్కడి జనాలను హిందువులు అన్నారు. ముసల్మానుల పెత్తనం వెయ్యేళ్లకు పైనే సాగింది ఈ దేశం మీద. ఆ పాలకుల నోట నలిగి నలిగి చివరికి ఈ దేశం ప్రజల నాలుకల మీదా  'హిందూస్తాన్' గా స్థిరబడింది.
ముసల్మానులతో పాటు ఇస్లామూ వారి వెంట  వచ్చింది. ఇస్తాం ఒక శుద్ధమతం. ఆ మతం ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చిన తరువాతే ఇక్కడి ముస్లిమేతరుల మీద 'హిందువులు' అనే ముద్ర స్థిరపడింది. ఆ హిందువులు ఆచరిస్తున్న ధర్మం హిందూధర్మంగా గుర్తింపబడింది.
'హిందూ' విదేశీయుల మనకు అంటగట్టిన ఒక ‘బానిస ట్యాగ్’ అంటారు దాశరథి రంగాచార్య ‘హిందూత్వంపై ఇస్లాం ప్రభావం’ అనే వ్యాసంలో. బానిసత్వం పోయినా ఇంకా ఆ పరాధీన సూచిక పదాన్నే గర్వంగా చెప్పుకు తిరగడం మనకే చెల్లింది!
స్వాతంత్ర్యం రావడం వేరు. బానిసత్వం పోవడం వేరు. జాతీయభాషగా రాజ్యాంగంలో మనం గుర్తించిన 'హిందీ' పదం అసలు జాతీయపదమే కాదు. అది విదేశీయుల నోటి నుంచి వచ్చిన నిమ్నపదం. ఈ నిజం గుర్తించలేకపోవడానికి పన్నెండేళ్లకు పైగా బానిసలుగా బతకేందుకు అలవాటు పడటమే కారణం కావచ్చు.
మహమ్మదు ప్రవక్త ఇస్లాం మతాన్ని ఒక సంఘటిత శక్తిగా రూపొందించాడు. రాజ్యవిస్తరణ, మతప్రచారం.. అనే రెండు ధ్యేయాలతో ఇస్లాం ఆయుధం పుచ్చుకొని బైలుదేరింది. ఇస్లాం ఆక్రమించుకొన్నంత భూభాగాన్ని, విశ్వాసాన్ని బహుశా చరిత్రలో అంత తక్కువ వ్యవధిలో మరే ఇతర మతం ఆక్రమించి ఉండదేమో!
ఆ ఇస్లాం వెయ్యేళ్లు పాలించిన భూభాగం భారతదేశం. ముసల్మానుల ప్రమేయం లేకుండా భారతదేశ చరిత్ర లేదు. ఇస్లామును తుడిచి పెడతామన్న రాజకీయాపార్టీలు సైతం  మహమ్మదీయులను సంతోషపెట్టే ఓటు రాజకీయాలు చేస్తున్నాయిప్పుడు!
హింసతోనే ప్రచారం ప్రారంభమయినా.. కాలక్రమేణా ఈ దేశ సంస్కృతిలో అంతర్భాగమయింది ఇస్లాం. 'స్వర్గ మన్నది ఎక్కడున్నది?' అంటే ‘ఇదిగో.. ఇదిగో.. ఇక్కడున్నది' అనే వరకు మచ్చికయింది భారతీయతకు. భారతీయ తాత్విక చింతన ఇస్లామును అంతగా ప్రభావితం చేసింది. వెయ్యేళ్ల చరిత్రలో కొన్ని దుర్మార్గాలకు ఒడిగట్టినా.. మొత్తం మీద భారతీయ ధర్మ, సంస్కారాల ప్రభావానికి లొంగిపోయింది ముస్లిముల సంస్కృతి. భారతీయుల మత సహిష్ణుత అలవడ్డం వల్లే.. మిగతా దేశాలలోని దూకుడు కాలక్రమేణా ఇక్కడ తగ్గింది. మతమార్పిడులు జరిగినా.. ఇస్లామేతరాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చివరి వరకు కొనసాగలేదు. ఆదిశంకరుడి అద్వైతం, రామానుజుడి విశిష్టాద్వైతం, వల్లభాచార్యులు, జయదేవుల మధుర భక్తి, తులసి రామాయణం, కబీర్, మీరా, త్యాగయ్య, రామదాసు, అన్నమయ్యల భక్తివాఙ్మయం ముస్లిం పాలకుల కాలంలోనే దేశానికి దక్కింది. ఇంత సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక భావజాలం వర్ధిల్లనీయడానికి కారణం ముస్లిముల మీద పడిన భారతీయ తాత్విక సహిష్ణుత ప్రభావం,
ఆరు నెలల సావాసానికి వారు వీరు అవుతారంటారు. వెయ్యేళ్ల సహజీవనంలో భారతీయత నుంచి ఇస్లాం స్వీకరించిన  సాంస్కృతిక సంపద స్వల్పమేమీ కాదు. భారతీయ చింతనలో వచ్చిన మార్పూ కొట్టిపారేసిది కాదు. పార్శీ ప్రభావంతోనే ఎదిగినా ఉర్దూ షాయిరీలో సంస్కృత సాహిత్య  ఛాయలు సుస్పష్టంగా కనిపిస్తాయ్! సూఫీ సిధ్దాంతానికి భారతీయ తాత్వికతే తల్లి. ఉత్తర భారతంలో వేషభాషల మీదే కాక, ఆహార అలవాట్ల మీదా ముస్లిం సంస్కృతి అధికంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులు నమ్మని ఏకబ్రహ్మ సూత్రాన్ని ముస్లిం ఆధ్యాత్మికత ప్రభావం వల్ల అద్వైత, విశిష్టాద్వైత సిధ్దాంతాలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరాది దేవాలయాల్లో నేటికీ సాగే 'ఆరతి' సంప్రదాయం ముసల్మానుల 'సామూహిక ప్రార్థన'లకు అనుకరణే. భారతీయత  మౌలిక నిర్మాణం తీరుతెన్నులవల్ల  అనుకూలించక   ఎప్పటికప్పుడు బెడిసిగొడుతున్నవి కానీ  భారతీయ సమాజం మొత్తాన్నీ ఒకే ఛత్రం కిందకు తెచ్చేందుకు ఇప్పుడు హిందూత్వ చేస్తున్న ప్రయత్నాలు ముస్లిముల అఖండ మత సిద్ధాంతంతో ప్రభావితమైనవే!
కానీ భారతీయత ‘ధర్మం వేరు.. రాజకీయం వేరు.. గా’ ఉంటుంది. లౌకికధర్మం రాజకీయాన్ని శాసిస్తుంది.  సమాజం ఆ తరహా ధర్మాన్ని రక్షిస్తుంటుంది. రాజకీయం ధర్మాన్ని శాసించే తత్వం  పరాయి మతప్రధానదేశలోలాగా భారతీయ సమాజంలో చెల్లదు.  
హిందూ ముస్లిముల మధ్య వ్యక్తిపరమైన వైరుధ్యాలేమైనా ఉంటే ఉండవచ్చు  కానీ మతపరమైన ఘర్షణలు  ఉండేవి కాదు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకొనే వరకు ఈ సహోదరభావం వర్ధిల్లింది. కాబట్టే 1857 స్వాతంత్ర్య పోరాటంలో బహదూర్ జఫర్ షా చక్రవర్తి కావాలని  హిందూప్రభువులు సైతం ప్రాణాలర్పించడానికి సిధ్దపడి పోరాడారు. తెల్లవాళ్లను విదేశీయులుగా భావించి తరిమికొట్టేందుకు హిందూ ముస్లిములిద్దరూ సంఘటితంగా తిరుగుబాటు చేసారు. మత సిధ్దాంతాల మధ్య వైరుధ్యాలను పక్కన పెట్టి హిందూ ముస్లిములు  ఒక్కటిగా ఉన్నంత వరకు తమది పై చేయి కాదన్న తత్వం తలకెక్కింది కాబట్టే విభజించి పాలించే విధానానికి తెరలేపింది తెల్లప్రభుత.
టర్కీ సుల్తాను నుంచి మతాధికారాలని ఊడలాక్కొన్న సందర్భంలో ముస్లిముల ఆత్మగౌరవానికి అవమానంగా భావించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిములిద్దరూ కలిసే ‘ఖిలాఫత్’ ఉద్యమం నదిపించారు. బెదిరిన బ్రిటిష్ దొరలు 'హిందూ రాజ్యంలో ముస్లిములకు రక్షణ ఉండదు' అన్న దుష్ప్రచారాన్ని ముమ్మరం చేసినప్పటి నుంచి రెండు మతాల మధ్య కనిపించని పొరపచ్చలు మొదలయ్యాయి. జిన్నా సారధ్యంలో ఏర్పడ్డ ముస్లిం లీగ్ ప్రత్యేక ఇస్లాం రాజ్యం కోసం చేసిన ఉద్యమంతో ఇరు మతాల  మనోభావాలు  తిరిగి మెరుగవనంతగా  చెడిన కథంతా మనకు తెలిసిందే!

ముస్లిములలో పెద్దలు కొందరు పెద్దలు మతద్వేషాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే,, హిందువుల్లో కొందరు మహానుభావులు మతద్వేషాన్ని రెచ్చగొట్టే కుత్సితానికి పాల్పడ్డారు. హిందువులు ఒక తాత్విక జాతిగా స్వభావరీత్యా  పరమతాలను ద్వేషించరు. కానీ ఆ కొద్దిమంది మహానుభావులకు మరికొంతమంది బుద్ధిమంతులు తోడవుతూ అనునిత్యమూ ప్రజల మధ్య సామాజిక శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు.
భారతదేశం విభిన్న విశ్వాసలకు ఆలవాలం. బౌధ్ధం, జైనం, శాక్తేయం, చార్వాకం వంటి పరస్పర విరుధ్ద విశ్వాసాలు సయోధ్యతో సహజీవనం సాగించాయి ఇక్కడ. స్వాతంత్ర్యం సాధించుకున్న తరువాతా సుఖజీవనానికి అవసరం లేని మతద్వేషాలు  అవసరమా? ప్రత్యేక మతరాజ్యం సాధించుకొనేందుకు అప్పట్లో ఆయుధంగా వాడిన మతవిద్వేషాలను ఇంకా ఏం సాధించాలని ఇక్కడ కొనసాగిస్తున్నట్లు?! 'సర్వే జనా సుఖినో భవన్తు' అన్నది భారతీయత మౌలిక ధార్మికసూత్రం. ఆ స్ఫూర్తి సంపూర్ణంగా ధ్వంసమయేదాకా మతవాదం అతిచొరవ చూపిస్తే సమాజమే శిక్షిస్తుంది. చరిత్ర చాలా సార్లు రుజువులతో సహా నిరూపించిన ఈ హితవును పెడచెవిన పెడతామంటే  .. సరే,, స్వయంకృతానికి ఇక ఎవరైనా  చేసేదేముంది?
***
కర్లపాలెం హనుమంతరావు
2౦ -05 -2018
(దాశరథి రంగాచార్య అక్షర మందాకిని (8) – హిందుత్వం పై ఇస్లాం ప్రభావం –వ్యాసం – ప్రేరణతో)

Saturday, May 12, 2018

నేటి మతోన్మాదానికి చారిత్రక నేపథ్యం ఉంది




ప్రకృతికి మనిషికి తాత్విక సంబంధంగా 
మొదలయినది మతం. మానవ పరిణామ దశల క్రమంలో ప్రారంభంలో అదో నమ్మకం.. ఆనక అదే ఓ విశ్వాసంగా బలపడింది. సమాజం అభివృద్ది చెందే వివిధ దశల్లో ఆ ‘మత’మే ఉన్నత వర్గాల వారు కింది తరగతుల వారిని తమ చెప్పుచేతుల్లో ఉంచుకొనే సాంస్కృతిక ఆయుధంగా మారిపోయింది. అదో చారిత్రక విషాదం.
మనిషి ఆదిమ దశలో ప్రకృతి నుంచి ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలో తెలియని నిస్సహాయతతో ముప్పిరిగొన్న భయం నుంచి బైటపడేందుకు అదృశ్య శక్తులేవో ఉన్నాయని ఊహించుకొని. వాటిని కర్మకాండల ద్వారా సంతృప్తిపరిస్తే కష్టం నుంచి గట్టెక్కవచ్చని భావించాడు. అతగాడి అజ్ఞానం, అమాయకత్వం, అసహాయత, అవగాహనాలేమి ఇత్యాదుల వల్ల మొదలైన ఆ కర్మకాండలకు ఒక సైధ్దాంతిక రూపం కల్పించి పూజాదికాలు అతని జీవితంలో  ఒక ప్రధాన విధానంగా మార్చింది పూజారి వర్గం.   దైవసంబంధమైన ఆ కర్మకాండలు నిర్వహించే హక్కు కేవలం తమ చెప్పుచేతల్లో ఉంచుకుంది. పూజారికి దేవుడి ప్రతిరూపం అనే ఇమేజి స్థిరపడింది. మతం మీది అతని గుత్తాధిపత్యం ఎప్పుడూ ధిక్కరణకు గురి కాలేదు. అప్పుడప్పుడు ఏ చిన్న  చైత్యన్యవంతమైన ఆందోళన చెలరేగినా వాటిని మొగ్గదశలోనే తుంచివేయడం జరిగేది. పాలకుల అండదండలు పుష్కలంగా గల బ్రాహ్మణ వర్గానికి అదంత కష్టసాధ్యం కూడా కాలేదు.
అత్యధిక సామాన్య వర్గ ప్రజల సాంస్కృతిక, జీవన విధానాలు  మతం పునాదుల మీదే నిర్మితం కావడం మతానికి సమాజం మీద అమితమైన పట్టును తెచ్చిపెట్టింది. భూస్వామ్య వర్గమూ  మంది సాంస్కృతిక బలహీనతలను సొమ్ము చేసుకోవడంలో వెనుకబడింది లేదు.  తన వంతు కుట్రగా కులాల ప్రాతిపదికన  సమాజాన్ని మరో మారు చీల్చిందది.. ప్రాబల్యం అధికంగా గల కులాలకు ఉత్పత్తి వృత్తులతో నిమిత్తం లేదు. సమాజ సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల మీద  పెత్తనం మాత్రం  ఆ పూజారి వర్గాలకే అప్పగించబడింది. భూస్వాములకు, పూజారులకు మధ్య అంతర్గతంగా కుదిరిన ఈ అన్యాయపు ఒప్పందం మూలకంగా ఉత్పత్తి వృత్తుల మీద ప్రత్యక్షంగా ఆధారపడిన బడుగు జీవులు మరోమారు ఘోరమైన దోపిడీకి గురయ్యారు.
మధ్యయుగాలలో ఈ దేశం మీదకు దండెత్తుకొచ్చి పెత్తనం చేసిన మొగలాయీల మొదలు ఇటీవల వరకు అధికారం చెలాయించిన వలస పాలకుల వరకు.. అందరిదీ ఒకే దోపిడీ పంథా. ఏ అగ్రవర్ణానికీ, అగ్రవర్గానికీ  బడుగుల జీవన స్థితిగతుల  మెరుగుదల పట్ల  ఆసక్తి లేకపోయింది. పాలకులతో భూస్వామి వర్గాలు రాజీ ధోరణితో సర్దుకుపోతే.. అర్చక వర్గాలు మతం మీద తమకున్న పట్టు చూపించి ఆయా పాలకులను  అధీనంలో ఉంచుకొన్నాయి.
వలస పాలకుల వల్ల జాతీయ సాంస్కృతిక జీవనంలో సగుణాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని భావించే వాళ్లేమీ తక్కువ లేరు. వలస పాలకులు తెచ్చిన ఏ సాంస్కృతిక సంస్కరణా బడుగుల మౌలిక స్వరూపాన్ని మార్చే దిశగా సాగింది లేదు.  ఏ కొద్ది మార్పో వాళ్ల జీవితాల్లో సంభవమైనప్పటికీ జఅదీ  పాలకులకు మేలు కలిగించే వరకు సాగి అక్కడితో ఆగిపోయేది. పీడిత వర్గాలు చైతన్యవంతమైతే   తమ అధిపత్యానికి ఎదురయ్యే సవాళ్ళు  అగ్రవర్ణాలు, వర్గాలు ముందస్తుగానే ఊహించి తగు జాగ్రత్తలు తీసుకొనేవి.
చార్వాకుడి నుంచి గౌతమ బుధ్దుడి దాకా, భక్తి ఉద్యమం మొదలు గాంధీయిజం వరకు ఈ దేశంలోని అన్ని ఉద్యమాలు మతవాదులతో సర్దుబాటు ధోరణిలోనే వ్యవహరించాయి. అలా వ్యవహరించాయి కాబట్టే వాటి మనుగడను కొంతవరకైనా సాగనిచ్చింది మతవర్గం. స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీజీ భూస్వామ్య వ్యవస్థను ఎక్కడా ధిక్కరించిన దాఖలాల్లేవు. పైపెచ్చు జనసామాన్యం మనసులు సులువుగా గెలుచుకొనేందుకు మతచిహ్నాలను సైతం విశృంఖలంగా  వాడారాయన. గాంధీజీ తెచ్చేందుకు ప్రయత్నించిన సంస్కరణల్లో చాలా భాగం మతవాదాన్ని మరింతగా సమర్థించే దిశగానే సాగాయంటే కొంతమందైనా నొచ్చుకుంటారని తెలుసు. నిష్ఠురమనిపించినా నిజం నిజమే అవుతుంది కానీ.. ఎన్ని ముసుగులు వేసినా అబద్ధం కాబోదు కదా!
స్వాతంత్ర్యం వచ్చినా ఈ దేశ ఆర్థిక విధానాలలో ఇదే తరహా ద్వంద్వ వైఖరి  కొనసాగింది. జాతి సాధించిన అభివృధ్దిలో అధిక శాతం పది శాతంగా ఉన్న అగ్రవర్ణాలు, వర్గాల వద్దే పేరుకు పోవడం మునుపటి కథ. ఇప్పుడు ఆ పది శాతం  రోజు రోజుకీ మరింతగా కుచించుకుపోతోందన్న  అంచనాలు వింటున్నాం.
లాభాల బాటలో ఉన్న సంపన్న వర్గాలు ఏ కారణాల కోసం తమ  సౌకర్యాలను స్వఛ్చందంగా బడుగు వర్గాలకు ధారాదత్తం చేస్తాయి? తమ అభివృధ్ధికి ఆటంకం కలిగించే బీదల పాట్లను కనీసం అర్థం చేసుకొనేందుకైనా ఆసక్తి చూపించవు. సరికదా.. నూతన విజ్ఞానం రగిలిస్తున్న సామాజిక స్పృహ కారణంగా  అభివృధ్దిలో తమకు న్యాయంగా దక్కవలసిన వాటా కోసం బడుగులు ఇప్పుడు చేస్తున్న ఆందోళనలకు  అడ్డుకట్ట వేసేందుకు  కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తాయి కూడా! అందులో భాగమే మతాల క్రియాశీలక రాజకీయ పాత్ర.
గతంలో మాదిరి  మతాన్ని కేవలం సామాజిక ఆధిపత్యం కోసం మాత్రమే వాడుకొనే ఆయుధంగా భావించడం లేదు అగ్రవర్ణాలిప్పుడు. మతం నెత్తికీ ఒక రాజకీయ టోపీ తగిలించి.. చేతికో జెండా అందిస్తే మిగతా అన్ని చిటుకుల కన్నా శక్తివంతంగా సామాన్యుల జీవితాల్లోకి చొరవగా చొచ్చుకు పోవచ్చు. మకిలి అంటకుండా స్వకార్యం సాధించుకొనేందుకు  మతానికి మించిన గమ్మత్తు మత్తు పదార్థం ఈ దేశంలో  ఇప్పటికి వరకైతే మరోటి  లేదు.
మసీదులు పడగొట్టి ఆలయాలు కడతామన్న అజెండా ప్రకటించుకున్న మర్నాటి నుంచే అప్పటి వరకు ఏదో మూల నక్కి ఉన్న  మతవాదం రాజకీయ రూపం ధరించి అప్రతిహతంగా ముందుకు దూసుకొచ్చింది ఈ దేశంలో. 2014లో పాలకులు మార్పిడి జరిగినప్పటి నుంచి కాశ్మీరు టు కన్యాకుమారి.. సర్వత్రా పెచ్చుమీరుతున్న ఉన్మాద ధోరణులకు.. గతంలోనే సామాజిక వ్యవస్థ మూలాలలో విత్తబడిన మతబీజాలే మూలకారణం. ప్రజాఉద్యమాలకు సైతం దేవుళ్లకు  ముడుపులు కట్టే వైరుధ్యం సామాన్య ప్రజలు ప్రశ్నలకు గురికాక పోవడం అందుకే ఈ దేశంలో సంభవమయింది! ప్రజలు తమ రెక్కల కష్టంతో నింపిన బొక్కసాలను యజ్ఞాలు, యాగాలు, పుష్కరాలు, దీక్షల పేరుతో పాలకులు ఖాళీ చేసేందుకు తెగబడుతున్నా ఇదేమని ప్రశ్నించాలన్న స్పృహే కరువైన ప్రస్తుత రాజ్యంలో  మతాతీత కులాతీత లౌకిక ప్రజాస్వామ్య సంక్షేమ వ్యవస్థను కాంక్షించడం ఎంత వరకు సబబు?! వలస పాలకుల నుంచి రాబట్టుకున్న రాజ్యమే లౌకిక సమాజాన్ని నిర్మిస్తుందన్న ఆశ ఇంకా మిగిల్చుకున్నవాళ్లకూ ఓ నమస్కారం.
పీడనకు గురిచేస్తున్న  మతవిశ్వాసాల ముందే భయభక్తులతో లొంగి   బతుకీడ్చేందుకు సిధ్దపడే పీడితుల మానసిక  బలహీనతలను శాస్త్రీయకోణంలో విశ్లేషించుకోవలసిన అవసరం మునపటి కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. పీడిత వర్గాలను సంఘటిత పరిచి సరైన దిశకి మళ్లించే ప్రగతి కాముక  సాహిత్యం  అందుకే ఇప్పుడు మరింత ముమ్మరంగా  విస్తరించాల్సుంది. మతంలోని గమ్మత్తు మత్తునుంచి సామాన్యుణ్ని బైటకుతెచ్చే సామాజిక బాధ్యత మేధావుల మీదే ఎక్కువగా ఉంది. మతోన్మాదం పెచ్చుమీరుతున్న ఈ దుర్మార్గ తరుణంలో మౌనం పాటించడమంటే మేధావులు తెలిసి  జాతికి చేస్తున్న ద్రోహం కిందే లెక్క.
*** 
-కర్లపాలెం హనుమంతరావు
(మతోన్మాదం .. చారిత్రక నేపథ్యఁం -హరిపురుషోత్తమరావు – విభిన్న. పుట. 33- ప్రేరణతో)


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...