Wednesday, September 9, 2020

చిన్న కథ: కాలం 'మార్ ' తోంది మరి! 🙃😏🙃 -కర్లపాలెం హనుమంతరావు




1970.. మట్టిగుంట 

సుబ్బయ్యతాత, సుందరమ్మమామ్మ ప్రయాణిస్తోన్న ఒంటెద్దు బండి డొంక రోడ్డులో గడ్డ అడ్డమొచ్చి గుంటలోకి పల్టీకొట్టింది.

 బాగా గాయాలయి అపస్మారకంలోకి జారిపోయారిద్దరూ!  ఆచారులగారి ఒకరోజు సపర్యల అనంతరం కళ్లు తెరిచిన ఉత్తర క్షణం సుబ్బయ్యతాత ఆందోళనగా అడిగిన మొదటి ప్రశ్న 'దానికి (భార్యకు) ఎలా ఉంది?' అని. ఒక అరగంట విరామంలో కళ్లు తెరిపిడి పడ్డ సుందరమ్మ మామ్మ  'ఎలా ఉందమ్మా ఇప్పుడూ?' అని ఆచారులవారు వేసిన ప్రశ్నకు బదులుగా తనే మరో ప్రశ్న వేసింది 'ముందాయనకు ఎలా ఉందోచెప్పండి?' అని. 'బాగానే ఉంది' అనే సమాధానం విన్న వెంటనే మెడలోని పుస్తెలతాడును కళ్లకద్దుకుంది! 


1990.. విజయవాడ 

సుబ్బారావు, సుందరి కనకదుర్గమ్మను దర్శనం చేసుకుని గుడి మెట్లు దిగి వస్తూండగా వెనక నుంచి ఎవరో ఇద్దరు దెబ్బలాడుకుంటో ఆ దంపతుల మీదకు వచ్చి పడ్డారు. సుందరి పట్టు తప్పి సుబ్బారావు మీద పడడం.. అనుకోని ఆ తోపుడుకు సుబ్బారావూ తూలడం! 

సుబ్బారావు కళ్లు తెరిచి చుట్టూ  చూసి తానున్నది ఓ మధ్య తరగతి ఆసుపత్రి బెడ్డు మీదని గుర్తించాడు. 

' ఏమయింది నాకు?'అని అడిగితే జరిగింది చెప్పి  'సమయానికి రక్తం దొరికింది.కాబట్టి గండం గడిచిందీ' అని సమాధానం వచ్చింది నర్సు దగ్గర్నుంచి. తనది, సుందరిదీ ఒకే గ్రూపు రక్తం. ఆమె రక్తం ఇచ్చివుంటుందీ! 'ఠేంక్స్ సుందరీ!' అన్నాడు బెడ్  పక్కనే కూర్చుని ఉన్న భార్యను చూసి. 'మొగుడూ పెళ్లాల మధ్య ఈ మర్యాదలేంటి కొత్తగా! ఎవరైనా వింటే నవ్విపోతారు! ఆపండి! మీ కోసం 

కాకపోయినా నా పచ్చతాడుకోసమైనా ఆ మాత్రం చేసుకోకపోతే నలుగురూ నన్నే అంటారు!' అనేసింది  సుందరి! 


2018.. హైదరాబాద్ 

సుబ్బేష్ కి ,సుందీకి ఘనంగా పెళ్లి జరిగిన మూడో రోజు. నృసింహస్వామి మొక్కు  తీర్చుకున్నట్లు ఉంటుంది.  యాదగిరి గుట్ట వెళదాం' అని సుందీ ప్రపోజల్ పెడితే .. 'అవును .. ఒంటరిగా ఓ పూట గడిపే అవకాశం'  అని సుబ్బేష్ తలాడించాడు. 

పెద్దాళ్లు ఇద్దరికీ తగు జాగ్రత్తలు చెప్పి చీకటి పడే లోగా వచ్చేయండి! హెవీలోడ్ లారీలు రేష్ గా తిరుగుతుంటాయ్!' అంటూ వంద హెచ్చరికలు చేసి మరీ పంపినా తిరుగు ప్రయణంలో చీకటి మలుపులో దొంగలెవరో ఇద్దర్నీ స్పృహ తప్పేటట్లు  చితకబాది 

 సుందీ నగలు, సుబ్బేష్ స్మార్ట్ ఫోను పట్టుకు పోయారు.  దారేపోయే వాళ్లెవరో  స్పృహలేని ఆ జంటను దగ్గర్లోని ఆసుపత్రిలో జమచేశారు. 

ఆసుపత్రి బెడ్డు   మీద మూలిగే సుబ్బేష్ ని తట్టి లేపుతూ 'వాటీజ్ దిస్ బ్రదర్?' అనడిగాడు 

ఖాకీ యునీఫాంలో ఉన్న పోలీస్ అధికారి ఒకరు.  'నాకు దెబ్బలు తగిలితే తగిలాయ్ కానీ..ఆ పిశాచి పీడా విరగడయింది  మొత్తానికి ఈ క్రెడిట్ నీదే  వైశాలీ. థేంక్స్ ఫర్ ది స్మార్ట్ ఐడియా డియర్!' అని వినవస్టోంది.  ఆ గొంతు  సుబ్బేష్ దే! 

'నీ బెటర్ హాఫ్ కూడా సేమ్ టు సేమ్ డైలాగ్ మూలుగుతోందయ్యా పక్క రూం బెడ్లో!డిఫరెన్సల్లా ఒక్క చిన్న  పేరులోనే! నువ్వు 'వైశాలీ'అంటోన్నట్లుగానే ఆమ్యాడంగారు ఎవరో 'విశ్వేషూ' అని మూలుగుతోంది మిష్టర్! కాలం మారింది  మరి!' అంటూ ఓ సర్కేస్టిక్ పంచ్ విసిరాడు  స్టిక్ ఆడించే ఆ పోలీసాఫీసర్!

- కర్లపాలెం హనుమంతరావు 

10-09-2018

***

Sunday, September 6, 2020

వనభోజనాల పుణ్యం - -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు దినపత్రిక, 22 జూన్, 2003 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం)

 



 

'ముందస్తుగా సభను రద్దు చేస్తే ఎలాగుంటుంది?' అని అడిగాడు అధినాయకుడు.

'స్వార్థం. ఒప్పుకోం!' అంది ప్రతిపక్షం.

'వ్యర్థం. ఊరుకోం!' అంది మిత్రపక్షం.

'చూద్దాం' అంది అధికారపక్షం ప్రతినాయకపక్షం.

హఠాత్తుగా ఎవరికోచ్చిందో ఆలోచన 'కార్తీక మాసం కదా! వనభోజనాలకు పోదాం! పదండి! ఎప్పుడూ ఉండే రాజకీయాలే కదా! ప్రొటోకాల్స్ కూ ఫోన్ కాల్స్ కూ దూరంగా పెళ్లాం పిల్లల్తో గడిపొస్తే ప్రాణానికి తెరపి. నేచర్ థెరపీ!' అనుకుంటుండగానే సుందరం ఒక రౌండు చందాలు దండుకొచ్చేశాడు.

సుందరం అందరికీ కావాల్సినవాడు. కాంగ్రెస్ లో పుట్టి కమ్యూనిష్టుల మధ్య పెరిగి భాజపాలో చేరి టిడిపికి మారి టిక్కెట్టు దొరక్క తెరాసా గుర్తు మీద తూగో జిల్లాలో ముస్లిం లీగ్ మద్దతుతో తుక్కుతుక్కుగా ఓడి ప్రస్తుతం పక్క రాష్టం ఎగువసభలో నామినేటెడ్ సభ్యుడుగా ఉన్నాడు. రాజకీయం అంటే ఒక ఒరలో రెండు కత్తులో, రెండు వరల్లో ఒకే కత్తో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయాలు నడుస్తుంటే.. తలలు పండిన వాళ్లందర్నీ ఒక్క బంతిన కూర్చోబెట్టడం పూలబంతిని చుట్టడమంత తేలికా! పార్టీ ఫండనో, పెద్దింట్లో పెళ్లనో, సహాయనిధనో, సానుభూతి సభనో.. ఎప్పుడూ చందా దందా చేసేవాళ్ల మూటలు విప్పించడం మామూలు వాళ్లకు మాటలా? అందుకే సుందరమే స్వయంగా ఎవరూ అడక్కముందే ఈ వ్యవ'హారం' మెళ్లో వేసుకున్నది!

వనభోజనంలో పాల్గొనేందుకు బెయిలివ్వమని జైల్లో ఉన్న స్కాం లీడరు చేత రిట్టేయించడంతో పని ప్రారంభమయినట్లయింది. ఏదయినా సరే ఎదిరించి అడగనిదే ఊరుకోలేని ప్రతిపక్షనాయకుడు కూడా 'ఇది రాజకీయాలకు అతీతమైన భోజన కార్యక్రమం. సామూహికంగా తినాలన్న ఊహే సాహసోపేతమైన చర్య' అని ప్రశంసించాడు.

ఎలాగూ యాత్ర అర్థాంతరంగా ఆగిపోయింది కనుక బస్సులయ్యినా బాడుక్కి తిప్పుకోవచ్చని ఆయన వ్యూహం. కమిటీ ఫామ్ అయింది. విధివిధానాలు చర్చకు వచ్చాయి.

'తలకెంతకనుకుందాం..' అనడిగారెవరో.

'తలల లెక్కెందుకులే! తేలిచావదు కానీ, శాల్తీల లెక్క చొప్పున పోదాం ఈ సారికి'

'ఏ నుండి జడ్ వరకు ఒక్కోరికి ఒక్కో కేటగిరీ!'

'ఆ లెక్కైనా సులభంగా తేలదు'

'భోజనాల వ్యవహారం కాబట్టి పొట్టల సైజును iబట్టి వసూళ్లు చేస్తే పోలా' అంది ఒక అతివాదపక్షి.

'పెళ్లాం పిల్లలు కూడా ఉంటిరి. ఆ పద్ధతి కుదర్దు కానీ, మెంబరుకో వెయ్యనుకుందాం' అని తేల్చేశాడు సుందరం.

స్థలం విషయంలో మళ్లీ ప్రతిష్ఠంభన ఏర్పడింది. 'తెలంగాణా హద్దులు దాటి మేం రాం' అని మోగింది ఒక విభజన స్వరం.

'తలకోనయితే మాకు భయం' అని మరో నిరసన గళం మారాం.

గందరగోళం.. గందరగోళం. అందరినీ సుందరమే ఆపాడు. 'వార్' అంటేనే కదా మనకు దడ? వాళ్లనే హోస్టులుగా పెట్టుకుంటే పోలా! జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకునే అతివాదులతో మాట్లాడతా! భోజన సదుపాయాలు.. అవీ.. ఏర్పాటుచేయమని షరతు పెడదాం!' అన్నాడు.

'ఐనా సరే! మా మిస్సెస్సులు రాలేరయ్యా! సీరియల్సు మిస్సవుతామని బెంగ. కస్సుబుస్సుమంటారు' అన్నదో సంసారపక్షి.

'ఆడవాళ్లకు టీవీ సెట్లు, మగవాళ్లకు పేక సెట్లు ఏర్పాటు చేస్తే సరి. ప్రత్యక్ష ప్రసారం బాధలెక్కడా లేకుండా చూసుకుందాం. సరా? పదిమందికి ఒక విస్తరి ఫ్రీ.. అంటే అంతా వచ్చి కలుస్తారు.'అన్నాడు సుందరం.

సుందరం మాటే నిజమయింది. నాలుగు బస్సుల జనం పోగయ్యారు. బస్సులు వేళకు మూడే దొరికాయ్! 'పోనీ .. మేం పాదయాత్ర చేస్తూ వస్తాం' అంది ప్రతిపక్షంలోని ఒక పక్షం.

'అట్లయితే మేం సైకిళ్ల మీద రావాల్సుంటుంది' ప్ర్రభుత్వపక్షం బెదిరింపు.

దారి పొడుగుతా విమర్శల దాడులే దాడులు. అందరికీ సమాధానం చెప్పగల సత్తా సుందరానికి ఉంది కనక సరిపోయింది. 

'కొండలన్నావూ! ఏవీ కొండలు? ఇంకా మేం ముందుకు రాలేం' అని ఒక వర్గం మారాం.

'అలాగే అన్నారు. పోనీ మనమే  తెప్పిందామా కొండల్ని. కంగారెందుకు?' సుందరం జవాబు.

'ఎత్తిపోతలన్నావూ! ఎత్తుభారమన్నావూ! ..ఏవీ?' మరో వర్గ ఎత్తిపొడుపు.

'ఎత్తిపోతలేగా! ఎత్తి పోయిద్దాం! అదీ ప్రాబ్లమేనా!' సుందరం చిర్నవ్వు సమాధానం.

'ఉసిరిచెట్లయినా లేకుండా ఇవేం వనభోజనాలయ్యా?' ఎవరో కసురుకున్నారు గాట్టిగా!

'పెద్దాయన పేరు చెబితే ఉసిరేం ఖర్మ సార్! ఏకంగా కల్పవృక్షమే కదిలొచ్చేస్తుంది. కాస్త కామ్ గా ఉందురు! 'అంటుండగానే బస్సులు బండల మధ్య ఆగిపోయాయ్!

రెండు గంటలవుతుంది. ఆకులు దొరకవని ఆకలి ఆగుతుందా?

ఉభయ కమ్యూనిష్టులకు ఒకే విస్తరి పరిచారు. కుడి ఎడమలు కుదరక అది కాస్తా చిరిగింది!

చీకటి పడిందాకా పేకాట మాత్రం జోరుగా సాగుతూనే ఉంది. ధర్మారావు తన నియోజకవర్గం ఓడిపోయాడు. వీడియో లైట్లలో కూడా ఆట కొనసాగేదేమో కానీ, ఆడవాళ్ల గోల పెరిగిపోయింది.

అంతలోనే మీడియోవాళ్లు ఊడిపడ్డారు హడావుడిగా. 'అవతల సభ రద్దైపోతుంటే మీరిక్కడ దాక్కొని విందు వినోదాలతో  ఎంజాయ్ చేస్తున్నారా?'అంటూ ఫటాఫటా ఫోటోలు పీక్కుంటున్నారు.

అంతటా హాహాకారాలు

మోసం.. కుట్ర.. ఘోరం.. అంటూ ఘొల్లుమంటున్నారు వనభోజనానికని వచ్చేసిన భోక్తలందరూ. చెట్టాపట్టాలేసుకుని వచ్చినవాళ్లు చెట్టుకొకళ్లు, పుట్టకొకళ్లుగా పారిపోయారు.  కడిగేద్దామంటే సుందరం కంటబడితేనా? ఇఫ్తార్ విందుకని ఎప్పుడో సిటీలోకి చెక్కేశాట్ట!

ఆటవిడుపు పేరుతో మూకుమ్మడిగా వల్లో చిక్కినట్లు తెల్లారి గాని తెలిసిరాలేదు పెద్దమనుషులెవ్వరికీ.

ఇంటికొచ్చిన రహస్య వీడియో చూసి వణికిపోయాడు అధికార ప్రతిపక్షనాయకుడు. 'వార్' వాళ్ల దగ్గర్నుంచి ముడుపులు అందుకుంటున్నట్లుంది వీడియోలో పేకాటలో తాను గెల్చుకున్న కౌంట్ కు  వాళ్ల నుండి డబ్బులు తీసుకునే దృశ్యం! అది గానీ బయటపడిందో తన పొలిటికల్ చాప్టర్ క్లోజ్!

'రాజ్యాంగం అయితే ప్రాబ్లం లేదయ్యా! పేక ముట్టనని పెళ్లాం దగ్గర ప్రమాణం చేసి మరీ వచ్చానయ్యా !'అని వాపోతున్నడు అలాంటి వీడియోనే మరోటి అందుకున్న అధికారపక్ష ప్రతినాయకుడు. 'అయితేనేం? ఆ ఆవిడ ఆయన పక్కనే ఉంది కదా.. పేకాటాడేప్పుడు?' అనడిగారెవరో!

'అదే కదా అసలు ప్రాబ్లమ్! ఆ ఆవిడ ఈవిడ ఒకరు కాదు! వీడియో బైట పడితే ఈవిడగారు మెళ్లో దిగేసిన సొమ్ము సమ్మంధాల మీద అటు ఆదాయప్పన్ను మొగుళ్లు, ఇటు ఇంట్లో పెళ్లామూ కళ్లుపడతాయని వణికిపోతున్నాడు. సభలో చెలరేగేవాళ్లూ, వార్ వాళ్లతో పేకాటాడేవాళ్లైతే మాత్రం ఆదాయ ప్పన్నువాళ్లకూ , పెళ్లాలకి వణక్కూడదా ఏం?'

 'మిత్ర పక్షాలవాళ్లకేమయింది? జరిగిందంతా  కుట్రేనని ఎప్పట్లా ఓ స్టేట్మెంటయినా పారేయచ్చుగా వాళ్లు ?'

'వనభోజనంలో విస్తట్లో పడిందంతా వన్యమృగాల ఆహరంట! లొట్టలేసుకుంటూ తిని చచ్చాం!' అన్నాడో బిక్కచచ్చిన మిత్రపక్షి.

'అర్థాంతరంగా సభను రద్దుచేయడం ఎంతో అర్థవంతమైన చర్య. ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలపరిచే ఈ చర్యను మేమంతా ముక్తకంఠంతో సమర్థిస్తున్నాం' అంటూ సభ చేసిన  ఓ ఉమ్మడి ప్రకటన జారీతో అంతా సర్దుకుంది ఆఖరుకి.

సుందరానికి ఈ సారైనా అధికార పక్షం టిక్కెట్టు ఖాయమేనా? ఎన్నికల   ఖర్చుక్కూడా ఇబ్బందీ లేదు. అంతా వనభోజనాల పుణ్యం!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు దినపత్రిక, 22 జూన్, 2003 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం



Saturday, September 5, 2020

స్వామి భక్త కాంగ్రెస్ -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక నా రాజకీయ విశ్లేషణ



కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కాదు; భారతీయ జనతా పార్టీ కాదు; కనీసం హిందూ మహాసభ అయినా కాదు. ఈ తరహా రాజకీయ పక్షాలకు కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు కద్దు. దేశాన్ని తమ భావజాలానికి అనుకూలంగా మలుచుకునే కొన్ని స్థిరమైన ప్రణాళికలు ఉంటాయి. పాలనా పగ్గాలు చేతికందితే ఏ తరహా సంక్షేమపాలనతో ముందుకు సాగాలో, ప్రతిపక్ష హోదాకు పరిమితమైతే ప్రజాపక్షంగా ఏ ఎత్తుగడలతో ప్రభుత్వాలని ఎండగట్టాలో.. అన్ని రకాల సమస్యలు చర్చించుకునేందుకు బ్లాక్ అండ్ వైట్ రూపంలో డ్రాఫ్టింగుల నిత్యం సిద్ధమవుతుంటాయి. పార్టీలలోకి సభ్యులను తీసుకునే ముందు అయా వ్యక్తుల ఆలోచనాధార, నడవడిక, గతచరిత్ర తాలూకు వివరాలు గట్రా గట్రా తమ తమ పార్టీల భావజాలానికి అనుకూలమైన పంథాలో ఉన్నాయో లేదో తైపార పట్టిచూడడం తప్పనిసరి అభ్యాసంగా ఉంటుంది క్రమశిక్షణకు గట్టి ప్రాముఖ్యతనిచ్చే పార్టీలకు. (నరేంద్ర మోదీ చేతికి చిక్కే దాకా భాజపా కార్యాచరణ సైతం చక్కని క్రమశిక్షణ కలిగి ఉండేదే). ప్రతీ రాజకీయపక్షానికి కచ్చితంగా నడుచుకొనే నియమ నిబంధనల చట్రం ఉన్న విధంగానే భారతీయ కాంగ్రెస్ పార్టీకీ విధి విధానాలు, నియమ నిబంధనలు లేకపోలేదు. కానీ అవి కాగితాలకు మాత్రమే పరిమితం అన్న భావన సర్వే సర్వత్రా అనాదిగా ఉంది. ఆచరణకు, అమలుకు మధ్య ఆమడదూరం ఉండడటమే ఈ దేశాన్ని ఎన్నో దశాబ్దాల పాటు ఏదో ఒక రూపంలో అవిచ్ఛన్నంగా పరిపాలించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ విలక్షణత.
దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆచరణీయ సూత్రం ఏకవ్యక్తి పాలన కింద చిత్తశుద్ధితో పనిచేయడం! అధినేత వ్యక్తిగత ఇష్టాఇష్టాలను అనుసరించి పార్టీ కార్యకలాపాలు కొనసాగడం, అందుకు అనువుగా సభ్యులు అత్యంత సులువుగా స్వీయాభిప్రాయాలను సైతం మార్చేసుకొనేందుకు కించిత్తైనా జంకకపోవడం కాంగ్రెస్ గంగలో మునిగి తేలే ప్రతీ భక్త శిఖామణీ నరనరానికి వంటబట్టించుకునే విశిష్ట లక్షణం. ఒక్క ముక్కలో చెప్పాలంటే కాంగెస్ పార్టీ ప్రధాన లక్షణం జర్మన్ పరిభాషలో నాయకుడి నియంతృత్వానికి ప్రతీకగా వాడే ఫ్యూరర్ ప్రిన్జిప్(Führerprinzip). అధినేత నోటిమాటే అన్ని నియమనిబంధనలను కొట్టవతల పారేసే ఆఖరి వేదవాక్కని ఈ పదానికి అర్థం. ’77- '79 ల మధ్య కాలంలో ఈ తరహా ఫ్యూరర్ ప్రిన్జిప్ అత్యున్నత దశను మనం కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా చూడవచ్చు.
1977 ఎన్నికలలో ఇందిరా గాంధీ ఘోరమైన ఓటమిని చవిచూసారు. పార్టీలోని పెద్దకాపులందరూ అందరూ ఆమె పని ఇక అయిపోయినట్లుగానే భ్రమపడ్డారు. ఇందిరమ్మకు సైతం కొంత కాలం కాంగ్రెస్(కె)..['కె' అక్షరం కాసు బ్రహ్మానందరెడ్డికి సంకేతం] ఛత్రం కిందనే స్తబ్దుగా ఉండపోవలసి దుస్థితి. సమయం బిగువును కొంత సడలనిచ్చి క్రమంగా ఇందిర పార్టీ పగ్గాలకై మళ్లీ పట్టుబట్టడం ప్రారంభించింది. కాసువారి తరహాలో ఖద్దరు అంగీ, గాంధీ టోపీలతో కనిపించే సీనియర్లు చాలామంది ఆరంభంలో ఆమె కోరికను ఆట్టే పట్టించుకోని మాట నిజమే. ‘77 డిసెంబర్ 31.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరుగుతున్న సందర్భం. సరిగ్గా ఆ ముహూర్తానికి ముందు అర్థ రాత్రి ఆమె సభాప్రాంగణం నుంచి హఠాత్తుగా నిష్కమించింది. వెళ్లే ముందు కలవదలచినవారికి తాను ‘గ్లాస్ హౌస్’ పాయింట్ వద్ద లభ్యమవుతానని ప్రకటించడం విశేషం. ‘గ్లాస్ హౌస్’ అప్పట్లో బెంగుళూరు మొత్తంలో ముఖ్యమైన ఫోకల్ పాయింట్లలో ఒకటి! కొద్ది సేపటికే యూ.పి కి చెందిన కమలాపతి త్రిపాఠి, వెస్ట్ బెంగాల్ ప్రముఖ నేత సుబ్రతోముఖర్జీ, మరొక ఇద్దరు ముఖ్యమైన సీనియర్ నేతలు వెళ్లి ‘మేడమ్ గాంధీ’ జట్టులో చేరిపోయారు. ఇందిరమ్మ నేతృత్వంలో వెంటనే కాంగ్రెస్ (ఐ) ఉనికిలోకి వచ్చినట్లు ప్రకటన జారీ అయింది. ఆనాటి రాజకీయ గందరగోళ వాతావరణంలో మళ్లీ చురుకుగా ముందుకు చొచ్చుకు వచ్చేందుకు ఇందిరాకాంగ్రెస్ కు ఆట్టే సమయం కూడా పట్టింది కాదు. 1980 ఎన్నికలకు చాలా ముందుగానే చాలామంది సీనియర్లు తిరిగి ఇందిరా గూటికి వచ్చేశారు. కాంగ్రెస్ (కె) అంతర్ధానమయి, దాని స్థానంలో కొత్తగా కాంగ్రెస్ (ఎస్) [ఎస్‌-సోషలిష్ట్ కు సంకేతం] పుట్టుకొచ్చినా దాని ప్రభావం నాస్తి. ఇంత తతంగం చూసింది కాబట్టే అప్పట్లో మాధ్యమాలు సైతం కాంగ్రెస్ పార్టీని 'నేతలున్న చోట ఉండే పార్టీలా కాకుండా, అధినేత కూర్చున్న చోట పడివుండే పార్టీగా' అభివర్ణించింది. అవే పరిస్థితులు ఈనాటికీ నెలకొనివున్నాయన్న మాట ప్రత్యక్షంగా కనిపిస్తున్న సత్యమే కదా! 1974 లో ఇందిరాకాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బారువా 'ఇందిరే ఇండియా! ఇండియానే ఇందిర' అనే నినాదం సృష్టించాడు. ఆ నినాదం అప్పటికప్పుడు ఎదురు తన్నినా, ‘80ల నాటి ఎన్నికల్లో మళ్లీ ఇందిరమ్మకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టింది కదా! అప్పటి నుంచి 1984 హత్యోదంతం వరకు ఇందిరా గాంధీ ప్రభకు తిరుగులేదన్నట్లుగా పార్టిలోనే కాదు, పార్టీ బైటా హవా సాగింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా కాంగ్రెస్ అంటేనే ఏకవ్యక్తి పాలనకు ఏకైక పర్యాయపదం! 1917 నాటి రష్యన్ల విప్లవం విజయవంతమయిన తరువాత బోల్షవిక్ పార్టీలో వ్లాడిమర్ లెనిన్ ఈ తరహా ఏకఛత్రాధిపత్యం కోసమే వెంపర్లాడింది. అక్కడ అది ఎంత వరకు సాధ్యమయిందో లెక్కకట్టే సమాచారం లేదుకానీ, ఇక్కడ ఇండియాలో మాత్రం కాంగ్రెస్(ఐ) పుణ్యమా అని సహజసిద్ధ ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్(ఐ)కి.. దేశానికి మధ్య భేదమే లేదన్నంత హేయమైన నియంతృత్వపాలన సాగిన మాటైతే వాస్తవం!
పూజ్య బాపూజీ జమానాకు వద్దాం. 1920 మొదలు మరణించిన 1946 చివరి క్షణం వరకు మేకపాలు తాగుతూనే ఉక్కు పిడికిలితో కాంగ్రెస్ ను శాసించిన మహాయోధుడు గాంధీజీ. బాపూజీ ప్రియశిష్యుడు పట్టాభి సీతారామయ్య. ఆయన మీద అఖండమైన మెజారిటీతో నేతాజీ గెలుపొందిన ఆలిండియా కాంగెస్ ఎన్నికలే బాపూ ఏకపక్ష ఆధిపత్య ధోరణికి తిరుగులేని ఉదాహరణ. గతంలో అధ్యక్షుడిగా నేతాజీ ప్రవర్తించిన తీరు బాపూజీకి బొత్తిగా మింగుడుపడింది కాదు. ఆ కారణంగా బోసు అధ్యక్ష హోదాలో సక్రమంగా కుదురుకునే వాతావరణం కల్పించనే లేదన్నది బాపుజీ మీద అభియోగం. 21 మంది సభ్యులతో కార్యనిర్వహణా సమితి ఆరంభించవలసిన సిడబ్ల్యుసి అసలు ఆకారమే ఏర్పరుచుకోవడం అసాధ్యమయ్యే రీతిలో గాంధీజీ ప్రవర్తించిన తీరును చూస్తే నిజమే అనిపిస్తుంది. మహాత్ముని విముఖత దృష్ట్యా ఒక్క సభ్యుడు కూడా నేతాజీ వత్తాసుకు వెళ్లే సాహసం చూపించలేదని, ఆ కారణం చేతనే విరక్తి చెందిన సుభాష్ చంద్రబోస్ ఏకంగా అధ్యక్షపదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పట్టు నుంచి విముక్తిపొందారన్న వాదన ఉంది.

గాంధీజీ మరో ప్రియతమ శిష్యుడు జవహర్ లాల్ నెహ్రూ గురించీ అదే కథ! ఆరంభంలో ఆయన బాపూజీకి పెట్ గా తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా లేడంటారు. క్విట్ ఇండియా ఉద్యమం చివర్రోజుల్లో జాతీయ నేతలు జైళ్ల నుంచి విడుదలయిన నాటి సంఘటన ఒకటి గుర్తుచేస్తారు. రాబోయే ఆరేళ్ల కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కాలానికి అందరూ డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఎన్నికవుతారని భావించారు. అతితొందరలోనే దేశానికి స్వాతంత్ర్యం ప్రకటింపబడే అవకాశం ఉన్నందున ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేతకు మాత్రమే స్వతంత్ర భారతానికి మొదటి ప్రధాని అయే అవకాశం. నాటి నియమనిబంధనల ప్రకారం జరిగిన సంస్థాగత ఎన్నికల్లో తేలిన ఫలితం.. 16 ప్రదేశ్ కాంగెస్ కమిటీలలో ఒక్కటి మినహా తతిమ్మావన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వైపు మొగ్గుచూపాయి. మిగిలిన ఆ ఒక్క ఓటు కూడా జవహర్లాలుకు కాక, ఆచార్య జె.బి.కృపలానీకి దక్కింది. ఏ ఒక్కరి విశ్వాసం సాధించకపోయినా, వల్లభాయ్ పటేల్ ని తొలగిపొమ్మని జవహర్ కే అవకాశం కల్పించారు బాపూజీ! అ విధంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేజిక్కించుకున్న తరువాత మౌంట్ బ్యాటెన్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ముస్లిం లీగ్ తో సమభాగ స్వామ్యం నెహ్రూజీకే దఖలయింది. సహజంగానే జూన్ 3, 1947 నాటి వైస్రాయిగారి ప్రకటనతో పంద్రాగష్టు’47 నుంచి స్వతంత్ర భారతావని తొలిప్రధానిగా పనిచేసే సదవకాశం జవహర్లాలు నెహ్రూ పరమయింది. క్రమశిక్షణ గల నేతగా సర్దార్ వల్లభాయ్ పటేల్ బాపూజీ ఆదేశాల మేరకు ఉపప్రధాని హోదాలో నెహ్రూజీకి మనస్ఫూర్తిగా సహకరించారు. జవహర్ లాల్ నెహ్రూ భారతావని తొలిప్రధాని కావడమే కాదు, మరణించిన 1964 చివరి రోజు వరకు జయాపజయాలతో నిమిత్తం లేకుండా తిరుగులేని కాంగ్రెస్ నేతగా రికార్డు సృష్టించారు కూడా. చైనా పాలసీ వైఫల్యం కారణంగా జాతి ఆత్మాభిమానం దెబ్బతిన్నా, విలువైన దేశభూబాగం నవంబర్ 1962 నాటి ఒప్పందం వల్ల కోల్పోయినా, నెహ్రూజీ దేశానికి ప్రధానిగానే ఉండగలిగారు. కాంగ్రెస్ అధినేతగా అదే చెక్కుచెదరని స్థానంలో పదిలంగా స్థిరపడిపోయారు. కాంగ్రెస్ లోని వీరపూజ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఈ తరహా ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అధినేత మీద ఉండే గాఢాభిమానమే నెహ్రూజీని ఆనాడు కాంగ్రెస్ కు అధ్యక్షుణ్ణి చేసింది. అదే తిరుగులేని విశ్వాసం దోషాలతో నిమిత్తం లేకుండా దేశానికీ ప్రియమైన ‘చాచాజీ’గా మార్చివేసింది.
ఇక ఇందిర విషయం. ప్రారంభంలో ఇందిరా ప్రియదర్శిని ఏకైక అర్హత మాజీ ప్రధాని గారాల కూచి కావడమే! ప్రధానిగా ఆమె ఎన్నిక సైతం చనిపోయిన చాచాజీ పట్ల గల అత్యంత గౌరవాభిమానాలే! లాల్ బహదూర్ శాస్త్రిగారి మంత్రివర్గంలో సభ్యురాలు అయినప్పటికీ ఇందిర సీనియర్ కాంగ్రెస్ నేతల దృష్టిలో రాజకీయాల లోతుపాతులు తెలియని ఒకానొక లేత అమాయిక బాలిక మాత్రమే! నిజానికి సంత్ భింద్రేన్ వాలా, అకాల్ తఖ్త్, పంజాబ్ సమస్యల సందర్భంలో మరొకరికి, మరో పార్టీవారికయితే ఖాయంగా పదవీగండం పొంచి ఉండేదే! కానీ కాంగ్రెస్ కల్చర్ ఇందిర పట్ల కార్యకర్తకుండే అచంచల విశ్వాసాన్ని ఇసుమంతైనా కదల్చలేకపోయింది. ఆమెనే కాదు, మరణానంతరం ఆమె బిడ్డ రాజీవ్ గాంధీని సైతం తమ అధినేతగా నెత్తి మీద ఎక్కించుకునేందుకు సంసిద్ధమయింది కాంగ్రెస్ పార్టీ.
ఇందిర హత్య జరిగే సమయానికి రాజీవ్ వెస్ట్ బెంగాల్ పర్యటనలో ఉన్నారు. రాజకీయాలంటే ఓనమాలైనా తెలియని ఆ యువకుడు తిరిగొచ్చి ‘ఫ్యూరర్’ పదవి చేపట్టే క్షణం వరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎంతో అసహనంతో ఎదురుచూసింది! దేశాధ్యక్షులు జ్ఞానీ జైల్ సింగ్ విదేశీపర్యటన అర్థాంతరంగా ముగించుకుని వచ్చి, విమానాశ్రయంలో దిగిన నిమిషాలలోనే ఇందిరా పుత్రుడి చేత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయించారు! బి.బి.సి ప్రసారాల ప్రకారం తల్లి మరణానంతరం కేవలం ఆరుగంటల లోపే విశాల భారతావనికి ఆమె కన్నబిడ్డ ప్రధాని రూపంలో ప్రత్యక్షమయ్యాడు! దేశాధ్యక్షుడి దేహంలోని సుశిక్షితుడైన మాజీ కాంగ్రెస్ కార్యకర్త - దివంగత అధినేత బిడ్డయిన కారణాన, రాజీవ్ సందర్భంలో ఆరు నెలలోపు చట్టసభకు ఎన్నికవాలన్న నిబంధన విధాయకంగానైనా ప్రస్తావించలేదు! సిరిపెరంబదూరు దురదృష్ట సంఘటన(1991)కు ముందు ‘89 ఎన్నికలలో కాంగ్ర్రెస్ పరాజయం ఎదుర్కొన్నది. ఆ వైఫల్యానికి రాజీవ్ ను బాధ్యుణ్ణి చేయడం కాంగ్రెస్ కలలోనైనా ఊహించలేని దుస్సాహసం. అప్పటికి దుఃఖంలో ఉన్న గాంధీల కుటుంబం పి.వి ని దేశ ప్రధాని కానిచ్చింది.
ప్రభుత్వ స్థాపనకు 50 ఎం.పి సీట్లు తరుగుపడినప్పటికీ అధ్యక్షస్థానంలో ఉన్నందున పి.వి పట్ల ఎవరూ బహిరంగంగా అవిధేయత ప్రకటించలేదు! గాంధీ కుటుంబేతరుడైనా సరే, పి.వి ని ప్రధానిగా ఉండనీయడానికి కారణం, కాంగ్రెస్ కార్యకర్త నర నరాలలో ఇంకివున్న స్వామిభక్తిపరాయణత్వం. స్వామి ఎవరన్నది కాదు.. స్వామి స్థానం పట్ల విశ్వాసంగా ఉండటం ప్రధానం కాంగ్రెస్ పార్టీ వీరభక్తులకు. పి.వి ప్రధాని అయిన కొద్ది రోజులకే నెహ్రూ మార్క్ ‘50ల నాటి అవాడి సీజన్ సోషలిజమ్ తలకిందులయే ప్రమాదం పొడసూపింది. మరో రెండేళ్లకే రావుగారు సెక్యులరిజానికీ మంగళం పాడే పనిలో ఉన్నట్లు సూచనలు అందడం ఆరంభమయాయి. గాంధీ ప్రవచించిగా, నెహ్రూ ప్రోత్సహించిన సోషలిజమ్ సారం ఆ సెక్యులరిజమ్! బాబ్రీ మసీదు విధ్వంసంలో పాములపర్తివారి పరోక్ష హస్తముందని ముస్లిం మైనార్టీలు గట్టిగా విశ్వసించారు. అయినప్పటికీ ఆయన ప్రధాని పదవి 1996 వరకు ఏ ఢోకా లేకుండానే నడిచింది కదా! తిరిగి గాంధీ కుంటుంబంలోని నేత కోసమై కాంగ్రెస్ పార్టీ వెంపర్లాడుతున్న సమయంలో సోనియా గాంధీ తిరుగులేని మెజార్టీతో దివంగత జితేంద్ర ప్రసాద్ మీద ఆధిక్యత సాధించారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆమను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, ఆపద్ధర్మ రూపంలోనో.. కాంగ్రెస్ తమ అధినేత స్థానంలో ఉంచుకుని కొలుచుకునేందుకు సమ్మతిస్తూ వస్తున్నది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న నాయకత్వ సంక్షోభానికీ.. కాంగ్రెస్ పార్టీ తరహా.. కార్యకర్తల్లోని స్వామిభక్తపరాయణత్వమే అంతిమంగా పరిష్కారం చూపించేది. అదే నిశ్చయం.

-కర్లపాలెం హనుమంతరావు

05 -09 -2020

(సూర్య దినపత్రిక సంపాదకీయపుట ప్రచురణ) 

***

Thursday, September 3, 2020

జోస్యం హాస్యం కాదు- కర్లపాలెం హనుమంతరావు – ఈనాడు దినపత్రిక సరదా వ్యాసం

 



 

'ఇది జోస్యం. హాస్యం కాదు' అన్నాడు సీతారాం సీరియస్ గా. సీతారాం మా ఆఫీస్ కొలీగ్.

నవ్వుతున్న నా వంక చుసి 'నమ్మకం లేదు లాగుంది. మీ టైమూ, నా టైమూ కూడా వేస్ట్' అన్నారు శర్మగారు నిష్ఠురంగా.

నా చేతులు చూపిద్దామని సీతారాం శర్మగారిని వెంటబెట్టుకొచ్చాడు. మర్యాదగా ఉండదని చేతులు చాపి 'మరి చూడండీ' అన్న మాట నిజమే.

జాండీస్  రోగి చేతిని వైద్యుడు చూసినంత నిశితంగా పరిశీలించి 'మీ కిద్దరు కళత్రాలు' అనేసారు శర్మగారు ఠక్కున.

కాఫీ కప్పులు ఇవ్వడానికని వచ్చిన మా శ్రీమతి అక్కడే నిలబడి ఉంది. గతుక్కుమంది గుండె. 'కళత్రం' అన్న ముక్కకు అర్థం తెలీకపోబట్టి అప్పటికి సరిపోయింది కానీ, లేకపోతేనా? కొంపలు ములిగిపోయేవి కావూ!'

ఇద్దరు పెళ్లాలంటే ఏ మొగాడైనా మురిసిపోతాడు. కానీ, సమయం, సందర్భం ఉండక్కర్లే సత్య వాక్కుకైనా?

లౌక్యం లేని విద్య రాణించదని శర్మగారికి చెప్పాలనుకున్నా. ఆయన చెప్పే మూడ్ లో తప్ప వినే మూడ్ లో లేడు. 'ప్రస్తుతానికి మీ యోగం కొద్దిగా హీనదశలోనే ఉన్నదని చెప్పాలి. అబ్బాయి అమెరికా ప్రయాణాన్ని గూర్చి బెంగ. భార్య ఆరోగ్యం అంతంత మాత్రమే! ఆవిడకు బి.పీ, మీకు షుగరూ లాంటి మొండివ్యాధులుండవచ్చు..'

'నా చెయ్యి చూసి మా ఆవిడ జాతకం కూడా చెప్తారేమిటీ?!'

'మీ ఆవిడ చెయ్యి చూసి నీ జాతకం కూడా పట్టేస్తారు శర్మగారు. ఉద్దండ పిండం. ఉద్యోగం చేస్తూనే జ్యోతిషం కరస్పాండెన్సు కోర్సు చేస్తున్నారంటే మాటలా? ముందు మా వాడి బదిలీ సంగతి తేల్చవయ్యా?' అని శర్మగారిని పొడిచాడు సీతారాం.

 నెల్లూరు జిల్లాకు బదిలీ అయి నాలుగు నెల్లయింది. జాయినవలా. సెలవు పెట్టి కేన్సిల్ కోసం ట్రయ్ చేస్తున్నా. ఆ సంగతి సీతారాముకు తెలుసు.

'మీ బదిలీ ప్రయత్నాలు ఇప్పట్లో అంతగా ఫలించే సూచనలు లేవు' అని చప్పరించేశారు శర్మగారు. శని గురుడింటి నుండి తరలిపోయాడు. మళ్లీ మహర్దశ రావాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.' అన్నాడు లేచి తుండుగుడ్డ దులుపుకుంటూ.

మా ఆవిడ దిగాలు పడిపోయి నిలబడిపోయివుంది. వాళ్లక్క పరిస్థితి చూసి మా బావమరది కొద్దిగా చొరవచేశాడు. ప్రమోషన్ పని మీద ప్రస్తుతం హైదరాబాద్ వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు. ఇందాకటి నుంచి జరుగుతున్నదంతా చూస్తున్నాడు. అతనికీ వాళ్లక్కకు లాగానే జాతకాలలాంటి వాటి మీద మంచి గురి.

'శర్మగారూ! ధర్మసూక్ష్మం ఏమన్నా ఉంటే చూడండీ!' అన్నాడు లోపాయికారి గొంతుతో.

'ధర్మసూక్ష్మం ఏముంది? యోగం అనుభవించడం ఒక్కటే ధర్మసూత్రం' అన్నారు శర్మగారు.

'పండితులు. మీకు సూక్ష్మాలు తెలియకుండా ఉంటాయా?' అంది మా ఆవిడ.

ఆయన సంచీలో నుంచి పొట్లం ఒకటి తీశాడు. అందులొ అరటి  మొక్క! 'ఇది పెరటిలో నాటించండమ్మా! పిలక పుట్టే లోపు మీ వారికి స్థానచలనం ఖాయం' అన్నారు శర్మగారు.

మహాప్రసాదంలా స్వీకరించింది మా ఆవిడ.

నా మొహం చూసి సీతారాం అన్నాడు 'నువ్వివన్నీ నమ్మవని తెలుసు. మా శర్మగారి సంగతి నీకు తెలీదు. బిన్ లాడెన్ కు ప్రాణగండముందని సంవత్సరం కిందటే చెప్పాడీయన.'

'చేతులు చూశా?!'

'చేతులే చూడనక్కర్లేదు సార్! జాతకం చూసైనా చెప్పేస్తాను. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరగబోతోందని సాక్షాత్ బుష్ గారికి ఉత్తరం రాశాను. ఆంత్రాక్స్ భయంతో ఆయనగారు కవర్ విప్పి చదివినట్లు లేదు. ' అన్నాడాయన రోషంగా.

'అప్పుడెవరి జాతకం చూశాడో? బుష్ గారిదా? డబ్ల్యు టివోదా?'

'సి.యంగారిక్కూడా పదవీ గండముందని చెప్పాడు' అన్నాడు సీతారాం మాటమారుస్తూ.

'సియంగారికి ఈయన తెలుసా?'

'లేదు. ఈయనగారికి సియంగారు తెలుసు. 'హస్తం' చూపించడం ఇష్టం లేక ఆయనగారే మొహం చాటేస్తున్నారుట, జాతకం ఇన్టర్నెట్లో చూసి చెప్పాడు'

'పాదం గుర్తులతో జోస్యం చెప్పడం ప్రాక్టీసుచేస్తున్నా. పర్ఫెక్ట్ అయిన తరువాత ఆయన కాళ్లు పట్టుకునైనా జాతకం చెప్పడం ఖాయం' అన్నారు శర్మగారు గుంభనగా.

'అలాంటివన్నీ చుసుకునేందుకు ఆయన దగ్గర ఇంకెవరో ఉన్నారుటగా! ప్రభుత్వానికి ఇంకో ఇరవై ఏళ్లు  ఢోకా లేదని ఆయన చెబుతుంటేనూ..! తరువాతి టర్మ్ లో పదవీ  స్వీకరణ మహోత్సవానికి  ముహూర్తం కూడా పెట్టి ఉంటేనూ..!

మా ఆవిడ మహాభక్తిగా పళ్లెంలో బియ్యం పోసి తెచ్చింది. చేటలో సోది అనుకున్నదేమో .. పాపం!

'బియ్యం వద్దులేమ్మా! ఒక ఆరు వందలు తక్కువ కాకుండా మీ సంతోషం చూపించండి చాలు' అన్నారు శర్మగారు మొహమాట పడుతూ.

అయిదు నిమిషాల జాతకానికి ఆరు వందలే ఎక్కువ!

'జాతకం చెప్పినందుకు వందే! మంత్రించిన అరటి మొక్కకు ఐదొందలు'

అరటి మొక్క తిరిగివ్వబోతుంటే మా బావమరది అడ్డొచ్చాడు. 'ఉండనీయండి బావా! డబ్బులు నేనిస్తాను' అంటూ పళ్లెంలో ఆరొందలూ సమర్పించుకున్నాడు. అందులో సీతారాం వాటా మూడొందలని తరువాత తెలిసింది.

'జాతకాలకు అంత ప్రభావం లేకపోతే యూనివర్శిటీల్లో కోర్సులెందుకు పెడతారూ? శర్మగారు గాని పోయినేడాది కలిసుంటే నేను కృషి బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసేవాడినే కాదు' అన్నాడు నమ్మకంగా.

మా ఆవిడ ఎంత మొత్తుకున్నా నేను పెరట్లో అరటి మొక్క నాటనీయలేదు.

'మీకీ జన్మకు ట్రాన్స్ఫర్ కేన్సిల్ కాద'ని శపించిందావిడ కసికొద్ది.

అరటి మొక్కను మా బావమరది వాళ్ల ఊరు తీసికెళ్లి నాటుకున్నాడు. నెలరోజుల్లోనే అతనికి స్థానచలనం కలిగింది. ఆఫీస్ మీద అకస్మాత్తుగా ఎ.సి.బి రైడింగ్ జరిగిందట. ప్రమోషన్ మాట అలా ఉంచి ప్రస్తుతానికి పార్వతీపురం ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ మాత్రం అయింది.

ఏదయితేనేం?చలనం.. చలనమే! శర్మగారి ధర్మసూక్ష్మం సామాన్యమైనది కాదు!

జోస్యం హాస్యం కాదు. కేబినెట్లో జాతకాలకు  ఒక పోర్ట్ ఫోలియా ఏర్పాటుచేసి శర్మగారిబోటి వాళ్లను మంత్రులుగా తీసుకుంటే చాలా సమస్యలు సమయానికి చవకలో పరిష్కరామయిపోతాయి.

వర్షాలు ఎప్పుడొస్తాయో తెలిస్తే రైతులు విత్తులతో సిద్ధంగా ఉంటారు. ప్రమాదాలెప్పుడొస్తాయో పసిగడితే ప్రయాణాలు వాయిదా వేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలిస్తే ముందే ప్రపంచబ్యాంకు నుంచి చప్పున అప్పు తెచ్చేసుకోవచ్చు. ఎవరి వాటా వాళ్లు చకచకా వెనకేసుకోవచ్చు.

కాశ్మీరులో ఫరూక్ అబ్దుల్లా వూరికే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు గానీ, ముష్రాఫ్ దొడ్లో శర్మగారి మంత్రించిన అరటి మొక్క నాటించేస్తే పీడా వదిలిపోతుంది.

వాజపేయి గారి కీళ్లనొప్పులక్కుడా ఏదో మందు కనిపెట్టి ఇస్తారీ శర్మగారు మంత్రి పదవి ఇస్తే.

ముఖ్యమంత్రిగారి 'ముఖాముఖి'లో ఇంకా ఇలాంటి పాయింట్లేమన్నా  చర్చించడానికి ఉన్నాయేమో కనుక్కుందామని 'శర్మగారి' గురించి వాకబు చేసా. జాబు నుంచి సస్పెండయ్యారని తెలిసింది.

వెల్ఫేర్ డిపార్టులో ఉండీ చేతులు చూసి సంపాదిస్తున్నాడని గిట్టనివాళ్లెవరో కంప్లయింట్ చేశారుట!

'సంపాదిస్తున్నందుకు కాదు అతగాడు సస్పెండయింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి 'చేతులు' చుస్తున్నందుకు’ అన్నాడు సీతారాం ఆ మధ్య కనపడి.

- కర్లపాలెం హనుమంతరావు

03 -09 -2020

(ఈనాడు దినపత్రిక 06, జూలై 2002 నాటి  సంపాదకీయ పుటలో ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...