Tuesday, July 7, 2015

దోమాయణం- ఓ సరదా గల్పిక



‘స్వచ్చ భారత్ వంకతో మోదీజీ దేశవాసులదరిచేతా తెగ చీపుళ్ళు పట్టిస్తున్నారు. బాగుంది.  దక్షిణ తైవాన్లో  శుభ్రతకోసం ఇంతకన్నా దివ్యమైన  పథకం  మరోటి ప్రచారంలోకొచ్చిందీ మధ్య. ఎవరెక్కువ దోమల్ని  చంపి తెచ్చి చూపిస్తే  వాళ్ళకి వంద అమెరికన్ డాలర్లు మొదటి బహుమానం. మిగతా ఔత్సాహికులకేమో దోమతెరలు.. ఓడోమస్ గొట్టాలు! బహుమానాలనగానే యమగ్లామరుగదా!  ఇప్పుడు అక్కడ  ఎక్కడ చూసినా మశకమహాశయులకోసమే పరుగు పందేలు!  ఒక్కోదోమవెంట పదిమంది ఉరుకులు పరుగులు.. చప్పట్లు కొట్టుకుంటూ! మన త్యాగరాజయ్యరువారి వర్ధంతి  జయంతుల నాటి   నగరసంకీర్తన దృశ్యాలే ప్రతిక్షణం ప్రస్తుతం మనకు అక్కడ కనిపించేవి!
దోమల్ది మనుషుల్ది రక్తసంబధం .  మనం  మనస్ఫూర్తిగా ఎవరికీ చప్పట్లు కొట్టం ఒక్క దోమలకు మినహా.  దేవుడే కంటి ఎదురుకొచ్చి నిలబడ్డాసరే  రెండు చేతులూ ఎత్తి నమస్కరించని శుద్ధనాస్తికుడైనా.. పడక ఎక్కిన తరువాత దోమ కంటపడితే రెండుచేతులకూ పని చెప్పక తప్పదు.
మనిషిని సృష్టించిన దేవుడే దోమనూ సృష్టించాడని  మర్చిపోరాదు. ఒక్క మానవుణ్ణే సృష్టించి వదిలేస్తే.. వాడు పెట్టే 'గీ..బే' లకి తన నిద్ర భంగమవుతుందని తెలుసు. కాబట్టే ఆ నసగాడికీ నిద్రరాకుండా దోమను సృష్టించి వదిలిపెట్టాడు గడుసుగా.
నారుపోసే 'వాడు' అన్నిజీవులకు నీరు పోస్తూ.. ఒక్క దోమలకు మాత్రమే  ప్రత్యేకంగా రక్తం  ధారపోసాడు. అదీ మన మానవరక్తం! దోమల్ని తిట్టడం అన్యాయం.  ఫలితం శూన్యం. రెండుచెవులున్న మనుషులే తిట్లను పెద్దగా పట్టించుకోనప్పుడు.. చెవులే లేని దోమలు మన మొర ఆలకిస్తాయనుకోవడం దురాశ. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపగలవేమోగానీ.. దోమల ఆగడాన్ని ఆపడం కుదరదుగాక కుదరదు.
దేవుడు మనకు చేసిన మహోపకారమల్లా  దోమల్ని  సూక్ష్మరూపంలో సృష్టించడమే!  ఏనుగులకుమాదిరి భారీకాయాలతోగానీ  దోమలు ఎగరడం మొదలుబెడితే చెవుల చుట్టూనే  నిత్యం షంషాబాద్ విమానాశ్రయం సందడి వినబడుతుండేదిగదా! నలుసంత  ఉండబట్టి చప్పట్లుకొట్టి దోమని మట్టు బెడుతున్నాం. భారీశరీరాలతోగాని దోమలు దాడిచేయడం మొదలుపెడితే ఎదురుదాడికి  మన రెండుచేతులేం మూలకు? ఈటెలూ.. బరిసెలూ..బాంబులూ పట్టుకుని  అడవి మనుషులు.. ఉగ్రవాదులకు పోటీగా రంగంలోకి దిగాల్సొచ్చేది . కార్తవీర్యునికిమల్లే సహస్ర బాహువులతో జన్మించే అదృష్టం అందరికీ  ఉండద్దూ!
శేషశయనుడికే ఈ దోమల బెడద తప్పిందికాదు.  ఆదిశేషుడి పడగల కింద ఆ ముక్తిప్రదాత తలదాచుకుంది బహుశా ఈ దోమల దాడినుంచి విముక్తికే అయివుండచ్చు. కైలాసనాథుడి కష్టాలైతే మరీ కడుపు తరుక్కుపోయేవి. వంటిమీద నూలుపోగైనా లేకుండా మంచుకొండలమీద కాపురం ఉంటున్నా..  దోమాసురుల తాకిడికి తాండవాలు తప్పడంలేదు. ముక్కోటి గణాలు ఉండీ ఏం లాభం? ఏ ఒక్కశ్రేణీ సర్వరక్షకుణ్ణి దోమాధముల బారినుంచి కాపాడలేక పోతున్నప్పుడు?! ఏ గణాల అండాలేని సామాన్యులం మనం..  దోమలగండం లేకుండా ఉండాలంటే తీరే ఆశేనా? బ్రహ్మదేవుడికి మల్లే పుట్టుచెవుడున్నా కొంత  బాగుండేది. దోమకాటు నుంచి కాకపోయినా కనీసం వాటి సంగీతాన్నుంచైనా   ఉపశమనం దక్కుండేది.
దేవుడు రెండు చేతులు ప్రసాదించింది అరచేతులతో చప్పట్లు కొట్టి  దోమల్ని  తరిమి కొట్టేందుకే. చీమలకుమల్లే దోమ ఏ శివుడాజ్ఞ కోసమూ ఎదురు చూసే జీవి కాకపోవడంకూడా  దురదృష్టమే. నిద్రపోతునిచూస్తే  దోమలకు మహా అసూయ. 'నరులనుకుట్టే దోమలు ఆడజాతికి చెందినవి మాత్రమే' అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మాత్రం భాగ్యానికి అంత చేటు పరిశోధనలు అవసరమా? వాటి సంగీతంబట్టే ఇట్టే పసిగట్టేయచ్చు.
మనిషి ఇంజెక్షను కనిపెట్టిందికూడా దోమకాటును గమనించే అయిఉండాలి. కుట్టే సమయంలో బాధ తెలియకుండా  బెజ్జందగ్గర ఓ రకమైన ద్రవాన్ని దోమ విడుదల చేస్తుంది. మనం వైద్యంలో వాడే అనస్తీషియాకు బహుశా ఈ ప్రక్రియే  ప్రేరణ అయిఉండాలి. ప్రతీ
గొప్ప ఆవిష్కరణని  తనకే ఆపాదించుకునే దుర్గుణం మనిషిది. దోమకు రావాల్సిన క్రెడిట్ మనిషి కొట్టేసినట్లుంది. దోమకాటులోని తీవ్రతకు బహుశా   ఈ కచ్చకూడా ఓ కారణమైవుండచ్చు.
మనిషిరక్తం పీల్చే జాతుల్లో దోమది ప్రథమస్థానం. 'దాహార్తికి కారణం దాని జీవన్మరణ సమస్య' అంటున్నారు క్రిమికీటక శాస్త్రవేత్తలు. ప్రాణాలను ఫణంగాపెట్టి   కాటుకి సిద్దపడే దోమ దుస్సాహసం వెనక ఎంత దయనీయమైన కారణాలు ఉన్నాయో మానవీయకోణంలో  తర్కించాలి. దోమకు బుర్ర తక్కువని మనకు మహా చులకన.  మన రక్తంలో
మేలిమిరకం విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని ముందుగా కనిపెట్టిన బుద్ధిజీవి దోమే. పాతికతరాలకు ఒక్క పర్యాయమైనా  మానవరక్తం పథ్యంగా పుచ్చుకోక పోతే దోమ మనుగడే ప్రశ్నార్థకంలో పడిపోతుంది తీసుకోవడమే తప్ప ఇచ్చే అలవాటులేని మనిషి  స్వచ్చందంగా దోమలకోసం రక్తదాన శిబిరాలు నిర్వహించడు గదా! దోమలకు మనిషి నైజం మహబాగా తెలుసు. అందుకే  ఈ బలవంతపు రక్త సేకరణలుఎంతో అప్రమత్తంగా ఉండి..కుట్టిన వెంటనే వడుపుగా   పట్ట బోయినా దోమచేతికి అందివచ్చే    కీటకం  కాదు. కసి, క్రోధం మానవశరీరాల్లో సృష్టించే ప్రకంపనలను నరాల  కదలికలద్వారా ముందే పసిగట్టి  చటుక్కున తప్పుకునే వడుపు భగవంతుడు     దోమకు ప్రసాదించాడు. దేవుడే దోమ పక్షపాతిగా మారిన నేపథ్యంలో ఇహ మనిషి మొరాలకించే నాథుడెక్కడ దొరుకుతాడూ?

దోమల అసాధారణ  గ్రహణ శక్తినుంచే మానవనేతలు  పలాయన నైపుణ్యం సాధించినట్లుంది.  సర్కారునిధులు  పీల్చినంత పీల్చి.. ప్రమాదం పసిగట్టగానే చటుక్కున పక్క పార్టీలోకి దూకి నక్కేవడుపు
మనప్రజానేతలు కచ్చితంగా మశకగురువుల   శిష్యరికంలో సాధించిన పలాయనవిద్యే.
దోమలు అన్నిప్రాణులను ఒకేలా ప్రేమించవు. నిద్రకుపడ్డ సమయంలో ముక్కు రంధ్రాలగుండా విడుదలయ్యే బొగ్గుపులుసు వాయువు మోతాదు మీద దోమల ఆకర్ష వికర్ష పథకాలు  ఆధారపడి ఉంటాయంటున్నారు శాస్త్ర వేత్తలు. మన ఉఛ్చ్వాశ నిశ్వాసాలు మన అదుపులో ఉండవు కనక  దోమలవేటా మన అధీనంలో లేనట్లే లెక్క.  అధీనంలో లేనివాటిని గూర్చింత రాద్దత మవసరమా?  అని సందేహం.
సుపరిపాలన  ప్రజల అధీనంలో ఉంది కనకనా? అయినా దాన్నిగూర్చి చర్చించడం మానుకుంటున్నామా? ఇదీ అంతే! అని సమాధానం.
'ప్రతీజీవికీ ఓ ప్రయోజనం ఉండి తీరుతుంద'ని కదా గురజాడవారి గిరీశంగారి థియరీ! దోమలతోనూ కతిపయ లాభాలు లేకపోలేదు. అనుక్షణం కళ్ళల్లో వత్తులేసుకుని దోమలకోసం దేవులాట్టంవల్ల   అప్రమత్తత శాతం బాగా పెరిగే అవకాశం ఎక్కువ.  తెల్లార్లూ దోమలు
చెవిదగ్గర 'గీ' మంటూ నిద్దర్లు పాడుచేస్తుండబట్టేగదా ఈ మాత్రమన్నా శాంతిభద్రతలు అదుపులో ఉంటున్నవి! రక్షకభటులమీదే పూర్తిగా భరోసా ఉంచి ఆదమరచి నిద్రకుబడితే తెల్లారేలోపు కొంప అయ్యవారి నట్టిల్లయ్యే ప్రమాదమూ పొంచి ఉంది.
వాస్తవానికి దోమలవల్ల దొంగలకే ఎక్కువ చేటు. దొంగచాటు వ్యవహారాలు, చాటుమాటు సరసాలు సాగించే కంత్రిగాళ్ళకు అవి ఎక్కువ శత్రువుల. అయినా వాళ్ళు ఒక్కముక్క దోమలకు వ్యతిరేకంగా  బైటికి అనరు. చేసే  మేళ్ళన్నీ మరిచి  మనమే వాటిని అస్తమానం అవసరానికన్నా ఎక్కువగా ఆడిపోసుకుంటున్నది!
దోమలమీద మరీ అంతగా  పగ పెంచుకోవడం తగదంటున్నారు
శాస్త్రవేత్తలు కూడా. దోమలే ఆహారంగా బతుకు వెళ్లదీసే ఎన్నోరకాల జీవులకు స్థానంలేకుండాచేస్తే  సంభవించే ఉపద్రవం దోమకాటు నష్టానికన్నా  పదింతలు.  దోమల్ని భరించి, జీవవైవిధ్యానికి తనవంతు పాత్ర పోషించడం మినహా మనిషికి మరో దారిలేదు.
మరి మోదీజీ 'స్వచ్చ భారత్' అంటారా?!
దేని దారి దానిదే! మధ్య నిషేధం అసాధ్యమని తెలిసీ..  మనం నినదించడంలా!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- సంపాదకీయ పుట- 13-11-2014 లో ప్రచురితం)
                        


                                        ***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...