Wednesday, July 8, 2015

డ్యూ- కథానిక




కాళిదాసు కృపా అపార్టుమెంట్ సు దగ్గరికొచ్చేసరికి మధ్యాహ్నం రెండుగంటలయింది.  మే మాసం ఎండ నిప్పులు చెరుగుతోంది. 'వెధవుద్యోగం.. వెధవుద్యోగం' అని కనీసం పదిసార్లయినా తిట్టుకొని ఉంటాడు ఈ ఐదు నిమిషాల్లో.
కాళిదాసు పోస్టుమేన్ ఉద్యోగంలో కొత్తగా ఏం చేరలేదు. ఇంకో ఏడాదిలో రిటైరవ్వబోతున్నాడు.
పంచాల్సిన టపా ఇంకో అరకిలో ఉంది. 'ఈ ఉత్తరంతోనే వచ్చింది చచ్చే చావంతా!' అనుకొంటూ ఐదో అంతస్తులో ఉన్న పెంట్ హౌస్ దాకా పోయి డోర్ బెల్ నొక్కాడు.
ఎదురుగా చిన్నపాప. ఐదేళ్ళుకూడా లేవు. 'ఇంట్లో ఎవరూ లేరు' అంటూ తలుపులు ధడాల్మని వేసేసుకొంది. ఉసూరుమంటూ కిందికి దిగి వచ్చాడు కాళిదాసు.
రూల్ ప్రకారం అపార్టుమెంట్ సులో అన్ని మెట్లెక్కి టపా డెలివరీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఉత్తరానికి 'డ్యూ' ఉంది. ఐదురూపాయల స్టాంపుకు బదులు నాలుగురూపాయలే అంటించారు. రెండు రూపాయలు డ్యూ. అడ్రసీ రిజెక్టు చేసాడు. కనుక సెండర్ నుంచే అపరాధరుసుం వసూలు చేయాల్సుంటుంది. ఈ వారంలో ఇదే అడ్రసుకు ఇది వరసగా మూడో సారి ఇలా డ్యూ పడిన కవర్లు రావడం! రెవిస్యూ విషయంలో పోస్టుమాస్టరుగారు చాలా నిక్కచ్చి. డ్యూ కచ్చితంగా రికవర్ చెయ్యాల్సిందే! తిరుపతి కొండలాంటి ఆ మెట్లు ఎక్కలేక కాళిదాసు తనే కట్టేసుకున్నాడు ఆ అపరాథరుసుం.
పండగలకీ, పబ్బాలకీ, ఎంవోలకీ, ఇంపార్టెంటు కవర్లకీ మామూళ్ళు దండుకోవడమేగానీ, ఇలా స్వంత డబ్బులు అచ్చుకోవడం ఈ మధ్యనే మొదలయింది. మామూళ్ళు ఇవ్వలేదని టపా డెలివరీ చెయ్యని రోజులు కాళిదాసు సర్వీసులో బోలెడన్ని. ఇది యాంటీ క్లైమాక్సు. ఇంతటితో ఐపోతే ఇది కథే ఐవుండేది కాదు.
మర్నాడు అదే అడ్రసుకు మరో కవరు అలాంటిదే  డ్యూతో వచ్చింది! కాళిదాసు బి.పి పెరిగిపోయింది. ఎన్నిసార్లని కడతాడు ఎదురు డబ్బులు! వేళ తప్పించి పోదామంటే ఆ కొంపలో పెద్దవాళ్ళు ఎప్పుడుంటారో ఆ దేవుడికే ఎరుక. ఇంటికి ఫోన్ లేదు. ఇంట్లో ఎవరూ దొరకరు. ఇదంతా ఏదో మిస్టరీలాగా ఉంది. ఎదురుపడి తేల్చుకొందామనుకొంటే శాల్తీ ఎవరో తేల్తే కదా!
బీటు మార్చమని బతిమాలాడు కాళిదాసు. అదే రూట్లో తన ఇల్లుందని కావాలని దెబ్బలాడి మరీ డ్యూటీ వేయించుకొన్నాడు అప్పట్లో. ఇప్పుడున్న పరిస్థితులకి బదిలీ కెవరూ ఒప్పుకోవడం లేదు. రోజూ ఆ ఆడ్రసుకో డ్యూ కవరొస్తున్నదాయ!
ఒక్క ఆదివారం వదిలేసి  రోజూ వచ్చే ఆ ఉత్తరాల డెలివరీకోసం మెట్లెక్కి దిగలేక కాళిదాసు కుదేలయిపోయాడు ఈ నెల రోజులబట్టి.
బెల్లుకొట్టగానే ఠక్కున తలుపుతీసి రడీగా పెట్టుకొన్న రెండురూపాయలు చేతిలో పెడుతోందీ మధ్య ఆ పాప! వేరే వాళ్లను పంపితే అదీ లేదు. ఇదేదో తనమీదే కావాలని జరుగుతున్న కుట్ర కాదుగదా?
సెలవు పెడదామనుకొన్నాడుగానీ.. రిటైర్మెంటు చివరి రోజులు. డ్యూకి భయపడి డ్యూటీకి డుమ్మాకొట్టారంటారని పౌరుషం! లీవ్ ఎన్ కాష్ మెంటుకూడా తగ్గుతుంది.
తెల్లారుతోందంటేనే భయం. కల్లోకూడా కట్టలు కట్టలుగా 'డ్యూ' ఉత్తరాలు!.. తిరుపతి కొండల్లాంటి మెట్లు! .. ఆయాసం.. రొప్పు! నెలరోజుల్లో కాళిదాసు సగమైపోయాడు.. పాపం!
ఒకరోజు మెట్లు దిగేసమయంలో కళ్ళు తిరిగి పడిపోయాడుకూడా! కాళ్ళు మడతపడ్డాయి! నెలరోజులు విశ్రాంతి కావాలన్నారు డాక్టర్లు. 'పీడాపోయింది' అనుకొన్నాడు కాళిదాసు కసిగా!
మధ్యలో ఒకసారి పరామర్శకొచ్చిన పోస్టుమాస్టరుగారు ' ఇప్పుడా డ్యూ ఉత్తరాలు రావడం లేదులేవయ్యా! నిశ్చింతగా వచ్చి డ్యూటీలో చేరు!' అని చెప్పిపోయారు. చెవిలో అమృతం పోసినంత సంతోషం వేసింది కాళిదాసుకి.
మళ్లీ డ్యూటీలో  చేరినా కాళిదాసులో మునుపటి ఉత్సాహం లేదు. చివరి రోజుల్లో ఇలాగయిందేమిటా అని దిగులు పడిపోయాడు.

ఆ రోజు వచ్చిన టపాని ఠపఠప సార్ట్ చేస్తున్నారు సిబ్బంది. 'మళ్లీ వచ్చిందిరో ఉత్తరం!' అని అరిచారెవరో ఉద్వేగం పట్టలేక.
'సేమ్ లెటర్.. విత్ డ్యూ!' అని పెదవి విరిచారు పోస్టుమాస్టరుగారు ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పుతూ. కాళిదాసు ముఖంలో నెత్తుటిచుక్క లేదు. నిస్సత్తువుగా కూలిపోయాడు. కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి.
పోస్టుమాస్టరుగారు ఒక నిశ్చయానికి వచ్చినవాడిలాగా 'పద! దీని సంగతేంటో తేలుద్దాం!' అంటూ లేచారు.
ఉత్తరంతో సహా అపార్టుమెంట్ సు మెట్లు ఎక్కుతుంటే నిజంగానే ఆయాసం వచ్చింది పోస్టుమాస్టరుగారిక్కూడా. లిఫ్టు లేదు. 'పాపం! కాళిదాసు ఇందుకే అంత డల్ అయిపోయాడు.' అనుకున్నారాయన.
కాలింగ్ బెల్ కొడితే ఒక పెద్దాయన తలుపు తీసాడు.
'మీరు?'
'సూర్యప్రకాష్' చెప్పాడు పెద్దాయన.
'మీతో చిన్న పనుండి వచ్చాం సార్! ఐ యామ్ పోస్టుమాస్టర్…'
'యస్! ప్లేజ్.. కమిన్' అంటూ పెద్దాయన మర్యాదపూర్వకంగా లోపలికి పిలిచాడు.
'మీ ఉత్తరం రిటనొచ్చింది. రెండు రూపాయలు డ్యూ!' అన్నారు పోస్టుమాస్టరుగారు.
'ఇస్తాను. ముందు కాఫీ తాగండి!' అన్నాడు ముసలాయన.
ఎప్పుడూ రెండు రూపాయలిచ్చే పాప కాఫీకప్పులతో వచ్చిందీ సారి. కాళిదాసుని చూసి పలకరింపుగా నవ్వింది.
'ఈ పాప నా మనమరాలు' అన్నాడు ముసలాయన రెండు రూపాయలిస్తూ.
'మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామని వచ్చాను సార్!'  అన్నాడు పోస్టుమాస్టరుగారు.
'తెలుసు. రెండు రూపాయలకోసమే అయితే కాళిదాసే వచ్చేవాడుగా!' అన్నాడాయన చిన్నగా నవ్వుతూ.
'కాళిదాసు మీకు ముందే తెలుసా?!'
'తెలుసు. రెండేళ్లకిందట నేను పమిడిపాడులో  హెడ్ మాస్టరుగా పనిచేస్తున్నప్పుడు ఇతనక్కడ పోస్టుమేనుగా ఉండేవాడు'
కాళిదాసు ఆశ్చర్యంగా ఆయనవంక చూసాడు. అతని మనసులో లీలగా ఏదో మెదలడం మొదలుపెట్టింది. 'అవును. అప్పుడు ఈ పెద్దాయనతో దసరా మామూళ్లవిషయంలో పెద్ద గొడవయింది. మామూలు అడిగితే నీతులు చెప్పాడు' గుర్తు చేసుకొన్నాడు కాళిదాసు.
సూర్యప్రకాష్ అదే విషయాన్ని పోస్టుమాస్టరుగారికి చెబుతున్నాడు. 'నేనక్కడ రిటైరై ఇక్కడికొచ్చాను. ఇక్కడ మా పెద్దబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఒకసారి పనిపడి పోస్టాఫీసు కెళితే ఇతను కనిపించాడు. ఎవరితోనో గొడవపడుతున్నాడు. అదే దురుసుతనం. వాళ్లతో చెడి టపా ఇవ్వడం మానేసాడని చెప్పారు వాళ్ళు. బేసిగ్గా ఉపాధ్యాయుణ్ణి కదా! ఇతనికో పాఠం చెబుదామనుకొన్నా. తీరిగ్గా ఉన్నాను. కనకనే రోజుకో  అండర్ స్టాంప్డ్ కవర్ పంపిస్తున్నా. అలాంటి కవర్లను తీసుకోవడానికి ఇష్టపడని కంపెనీనే సెలక్టు చేసుకొని కావాలనే పంపిస్తున్నా. ఇతగాడు ఈ మెట్లన్నీ ఎక్కి ఎక్కి .. ఇక ఎక్కలేని ఓ రోజు నా దగ్గరికొస్తాడని తెలుసు.  అలా రావాలనే కొంత ఖర్చైనా ఇదంతా చేసింది!'
'మీ అపార్టుమెంటు మెట్లు ఎక్కలేక ఒకరోజు పడిపోయాడు ఇతగాడు. నెలరోజులకు పైనే ఆసుపత్రిలో పడి ఉన్నాడు. మీరు అనుకొన్నదానికన్నా పెద్ద శిక్షే పడింది సార్ ఈ కాళిదాసుకు' అన్నారు పోస్టుమాస్టరుగారు నిష్ఠూరంగా.
'ఇతగాడు మాకు విధించిన శిక్షకన్నానా!' అంటూ నిరసనగా కాళిదాసువంక చూసింది అప్పుడే బైటికివచ్చిన ఒక ముసలామె. ఆమె సూర్యప్రకాష్ భార్యలాగుంది.
'బక్క ఉద్యోగి. అతను మీకు శిక్ష వేయడమేమిటమ్మా?!' అని విస్మయంగా ఆదిగారు పోస్టుమాస్టరుగారు.
పెద్దాయన కలగజేసుకొని అన్నాడు' పోస్టల్ యంత్రాంగంలో పోస్టుమ్యాన్ ఒక మహత్తరమైన శక్తి మాస్టారూ! బైటి ప్రపంచానికి, మాకు ఈ ఉద్యోగే ప్రధానమైన లింకు. ఎక్కడెక్కణ్ణుంచో అయినవాళ్లూ, అవసరమున్నవాళ్లూ చెప్పుకొనే సంగతులన్నింటినీ మోసుకొచ్చే దూతకదా పోస్టుబంట్రోతంటే! ఇది ఒక పవిత్రమైన బాధ్యత అని నా ఉద్దేశం. మామూళ్ళు ముట్టచెప్పలేదనే కసితో దాన్ని దుర్వినియోగం చెయ్యడం సాధారణమైన నేరం కాదు. ఆ నేరం చేసినందుకే తగిన శిక్ష అనుభవించాడు మీ కాళిదాసు' అన్నాడు సూర్యప్రకాష్ దృఢంగా!
'కాళిదాసు అంత చెయ్యరాని నేరం ఏం చేశాడండీ?'
'పమిడిపాడులో ఉన్నప్పుడు మామూళ్ళు ఇవ్వలేదని ఈ అయ్యగారి టపా ఇవ్వకుండా దాచేసాను సార్ చాలారోజులు' అన్నాడు కాళిదాసు పశ్చాత్తాపంగా.
'అలా దాచేసిన ఉత్తరాల్లో ఏముందో తెలుసా.. కాళిదాసూ? అత్తగారింట్లో అగచాట్లు పడుతూ రక్షించమని రోజూ రోజుకొక ఉత్తరం రాసిన ఓ ఆడకూతురి ఆవేదన. అన్ని డజన్ల ఉత్తరాల్లో ఒక్కటైనా మాకు అందివుంటే మా కన్నకూతురు మాకు దక్కి ఉండేది. ఈ వయస్సులో ఈ కడుపుకోత తప్పి ఉండేది. మేంకూడా పట్టించుకోలేదన్న అవమానంతో మా చిట్టితల్లి వంటిమీద కిరోసిన్ పోసుకొని అంటించుకుంది. ఇదిగో ఈ పసిపాపే మా పాప కన్నకూతురు. ఎన్ని సార్లైనా నేను రెండు రూపాయలు కట్టి ఈ డ్యూ ఉత్తరాలు విడిపించుకోగలను. నువ్వేం చెల్లించి 
 ఈ పసిపాప 'డ్యూ' విడిపించగలవో చెప్పు కాళిదాసూ!' అంటూ పాపను దగ్గరకు తీసుకొని భోరుమన్నాడు అప్పటివరకు గాంభీర్యం నటించిన ముసలాయన.
కాళిదాసు కొయ్యబారిపోయాడు!
***
-కర్లపాలెం హనుమంతరావు
(గమనికః కథాకాలం 2005 సంవత్సరం)
(విపుల మాసపత్రిక డిసెంబరు 2007 సంచికలో ప్రచురితం)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...