Tuesday, July 7, 2015

రసమయ తపస్సు- సాహిత్య వ్యాసం

వ్యాపారపత్రికలలో కవిత్వానికి దక్కుతున్న చోటు.. ఆ చోటులో కనిపిస్తున్న కవిత్వం గమనిస్తే.. నిజానికి ఎవరికీ కవిత్వం మీద అంత సదభిప్రాయం పెరిగే అవకాశం లేదు. కవిత్వానికే మీదుకట్టిన కొన్ని సాహిత్యపత్రికల్లో సైతం లబ్దప్రతిష్టులకు మాత్రమే అవకాశం దక్కే పరిస్థితి. ఇన్ని ప్రతికూల నేపథ్యంలో సైతం కవిత్వం కుండపోతగా వర్షిస్తూనే ఉండటం హర్షించదగ్గ పరిణామమే.

కవిత్వం మీద మోజు చూపిస్తున్న వర్గాల్లో ముఖ్యంగా యువతదే ప్రధాన

భూమిక. ఇది మరీ సంతోషించదగ్గ విషయం. ఇప్పుడు వస్తున్న కవితాసంపుటాలే ఇందుకు ఉదాహరణ.

కవిత్వం అంటే ఒకప్పుడు ఛందోబంధంగా ఉండితీరాల్సిన   పరిస్థితి.
భాషమీద కొంత పట్టు, వ్యాకరణంమీద కనీస అవగాహన అవసరం. పూర్వ సాహిత్యంతో స్వల్పంగానైనా పరిచయం లేకుండా కవిత్వం రాయడానికి అవకాశం ఉండేది కాదు. గిడుగు వారి వ్యావహారికోద్యమ ఫలితంగానో, గురజాడ వంటి  అభ్యుదయవాదుల కృషి మూలకంగానో.. శ్రీశ్రీ వంటి అతివాదుల పుణ్యమా అనో ఛందోబంధనాలన్నీ ఫటాఫట్ తెగిపోయి తెలుగు కవితామతల్లికి సంపూర్ణ స్వేచ్చాస్వాతంత్ర్యాలు సిద్ధించాయి. కాలానుగుణమైన మార్పులు ఎన్నో చోటు చేసుకోవడం వల్ల.. కవిత్వం స్వరూప స్వభావాలే సంపూర్ణంగా మార్పు చెందాయి. ఇవాళ మనసుకి ఎలా అనిపిస్తే అలా రాయడమే అసలైన కవిత్వం’ అనే భావన   స్థిరపడిపోయింది. అదీ ఆనందించదగ్గ పరిణామమే. కాకపోతే ఈ స్వేచ్చను నేటి యువత నిజంగా ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నది?

భాషాపాటవం, సంవిధాన చాతుర్యం, శిల్ప విణ్ణానం పుష్టికరమైన కవిత్వానికి ముఖ్యావసరాలు. అవి స్వాధీనమవాలంటే ఒక రసమయమైన తపస్సు అవసరం. గతకాలపు కవితా ప్రక్రియలను  (ఇప్పుడు మనం వాటిని  ఉపయోగించకపోయినా సరే) ఒక పరిశీలనా దృష్టితో.. సావధాన చిత్తంతో.. అధ్యయనం చేయకుండా రాయబూనుకుంటే ఆ కవిత్వం తేలిపోతుంది. నన్నయ భారతం ఎందుకు రాయాల్సి వచ్చింది? పాల్కురికి సోమనాథుడు తమ కాలం నాటి ఇతర కవుల మాదిరిగా కాకుండా దేశికవితల్లోనే రచనలు ఎందుకు చేయాల్సి వచ్చింది? తిక్కన గారు భారతాన్ని ఎంత నాటకీయత దట్టించి రాసారు? శ్రీనాథుడుకి, పోతనకు.. వ్యక్త్తిత్వాల మధ్య వైరుధ్యం కన్నా.. వ్యక్తీకరణల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? రాయలు వారి భువనవిజయంలోని అష్టదిగ్గజాల మధ్య గల రాజకీయాలకన్నా వారి వారి రచనల మధ్యగల సామ్యాలు.. తారతమ్యాలు ఎలాంటివి? ప్రబంధసాహిత్యం ఎందుకు చివరి దశలో  తిరస్కరణకు గురయింది? పద్యధోరణుల మీద భావకవిత్వం చేసిన తిరుగుబాటు ఎటువంటిది? నవ్యకవిత్వం వచ్చి భావవిత్వాన్ని ఎలా వెనక్కు నెట్టింది? ఆధునిక కవిత్వం మొత్తం అభ్యుదయ కవిత్వమే అనుకోవడానికి ఎంతవరకు వీలుంది? అభ్యుదయ కవిత్వం మీదా దిగంబరకవులు ఎలా.. ఎందుకు తిరగబడినట్లు? ఆ వేడి ఇట్టే చప్పున చల్లారిపోవడానికి వెనకున్న తాత్విక కారణాలేమిటి? విప్లవ కవిత్వం ఎప్పుడు.. ఏసందర్భంలో.. ఎవరి ఏ అవసరాలకు అనుగుణంగా చొచ్చుకొని వచ్చింది? తరువాతి కాలంలో దాన్లోనూ చీలికలు ఏర్పడటానికి కారణాలేమిటి? ప్రపంచీకరణ పెచ్చుమీరుతున్నతరుణంలో కవిత్వంలో జరిగిన పరిణామాలు ఎటువంటివి? ఆధునికాంతరవాదంగా ముందుకు వచ్చిన.. వస్తున్న ఈనాటి అస్తిత్వపోరాటాల కథా కమామిషు లేమిటి? కుల మత వర్గ వర్ణ లింగ వ్య్తత్యాసాల ఆధారంగా కవిత్వంలో కొత్తగా ఏర్పడుతున్న తాత్విక ధోరణులు ఎలాంటివి? విశ్వసాహిత్యంతో మన సాహిత్యం ముందు నుంచీ ఎలా ప్రభావితమవుతూ వస్తోంది? ప్రస్తుతం యువత  రాస్తున్న కవిత్వం ప్రపంచ సాహిత్యంతో ఏ మేరకు తులనాత్మకంగా తూగగలుగుతోంది? కవిత్వచరిత్రను మొత్తంగా  ఒక స్థూలదృష్టితో   అర్థం చేసుకునే ప్రయత్నం ఏదీ చేయకుండా.. నిజానికి అర్థవంతమైన కవిత్వం రాయడం కుదరదు. ఆ పని చేస్తున్న యువకవులు ఎంతమంది అంటే.. వచ్చే సమాధానం అంత సంతృప్తికరంగా లేదు.

అధ్యయనం  ఒక వంకనుంచీ జరగాల్సిన ప్రయత్నమైతే.. మరో వంకనుంచీ  ఆచరణాత్మకమైన కృషీ సమాంతరంగా జరగాల్సి ఉంది. ఒక కవిత రాసిన తరువాత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నామా?  "కవి తన ప్రతీ అభివ్యక్తినీ నిశితంగా తీర్చి దిద్దుకున్నప్పుడే.. ఆ భావశకలాలు చదువరి హృదయక్షేత్రంలో బలంగా నాటుకునే అవకాశం ఉంటుంది" అంటారు  సీనియర్ కవి ఆవంత్స సోమసుందర్ ఒక పరిశీలనా వ్యాసంలో. కవితకు ఈ నిశితత్వం ఎలా వస్తుంది? ఆవంత్సవారి మాటల్లోనే చెప్పాలంటే.. "రచన  పూర్తయిన తరువాత చప్పున తృప్తి పడకుండా.. చెప్పిన రీతికంటే మరింత రమణీయంగా తీర్చిదిద్దటానికి ఇంకేమన్నా అవకాశాలున్నాయా? అన్న అంశాన్ని   అధ్యయనబుద్ధితో సమీక్షించుకోవాలి. సంవిధానంలో, భావాల  అభివ్యక్తీకరణలో మరిన్ని మెరుగులు సంతరించుకోగల పరాత్మక పరీక్షకు కవి పూనుకున్నప్పుడే ఉత్తమత్వం కవిత్వంలోనుంచి ‘అగ్నిసరస్సునుంచి ప్రభవించిన వజ్రం’లా మెరుపులీనేది". ఈ ధ్యాన నిమగ్నతను ఆరంభంనుంచే అలవర్చుకున్నవాడే మంచికవిగా రూపు దిద్దుకునే అవకాశం పెరిగేది. ఓర్పులేని కవి ఎంత కవిత్వం రాసినా నేర్పులేమి కారణంగా  తేలిపోతుంది.

ప్రతిభను నిత్యహరితంగా రక్షించేది వ్యుత్పన్నతే.  లోకవృత్త పరిశీలన, విస్తృతమైన గ్రంధాద్యయనం, అనుభవ పరిపాకంతోచేసే మేధోమథనం-  కవిత్వకన్య చెక్కిలికి కమ్మని, చిక్కని చక్కదనం చేకూర్చే చెక్కుడు  సరంజామా. భావుకత్వం ఒక్కటే కవిని  మంచి కవిగా తీర్చిదిద్దలేదు. రచన పూర్తయిన వెంటనే నిద్దపుస్వరూపం సిద్దించినట్లు తృప్తిపడే కవి తనకు తానే కాదు..  కవిత్వానికీ హాని చేస్తున్నట్లే లెక్క.

ఇవాళ  అంతర్జాలంలో ఎవరికైనా ఎంతటి uncut and unsesored వెర్షన్నైన అత్యంత సులభంగా ప్రచురించుకునే సౌలభ్యం ఉంది. రాసీ రాయని మరుక్షణంలోనే వాసి సంగతి సమీక్షించుకోకుండా ఏదైనా  పత్రిక్కి  పంపించాలనో, అంతర్జాలంలో ప్రచురించేసుకోవాలనో గత్తర పడితే.. దక్కేది ఒక వ్యతిరేక ఫలితం. తుడుపు

కోవడానికి చాలా కష్టపడ వలసిన  'చెడ్డముద్ర"!


రచన పూర్తవగానే విమర్శకుడి అవతారం ఎత్తడం మంచి పద్ధతి. కవిత్వం అంటే ఒక రసమయ తపస్సు. దీక్షకొద్దీ దాని  ఫలితం.
***
కర్లపాలెం హనుమంతరావు
(మాలిక- అంతర్జాల మాసపత్రిక- జనవరి 2015లో ప్రచురితం)

No comments:

Post a Comment

కథ విలువ - చెంగల్వ - సేకరణ

  కథ  విలువ  - చెంగల్వ  నమస్కారమండి!" అన్న గొంతు విని తలెత్తి చూసాను. "ఓఁ. మీరా! రండి" అంటు ఎదురు వెళ్లి సాదరంగా ఆహ్వానించాను...