టీవీల్లో.. సినిమాల్లో ఇవాళ వస్తున్నది అసలు తెలుగు భాషే కాదు అంటే.. ఎంత మంది ఒప్పుకుంటారో తెలీదు. ఇంగ్లీషు భాష గొప్పతనం ఇంగ్లీషు భాషది. దాన్ని అవసరానికి మించి గొప్పగా చూపించడానికి మన తల్లిభాషను తక్కువ చేయడం మర్యాదా?
'అబ్బా.. ఈ సోదితెలుగులో ఏముంది బాబూ!' అని
బహిరంగంగానే తల్లిభాషను హేళనచేసే వాళ్ళకి..పోనీ ఆ ఆంగ్లభాషలోనైనా అసలు ఏముందో తెలుసా? చిన్నతనంనుంచి అమ్మదగ్గర నేర్చుకున్న పలుకులోనే ఎంత మాధుర్యముందో గ్రహించలేని బుద్ధిమంతులకి ఆ పరాయిభాష సొగసులుమాత్రం ఏమంత అర్థవవుతాయిని? .
ఇంగ్లీషు ఇంకా ఈ గడ్డమీదకు
రానికాలంలో మన తెలుగుకవులు (కొంత సంస్కృతభాష ప్రభావంతోనే అయినా) ఎంత చక్కని సాహిత్యాన్ని సృష్టించారో!
చదివితేనే కదా అనుభవంలో కొచ్చేది?!
చదివితేనే కదా అనుభవంలో కొచ్చేది?!
ఉదాహరణకి ఈ
పద్యం చూడండి.
కోల కులేంద్ర వాడి కొమ్ము మొనంబడి, సర్వదా విష
జ్వాలలు గ్రమ్ము శేషు తల చాయనె యోడకవచ్చి కూడె, నౌ!
భూ లలితాంగి కెంతవలపో రఘునాథ నృపాలమౌళి పైన్!
పద్యం చూసి బెదిరి పక్కకు పోకండి. ఎంత హృద్యంగా ఉందో ఒక్కసారి ఆలకించండి. మన తెలుగు ఎంత మధురమైనదో.. మంచి పనివాడి చేతబడితే ఎంతటి హొయలుపోతుందో గమనించండి!
ఈ పద్యం చేమకూర వెంకటకవిగారి
'విజయవిలాసం' కావ్యంలోనిది. 'దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?' అనే సంచలన వ్యాసం రాసారే.. తాపీ ధర్మారావు గారు.. ఆయన ఎంతో శ్రమకోర్చి విజయవిలాసంలోని ప్రతీ పద్యానికి హృదయోల్లాసమైన వ్యాఖ్యానంచేసి మనబోటివారి తెలుగు భాషాభిమానాన్ని పెంచే నిస్వార్థ సాహిత్య సేవ చేసారు(విజయ విలాసం చాలా సరదా కావ్యం. పెద్దగా తెలుగులో ప్రావీణ్యం అవసరం లేదుకూడా అర్థం చేసుకోవడానికి. తాపీవారి వ్యాఖ్యానం దగ్గర ఉంచుకొని చదివితే ఈ కావ్యం సాహిత్య ప్రియులకు ఒక రసవత్తరమైన విందు భోజనం. చమత్కారం లేని ఒక్క పద్యంకూడా విజయవిలాసంలో కనిపించదు.
సరే.. ఇంతకీ ఈ పద్యంలోని
విశేషమేమిటయ్యా అంటే.. మరి చిత్తగించండి!
కొండలెక్కిదిగీ, మదగజాల మీదనుంచి నడుచుకుంటూ, మహాకోలకులేంద్రుడి(వరాహావాతారం తాలూకు) వాడి కోరలు చీలుస్తున్నా లెక్కచేయకుండా,
విషపుజ్వాలలు విడిచే ఆదిశేషుడి వేయిపడగల నీడల్లోనే ఒదుక్కుంటూ.. పరమకోమలమైన భూదేవి రఘునాథ మహారాజు చెంతకు చేరడానికని వచ్చిందట!
ఇష్టమైన ప్రియుడిని కలవడానికి కోమలులైనా సరే ఎన్ని కష్టాలైనా ఇష్టపూర్వకంగా సహిస్తారు కదా ఆడువారు! స్త్రీవలపు అంత బలమైనది మరి! రఘునాథ
మహారాజుమీద ఉన్న వలపువల్ల.. కొండలెక్కిదిగే శ్రమను, మదగజాలమీదనుంచి నడిచే ప్రమాదాన్ని, మహా రౌద్రాకారంలో ఉన్న వరాహావతారం వాడిముట్టె పొడుచుకుంటుందన్న భయాన్ని, ఆదిసర్పం పడగల జ్వాలల వేడిసెగలను.. వేటినీ భూదేవి లెక్కచేయలేదు.
మామూలు మనుషులకే మహాప్రమాదకరమనిపించే ఈ సాహస కృత్యాలు మరి భూదేవి వంటి కోమలులని ఎంతగా భయపెట్టాలి?
మనసుకు నచ్చినవాడిని ఇలా ఎన్ని కష్టనష్టాలకైనా సహించి కలుసుకొనే స్త్రీని ఆలంకారికులు 'అభిసారిక' అంటారు. ఎంత మంది అభిసారికలు ఉంటే అంత గొప్పమగతనం పురుషపుంగవులకు.. విజయవిలాసకావ్యం వెలసే రోజుల్లో.
ఆశ్రయమిచ్చిన రాజుగారి అహాన్ని ఏదో విధంగా ఉత్ప్రేక్షించి పబ్బం గడుపుకోవడమే ఆ రాజుల్లో చాలామంది కవుల గడుసుతనం. వాటి తప్పొప్పులనుగూర్చి అలా ఉంచండి! అందరూ పాటించే ఆ ఉత్ప్రేక్ష ప్రశంసల్లోసైతం ఉత్తమం
ప్రదర్శించి తెలుగుసాహిత్య కళామతల్లికి నిత్యాలంకారాలుగా శోభిల్లే
సొమ్ములు చేయించి పెట్టిన చేమకూర వెంకటకవిని అభినందించకుండా ఎలా ఉండగలం? కవిలో ఎంత
నగిషీలుచెక్కే పనితనమున్నా .. సొమ్ము చేకూరాలంటే ముడిసరుకులో తగిన మన్నిక
ఉండాలిగదా! మనతెలుగు అటువంటి మేలిమిబంగారమని చెప్పటమే ఈ చిన్నవ్యాసం పరమార్థం!
No comments:
Post a Comment