ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. ఉదర నిమిత్తం బహుకృత వేషం. పశుపక్ష్యాదులది దొరికింది తిని కడుపు నింపుకొనే నైజం. మనిషికే బహురుచుల మోజు. 'అన్నము తిను వేళ నాత్మ రుచులు గోరు/ మదియు నాల్క జెప్ప నడగుచుండు' అన్నాడు యోగి వేమన. వేదాల్లోను పురాణాల్లోను భోజనం భోగట్టానే ఉందని గురుజాడవారి శ్రీమాన్ గిరీశంగారు సెలవిచ్చారు కదా! 'అన్నం వ్యజానాత్.. అన్నవే బ్రహ్మ అని తెలుసుకోవోయి వెధవాయా అంది' అని దబాయింపు కూడాను! 'చమకంలో శ్యామాకాశ్చమే- చామల అన్నం మా మజాగా ఉంటుంది.. మాక్కావాలి దేవుడా!' అని ఉందని ఆ గురువు ప్రబోధించడం.. 'గేదె పెరుగు చమే.. చేగోడీ చమే!' అంటూ అతగాడి శిష్యపరమాణువు వెంకటేశం చమకపారాయణం అందుకోవడం! 'తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్!' అంటూ ఆ మహాకవే మరో చోట నొక్కి చెప్పిన వాక్కుకి ఈ పచన పురాణం యావత్తూ ఓ చక్కెర పూత. ఉదరానందమే హృదయానందానికి నాందీ. ఈ కిటుకు పసిగట్టింది కాబట్టే బసవరాజుగారి వెర్రిపిల్ల సైతం మనసైన బావగారిని గుత్తొంకాయ కూరతో పడగొట్టింది. కొనకళ్లవారి కోడలు పిల్ల 'అందముగా తీపందుకునేలా' అరిసెలు వరసైన మావనోటికి అందించింది. చారడేసిన కళ్లను చక్కిలాలతో పోల్చడం మన తెలుగువారికి ఆనవాయితీ. 'వంకాయవంటి కూరయు/పంకజముఖి సీత వంటి బామామణియున్/శంకరుని వంటి దైవము' లేరు' అని తెలుగువారికి గట్టినమ్మకం. ఎంత కళాభివేశంలో సైతం కవుల కుక్షింభరత్వాన్ని నిర్లక్ష్యం చేయలేదు! 'వైశ్వానర జఠరాగ్ని రూపంలో దైవమే జీవి శరీరంనుంచి ఆహారం నాలుగువిధాల జీర్ణించుకుంటుంద'ని గీతే(15-14) ప్రవచిస్తోంది. తెలుగువారి బువ్వంపు బంతులమధ్య ప్రతిద్వనించే గోవిందనామాల అంతరార్థం తవ్వినవారికి తవ్వుకున్నంత!
'వేవురు వచ్చినా వండ నలయని' గృహిణిని అద్భుతంగా వర్ణించాడు పెద్దన కవీంద్రుడు 'మనుచరిత్ర'లో. వండేందుకు సమయానికి సంబరాలేమీ అందుబాటులో లేనిపక్షంలో సైతం నాటి గేస్తులు ఎంత ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారో అయ్యలరాజు నారాయణామాత్యుడు 'హంస వింశతి'లో విశదీకరిస్తాడు. మామిడికాయనుంచి మారేడుకాయ వరకు, కొండముక్కిడికాయ మొదలు కొమ్ముకాయ, కరగు కాయ, వెల్గకాయ దాకా గృహస్థుల ఇంట సదా సిద్ధంగా ఉండే ఊరుగాయల జాబితా (4-135) ఏకరవు పెడతాడు ఒక పద్యంలో. తిండి తిప్పలంటే వండుకొని ఇంత కడుపుకు వేసుకోవడంగా మన పెద్దలెప్పుడూ భావించలేదు. 'తలం జీర సుట్టియును జె/ ప్పులు దొడిగియు చేసినట్టి భోజనము ఫలం/ బలఘ చరిత బద్మజు/ డసురుల బోగంబని విధించె బ్రకట ఫణితులన్' (3-17) అంటోంది మహా భారతం. 'తడబడి తద్ప్రసాదంబు గుడుచుచో../ రయమున గూలు నరక వార్ధి ననుచు' (41)అంటూ పాల్కురికి సోమనాథుడి ‘పండితారాధ్య చరిత్రం’ అంటుతిండి చేటును గూర్చి 15వ శతాబ్దిలోనే హెచ్చరించింది! 'ఉదరం సగభాగం అన్నంతోను, ఒక భాగం మంచితీర్థంతోను నింపినప్పుడే మిగతా భాగంలో గాలి ఆడి జీర్ణక్రియ సులభతరం అవుతుంద'ని(41) మంత్రి అప్పన్న ‘చారుచర్య’ హితవు చెబుతోంది. వెన్నెలకంటి సూరన్న విష్ణుపురాణం 'మునుపు మధురాన్నములు చవిగొనియనేని/ నడుమ లవణామ్ల తిక్తముల్ నంజెనేని/ పిదప కటుకార్ద్ర భోజనం బొదవెనేని/ బలము నారోగ్యము జాల గలిగియుండు' అంటూ పచన క్రమాన్ని నిర్దేశిస్తోంది. లోకహితంకోసం తపించి అభిభాషించిన ఆరోగ్యసూత్రాలనైనా ఆలకించికపోతే చివరికి నష్టపోయేది ఎవరు? మనమే!
'వండడం కాదమ్మా ప్రధానం. తినాలి. తినడమూ కాదు. ఏది ఏమిటో తెలియాలి' అంటుంది శ్రీపాదవారు సృష్టించిన 'పాకశాస్త్రం'లోని ఓ పాత్ర. ‘ఓ రామ! నీ నామ మెంతో రుచిరా!' అని పరవశంతో పాడుతున్న ఓ భక్తుణ్ని 'నామం రుచి చూసానయ్యా! చప్పగా ఉంది' అని దెప్పిపోఛాడో తిండిపోతు. తినేవి ఏవో.. తినకూడనివి ఏవో విచక్షణ మరిస్తే కుడిచిన విస్తరే పంచకూళ్ల విషమౌతుంది- అంటున్నారు ఆహార శాస్త్రవేత్తలు. మిరియం పొడి చల్లిన తినుబండారాలనుండి, ఆవపిండిలో ఊరేసిన వడలు, ఇంగువ తాళింపులతో ఘుమాయించే కరకర సరుకులు, చింతపండు, నిమ్మ రసాలు పిసికి పోసిన పులుసులు, తొలిచూలు గోవుల పొదుగులనుంచి సేకరించి మధించిన వెన్నలను కాచి తీసిన నేతులలో ముంచి తేల్చిన మధుర పాకాలు, భక్ష్య భోజ్య, లేహ్య, పానకాలలో ఏ ఒక్కటీ బీరుపోకుండా తెలుగువాడి నిండువిస్తరి వైభోగాన్ని శ్రీనాధ కవిసార్వభౌముడు పలు సందర్బాలలో పూసగుచ్చినట్లు వర్ణించాడు. పాకశాస్త్రం భారతీయుల చతుష్షష్ఠి కళల్లో ఒకటి. సీతమ్మ సీమంతంనుంచి శ్రీకృష్ణుని చల్దులదాకా ఆడంగులు పాడుకొనే అన్ని పాటలనిండా ఎన్ని తినుబండార వైభోగాలో! సంతోషానికి సంతృప్తి దగ్గరి దారంటారు పెద్దలు. సంతృప్త అంతరంగానికి ఆత్మారాముడి ఆశీర్వచనం తప్పని సరి. ఆరోగ్యకరమైన ఆహారం సంతృప్త భావతరంగ వ్యవస్థను తట్టి లేపుతుందని.. ఇష్టమైన పదార్థం రుచికరంగా జిహ్వకు తగలగానే కోరికను రేకెత్తించే 'డొపమైన్' ఉత్పత్తి అధికమవుతుందని, ఆ స్థితిలో జీర్ణమయే ఆహారం ఆనందకారక రసాయనాలు ఒపియేట్స్ (opiates) కెన్నబినాయిడ్స్ (cannaabinoids) మెదడు విడుదల చేసేందుకు దోహదపడతాయని తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. కార్డిఫ్ విశ్వవిద్యాలయానికి చెందిన యాండ్రూ స్మిత్ అనే మానసిక శాస్త్రవేత్త నిర్వహించిన పరిశోధనల్లో అనారోగ్యకరమైన ఆహారాన్ని అపరిమితంగా స్వీకరించడం వల్ల ‘ప్రతిఫల వ్యవస్థ’ ((reward system) అస్తవ్యస్తమై భోక్త విపరీత భాగోద్వేగాలకు బానిసవుతాడని తేలింది. ఉదయ అల్పాహారంగా నిలవ ఆహారం సేవిస్తున్న వారిలో అలసట.. అహననం, ఆందోళన , కుంగుబాటు తాజా ఫలాలు సేకరించే వారిలోకన్నా మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు తాజా పరిశోధనలు నిగ్గు తేలుస్తున్నాయి. తిండి తిప్పలు ఎన్ని రకాలో! తిండికోసం పడే తిప్పలు సరే! తిన్న తరువాత వచ్చిపడే తిప్పల్ని తప్పించుకోవాలంటే తినేటప్పుడే అప్రమత్తంగా ఉండటం తప్పని సరి- అంటున్నారు ఆహారశాస్త్ర నిపుణులు. ‘భోజనం యోగంగా భావించినంత కాలమే మనిషికి భోజనం ఓ భోగం’ అన్న ‘లోలంబ రాజీయం’ సూక్తే చివరికి శిరోధార్యమయింది. శుభం.
***
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ఆదివారం సంపాదకీయం )
No comments:
Post a Comment