ఒక్కోసారి ఊహించని వైపునుంచి ఉత్పాతాలు వచ్చి
పడుతుంటాయి. దిల్లీ
గొడవలను గురించి కాదీ ప్రస్తావన. చిల్లర మల్లర మంచితనాన్ని గురించే చింతంతా.
నగర పాలికల ఎన్నికలకు నగారా మోగేందుకు సిద్ధంగా ఉందా!
పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో పై స్థాయి పెద్దలు పనుపున వచ్చిన కింద
స్థాయి పెద్దలు మా
బుల్లిస్థాయి పెద్దలను అందరినీ సమావేశపరచి మరీ హెచ్చరించడాలు కూడా అయిపోయాయి. ఈ సారి- 'ఏం
చేసైనా సరే'.. పార్టీ అభ్యర్థుల్ని ఆయా ప్రాంతీయ బాధ్యులే గెలిపించుకు తీరాలి’ అని తాఖీదు!
‘ఏం చేయించడానికైనా' మేం సిద్ధంగా ఉంటే సరా? ఏమైనా చేసేందుకు కార్యకర్తలూ సిద్ధంగా ఉండాలిగదా! అసలు
కార్యకర్తలంటూ పార్టీలో మిగిలుంటేనే కదా ఏ కథయినా? ఖర్మ!
పార్టీ అధికారంలో లేనప్పుడు జెండాలు భుజం దించకుండా..
సొంత సొమ్ము తగలేసుకొని మరీ ఊరేగిన తింగరోళ్లను.. అధికారంలోకి వచ్చినాక.. పులుసు ముక్కల తొక్కలకు మల్లే పార్టీ పక్కన పెట్టేసింది. అలిగి పక్క
పార్టీల్లోకి గెంతేసారెప్పుడో దాదాపు అంతా.
‘చుక్క.. ముక్క’ ఏర్పాట్లా పక్క పార్టీల కన్నా ఇంకాస్త ఎక్కువ మెరుగ్గానే చూద్దాంలే. మాతృపక్షంలోకి మళ్లా లేచిపోయిరమ్మ’ని పిలుపిచ్చాం. పార్టీ తరుఫున గడ్డం పుచ్చుకు
బతిమాలాం.
'హామీలు నమ్ముకొని
గోదాట్లోకి దూకే రోజులంటన్నా ఇవి? అవతల
పార్టీలు.. పాపం.. పదవుల్లో
లేకపోయినా ఆప్పో సప్పో చేసి మరీ మమ్మల్నిప్పటిదాకా మేపుకొచ్చింది ఇదిగో.. ఇట్లాంటి ఎన్నిలక్కర్ల
కోసమే కదా! మళ్లా వాళ్లకీ వెన్నుపోటంటే బావుండదు' అని సుద్దులు చెప్పుకొచ్చారు పిల్లకార్యకర్తలు. ఇహ
వాళ్ల వైపునుంచి సభల్లో చెప్పులు, ప్రచారంలో సిరాలు, కేన్వాయీల కడ్డంగా పడుకోడాల్లాంటి అల్లర్లు కల్లో మాటే మా పార్టీ వరకు.
ఈ మధ్యన యోగాగురువులు, స్వాములార్లు, వ్యక్తిత్వ
వికాస పాఠాలు గుప్పించే పెద్దోళ్ల సేవలు కూడా మా బాగా ముమ్మరించేయాయి
కదా అన్ని పార్టీలల్లో!
అల్లరి కార్యకర్తలకు ఎక్కళ్లేని కరువొచ్చి పడిందందుకే.
చిల్లర పన్లేవీ పెట్టుకోకుండా ఎన్నికల గండాలు
గట్టెక్కేందుకు మనకింకా
సంపూర్ణ రామరాజ్యంల్లాంటివి సగమైనా వచ్చిచావలేదే!
మేం దిగువసభలకు
నిలబడ్డప్పుడు ఎగువనున్న ఏ పెద్దమనిషీ దిగొచ్చి
మాటవరసకైనా ఒక్క మంచిమాట మాటసాయంగా అయినా
చేసిందిలేదు. పైవాళ్ల పోస్టర్ల నుంచి.. పక్క పార్టీ అభ్యర్థుల పోస్టర్ల
మీద పేడముద్దలు, ఊరేగింపుల మీద వేయించే రాళ్ళు రప్పలు.. సోషల్
నెట్ వర్కుల్లో అక్కసులు వెళ్లబోసుకునే దాకా అన్ని తిప్పలూ మేమే
పడింది. ఎన్నికలసంఘం ఆ లెక్కలడిగినప్పుడు ఎన్ని యాతనలు పడ్డామో అధిష్ఠానాలకేం తెలుసును? అప్పుడూ మాకే బిల్లు. ఇప్పుడూ మా మనీపర్శులకే చిల్లు. దేశమే అట్లా ఏడ్చింది! దరిద్రం!
గతం గుర్తుచేసుకుని కుళ్ళుతూ కూర్చుంటే భవిష్యత్తుండని పాపిష్టి ఫీల్డ్ ఈ రాజకీయం. గోల్డనుకుంటారు కానీ..
బైటికే ఆ మెరుపులు!
‘రిటన్ ఆఫ్ రాహుల్ బాబు’ ఎపిసోడ్ చూసి
విరమించుకోడమే తప్పించి నిజానికి ఇంటాళ్లక్కూడా కూడా ఆనవాలు చిక్కకుండా ఆ బాబుకు మల్లేనే సెలవు
చీటీ ఓటి పారేసి ఇంచక్కా ఎక్కడికైనా చెక్కేసెయ్యాలనిపిస్తుంది ఒక్కోసారి!
వాళ్లెన్నిక చేసినవి గాడిదలైనా.. సరే గెలిచే తీరాలని రెట్టిస్తే
ఎట్లా? డ్యూటీలు బలవంతంగా మెడకు చుట్టేసే ఈ అధిష్ఠానాలు.. టిక్కెట్ల పంపకాలప్పుడు మాత్రం ఎన్ని సార్లు దిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి.. సిగ్గిడిచి
కాళ్ళ మీద పడ్డా కోరుకున్నవాడి
వేపు కన్నెత్తైనా చూడవు! కోటరీలు కట్టే సూటూకోటుగాళ్ల మాటలే ఫైనల్గా వాళ్ల చెవులకు
స్వీటు!
ఎక్కడెక్కణ్నుంచో గాలించి మరీ తెచ్చి ఇక్కడ నిలబెట్టేస్తున్నారే కాండిడేట్లను! ఇలాకాలో ముక్కూ మూతీ
అయినా సక్రమంగా ఎరగని కుంకలను చంకనేసుకు ఊరేగడం..
కుక్కల్లా విశ్వాసంగా పార్టీలో పడున్నందుకు
చివరికి దక్కే ఖర్మఫలం! ఎన్ననుకున్నా అన్నం పెట్టిన పార్టీ.. ఆనతి పాటించడం ఆనవాయితీ
కనక.. తప్పదు.
కానీ..
అతి నిజాయితీ, నీతికి ప్రాణమిచ్చే త్యాగబుద్ధి..
వంకాయ.. ఏం చేసుకోనూ ఈనాటి రాజకీయాలల్లో? ఓటరు పన్లకు ఏ మాత్రం లింకుల్లేని కార్యక్షేత్రాల నుంచి వచ్చిపడే మహామేధావుల్ని గెలిపించే ‘భారం’ మా నెత్తికి రుద్దితే.. గట్టెక్కించడం అంత తేలికా?
అవతల పార్టీల నుంచి కాలు దువ్వేది గాలి బ్రదర్సుకే పాఠం నేర్పే ఘనాపాటీలు.. గుత్తేదార్లు, రామలింగరాజునయినా నంజుకు తినివూసేసే ఇండస్ట్రియల్ ఎలైట్సూ!
అన్నీ లైటుగా తీసుకోబట్టే మాడిపోయిన బల్బులాగా కళతప్పుందిప్పుడు మా పార్టీ భవిష్యత్తు!
అధికారులు అందుబాటులో
ఉన్నప్పుడు చేయరానివి,
చెప్పకూడనివి ఏవేవో చేసేసి మీడియా పుణ్యమా అని ప్రజాసేవకుల జాబితాలోకొచ్చి
పడ్డ స్వాములార్లు, అవతారమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, చలనచిత్రాలలో అవకాశాలు సన్నగిల్లిన మహానటులూ, మొహం
మొత్తిందాకా టీవీ
సోపుల్లో మొహాలు చూపించి వళ్లు పెంచిన
గ్లామరు గాళ్సూ.. పోటీ! నీతివంతుడన్న
ముద్ర పడ్డ పెద్దమనిషి ఎవడన్నా ఈ తరహా సెలబ్రటీల పోటీని
తట్టుకుని నెట్టుకురావడమే! మహాత్మా ఫూలే కన్నా ఫూలన్ దేవికే ముందు మెడలో పూలమాలలు పడే ఫూలిష్ సీజన్ స్వామీ ప్రస్తుతం నడిచేదీ!
బఫూన్స్ ను పెట్టి గెలిపించుకు రమ్మంటూ మా ప్రజాప్రతినిధులకిప్పుడు ఈ కొత్త రకం ప్యూను
జాబులేంటో? ఖర్మ౦!
ఈ సారి మా ఇలాకా నగరపాలిక ఎన్నికల్లో ప్రస్తుతానికి మేమున్న
పార్టీ పక్షాన నిలబెట్టబడ్డ పెద్దమనిషి
అదేదో విదేశీ నిధుల సాయంతో స్వచ్ఛందంగా సేవా సంస్థలు
ఏట్లో దూకినోడు గట్టెక్కాలంటే సొంతంగానే ఈదనక్కర్లేదంట! మోతగాళ్ల రెక్కల కష్టం పుష్కలంగా ఉంటే చాలన్నది మా పాత పార్టీ బొజ్జపెద్దల నయా సిద్ధాంతం. నిజమే కావచ్చేమో కానీ మోసే చిల్లర గాళ్లకే ఎక్కళ్ళేని
కరువొచ్చి పడిందయ్యా స్వాములూ ఇప్పుడు!
ఆ ఉత్పాతం పార్టీ పసిగట్టకపోడమే మా ఉపద్రవాలకు మూలకారణం.
స్వచ్ఛంద సంస్థల పెద్దాయన వ్యక్తిగత జీవితం మరీ శుద్ధమబ్బా! సర్కారు కొలువులు వెలగబెట్టే
రోజుల్లో ఒక్క పైసా కూడా ముట్టని అర్భకుడన్న చెడ్డపేరొకటి
పెద్ద మైనస్ గా మారిందిప్పుడు సామాజిక మాధ్యమాలలో కార్చిచ్చులా అంటుకుని.
రేప్పొద్దున నిజంగానే ఎన్నికయి ఊరి మొత్తానికి ఫస్ట్ పెద్దమనిషి అయిపోతే ఇలాకా అభివృధ్ధి గతి ఏంటీ? అంటూ రచ్చ. ఎక్స్పార్టీవోడికి ఇదే పెద్ద
బ్రహ్మాస్త్రంగా మారిందిప్పుడు!
ఏ ప్రభుత్వ భూమీ కబ్జాకాస్కారం ఉండదు! ముందే ఆక్రమించిన భూముల్నయినా తిరిగి లాక్కునే
ప్రమాదం కద్దు! అసైన్ మెంటనో.. అసెస్ మెంటుల్లో లోపమనో.. ఏదో ఓ సిల్లీపాయింటు పట్టుకుని
సెటిల్ మెంట్లన్నీ అంట్లగిన్నెల డబ్బీలో వేసేస్తానని మొండికేస్తేనో? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చి పడే పిసరంత
నిధులను కూడా అచ్చంగా ఆయా పథకాలకు మాత్రమే
వెచ్చించి తీరాలని ఖచ్చితంగా నిబంధనలు పెట్టేస్తేనో? ‘పట్టించుకోం.. పో.. దిక్కున్న చోట చెప్పుకో!’ అంటూ మునపట్లా చిందులేస్తామే
అనుకోండి! అయినా అందర్లా ‘ఊఁ’ కొట్టి ఊరుకొనే
ఘటమైతే తంటానే లేదు. మొండిఘటమని ట్రాక్ రికార్డులు అఘోరిస్తున్నాయే! కోర్టు బోనులకెక్కిస్తేనో
మళ్లీ! మన తంటాలేవో మనం పడి గుట్టుగా బెయిళ్లు కొనుక్కు తెచ్చుకున్నా
వెంటనే రద్దు చెయ్యాలని కోర్ట్ల మీదకు తిరగబడితేనో? గడ్డివాములోని కుక్క
సామెతబ్బా .. వీడిని ఎన్నుకుంటే! అడ్డమైన గడ్డికీ అలవాటు పడ్డ పశువులం మన నోట్లో మన్నే
కదా పడేది చివరికి? అని గోడు.
లోపాయికారీగా మా ఏడుపూ అదే .. నిజం చెప్పద్దూ! ఎన్ని తరాల
బట్టో అనుభవిస్తున్నవీ భోగాలన్నీ! అడిగేనాథుడు రాలేదిప్పటి దాకా. ఇప్పుడీ చాదస్తపు ప్రజాసర్వెంటొకడొచ్చి
విద్యుత్ బిల్లులు.. వాటర్
బిల్లులు, ఆస్తి పన్నులు.. వృత్తి పన్నుల..
ఆ పన్నులు ఈ పన్నులంటూ పాత దస్త్రాలన్నీ కెలికించేసి బకాయిలతో సహా అపరాథ రుసుం, దాని
మీది చక్రవడ్డీతో లెక్కగట్టి అసల్తో కలిపి మొత్తం ఏ వారం రోజుల్లోనో
కట్టేసెయ్యాలని గట్టిగా లాయర్ నోటీసుల్తో దాడికొచ్చేస్తేనో!
దాచిపెట్టిన పన్ను ఎగవేత కేసులన్నీ
వెతికించి తిరగతోడితే? కూడేసి కూతుళ్ల పెళ్లిళ్లకు, కొడుకుల వ్యాపారాలకు
తరలించేసిన సొమ్ములన్నీ తిరిగి తెచ్చిమ్మంటే? ఎక్కణ్నుంచని పీక్కుని తెచ్చిపొయ్యడం!
ఏడుకొండలవాడి హుండీలో వేసిన సొమ్మునైతే వెనక్కు లాక్కోలేం కదా!
గమ్మున కూర్చొనే
తిమ్మయ్యయ్యా మన పట్టనానికి ఇప్పుడు అధినేతగా రావాల్సిందీ? చదూకొన్న వెధవామాయ ఈయన! కోర్టు రూల్సు అన్నీ కొట్టిన
పిండంటున్నారు! రాజ్యాంగంలోని రహస్యాలన్నీకంఠతా పట్టేసి సివిల్సులో నెంబర్ ఒన్ గా వచ్చినోడితో
పోరే మార్గం ఏది? కోర్టుల్లో పడి వీడితో పోరుతూ
కూర్చుంటే వచ్చే ఎన్నికలకు అయ్యే ఖర్చులు
మళ్లీ దక్కించుకునే దారులు వెదికే తీరిక ఎదీ?
పార్కులు, పార్కింగు
స్థలాలు, పాదచారులు నడిచే
దారులు పాదచారులకే అంటూ
కొత్తరకం చాదస్తాలు దస్తాలకు దస్తాలు సిద్ధం చేసుంచాడని టాకు! ఆ సరికొత్త సకల సౌకర్యాలకూ
జనాలు అలవాటు పడిపోతే మింగటానికింక నేతాగణాలకి
మిగిలే జాగా ఒక్కరంగుళమైనా మిగిలుంటుందా? భూముల
ఆక్రమణల కోసం అడ్డొచ్చిన
ప్రతీ చెట్టూ చేమా, పుట్టా గుట్టా కొట్టేసుకుపోతున్నామిప్పుడి దాకా! అడిగే దమ్మెవడికీ
లేదు. నేరస్తుల శిక్షాస్మృతిలో వాటికీ శిక్షలు
ఇన్నున్నాయని తెలిసిపోతే మన ఇళ్లల్లో పనిచేసే
పనివాళ్లల్లో కనీసం ఒక్కళ్లకైనా బెయిలుకు వీలయ్యే శిక్షలు పడకుండా తప్పే దారుంటుందా?
ఆటస్థలాల్లేని పాఠశాలలు, రక్షణవ్యవస్థ పటిష్టంగా లేని పర్యాటక ప్రాంతాలు, నిబంధనల ప్రకారం వైద్యసేవలందించని వట్టొట్టి వైద్యశాలలు, పరిశుద్ధమైన
పదార్థాలు తాజాగా వడ్డించని పాచి భోజనశాలలు, వాహదారుల వాడకానికి తగినంతగా జాగాలు చూపించని
టిక్కీ వినోద, వ్యాపార కేంద్రాలు.. గుర్తింపులు రద్ధయేదాకా నిద్ర పోనంత చండశాసనుడని ముందు నుంచే చెప్పుకుంటున్నారు
ఈయన గురించి! మన భద్రత కోసం అంకితమై అహర్నిశలు
జనాలను అదుపుచేసే కార్యకర్తలకు రిటర్న్ గిఫ్ట్స్ గా మనమింకేం కంట్రాక్టులు జనం సొత్తు దోచి ఇప్పించగలం?
శిరస్త్రాణాలు, సీటు బెల్టులు, పరిమితికి లోబడి మాత్రమే నియమిత
వేగంతో అనుమతించిన దారుల్లో వాహనాలు నడపడాలు! ఇదేమైనా అమెరికా దేశం న్యూయార్కు నగరమా! ముచ్చటపడితే నడుపుకోడానికి హోండాలు, బెంజీలు మునిమనమళ్లకు ఏ బర్త్ డే కానుకులుగా ఇచ్చుకోడమూ నేరమేనా? కాలుష్యం పెరుగుతుందని చెప్పి కాళ్లరిగిపోయేటట్లు ఇంటాడాళ్లు కాళ్లాడించుకుంటా
షాపులెంట చీపుజనాలతో వీపులు రుద్దుకుంటా తిరుగులాడాల్నా? లాకౌట్లు చేయిస్తా, కటౌట్లు పీకేయిస్తా అంటుండె! పేకాట క్లబ్బులకు లాకులు వేయిస్తే ఇంటళ్లుళ్లు ఇంకేదో దేశం
పోయి టైం పాస్ చేస్తేనో.. కూతుళ్ల మాటేమిటి?
ఇచ్చమొచ్చిన
చోట మలమూత్ర విసర్జనలు చేస్తే పబ్లిక్కున పెట్టించి పరువు తీస్తా! ధూమపానం చేస్తున్నట్లు పదిమందిలో కనిపించినా, బస్టాండుల్లాంటి చోట్ల
ఆడబిడ్డల్ని పట్టుకుని వేధించినా అక్కడికి అక్కడే అరెస్టులు చేయించేస్తా! గుళ్లు, మసీదులు,
చర్చీల ముందు చేరి చెవులు దిబ్బెళ్లడేలా డోళ్లూ బూరాలతో హార్మోనీ పెట్టెలతో శబ్దాలు గాని చేస్తే న్యూసెన్స్ కేసులు బనాయించేస్తా! ఇంటాడాళ్లను
వేధించడం, పసిపిల్లకాయల చేత పనిపాటలు చేయించడం సహించరాని నేరం.. తక్షణమే యాక్షన్ తప్పదనడం..
ఓవరాక్షన్ కాదూ! శాంతి భద్రలు మరీ ఇంత ఘోరంగా అదుపులో ఉంటే ఒక్క పార్టీ కార్యకర్తనయినా ఊచల కివతల ఉంచేసుకోగలమా? కితకితలు కాకపోతే .. కట్టుకున్న దానిని, కన్న తల్లిదండ్రులను ఇంటైనా బయటైనా అమానుషంగా హింసించినట్లు సమాచారముంటే
సహించడమనే మాటే ఉండదంటూ ఇప్పట్నుంచే ఎన్నికల్లో ఉపన్యాసాలు దంచటాలేవిటంట! కూరగాయల బజార్లలో నిలువు దోపిడీలు జరుగుతున్నాయ్!
పళ్ళను మగ్గబెట్టేందుకు కృత్రిమ రసాయనాలు వాడేస్తున్నారు. చట్టం అనుమతించని ఏ
ఒక్క అసాంఘిక చర్యకు ఎవరు పాల్పడ్డా, అంతస్తులతో నిమిత్తం లేకుండా చట్టబద్ధంగా ఉంటూనే
కఠినంగా వ్యవహరిస్తా!’ అంటూ ఏమేమో పట్టణ ప్రజాజీవనం ప్రశాంతంగా
సాగిపోవాలని పెద్ద తానొక్కడే తహతహలాడుతున్నట్లు
డే అండ్ నైట్, పోయిన ప్రతీ చోటా బారెడేసి ప్రసంగాలు..
మా చదువుకొన్న అభ్యర్థిగాడిదవి! అక్కడికీ ఎన్నోసార్లు
చిలక్కి చెప్పినట్లు విపులంగా చెప్పి చూసాం. వింటేనా! పై వాళ్లకి ఫిర్యాదులు చేసే విఫల ప్రయత్నమూ చేసాం. మా
వంతు బాధ్యతగా అలవాటైన అల్లర్లతో ప్రచారం ఎప్పట్లానే.. మాకున్న వనరులకు లోబడి నిజాయితీగానే
నిర్వర్తించాం. అదొక్కటే చివరికి నిబద్ధత కలిగిన
పార్టీ ప్రజాప్రతినిధిగా నాకు మిగిలిన
సంతృప్తి.
కల్కి వచ్చి ధర్మరక్షణ చేసే ముందే దుష్ట భక్షణకు మానవమాత్రుడు గత్తరపడితే
ఫలితం ఎలా ఉంటుందో.. అంతకన్నా దారుణంగా వచ్చింది ఎన్నికల రణంలో
మా పరాజయం.
కలియుగంలో కలియుగంలా మాత్రమే పాలన సాగాలన్న ప్రగాడమైన
అభిప్రాయమే ఓటర్లకు ఒన్ సైడెడ్ గా ఉన్నట్లు రూఢీ అయింది. మేము ఊహించినదానికన్నా దారుణంగా
ఓడిపోయాడు మా పార్టీ నిజాయితీ పెద్దమనిషి!
అందునా ఎదుటి పక్షం నుంచి తొడ చరిచిన ఉస్తాదు.. ఎన్నో తరాల బట్టి ఇక్కడి ఎన్నికల
గోదాలో నిలబడి ఎదురు లేకుండా గెలుచుకొస్తున్న వంశం నుంచి
వచ్చిన అంకురం.
నియోజకవర్గం ఓటర్లలో అధిక శాతంగా ఉన్న కులం నుంచే వచ్చిన అభ్యర్థిని
ఏ కారణంతో కులం.. మతం.. దేవుడు.. దయ్యం.. లాంటి సెంటిమెంట్లేవీ లేవని పబ్లిగ్గా
నిక్కే అభ్యర్థి కోసం వద్దని
నిరాకరిస్తుందీ పబ్లిక్కు ?
ఎన్నికలంటే ఒక నెలరోజులు మించి సాగని సంబరాలు. ఆ
తరువాత? మంచికైనా.. చెడ్డకైనా ఆదుకొనేదైనా.. అడ్డుకొనేదైనా
ఎవరని కదా కామన్ మ్యాన్ కామన్ గా చూసుకొనేది! అసాంఘిక శక్తుల ఆరాధ్య దైవాన్ని కాదని ఓ నిజాయితీ పరుడైన విదేశీ
మేథస్సుగల స్వచ్ఛంద సేవా తత్పరుణ్ణి ఏం భరోసా కల్పించి గెలిపించడం మా బోటి ఔట్ డేటెడ్ పార్టీలోని అట్టడుగు స్థాయి నాయకత్వం? మా పార్టీ తరుఫున నిలబడ్డ మహా మేధావి ధరావతుకూడా గల్లంతయిందని వేరే
చెప్పనవసరం లేదనుకుంటా.
ఓటమికి బాధ్యత వహిస్తూ నన్ను రాజీనామా చెయ్యమని అధిష్ఠానం ఆదేశం. ఎన్నో లక్షలు పోసి, ఎంతో శ్రమదమాదులకోర్చి గెల్చుకున్న ఎమ్మెల్యే
సీటిది. వద్దని దులపరించుకు పోవడం అంత సులభమా? ఎదుటి పార్టీలోకి దూకేస్తే పస్తుతానికి నా ప్రజా ప్రతినిధి పదవిని
కాపాడుకోవచ్చని అందరిలానే
నాకూ ఆలోచన వచ్చింది.
తప్పేముంది? బిజెపిని గెలిపించినంత మాత్రాన ప్రశాంత్ కిశోర్ అచ్చంగా భాజపాకే ఎన్నికల సలహాదారుడిగా అంకితమయిపోయాడా? మొన్నటి దిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఛీఫ్ అడ్వయిజర్ గా పనిచేసాడా
లేదా? రాజకీయాల్లో ఏదైనా సంభవమే!
ఎదుటి పార్టీతో రాజీ
బేరాలు మొదలయ్యాయి. చర్చలు చివరి అంచె
దగ్గర కొచ్చి స్థభించాయి. నా బేరానికి మరో అభ్యర్థి అడ్డురావడమే
ఆందుక్కారణం.
ఆ అభ్యర్థి వేరెవరో అయితే ఈ కథే చెప్పక పోదును. ఎవరి మూలకంగా అయితే నేను
రాజీనామా చేయవలసి వచ్చిందో.. ఆ స్వచ్ఛంద సేవా సంస్థల అధిపతి! 'మీ ముసలి పార్టీ నన్ను ఎలాగూ
గెలిపించలేక పోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గూండా పార్టీ ద్వారా నిలబడతాను. నా సంస్థల్ని కాపాడుకోడానికి
ఈ 'వాల్ జంప్' తప్పడం లేదు. సారీ'
అనేశాడా స్వం. సం. సేవాభావ ప్రజల పెద్దమనిషి! ముందే చెప్పాగా .. రాజకీయాల్లో ఏదైనా సంభవమే!
కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment