Monday, December 13, 2021

తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ కర్లపాలెం హనుమంతరావు ( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య )










తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ 

కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య ) 




బెంజమెన్ షుల్జ్ - తొలి తెలుగు ముద్రాపకుడు


తెలుగులో తొలిసారిగా గ్రంథాన్ని ముద్రించి చరిత్రకెక్కిన బెంజమెన్ షుల్జ్ చిరస్మరణీయుడు. ఇతడు 1689లో జర్మనీలో జన్మించాడు. 1719 × తన 29వ ఏట దక్షిణ భారతదేశం వచ్చాడు. డెన్మార్క్ రాజు ఐదవ ఫ్రెడరిక్ పంపగా జర్మనీ నుంచి దక్షిణ భారతదేశంలోని తరంగంబాడికి క్రైస్తవ మత ప్రచారం కోసం వచ్చిన రెండవ జట్టు ఫాదరీల్లో షుల్జ్ ఒకరు. చెప్పులు సైతం లేకుండా నిరాడంబరంగా పాదచారిగా మత ప్రచారం చేశాడు. అనారోగ్య కారణాల వల్ల స్వదేశం తిరిగి వెళ్లిన తర్వాత కూడా తెలుగు టైపులు పోతపోయించి, తెలుగు గ్రంథాలు రచించి ముద్రించాడు. జర్మన్ లూథరన్ తత్త్వవేత్త జోహాన్ ఆర్నెడ్ (1555-1621) రచించిన నాలుగు గ్రంథాలను షుల్జ్ తెలుగులోకి హాలేలో ముద్రించాడు. 23 సంవత్సరాల ముద్రణారంగంలో శ్రమించాడు. స్వదేశం వెళ్లిపోయాక కూడా 17 సంవత్సరాల పాటు తెలుగు పుస్తకాలు ముద్రించాడు. స్వయంగా 'GRAMMATICA TELUGICA' (1728) పేర 8 ప్రకరణాల్లో తెలుగు వ్యాకరణం రచించాడు. దీనిని హాలే విశ్వవిద్యాలయం వారు భద్రపరచి 1984లో తొలిసారి ముద్రించారని ఆరుద్ర తెలియజేశారు.8 తమిళం, పోలీసు, డేనిష్ భాషల్లో 20 పుస్తకాలను ఆరేళ్లలో ముద్రించాడు. మద్రాసులో సెంట్ జార్జ్ కోటలో కుంపిణీ గవర్నరు ఒప్పించి భారతీయుల కోసం పాఠశాల పెట్టించడమే గాక అందులో తెలుగు విభాగాన్ని ప్రారంభించి పిల్లల్లో తానూ ఒకనిగా కేవలం రెండు నెలల్లో తెలుగు నేర్చుకున్నాడు. అంతేకాదు బైబిల్ను సాహసోపేతంగా తెలుగులోకి అనువదించి ముద్రించాడు. 1760 నవంబర్ 25న షుల్జ్ కన్నుమూశాడు.


K. జేమ్స్ గ్రాంటు - దేశీయ విద్యలపై దృష్టి


కుంపిణీ వారికి మన దేశంలో మొట్టమొదట వశమైనవి ఉత్తర సర్కారులు. ఈ ప్రాంతాల సంక్షిప్త రాజకీయ చరిత్రను, విపులమైన రెవెన్యూ చరిత్రను వ్రాసిన తొలి ఆంగ్లేయిడు జేమ్స్ గ్రాంటు నిజాం దర్బారులో బ్రిటిషు రాయబారిగా పనిచేశాడు. దేశీయ విద్యలు మూలపడ్డాయని, వాటిని ఉద్దరించాలని చెప్పాడు.


ఛార్లెస్ వైట్ - నిఘంటు నిర్మాణానికి అంకురార్పణ


సెంట్ జార్జ్ కోటలో సివిల్ సర్వెంట్ హోదాలో పనిచేసిన ఛార్లెస్ వైట్ తెలుగులో నిఘంటు నిర్మాణానికి 1793 ప్రాంతాల్లో అంకురార్పణ చేశాడు.మంచి నిఘంటువు తయారు చేసిన వారికి బహుమతులివ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాడు. అంతేకాదు తెలుగు నేర్చుకొనేవారికి ఉపయోగపడే ప్రాథమిక గ్రంథాలను రాయించాలని సూచించాడు. ఈయన సూచనవల్లే సెంట్ జార్జి కోట

పాలకులు మామిడి వెంకయ్య 'ఆంధ్ర దీపిక' హక్కులను కొన్నారని భావించవచ్చునని తెలుగు భాషా సారస్వతాల రంగాన్ని బ్రౌసు మహోజ్వల కాంతులతో నింపాడు. తెలుగు భాషా సాహిత్యాల పునరుద్ధరణకు, పునరుజ్జీవానికి అతడు ధారవోసిన శ్రమ అపారం. 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఇంగ్లండులో విద్యాభ్యాసం తర్వాత 1817లో కుంపిణీ ప్రభుత్వ సివిల్ సర్వెంట్గా భారతదేశంలో అడుగుపెట్టాడు. దక్షిణ భారత క్యాడర్లో బ్రౌను నియామకం ముఖ్యంగా తెలుగు వారు చేసుకున్న పుణ్యం.

కలెక్టరు సహాయకునిగా, మెజిస్ట్రేటుగా, పర్షియన్, తెలుగు పోస్ట్మాస్టర్ జనరల్ కునిగా, గా, విద్యామండలి సభ్యునిగా, కాలేజ్ బోర్డు కార్యదర్శిగా అనేక హోదాల్లో అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేశాడు. 38 సంవత్సరాలు కుంపిణీ వారి కొలువులో ఉన్నాడు. తాను దేశంలోనూ, తిరిగి ఇంగ్లండు వెళ్లాకకూడా మొత్తం దాదాపు ఐదున్నర దశాబ్దాల కాలం తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడు. ఇది ఒక వ్యక్తికి సాధ్యమయ్యే పని కాదు. తెలుగు గ్రంథాల రచనలో, తాళపత్ర గ్రంథాల సేకరణలో, ఉద్ధరణలో, భద్రపరచడంలో, పరిష్కరణలో, ముద్రణలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పనిచేశాడు బ్రౌన్. బ్రౌన్ వేమన పద్యాల ఆంగ్లానువాదం 1825లోనే చేపట్టాడు. తెలుగు ఛందస్సు (1827) ముద్రించాడు. తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు, తెలుగు వ్యాకరణం, ఆంగ్లంలో తెలుగు వ్యాకరణం ప్రచురించాడు. ది లిటిల్ లెక్సికాన్, ది జిల్లా డిక్షనరీ కూర్చాడు. కొత్త నిబంధనను అనువదించాడు. వేమన పద్యాలను ఆంగ్లంలో 1829లో 693 పద్యాలతో, 1839లో 1164 పద్యాలతో ప్రచురించాడు. ఆయన ఎన్నో విధాలా శ్రమించి వ్యయప్రయాసల కోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంథాల సంఖ్య వేలల్లో వుంది. మాజేటి సర్వేశలింగం సంకలనం నుండి సేకరించిన గ్రంథాలు 613 కాగా 227 గ్రంథాలు తెలుగు, 386 సంస్కృత గ్రంథాలు. మచిలీపట్నంలో కొన్నవి 1830 గ్రంథాలు. ప్రత్యేకంగా కడపలో భవనాన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి, దిగ్ధంతులైన పండితులను నియమించి అనేక కావ్యాలు, శతకాలకు సంబంధించిన వేరు వేరు చోట్ల లభ్యమైన ప్రతులను పోల్చి చూపి (Collation) శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరింపజేశాడు. వాటిల్లో వసు చరిత్ర, మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, పల్నాటి వీర చరిత్ర, దశావతార చరిత్ర మొదలైనవి ఉన్నాయి. పోతన భాగవతాన్ని పరిష్కరించడమే కాక తెలుగు భారతం 18 పర్వాల పరిష్కరణకు, శుద్ధ ప్రతుల తయారీకి 2714 రూపాయలు ఖర్చు చేశాడు. తెలుగు నేర్చుకోదలచే ఇంగ్లీషు వారి కోసం, ఇంగ్లీషు నేర్చుకోదలచే తెలుగు వారి కోసం వాచకాలు తయారు చేశాడు. మద్రాసులో, కడపలో, మచిలీపట్నంలో స్వంత ఖర్చులతో ఉచిత పాఠశాలలు నడిపాడు. ఆయనే అన్నాడు " In 1825 found Telugu Literature dead in thirty years I raised it to life "10 అని. అది అక్షరాలా నిజం. 1855 ఏప్రిల్లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తిరిగి ఇంగ్లండు వెళ్లిపోయాడు. లండన్ యూనివర్సిటీలో తెలుగు గౌరవ ఆచార్యునిగా పనిచేశాడు. గ్రంథ రచన, ముద్రణ నిర్వహించాడు. ఆయన చివరి ప్రచురణ 'తాతాచార్యుల కథలు'. 1884లో కన్నుమూశాడు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్న వేమన పద్యానికి నిదర్శనంగా తెలుగుజాతి ఎన్ని తరాలకైనా మరువరాని పుణ్య పురుషుడు సి.పి. బ్రౌన్.


సర్ థామస్ మన్రో ప్రజల గవర్నరు -

తన 19 ఏళ్ల వయసులో మద్రాసుకు సైనిక విద్యార్థిగా వచ్చిన సర్ థామస్ మన్రో తన 66వ ఏట మద్రాసు గవర్నర్ గా చేస్తూ చనిపోయాడు. తెలుగు నేర్చుకున్న తెల్ల దొరల్లో ఈయన సుప్రసిద్ధుడు. రాయలసీమ తెల్లదొరల అధీనంలోకి వచ్చాక ఈయనను పాలకునిగా నియమించారు. దత్త మండలాల్లో ఉన్న 80 మంది పాలెగాండ్లను అదుపులోకి తెచ్చి రైతులకెంతో ఉపకారం చేశాడు. పాఠశాలలు నెలకొల్పేందుకు, ప్రజోపయోగకరమైన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడానికి పథకాలు రూపొందించాడు. రాయలసీమ అంటే ప్రాణం.

1783లో రైటర్గా మద్రాసు వచ్చిన విలియం బ్రౌన్ మచిలీపట్నం, విజయనగరం, విశాఖ, గంజాం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో అనేక హోదాల్లో 50 సంవత్సరాల పాటు పనిచేశాడు. 1817లో 'జెంటూ' (తెలుగు) వ్యాకరణం ముద్రించాడు. అందులో పూర్వ వ్యాకర్తలను స్మరించడమే గాక కొన్ని పూర్వ వ్యాకరణాలు నిరుపయోగాలన్నాడు. 1818లో ఆయన ప్రచురించిన జెంటూ వొకాబులరీ వల్ల ఆనాటి సాంఘిక చరిత్ర తెలుసుకోవచ్చు. 1832లో తెలుగు అనువాదకునిగా పనిచేశాడు. మచిలీపట్నంలోని మామిడి వెంకయ్య, గుండుమళ్ల పురుషోత్తం వంటివారు విలియం బ్రౌను తెలుగు వ్యాకరణ రచనకు సహాయం చేశారు. ఆయన తెలుగు వ్యాకరణం చాలా విశిష్టమైనది. ఇంగ్లీషు వర్ణక్రమం ప్రకారం తెలుగు అక్షరాలు 22 మాత్రమేనని వర్గీకరించాడు. ఇది ఇంగ్లీషు వాళ్లు తెలుగు నేర్చుకొనేందుకు దోహదం చేసింది. తెలుగు భావ ప్రకటనకు గంభీరంగానూ, వినడానికి కమ్మగానూ ఉంటుందని అన్నాడు.


ఎ. డి. క్యాంబెల్ - ప్రామాణిక వ్యాకరణం


అలెగ్జాండర్ డంకన్ క్యాంబెల్ 1807లో రైటర్గా మనదేశానికి వచ్చాడు. బళ్లారి, తంజావూరు కలెక్టరుగా పనిచేశాడు. ప్రభుత్వ తెలుగు, పర్షియా అనువాదకునిగా పనిచేశాడు. బళ్లారి మిషన్కు ఈయన కృషివల్లే ముద్రణశాల లభించింది. 1817లోనే సెంట్ జార్జికోట కాలేజ్ బోర్డుకు కార్యదర్శి అయ్యాడు. రెవెన్యూ బోర్డు కార్యదర్శిగా కూడా పనిచేశాడు. తెలుగును నిశితంగా అధ్యయనం చేయడమేగాక తెలుగులోనూ, తెలుగును గురించి ఆంగ్లంలోనూ ప్రామాణిక రచనలు చేసిన కొద్ది మందిలో క్యాంబెల్ ఒకరు. ఉదయగిరి నారాయణయ్య అనే పండితుని దగ్గర ఆంధ్ర శబ్ద చింతామణిని ఆమూలాగ్రం చదువుకున్నాడు. మామిడి వెంకయ్య ఆంధ్ర దీపిక పీఠిక, ఆంధ్రకౌముది, అహోబిల పండితీయం మొదలైనవి 10 ఏళ్లపాటు శ్రద్ధగా పఠించాడు. ఈ పరిజ్ఞానంతో తర్వాతి వారికి ఉపయుక్తంగా ఉండేలా ఆరు అధ్యాయాలు, 519 సూత్రాలతో తెలుగు వ్యాకరణాన్ని ఇంగ్లీషులో రచించాడు. అప్పట్లో ఇంగ్లీషు వచ్చిన తెలుగు వ్యాకరణాల్లో క్యాంబెల్ వ్యాకరణ గ్రంథం ప్రామాణికమైనదిగా పరిగణనకెక్కింది.


1812 నుంచి దేశ భాషల అధ్యయన సంఘానికి కార్యదర్శిగా ఉన్నాడు. అదే తర్వాత కాలేజ్ బోర్డుగా మారింది. 1816లో వ్యాకరణం ముద్రణ జరిగింది. 1812 నుంచి 1820 వరకు ఎనిమిదేళ్లు కాలేజ్ బోర్డు కార్యదర్శిగా, పరీక్షాధికారిగా పనిచేశాడు. ఆయన ప్రతిభా విశేషాలకు మెచ్చి ప్రభుత్వం వారు నిఘంటువు రాయమన్నారు. క్యాంబెల్ ఆంధ్ర దీపికను ప్రాతిపదికగా తీసుకొని కొత్త పదాలు కలుపుకుంటూ తెలుగు ఇంగ్లీషు అర్థాలిస్తూ నిఘంటువు పూర్తి చేశాడు. దాని తొలి ముద్రణ 1821లోనూ, రెండవ ముద్రణ 1848లోనూ జరిగింది. తన వ్యాకరణానికి ఆయన రాసిన ప్రవేశిక చాలా గొప్పది. ఆంధ్ర భాషా చరిత్రను, ఆంధ్రదేశ చరిత్రను సంక్షిప్తంగా రాసినా అది కూడ ప్రామాణికమైనది. ఆంధ్ర చరిత్ర రచించిన వారిలో క్యాంబెల్ మొదటివాడు కావచ్చునని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.11 తన గ్రంథంలో త్రిలింగ శబ్దానికి విపులమైన పీఠిక రచించాడు. ప్రాచీన పాశ్చాత్య చరిత్రకారులు ఆంధ్రదేశం గురించి భావించిన అంశాల్ని ప్రస్తావించాడు. వివిధ భారతీయ పురాణాల్లో ఆంధ్రప్రసక్తి ఉన్న ఘట్టాలను క్రోడీకరించాడు. మెకంజీ సేకరించిన వ్రాత ప్రతులను, శాసనాలను ఆధారం చేసుకొని విజయనగర రాజుల జాబితా రూపొందించాడు.


ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ - తులనాత్మక అధ్యయనం


మద్రాసులో రైటర్ 1796లో సివిల్ సర్వీసు ప్రారంభించిన ఎల్లిస్ 1802లో రెవెన్యూ బోర్డు సభ్యునిగా, జిల్లా జడ్జిగా, కలెక్టర్ గా అనేక హోదాల్లో పనిచేశాడు. మచిలీపట్నంలో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాడు. తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు దక్షిణ భారతీయ భాషల విషయంలో చెప్పుకోదగిన కృషి చేశాడు. తమిళ, సంస్కృత, మళయాళ భాషలలో తెలుగును తులనాత్మకంగా అధ్యయనం చేసి ద్రావిడ భాషావాదం బలపడడానికి ఎల్లిస్ దోహదం చేశాడు.


ఎ. డి. క్యాంబెల్ తెలుగు వ్యాకరణానికి పరిచయంగా ఎల్లిస్ తెలుగుతో ద్రావిడ భాషకు గల సామ్యాన్ని గురించి రాసిన నోటును (1816) పొందుపరచడం జరిగింది.


భారతీయుల సాంఘిక పరిస్థితుల పట్లా, చరిత్ర పట్లా ఎంతో శ్రద్ధ కనబరచి ఆ విషయాలపై ప్రామాణిక రచనలు చేశాడు. "జనని సంస్కృతంబు సకల భాషలకును" అన్న కొందరు ఆంగ్ల పండితుల వాదాన్ని ఎల్లిస్ ఖండిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలనీ, సంస్కృతం నుంచి జనించినవి కావని నిరూపించాడు. వాక్య నిర్మాణ పద్ధతిలో దక్షిణాది భాషలు సంస్కృతంతో ఎలా విభేదిస్తున్నాయో రాశాడు. మామిడి వెంకయ్య 'అంధ్ర దీపిక' ఉపోద్ఘాతంలో చెప్పిన తత్సను, తద్భవాలను గురించి చర్చించాడు. లక్ష్మధరుని షడ్భాషా చంద్రికను ఉటంకించాడు. ఇది భాషా శాస్త్ర విషయకంగా ప్రాముఖ్యాన్ని సంతరించుకోదగింది. ఎల్లిస్ మరణానంతరం ఆయన భాషా శాస్త్ర పరిశోధన పత్రాలన్నిటినీ సర్ వాల్టర్ ఇలియట్క అందే ఏర్పాటు జరిగింది. ఇలియట్ డాక్టర్ పోపు ఇచ్చి ఆక్స్ఫర్డ్ బోదిలియన్ గ్రంథాలయంలో భద్రపరచేట్లు చేశాడు.


కోలిన్ మెకంజీ - చారిత్రక సంపద


తెలుగుతో పాటు 15 భారతీయ భాషల్లో వేలాది వ్రాతప్రతులు సేకరించి అనంతర తరాలకు అమూల్యమైన విశేషాలను అందించిన పాశ్చాత్య ప్రముఖుడు కోలిన్మెకంజీ. లూయిస్ ద్వీపానికి చెందిన మెకంజీ 1783లో ఈస్టిండియా కంపెనీ వారి ఇంజనీర్స్ క్యాడెట్లో ఎంపికై భారతదేశం వచ్చాడు. మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేలో పాల్గొన్న ఇంజనీర్లలో మెకంజీ ఒకరు. కోయంబత్తూరు, దిండిగల్, నెల్లూరు, గుంటూరు ఎక్కడికి సర్వే కోసం వెళ్లినా తనతో జిజ్ఞాసువులైన పండితులను తీసుకెళ్లేవాడు. 1809లో మద్రాసు సర్వేయర్ జనరల్, 1817లో కలకత్తా సర్వేయర్ జనరల్ గా ఉండి దాదాపు 70 వేల చదరపు మైళ్ల మేర సర్వే జరిపించాడు. కావలి వెంకట బొర్రయ్య. లక్ష్మయ్య అనే ఇద్దరు ప్రతిభావంతులైన తెలుగు సోదరుల సహాయంతో దేవాలయాలు, చెరువులు, రిజర్వాయర్లు, శాసనాల ప్రాచీన చరిత్రను మెకంజీ వెలికితీశాడు. ఆయన కృషిని సెంట్ జార్జి కోట ప్రభుత్వం కూడా ఎంతగానో ప్రశంసించింది.

తాను సేకరించిన 1620 ప్రాంతాల స్థానిక చరిత్రల కైఫీయతుల విశ్లేషణ, కేటలాగింగు చేపట్టిన కొంత కాలానికి 1821లో కలకత్తాలో మెకంజీ మరణించాడు. మెకంజీ సేకరించిన సమాచారన్నంతటినీ గపిండియా కంపెనీ కొనుగోలు చేసింది. 

ఏషియాటిక్ జర్నల్ మెకంజీ సేకరించిన విషయ సంపదను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది.


విల్సన్స్ మెకంజీ కలెక్షన్స్ పేరుతో 1828లో కలకత్తాలో కేటలాగింగ్ ఆరంభమైంది. మెకంజీ సేకరించిన 176 తెలుగు లిఖిత ప్రతుల వివరాలు అందులో చోటు చేసుకున్నాయి. 36 పౌరాణిక, వైతాళిక సాహిత్య గ్రంథాలు, 23 స్థానిక చరిత్రలు, 82 ప్రతులు కావ్యాలు, నాటకాలు, గాధలకు సంబంధించినవి ఉన్నాయి. వీటి సహాయంతో సాధికారికమైన స్థానిక చరిత్ర నిర్మాణం చేయవచ్చు.


వీరేగాక ఇంకా ఎందరో తెల్లదొరలు తెలుగు ప్రాంతాల్లో, తెలుగువాళ్ల మధ్య తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు. వారందరి గురించి విపులంగా చర్చించడం ఈ అధ్యయనంలో సాధ్యమయ్యేది కాదు. అయితే వారిని నామమాత్రంగానైనా స్మరించడం బాధ్యత. బెంజిమెన్ బ్రాన్ఫీల్, జాన్. పి. మారిస్, థామస్ కన్ సెట్టస్, సర్ విలియం జోన్స్, చార్లెస్ విల్కిన్స్, హెన్రీ థామస్, కోల్ బ్రూక్, జె. బి. గిల్ క్రిస్ట్, విలియం కేరీ, జార్జి అబ్రహం గ్రియర్ సన్, రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ (సి. పి. బ్రౌన్ తండ్రి) క్లాడినస్ బఛ్యస్, జాషువా మార్ష్మన్, హెన్రీ మార్టిన్, డేనియల్ కోరీ, డా. జాన్ లీడెన్... ఇలా వారి వారి స్థాయిల్లో, పరిమితుల్లో తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు.


- కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...