Showing posts with label Essays. Show all posts
Showing posts with label Essays. Show all posts

Sunday, December 12, 2021

సంస్కృతి : బళ్లో పడెయ్యడం అను అక్షరాభ్యాసం కథ -కర్లపాలెం హనుమంతరావు

  



ఇప్పుడంటే బిడ్డ తల్లి కడుపులో ఎదుగుతుండగానే.. కన్నవాళ్లు యమకంగారుగా ఏ కాన్వెంటులో సీటు దొరుకుతుందా అని వేట మొదలుపెడుతున్నారు. అర్థశతాబ్దం కిందట పిల్లల చదువులకు  తల్లిదండ్రులు మరీ ఇంతలా తల్లడిల్లడం కనిపించదు. 


బిడ్డను అయిదేళ్ల వరకు ఇంటా బయటా హాయిగా ఆడుకోనిచ్చేవాళ్లు. నడుముకు నిక్కరు గుండీలు సొంతంగా పెట్టుకునే  అయిదేళ్ళ వరకు ఆగి  ఆ నిక్కరు బిగించే చేతికే  పలకా బలపం ఇచ్చి బళ్లో కుదేసివచ్చేవాళ్లు. సామాన్యులు ఇంత సాధారణంగా జరుపుకునే పిల్లల అక్షరాభ్యాస కార్యక్రమం కలిగినవాళ్ల ఇళ్లల్లో  ఇంకాస్త ఆర్భాటంగా చేయడం రివాజు. డబ్బుండి చేసినా, లేకుండా  చేసినా ఇద్దరు  నిర్వహించేదీ ఒకే కార్యకలాపం. దాని పేరే అక్షరాభ్యాసం. గతంలో మన తెలుగునాట పిల్లలను పాఠశాలలో ఎట్లా వేసేవారో.. ఆ తతంగం, దానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయం .. వాటిని  గురించి సూక్ష్మంగా తెలుసుకొనేందుకే ఇక్కడ ఈ వ్యాసం. 

 

ధర్మశాస్త్రాలు బిడ్డకు అక్షరాలు దిద్దబెట్టే ఈ తతంగానికి రకరకాల పేర్లు నిర్దేశించాయి. తెలుగువాళ్ల మూలరుషిగా భావించే విశ్వామిత్రుడు బిడ్డను బళ్లోవేసే తంతును విద్యారంభం అన్నాడు. అదే సంస్కారం, గోపీనాథభట్టు విరచిత ' సంస్కార రత్నమాల ' ప్ర్రకారం- అక్షరారంభం! అక్షర స్వీకరణగా వశిష్టుడు పేర్కొంటే, మార్కెండేయుడు 'అక్షర లేఖనం'అనే పేరు ఖాయం చేశాడు. ఎవరే పేరుతో  పిలుచుకున్నా  పిల్లలకు  అక్షరాలు దిద్దబెట్టే శుభకార్యంలో తంతు  మాత్రం దాదాపు ఒకటే!


తమాషా ఏమిటంటే, వీరమిత్రోదయ, స్మృతిచంద్రిక, సంస్కార రత్నమాల, యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యానం చెప్పిన అపరార్క వ్యాఖ్య లాంటి అర్వాచీన గ్రంథాలలో ప్రముఖంగా ప్రస్తావనకొచ్చిన అక్షరాభ్యాస సంస్కారం అసలు గృహ్యసూత్రాలలోనే కనిపించకపోవడం! విశ్వామిత్ర, బృహస్పతి వంటి రుషుల పేర్లు ఈ వ్యవహారంలోకి లాగడం కేవలం  దీనికి పురాతన సంప్రదాయవాసన అంటగట్టడానికేనంటూ పి.వి. కాణే వంటి ఆధునికులు విమర్శిస్తున్నారు. 


ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా గ్రంథం రాసిన డాక్టర్ అ.స. అత్లేకర్ అభిప్రాయం ప్రకారం భారతీయుల  అక్షర జ్ఞానాన్ని క్రీ.శ. ఏడు, ఎనిమిది శతబ్దాలకు ముందు కాలానికి మించి ముందుకు  తీసుకుపోలేం. 


ఇండియన్ యాన్టిక్వెరీ గ్రంథ కర్త డాక్టర్ బూలర్ లెక్క ప్రకారం అయితే మన దేశస్తులకు వర్ణమాలను గురించి తెలియడం క్రీ.పూ 800 తరువాతే! ఎట్లాంటి పరిస్థితుల్లోనూ  అంతకన్నా ముందైతే కాదు. ప్రాచీన లిపి మాల అనే మరో గ్రంథం ఉంది. దాని కర్త పండిత గౌరీశంకర్ హీరాచంద్ర.  ఈ దేశవాసులకు అక్షరాలు రాసే లేఖనకళ వంటబట్టిందే క్రీ.పూ 16 -12 శతాబ్దాల ప్రాంతంలో అంటారాయన.  అందరికి అందరూ పండితులే. అందరివీ శాస్త్రీయ పరిశోధనలే! కానీ ఏటి కొకరు కాటి కొకరు ! ఇహ రథం ముందుకు కదిలేదెట్లా? అందుకే ఆ గందరగోళాల జోలికి  పోకుండా ఇంచక్కా   మనవైన సంప్రదాయాలు ఈ అక్షరాభ్యాస తతంగాన్ని గూర్చి  ఏ వింతలూ విశేషాలూ  చెబుతున్నాయో.. రవ్వంత తెలుసుకుందాం!


 ఏ విషయం తెలిసినా , ఎంతటి  గొప్పవారైనా ఆరు నెలలు గడిస్తే అంతా మరుపుకొస్తుందని శాస్త్రం. అట్లాంటి మతిమరుపు జాడ్యానికి మందు కింద బ్రహ్మదేవుడు అక్షరమాలను   సృష్టించాడని బృహస్పతి స్మృతి ఉవాచ. 

'                                                                             షాణ్మాసికే తు సంప్రాప్తే భ్రాంతిస్సంజాయతే యతః ।

ధాత్రాక్షరాణి సృష్టాని పత్రా రూఢాన్యతః పురా॥- అనే శ్లోకానికి అర్థం ఇదే! 


కృష్ణయజుర్వేద సంహిత రెండో కాండంలో అంతకు మించిన తమాషా మంత్రం ఇంకోటుంది. 

 'యాప్ర లిఖతే తస్యైఖలతిః' అని ఆ మత్రం. అంటే ఆడవాళ్లు ఈడేరిన తరువాత గాని పలకా బలపం చేతబడితే .. ఆ పాపానికి పరిహారంగా బట్టతల గల బిడ్డ పుడతాడని హెచ్చరిక. ఆడవాళ్లు చదువుకోరాదని చెయ్యి చుట్టి ముక్కు చూపించే పద్ధతి అన్న మాట. ఆ లెక్క నిజమే అయితే,  ఇప్పుడు ఎక్కడ చూసినా అర్థ బోడిగుండు శాల్తీలే దర్శనమీయాలి  న్యాయంగా కదా! ఏదో .. అప్పటి నమ్మకాలు  అప్పటివి అని సరిపెట్టుకునేవాళ్లలో  ఏ పేచీ ఉండదనుకోండి! 


కాలం గురించి ఎన్ని కయ్యాలు జరిగినా, హిందువుల మనోభావాల ప్రకారం, ప్రప్రథమ లేఖకుడు వినాయకుడు. వ్యాసమహర్షి చెప్పుకుపోతుంటే మహా భారతం మొత్తం పూసపోకుండా రాసుకుపోయింది  ఆ మహాదేవుడే  కదా! మరి వ్యాసుడి కాలం సుమారు 5000 ఏళ్ల కిందటిదేనా అని అడిగితే  ఇప్పుడున్న   శాస్త్రవేత్తల్లో సగం మంది అవునన్నట్లే తలలాడిస్తారు.  ఇహ మన  అక్షరజ్ఞాన కాలం  గురించి ఇంతలా  కుస్తీలింకా అవసరమా? 

అని సందేహం. సమాధానం చెప్పే దెవరు? 


చౌలం అంటే ఉపనయనం ముందు జరిగే తంతు . అది ముగించుకున్న తరువాతనే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం! అలాగని మరి  సాక్షాత్తూ కౌటిల్యుడంతటి రాజగురువే నియమం విధించాడు. 


రాజకుమారుడు 'వృత్త చౌల కర్మా లిపిం  సంఖ్యానం చ ఉపయంజీత, వృత్తోపనయనస్త్రయీ మాన్వీక్షికీం చ శిష్టేభ్యో నార్యా  మధ్యక్షేభ్యో దండనీతిం, వక్తృ ప్రవక్తభ్యః, బ్రహ్మచర్యం చా షోడశాద్వర్షాత్, అతో గోదానం దారకర్మ చ'-అన్నాడు. 


వడుగు అయిన తరువాత అక్షరాలు నేర్చుకోవడం, గణితం.. ఉపనయనం అయిన తరువాత  వేదాధ్యయనం చేయడం, అన్వీక్షకి, వార్త, దండనీతులు అనే మూడు రాజవిద్యలు పదహారో ఏడు వరకు (అంటే గోదానవ్రతం అయే వరకు)అభ్యసించడం ! అవన్నీ సక్రమంగా పూర్తి చేసుకున్న తరువాతనే పెళ్లి ముచ్చట. 


ఇలాంటి ఏదో నియమం ఉండబట్టే  వాల్మీకి కాలంలో కూడా ఉండబట్టే ఆ గురువు లవకుశులకు ఒక్క వేదం మినహాయించి  సమస్త విద్యలు చౌలం అయిన తరువాతనే  నేర్పించాడని ఉత్తర రామాయణంలో భవభూతి చెప్పిన  మాట. 


'నివృత్త చౌల కర్మణోశ్చ త్రయోస్థయీవర్జ మితరాస్తి స్రోవిద్యాః సావధానేన మనసా పరినిష్ఠాపితాః'

లిపి పరిజ్ఞాతుడైన తరువాతనే  రఘువంశ మహారాజు అజుడు సాహిత్యసముద్రంలోకి ప్రవేశించినట్లు కాళిదాసు రఘువంశంలో అనే మాట. 


చంద్రాపీడ మహారాజు ఆరేళ్లకు విద్యామందిర ప్రవేశం చేసి పదహారేళ్ల వరకు ఎట్లా గడిపాడో, ఎన్ని రకాల కళలు అభ్యసించాడో బాణుడు కాదంబరిలో వివరంగా చెప్పుకొస్తాడు.  


చదువులు నేర్చుకోవడం సరే, ఏ వయస్సు నుంచి నేర్చుకోవాలన్న విషయం మీద కూడా కీచులాటలే మళ్లీ! విశ్వామిత్ర నీతి ప్రకారం ఐదవ ఏట నుంచి విద్యారంగ ప్రవేశం చేయాలి. పండిత భీమసేన్ వర్మ రాసిన 'షోడశ సంస్కార విధి' అనే గ్రంథంలో  పేరు తెలియని ఒక స్మృతికర్త మతాన్ని బట్టి ఐదు నుంచి 

ఏడు సంవత్సరాల వరకు ఎప్పుడైనా నిక్షేపంగా అక్షరాభ్యాస కార్యక్రమం ముగించుకోవచ్చు. ఇదే ఆ రోజుల్లో 'పంచమే సప్తమేవాబ్దే' సిద్ధాంతంగా ప్రసిద్ధి. 


ఉపనయనం ఆర్షధర్మం దృష్టిలో  రెండో జన్మ. ఆ సందర్భంలో విద్యాభ్యాస కార్యక్రమం కూడా శుభంగా ముగించుకోవచ్చని బృహస్పతి అభిభాషణ. 


మార్గశిరమాసం మొదలు జ్యేష్ఠమాసం వరకు మధ్యలో ఎప్పుడైనా అక్షరాలు దిద్దబెట్టవచ్చని    చెబుతూనే ఆషాఢం నుంచి కార్తీకం మధ్య కాలం మొత్తాన్నీ నిషిద్ధ కాలంగా  విశ్వామిత్ర నీతి నిర్దేశించింది.

  

  'అప్రసుస్తే నిద్రాం త్యజతి కార్తిక్యాం తయోః సంపూజ్యతే హరిః' అని విష్ణు దర్మోత్తరం. సూర్యభగవానుడు ఉత్తరాయన పుణ్యకాలంలో ఉన్నప్పుడు చేసే అక్షరాభ్యాసం శుభదాయకమని వశిష్ఠుని వాక్కు.  


అపరార్కుడు, స్మృతిచంద్రిక కర్తలిద్దరూ మార్కండేయ పురాణోక్తులను పేర్కొంటూ ఐదో ఏట కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి లోపలే  ఈ కర్యక్రమాన్ని కడతేర్చుకోవాలని హితవు చెప్పారు. కాకపోతే ఒకటే షరతు. పాడ్యమి, షష్ఠి, అష్టమి, పూర్ణిమ, అమావాస్య, రిక్త తిధులైన చవితి, నవమి, చతుర్దశులను వదిలిపెట్టడం క్షేమకరమని హెచ్చరించడం.  


శని మంగళ వారాలు కూడా చదువుల ఆరంభానికి శుభదాయకం కాదన్నది నాటి కాలపు సమాజంలోని గాఢవిశ్వాసాలలో ఒకటి.  రవి, కుంభ రాశులకు చదువుల ప్రారంభానికి కలసిరావు. లగ్నాత్తు ఆష్టమంలో గ్రహాలేమీ లేకుండా చూసుకొని ముహూర్తం నిర్ణయించుకోవాలని పెద్దలు నిర్దేశించేవాళ్లు. ఈ తరహా  జ్యోతిష సంబంధ నియమాలు ఒకటా.. రెండా! పట్టించుకొనేవాళ్లు పట్టించుకొనేవాళ్లు. పట్టింపులేని వాళ్లు పిల్లల చేతిలో  ఓ మార్కాపురం పలకా.. నరసాపురం  బలపం పెట్టి బడికి తోలేసేవాళ్ళు.  


ముహూర్తం చూసుకుని గానీ, అక్షరం నేర్పించని పెద్దల  ఇళ్లల్లో ఎంత మంది చదువు సాములు నేర్చి పండిత ప్రకాండులయ్యారో.. ఆ లెక్కలు  అవీ తీసేవాళ్లు అప్పుడూ లేరు. ఇప్పడు అసలే లేరు. 


ఇహ అక్షరాభ్యాసం జరిపించే  విధానం గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం. ఓం ప్రధమంగా బిడ్డకు తలారా  స్నానం చేయించి , ఆపైన వస్త్ర భూషణాదుల అలంకరణ చేసి , విఘ్నేశ్వరునికి పూజ, సరస్వతీదేవికి అర్చన పూర్తి చేయించేవారు ! అటు పిమ్మట వెదురు చేట నిండానో, వెండి పళ్లెం నిండుగానో సన్నబియ్యం పోసి దానిని రెండే రెండు గీతలతో మూడు భాగాలుగా విభజన చేసి పై భాగంలో 'ఓమ్' .. రెండో భాగంలో 'నమఃశివాయ' .. మూడో గడిలో 'సిద్ధం నమః' అని మూడేసి సార్లు  పురోహితుడు బిడ్డ చేత రాయించి నమస్కారం చేయించేవాడు. విఘ్నేశ్వర, సరస్వతీ శ్లోకాలు బిడ్డుచేత ముద్దుగా చదివించేవాడు. 


ఇక్కడి ఈ ' ఓం నమశ్శివాయ' మంత్రం జైన సంప్రదాయం నుంచి పుట్టుకొచ్చిన తతంగమన్నట్లు కొందరి భావన.  కాదు.. పరమేశ్వరుడికి 'సిద్ధ' అనే నామాంతరం ఉంది. కాబట్టి 'ఓం నమశ్శివాయ సిద్ధం నమః' అనే ప్రార్థన వ్యవహారంలో 'ఓం నమః శివాయ సిద్ధం నమః' గా మారిందనే ప్రతివాదన తెచ్చేవాళ్లూ  కద్దు.  


నృసింహపురాణం ప్రకారం దైపప్రార్థనల అనంతరం గురుపూజ ఒక విధి. గర్గ వచనం ప్రకారం, అజ్యాహుతులతో సరస్వతి, హరి, లక్ష్మి, విఘ్నేశ, సూత్రకారులకు స్వవిద్యను ఉద్దేశించి హోమం చేయడం  మరో విధి. ఇప్పుడీ ఆచారాలకు సమయమేదీ? ఉన్నా శ్రద్ధ ఏదీ? బిడ్డకు మంచి పబ్లిక్ పాఠశాలలో అడ్మిషన్ సాధించడమే వంద యజ్ఞాలు నిర్వహించిన పెట్టు. అంత తలకిందులుగా ఉంది నేటి వ్యాపార చదువుల వ్యవహారం.


ఇస్లాం మతంలో కూడా ఈ విద్యారంభానికి దీటుగా   'బిస్మిల్లాఖాని' అనే శుభకార్యం ఉంది. ముసల్మాన్ సంప్రదాయవాదులూ  ఐదో ఏట, నాలుగో నెల, నాలుగో రోజు బిడ్డ చేత అక్షరాభ్యాసం చేయిస్తారు. 

'ఏసియాటిక్ బెంగాల్ ' అనే  గ్రంథంలో (శాహజహాం) మొగల్ చక్రవర్తి హుమయూన్‌ కు  ఈ తరహా అక్షరాభ్యాసం, తదనంతరం ఉత్సవం జరిపినట్లు  ఒక ప్రస్తావన కనిపిస్తుంది. 


'శూద్ర కమలాకరం' లో సైతం రాజవిద్యలైన ధనుర్విద్య, ఛురికాబంధనాల ప్రస్తావన వచ్చినప్పుడు శుభదినాలలో ప్రారంభించాలనే నియమం కనిపిస్తుంది.  పునర్వసు, పుష్యమి, భరణి, హస్త, స్వాతి, చిత్ర, కృత్తిక, మఘ, రోహిణి, ఉత్తరాత్రయం, శ్రవణ, ధనిష్ఠ, మూల, మృగశిర, పుబ్బ, రేవతి-ఈ నక్షత్రాలలో ధనుర్విద్యారంభం శుభదాయకమని 'ధనుర్విద్యాదీపిక' నిర్దేశిస్తుంది. 


'సర్వాయుధనగామాత్ర..' లాంటి మంత్రాలు కొన్ని మంత్రాలు ఉన్నాయి. వీటితో లక్ష్మీ నారాయణులను పూజించి తొట్టతొలుత ఒక బాణమో, ఛురకత్తో  తూర్పు దిశకు వదలడం  ఆయుధ విద్యలకు సంబంధించిన  కింద లెక్క. 


ఇప్పుడైతే బాణాలు, భురకత్తులు గట్రా  విసరడాలు లేవు కానీ .. వాటి స్థానంలో రాళ్లు విసరటం.. ఏసిడ్ బాటిళ్లు నెత్తిన పొయ్యడాలు వంటి విధ్యంసకర విద్యల ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. ఆ విద్యలకు ఏ ఆరంభ ముహూర్తాలు అక్కరలేదు. గురవులతో అయితే అసలు బొత్తిగా అవసరమే లేదు. ప్రతీ ఆకతాయి విద్యార్థి  ఎవరికి వాడే ఏకలవ్యుడు ! 


-కర్లపాలెం హనుమంతరావు

09 -09 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

(మూలఃభారతీయ సంస్కారములు -అక్షరాభ్యాసము)

 

  

 

 

 

 

 

   


దేవుళ్ల మీదా నిందలేనా? -కర్లపాలెం హనుమంతరావు- సరదా వ్యాసం


ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/

తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/

అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!/.. 

అక్కటా! అందరందరు అందరే.. అడుగనేల కామదాసులు కారే నీ కరుణ వలన-

ఇది శ్రీరామ కథ సినిమాలో దేవుళ్ల బుద్ధిచాపల్యం మీద పెట్టిన చాకిరేవు.

 ‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/

విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ / కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?- అని కృష్ణుడు దెప్పితే.. బామ్మరిది.. ఏదో సరదా కన్నాడు లెమ్మని  అర్జునుడేమన్నా కిమ్మనకుండా ఉండిపోయాడా?

'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/

ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ ఎదురుపెట్టాడు.  కృష్ణార్జున యుద్ధంలోని ఈ మాదిరి దెప్పుళ్లు గతంలో ప్రతీ చలనచిత్రంలో  వినిపించేవి. తగవులు వచ్చినప్పుడు భగవంతుళ్లు, భగవదంశ ఉన్నవాళ్ళు కూడా కోపతాపాలకు వశమైపోవడం విచిత్రమే.  భక్తులకు ఆదర్శమన్న స్పృహ లేకుండా దేవుళ్లు తమలో తాము తిట్టుకుంటుంటే, వారి వారి భక్త కోటి తన్మయత్మలో మునిగితేలడం ఏ తరహా సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుందో   ఆయా సాంప్రదాయవాదులే సెలవియ్యాలి మరి.

రెండు ముక్కలు గట్టిగా తిట్టుకుంటే చాలు, ఆ పైన పదాలు తట్టక  మీద మన్ను పోసుకుంటున్నారు ఇప్పటి తరాలు.  ఆక్స్ ఫర్డ్ వర్డ్స్ విద్యాధికులూ ఈ  షష్టాకాలకేం తక్కువ కాదు. కానీ వాటి మూలార్థాలు   వంకాయలు, బీరుకాయలు అమ్ముకునే బస్తీజీవి బుద్ధికెక్కవు.  వ్రతం చెడీ ఫలం దక్కకపోతే ఎట్లా అని కాబోలు లేటెస్టుగా ఫారిన్ రిటర్న్సే కాదు.. ఫారిన్ కంట్రీసులో సెటిలయిన  మనవాళ్లు కూడా మన బస్తీ లాంగ్వేజీలోనే సామాజిక మాధ్యమాల ద్వారా కుస్తీ పట్లకు దిగిపోతున్నారు! అంతర్జాలం అభివృద్ధి ఫలాలలో అవాచ్యాలు విశ్వవ్యాప్తంగా విస్తరించడం ఒక కోణం.

 గతంలో మన తెలుగు ప్రాంతాలలో తిట్ల కవులుగా చాలా మంది చరిత్రలో ప్రసిద్ధమయారు. బడబానలం భట్టారకుడు అనే మహానుభావుడు ఉన్నాడు. చెరువులో నిలబడి సూర్యనమస్కారాలు చేస్తుంటే చేతివేలి ఉంగరం కాస్తా నీళ్లల్లో జారిపడింది. కొత్తది కొనుక్కోవచ్చు. కుదరకుంటే ఆశ వదులుకోవచ్చు. ఊరంతా తాగే నీళ్లను ఎండబెట్టి ఉంగరం దొరకబుచ్చుకొన్నాడాయన. చెరువుని అట్లా ఎండమని బెదరగొట్టడానికి ఆ పండితుడు వాడింది ఇప్పటి ప్రమాణాల ప్రకారం పచ్చి అన్ పార్లమెంటరీ లాంగ్వేజీ! ఆ  తిట్ల కవులకు కాపీ క్యాట్లే  ఈ కాలం నాటి మన  నాయకమ్మన్యులు!


క్రౌంచ పక్షుల మిథున భంగానికి అలిగి వాల్మీకి అల్లిన మహాకావ్యం రామాయణం. అలగడమే తెలీనంత ధర్మరాజు వారసులేమీ కాదు దైవభక్తులు కూడా. 'దొరతనములన్నియును దొరసినందాకా''అన్నాడు కదా అన్నమయ్య.  'కోపము పుట్టిన నెంతటి/ భూపాలుండైన చెడు' అంటాడు సానందోపాఖ్యానంలో శివరామకవి. లా మేకర్సూ వాళ్లే.. లా ఫస్ట్ బ్రేకర్సు వాళ్లే అన్న సిద్ధాంతం కలియుగం ముందు నుంచే మొదలయిందనడానికి వందలాది ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ స్థలాభావం.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాజశేఖర్ 'అంకురం' అప్పట్లో సూపర్ హిట్!అందులోని ఓ మంత్రిగారి కాన్వాయ్ సీనులో కారు మీద జాతీయజెండా తలకిందులుగా వేలాడ్డం చూసి ఓ సుకుమార దేశభక్తుడు కోర్టులో ప్రజావ్యాజ్య వేసి మరీ తన ఆగ్రహం ప్రకటించాడు. ఆ అవమానకర సన్నివేశం తొలగింపుకు ఓ ప్రేక్షకుడి ధర్మాగ్రహం కారణం. ఇప్పుడా తరహా ధర్మాగ్రహాల కన్నా నచ్చని తీర్పులు చెప్పే ధర్మస్థానాల మీదనే ఏకంగా ఆగ్రహంతో బురద జల్లే కొత్త సంప్రదాయం మొదలయిపోయింది.  

 ఇప్పటి చిత్ర కథానాయకులే వెండి తెర మీదా, బైటా నేరుగా 'బొంగు, బొక్క, తొక్క' అంటూ నోళ్ళు యధేచ్ఛగా పారేసుకుంటున్నారు. ‘అరిచే కుక్కలు కరవ్వు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది. కరవడం సంగతి ఎట్లా ఉన్నా ముందు అరవడం  రాజకీయనేతలకు, రాజకీయాలలో నిలబడుండాలనుకొనే ఆశావాహులకు ముందుండాల్సిన అర్హతగా మారిపోయింది. 

కోపతాపాల ప్రకటనకు నిన్న మొన్నటి వరకు కొద్దో గొప్పో ముసుగులూ గట్రా ఉండడం కద్దు! కొంపలో కొప్పట్టుకు చితక్కొట్టే కిరాతకుడూ  ఫేస్ బుక్  పోస్టుల దగ్గర కొచ్చేసరికి పురుషోత్తముడి అవతారానికి తగ్గకుండా సూక్తులు వల్లించేవాడు.  అందరూ అందరి మీదా అన్ని వేళలా అన్నిరకాల ఆగ్రహావేశాలు ప్రకటించడం వల్లవని వ్యవస్థలో  మనమున్నది.. అనుకునే వాళ్లం నిన్నటి వరకు.  ఏ కులం పేరుతోనో, మతం పెరుతోనో, లైగింగ దృష్టితోనో దూషించినట్లు ఫిర్యాదు వచ్చిన ఉత్తరక్షణంలో కనీసం ప్రాథమిక సమాచార నివేదిక సెక్షన్ల కిందయినా కొన్ని కేసులు పోలీస్టేషన్లలో బుక్కవుతుండేవి.  ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులే పూనిక వహించి ప్రత్యక్షంగా ఈ సరిహద్దులు చెరిపేసే బ్రహ్మప్రయత్నాలు చేస్తున్నారు. సభను తీరుగా నడిపించే బాధ్యత రాజ్యాంగబద్ధంగా స్వీకరించిన బుద్ధిమంతులే స్వయంగా  సాక్షాత్తూ చట్టసభల్లో జిహ్వపదును ప్రదర్శన స్పర్థల్లో ముందుంటున్నారు. కోపతాపాల బాహాట ప్రకటన కోసంగానూ స్థిరబడ్డ  వ్యవస్థ  దిష్టిబొమ్మల దగ్ధం, పాత పాదరక్షల, కలం సిరాల ప్రయోగ విధానాలు గట్రా!  వాటి మార్కెటు పుంజుకునే  కన్నా ముందే నానారకాల నోటి దూలలను రేటింగ్ రూపంలో లేటెస్టుగా టి.వి ఛానెల్స్ సొమ్ముచేసుకోవడం ఒక విపరిమాణం.  

'ఎక్కడయ్యా నీ అహింస/ఏడ నీ కరుణా రిరంస/చూడు దేశం ద్వేష భుగ్నం/క్షురత్ జిహ్వానల విభుగ్నం' అని మహాకవి మొత్తుకుని ఇప్పటికి సుమారు వందేళ్లు.  పందెంకోళ్లాటను మించి నడుస్తోంది దేశం బరిలో నేతల కారుకూతల పర్వం!

 

'ధారణిరాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి రం/భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు/ర్వార మదీయబాహుపరివర్తితచండగదాభిఘాత భ/గ్నోరుతరోరు జేసెద సుయోధను నుగ్రరణాంతరంబునన్' అంటూ  'కురు గురు వృద్ధ బాంధవులు అనేకుల చూస్తుంండగానే నిండు సభ సాక్షిగా మదోద్ధురుడైన సుయోధనుడి సోదరుడు దుశ్శాసనుడు  పాంచాలిని పరాభవించి భీమసేనుణ్ని రెచ్చగొట్టిన మహాభారతం ఘటన మనందరికీ తెలిసిందే! అంత పట్టరాని ఆగ్రహంలో కూడా  ఆ పాండవ ద్వితీయుడు 'లోకభీకర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝరమును’ ఆస్వాదిస్తాననే భీకర ప్రతిజ్ఞ వరకే పరిమితమయాడు తప్పించి 'ఖలుడు'   అన్న ఒక్క ముక్కకు మించి ఆ దుష్ట దుశ్శాసనుణ్ణి దుర్భాషలాడనేలేదు.  అంతటి ఆగ్రహంలోనూ ఆ మాదిరి నిగ్రహం కాకతాళీయమా అంటే?  కాదనేందుకు మరో ఉదాహరణ చెప్పాలి.   విరాటుడు కొలువు కూటమిలో ఉన్నప్పుడు అక్కడికి భీత హరిణి 'కోపవేగమున కన్నుల నిప్పులు రాల నంగము/ల్గనలగ సాంద్ర ఘర్మ సలిలంబులు గ్రమ్మ, నితాంతదంతపీ/డన రట దాస్యరంగ వికటభ్రుకుటీచటుల ప్రవృత్త న/ర్తన ఘటనా ప్రకార భయదస్ఫురణా పరిణద్ధమూర్తి' గా మారాడే తప్పించి నోటితో ఒక్క ‘ఛీ’త్కార శబ్దం కూడా చేసిందిలేదు. 'నేలయు నింగియు దాళముల్ గా జేసి యేపున రేగి వాయించి యాడ,/గులపర్వతంబులు గూల్చి యొండొంటితో దాకంగ వీకమై దన్ని యాడ,/నేడు సాగరములు నిక్కడక్కడ బెట్టి పలుచని రొంపి మై నలదికొనగ,/దిక్కులు నాలుగు నొక్కచోటికి దెచ్చి పిసికి పిండలి సేసి పిడుచగొనగ,

 మిగిలి బ్రహ్మాండభాండంబు పగుల వ్రేయ/నప్పళించుచు/ బ్రళయకాలానలమున/ గండరించిన రూపంబు కరణి భీముడు భయంకరాకారత నతిశయిల్లాడినట్లు తిక్కన మాత్రమే చెప్పుకొచ్చాడు. భారతదేశ రాజకీయ సంస్కృతి, ముఖ్యంగా తెలుగురాష్ట్రాలలో మనం నేడు చూస్తున్న రాజకీయ వాతావరణం తిక్కన భారతం  మార్క్ ‘బండబూతుల’ స్థాయికి అప్డేట్ అవడం ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులందరినీ విపరితంగా కలచివేస్తున్న తాజా దురవస్థ. 

సాక్షాత్తూ మంచి చెడులు అన్ని కోణాల నుంచి తరచి చూసి , సాక్ష్యాల ఆధారంగా, రాజ్యాంగ పరిథిలో నిరపేక్షతో కూడిన తీర్పులిచ్చే న్యాయవ్యవస్థ ‘న్యాయదేవత’కు ప్రతినిధిగా మనం భావిస్తూ వస్తున్నాం. న్యాయదేవత కూడా ఇప్పుడు  ఈ  వాచాలత నిందల దాడులను ఎదుర్కొంటోంది. దేవుళ్ల మీదా నిందలేనా? అంటూ నివ్వెరపోయే దుస్థితుల నుంచైనా సామాన్య పౌరుడిని బైటపడవేసే అత్యయిక పరిస్థితి వచ్చిపడింది

తగు సమయంలో ఈ తరహా దుష్టాతి దుష్ట సంస్కృతులకు అడ్డుకట్ట పడని పక్షంలో పేరుకు మాత్రమే మనది మెజారిటీ ఓటర్లు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల నడిపే స్వచ్ఛమైన, స్వేచ్ఛాయుతమైన పాలన అని చెప్పుకోవాలి


Wednesday, December 8, 2021

ప్రాకృతసాహిత్యంలో సామాన్యమానవుడు

 

 

Monday, April 5, 2021

10:44 AM

 

ప్రాకృతసాహిత్యంలో సామాన్యమానవుడు-తిరా--భారతి-75-6-౪.pdf


సకల జగజ్జంతువులకు వ్యాకరణాది సంస్కారం లేని సహజ వాక్ వ్యాపారం ప్రకృతి. ప్రకృతి సంబంధమైనది ప్రాకృతం.

పిల్లలకు, మహిళలకు ఇది సుబోధం. మేఘ వర్షిత జల స్వచ్చత దీని లక్షణం.దేశ విశేషాలను బట్టి సంస్కారాదులను బట్టి విశిష్టతను పొంది.. సంస్క్రుతాదులుగా తరువాత విభేదాలు పొందేది. రుద్రట రచిత కావ్యాలంకారానికి వ్యాఖ్యానం రాస్తు నమిసాధువు చెప్పిన వ్యుత్పత్తి ఇది.

సంస్కృతం ప్రాకృతం పరస్పారాబూతాలన్న మాట నిజమేనా?

అగ్ని మీళే పురోహితం

యజ్ఞస్య దేవ మృత్విజం

హోతారం రత్న ధాతవం- ఇది రుగ్వేదం తొలి మండలం తొలి ఋక్కు. మానవ జాతి మొదటి చందోబద్ధ సాహిత్యంగా పరిగణించేది. ఈ సంస్కృత శ్లోకానికి మూలాధారంగా ఏదైనా ప్రాకృత గాధ ఉందా? మరి సంస్కృతం సంస్కరింపబడిన ప్రాకృతంగా  నిర్ధారించుకోవడం ఎలా?! రెండూ ఒకే కొమ్మకు పూచిన రెండు పూవులు ఎందుకు కాకూడదు?

ఋగ్వేద మేధావుల భాష ఐవుండి.. ప్రాకృతం (ప్రజల భాష)దానికి సంపూర్ణ భిన్నంగా కాక.. సన్నిహితంగా ఉండే పలుకు ఎందుకు ఐ ఉండకూడదు? త్తణ- త్వవ, ఆవి- ఆయై, విహి- వఏభిః, హోహి- బోధి, విఊ- విదుః, రుక్ఖ- రుక్ష.. మొదటివి ప్రాకృత రూపాలు, రెండీవి సంస్కృత రూపాలు. రెంటికీ చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు పిషెల్ (Richard Pischell)  మహాశయుడు ఉదాహరించిన ఈ రూపాలను బట్టి సంస్కృత ప్రాకృతాలు  అసలు ఒకే పూ రేకు రెండు పార్శ్వాలనుకున్నా తప్పు లేదు.

భాష ప్రవాహిని. ఋగ్వేద భాషా జన ముఖ యంత్రంలో పడి మార్పులకు లోనవక తప్ప లేదు. ప్రాచీనతను కాపాడుకోవాలనే తపన వలన  ఋక్కులకు, పనసలకు పద పాదాలు, ఉచ్చారణ రక్షణకు ప్రాతిశాఖ్యలు పుట్టినట్లున్నాయి. 'వేద రక్షణకు వ్యాకరణం చదవాలి.లోపాగమ వర్ణ వికారజ్ఞుడే వేద రక్షణా సమర్ఢుడు.' అని పతంజలి హితవు. పాణినీ 'వేదేలోకే' అని విడదీయడం వల్ల సాహిత్య భాష, లౌకిక భాష విడిపోయినట్లు అనిపిస్తుంది.

తథాగతుడు మేధావుల మేలిమి భాషకు పోక తన ప్రామ్తీయ పాలీ భాషలో ధర్మోపన్యాసాలు చేసినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఋగ్వేద బ్రాహ్మణ  సంస్కృతాన్ని కొంచెం యాసతో కొంచెం ముఖ యంత్ర సౌలభ్యంతో వ్యవహరిస్తే తథాగతుడు వాడిన ఆ పాలీ భాష అవుతుంది అపిస్తుంది.

"యో చ నస్ససతం జంతు అగ్గిం పరచరే వనే

 ఏకంచ భావితత్తానం ముఉత్తం అపి పూజయే

 సా యేవ పూజనా సేయ్యో యమ్ చే నస్స సతం హుతం"

దమ్మ పదంలోని ఈ మూడు పాదాలు చాలు సంస్కృత ప్రాకృతాలు  ఒకే పూ రేకు రెండు పార్శ్వాలని నిర్దారించడానికి.

భాష ప్రవాహ నైజం కలది కనక ఆ ప్రాకృతంలోనూ సాహిత్య సంస్కారం కలది పై పలుకు అయింది తక్కినది అపభ్రంశం కింద జమయింది. నమిసాధువు దబాయించి చెప్పిన ఆ అప్రభ్రంశ భాషా దేశ భాషలుగా వేయి చీలకలయింది.

 

సామాన్య మానవుణ్ణి ప్రాకృత సాహిత్యం ఆదరించినట్లు సంస్కృత సాహిత్యం ఆదరించలేదు. ఆదికావ్యం రామయణం కూడా రాగ రంజితమైనదే. ప్రాకృత సాహిత్యం ప్రజారంజన చేయలేదు అన్న మాట అబద్ధమని తేలి పోలేదూ! అ దృష్టితో చూస్తే ప్రాకృత సాహిత్యం గాథా సప్తశతిది ప్రజారంజక సాహిత్యంలో అగ్రస్థానం.

 

గాథా సప్తశతికి తెలుగు గడ్డతో సంబధం ఉంది. ప్రజారంజక కవుల గాథలను సేకరించి ప్రాకృత సాహిత్య మాతకు అలంకారాలుగా కూర్చిన హాలుడు తెలుగు వాడే. పేరుకు రాజైనా ప్రాణమంతా గ్రామీణ జీవన సౌందర్యానికే మీదు కట్టిన  మొదటి శతాబ్ది ముక్తక గ్రధన మార్గదర్శి.తెలుగుల కమనీయ కల్పనా  పటిమను దిగంతాలకు చాటిన మహనీయుడు.

 హాలుడిది ప్రధానంగా రసిక దృష్టి. శృంగార రస ధుని నుంచి తొంగిచూసే సామాన్యుని జీవితం హాలుని ప్రథాన ఇతివృత్తం.

'ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని

కథలన్నీ కావాల'ని మహాకవి శ్రీ శీ ఇపుడన్నాడు గానీ క్రీస్తు శకం తొలి శతాబ్దిలోనే హాలుడు ఆ యజ్ఞం అరంభించాడు.

 

సామాన్య్డుడు అంటే ఎవరు? ప్రతి వృత్తిలోని సామాన్య గృహస్థు. రాజ సేవకుడు మొదలు.. నాపితుని వరకు.వారి దైనందిన జీవితం, దారిద్ర్యం, కరువు కాటకాలు, వాగులు, వరదలు, వానకాలపు బురద వీధులు, ఎండకాలపు మృగతృష్ణలు,  దప్పికగొన బాటసారులు, చలివెందలి చపలాక్షులు, చలికాలపు నెగళ్ళు, గొంగళ్ళు, గొంగళ్ళు అక్కర్లేని నెరజాణల మొగుళ్ళు, వసంతోత్సవాలు, మొగిల్లను చూసి నిట్టూర్పులు విడిచే ముదితలు, ఫాల్గుణోత్సవాలు, పెండ్లిండ్లు, పేరంటాలు, సతులు, అసతులు, విధవలు, వేశ్యలు, జారులు పూజారులు, వంటలు పంటలు,శిధిల దేవాలయాలు, ప్రసిథిల వలయాలు, నగలూ నాణేలు- ఒకటేమిటి.. గ్రామాలల్లోని ప్రతిదీ కావ్య వస్తువయింది.

ధర్మ శాస్త్రం నిషేధించిన ఋతుమతీ సంస్పర్శన సంగమాలను సైతం ఈ కవులు వదిలి పెట్టలేదు.

 

దారిద్ర్య చిత్రణలో ప్రాకృత కవి  నేటి కవిని ఎలా మించి పోయాడో చూడండి!

దుగ్గ అ కుటుంబఅ

కహంణ మఏ దోఇఏణ సోఢ వ్వా,

దసి ఓసరంత సలివేణ

ఉపహ రుణ్ణంవ పడవిణ (గాథాసప్తశతి 1-18)

(దుర్గ తకుటుంబాకృష్షిః

కథన్ను మయా ధౌతెన  సోఢన్యా

దశాపసరప్సలిలేన

వశ్యత రుదిత మివ పట కేన?)

కటిక దరిద్రం. ఉన్న ఒక్క గుడ్డనూ దినమూ గుంజి పులిమి ఆరవేస్తున్నారు. గుడ్డ చీకిపోయి ఇక ఉండ లేననకుంది. ఆర వేసిన గుడ్డ అంచునుంది నీరు కారుతుంది. దానిని ప్రాకృత కవి చూసాడు. హృదయం ద్రవించింది. ఈ దరిద్రపు సంసారం గుంజుకుని రావడం ఇక సహించలేనన్నట్లు ఆ గుడ్డ ఏడుస్తున్నట్లుగా ఉంది అని అంటాడు కవి.

Tuesday, November 11, 2014

12:00 PM

దరిద్రుని ఇల్లాలుకు వేవిళ్ళు.ఎన్నో కోరికలు పుడతాయి ఆ దశలో స్త్రీలకు. 'ఎం కావాలి>' అని భర్త అడిగినప్పుడల్లా భర్త అకులత్వం పోగొట్టడానికి 'మంచి నీళ్ళు' అని అడిగి పుచ్చుకునేదిట.

'దుగ్గ అఘరమ్మి ఘరిణీ

రక్ఖంతీ ఔలత్తణం పఇణో

పుచ్చిఅదోహల సద్దా

పుణోని ఉఆం విఆ కహేఇ (గా.సః 5-72)

౯దుర్గత గృహే గృహిణీ

రక్షంతీ అకులత్వం సత్యుః

పృష దోహద శబ్దా

పున రపి ఉదక మితి కధయతి)

 

పరిసర సామాన్యాంశాలను అతి సహజ మనోహరంగా అప్రయత్నంగా సులభగ్రాహ్యంగా ఉపమోత్ప్రేక్షించడంలోనే కవి కల్పనా దక్షత పరీక్షకు నిలబడేది.

ఫాలేహి అచ్చభల్లం

వ ఉఅహ కుగ్గామ దేఉలద్దరే,

హేమంత ఆల వధిఓ

విఝ్జా యంతం పలాలగ్గిం (గా.స-2-9)

పాటయ తగచ్చభల్లం

ఇవ వశ్యత కుగ్రామదేవకులద్వారే

'హేమంతకాల పథికో

విధ్మాయమానం పలాలాగ్నిం)

చలికాలం. పల్లెటూరి దేవళం ముందు ఓ బాటసారి అప్పటి వరకు చలి కాచి ఆరిన నెగడును కర్రపుల్లతో కెలకడం ఎలుగుబంటి పొట్ట చీలుస్తున్నట్లుందని కవి ఉపమోత్ప్రేక్ష.

మంట ఆరిన కాలిన గడ్డి కుప్ప పడి పోయిన  నల్లటి ఎలుగు బంటిలాగే ఉండటం.. దాని పొట్ట చిల్చినప్పుడు నిప్పులా లోపలి రక్త మాంసాలు కనిపించడం- ఎంత మనోహరంగా ఉంది కవి కల్పన!

రంధణకమ్మ నివు ణిఏ

మాజూరసు రత్తపాటలను అంధం

ముహమారు అం సి అంతో

ధూమాఇ సిహీ ణ వజ్జలఇ  (గా.స-2-24)

 

(రంధన కర్మనిపుణికే

మాకృధ్యస్య రక్తపాటల సుగంధం,

ముఖమారుతం సిబన్

ధూమాయతే శిఖీ న ప్రజ్వలతి)

కవితకు ప్రేరణ పద్మినీజాతి స్త్రీయే కానక్కర్లేదు. అనుక్షణం మన కటెదుట మసలుతూ, ఇంటి పనులలో నిమగ్నురాలైన ఇల్లాలైనా చాలు-అని ప్రాకృతకవి సిద్ధాంతమై ఉంటుంది.

ఇల్లాలు వంట చేయాలి , పొయ్యి రాజేసింది. పొయ్యి రాజుకోవడం లేదు. నిప్పు రావాడం లేదు. భర్త అంటాడూ"వంటల్లో ఆరితేరిన గడసరిదానా! ఊదడం మాను. కోపగించుకోకు. నీ ఊర్పుల కమ్మ తావిని ఆస్వాదిస్తూ అగ్నిదేవుడు మరీ మరీ ఆ  తావిని గ్రోలుదామని మండడం లేదు"

'హాసానిఓ జణో

సామలోఅ పఢమం పసూఅమాణాఏ,

వల్లహ వాహేణ ఆలం

మమ్మత్తి బహుశో భణంతేఏ  (గా.స-2-26)

(హాసితో జనః

శ్యామయాః ప్రథమం ప్రసూయమానాయాః

వల్లభ వాదేవ ఆలం

మమేతి బహుశో భణం త్యా) 

 ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాలకు మల్లే తాత్కాలికం. ప్రసవ వేదన భరించలేని బాధలో 'ఇహ మొగుడూ వద్దు.. మొద్దులూ వద్దు' అని ఆడవారు ఏడుస్తారు.అంతమాత్రం చేత వాళ్లు సంసారాలు చేయకుండా ఉన్నారా? ఉంటే సృష్టి ముందుకు సాగేది ఎట్లా?! ప్రాక్రుత కవి స్త్రీ ప్రసవ వైరాగ్యాని బహు చక్కని పద్యంలో వివరించాడు.

 

ముర్రుపాలు తాగిన కొత్త గేదె దూడకు ఎక్కడ లేని నిద్ర ఆవరిస్తుంది. ఆ ప్రకృతి ధర్మాన్ని ఓ  పరసతిని మరగిన వగలాడి పగటి నిద్రతో మహా చమత్కారంగా పోల్చిన కవి కల్పనా పటిమకు జోహార్లు అర్పించాల్సిందే!

జి హోసి ఇ తప్ప పిఅ

అణూది అహం ణేససేహి అంగేహిం

ణవసూఅ పీఅపీఅసి?  (గా.స- 1-65)

 

(యది భవసి న తస్య ప్రియా

అణుదివసం నిస్సహై రంగైః,

నవసూత పీతపీయూష

మత మహిషీ వత్సేవ కింస్వవిసి?)

గేహే హ సలోఅహ ఇమం

పహసి అవాణా వైస్స అస్సేఇ,

జాఆ సుఆ పదముబ్బిణ్ణ

దంతజుఅ లంకిఅం బోరం  (గా. స- 2-100)

(గృహ్ణీత ప్రలోకయత ఏనం

సహసిత వదనా పత్యు రర్పయతి,

జాయా నుత ప్రథమోద్భిన్న

దంతయు గళాంకితం బదరం)

ఓ పిల్లడికి పాల పండ్లు వచ్చాయి. ఆ పండ్లతో వాడు రేగు కాయను కొరికాడు. మహదానందంతో భర్త వద్దకు వచ్చింది పిల్లడి తల్లి 'ఇదిగో తీసుకోండి.చూడండి దీన్ని'  అంతో నవ్వుతూ పిల్లడు  కొరికిన -కొత్త పాలపళ్ల గాట్లున్న రేగుపండును భర్తకు చూపించింది.

 

పిల్లలకు పళ్ళు వచ్చే వరకు భార్యా భర్తలు తప్పనిసరిగా శయ్యాపథ్యం చేయాలి. ఈ లోగా కక్కుర్తి పడరాదని వైద్యక శాస్త్రం చెబుతోంది. అందుకే ఆ భార్యకు అంత ఆనందం. ఆమె నవ్వులోని అంతరార్థాన్ని కవిత్వంగా మలిచిన కవికి ఎన్ని వరహాలు పురస్కారం ఇవ్వాలి?!

 

అవిరల పడంత ణవజల

రారా రజ్జు ఘడిఅం పాత్తేణ,

అపహుత్తో ఉఖ్ఖేత్తుం

రస ఈవ మేహో మహిం ఉవహ  (గా.స- 5-36)

 

(అవిరల పతన్న సజల

ధారారజ్జుఘటాతాం ప్రయత్నేన,

అప్రభవ న్నుక్షేప్తుం

రసతీవ మేఘో మహీం పశ్యత)

 

బరువుల్ని పైకి లాగే సమయంలో ఊపుకోసం అప్రయత్నంగా నోటినుంచి శబ్దాలు చేస్తుంటారు కార్మికులు. ఈ దృశ్యాన్ని కుండపోతగా వర్షం కురిసే  సమయంలో వినిపించే మేఘ గర్జనలకు సమన్వయిస్తూ కవి చేసిన చమత్కార వర్ణన ప్రజా రంజకంగా ఎందుకుండదు! పగ్గ్గాలు పైనుంచి వదిలినట్లు వర్షం కురుస్తోంది. ఉరుములు వినిపిస్తున్నాయి. మేఘమనే కార్మికుడు సందులేకుండ భూమిని పగ్గాలు కట్టి పైకి లాగుదామనుకున్నాడు,ఎంత ప్రయత్నంచినా లాగ లేక మూలుగుతున్నాడు. ఆ మూలుగులేనుట ఉరుములు!

 

ఇక రాజకీయ ఛాయలు గల గాథలకూ కొదవ లేదు. సామాన్యుని దృష్టి కోణంనుంచి కవిత్వరీకరింపబడటమే ఇక్కడ ఎన్నదగిన అంశం.

 

ఆమ అస ఇహ్మ ఓసర

సఇవ్వఏ ణ తుహ మఇలఆం గోత్తం,

కిం ఉణ జణస్య జాఆవ్వ

చందిలం తా ణ కామేమో  (గా.స-5-17)

 

(ఆమాస్త్యో వయం

అససర పతివ్రతే న తవ మలినితం గోత్రం;

కింపున ర్వయం జనస్య జాయేవ

నాపితమ్ తావన్న కాక్ముయామహే)

 

'ఔను! మేము లంజలం. దగ్గరకు రాకు. తప్పుకో. నీ వంశం మైలపడిపోనూ! కాని మెము సామాన్య సంసారికి భార్యలం. నాపితుని మామించ లేదుగదా!' అని ఈ గాథకు అర్థం. ఈ సంభాషణ అర్థ మవాలంటే కొంత చారిత్రిక నేపథ్య జ్ఞానం తప్పని సరి. గాథాసప్తశతి ఐదవ శతకం 17వ గాథ నందవంశ మూలపురుషుని కథను ధ్వనింపచేస్తుందని శ్రి ఎన్.ఎస్. కృష్ణమూర్తిగారి అభిప్రాయం.

నందులకు పూర్వం భారపాలకులు శిశునాగులు. శిశునాగుల్లో కడపటి రాజు కాలాశోకుడు. కాలాశోకుని భార్యకు ఆస్థాన నాపితునికి సంబంధం కలిగింది. ఆ నాపితుడు కాలాశోకుని భార్య సహాయంతో, అతనిని చంపి, రాజ్యం ఆక్రమించుకొని నందవంశానికి మూలపురుషు డవుతాడు. వీడిని నాపితదాసుడని కొందరన్నారు.మహావంశ నందులు అధార్మికులని, ఉన్నత కులులు కారని ఆ స్త్రీ ఈ గథలో అంటున్నది.

 

వీధి వినోదాలు కవి దృష్టిని దాటి పోలేదు. ఒక వీధిలో మల్లుడు తప్పెట కొదుతున్నాడు. తప్పెట తాళానికి అనుగుణంగా మల్లుని భార్య నాట్యం చేస్తున్నది. ఒకర్తె మల్లుని భార్యను ఎత్తి పొడుస్తున్నది." ఓ మల్లీ! ఎంత దురదృష్టమే నీది! భర్త డప్పు కొడితే ఆడుతావు సిగ్గు లేక! అని.

ఆ ణత్తం తేణ తుమం

వఇణో వహఏణ సడహ సధేణ

మల్లి ణ లజ్జసి ణచ్చసి

దోహాగే సా అడి జ్ఞంతే     గా.స-785

 

ఆజ్ఞప్తం తేన త్వాం

సత్యా ప్రహడేన పటహశబ్దేన,

మల్లి నలజ్జసే నృత్యసి

దౌర్భాగ్యే ప్రక్టీ క్రియమాణే

(మొదటి భాగం సమాప్తం)

గాథా సప్తశతి-రెండో భాగం

గథా సప్తశతి లోని రచన కొంతైనా తెలుగు గడ్డ మీద జరిగుంటుందని పండితుల అభిప్రాయం. దీనిలోని తెలుగు పలుకులను గురించి తిరువల రామచంద్ర గారు భారతిలో విస్తృతంగా రాసారు.

 

వజ్జాలగ్గం కూదా గాథా సప్తశతిలాగా ముక్తకాల సంకలనమే. కర్త జయవల్లభుడనే శ్వేతాంబర జైనముని. 8వ శతాబ్ద్ద్దం వాడు.  తను ధర్మార్థ కోవాలానే త్రివర్గం గురించిన సుభాషితాలను సంకలించానని స్వయంగా చెప్పుకున్నాడు.

 

సువ్వన్ను వయణ పంకయ

ణివాసిణిం పణమిఊణ సుయదేవిం,

ధమ్మాఇ సుహాసి అం వోచ్చం   వ-1

 

(సర్వగ్య వదన పంకజ

నివాసినీం ప్రణమ్య శ్రుతదేవీం,

ధమ్మాది త్రివర్గ యుతం

సుజనానాం సుభాషితం పక్ష్యామి)

'కవుల వివిధ గాథలలో మేలిమిని గ్రహించి జయవల్లభమనే వజ్జాలగ్గం విధిపూర్వకంగా కూర్చాను' అన్నాడు.

 వజ్జా అంటే పద్దతి. లగ్గం అంటే సంకలనం. ఒక ప్రస్తావంలో చెప్పే గాథల పద్ధతిని పజ్జా-ప్రజ్యా అన్నానని తెలుపుకున్నాదు. ఇతడు ప్రాకృతం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. లలిత మధురాక్షరమైనది ప్రాకృత కావ్యం.నది స్త్రీలకు ఇష్టమైనది. శృంగార రసయుతం. అలాంటిది ఉండగా సంస్కృతం ఎవరు చదువుతారు? అని ఇతని ప్రశ్న.

లలిఏ మహురక్ఖర ఏ

జువౖ జణ వల్లహే ససింగారే

సంవే(?) పా ఇఅ లవ్వే

కో సక్కై సక్కఅం పఢిఉం-  29

 

పాలు పితుకడం సరిగా తెలియని వారు ఆవులను బాధ పెట్టినట్లు గాథల రసం తెలియని మోటువాళ్ళు దాన్ని ఈకకు ఈక తోకకు తోక లాగి పాడు చేస్తారని వాపోతాడీ కవి ఓ గాథలో "ఓ గాథా! నిన్ను మోటు మనుష్యులు అడ్డదిడ్డంగా చదువుతారు.చెరుకు తినడం తెలియని మోటువాళ్ళు చెరుకు నమిలినట్లు నిన్ను ఎక్కడ బడితే అక్కడ విరుస్తారు' అని కవి వాపోత.

వజ్జాలగ్గం భర్తృహరి సుభాషిత పద్యతిలో సంకలనం చేసినట్టిది. దీనిలో 96 పగ్గాలలో దాదాపు వేయి గాథలున్నాయి. సామాన్య జనుడే ఈ కవి లక్ష్యం. దరిద్రుణ్ణి, తదితరులని స్వేచ్చగా వర్ణించాడు. దరిద్రుడు అతని దృష్తిలో సిద్దులందరిలోకి మహా సిద్ధుడు.

'దీనంతి జోయసిద్ధా

అంజణ సిద్దా వి కౌని దీసంతి,

దాంద్జ జో యసిద్దం

మం తె లోఆని పచ్చంతి  -141

 

 

(దృశ్యంతే యోగసిద్ధాః

అంజన సిద్దా అపి కేచన దృశ్యంతే,

దారిద్ర్యయోగ సిద్ధం

మాం తే లోకా న ప్రేక్షంతే)

 యోగ సిద్ధులు కనబడతారు. అంజన సిద్ధులూ కనబడతారు. నాబోటి దారిద్ర్య యోగసిద్ధులు ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించరు- అని ఓ దరిద్రుడు వాపోతుంటాడుట.

 

జై నామ కహని సోక్ఖం

హూఇ తులగ్గేణ సేవఅజణస్య,

తం ఖవణాఅ సగ్గారో

హణం న విగ్గో వా సఏహి   -153

 

(యది నామ కథమపి సౌఖ్యం

భవతి తులాగ్రేణ సేవకజనస్య,

తత్ క్షపణక స్వర్గారోహణ

మివ వ్యాకుల భావసతైః)

రాజసేవకులు దంభర్మాంకులు. వస్త్ర వ్యాపారులు, పల్లెల్లో తెలివితేటలు గలవారు, వడ్డెవాళ్ళు, వైద్యులు, జ్యోతిష్కులు, మొదలైన వారి మనస్తత్వాలను బాగా చిత్రించాడీ కవి. రాజ సేవకునికి ఏదైనా సౌఖ్యం కాకతాళీయంగా వస్తే, అది క్షపణకుని స్వర్గారోహణం లాగా ఎన్నో కష్టాల తర్వాత మరణానంతరంసంభవించ వచ్చునంటాడు.  క్షపణకుడు(సన్యాసి) కి సుఖం కలిగేదెప్పుడు? మరణానంతరమే. అతని ఘనతను గ్రహిమ్చి విమానంకట్టి మోసుకుని పోతారు. వాద్యాలు మోగిస్తూ దానాలు ఇస్తారు. అతని పేర ఇలా అంత్య సంస్కారం కోసం తీసుకు వెళతారు. ఇలాగే రాజసేవకుడికీ కాకాతాళీయంగా ఏదైనా సుఖం కలిగిందీ అంటే అది మరణం తరువాతే. జీవితకాలంలో సుఖ యోగం లేదు అని కవి భావం.

 

ఒక సేవకుడు అనుకుంటాడు"మంచి పొదుగు ఉన్న మూడు ఆవులు, నాలుగు మంచి ఎడ్లు, చేతినిండా  వరికంకులు ఉంటే చాలు.. ఓ సేవా ధర్మమా, నీవు ఎక్కడన్నా సుఖం ఉండు' అని.

తంబాఉ తిన్ని సుపఓహరా ఉ

చత్తరి పక్కల ఎఇల్లా,

నిస్సన్నా రాలయ మంజరీ ఉ

సేవా సుహం కుణవు'   -160

 

(గాన స్తి సః సుపతీధరాః

చత్వారః సనర్థ బలీవర్గాః

నిష్పన్నా రాలవ మంజర్యః

సేవా సుఖం కరోతం)

గ్రామాలలోని చతురులను గురించి కవి చాలా మనస్తత్వ విచారణ చేసాడు. ఒకామె ఒక అమ్మాయిని హెచ్చరిస్తుంది" పల్లెల్లోని భేకులు బహు చతురులు. బహు కూట నిపుణులు. వారి చేతుల్లో పడ్డ వారికి స్వప్నంలో కూడా సుఖం లేదు.వారికి ఆరవ జ్ఞానం(సిక్స్త్ సెన్సు) ఉంటుంది. ఆ చూపుల్లో పడిన వాడికి సుఖం ఉండాదు'

 మేడలతో, మిద్దెలతో, ప్రాకారాలతో, శిఖరాలతో ఉండేదే కాదు.. చతురులున్న పల్లే నగర మవుతుంది.

 

తహ చంపిఊణ భరి ఆ

నిహిణా లావణ్ణ ఏత తణు అంగీ,

జహ సే చిహారతరంగా

అంగుళి మగ్గ దీసంతి   -314

 

(తథా నిసీడ్య భృతా

నిధినా లాణ్యేన తన్వంగీ,

యథా అస్యాః చికురతరంగా

అంగుళీమార్తా ఇవ దృశ్యంతే)

 

శరీర సౌందర్యం, అంగాంగ సౌష్టవానికి మించిందని ప్రాకృత కవి గొప్ప ఊహ.ఓ లావణ్య సుందరిని చూసిన అతగాడికి ఇంత్లో ధాన్యమో, పత్తో సంచుల్లోకి కూరుతున్న దృశ్యం గుర్తుకొచ్చింది.విధి ఒక తన్వంగిని లావణ్యంతో కూరి కూరి నింపాడుట. పై నుంచి నొక్కి నొక్కి కూరిన చేతుల గుర్తులే వంకుల జుట్టు అని కవి చమత్కారం! ఆహా.. ఎంత గొప్పగా ఉందీ ఊహ!

 

దాడిమఫలం వ్వ పెమ్మం

ఎక్కేసక్కేవ్వ హోఇ సకషాయం,

జావ న బీఓ రజ్జఇ

తా కిం మహ రత్తణం కుణఇ    -334

(దాడిమఫల మివ ప్రేమ

ఏకైకస్మిన్ పక్షే సకషాయం,

యావ న్న ద్వితీయే రజ్యతే

తావ త్కిం మధురత్వం కరోతి)

ప్రాకృతమని చిన్న చూపు కాని సామాన్యుని చూపు ఎంత గహ్యమైన అంశాన్నైనా తన పరిధిలోకి అనువదించుకుని అత్యద్భుతమైన అవగాహనను ప్రదర్సిస్తుంది. మేధావుల ఊహ పోహల వలె కాకుండా సామాన్య జీవి ఏక పక్ష ప్రేమని పూర్తిగా పండని దానిమ్మ పండుతో ఎంత గొప్పగా పోల్చాడో! దానిమ్మ పక్వానికొచ్చే విధానం మిగతా ఫలాలకన్నా కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. గింజలన్నీ ఎర్ర బారినదాకా పండులోకి తీపిదనం రాదు. ఒక పక్క తియ్యగా ఉండి మరో పక్క వగరుగా ఉండే లక్షణం ఒక్క దానిమ్మ పండుకే ప్రత్యేకం. ప్రేమా అంతేట. 'ఒక పక్షంలో మాత్రమే ప్రేమ ఉండి మరో పక్షంలో దానికి అనుగుణమైన స్పందన కరవైతే ఆ బంధం దానిమ్మ పండు మాదిరి సంపూర్ణమైన పక్వ ఫలం అనిపించుకోదు'అంటాడు ప్రాకృత కవి.బిఓ అన్న పదానికి విత్తనం, రెండో పక్షం రెండు అర్థాలు ఉండి గాథ చమత్కారాన్ని మరింత పెంచింది.

బింకాన్ని ప్రెమను రెండు మదగజాలతో పోల్చాడు మరో గాథలో ప్రాక్కృత కవి. బింకం ఉంటే ప్రేమ పండదు. ప్రేమ ఉంటే బింకం నిలవదు. రెండూ ఒకే చోట ఉండలేవు.. ఒకే కట్టుకు కట్టివేసిన రెండు మదాజాల మాదిరిగా.

జి మాణీ కీస పిఓ

అహన పియో కీసక్షీరఏ(?) మాణో,

మాణిణి దోని గయిందా

ఎక్క కంభే న బజ్జంతి  -355

ఒక వరలో ఇమడని రెండు కత్తులతో ప్రేమని, అహంకారాన్ని కబీర్ దాస్ కూడా పోల్చడం గమనించాలి.

పియా బాహై పేమరస

రాఖా బాహై మాన

ఎకమ్యానమేఁదో ఖడగ

దేఖా సువా , కాన'

 

పల్లెటూరి జనానికి బూతన్నా, బహిరంగ శృంగార చేష్టలన్నా సంకోచం లేకపోవడం ఈనాడే కాదు..ఆ నాడూ ఉంది. కాబట్టే వజ్జాలగ్గంలో కవి 'ఒక నవ దంపతుల వివిధ శృంగార భంగిమల్ని రాత్రంతా చూస్తూ గడిపిన  దీపం నూనె లేకపోయినా అలాగె మండుతున్నదని ఓ గాథలో  సూచ్యం చేస్తాడు.

దట్టూణ తరుణ సురఅం

వివిహ పలోఠ్ఠంత కరణసోహిల్లం,

దీఓ వి తగ్గయ మణో

గఅం వి తెల్లం న లక్ఖేఇ -319

 

(దృష్ట్యా తరుణ సురతల

వివిధ ప్రలుఠత్  కరన సహితం,

దీపోసి తద్గతమనాః

గతం మసితైలం న లక్షయతి

అని చెప్పుకొచ్చాడు.

 

తాడిచెట్టును అడ్డం పెట్టుకుని ఓ ప్రాకృత కవి  'ఓ తాడిచెట్టూ! ఎందుకు నీ ఎత్తు? సగం ఆకాశాన్ని ఆక్రమించావు. ఆకలి దప్పి తీర్చుకుందామని పాంథులు దగ్గర చేర్తారా ఏమన్నానా?' అంటూ రస హీనతని ఎద్దేవా చేస్తాడు. ప్రాకృత సాహిత్యంలో ఇలాంటి నర్మ గర్భ శృంగార  ప్రేలాపలకు కొదవే లేదు. గ్రామీణులు పని పాటల అలుపు సొలుపుల నుచి ధ్యాసను  మళ్ళించుకోడానికి వళ్ళు పులకలెత్తే మౌఖిక శృంగారాన్నాశ్రయించడం అసభ్యంగా భావించడం లేదు నాడూ నేడూ కూడా! 

కబీరు అంతటి సాధువు ఈ గాథను గుర్తుకు తెచ్చే ఖర్జూర వృక్ష దోహాను వల్లె వేస్తున్నాడు మరి

" సాథు భయా తో క్యా భయా

జై సే షేడ ఖబర్,

సంచీకో సాయా సహీఁ

ఫల తాగే అతిదూర్!"

హౌనయ్యా గొప్ప సాధువే ఖర్జూరం లాగ. పిట్ట వాలడానికి నీడ లేదు. పండ్లు కోసుకుందామంటే దూరంగా ఉన్నాయి .. అందవు"

(ప్రాకృతసాహిత్యంలో సామాన్యమానవుడు-తిరా--భారతి-75-6-౪.pdf)

 

 

 

సాహిత్య వ్యాసం: బేతాళ పంచవింశతి -కర్లపాలెం హనుమంతరావు ( తెలుగు వెలుగు మాసపత్రిక - ఏప్రియల్ ; 2019 సంచికలో ప్రచురితం)

 









సాహిత్య వ్యాసం:

బేతాళ  పంచవింశతి

-కర్లపాలెం హనుమంతరావు

( తెలుగు వెలుగు మాసపత్రిక  - ఏప్రియల్ ; 2019 సంచికలో ప్రచురితం) 



బేతాళ కథలను గురించి తెలుగువాళ్లకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.    బాలల మాస పత్రిక 'చందమామ' చలవ.. తెలుగునాట తరాల బట్టి బేతాళుడు ప్రతీ ఇంటికీ నెలకో సారొచ్చి చక్కని కథ వినిపించే కథల భూతంగా   చిరపరిచితుడు.

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీది శవాన్ని భుజాన వేసుకొని స్మశానం కేసి నడవడం.. శవంలోని బేతాళుడు  మహారాజుకు  దారిశ్రమ తెలియకుండా కథలు అల్లి చెప్పడం బేతాళ కథల   రివాజు.  విక్రమార్కుడు వినే ఆ వింత  కథలనే   'చందమామ' పాఠకులూ చిన్నా పెద్దా  తేడా లేకుండా ఎంతో ఉత్కంఠతో చదవడం  అదో మోజు. ఆ మైమరుపుకు కారణం నెలకో తీరులో సాగే  కథలలో కొనసాగే  కొసమెరుపు. బేతాళుడి  ప్రశ్నలకు జవాబులు తెలిసీ పెదవి విప్పకుంటే   రాజు తల వెయ్యి వక్కలయ్యే ప్రమాదముంది. మహారాజు  ఆ నెల  ఏ తెలివైన జవాబు చెప్పి గండం  నుండి తప్పుకుంటాడోనని  దిగులు!  చిత్ర విచిత్రమైన భావోద్వేగాలతో దశాబ్దాలపాటు చందమామ పాఠకులను ఉర్రూతలూగించిన  బేతాళుడు ఎవరు?  చిక్కుముడి కథల అసలు  పరమార్థం ఏమిటి?  బేతాళ కథలు  రేకెత్తించే పలు  సందేహాలు  నివృత్తి కావాలంటే  'బేతాళ పంచవింశతి' గురించి కొంతయినా  తెలుసుండాలి.    

అనగనగా ఒక వీరుడు. అతగాడి పేరు విక్రమసేనుడు.  ప్రతిష్టాపురానికి ఆయన మహారాజు.  శీలభద్రుడనే ఓ యోగి పదేళ్ల పాటు ప్రతీ రోజూ  క్రమం తప్పకుండా రాజుగారికి రోజుకో విచిత్రమైన పండొకటి కానుకగా సమర్పిస్తాడు. నిజానికి  ఆ బహుమానాలన్నీ మణులు.. మాణిక్యాలు! రాజు నిలదీసిన మీదట యోగి నోట బేతాళుడి వివరాలు బైటపడతాయి. కోరుకున్న రూపంలోకి మారిపోగల కామరూప శక్తి మాయ బేతాళుడి బలం. ఆ భూతాన్ని   తన పరం చేయమని వేడుకుంటాడా తాంత్రిక యోగి. 

శైవ తాంత్రిక సంప్రదాయాల అనుసారం బేతాళుడు ఒక భూతం. మంత్ర తంత్రాలతో వాడిని వశం చేసుకోవడం సులభం.  స్మశానాలలో శవాలలో నివాసముండే వాడు  తన వశమయితే  సర్వశక్తులు  సిద్ధిస్తాయని తాంత్రిక యోగి దురాశ.   సాహసం, మేధస్సులకు  సైదోడుగా  బోలెడంత సహనం గల విక్రమసేనుడే తన  వాంఛితం ఈడేర్చే  సమర్థుడని యోగి ఇంత మంత్రాంగానికి పూనుకున్నది. సన్యాసి దురూహ పసిగట్టని రాజు ఎన్ని రాత్రులైనా జాగారాలు చేసి బేతాళుడిని యోగి పరం చేయాలని పంతం పడతాడు. విక్రమసేనుడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భంగం చేసే బేతాళుడి ప్రయాస  నేపథ్యంగా సాగే పాతిక  విచిత్ర కథల సమాహారమే 'బేతాళ పంచవింశతి'. 

పంచవింశతి అంటే ఇరవైకి అయిదు అదనం. బేతాళుడు చెప్పిన  పాతిక కథలు కాబట్టి ఇవి 'బేతాళ పంచవింశతి' పేరుతో సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధ కథాకావ్యంగా ప్రసిద్ధమయాయి. ‘చందమామ’ పత్రికలో నిరంతరాయంగా కొనసాగిన కల్పిత కథలన్నిటికి బేతాళ పంచవిశంతిలోని  కథలే ప్రేరణ.  

బేతాళుడి పుట్టుక కథ చాలా ప్రాచీనమైనది.  జనశ్రుతంగా  విన వచ్చిన ఈ  కథలను అజ్ఞాత కవి ఎవరో గ్రంథస్థం చేసినట్లు  సాహిత్య పరిశోధకులు భావిస్తున్నారు. బేతాళ కథల మూలాలు శైవ తాంత్రిక సంప్రదాయంలో ఉన్నప్పటికీ..  బౌద్ధుల తాంత్రిక యోగ సంప్రదాయంలోకీ వచ్చి తిష్ఠవేసినట్లు చెబుతారీ  బేతాళుడు. 

క్రీ.శ ఒకటవ శతాబ్ది, శాతవాహనుల కాలం నాటి ప్రాకృత భాషాకవి గుణాఢ్యుడు పైశాచి భాషలో రాసిన  బృహత్కథలోని కొన్ని కథలే  బేతాళ కథలని ఒక నమ్మకం ప్రచారంలో ఉంది.   బృహత్కథాలహరి కాశ్మీరం ప్రతిలో బేతాళ పంచవింశతి ప్రస్తావన ఉన్నట్లు పాశ్చాత్య  పండితుడు వింటర్ విట్స్ కూడా భావించాడు. ప్రాకృతం నుంచి సంస్కృతంలోకి అనువాదమయిన క్షేమేంద్రుడి బృహత్కథామంజరిలో, సోమదేవుడి  కథాసరిత్సాగరంలో కనిపించే బేతాళ కథలు నేపాళ కవి బౌద్ధస్వామి సంస్కృత బృహత్కథాశ్లోకసంగ్రహంలో కనిపించవు! బేతాళ పంచవింశతికి  మూలమని భావించే కాశ్మీరం ప్రతి ప్రస్తుతం అలభ్యం.   ఈ నేపథ్యంలో  నిజానిజాలు  నిర్ధారించడం కష్టం. ఆయా కాలాలల్లో కవులు తమ సమకాలీన సామాజిక  పరిస్థితులకు  తగ్గట్లుగ ఈ కథల్లో మార్పులు చేసుకున్నారు. ఆ కారణంగా ఏవి మూలరూపాలకు దగ్గరివో, ఏవి  చొప్పించిన  ప్రక్షిప్తరూపాలో  నిగ్గుదేల్చడమూ క్లిష్టతరంగా మారింది ప్రస్తుతం! 

జంబలదత్తు గద్య రూపంలో, వల్లభదేవుడు  సంక్షిప్త రూపంలో, మరో పేరు తెలియని కవి క్షేమేంద్రుడి బృహత్కథామంజరిలోని పద్యరూప కథలను గద్యంలోకి  మార్చినట్లు చెబుతారు. గద్య పద్య మయ హృద్యశైలిలో కూర్చిన   12 వ శతాబ్ది నాటి శివదాసు కృతే ఉన్నంతలో మూలరూపానికి కాస్తింత  సమీపంగా నడిచినట్లు ఇప్పటి విమర్సకులు భావిస్తున్నారు.

ఇక తెలుగులో.. 

జక్కన తెలుగు 'విక్రమార్క చరిత్రము' తెలుగునాట   విస్తారంగా ప్రచారంలొకి వచ్చినప్పటి బట్టి విక్రమసేనుడు విక్రమార్కుడుగా మారిపోయాడని వినికిడి. తెలుగులో వెన్నలకంటి అన్నమయ్య  రాసిన  షోడశకుమార చరిత్రములోని మిగతా కథలతో పాటు కొన్ని కథలు ఈ బేతాళ పంచవింశతి నుంచీ ప్రేరణ పొంది రాసినవే అంటారు. చిన్నయసూరి కాలం వరకు సామాన్య పాఠకులు వెన్నెలకంటివారి కావ్యాన్ని ‘బేతాళ పంచవింశతి’గానే పిలుచుకొనేవాళ్లు కూడా! మిక్కిలి మల్లికార్జునుడనే కవీ బేతాళ పంచవింశతి పేరుతో మరో  కావ్యం రాసినట్లు ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం మూడవ సంపుటి) పేర్కొన్నారు.  కూచిరాజు ఎర్రన సకలనీతి కథావిధానంలో సైతం బేతాళ పంచవింశతి కథలు కొన్ని కనిపిస్తాయి. వెన్నెలకంటి, ఎర్రనల కన్న ముందే పద్మనాయక యుగంలో కవివల్లభటుడూ తన వంతుగా మరో బేతాళ పంచవింశతి పుష్పాన్ని తెలుగు సాహిత్య తోరణానికి జతచేసాడు. పోతరాజు అనే కవి రాసినట్లు  చెప్పుకొనే మరో పది బేతాళ పంచవింశతి  పద్యాలను ఒక అజ్ఞాతసంధాత వెలికితీసినట్లు విదితమవుతోంది.  

ఆలయ నిర్మాణాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన  పద్మనాయకరాజుల నాటి   రేచర్ల గోత్రీకుడు బేతాళరెడ్డిని ప్రస్తుతిస్తూ  చిన్న వీరయ్య అనే కవి సంసృతంలో ఒక లఘుకావ్యం రచిస్తే బంగారు రంగప్ప దానిని ‘బేతాళ చరిత్ర’ పేరుతో ద్విపద  కావ్యంగ  అనువదించాడు.  ఆ  అనువాదం తరచూ బేతాళ కథలుగా పొరపడటం జరుతుతోంది.. ఇదో గమ్మత్తు.. సాహిత్యంలో!

బేతాళ పంచవింశతిలో బేతాళుడు విక్రమసేన మహారాజుకు ప్రతీ రాత్రీ ఒకటి చొప్పున వరుసగా  రెండు డజన్ల కథలు చెపుతాడు. 


తెలివైన పద్మావతి పంపిన మార్మిక  సందేశాలను మంత్రిపుత్రుడు తన బుద్ధికుశలతతో పరిష్కరించి యుక్తియుక్తంగా  ఆమెను తన రాకుమారుడికి జతచేసిన మొదటి కథ నుంచి.. బాలుడి మృత దేహంలోనికి పరకాయప్రవేశం చేసే ముందు రోదనలు, చిందులతో  ఓ ముసలి యోగి చేసిన హంగామా దాకా  ఎక్కడా ఆగకుండా, నడక మందగించకుండా సాగుతుంది బేతాళుడి కథాప్రవాహం.  అనాథలైన  తల్లీ కూతుళ్ళు  విధివశాన ఓ తండ్రి, కొడుకులకు భార్యలవుతారు. ఈ రెండు జంటలకు కలిగిన సంతానం మధ్య సంబంధాలలో సంక్లిష్టత ఏర్పడినప్పుడు ఆ తికమక సంబంధాల సమస్యకు రాజు వద్ద నుండి సబబైన సమాధానం రాదు.  అక్కడికి బేతాళుడి ప్రశ్నలు ఆగిపోయినా ఆ మరునాటి రాత్రి జరిగిన పతాకసన్నివేశాలతో కథాకావ్యం సుఖాంతమవుతుంది, 


నడిమధ్య  కథలలో పునరుజ్జీవితురాలైన మందారవతి, మనుషుల పాప పుణ్యాలను గూర్చి చర్చించే చిలుక.. గోరింక, యజమాని కోసం సకుంటుంబంగా సాహస త్యాగాలకు ఒడిగట్టే భృత్యుడు వీరవరుడు, ఉమ్మడి ప్రజ్ఞల కారణంగా పునరుజ్జీవించిన  సమప్రభను ఎవరు ఏలుకోవాలన్న మీమాంసలో పడిన బ్రాహ్మణ కుమారులు, తలలు.. మొండేలు తారుమారుగా అతికించుకొని తిరిగి బతికిన భర్త.. సోదరులలో ఎవరి పాణి గ్రహించాలో అంతుబట్టక ధర్మసంకటంలో పడ్డ యువతి..  వంటి వింత చిక్కుముడులలో  చిక్కిన పాత్రలు  ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి కొన్ని కథలలో. 

 వివాహమైనా భర్త అనుమతితో  ఇల్లు దాటిన ఇల్లాలు, కాముకుడైనా నిష్కలంకమైన ప్రేమ ప్రదర్శించే   చోరుడు, లోకం ఊహించలేని  దుష్టపాత్రల శిష్టస్వభావాలు విస్తుగొలిపిస్తాయి మరికొన్ని కథలలో! 

సముద్రగర్భ నగరాలు, దివ్యలావణ్యాలతో మెరిసే రాజకుమార్తెలు,  కలువల తాకిడికే దేహం కందే అతి సుకుమారులు, చంద్రకిరణం సోకినా వళ్లు కాలిపోయే   వయ్యారిభామలు, దంపుడు బియ్యం దెబ్బల మోతకే  చేతులు బొబ్బలెక్కే  అబ్బురాండ్రు.. ఊహకైనా అందని చిత్ర విచిత్ర పాత్రలు   ఇంకొన్ని కథలలో!

సుఖలాలసులైన యశఃకేతు వంటి దౌర్భాగ్య మహారాజులు, అమృతం తాగినా విషం మింగినట్లు మరణించే   హరిస్వాములు వంటి దురదృష్ట జాతకులు,  వధ్యశిల ఎక్కిన ముష్కురుని కోరి మరీ వరించి సతీ సహగమనానికి సిధ్ధపడ్డ సుదతీమణులు.. పాఠకులకు ఊపిరి సలుపనీయని విచిత్ర వ్యక్తులు రెప్పకొట్టకుండా చదివిస్తారు  అన్ని కథలూ!

మంత్ర గుళికల మహిమతో  ఇద్దరికి ఇల్లాలైన శశిప్రభ సంకటస్థితి నిజజీవితంలో  మనకే ఎదురైతే కిం కర్తవ్యం?   నాగు రక్షణ కోసం స్వీయ దేహాన్ని  శంఖచూడుడంత సంతోషంగా    గరుత్మంతునికి ఆహారంగా మనం  సమర్పించుకోగలమా? ధర్మం, మోహం మధ్య నలిగే దుర్భర పరిస్థితులు కనక మనకే తటస్తిస్తే ‘సుందరి ఉన్మాదం' కథలోని మహారాజుకు మల్లే సులువుగా మనం ఉసురు తీసుకొంటామా? జీవితమంటే కష్టనష్టాల కలినేతన్న తత్వం తెలిసినప్పటికీ బేతాళ కథల్లో మాదిరి బతుకులో నిజంగానే కష్టాలు ఎదురైతే బేతాళ కథల పాత్రలంత విశుద్ధంగ, విస్పష్టంగ, విచిత్రంగ ప్రవర్తిస్తామా?  అభీష్టవరదాయినీ మంత్రవిద్యను నేర్పే సాధనాక్రమంలో అనూహ్యంగా గురుశిష్యులిద్దరూ  ఆ వింతవిద్యనే  పోగొట్టుకొంటారో  కథలో!  తండ్రి కోసం చేసిన పిండప్రధానంలో  విచిత్రమైన ధర్మసంకటం ఎదుర్కొంటాడో కన్నకొడుకు మరో కథలో! కాసుల కోసం కన్నవాళ్ళు, స్వీయ ప్రాణరక్షణ కోసం మహారాజు ..ఇలా తలా ఒక స్వార్థ ప్రయోజనార్థం  దైవోపహతుడైన ఏడేళ్ళ బాలుణ్ణి బలివ్వడానికి సిధ్ధపడతారు  మరో కథలో! వింటేనే చాలు వెన్నులో వణుకు పుట్టించే  అరుదైన ఘటనలు నిజంగా కంటి ముందే జరుగుతుంటే పాఠకుల మానసిక పరిస్థితుల గతేమిటి? మోహాతిశయంతో ప్రాణాలు విడిచిన స్త్రీని చూసి తట్టుకోలేక  ప్రాణాలు విడుస్తాడా ఎంత ప్రియుడైనా కథల్లో కాకుంటే నిజంగా జీవితంలో? ఇదే అబ్బురమనుకుంటే ఆ భార్య, భార్యాప్రియుల అర్థాంతర మరణ వార్త విని స్వీయప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యజిస్తాడు అసలు భర్త మరీ విడ్డూరంగా మరో కథలో!  చచ్చిన సింహానికి జీవం పోసి బతికించి దాని దాడికి బలయి చచ్చిన  మూర్ఖ విద్వాంసుల వంటి వారి మూఢత్వాన్నీ వదలకుండా చెప్పినందుకే బేతాళ కథలు సంస్కృత సాహిత్య రంగాన కథల   ఖజానాగా ప్రసిద్ధికెక్కింది శాశ్వతంగా. భారతీయుల కథాకల్పనా పటిమకు బేతాళ  పంచవింశతిలోని ప్రతీ కథా ఒక విశిష్ట  ఉదాహరణే.

కథలోని విక్రమసేనుడు వాస్తవానికి త్రివిక్రమకసేనుడని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. ఆ త్రివిక్రముడి అభీష్టం మేరకు ‘బేతాళ పంచవింశతి’ శతాబ్దాల కిందటే ప్రపంచవ్యాప్తంగా ‘ప్రశ్న సమాధాన’ ప్రక్రియాపరంగ సాగే కథావిభాగంలో ఉత్తమ శ్రేణి కావ్యంగ  కీర్తి గడించింది. పలు ప్రపంచ భాషలలోకి తర్జుమా కావడమే బేతాళ కథల ప్రఖ్యాతికి గట్టి నిదర్శనం. 

'భేతాళ పంచవింశతి' ప్రసంగ, శ్రవణాలు జరిగే చోట యక్ష, భేతాళ, పిశాచ, రాక్షసాది దుష్టశక్తుల సంచారం   నిషిద్ధమని భూతం పాఠకులకిచ్చిన అభయం బేతాళ కథలని భారతీయ పురాణాల స్థాయికి పెంచే ప్రయత్నంగా భావించినా  భావించవచ్చునేమో!

 ఆ కథల కమామిషు ఎటు పోయినా  ఇప్పటి సాధారణ తరాలకు మాత్రం కథల బేతాళుడి పరిచయం  ‘చందమామ’ మాసపత్రిక పఠన పుణ్యఫలమే. సాహసాద్భుతాలతో కూడిన  బేతాళ కథల  నిర్మాణం భారతీయుల  కథనకౌశలానికి ఆటపట్టు. ఆ పట్టు ఏ  మాత్రం సడలకుండా   దశాబ్దాల తరబడి  కథలు కల్పించి మరీ  బేతాళుడి నోట చెప్పించి తెలుగుసాహిత్యాన్నీ సుసంపన్నం చేసినందుకు తెలుగువారందరం  'చందమామ' కు సదా మనసారా అభివందనలు తెలుపుకుంటూనే ఉందాం

- కర్లపాలెం హనుమంతరాపు

( తెలుగు వెలుగు మాసపత్రిక  - ఏప్రియల్ ; 2019 సంచికలో ప్రచురితం) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...