శబ్దరత్నాకరంలాంటి ఏ పద కోశమో తిరగేసి చూడండి.. 'వెక్కిరింత' అంటే తిట్టిపోయడం అనో బెదిరించడం అనో అర్థం
కనిపిస్తుంది! అబ్బెబ్బే.. బెదిరించే పాటి
బలమే ఉంటే ఈ తెరచాటు సూటిపోటీ
మాటలెందుకండీ సెటైరిస్టుకు? నేరుగా ఏ స్వతంత్ర అభ్యర్థిగానో
పోటీకి దిగిపోయి ప్రచారం వంకతో చివర్రోజు
ఆఖరి క్షణం దాకా హాయిగా కడుపులో ఉన్న ఉబ్బరమంతా సుబ్బరంగా తీర్చేసుకోడా? ఈ.సి
కోడా.. పాడా! ముందు మీడియా ఫోకస్ ప్లస్ పాయింటవుతుంది కదా!
ఎదుటి పోటీదారుడు ఏ మాజీ సి.యమ్మో.. అతగాడి ముద్దుల తనయుడో
అయితేనో! అమ్మో.. కోరి కోరి ఎద్దుకొమ్ముల ముందుకెళ్లి కుమ్మించేసుకున్నట్లే గదా! ఈ
పీడాకారమంతా ఎందుకనే.. అధిక శాతం చేతి జిలగాళ్లు కుండ బద్దలుకొట్టె రిస్కులకు
దిగకుండా రస్కుల్లాంటి రాతల బాటపట్టేది! ఇప్పుడా సైడూ ‘నో ఎంట్రీ’ బోర్డ్
వేలాడుతోంది. అందుకే వెటకారిస్టుల ఈ గోల!
నేరుగా పబ్లిక్ మీటింగుల్లో పాతచెప్పులు విసిరేసినా ‘పోనీలే.. పాప’మని క్షమించేసే మన
నేతలు కొందరు అదేందో మరి.. ఆ దయాగుణం మాత్రం దెప్పిపొడిచే రచయితల మీద వీసమైనా
చూపించడం లేదు!
పిచ్చి చేష్టలను తప్పుపట్టడం వెనకాల.. ఛాన్సు వచ్చింది
కదా.. కచ్చ తీర్చుకోవచ్చన్న పిచ్చి దుర్బుద్ధి
ఒక్కటే ఉండదు సుమండీ! చపలచిత్తుడి బుద్ధిని శుద్ధి చేద్దామన్న మంచి ఉద్దేశమూ కొంతమందికి కద్దు. ఒకానొక కాలంలో ఏకోజీ మహారాజు కొలువులో ఒక వెలుగు వెలిగిన వాంచానాథుడు రాజుగారి పాలనలోని ప్రజాపీడనకు అలిగి
దున్నపోతును అడ్డం పెట్టుకుని మరీ ఓ వంద పద్యాల్లో తిట్టిపోసాడు. అన్నీ చమత్కారాలే
అందులో! కుపరిపాలన సాగించే అసమర్థులను వ్యంగ్య విధానంలో దెప్పి దారికి తెచ్చే మంచి
పద్ధతి మొరటు కాలమని మనం వెక్కిరించే ఆ 15వ శతాబ్దిలోనే ఉంది కదా! మరి అన్ని విధాలా
అభివృద్ధి చెందిన అతి మహా పెద్ద ప్రజాస్వామ్యంలో మనం సుపరిపాలన సాగించేస్తున్నామని
ప్రపంచానికి గొప్పలు చెప్పుకుంటున్నాం కదా! అయినా.. నిరసన స్వరాలు వినిపిస్తాయన్న జంకుతో
వ్యంగ్యం మీద ఇంకా ఇన్ని రుసరుసలా? పెన్నును గన్నులా వాడేవాడిని
కూడా ఓపిగ్గా అర్థంచేసుకోడమే ఓపెన్ డెమోక్రసీ ఉత్తమ లక్షణం పాలకులారా!
గాడి తప్పిన వాడని సెటైరిస్టుగాడిని ఊరికే ఈసడించుకోడం తగదు! వాచాలత్వాన్నీ ఏ కవిత్వం మల్లేనో అల్లి
గిట్టనివాళ్లని గిల్లడానిక్కూడా బోలెడంత గడుసుతనం కావాలండీ. సెటిలర్సునే గుండెల్లో పొదువుకుంటామంటూ వాడవాడలా
తిరిగొచ్చే దొరలు.. సెటైరిస్టుల్నీ ఆ
కౌగిట్లోనే ప్రేమగా పొదువుకోవచ్చుగదా? రాసే రాసే కలాలని వాలంటరీ
రిటైర్మెంటు తీసుకొమ్మనడం ధర్మమా.. బాంచెన్.. మీ కల్మొక్తా .. జర చెప్పుండ్రి
సార్లూ!
పిల్లులు గోడల మీదా, ఎలుకలు గాదెల కిందా.. చేరి రాజకీయాల పేర
రచ్చ రచ్చ చేసేస్తున్నాయి. ఆ విరక్తితోనే కదా ఆ
పిల్లి మీదా, ఈ
ఎలుక మీదా పెట్టి అన్యాపదేశంగా
పెద్దయ్యల అన్యాయాల మీద దండెత్తేది? డైరెక్టు ఎటాకర్సుతోనేమో ఏదోలా చీకట్లో మాటలు
కలిపేసుకోవచ్చు.. వీలును బట్టి తమలో కలిపేసుకోవచ్చునేం! ఇన్ డైరెక్టు భాషలో ఏదో
గుసగుసలు పోయే వెటకారిస్టుల మీదనేనా ఈ గుడ్లురమడాలూ!
సెటైరిస్టుల స్క్రిప్పుల సాయం లేకుండా ఏ పొలిటీషియన్ స్టేజ్
మీద ఎట్రాక్టివ్ ఉపన్యాసాలివ్వగలడో తేల్చండి! కామెడీ రాతగాళ్లు కేవలం మందు
పార్టీలల్లో వినోదాల విందుల వరకేనా దొరబాబులూ పరిమితం?
ఎంత కసి ఉంటే ఆ
జోనాథన్ స్విఫ్టంతటి సెటైరిస్టు గలివర్ని అడ్డుపెట్టుకొని మరీ ఆనాటి పాలకులకు గడ్డిపెట్టాడు? బతుకు తెరువు కోసమే కద మహానుభావులారా
ఎప్పట్లా పిట్టల్ని కొట్టిందా నిషాదుడు రామాయణ కాలంలో! అయినా ఆనాడు వాల్మీకంతటి మహర్షికే అంత లావు కోపం
తన్నుకొచ్చేసిందే! అంత ఉక్రోషంలో కూడా ఆయన నిషాధుడి మీద చెయ్యెత్తింది లేదు. ప్రపంచం పూజించే ఉత్కృష్ట కావ్యం చెప్పవతల గిరాటేశాడు!
వాల్మీకిని అసలు కలమే పట్టద్దని ఏ శ్రీరామచంద్రుడో వారించుంటే? లోకం గర్వించే రామాయణం అసలు రూపుదిద్దుకొనేదేనా? రాసే కలాలకి అందుకే
పాలకులు పూర్తి స్వేచ్ఛనివ్వాలి.
సజావుగా జనాలను పాలించడం రాక నేతలు
సెటైరిస్టుల మీద పడితే ఎట్లా?
చేతి ఉంగరం పోయిందని చెరువు మీద, రాసుకునే వేళకు పత్రాలందించలేదని తాటిచెట్టు మీద.. అలిగి తిట్లపురాణాలకు దిగిన
బండకవులకేమో తమరు గండపెండేరాలూ, పూల దండలతో సత్కారాలూ?!
చెరువు పూడికలు తీయించాలని, చెట్లు ఏపుగా
పెంచి ట్రీ గార్డులు పెట్టించాలని.. ఏదో
వంకన జనం సొమ్మును మూటకట్టి చంకనేసుకుపోయే
వంకరబుద్ధి ఆషాఢభూతులను వెటకరించినందుకేమో వెంటాడి వెంటాడి వేధించడాలా?
చెడ్డకు ఎదురొడ్డి నేరుగా గోదాలో కలబడే గుండె నిబ్బరం అందరికీ ఉంటుందా! ఆ సత్తా లేనప్పుడే కదా పిల్లి మీదా ఎలుక మీదా పెట్టి జబ్బసత్తువ
కొద్దీ దెప్పిపొడవడాలూ!
ఎదుటి శాల్తీ పిచ్చి చేష్టలను నేరుగా ఎదుర్కొనే సత్తా
లేనప్పుడే దెప్పిపొడుపు భాషను పుట్టుకొచ్చేది! బైటికి కనిపించే పదాన్ని
పట్టుకొచ్చి.. లోపల గూఢార్థం చొప్పించి దెప్పడంలో ఎంత గడుసుతనం కావాలో! ఆ లోపలి
అర్థాలకే లోపాలున్న శ్రీరంగనీతి జాతి
ఉలిక్కిపడేది. నవ్వించే విధంగా ఉంటుంది కాబట్టి నలుగురి ముందూ తానూ నవ్వక
తప్పదు. కానీ ‘బిడ్డా! నా టైము రానీ.. అడ్డంగా నరుకుతా!’ అని అనుకోడమే ప్రజాస్వామ్యానికి పెద్దహాని.
పాలకులే కానక్కర్లేదయ్యా.. పలు సందర్భాలలో సమాజమే తన
మూర్ఖత్వం వల్ల దెప్పులపాలవడం కద్దు.
వీరేశలింగం వంటి పెద్దలు ఇదిగో ఈ దెప్పిపొడుపు దారినే పోయి సమాజానికింత
సోయి తెప్పించే ప్రయత్నం చేసింది. సంఘాన్ని గమ్మత్తుగా మరమ్మత్తు చేసేందుకు సెటైర్
ను మించిన ఆయుధం లేదని గురజాడ
నమ్మకం. కాబట్టే కన్యాశుల్కం నాటకం వంకన నాటి సొసైటీ తాట
తీసారు. చిలకమర్తి గణపతి, మొక్కపాటి పార్వతీశం, పానుగంటి జంఘాలశాస్త్రి.. మనిషిలోని, సంఘంలోని
వంకరబుద్ధుల్ని, వెంగళాయితానాన్ని, అమాయకత్వాన్ని, అహంభావాన్నీ ‘ఇహ
నా వల్ల కాదురా బాబూ!’ అన్నంత గొప్పగా కడుపుబ్బా నవ్విస్తూనే కడిగవతల
పారేసారు సారులూ! చమత్కారం, వెక్కిరింతల వంటి జోడు గుర్రాలను పూన్చి
వ్యంగ్యరథాన్ని పిచ్చిగా కలుపు మొక్కలు పెరిగిన
వ్యవస్థల మీదుగా లాగుతుండబట్టే నలుగురూ నడిచే బాట ఈ మాత్రమైనా చదునుగా
ఉండింది! నేరుగా పడే గంటె వాతల కంటే కొంటెపూలు కట్టిన కుచ్చుల జడతో కొట్టే
దెబ్బల్లోనే మజా ఉంటుంది! 'జమీందారు రోల్సు కారు,
మహారాజు మనీపర్శు..
మాయంటావా? అంతా/ మిథ్యంటావా?'
అంటూ ముద్దుల వేదాంతిని సైతం వదలకుండా తలంటుపోసాడా మహానుభావుడు శ్రీ శ్రీ!. అంత మాత్రానికే
జాతికి ఆసారాం బాపూలు, నీరవ్ మోదీల వంటి పీడలు వదులుతాయని కాదూ!
సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత
ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ,
విజయాలకీ వ్యవధి ఇవ్వరని
ఆడంగుల మీదా, రాజకీయ నేతల హంగు ఆర్భాటాల మీదా చలం ఇలాగే
చిందులేసాడు ముందు. ఆఖరికి ఆ అరుణాచలం యోగీ
శ్రీ శ్రీ తరహా ఎకసెక్కాలని ఎరక్కపోవడం క్షమించరాని నేరమని ఒప్పుకున్నాడు! అదీ వ్యంగ్యం తాలూకూ హంగూ ఆర్భాటం. ఇప్పటి నేతలకే మరి ఎందుకో వ్యంగ్యమంటే అంత
ఖంగూ.. కంగారూ!
వేరే చేసేదేం లేకపోయినా దారే పోయే దానయ్యనైనా తన దాకా
రప్పించుకుని కాసేపు నవ్వించే గారడీ కాదు స్వములూ వ్యంగ్యమంటే! చేత్తో చూపించిన
టెంకెను కళ్ల ముందే భూమిలో పాతి.. లోటాడు నీళ్లైనా పోయాకుండానే ఒక్క నిమిషంలో మొలిచిన చెట్టు నుంచి దోర మాగిన మామిడి పండంటూ ముక్కలుగా కోసి ఉప్పూ కారాలద్ది నాలిక్కి రుద్ధి
‘ఆహాఁ.. ఏమి రుచిరా!’ అని మైమరపించే అతితెలివి
నేటి నేతాగణాలది. మతులు పోగొట్టే ఆ
విద్యలన్నింటి వెనకాలున్న అసలు టక్కు టామారలన్నింటినీ నవ్విస్తున్నట్లే నవ్విస్తూ
విప్పిచెప్పే సత్తా ఉండేది ఒక్క సెటైర్ రైటరుకే! లోకం కళ్లు నాజూగ్గా తెరిపించేది
ఒక్క సెటైరిస్టే. తమ
గుట్టు రట్టవుతుందన్న కంటు పెట్టుకుని నవ్వించే కలాల మీద నిర్భంధం విధించే కన్నా ప్రజలు తమ మీద
పెట్టుకున్న నమ్మకాలేవీ వమ్ముకాకుండా విధులు సక్రమంగా నిర్వర్తిస్తామంటే
ప్రజాప్రతినిధులను అడ్డుకునేదెవరు? చెయ్యాల్సిన ప్రజాసేవలు మాని తమను అభాసు పాల్చేస్తున్నారని సెటైరిస్టులను
రిటైరైపొమ్మనడమే అన్యాయం! ఎత్తిపొడుపులతో సెటైరిస్టులు ఎత్తిచూపే లోపాలను కాస్తింత అవగాహన చేసుకొని సరిదిద్దుకొనే
ప్రయత్నం చేసేస్తే సరి.. సర్వే జనా హాపీ! చేతిలో కత్తి ఉంది కదా అని.. పూలగుత్తి
కుత్తిక కత్తిరించేస్తామంటేనే ఇబ్బంది? తుగ్లక్ పాలకులున్నంత
కాలమూ గజ్జెల మల్లారెడ్డి జజ్జనక జనారేలు గజ్జెకట్టి పాడుతూనే ఉంటాయి
సుమా!
కారుణ్యకవి జాషువా ’వర్ణమునకన్న పిశాచము భారతంబునన్/ కనుపడలేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఆ దెప్పిపొడుపు వెనకాల
ఎంత గుండెనొప్పి ఉందో మతికి తెచ్చుకోవాలి ముందు మంచి మంచిపాలకులనేవాడు! 'దిబ్బావధాన్లు కొడుక్కి ఊష్ణం వచ్చి
మూడ్రోజుల్లో కొట్టేయడానికి ఇంగ్లీషు చదువే కారణం'గా
కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు మూఢంగా ఎందుకు
నమ్ముతున్నాడో సంఘం ముందుగా స్వీయవిమర్శ చేసుకోవాలి. ‘మును సుముహూర్తము’ నిశ్చయించినా సతి ముండెట్లు మోసెరా?' అని కుండబద్దలు కొట్టినందుకు వేమన బుర్ర
బద్దలు కొట్టకుండా అతి మత విశ్వాసులే ముందు తన బుర్రబద్దలు కొట్టుకోనైనా మూఢవిశ్వాసాల
ఊబి నుండి బైటపడాలి. 'ఈ పురాతన ధూళిలో బ్రతుకుతున్న వాడికి/ ఒక ఇల్లు కావాలని చెప్పడానికి
మార్క్సు కావాలా?నీకిది ఇన్నాళ్లూ తోచకపోతే నీ కంటే
నేరస్థుడు లేడు' పొమ్మన్నాడు గుంటూరు శేషేంద్ర శర్మ. అధర్మం,
అన్యాయం, దోపిడీ, మూఢత్వం,
అజ్ఞానం, దౌర్జన్యం,
అవినీతి, అమానుషాల వంటి దురాచారాలు, బలహీనతలు,
నైచ్యాల మీద ఎక్కుపెట్టేన
రాముడి ఆయుధం దొరా వ్యంగ్య రచయిత చేతిలోని లేఖిని బ్రహ్మాస్త్రం. అవసరాన్ని బట్టి
అది రావణ సంహారానికి ఎదురొడ్డి నిలబడ్డట్లే.. సందర్భాన్ని బట్టి చెట్టు చాటు
నుంచైనా వాలి వంటి అపరాధిని వధింస్తుంది. మొట్టితే తప్ప ఖలుడే కాదు దేవుడూ దారికి
రాడని నమ్మకం నుంచి పుట్టింది బాబులూ ఈ సెటైర్!
సున్నితంగా, సుతారంగా హాస్యంతో కలగలిపి వడ్డించి మరీ మెక్కేవాడికైనా
భుక్తాయాసం తెలీనంత గమ్మత్తు వ్యంగ్యంలో ఉంది. బలవంత పెట్టినా రిటైర్ అయ్యేది అయ్యేది కాదు
సెటైర్! పాలకులు దారికి వచ్చే వరకు
చాటుమాటుగానైనా సరే సెటైరిస్టుల యుద్ధానికి రెస్టంటు ఉండదు!
జి.ఎస్.దేవి
(కర్లపాలెం హనుమంతరావు)
(సూర్య దినపత్రిక వ్యంగ్యల్పిక- ఆదివారం సంపాదకీయ పుట ప్రచురితం)