'
ప్రేమే దైవం! యువతే లక్ష్యం!'
'ఇది వరకేదో ఓన్లీ సేవే లక్ష్యం అన్నట్లు గుర్తు!'
'అది ముగిసి పోయిన పార్టీ పొట్టి కేప్షన్ బాబాయ్! ఇది
ముందుకు దూసుకొచ్చే మరో పార్టీ కొత్త స్లోగన్. మాది దక్షిణాది రాష్ట్రాల మార్కు లవ్
పార్టీ! అదేమో ఉత్తరాది రాష్ట్రాల ఉత్తుత్తి ప్రేమల పార్టీ! మాధుర్ నాథ్ చౌధురి
గుర్తున్నాడా?'
'మర్చి పోదగ్గ మహానుభావుడా నాయనా! పాఠాలు చెప్పమని పెద్దబళ్లో పంతులుద్యోగమిస్తే .. ప్రేమ పాఠాలు వల్లించి మరీ
ఆడశిష్యులను ఏకంగా పెళ్లి పీటల మీదకు ఎక్కించిన మన్మథుడు! చాలా ఘన సన్మానాలే జరిగినట్లు గుర్తు .. పాత చెప్పులు గట్రా
గజమాలలతో!'
'చెప్పు పడ్డంత మాత్రాన గొప్పతనమేమన్నా తరుక్కుపోతుందా
బాబాయ్! ఆ మాటకొస్తే ఇప్పుడున్న వాళ్లల్లో
చెప్పు రుచి చూడకుండా పెద్ద నేతలుగా ఎవరెదిగారో చెప్పు?'
'సర్సరే! ఇప్పుడీ పాత చెప్పుల పురాణాలెందుగ్గానీ.. నువ్ చెప్పాలనుకొనే కొత్త కహానీ ఏదో చప్పున చెప్పెయ్! పనికొచ్చే
పనులు నాకవతల ఇంకా చాలా ఉన్నాయ్!’
'ఆ మాధుర్ చౌధురి గూరూగారే అప్పట్లో పన్లో పనిగా ప్రేమ పేరుతో
ఓ పార్టీ కూడా పెట్టేసి ‘ఆఠిన్ ‘ గుర్తుతో హడలెత్తించేసాడు జనాలందర్నీ! రాబోయే ఎన్నికల్లో
మేమూ అదే మోడల్లో మరో ‘రతీ మన్మథుల రాజ్యం’..
సింపుల్ గా ‘ర.మ రాజ్యం’ పార్టీతో ఓటరు దేవుళ్ల గుండెలు కొల్లగొట్టబోతున్నాం!'
'ఊఁ.. కానీయండి మరి! ఎన్నికల జాతర్లు కనుచూపు మేరలో ఉండె.
ఇట్లాంటి గారడీలు ఇంకెన్ని చూడాల్నో! ఇన్నాళ్ల బట్టి జనాల గోడు అసలు పట్టించుకోనోడు
కూడా.. పరగడుపునే పక్క దూకొసొచ్చేసి హఠాత్తుగా ఇట్లా ఝడివాన ప్రేమల్తో జడిపిస్తుంటే
తడిసి ముద్దయేందుకు జనాలేమన్నా ‘సి’ సెంటర్ కెళ్లి సినిమాలు చూసే పిచ్చికుంకలట్రా నాయనా! బడా బడా నేతలు.. బడబడవాగే అధినేతలకే చుక్కలు చూపించే తెలివి తేటలు
ప్రదర్శిస్తున్నారీ మధ్య.. చూట్టంలా!'
'బాబోయ్! టీవీ చర్చా కార్యక్రమాల్లో మాదిరి ఆ ముతక భాషేంటి బాబాయ్..
ఇంత వయస్సు మీద పడిం తరువాత కూడా! షష్టిపూర్తి చేసుకున్న పెద్దమనిషివి.. నీకే మనసులో ఇంత
పులుసు పొర్లుతుంటే.. ఇహ కోడెవయసు మీదున్నోళ్లం.. మేం మాత్రం దున్నపోతులకు మల్లే
మీద వాన పడ్డా నోర్మూసుకొనుండలేం కదా!’
'నా సంగతులు ఇప్పుడెందుగ్గానీ.. మీ ప్రేమ పార్టీ ఊడబొడిచే
ఘనకార్యాలేంటో ముందవి టూకీగా విప్పి చెప్పిపోరా
బాబూ.. నన్నవతల మీ పిన్ని పిలుస్తోందీ!'
'దేశాన్నిప్పట్లో పట్టి పీడించే ప్రధాన దేభ్యాలేంటి.. ఐ మీన్ సమస్య;లు?'
‘మహా భారతం
మొత్తం పది ముక్కల్లో పూర్తిగా చెప్పమన్నట్లుంది నీ చమత్కారం. ‘అ’ ఫర్ ఆవినీతి.. ‘ఆ’
ఫర్ ఆశిత్రులకు ఫర్.. ‘ఇ’ ఫర్ ఇష్టారాజ్యప్పాలన..
‘ఈ’ ఫర్ ఈశా అల్లా ఏసులు అంటూ తన్నులాటలు! ఇట్లా ‘బండి రా’ దాకా ప్రతి అక్షరానికో వంద
చొప్పున అవకతవకలు తడువుకోకుండా ఏకరువు పెట్టేయచ్చు. ఈ పీకులాటలేవీ వద్ద<టె..
టూకీగా ఓ టూ వర్డ్స్ల్ లో . కూడూ.. గూడూ!’
'ఒకే ఒక్క ఓటుతో ఆ రెండు ప్రారభ్దాలను పటాపంచలు చేయబోతోంది
బాబాయ్ మా రతీ మన్మథుల రాజ్యం పార్టీ! ప్రణయాలకు ఆకలి
దప్పికలుండవంటారు కదా! తిండి తిప్పలనేవి ఇహ సమస్యలుగానే ఉండబోవు మా ‘ర.మ’ రాజ్యం పాలనలో. రూపాయిక్కిలో బియ్యం,
పండగ పబ్బాలొచ్చి పడ్డప్పుడు ఆ అన్న సంచీ, ఈ అయ్య ముల్లె అంటూ ఉప్పు పప్పులు పంచే
నక్కజిమ్మిక్కులేమీ చెయ్యనక్కర్లేదు. తాగు నీరో.. సాగు సీజనుకు సరిపడా
నీరో.. అంటూ ఉన్న కుంచెడు గుంతల్లో నీటి వాటాల కోసం గడ్డపారల్తో కొట్టుకు చచ్చే
సీన్లుండవు. ముందెప్పటికో పొదల మాటున చేరి చేసుకునే శృంగార కార్యకలాపాలకని ఇప్పట్నుంచే చెట్లు
చేమలంటూ రోడ్ల పక్కన అట్లా పడీ పడీ మొక్కలు పాతుకొనే చెత్తపథకాలుండవు. ప్రేమలో పడ్డోళ్లంతా
ఎదుటి వాళ్ల గుండెల్లో కాస్తింత చోటు దక్కితే అదే.. పెద్ద ఆస్తిగా భావిస్తారు కదా!
ఇంకీ గులాబీ రంగు డబుల్ బెడ్రూంలు, పసుప్పచ్చ కలర్ ఒంటి స్తంభం మేడలు అనే రాష్ట్ర
పథకాలకు, సర్వం సత్వరం కమలమయం అయిపోవాలన్న కేంద్రం పెద్దల ఆవాస
యోజన ఆయాసాలకు వీసమెత్తైనా విలువుండదు. ప్రేమలో పడ్డవాళ్లకి మన మామూలు భాషల్తో బొత్తిగా పని నడవదు కదా!
వాళ్లవన్నీ మూగ సైగలు! సింగర్ సైగల్ కాలం నాటి
బొంగురు గొంతు పాటలు! ఆ మూలుగు
సంగీతం కేసెట్లో నాలుగు సూటుకేనులకు పోసి
ప్రజలకిచ్చేస్తే సరి! ఇహ ఏ ‘సతారా. బెళగావుఁ’ మార్కు భాషా సమస్యలకు తావుండదు. తమిళమా.. తెలుగా.. ఏది
అతి ప్రాచీన భాష? అన్న కీచులాటలన్నీ పక్కన పెట్టేయక తప్పదు. దేశమంతటా అప్పుడు
వాడుకంలో ఉండేది ఒకే ఒక భాష. అదే ఆడమ్
అండ్ ఈవ్ పుట్టుకతో పాటు పుట్టుకొచ్చిన రిమ్మతెగులు ఘోష. అదే అత్యంత ప్రాచీనం.. అంతకన్నా అధునాతనమైన
భాషయినప్పుడు మరాఠీవాడికి, బీహారీబాబుకి
మధ్యన ఇహ ఏ పనికిమాలిన పొరపొచ్చలకు
టైముండదు, త్యాగం మినహా మరేదీ కోరదు కదా అసలు
సిసలు ప్రేమ! జనాలను కొల్లగొట్టి తరాలకు సరిపడా కూడబెట్టుకొనే తాపత్రయం దానంతటదే
పెద్ద ప్రయత్నమేం లేకుండానే పెద్దమనుషుల మనసుల్లో నుంచీ సులువుగా తుడిచిపెట్టుకుపోతుంది. మా ప్రేమరాజ్యం
స్వర్ణయుగం పాలనలో కుంభకోణమంటే జనలాలకు
తటాలుమని తట్టేదిహ తమిళనాడు తాలూకు ఊరు
పేరు ఒక్కటే! ప్రస్తుతం పాలిటిక్సులో ప్రతీ క్షణం మోతెక్కిపోతోన్న కుంభకోణాల ఊసులకు ఇహ ఆస్కారమే ఉండదు. వారసులే దేశాన్నేలుతున్నారన్న
రుసరుసలు ఇహ ఏ సైడు నుంచి వచ్చినా ఓటరు చెప్పుతీసుకోడం ఖాయం. నిజంగా పెద్దపండుగే
కదా బాబాయ్.. వెన్నుపోట్లు, వెన్నముద్దలు రాయడాలన్నీ ఇహ గత పాలకుల ఖాతాలల్లోనుంచి హఠాత్తుగా నిద్ర
లేచొచ్చే పిశాచాలయి
బక్కజనాలని పీక్కుతినకపోతే! రతీ మన్మధుల రాజ్యం పార్టీ
లక్ష్యం విస్తరించే కొద్దీ 'అది కావాలి.. ఇది కావాలి'
అనే డిమాండ్లు వాటంతటవే అణిగిపోతాయ్. పై పెచ్చు 'ఇదిచ్చేస్తాం.. అదిచ్చేస్తాం! పుచ్చుకోకుంటే చంపి పాతరేస్తాం' లాంటి త్యాగనినాదాలే కర్ణభేరులదిరి పోయేలా మిన్నుముట్టేస్తాయి. మీరు కోసే రామరాజ్యంలో కూడా సాధించలేనన్ని ఇంకెన్నో
మహాద్భుతాలు మా ‘ర.మ రాజ్యం’ పాలనలోకొస్తే సులువుగా సాధించుకోవచ్చు బాబాయ్! ఇప్పుడు జరిగే హక్కుల పోరాటాలన్నీ ఠక్కుమని
ఒక్కసారే చెట్టెక్కేస్తే.. ధర్నా చౌకు వెనకున్న తుప్పలన్నీ నిర్మానుష్యంగా
మారిపోతాయ్ గదా! అక్కడి ప్రతీ అంగుళమూ
ప్రేమ పక్షులకు కేటాయించేటందుకు సులువవుతుంది. ప్రేమ మాత్రమే తప్పించి పగ, కక్ష,
కార్పణ్యాల్లాంటి దుర్లక్షణాలేవీ మచ్చుక్కైనా
కంటబడని ఆ భయంకరమైన శాంతి భద్రతల అదుపుకు నీ లాంటి సీనియర్ సీజనల్ పొలిటీషియన్సు గుండెలు పాపం..
తట్టుకుంటాయో .. లేదో! వుయ్ పిటీ యూ బాబాయ్స్!'
'గురజాడగారి గిర్రాయి టైపు లెచ్చర్ల తంతును మించిపోతోందిరా
నీ వాగ్ధాటి రోజు రోజుకీ! ఇన్నేసి న్యూసు పేపర్లు, ఇంతలేసి
న్యూసెన్సు టీవీ ఛానల్సు
క్రమం తప్పకుండా చూసే నాకే నిర్గుండె పడేటట్లుందే నీ భావి భారత రాజకీయ ఊహా చిత్రం చూసి! ఇహ తన మానానికి తాను కామ్ గా తిని తొంగునే ఆమ్ ఆద్మీగాడి పని! మీ ప్రేమపిచ్చోళ్ల
ధాటికి ఎట్లా తట్టుకుంటాడో ఏంటో.. పాపం! ఐ పిటీ ది ఓటర్! మూవీ, టీవీ మార్కెట్ల రేటింగులకంటే ఈ ప్రేమలూ.. దోమలూ ఓ.కే!
మూడు పూటలా మెక్కేందుకింత కూడు.. మంచమెక్కి తెల్లారే దాకా తొంగునేందుకు ఓ జానెడు
గూడు ఉంటే చాలు.. అబ్బో అదే ఓ పెద్ద భూలోక స్వర్గమని సంబరపడే బక్కోళ్లకు ఈ ప్రేమల,
చీమల పార్టీలెందుకబ్బీ.. చీదర పుట్టించడానిక్కాకపోతే!
పిచ్చాళ్లందరినీ మదపిచ్చాళ్లుగా మార్చేసి మీ పబ్బం గడుపుకునేందుక్కదూ మీరీ
తిమ్మిరి పార్టీలన్నింటినీ తెర ముందుకు తెస్తున్నదీ? హన్నా.. ఏం.. ఎత్తిగడల్రా!
స్నేహాలూ.. ప్రేమలూ.. అంటూ సొంత పాలిటిక్సుకి ఇన్ని కలర్సా!’
'ఏళ్ల బట్టీ బూర్జువా పార్టీల తత్వం బాగా వంటబట్ట బట్టి నీ బోటి ముసలి డొక్కులకి
ప్రేమంటే ముందులో కాస్తంత డోకేలే బాబాయ్! బట్ వుయ్ డోంట్ కేర్! బోల్డుగా చెప్పాలంటే
నేటి తరానికి మా ‘రతీ మన్మథుల రాజ్యం’ దే ది బెస్ట్ మ్యానిఫెస్టో! ఇప్పుటి పార్టీలన్నింటివీ ప్రాంత, కుల.
రాజకీయాలకు పక్కలు పరిచే ఫీట్లే! కులం కత వదిలేయ్.. అసలు ఉపకులం ఊసైనా ఎత్తకుండా మంత్రాంగం నడపలేనంత
నిస్సత్తువలో ఉన్నాయ్ బాబాయ్ మీ మహా మహా పెద్ద పార్టీలే! ప్రేమజీవులకు అసలు కుల
మతాలనే సతమతాలే ఉండవు. జాతి అడ్డూ ఆపుల్లేకుండా పురోగమించాలంటే మా రతీ మన్మథుల రాజ్యం పార్టీ లక్ష్యాలే
చివరికి గతి. అన్ని ప్రభుత్వాల ముందూ మేం పెట్టుకున్న మహత్తర మహజర్లకు అతీ గతీ లేనందునే ఇప్పుడీ రతీ
మన్మథ రాజ్యం పార్టీ పురుడుపోసుకుంది’
'అవునా! ఏంటబ్బీ మరీ
అంత మహత్తరమైన మీ మహజర్ల విశేషాంశాలు?'
'ప్రేమ కోసం జీవితాలను ఫణంపెట్టిన అమర జీవులు దేవదా, పారు; ఏంటొనీ క్లియోపాట్రా; సలీం అనార్కలి. ఆ అమర
జూవుల విగ్రహాలని పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్టించమని మొత్తుకున్నాం.
పసివగ్గులక్కూడా ప్రేమకథలను ఉగ్గుపాలతో రంగరించి మరీ గొంతులో పోయాలని గగ్గోలు పెట్టుకున్నాం.
సిగ్గు ఎగ్గుల్లేకుండా ప్రేమించుకోవాలంటే ప్రాధమిక దశ నుంచే లైలా మజ్నూల్లాంటి లవ్
బర్డ్స్ చరిత్రలు పాఠ్యప్రణాళికల్లో చేర్చించమని చెవినిల్లు కట్టుకుని మరీ పోరాం. ప్రేమ కథాచిత్రాలను మాత్రమే నిర్మించే విధంగా
సినిమాటోగ్రఫీ చట్టాలలొ సవరణలు చేపట్టమని వినతి పత్రాలు వేలు ఇచ్చుకున్నాం.
ప్రేమను కించపరిచే ఏ కళారూపాన్నైనా పర్మినెంటుగా బహిష్కరించే సెక్షన్లు ఐ.పి.సి కోడుల్లో తక్షణమే చొప్పించాలని పెద్ద
పెద్ద తలకాయలతో కూదా చెప్పించాం. ప్రేమ విరోధులకు విధించే శిక్షలు ప్రణయద్వేషులందరికీ
వణుకుపుట్టేటంత కఠినాతి కఠినంగా ఉండాలని అనేకమైన పర్యాయాలు అప్పీళ్లక్కూడా వెళ్లివచ్చాం. . ప్రేమ వివాహాలను ప్రభుత్వాలే స్వంత ఖర్చుతో
భారీగా నిభాయించాలని నివేదించుకున్నాం.
ప్రేమపక్షుల విహారానికి అనుకూలమైన స్థలాలను ప్రభుత్వాలే సమీకరించాలని. వాటిని ప్యారిస్ పార్కులని తలదన్నే పొదరిళ్ల
మాదిరి అభివృద్ధి పరచాలని ఎంతగానో
పాకులాడాం. విఫలప్రేమికులకు సరికొత్త
ప్రేమికులు దొరికే వరకు ప్రభుత్వాలే 'వియోగభత్యం' కింద మందూ.. మాకూ ఖర్చులకని నెల నెలా ఇంతని చెల్లించాలన్న డిమాండ్లకయితే
లెక్కేలేదు. ప్లాపైన ప్రేమ చిత్రనిర్మాతలకు ఉద్దీపన పథకాలు.. రేంటింగు తగ్గిన
ప్రేమ సోపులకు భారీ సబ్సిడీలు
కేటాయించాలని ప్రతి బడ్జెటుకు ముందు
ప్రతిపాదనలు పంపించాం. పునః ప్రేమకు తాము చేసే సర్వ ప్రయాసలు పునః విఫలమై, పూర్తి విరక్తితో ఆత్మాహుతులకు తలపడితే .. సదరు విఫల ప్రేమికులు దూకి
చచ్చేటందుకు సరిపడా లోతైన కాలువలు, బావులు
తవ్వించాలని.. తల పెట్టుకుని పడుకునేందుకు
ప్రత్యేక రైలు పట్టాలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన రైళ్లను వేళకు ఆ ట్రాకుల మీదుగా పోయేలా ఏర్పాట్లు చేయాలని,
ప్రేమికుల చేత పళ్లు రాలగొట్టించుకొనే ఔత్సాహిక ప్రేమికుల దంత చికిత్సలకు గాను వెంటనే
ప్రత్యేక 'ప్రేమశ్రీ' వంటి ఆరోగ్యపథకాలు ఆరంబమవాలని ఎంతగానో ఆరాటపడ్డాం. లాస్ట్ బట్ నాట్
ది బెస్ట్ డిమాండ్ బాబాయ్! నూతన ప్రేమికులకు పరిమితుల్లేని ఉచిత సెల్ ఫోన్ కాల్స్
సౌకర్యమైనా కల్పించాలని ఎంతగా కృషిచేసామో!
ఊహూఁ! ఒక్క
అధికార పార్టీ అయినా మా మొరల్లో ఒక్కటైనా ఆలకిస్తేనా? అందుకే ఇప్పుడీ రతీ మన్మథుల రాజం
పార్టీ పుట్టుకొచ్చింది! మా ర.మ రాజ్యం పార్టీ గాని రాజ్యంలోకి వచ్చేస్తే ఆ అద్భుతాలనీ మనకు మనమే ఇంచక్కా చెసుకొవచ్చనేదే మా
ఆలోచన’
'బాగుందిరా అబ్బాయ్ నీ ప్రేమ పార్టి సంబడాలు. కానీ నాదో బుల్లి సందేహం. ఈ ప్రేమా.. దోమా.. వాలకం చూస్తుంటే ఇదేదో మొన్నటి గురువారం నాటి
ప్రేమికుల దినోత్సవ తర్వాతనే వచ్చిన పూనకంలా ఉందే! మరా రోజు నుంచే
మీరీ పార్టీ అట్టముక్కలూ.. జెండా గుడ్డపీలకలు పట్టుకు రోడ్ల మీదకొచ్చి
ఇంచక్కా చక్కర్లు కొట్టొచ్చు కదా! మధ్యలో ఈ రెండు రోజుల సందూ ఎందుకు తీసుకున్నట్లో?!'
'అర్థమవుతానే ఉందిలే బాబాయ్ నీ మాటల్లోని పెడర్థాలు1 మాది మీ లాంటి 'కావలి కుక్కల' బాపతు పార్టీలు కావు. కావలింతల పార్టీ. ఎవర్ని ఎప్పుడు
ఎక్కడ ఎంత గాఠ్ఠిగా వాటేసుకోవాలో.. ఎవర్ని ఎట్లా చూసీ చూడనట్లుగా దులపరించుకు 'అలా ముందుకు పోవాలో' .. ఆ ప్లానింగూ పాడూ కోసం ఈ ఒక్కింత ఆలిసం ..!'
'కొయ్!.. కొయ్
రా నా రాజా! ప్రేమికుల రోజునే మీరిట్లా అట్టముక్కలు, గుడ్డపీలికలు పట్టుకుని ఏ పార్టీలోకో దొడ్డిగోడ గుండా
చీకట్లో దూకుతూ పట్టుబడిపోతే ఆ భజరంగ భళులా, రాంబంటు దళాలా.. ఆ
గుంపులేవో నిజంగానే మీ రెండు పార్టీలకీ అక్కడికక్కడే పబ్లిగ్గా పొత్తులు
కరిపించేసి కొంపలు ముంచేస్తాయన్న బెంగ కదట్రా నాయనా..
నిజంగా చెప్పు! హ్హా.. హ్హా.. హ్హా! ప్రేమల పార్టీ ఒహ
వైపూ! దొంగప్రేమల పార్టీలు మరో వైపూ! ఇద్దరి మధ్యన ఒరకాటంలో పడి చచ్చేది మాత్రం పాపం.. మనసులో ఏముందో బైటికి గాట్టిగా చెప్పుకునే పాటి శకైనాలేని
మన స్వతంత్ర భారత పౌరుడు! ఏడు దశాబ్దాల బట్టి ఇదే కదా మన ప్రజాస్వామ్యం
కథా! ఐ పిటి దిస్ నేషన్స్ ఓటర్.. రా నిజం చెప్పాలంటే అబ్బిగా!’
***
-జి.ఎస్.దేవి
(సూర్య దినపత్రిక ఆదివారం (17 -02 -2019) సంపాదకీయ పుట వ్యంగ్యం)
No comments:
Post a Comment