కథలు- సినిమా కతలు
-కర్లపాలెం హనుమంతరావు
ఇప్పుడంటే వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా సినిమాలమీదకు దృష్టి సారించడం లేదు. కానీ.. ఒక దశాబ్దం కిందట సినిమాలే ప్రపంచంగా.. సినిమా ప్రపంచంలో చెడ తిరిగిన వాడిని. 'చెడ' తిరగడం సినిమా జీవులకు ఉండవలసిన ప్రధాన లక్షణం.
బుద్ధిమంతులు ఇంట్లో.. గదిలో ఓ మూల చేరి ప్రశాంతంగా .. ఏ అర్థరాత్రో.. ఆపరాత్రో.. ఎన్నికాగితాలూ.. కంప్యూటరు బైట్లు ఖరాబు చేసుకున్నా . అడిగే నాథుడు ఉండడు. సినిమా రచయితకు అలా కుదరదు. క్లాప్ బాయ్ నుంచి.. దర్శకుడిదాకా అందరూ 'నాథుళ్లే'. ఎవరికి వాళ్ళు వాళ్లను 'శ్రీనాథుళ్ల'ను కోవడం సినీజీవుల విలక్షణత. రావిశాస్త్రిగారినో సారి సినీ కథ రాసేందుకని మద్రాసు తోలుకెళ్లారు తెల్సీ తెలియని అమాయకులెవరో తిరిగొచ్చిన తరువాత కొత్త అనుభవం ఎలా ఉంది శాస్త్రిగారూ?' అనెవరో అడిగితే 'బాఁనే ఉంది. జల్సాగా కూడా ఉంది. మన భోజనానికి మన ఖర్చు లేదు. మన మందుకీ మనం ఖర్చు అక్కర్లేదు. మన పసందు ఏదైనా సరే మనం అచ్చుకోనక్కర్లేదు. మన పన్లేవీ మన చేత చేయనివ్వరు.. చివరికి కథ కూడా..' అనేసారు.
ఈ కాలంలో అచ్చుపత్రికల్లో కథల పేరుతో వచ్చే రాతలకే ఏ 'ఏకతా'సూత్రం అతకడం లేదు. ఏ కతకైనా 'ఏకత'(Unity) అవసరమని SYD FIELD అనే పెద్దాయన 'Screenplay' అనే పుస్తకంలో సిద్ధాంతం చెబుతాడు. The Foundations of ScreenWriting పేరుతో పడీ పడీ 300 పేజీల ఉథ్గ్రంథమోటి రాస్తూ బుర్రను తొలిచే పురుగును .. ఫైనల్ గా మిణుగురు పురుగు మాదిరి ఎలా మెరిపించచ్చో స్టెప్ బై స్టెప్ లెక్కలాగా సాధికారికంగా వివరిస్తాడు. హాలీవుడ్లో చిత్రాలు ఈ సిడ్ ఫీల్డ్ సూత్రాలమీద ఎంతవరకు తయారవుతాయో తేల్చడం అంత తేలిక కాదు. కానీ.. హాలీవుడ్ స్థాయి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలందించాలని కలవరించే వెర్రి సజ్జంతా కనీసం ఒక్కసారైనా ఈ పుస్తకం అట్టను తడిమి లోపలేం రాసుందో తెల్సుకుంటే లాభమే కానీ.. వచ్చే నష్టమేమీ ఉండదు.
కథను తెరకు అనువదించడం ఒక శాస్త్రం. శాస్త్ర ప్రకారం చేయడం అపాయకరమని మొదట్నుంచీ మన తెలుగువాళ్లకెందుకో ఒక అపనమ్మకం. (ఇప్పుడు కాస్త పరిస్థితి మారిందంటున్నారు). హాలీవుడ్డో. కొరియన్ ఫుడ్డో..వాళ్లు అష్టకష్టాలూ పడి వండుకున్న వంటకాల్ని దొంగతనంగా ఎత్తుకొచ్చి ఎంగిలి పడ్డం మన రచయితలకో థ్రిల్లు! 'లోకో భిన్న రుచిః ' అన్న సూత్రంలోని మాయమర్మం కాస్తయినా వంట పట్టిన రచయిత 'నేటివైజేన్' టెష్టులో 'సి'గ్రే డైనా సాధిస్తాడు. అదీ కుదరని 'మక్కీకి.. మక్కీ' కుక్కింగు రాయుళ్ళు- నమ్ముకొని రంగంలోకి దూకిన దిగిన నిర్మాతల్ని నట్టేట ముంచేస్తారు. మరో సినిమా తీయడం ఆనక.. బెజవాడ బస్టాండులో మిరబ్బజ్జీ బాండీ వేసుకునే స్థాయికి తీసుకు రాఅకపోతే అక్కడికి అదృష్టవేఁ!
హాలీవుడ్డు కయినా.. బాలీవుడ్డు కయినా.. టాలీవుడ్డు కయినా.. అతకడాలు.. అతక్క పోవడాలంటూ ఉండవు. సిడ్ ఫీల్డు స్క్రీన్ రైటింగు పాఠాలు ఒక్క హాలీవుడ్డు మేథావుల చెవుల్లో ఊదిన గాయత్రీ మంత్రాలేవీఁ కాదు. ఊహా మాత్రంగా మెదడులో మెదిలిన ఆలోచన తెరమీదో కావ్యంగా కనిపించేందుకు జగమంతా ఒకే విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. కథానిర్మాణం వెన్నెముక కూర్పయితే కథలోకి జీవం తేవడం సృజనాత్మకతకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. సిడ్ ఫీల్డుకైనా.. రాబర్డ్ మెక్ కైనా.. సిద్ధాంతం బుర్రకెక్కించడం వరకే పరిమితం! స్పీల్ బర్గో.. చక్రపాణో కావడం మేథస్సుకు సంబంధించిన చమత్కారం.
తెరమీద కదిలే కథకి.. తెర వెనక ఎంత కథ నడవాలో వివరించే సిద్దాంతం స్క్రీన్ ప్లే! వాస్తవానికి అనుభవ పూర్వకంగా సాధించవలసిన యోగం. ఈదే నైపుణ్యం నేర్పే పుస్తకాలుండచ్చేమో.. కానీ.. ఈదడానికి మాత్రం ఎవరి రెక్కలు వాళ్లకే సాయం రావాలి' . సినిమా కథ తయారీకి కూడా సరిగ్గా అతికేదీ మార్క్ ట్వైన్ సూక్తి. కాకపోతే పుస్తకాలలో మనం చదివే కథలకి.. తెరమీద మనం చూసే కథనాలకీ నిర్మాణ సిద్ధాంతంలో ఆట్టే తేడా లేదు. మనసును రంజింపచేసే ఈ రెండు ప్రక్రియల్లో ఉండేది ఒకే సామాస్య నిర్మాణ సూత్రం. చదువరులకి.. వీక్షకులకి ఆ మర్మాలు అనవసరమేమో గానీ.. కథానిర్మాతలకు ఈ లోతు పాతులన్నీ కాకపోయినా .. కొన్నైనా తెలిసుండాలి కదా! వడ్డించినన భోజనం ఆరగించే మనిషికి అనుపాకాల తయారీతో సంబంధమేముంటుంది. భోక్తకు కావల్సింది రుచి. రుచికరంగా వండటమెలాగో తెలుసుకోవాల్సిన ధర్మం వంట చేసే మనిషిది. వంటమనిషికి కథలు రాసేవాళ్లకి ఒకే సూత్రం. ఆ సూత్రాలు తెల్సుకునేందుకైనా కొన్ని సిద్ధాంత గ్రంధాలమీద మనసుంచి అవపోసన పట్టాలి.
సిడ్ ఫీల్డ్.. రాబర్ట్ మెక్ లాంటి అనుభవజ్ఞులైన చలనచిత్రకథాశాస్త్రజ్ఞులు స్క్రీన్ రైటింగుకి సంబంధించిన సిద్ధాంత గ్రంథాల్లో చెప్పిన పాఠాలన్నీ అందుచేతనే.. ఔత్సాహిక సినీకథా రచయితలకు.. కథారచయితలకు.. ఒకే విధంగా ఉపకరించే పాఠ్యగ్రంథాలని నా ఉద్దేశం.
నేను సినిమారంగంలో క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో చదివిన కొన్ని పుస్తకాలుః
నేను చదివిన కొన్ని పుస్తకాలు
1.SYD FIELD /SCREENPLAY
2.ROBERT MckEE/ STORY-
substance, structure, style, and the principle of screenwriting
3.తెలుగు సినిమా సాహిత్యం- కథ , కథనం, శిల్పం- డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణఉస్మానియా విశ్వవిధ్యాలయం నుంచి పి.హెచ్.డి పట్టా పొందిన సిద్ధాంత గ్రంథం
4.సినిమా స్క్రిప్టు రచనా శిల్పం- చిమ్మని మనోహర్
No comments:
Post a Comment