అఖిలభారత తెలుగు రచయితల 2వ మహాసభ 1963, జనవరిలో
రాజమండ్రిలో జరిగిన సందర్భంలో ఒక సావనీర్ తెచ్చారు.సుమారు
200పేజీలకు పైనే ఉంటుందా ప్రత్యేక సంచిక. పి.వి.నరసింహారావు గారు "ఉన్నత
లక్ష్యాలతో రచనలు సాగించాల"ని ఉద్భోధిస్తూ చేసిన ప్రసంగపాఠం ఉందందులో. విశ్వనాథవారి
నుంచీ కాశీ కృష్ణమాచార్యుల వారి దాకా... మధునాపంతుల, సినారె,
సోమంచి యజ్ఞన్నశాస్త్రి, దాశరథి, తిలక్, మధురాంతకం, సంపత్కుమార,
పిలకా, పురిపండా వంటి ప్రముఖుల వ్యాసాలు, రచనలు ఎన్నో ఇందులోకనిపిస్తాయి.
ప్రముఖ విమర్శకులు శ్రీవాత్సవ- వర్ధమాన రచయితలను ఉద్దేశించి లేఖారూపంలో ఒక మూడుపుటల చక్కని రచన చేశారు. ఆ వ్యాసం మొత్తాన్నీ మళ్ళీ ఇక్కడ ప్రస్తావించడం కుదరదు కాని… కొత్తగా రచనలు చేసే ఔత్సాహికులకు ఈ నాటికీ పనికొచ్చే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి.కొన్ని భాగాలను క్లుప్తంగా ఇస్తాను.చూడండి!
రచయితలు అష్టకష్టాలుపడి రాసిన తమ రచనలకు ఎందుకో(బహుశా సరదావల్లో..మోజుతోనో) కలంపేర్లు పెట్టుకుని ప్రచురించుకుంటుంటారు.
మళ్ళా ఆ రచన ప్రచురింపబడ్డప్పుడు ఆ రాసింది తామే అని నలుగురికీ తెలియచెప్పటానికి
నానాతంటాలు పడుతుంటారు. ఇంచక్కా సొంతపేరుతో ప్రచురించుకుంటే ఈ తిప్పలుండవు కదా అని
శ్రీవాత్సవ అభిప్రాయం. సరే..అదేమంత పెద్ద విషయం కాదుకానీ…కాస్త
అలోచించదగిన సంగతులు ఇంకా కొన్నున్నాయి.
సాధారణంగా రైళ్ళలోనో..బస్సుల్లోనో ప్రయాణంచేస్తూ ప్రేమలో
పడిపోయే మధ్యతరగతి యువతనో, నిత్యనీరసంగా ఉండే
సతీపతికుతూహల రహస్యాలనో ఇతివృత్తాలుగా తీసుకుని కాలక్షేపం రచనలు చేస్తే వచ్చే ప్రయోజన
మేముంది? అంటారు శ్రీవాత్సవ. మన చుట్టూ... జీవితాలతో నిత్యం సంఘర్షిస్తూ అంతులేని
పోరాటం చేసే జనావళి అశేషంగా కనపడుతుంటే వాళ్ళ
జీవితాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడో..ఎప్పుడో.. కదాచిత్ గా కనిపించే అసాధారణమైన
అద్భుత సంఘటనలను గ్లోరిఫై చేసే రచనలు చేయడం ఎంతవరకు సబబు? అలాంటి
రాతలు తాత్కాలికంగా సంతృప్తినిస్తాయేమో గానీ.. కలకాలం నిలిచుండేవి మాత్రం కావు.
మరీ ముఖ్యంగా మనలోని కొందరు రచయితలు అవినీతిని ఆకర్షణీయంగా
చిత్రించే ధోరణికీ పాల్పడుతుంటారు. మనచుట్టూ ఇంత అవినీతి పెరిగిపోతూ…సామాన్యుడి బతుకును అతలాకుతలం చేస్తుంటే..అదేమీ పట్టించుకోకుండా…సంఘాన్ని మరింత దిగజార్చే
నిమ్న వాంచల్నీ, నికృష్ట తత్త్వాల్ని, దుర్మార్గాన్నీ, దుర్నీతినీ, సౌఖ్య
వాంచల్నీ,
కామోద్రేక్తలనీ సమర్ధించే సమ్మోహన విద్యను రచయిత ఉపయోగిచడం ఎంత వరకు ధర్మం?
రచయిత అన్నవాడు మనసులో దాగున్న మధురాత్మను మేల్కొలిపి మహనీయ కార్యాలు
చేయడానికి పురికొల్పే స్థితిలో ఊండాలి. మంచి రచనలతో మనిషిలోని
మంచితనాన్నితట్టి లేపవచ్చు.
కవిత చెప్పినా, కావ్య మల్లినా, పాట పాడినా, పద్యం పలికినా, కథ వినిపించినా.. మానవతలోని తరగని విలువలను
పైకి తీసేవిగా ఉండాలి. పదిమందీ పదే పదే పలుమారు తలుచుకునే రీతిలో రచన సాగాలంటే.. మన ముందు తరం రచయతలు తొక్కిన దారేమిటో తెలుసుకోవాలి. ఆ దారిలో మనం నడుస్తే.. మన అడుగుజాడలు తరువాత తరం వారికి
అనుసరించేవిగా ఉంటాయి…అంటున్నారు- ఆ లేఖలో శ్రీవాత్సవ.
ఈ రచన చేసి ఇప్పటికి సుమారు అర్థశతాబ్దం గడిచిపోయింది. ఈ కాలానికీ శ్రీవాత్సవ చెబుతున్న విషయాలు
కొత్త రచయితలు సరిగ్గా అతికినట్లు సరిపోతుండటమే.. ఆశ్చర్యం.. బాధా కలిగించే విషయం.
కదా?
-కర్లపాలెం హనుమంతరావు
24 -01 -2020
బోథెల్, వాషింగ్టన్ స్టేట్, యూ.ఎస్.ఎ
No comments:
Post a Comment