Saturday, January 4, 2020

ఉల్లికి కన్నీళ్ళు -కర్లపాలెం హనుమంతరావు - సరదాకే



కోస్తే కన్నీళ్ళు తెప్పిస్తుంది. సరే కొయ్యక ముందే కన్నీళ్ళు తెప్పించే గడుసుదనం కూడా కూటి కూరగాయలన్నింటిలో ఒక్క ఉల్లిపాయకే ఉంది. క్రీస్తు కన్నా ఐదువేల ఏళ్ల ముందు పుట్టింది. మనిషి మా బాగా రుచి మరిగిన ఆహార దినుసులలొ ఉల్లిది  అత్యంత ‘ప్రియ’మైన స్థానం! ఆ ప్రియమైన ఉల్లి ‘ప్రియం’
అయినందుకే లొల్లి.

దేశవాళీ ఉప్పుతో స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆత్మాభిమానం మనది! స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు ఉల్లిగడ్డ విదేశీ
గడ్డ నుంచి దించుకుంటే తప్ప  వంటింటి పొయ్యిలోని పిల్లి లేవనంటోంది! ఉల్లికే కన్నీళ్ళు తెప్పించే ఈ లొల్లి ఇంకెన్నాళ్లో కదా మరి?

ఉప్పు లేని కూర చప్పగా ఉన్నా అదో పెట్టు. ఏ రక్తపోటు జబ్బు దాపురించిందనో సర్దుకోడం కద్దు! ఈ ఉల్లి సిగ దరిగిరి! ఒక్కసారి గాని దీని రుచి
మరిగితిరా! ఎన్నిమాయదారి రొప్పులు వచ్చిపడ్డా.. కోసే వేళ కన్నీళ్లుకోసుకొనే అవకాశం లేని వేళా కన్నీళ్లే!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదని వినికిడి. ఆ నానుడి తెలుగువాడి నాలుక మీద పడి యుగాల బట్టి  నానుతూనే ఉంది. 'వాహ్వా.. ఎంత రుచి!' అంటూ సన్నాసుల జిహ్వ సైతం  చాటుగా  పాడుకొనే ఉల్లి సంసారుల అహారానికే కాదు.. అల్పాహారానికీ తప్పనిసరి దినుసు అవడమేట.. ఇప్పటి ఇబ్బందులన్నింటికి ముఖ్య కారణం! పాలకుల పరిహాసాలకి.. జనం సంగతి  సరే.. ఉల్లికే ముందు కన్నీళ్లు  వరదలై  పారే పరిస్థితి!

రాతి యుగం నాటి మనిషికి రోటీలో ఉల్లిపాయ రోటిపచ్చడి కలిపి తినే యోగం ఎటూలేకపోయింది! రాగియుగం నాటి శాల్తీలకు మల్లే  రోజూ రాగి సంకటిలో ఇంత ఉల్లి తొక్కు  నంజుకు తినే లక్కు నేటి మనిషికి కరువుతోంది. మనిషి నాలిక రుచి చూసి ఎన్నాళ్లయిందోనని ఉల్లికే కన్నీళ్ళు కాలువలయ్యే దుస్థితి. 

గుండ్రంగా చెక్కులు తీసి మరీ పింగాణీ పేట్లలో  వడ్డిస్తుంటారు కదా  ఉల్లి ముక్కలు  స్టార్ హోటళ్లలో!   సరదా కోసమైనా సరే సుమా!  ఆ తరహా  ముక్కలు తెల్లారి  రెండు  పంటి కింద వేసుకుంటే.. తెల్లారే సరికల్లా బతుకు తెల్లారిపోయినట్లేనంట!.  రాత్రి నిలవుంచిన ఉల్లి ముక్కలంటే  కొరివిదయ్యాలకు పరమాన్నంతో సమానమని రెడ్ ఇండియన్లకదో నమ్మకం. ఉల్లికే నవ్వాపుకోలేక కన్నీళ్ళు ధార కట్టే వెర్రి విశ్వాసమనా పరిహాసం? ఉల్లి వాసన
చూసినా చాలు.. మాంసాహారం ముట్టినంత  దోషం అంటూ మొన్న మొన్నటి దాకా రేగినఆహార అంటు’ ఉద్యమమో?! ఆహార సామ్రాజ్యంలో ఉల్లి నియంత! ఎవరి అదుపాజ్ఞలకూ అది కట్టుబడి ఉండదు సుమా! మధ్య ప్రాచ్యపు ఈజిప్షియన్ల ఆచారమే అందుకు
ఉదాహరణ.

చెక్కు తీసిన ఉల్లిపాయ చక్రాలు ఈజిప్షియన్లకు  రక్షరేకుల కింద లెక్క. మనిషి తపించే  పరలోక సుఖాలన్నింటికీ గుండ్రటి ఉల్లిపాయ చక్రాలే ఈ లోకంలో సంకేతాలు. ఈజిప్టు  రాజుల సమాధుల గోపురాలు ఉల్లి ఆకారంలో కనువిందు చేయడానికి కారణం కద్దు!  చచ్చి పైకి పోయినా  చక్రవర్తుల బతుకు రాజాలా సాగాలన్న  ప్రజల హైరానాకు ఆ ఉల్లి చక్ర గోపురాలు ప్రతిరూపాలు. పొరపాటున
ఎన్నుకున్న సైతాను నేతల పీడ ఎప్పుడు విరగడవుతుందా  అంటూ కళ్లలో వత్తులేసుకు  ఎదురుచూసే మన తరాలకు నిజంగానే ఇదో వింత విశేషమే కదా!

అంత కన్నా వింత.. సంస్కృతీ సాంప్రదాయాలలో  ఉల్లికి ఇంతటి ప్రాధాన్యమున్నా మధ్య ఆసియా- దాని సాగు విషయంలో మాత్రం ఇంకా చాలా  వెనకంజలో ఉండటం! ఈజిప్టు వంటకాలకు శ్రేష్టమైన రుచినిచ్చే నాణ్యమైన ఉల్లి ఈనాటికీ
పాకిస్తాన్, ఇరాన్ వంటి  తూర్పు ఆసియా ప్రాంతాలలో సాగవడం ఒక విచిత్రం!

కరెన్సీది సాధారణంగా కాగితాల రూపం ఏ  దేశంలో అయినా! కాబట్టే ఏ కలర్ప్రింటింగ్ బట్టీలల్లో అచ్చొత్తించినా అచ్చమైన నోట్లలా దర్జాగా చలామణీ చేయించొచ్చని ధీమా. ఆర్థిక మాంద్యం తిప్పలు తప్పుతాయనే మధ్యయుగాల నాటి కొన్ని ముదురు దేశాలు  ఉల్లిపాయనే నేరుగా కరెన్సీ కింద వాడేసేవి. ఇంటి
అద్దె వంటివి అంటే కొంత వరకు ఓకేనే గానీ..   ఉల్లి గడ్డలు ఓ రెండు కొనాలన్నా ఉల్లి చిల్లరే  ఓ వీశెడు పోసెయ్యడమా?!   కన్నీళ్ళే కాదు సుమా..
ఉల్లిపాయ  నవ్వులూ ఇలా పువ్వుల్లా  వెదజల్లేస్తుంటుంది.   కన్నీళ్లు కార్పించే ఉల్లి ధరలను నేలకు  దింపించేస్తే జనాలు మాత్రం నవ్వుతూ తుళ్లుతూ  పాలకులకు ఉల్లాసంగా ఉల్లిదండలేసి మరీ నీరాజనాలు పట్టేయరా?

ఉల్లికి ఉక్రోషం జాస్తి. గాలిలోని తేమతో  కలసి  పమాదకర ఆమ్లంగా  కోసినోడి కంటి  మీద దాడి చెయ్యాలని అది గంథకం వెదజల్లేది. కానీ మనిషి మెదడు అంతకన్నా చురుకే. మొద్దు నిద్రకు పడే  మన ప్రభుత్వ యంత్రాంగం బాపతు కాదు!
ప్రమాదం ఏ మూల నుంచైనా రానీ.. తక్షణమే నివారణ  చర్యలు చేపట్టే రక్షణ వ్యవస్థ సర్వదా మెదడు అధీనంలో ఉంటుంది.  ఉల్లి బుద్ధి దానికి ముందే తెలుసు.  కాబట్టే వెంటనే కంటి వెంట నీళ్లు కార్పించేసి  రక్షణ కల్పించడం. ఉల్లి కన్నీళ్ల గురించి మన కతలు, కల్పనలకేం గానీ..  ఏ  కోతలు , గీతలు లేకుండానే మరి కోతుల్లాంటి నేతలు తెప్పిస్తున్న కన్నీళ్ల మాటేమిటో?

ఉగాండాలో కూడా ఉల్లికి మా గొప్ప  ఉగ్గండంగా ఉందనే ఊకదంపుళ్ళు  మన నేతాశ్రీలవి. ఉల్లి బెంగ ఆనక.  ముందు ఈ  నేతల వెనకాతల నడిచే దొంగ కతలను గురించి కదా జనం దిగాలుపడాల్సింది?   నీళ్లలో తడిపినప్పుడోకత్తి
పీకకు ఇంత బొట్టు  వెనిగర్ పూసినప్పుడో ఎంత లావు ఉల్లిపాయ నుంచైనా  ఏ గండం ఉండదు.  ఏ ఉపాయాలు పన్ని మరి మనమీ  కోతి జాతి నేతల ఉపద్రవాల నుంచి
బైటపడేదీ?

ఇంకా నయం! ఇక్కడ ఇండియాలో పుట్టబట్టి ఉల్లి కన్నీళ్ల కహానీలు నవ్వుతూ చెప్పుకుంటున్నాం.   అదే లిబియానాలో పుట్టుంటేనా? ఏకంగా తిండి తిప్పలు మొత్తానికే ముప్పతిప్పలు వచ్చి పడేవి ఉల్లి మూలకంగా! లిబియన్లకు వంటా-వార్పంటే  ముందుగా గుర్తుకొచ్చేది  ఉల్లిపాయల తట్ట! ఆ దేశంలో  తలసరి ఉల్లిపాయల   వినియోగం సాలీనా  సుమారు మన  ఇరవై రెండు యూరియా బస్తాల సరుకు! అదీ తంటా!

ఉల్లి తొక్క మందంగా ఉంటే రాబోయే చలికాలంలో ఇబ్బందులు తప్పవనితేలికపాటిగా ఉల్లి పొరుంటే తేలికలో గండం గడిచిపోతుందని ఇంగ్లీషువాళ్ల జనపదాలలో ఆదో పిచ్చి నమ్మకం. తరచూ అంచనాలలో గురి తప్పడం  వాతావరణశాఖవారి నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం కదా మన దేశంలో! ఆ ఉల్లిపొట్టు శాస్త్ర
విజ్ఞానమేంటో  కూస్తింత దిగుమతి గాని చేసుకుంటే  మన పనికిమాలిన  తుఫాను రాజకీయాలకు రవ్వంత తెరపి దొరుకును కదా!

వింటానికైనా చెవులకు  ఇంపుగా ఉంటానికట వందేళ్ల కిందట  న్యూయార్క్ నగరానికి  'బిగ్ ఏపిల్అనే ట్యాగ్ తగిలించడం! అంతకు వందేళ్లకు ముందు నుంచే ఆ  నగరం అసలు వ్యాపార నామధేయం ‘బిగ్ ఆనియన్’ !  'ఆపిల్ చెట్టు కాయలం' అంటూ మా గొప్పలు చెప్పుకునే  మన  నేతల మూలాలదీ అదే తంతు కదా!
తీరిగ్గా తడిమే ఓపికలుండాలే గాని  తల్లివేర్లతో సహా ఆ పిదప నేతల వివరాలన్నీ చివరికి తగిలేది   ఏ ఉల్లి జాతి పిలకల్లోనే.. గ్యారంటీ!
ఆపిల్ కాయ అప్పికట్ల కొట్లలో కూడా అరువుకు దొరుకుతున్నదిప్పుచు! కానీ.. ఉత్తరాన కశ్మీరం నుంచి దక్షిణాన కన్యాకుమారి దాకా ఉల్లి తల్లికే వచ్చి పడింది ఎక్కడలేని   ముప్పందం!

ఉల్లిసాగులో మన దేశానికన్నా ముందున్నది ఒక్క చైనా (సాలీనా 20,507,759 మెట్రిక్ టన్నులు) మాత్రమే సుమా! అగ్రరాజ్యం అమెరికాదీ ( 3,320,870 మె.ట)  మన (13,372,100) కన్నా దిగువ స్థానమే మామా!’ అంటూ మన  సర్కారు మార్కు పెద్దమనుషులు ఎప్పుడూ  ఏకరువు పెట్టే  లెక్కలూ  రెండేళ్ల కిందటి పట్టీ నుండి బట్టీపట్టినవండీ! అయినా ఏ మండీ  లెక్కలు  బీదా బిక్కీ మండే
డొక్కలని చల్లారుస్తున్నాయనీ!

అమెరికన్ సివిల్ వార్ సమయంలో 'ఉల్లిపాయలు ఇవ్వకుంటే  ఉన్న చోటు నుంచి ఒక్కరంగుళమైనా ముందుకు కదిలేదిలేదు.. పొమ్మం' టూ జనరల్ గ్రాంట్ అంతటి మహాశయుడు నేరుగా ప్రభుత్వానికి టెలిగ్రాం కొట్టించాడు! వట్టిగా తినడానికేఅయితే  బుట్టల కొద్దీ ఉల్లిపాయలెందుకు? యుద్ధంలో అయే కోతిపుండ్లు బ్రహ్మరాక్షసులవకుండా  ఉల్లిపాయే ఒక్కటే అప్పట్లో చవకలో దొరికే  యాంటీ సెప్టిక్ మందు.  ఉన్నపళంగా వార్ డిపార్ట్ మెంటువారూ ఉల్లి తట్టలు మూడు రైలు పెట్టెలకు నింపి పంపించిందీ  ఉత్తిగా పెసరట్టులో ఉల్లి కలుపుకు తిని ట్రెంచుల్లో బబ్బోమని కాదు!

ఉల్లి తడాఖా ముందు ఉగ్రవాదులే తలొంచుకోక తప్పని కాలం ఇది! బుల్లి బుల్లి ఊళ్లల్లో బీదా బిక్కీకీ ముఖ్యమైన ఆహారాలన్నీ ఉల్లితో కలిపి తినేవే! ముక్కుతో వాసన చూద్దామన్నా ముక్క సరుకైనా దొరక్కపోవడమే మా ఇరకాటంగా
ఉంది.. చానాళ్లబట్టి!

నెబ్రస్కా బ్లూ హిల్స్ అనే ఓ బుల్లి దేశం ఉంది. అక్కడి నేరస్తుల శిక్షా స్మృతిలో  నేటికీ ఉల్లికి అమిత గౌరవ స్థానముంది! పిరికి మగాళ్లని
గేలిచేస్తున్నట్లుగా పెద్ద టోపీ తలకు తగిలించి తిరిగే మగనాళ్లకు పడే
శిక్ష.. జీవితాంతం  ఉల్లి  ముట్టకుండా భోంచెయ్యడం! ఊతప్పం తినలేని ఉత్తుత్తి బతుక్కన్నా ఉరి కంబమెక్కి మెడకో తాడు తగిలించుకోడం మేలనిఘొల్లుమంటున్నారంట అక్కడి ఫిమేల్సంతా!

ఒలపింక్స్  జరిగిన మొదటి శతాబ్దం బట్టి ఆనియనే  నేటి దాకా ది  బెస్ట్ఛాంపియన్!  ఆ తరహా ఆటల్లో ఎప్పుడూ అఖండ విజేతలుగా నిలిచే గ్రీకులు పుచ్చుకునే  బలవర్థక ఆహారంలో  ఉల్లిపాయే ప్రధానమైన దినుసు. ఇక్కడాఇండియాలో ఇప్పటికీ ఉల్లి కంటికి, కీళ్లకు, గుండెకు మేలు చేసే గట్టి మందే! కానీ ఉల్లి మందుకైనా దొరకడంలేదే! రోగుల మూలుగుల్లో ఉల్లి పాత్రా గణనీయంగా ఉంది!

నవజాత శిశువు మాదిరి ఎనిమిది కిలోలకు అటూ ఇటూగా తూగే ఉల్లిపాయను సాకి మరీ గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కేసాడో ఇంగ్లీషు రైతు సోదరుడు. ఆ మాదిరిగా రికార్డులకు ఎక్కి దిగడాలు వింటానికి హుషారుగా ఉంటాయ్! నిజమే కానీ ఆర్నెల్లుగా ఆకాశానికట్లా ఎగబాకి ఎగబాకి  ఇక దిగొచ్చేది లేదంటూ తెగ జగమొండితనం ప్రదర్శిస్తున్నదే  ఉల్లిపాయ? ప్రపంచ మార్కెట్ గణాంకాల రీత్యా శాఖాహార పంటలలో  ఇప్పటికీ ఉల్లిదే  ఆరో స్థానమేనంట! అయితే ఏంటంట? వంటింట వాసనకైనా ఉల్లి కంటబడ్డంలేదే!  ఏ మహాతల్లి మాత్రం ఎంత కాలమిలా కన్నీళ్ళతో సహిస్తో పొయ్యి ముందు కూలబడుండేది? ముక్కోటి దేవతలూ జస్ట్
కౌంటింగాఫ్ నెంబర్లకేనా? ఏ మూలవిరాట్టుకూ  మనిషి ఉల్లి పాట్లు పట్టనే పట్టవా? చంద్రయాన్ - మూడు  వెళ్ళి వెదికే దాకా వేచిచూసే ఓపిక పెనం ముందు అట్టేసే వంటమనిషికి ఉంటుందా!

సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుని వారసులు జనం. టెంకాయకు బదులుగా వంకాయ సృష్టించుకున్నట్లే   ఉల్లికి బదులుగా ఎక్కడో ఏ వెల్లి సృష్టో జరిగిపోతేనో! రచ్చ  రాజకీయాల కోసమైతే ఎట్లాగూ ఏ రాజధానోపౌరసత్వం మాదిరి చిచ్చులో బొచ్చెడు కొత్తవి  ఎప్పటికప్పుడు హాయిగా రగిలించుకోవచ్చు గానీ ముందీ పేదోడి కడుపు రగిలి  నిప్పురవ్వ కార్చిచ్చవక ముందే ఏడిపించే ఉల్లిపాయనా పాడు ధర చెర నుంచి విడిపించమని కన్నీళ్లతో
మొత్తుకుంటున్నాం మహాప్రభో !

కన్నీళ్లు పెట్టించే ఉల్లి తల్లి కంటనే కన్నీళ్లు వరదలై పారుతున్నా నవ్వు తెప్పించే పిచ్చి చేష్టలిట్లా ఇంకా కొనసాగితేనా..  చివర్న కన్నీళ్లు
పెట్టుకునేది ఎవరో తమరికి మాత్రం తెలియదనా స్వాములూ.. నా పిచ్చితనం కానీ!

-కర్లపాలెం హనుమంతరావు
వాట్సప్ +918142283676
***

 (సూర్య దినపత్రిక, 05, జనవరి, 2020 నాటి ఆదివారం సంపాదకీయ పుట ప్రచురితం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...