"ధన్వదుర్గం మహీదుర్గ మబ్దుర్గం వార్క్షమేవ వా।
నృదుర్గం గిరిదుర్గం వా సమాశ్రిత్య వసేత్సురమ్॥"
ఐదు యోజనాల వరకు నీరు లేని మరుదుర్గం, రాళ్లతోగాని ఇటుకలతో గాని పన్నెండు బారల ఎత్తుండి యుద్ధం తటస్తిస్తే కూడా పైన తిరగేందుకు వీలైనంత వైశాల్యంతో ప్ర్రాకారం కట్టుకోడానికి పనికొచ్చే భూదుర్గం, చుట్టూతా లోతైన నీరున్న జలదుర్గం, చుట్టూతా మరో యోజన దూరం దట్టమైన చెట్టూ చేమా ఉన్న వృక్షదుర్గం, చతురంగ బలాలతో పరిరక్షితమైన మనుష్యదుర్గం, నాలుగు దిక్కులా కొండలతో చుట్టి ఉండి, లోతైన నదులు, సన్నటి ఇరుకైన మార్గం ఉండే గిరిదుర్గం.. ఇవన్నీ రాజధానికి ఉండే అర్హతలేట. అన్నీ కాకపోయినా వీటిలో కనీసం ఏ కొన్నైనా ఉండే ప్రాంతంలో ముఖ్యపట్టణం కట్టుకోవడం రాజుకు క్షేమం అని మనుస్మృతిలో మనువు నిర్దేశించిన రాజధాని ప్రధానలక్ష్యణాలు. అన్నింటిలోకి గిరిదుర్గం అత్యుత్తమైనది అని కూడా ఆయన అదనపు సలహా!
మరుదుర్గాన్ని మృగాలు, మహీ దుర్గాన్ని ఎలుకలు సంతతి జీవులు, జలదుర్గాన్ని మొసళ్ళు, వృక్షదుర్గాన్ని కోతులు, నృదుర్గాన్ని మనుష్యులు, గిరిదుర్గాన్ని దేవతలు.. ఆశ్రయించి ఉంటారు. కాబట్టి రాజు జోలికి రావాలంటే ముందు ఈ జాతులు అన్నింటితో పెట్టుకోవాలి శత్రువులు అని మనువు ఆలోచన.
గిరిదుర్గాన్ని ఆశ్రయించిన రాజును శత్రువులు హింసించడం చాలా కష్టం. అక్కడ ఒక నేర్పుగల విలుకాడిని నిలబెడితే కింద ఉన్న వందమంది శత్రువులకు సమాధానం ఇచ్చేపాటి శక్తి అమరుతుంది. ఆ లెక్కన వందమంది విలుకాళ్లను పెడితే పదివేల మంది శత్రు యోధులకు పెడసరి కొయ్యలుగా మారే అవకాశం కద్దు.
ఏదేమైనా దుర్గం రాజులకు అత్యవసరం. ఆ దుర్గం కూడా వట్టి యుద్ధ సాధనాలతో నింపి కూర్చుంటే ప్రయోజనం సున్నా. ధనం, ధాన్యం, వాహనాలు, బ్రాహ్మణులు(ముహూర్తాలు గట్రా పెట్టడానికి కాబోలు), నిర్మాణ శిల్పులు, యంత్రాలు, నీళ్లు,.. ముఖ్యంగా మట్టి (కసవు అన్నాడు మనువు)నిండి ఉండకపోతే పేరుకే అది రాజధాని. మనుధర్మశాస్త్రం -పుట 116).
రాజులూ యుద్ధాలూ .. నాటి కాలం కాదు కదా ఇది! ప్రజాస్వామ్యం! ప్రజలు ముచ్చటపడి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఆలోచించినా చాలు.. రాజుకు మించిన అధికారం చేతికి అందివచ్చే కాలం. 21వ శతాబ్ది మార్క్ రాజులకు మనువు చెప్పిన కోటలు గట్రాలతో రాజధానులు కట్టకపోయినా మునిగిపోయేదేమీ లేదు కానీ.. ఎన్నికల్లో ఎడపెడా పోసిన లక్షల కోట్లు రాబట్టుకోవాలంటే ఆర్థికదుర్గాలు వంటివి మాత్రం తప్పనిసరి. సందర్భం వచ్చింది కాబట్టి మనువు తన స్మృతిలో ఈ రాజధానుల పితలాటకాన్ని గూర్చి ఏమన్నాడో .. జస్ట్.. ఆసక్తి ఉన్నవాళ్ళు తెలుసుకుంటారనే ఈ రాత!
-కర్లపాలెం హనుమంతరావు
06 -01 -2020
No comments:
Post a Comment