Friday, January 24, 2020

కవిత్వ సమీక్ష రెండు కవితలు- ఒక సామ్యత; ఒక విభిన్నత -కర్లపాలెం హనుమంతరావు




కైలాస గంగ
-"సంపత్"

కృతయుగం
ఇది ఏమి పొగలుమిసి సెగలెగసి భువికవతరించినది కైలాసగంగ?
 కలియుగం
-కాదు యుగయుగ హృదయశోణిత తరంగ-
 కృత
శివజటాజూటాగ్ర గళిత హిమమణిమిళిత శీకరకిరీట కాదా?
నటరాజభుజగ కంఠాభరణ మణికిరణ చుంబితలలాట కాదా?
 కలి
నర కబంధ ప్రేతములమీద పరదెంచు పెను కాలభూతమేమో!
ప్రేతముల మానసగీతములవలె కదలు రక్తజలపాతమేమో!
 కృత
కైలాసశైల మూర్ధాభిషిక్తతుషార చూడాకలాప కాదా?
కలకలస్వనసలిల ఋక్చంద స్వచ్చంద వేదసంలాప కాదా?
కలి
మృత్యుగళసీమావిలంబివిలయకృశాను తోరణశ్రేణియేమో!
నరకభీకరతమోఘూర్ణితభయద వైతరణివేణియేమో!
కృత
రజతగిరి గైరికా సంవక్త పృథులతర మిహికానితంబ కాదా?
ఈత్రిలోకాభినందితమైన మిన్నేరు అఖిలజగదంబ కాదా!
 కలి
బలినుండి నరమేధములనిండి మిన్నెగయ హోమాగ్ని ధూమమేమో!
భువినుండి దివికి నాల్కలు సాచి కబళించు నాప్రళయకామమేమో!
కృత
ఇది ఏమి పొగలుమిసి సెగలెగసి భువికవతరించినది కైలాసగంగ?
 కలి
-కాదు యుగయుగ హృదయశోణిత తరంగ-
***


ప్రాబ్లెమ్ ఆఫ్ లైఫ్
-"శంపాలత"

ఇబ్బందులకు ఇంటూమార్కులు పెట్టుకుంటూ
స్వేచ్చను స్కేర్ బ్రాకెట్సులో బంధిస్తూ
చిక్కుసమస్యలనూ చిద్విలాసాలనూ
ప్లస్ మైనస్ లతో సూచిస్తూ
జీవన సమీకరణం చివరికి
'జీరో' కే సమానమవుతుంది!

బతుకు బాటలో మనస్సు పెంచుకున్న 'ఏక్స్లలరేషను'
వెతలగతుకుల్లో రిటార్డేషనుగా మారి
జీవనశకటం వెనక్కే పోతుంది
గుండెలో శాంతి-శాతంలో సహస్రాంశంగా
నెగ్లిజిబుల్ అవుతోంది!

ప్రసరించిన ఆశాకిరణం ఎదురుదెబ్బలు తిని తిని
ప్రతిబింబంలోనే పరావర్తనం చెందుతోంది
స్వార్థం గ్రావిటేషను ఫోర్సుతో దురాశలవైపు ఆకర్షింపబడి
నిరాశతో నిట్టూర్పులే విడుస్తోంది!

ఎగిరి-ఉన్నత శిఖరాలందుకోవాలన్న ఆశయాల రోదసినౌక
నెగటివ్ వెలాసిటీతో సగంలోనే
నేల రాలిపోతున్నది!
'స్క్వేర్ రూట్'లో ఒదిగిఉన్న స్వప్నం
చివరి విలువలు గమనించలేకపోతున్నది!

లంబకోణంలా నిటారుగా నుంచోవాలన్న వాంచ
పరతంత్రతలో చిక్కుకొని
'అబ్ ట్యూన్'లా వంగి వాలిపోతున్నది!

నేలిడి ఉహించటానికి లేకుండా జీవిత పరిభ్రమణంలో
సాలిడ్ యాంగిల్ లా మారిపోతున్నది!

హోల్ క్యూబ్ లో ఉన్న ఆర్థికవిపత్తు-ఎంత విడదీసినా
చోటుచాలకుండా విస్తరించుకుపోతున్నది-
అసంపూర్తిగానే మిగిలిపోతున్నది!
కష్టనష్టాలను వేటితో భాగించినా
శేషం మిగులుతూనే ఉంది!

అనుకున్న 'ఆన్సరు' రానందుకు దిక్కులు చూస్తూ
అంతరంగం 'ఆబ్ స్ట్రాక్' గా ఆలోచిస్తున్నది!

నా అభిప్రాయంః

రెండు కవితలు- మధ్య మూడు దశాబ్దాల అంతరం. మొదటిది '40ల నాటి ధోరణి. తరువాతది తరువాతి తరం తాలూకు  అసహనం. రూపాల్లో వైవిధ్యం ఉన్నా అంతర్గతంగా రెండింటిదీ ఒకే తర్కం.

కృతయుగానికి 'శివజటాజూటాగ్ర గళిత హిమమణిమిళిత శీకరకిరీట' oత పునీతంగా కనిపించిన గంగ కలియుగానికి 'నర కబంధ ప్రేతములమీద పరదెంచు పెను కాలభూతం'గా అనిపించింది. వస్తువు ఒకటే. చూసే చూపును బట్టి  రజ్జు సర్పభ్రాంతి.  శ్రీశంకరుని తత్త్వం. కలియుగం నాటికి 'నరకభీకరతమోఘూర్ణితభయద వైతరణివేణి'లాగ అనిపించిన గంగ.. వాస్తవానికి వర్తమాన సమాజరీతికి కవి సంకేతం. రెండో కవితలో  'నేలిడి ఉహించటానికి లేకుండా జీవిత పరిభ్రమణంలో/ సాలిడ్ యాంగిల్లా మారిపోతున్నది’ అని అనడం అంటే..    జీవితం మీద ఆ కవిదీ అదే  పెసిమిస్టిక్ దృష్టి..  మరో కోణం నుంచీ!

తెలుగుకవిత్వ వికాసపరిణామ క్రమాన్నిసవ్యంగా పరిశీలించే వారెవరికైనా ఈ రెండుకవిత్వ రూపాల్లోని సామ్యాలు, తారతమ్యాలు ఇట్టే స్ఫురిస్తాయి. మొదటిది '40ల్లోని భావ విప్లవ నేపథ్యంలో ఛిద్ర జీవిత విధ్వంసానికి పట్టిన అద్దం ఐతే రెండోది '70లోని అస్తవ్యస్త జీవన వ్యవస్థ మీది యువత విసుగు విసురు. మొదటి   వ్యక్తీకరణ ఆనాటికే ప్రాచుర్యంలో ఉన్న కావ్యభాషసరళి. రెండో కవిత-  ఏకమొత్తంగా రూప భావాలు రెండింటిలోనూ కవి ఎంచుకున్న సరికొత్త గణిత పంథా. అది తేడా!

కవిత్వ రూప, తత్వాలమీద మొదటి నుంచీ ఏవేవో  వాద వివాదాలు. విశ్వవ్యాప్తంగా అదే తరహా. మిగతా అన్నిసాహిత్య ప్రక్రియలకన్నాకవితారంగంలోనే ఈ రచ్చ ముందుగా ఎందుకు అన్నది చర్చ. 

కవిత్వం  ప్రధానంగా హృదయ సంబంధి కావడమూ,  జీవితాన్ని, సమాజాన్ని నిర్వచించాల్సిన పెనుభారం తన కవిత్వం మీదే ముందుగా ఉందన్న భ్రమ కవితాప్రపంచం భ్రమ బలంగా ప్రబలి ఉండటమూ కారణం  కావచ్చును.   భావాత్మకమైన ప్రతిస్పందనకు శైశవదశలో సుఖంగా మనసుకు  అందివచ్చే సంతృప్తికరమైన ప్రక్రియ కవిత్వం  కావడమూ మరో కారణం కావచ్చును.   సూక్ష్మంలో మోక్షంలా వ్యక్తీకరించే సౌలభ్యం పాఠకుడి మనసును కవిత్వం వైపుకు తొందరగా బలంగా ఆకర్షిస్తుంది. కవి  ఉత్సాహానికి అదీ కారణం కాదనలేం.

వాదం ఏదైనా.. ప్రధానంగా కవిత్వం హృదయప్రధానం. రూపం ఏదైనా.. కవిభావం అద్దంలో మాదిరి కనబడడం అందుకే అవసరం. నడక ఎలా సాగింది అనే అంశం ఎంత ప్రధానమో..  కవిత చూపు నేలకు ఎంతకు దగ్గరగా ఉందన్నది అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత గల విశేషం.
రాసేది మనిషి. చదివేది.. వినేది మనిషి. చెప్పేది  మానవ జీవితాన్ని, మనిషి అంతర్భాగంగా ఉండే సమాజాన్ని గురించి. మరి భాష- భావం, నడక-నడత, ఆకారం-అలంకారం  పాఠక మేధో పరిమితులకు అనువుగా ఉంటేనే  అందం చందం! అర్థమయే   కవితకే ఆదరం. పదుగురితో పంచుకోబుద్ధవాలంటే ఆ కవితలో కొత్త విశేషం ఏదైనా ఉండటమూ తప్పని సరే. భావన గంగయితే యమున రూపమైతే.. కనిపించకుండా సాగే వ్యంజన సరస్వతి! ఈ కొలమానాల ప్రకారం పై రెండు  కవితలూ నా మనోసాగరాన సమ్మిళితమయేందుకు  ఉధృతంగ ప్రవహిస్తూ వచ్చే  త్రివేణీ సంగమ రస తరంగిణుల
-కర్లపాలెం హనుమంతరావు
25 -01 -2020
బోథెల్, వాషింగ్టన్ స్టేట్, యూ.ఎస్.ఏ



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...