Tuesday, December 7, 2021

చిన్న కథ సుబ్బరావమ్మ ఏడ్చింది - కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రభూమి - 01 - 12 -2009 - ప్రచురితం )




 చిన్న కథ; 

సుబ్బరావమ్మ ఏడ్చింది 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రభూమి - 01 - 12 -2009 - ప్రచురితం ) 


సుబ్బరావమ్మ సూపర్ ధైర్యవంతురాలు. ఏడవటం అస్సలు తెలీదు. తల్లి కడుపులో నుండి బైటపడంగానే ఎవరైనా కేర్..కేర్మని ఏడుస్తారు కదా! ఈవిడ 'ఐ డోంట్ కేర్' అన్నట్లు నవ్వటం మొదలుపెట్టిందట! దయ్యంపిల్లేమో అని ఇంట్లో వాళ్లు శాంతులు చేయించినా గాని సుబ్బరావమ్మ  సుబ్బరంగా నవ్వుతూనే ఉంది.


సుబ్బరావమ్మ పదమూడో ఏట తండ్రి గుండెపోటొచ్చి పోయినప్పుడు కూడా సుబ్బరంగా నవ్వుతూ నట్టింట్లో తిరిగింది. కళ్ళనీళ్లు పెట్టుకోలేదు సరికదా...ఆరోజు అత్యంత విషాదంలో మునిగుంటే తనే అందర్నీ సముదాయించింది.


సుబ్బరావమ్మకు కష్టాలు రావనికాదు...ఏడవటం ఎలాగో తెలీదు. అదీ ప్రాబ్లమ్. 


కొంతమందికి నవ్వటం రాదు కదా!...అలాగ.ఏడ్చినపుడు నరాలు రిలాక్సవ తాయి. గుండె తేలికవుతుందని ఎంత చెప్పినా ఉపయోగం లేకపోయింది.


పెళ్లయి అత్తారింటికి వెళ్ళినప్పుడు దీని తిక్క కుదురుతుందిలే అనుకొన్నారు. అత్తగారికే కుది రిందా తిక్కేదో! ఎప్పుడూ ఏడవకుండా ఉండే కోడల్ని చూసి ఆ అత్తగారికే తిక్క ఎక్కు వైందో..ఏమిటో...మరింత 'కోడరికం' పెట్టింది. 


సుబ్బరావమ్మ మొగుడు పరమత్రాష్టుడు. తాగుడూ.. పేకాట.. తిరుగుళ్లు... తెల్లారి కొంప కొచ్చి పెళ్ళాన్ని చితకబాదేవాడు. మహా ఇల్లాలు... ఆ బాధలన్నీ కిమ్మనకుండా భరిం చింది గానీ ఏనాడైనా కట్టుకున్న వాడిట్లా కసాయి వాడని...కనీసం ఒక్కసారయినా ముక్కు చీదెర గదు. పెళ్ళాం వైఖరికి విసిగి మొగుడు పట్టించుకోవటం మానేశాడు. 


అత్తగారు బెదిరి దూరంగా ఉండేది. ఆడపడచులు వదినవైపే ఆశగా చూస్తుంటేవాళ్లు ఎప్పటికైనా తమ ఆశ నెరవేరక పోతుందా అని.


కాలచక్రం గిర్రున తిరిగింది. సుబ్బరావమ్మిప్పుడు అత్తగారయింది. కొడుకులు, కోడళ్లు పెట్టే హింస నరమానవుడు సహించలేనిది. అలాంటి వాటిని తట్టుకుని నిలబడటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.


హఠాత్తుగా సుబ్బరావమ్మకి ఇప్పుడు ఒక కొత్తరకం జబ్బొచ్చి పడింది. దాన్ని ఇంగ్లీషులో అదేదో నోరు తిరగని 'ఫోబియా' అంటారుట..మొత్తానికి అదొక చిత్రమైన జబ్బు. దానికింతవరకూ మందు వైద్యరంగంలో కనుక్కోలేదుట. సుబ్బరావమ్మిక రోజులు లెక్కించు కోవచ్చు అన్నారు డాక్టర్లు. 


కొడుకుల గుండెల్లో బండరాళ్ళు పడ్డాయి. ప్రేమతో కాదు... ఆమె ఇంకా కనీసం ఒక ఏడాదన్నా బతికుండాల్సిన అవసరముంది. మనుమరాలికి మైనారిటీ తీరిందాకా తన నానమ్మ ఇచ్చిన పదికోట్ల ఆస్తికి తనే హక్కుదారు. 


నానమ్మలు మనవరాళ్లకి ఆస్తిని నేరుగా రాసిచ్చే చిత్రమైన సంప్రదాయం వాళ్ళ వంశంలో నాలుగు తరాలనుండి నిరాటంకంగా వస్తుంది. మనమరాలికి మైనారిటీ తీరకుండానే తాతమ్మ గుటుక్కుమంటే ఆస్తంతా ఊళ్ళో ఉన్న శివాలయానికి చెందాలన్నది అందులో రూలు. అందుకే సుబ్బరావమ్మ కొడుకులు తెగ ఆందోళన పడుతున్నారు. ఇంకో ఏడాది గడిస్తేగాని పెద్ద కొడుకు కూతురు మేజర్ కాలేదు. అందాకా సుబ్బరావమ్మ ఎలాగైనా బతికి తీరాలి. 


బతకా లంటే ఆమె నరాలు మెత్తబడాలి. నరాలు మెత్తబ డాలంటే బాగా ఏడవాలి. అది సుబ్బరావమ్మకి చేతగాని పని. అన్ని రకాల వైద్యాలూ అయ్యాయి. 


అల్లోపతి... ఆయుర్వేదం... హోమి యోపతి...న్యూరోపతి...నాచురోపతి, భూమం డలం మీదున్న వైద్య విజ్ఞానం మొత్తం ఈ సుబ్బ రావమ్మని ఏడిపించలేమని నిస్సహాయంగా చేతులెత్తేసింది. 


బట్... ఇండియా ఈజే లాండాఫ్ మిరాకల్స్ కదా! హిమాలయాల్నుంచీ హిందూ మహా సముద్రందాకా పాదయాత్ర చేస్తూపోయే తాంత్రికబాబాగారు ఈపూరుపాలెం వచ్చిన ప్పుడు ఈజీగా ఈ సమస్యను పరిష్కరించారు.


బాబాగారు విషయమంతా విని సాలోచనగా తలూపి కొడుకుని పిలిచి చెవిలో ఏదో ఊదారు. 


వాకిట్లో వేసున్న సుబ్బరావమ్మగారి మంచాన్ని నట్టింట్లోకి మార్పించారు. వారం రోజులవరకూ ఏ మార్పూ లేదు. 


ఆరోజు ఆదివారం... అందరూ ఎవరిపన్లలో వాళ్ళున్నారు. సుమారు పది గంటల ప్రాంతంలో ఘొల్లుమని  గోల వినప డింది. ఆ వింత శబ్దాన్నింతవరకూ ఎవరూ విని ఉండలేదు. కంగారుగా ఇంటిల్లిపాది గదిలోకి పరుగెత్తారు. 


సుబ్బరావమ్మ ఏడుస్తున్నది . భయంకరంగా ఏడుస్తోంది . గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తోంది. 


ఇంటిల్లిపాదీ ఆనందంతో గంతులేసారు.


ఇంక ఆస్తికి ఢోకా లేదు . 


థేంక్సు టూ కేబుల్ టీవీ అని గొంతెత్తి అరిచారు ఇంటిల్లిపాదీ! . 


అసలేం జరిగిందంటే... 


టీవీలో రోజూ అన్ని ఛానెల్సులో వరసగా వస్తున్న సీరియల్సుని చూసి చూసి సుబ్బరావమ్మ అందులో పూర్తిగా లీనమైపోయింది. 


ఆవాళా ఆదివారం అవటంచేత...ఆ ఏడుపు సీరియళ్లేవీ రావు . కనుక.... ఘొల్లుమన్నది  సుబ్బరా వమ్మ.


తానొకటి తలిస్తే దైవమొకటి తలు స్తుంది. సుబ్బరావమ్మగారు ఏడుస్తూ ఏడుస్తూ ఆరోజు చీకటి కాకుండానే కన్నుమూ సారు.


ఇప్పుడు ఏడవటం ఇంట్లో వాళ్ళ వంతయింది. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రభూమి - 01 - 12 -2009 - ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...