Thursday, December 9, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం ప్రతిరోజూ ప్రశస్తమే ! రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు- 06 - 09- 2009 న ప్రచురితం )

 




ఈనాడు - గల్పిక-  హాస్యం - వ్యంగ్యం 

ప్రతిరోజూ ప్రశస్తమే ! 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు- 06 - 09- 2009 న ప్రచురితం ) 



ఆ అమెరికా యూనివర్సిటీ వాళ్ళకు పనీపాటా  లేదా ఏంటి... ఆదివారం ' ది బెస్ట్' అని తేల్చుకోవటానికి అన్ని బ్లాగులు మధించాలా?! మనదేశంలో చంటిపిల్లాడిని అడిగినా గంటకొట్టి  చెబుతాడే, సండేని మించిన గ్రాండ్ డే భూమండలం మొత్తంమీద వెదికినా మరోటుండదని! ఆది వారమంటే కంటినిండా నిద్దర, కడుపునిండా భోజనం, టీవీ నిండా సినిమాలే! ఆడవాళ్ళకు తప్ప ట్రాఫిక్ పోలీసులతో సహా అందరికీ ఆదివారమంటే ఆనందవారమే కదా భాయీ! అహాఁ... చెప్పలేములే ఆహాయి!'


'ఆహా... అందుకే అయిదేళ్ళ కిందట ఆ డిసెంబరు చివరి ఆదివారంనాడు అంతమందిని కొట్టుకెళ్ళిన సునామీ పుట్టింది! ' 


' సోమవారంనాడు షేర్ మార్కెట్లకు మహమంచి రోజంటారే! ' 


'బ్లాక్ -మండే' సంగతి మర్చిపోయారా? చంద్రమండలం మీద మనిషి మొదటిసారి కాలు పెట్టింది చంద్రదినం అంటే సోమవారంనాడు కాదుకదా నాయనా! ఏ లెక్క ప్రకారం సోమవారంనాడే గుండె నొప్పులు ఎక్కువుంటాయని చెప్పారు స్వామీ, ఆ గొప్పవారూ? ' 


' సర్వేలయ్యా... సర్వేలు!'


' సర్వేల లెక్కల్లో నూటికి తొంభైతొమ్మిది తప్పులే ఉంటాయని ఓ సర్వే చెబుతోంది. తమరికి తెలుసా సర్వేశ్వర్రావు గారూ! మంగళ వారంనాడు ప్రయాణాలకు తప్ప అంతా మంగళకరంగానే ఉంటుందంటున్నారు... మరి ఎనిమిదేళ్ళ క్రితం వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దారుణంగా దాడి జరిగింది. మంగళవారమేనయ్యా మహానుభావా!'


'మరీ అలా కొట్టిపారేయ్యాకన్నా! బుధవారం పరమ చెత్తరోజన్నారు. ' 


'మన ముంబయి మీద దాడులు జరిగింది బుధవారంనాడే! ఇందిరమ్మ యమర్జన్సీ కూడా బుధవారంనాడే మొదలయింది. ఇంకో మూడేళ్ళకు ఒక మహాప్రళయమొచ్చి మనందరికీ మూడుతుందంటున్నారు. బాగా చూసుకో, ఆ రోజుకూడా బుధవారమే అవబోతుంది!' 


'అబ్బో.. బహుదొడ్డ థియరీ! గురువారం పొగతాగేవాళ్ళు మానేయటానికి మంచిరోజు.. మరి ఒప్పకుంటావా ఇదన్నా ? ' 


' అండే.. శుక్రవారంనాడు స్మోకింగు ఆపేయాలనుకునేవాడు గురువారం దాకా ఎదురుచూస్తూ కూర్చోవాలా?'


'మరీ అంత రెట్టమతంగా  మాట్లాడబాకన్నా! మనకు మాత్రం అట్లాంటి  నమ్మకాలు లేవా ఏంటీ ? శుక్రవారంనాడు డబ్బులు బైటికి తీస్తామా? ఆ రోజు క్షవరం చేయించుకుంటే వారమంతా తలనొప్పి తప్పదని నమ్మేవాళ్ళు లెక్కలేనంతమం ది ఉన్నారు బాబూ! ' 


' అమెరికాలాంటి దేశమే శుక్రవారమంటే ఉలిక్కిపడుతుంది. అదేరోజు పదమూడో తారీఖైతే ఇంక చెప్పే పనేలేదు . ఏసుని శిలువ వేసింది. శుక్రవారం...'


మరి ఏసు తిరిగొచ్చింది కూడా శుక్రవారమేగదా!' 


' నువ్వు ప్రతిదీ ఇలాగే బుకాయిస్తావుగానీ, ఆఖరికి మన దేవుళ్ళకి కూడా ఒక్కోరోజు ప్రత్యేకంగా ఇష్టముంటుంది. తెలుసా! శివుడికి సోమ బుధవారాలు, ఆంజనేయుడికి మంగళవారం, లక్ష్మీదేవికి గురు శుక్రవారాలు, శనివారం వేంక టేశ్వరస్వామివారికి....' 


' ఇంకా ఆగితే ఆదివారం సూర్యుడికి, సోమవారం చంద్రుడికి బుధవారం బృహస్పతికి; గురు, శుక్రవారాలు ఆ పేరుతోనే ఉన్న గ్రహాలకు ఇష్టం, పూజలు చేయకపోతే వాళ్ళకు ఆగ్రహం అంటావు. పాయింటది కాదు మిత్రమా! శని వారం పిల్లలు పుట్టటానికి మంచిరోజని, ఆ రోజు పుట్టినవాళ్ళలో చాలామంది ప్రధానమంత్రులు కూడా అయ్యారని చెబుతాయే, అలాంటి సర్వేలను  గురించే నేను మొత్తుకునేది. చాదస్తం ఎక్కువైతే గంటల పంచాంగం కూడా నిమిషాని కోసారి చూసుకోందే కాలు బయటకు పెట్టాలనిపించదు. నమ్మకాలు ఎక్కువైతే

మూఢనమ్మకాలుగా మనకు తెలీకుండానే మారిపోతాయి.. తాగుబోతుకి దీపస్తంభంలాగా. లైటుస్తంభం వెలుతురు కోసం కాదు, తూలిపడిపోకుండా పట్టుకోటానికని గట్టిగా నమ్మినట్లుంటుంది వ్యవహారం'


' ఇంతకీ నువ్వేమంటావో సూటిగా చెప్పరాదా సోదరా! '


' మంచిరోజు చూడకుండా చెడ్డపని కూడా చేయలేని ఆ బల 

హీనతను వదులుకోమంటా! మనకు పనికిరాని అమావాస్య పక్కనున్న తమిళనాడులో గొప్ప రోజనుకుంటారు. గ్లోబుమీది అన్ని దేశాల్లో ఆదివారాల్లాంటివన్నీ ఒకేసారి రావు. రోజు అనేది దేవుడు మనకి ఉదయాన్నే ఇచ్చే బ్లాంక్ చెక్కులాంటిది. వాడుకునే దాన్నిబట్టి దాని విలువ మారుతుంది. ప్రతివాడికి తొమ్మిది దినాల్లో ఒకటి అనుకూలంగానే ఉంటుందని 'లస్టర్ ఆఫ్ వెటర్నటీ' ఆరో ఛాప్టర్ లో ఉంది. ఘనా దేశస్తులు బిడ్డకు పుట్టిన రోజు పేరుగా పెట్టుకుంటారు. అంటార్కిటికాలో ఏడాదిలో సెప్టెంబరు 21వ తేదీనే సూర్యుడు ఉదయిస్తాడు. అది ఆదివారమైనా, శనివారమైనా వాళ్ళకి ఆనందమే కలిగిస్తుంది కదా! 'భగవన్నిమిత్తమైన అన్ని దినాలు సుదినాలే ' అంటారు చిలకమర్తివారు . పనిచేసేవాడికి ఏ రోజూ పనికిరానిదికాదు. వారంలోని ఏడు రోజులు సృష్టి మనకిచ్చిన ఏడువారాల ఆభరణాలు.


' అవునన్నా! ఇప్పుడు మనం మర్చిపోయాంగానీ, మన చిన్నప్పుడు తెలుగువాచకంలో ఒక చక్కని పాట ఉండేది. ఆదివారంనాడు అరటి మొలి చింది. సోమవారం నాడు సుడివేసి పెరిగింది. మంగళవారం నాడు మారాకు తొడిగింది. బుధవారం నాడు పొట్టిగెల వేసింది. గురువారంనాడు గుబురులో దాగింది. శుక్రవారంనాడు చూడిగా పండింది. శనివారం నాడు చకచకా కోసి, అందరికీ పంచితిమి అరటి పొత్తములు... అన్న పాట అర్ధమైందన్నా! అందరికీ పంచే అన్ని అరటి పొత్తాలు కావాలంటే వారంలోని ఆ అన్ని  రోజులూ ఆ అరటిచెట్టులాగా ఒకేలా పెరిగాలనేగా నువ్వనేది:  సరే నేను వస్తా.. ' 


' ఎక్కడికి? ' 


' శనివారం కదా అని పనికి బద్ధకించా! అత్యవసరంగా  ఫైలు ఒకటి పరిష్కరించాల్సి ఉంది.  పాపం, ఒక ముసలాయన పింఛను కోసం వారం, వర్జ్యం  కూడా చూసుకోకుండా ప్రతి రోజూ ఆఫీసు గుమ్మం ముందు పడిగాపులు కాస్తున్నాడు.' 


' అదీ, ఇప్పుడు నాకు నచ్చావ్ సోదరా, పోయిరా!'



రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు- 06 - 09- 2009 న ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...