Sunday, December 12, 2021

తల్లీ... నమస్తుభ్యం! -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు , సంపాదకీయం - 11:05:2013)

కౌసల్య తన పేరేమిటో చెప్పమంది. అమ్మతోనే కాని... ఆమె పేరుతో పనేమిటి చంటి పిల్లలకు? 'అమ్మగాలు' అంటాడు- 'రా' అనే అక్షరం, 'డు' అనే అక్షరం పలకడం రాని ఆ బాలరాముడు అత్యంత కష్టంమీద. 'కౌసల్య తండ్రీ' అని బిడ్డణ్ని సరిదిద్దబోయి అప్పటికే నాలుక తిప్పడం రాని రాముడి కళ్లలోని చిప్పిల్లిన నీరు చూసి తల్లి గుండె చెరువైపోతుంది. 'కౌసల్యను కానులేరా నాన్నా! వట్టి అమ్మనేరా నా చిట్టి రామా!' అంటూ అమాంతం ఆ పసికందును తల్లి గుండెలకు హత్తుకునే రమణీయ దృశ్యం విశ్వనాథవారి 'రామాయణ కల్పవృక్షం'లోనిది. నవమాసాలు మోసి రక్తమాంసాలను పంచి కన్న పాప కనుపాపకన్న ఎక్కువ అనడం 'సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్ము'ను తక్కువ చేయడమే. సంత్ జ్ఞానానంద యోగి ప్రవచించినట్లు 'తాయి సంతతి సంతత యోగ దాయి'. 'చల్లగ కావుమంచు మనసార పదింబది దైవ సన్నిధిన్ మ్రొక్కు' మాత వాత్సల్యాన్ని ప్రసిద్ధ ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రాల్ట్ మాటల్లో చెప్పాలంటే- 'తల్లి నివేదనకన్నా, ముందుగా బిడ్డ కామన చేరగలిగే ప్రార్థనాస్థలి సృష్టి మొత్తం గాలించినా ఎక్కడా దొరకదు'. గణాధిపత్యం కోసం శివపుత్రులిద్దరి మధ్య స్పర్ధ ఏర్పడింది. మయూర వాహనుడికి సర్వ తీర్థాల్లో తనకన్నా ముందుగా అన్నగారే మూషికారూఢుడై సందర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తల్లి కామన వల్లే సిద్ధివినాయకుడికి ఆ విజయం సిద్ధించిందన్న ధర్మసూత్రం వల్లీనాథుడికి అప్పుడుకాని బోధపడలేదు. వానలో వస్తే తడిసినందుకు నాన్న తిడతాడు. అదే అమ్మైతే? 'ఈ పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చినదాకా ఆగకూడదా!' అంటూ వానకే శాపనార్థాలు పెడుతూ బిడ్డ తల తుడుస్తుందట. అమ్మంటే అదీ!

 

ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలూ అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం కురిపించినా తృప్తిచెందనిది సృష్టిలో అమ్మ ఒక్కతే. 'తండ్రిం జూడము తల్లి జూడము యశోదా దేవియున్ నీవు మా/ తండ్రిం దల్లియు నంచు నుండుదుము... ఇంతటి వారమైతిమి గదా తత్త ద్వయోలీలలన్' అంటూ రెండు చేతులూ జోడిస్తాడు ముకుందుడంతటివాడు నందుడి సందర్శనార్థమై రేపల్లె వచ్చిన సందర్భంగా- భాగవతంలో. జగన్నాథుణ్ని అలా తీర్చిదిద్దే యుక్తి అమ్మదే. 'నాయన గొప్ప సంపద అమ్మే' అని కదా శ్రీస్తవ స్తోత్రం! సర్వ భూతాల్లో ద్యోతకమయ్యే దివ్యశక్తిని మాతృరూపిగానే సంభావిస్తుంది దుర్గా సప్తశతి. దుర్గా, ఫాతిమా, మేరీ, బుద్ధుడి మేనత్త గౌతమి, బహాయీల తాయి తాహిరి, మహావీరుడి తల్లి త్రిషాల... మాతృ ప్రేమకు కులమతాలని, దేశకాలాలని ఎల్లలేముంటాయి? గ్రీకులకు వార్షిక వసంతోత్సవాల్లో దేవతల తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాచీన రోమన్లు హీఠారియా పేరిట దేవతామూర్తి సిబెల్‌ను మాతృపీఠం ఎక్కించారు. ఇంగ్లాండులో తల్లులందరికీ 'మదరింగ్ డే' పేరిట ఆటవిడుపు. మే రెండో ఆదివారాన్ని అమెరికా దేశమూ 'తల్లుల దినోత్సవం'గా ఆమోదించి వచ్చే ఏటికి వందేళ్లు! ప్రపంచీకరణ ప్రభావాన ఇవాల్టి రోజును మరెన్నో దేశాలూ తల్లికి కృతజ్ఞతలు చెప్పే ఓ సంబరంగా జరుపుకొంటున్నాయి. ప్రేమాభిమానాలు భారతీయులకేం తక్కువ? మాతృదినోత్సవం ప్రస్తుతం మనకూ ఓ ముఖ్యమైన పండుగ కావడం అబ్బురం కాదు.

 

కాలం సనాతనమైనా, అధునాతనమైనా- అమ్మ పాత్రలో మాత్రం మారనిది సౌజన్యం; బిడ్డ కోరితే గుండైనా కోసిచ్చే త్యాగ గుణం; కోటి తప్పిదాలనైనా చిరునవ్వుతో క్షమించేయగల సహనం. గుళ్లోని దేవుణ్ని అడిగాడు ఓ సత్యాన్వేషి- 'అమ్మ' అంటే ఏమిటని. 'తెలిస్తే ఆమె కడుపునే పుట్టనా!' అని దేవుడి ప్రత్యుత్తరం. భిక్షమడిగే బికారిని అడిగాడీసారి. 'బొచ్చెలోని పచ్చడి మెతుకు'లని సమాధానం. నడిచే దారిలో ఓ రాయి తాకి తూలి పడినప్పుడు కాని తెలిసి రాలేదా సత్యాన్వేషికి తన పెదాల మీదే సదా దాగుండేది అమ్మేనని. విలువ తెలియనివారికి అమ్మ అంటే 'ఇంతేనా'!; తెలుసుకున్నవారికి 'అమ్మో... ఇంతనా!'. 'ఆపద వచ్చినవేళ నారడి బడినవేళ/ పాపపు వేళల భయపడిన వేళ/ వోపినంత హరినామమొక్కటే గతి...' అనే అన్నమాచార్యులవారి సంకీర్తనలోని హరినామానికి అమ్మ పదమొక్కటే ఇలలో సరి. అడ్డాలనాటి బిడ్డలకు గడ్డాలు మొలుచుకొచ్చి- ఆలి బెల్లం, తల్లి అల్లమవుతున్న రోజులివి. కాలమెంతైనా మారనీ... పెరటి తులసి వంటి అమ్మలో మాత్రం మార్పు లేదు, రాబోదు. అందుకేనా చులకన? బిడ్డను చెట్టులా సాకేది తల్లి. ఆ తల్లికే చివరి దశన కాస్తంత చెట్టునీడ కరవవుతున్నది. పేగు పంచి ఇచ్చిన ఆ తల్లికి 'జీవించే హక్కు' ఇప్పుడు ప్రశ్నార్థకం! తల్లి కన్నీటికి కారణమైనాక బిడ్డ ఎన్ని ఘనకార్యాలు ఉద్ధరించినా సార్థకమేది? కన్నీటి తడితో కూడా బిడ్డ మేలును మాత్రమే కోరేది సృష్టి మొత్తంలో తల్లి ఒక్కతే. 'అమ్మకై పూదండ/ లల్లుకుని వచ్చాను/ అందులో సగభాగ/ మాశపెడుతున్నాను/ మా యమ్మ మాకిత్తువా దైవమా!/ మాలలన్నియు నిత్తురా!' అని మాతృవిహీనుడైన ఓ కవిగారి మొత్తుకోలు. అమ్మ పాదాలు దివ్య శోభాకరాలు, పరమ కృపాస్పదాలు, సకల భయాపహరాలు... అమ్మ పాదాలు కొండంత అండ! 'అమ్మపండుగ' ఏడాదికి ఒక్కనాడే. నిండు మనసుతో బిడ్డ ఆదరించిన ప్రతిక్షణమూ అమ్మకు నిజమైన పండుగే!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు , సంపాదకీయం - 11:05:2013)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...