Thursday, December 9, 2021

ఈనాడు - సంపాదకీయం జీవన శిల్పం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 20-03-2011 - ప్రచురితం )

 ఈనాడు - సంపాదకీయం 

జీవన శిల్పం

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 20-03-2011 - ప్రచురితం ) 


భారతీయ కాలమానం ప్రకారం ఏడాది చివర్లో వచ్చే పౌర్ణమి, ఫాల్గుణంలోనే శిశిరంలో రాలిన ఆకుల స్థానే కొత్త చివుళ్ళతో ప్రకృతి పచ్చగా పలకరించడం ప్రారంభించేది.  మరునాటి నుంచీ మొదలయ్యే వసంతంతోనే 'రాగవర్ణ రంజితమైన వసంతాగమనం ముందుంది. ' సంబరాలు జరుపుకొనేటందుకు పండుగ ఓ మంచి సందర్భం' అన్న పెద్దల ఆశావాద ఆదేశ ఫలితమే ఫాల్గుణ పౌర్ణమి హేళికా పౌర్ణమిగా వన్నె లీనడానికి కారణం. 'హేళి' అంటే దేవభాషలో వినోదం. 'హేళిక' అనే శిశుఘాతకి రఘునాథుడనే మహారాజుచేత మరణం పాలయింది  పౌర్ణమినాడే అని చెబుతారు. హిరణ్యకశిపుని సోదరి హేళిక, సోదరుని ఆదేశానుసారం మేనల్లుడితో సహా అగ్నిప్రవేశం చేసినా విష్ణుభ క్తి ప్రభావంతో తాను బలయ్యీ ప్రహ్లాదుని కాపాడింది. ఆ త్యాగమూర్తి స్మరణగా జరుపుకొనేదీ  ఈ హేళికా పర్వదినమని మరో  కథనం. ఆదిశంకరుడు మంచుకొండ పై  యోగముద్రలో ఉన్నవేళ పర్వత రాజపుత్రిక పరిచర్యలు ఆచరించేది. తారకాసుర వధ నిమిత్తం సంభవించే  కుమార జన్మ కై  వారిమధ్య అదను కొరకు  వేచి ఉన్న పూ విలుకాడి వాడి శరాఘాతానికి శివుడి  తపోభంగమైనది . ఉగ్ర రుద్రుడు ముక్కంటి మంటతో మరుడిని  బూడిద చేశాడు. స్త్రీ పురుష శక్తులను పరస్పరానుసంధానం చేసి సృష్టి చలనము కై   ప్రధాన  ప్రేరకుడిగా ఉండ వలసిన పుష్పశరుడు మాడి మసి అయితే జీవప్రవాహం ఘనీభవించిపోదా! రతీ విలాపంతో పతి ఆనతితో  పార్వతి మన్మథుడికి  పునర్జీవితం ప్రసాదించినదీ  ఈ ఫాల్గుణ పున్నమి  నాడేనని లింగపురాణ కథనం.  ఆ కామదేవుని పునర్జన్మ భూమి మీద పర్వదినమైంది. ఈ రంగుల పండుగ వసంతుని ఆగమనానికి  యువహృదయం పట్టే స్వాగత హారతి  అన్నాడో కవి. అర్థవంతమైన వ్యాఖ్యానం కదూ! 


వసంత రుతువేళ చెట్టు పుట్ట గుట్ట ఏ తరహా ప్రణయ భావనలకు దోహద కారకమవుతుందో వివరించని ప్రబంధకవులు లేరు. ప్రబంధాల ప్రధాన లక్షణాలలో  రుతువర్ణన ప్రముఖమైనదైతే. . అందులో వసంతకాలపు  వర్ణన మరింత ప్రధానమైనది. గోదాదేవి విరహతాపం  వర్ణితమయ్యే   సందర్భంలో రాయలవారి ఆముక్తమాల్యద ఐదుపదుల పద్యాలతో వసంత రుతువు  శోభను ఆవిష్క రించింది . మన్మథుడి ధనుస్సు పుష్పమయం. వింటినారి తుమ్మెదల బారు. అతగాడి సామంతుడైన వసంతుడికి మాధవుడని మరో పేరూ కద్దు. ఆ మిషతో మాధవుడు బలినణచిన వామనుడివలె త్రిలోకాలను ఎలా ఆక్రమించెనో  కవి ఆలంకారిక శైలిలో  చెప్పుకొచ్చాడు . పూవుల  మకరందం పాతాళాన్ని, పూవులు  పృధ్వినీ , పూ పరిమళం అంబరాన్ని  ఆక్రమించాయంటాడు  కవి. కవి ప్రజ్ఞకు వసంత రుతువర్ణన గీటురాయి. రాయలవారికి సమ ఉజ్జీ రామరాజ భూష ణుడు. మన్మథుడి చెలికాడైన మాధవుడి తపోఫలం మరుత్కుమా రుడు. ఆ పసివాడిని వసంతకాలంలో వృక్షాలు పెంపుడు తల్లులై ఊయలలేర్పాటు చేసి జోలలు  పాడేవట. ఆ వైనాన్ని వసుచరిత్ర కర్త అద్భుతమైన పద్యంలో హృద్యంగా వర్ణించాడు. అశోకపుష్పాల మక రందం తాగిన తుమ్మెదల ఝంకారాలకు కోకిలల పంచమరాగాలు తోడై బండి గురివెందల పుప్పొడులు  నిండిన ఆకాశం సందడి చేస్తుంటే 'లతికలు  హితకోటి ససినయపుడు , మదన  క్రీడోత్సవ నదిక సరుల దరుణులు విరులయోవరుల  సిరుల రాచజాతరల్సేయుట  అరుదా ' అని ఆ కవి  సందేహం వెలిబుచ్చాడు. సందేహం లేదు కనకనే, విశ్వసాహిత్యం మంతటా  వసంత విలాసాన్ని గురించి అంత రసస్మృష్టి సాగటం .


శిశిరంలో జీవకళ తగ్గి పేలవంగా ఉండే ప్రకృతి కన్నె వసంతుని చూడగానే పులకిస్తుంది. ఈ వసంతవేళా  సీతాన్వేషణలో ఉన్న రాముడు సోదర సమేతంగా పంపానదీ తీరప్రాంతంలో  చైత్రమాస వనశోభను పోలిన సతిసౌందర్యాన్ని స్మృతికి తెచ్చుకుని విల పిస్తాడు. సీతా వియోగ శోకంతో ఉన్న తనను  మన్మథుడు మరీ పీడిస్తున్నాడన్నది రాముని ఆరోపణ . మధుమాస వేళ తావలచిన గోవిందుడు సమీపాన లేని రాధ బాధా అదే . ముక్కు మూసుకుని తపమాచరించే ముముక్షువులకే వాసంతికాశోభ తాపాలు రేకెత్తించగా లేనిది యౌవనం లో గం  యువతీయువకుల తుళ్లింతలను ఆపడం దాని తరమా  ' అంటుంది  జయదేవుడి  గీతగోవిందమ్.  'రసమయమైన ప్రకృతి ఆరాధనే ముక్తికి ఒక మధుర సాధన' అని రసతత్వవేత్త సంజీవదేవ్ వాదన కూడా . జీవి జననం, జీవనం, మరణం ప్రకృతితోనే అనుసంధానిమితులు . ప్రకృతిని ప్రేమించడంవల్ల మనిషిలోని దైవత్వ భావనకు విస్తృతి ఏర్పడుతుంది' అన్న వర్డ్స్ వర్త్ మాటలు అక్షరసత్యాలు, కవులు, గాయకులు, చిత్రకారులు, తత్వవేత్తలు, ద్రష్టలు.. తమ ప్రతిభా వ్యుత్పత్తుల  ద్వారా ప్రకృతికి సౌందర్య రూపం సృజించడం ఈ దైవత్వ సాధనకోసమే కావచ్చు. రసికుల హృదయాలలో  రసతరంగాలు రేకెత్తించే రచనలు సృష్టించిన కవుల జాబితాకు కొదవ లేదు. కొడవటిగంటి చెప్పినట్లు అందరం కాళిదాసులం, రవివర్మలం, పురందరదాసులం కాలేకపోవచ్చు...! కంటిముందున్న ఈ రస జగత్తును అర్ధం  చేసుకుని ఆస్వాదించగలిగితే అంతకుమించిన జీవన శిల్పం మరొకటి లేదు. ' చలిత చలిత మచ్చరణ కటకమం/ జీరగళ స్రుత శంజితమ్ము/ పిలిచి పిలిచినా పలుకరించినా' చలించక పోవడానికి, దేవులపల్లివారు సందేహించినట్లు - మన ఎడద జడశిల కాదుగదా! అలా కాకూడదనే కాలపురుషుడు ఏడాదిలో మూడు నెలలపాటు మోడువారే బీడు బతుకు పత్రాల పై  వసంతమనే మధు సంతకాన్ని మనకోసం క్రమం తప్పకుండా అంత అందంగా చేసి అందించేది . అందిస్తూనే ఉండేది . ఆటవిడుపుగానైనా రసాస్వాదన చేయడం మనకే కాదు .. మన మనసులకీ హితకరం.  అదే, ఈ వసంతోత్సవం ఇచ్చే సందేశం.


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 20-03-2011 - ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...