Tuesday, December 7, 2021

సాహిత్య వ్యాసం సొంత ముద్ర కర్లపాలెం హనుమంతరావు ( తెలుగు వెలుగు- ఆగష్టు 2018 సంచికలో ప్రచురితం '

 



సాహిత్య వ్యాసం 

సొంత ముద్ర 

కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు వెలుగు- ఆగష్టు 2018 సంచికలో  ప్రచురితం ' 



ఏ వలరాజు భార్యను నుపేంద్రుని కోడల శంభుచేత నా 

దేవర గోలుపోయి కడు దీనత నొందుచుచున్న దానఁ రం 

డో వనవీధినున్న కచరోత్తములార దిగీంద్రులార రం 

డో వనవాసులార వినరో మునులార యనాథ వాక్యముల్


నేను మన్మథుడి భార్యను . విష్ణుమూర్తి కోడల్ని.  శివుడి మూలకంగా  నా భర్తను పోగొట్టుకుని చాలా దుఃఖంలో ఉన్నదాన్ని. అడవుల్లో, ఆకాశంలో ఉండేవాళ్లు, అంతా రండి! ఈ అనాధ వినండి!- అని పై పద్యానికి అర్థం. ఈ పద్యం పోతన రచించిన  ' వీరభద్ర విజయం'లోని రెండో 121వ పద్యంగా కనిపిస్తుంది, 


* *


నిస్సహాయ పరిస్థితుల్లో బలహీనులు, భాగ్యులు ఇలాగే స్పందిస్తారు. ముఖపరిచయం లేకపోయినా దారినపోయే వాళ్లందరినీ పేరు పేరునా పిలిచి తమకు జరిగిన అన్యాయాన్ని ఏడుస్తూనే ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ పనే చేస్తోంది ఇక్కడ రతీదేవి కూడా!


ఇంద్రుడు పంపించాడని శివయ్య గుండె బొండుమల్లెల పరిమళాలు పూయించాలని పూలబాణాలతో సహా మహా ఆర్భాటంగా ఊరేగుతూ వచ్చాడు. వలరాజు (ఆహాఁ! ఎంతచల్లని తెలుగు పలుకు). దేవయ్య మీదకి బయల్దేరే ముందు అక్కడికీ ఓ ధర్మపత్ని బాధ్యతగా ముందొచ్చే ముప్పు గురించి హెచ్చరించింది రతీదేవి. అతివిశ్వాసంతో శివయ్య మీద ప్రణయసైన్యాన్ని వెంటేసుకుని మరీ దాడి చేశాడు మన్మధుడు. చివరకు ఆ ముక్కంటి మూడోకంటి నిప్పురవ్వలకు కాలి బూడిదపోగయ్యాడు! 


శివయ్య చేసింది అన్యాయం. కానీ ఆయనేమో దేవతలకు దేవుడు. ఎవరయ్యా ధైర్యంగా ఎదురు నిలబడి అడగ్గలరు? అట్లాగని మనసారా ప్రేమించి పెళ్లాడి కడదాకా జీవితాన్ని పంచుకుందామని గంపెడంతాశతో గృహస్థ ధర్మం స్వీకరించిన స్త్రీమూర్తి చూస్తూ ఊరుకుంటుందా? ఏదేమైనా సరే... తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేం దుకు ఎదురు నిలబడాలనే సగటు ఇల్లాలి మాదిరి రతీదేవి పంతం పట్టింది. అందుకే ఆ దుర్ఘటన జరిగిన వనంలోనే బూడిదకుప్ప ముందు కూలబడింది. అక్కడి వనవాసులను, ఆకాశజీవులను, ఆఖరికి ఆ శివయ్యే సర్వస్వమనుకునే మునిగణాలను కూడా తన మొర ఆలకించమని వేడుకుంటోంది పరమ దయనీయంగా! 


మామూలు మానవులకే కాదు దివ్యశక్తులున్నాయని మనం నమ్మే దేవుళ్లు కూడా కష్టసుఖాలు ఎదురైనప్పుడు మనలాగే భావోద్వేగాలకు లొంగిపోతారా? అని ప్రశ్న వేసుకుంటే కొన్ని కొత్త విషయాలు బయటికి వస్తాయి. అవి కావ్యరచనకు సంబంధించిన రహస్యాలు.


సృజన రహస్యమంతా అక్కడే ఉంది. తన కృతిని పదిమంది చదివి తాదాత్మ్యం చెందాలని కోరుకుంటాడు కవి. అలా తన్మయత్వం చెందాలంటే రచనలోని పాత్రలు దేవుళ్లయినా, దానవులైనా మనుషుల మాదిరే భావోద్వేగాలు ప్రదర్శించక తప్పదు. అప్పుడే చదివే పాఠకుడు తన స్వభావంతో.. తన పరిసరాల నైజంతో ఆ పాత్రలను సొంతం చేసుకునేది. తన రచన చదివే పారకులు ఎవరో ముందే నిశ్చయించుకునే కవి/ రచయిత ఆ రచనను తన సొంత స్థాయికి కాకుండా పాఠకుడి మేధోస్థాయికి తీసుకువెళ్తాడు.


కథాకాలం ఏదైనప్పటికీ, కథన  కాలానికి పాఠకుల భావోద్వేగ స్థాయికి తగినట్లు సాగే రచనే పదికాలాల పాటు కాలానికి ఎదురీది నిలబడేది.


పై పద్యకర్త బమ్మెర పోతన అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అచ్చతెలుగు పదాల పోహళింపు, ద్రాక్షాపాక రసధార, చెవులకు ఇంపనిపించే శబ్దాల్ని పొదిగి చేసే పదప్రయోగాలు, సందర్భానికి తగ్గట్లు ఛందోవృత్తాల వాడకం... ఇవన్నీ ఆయన ‘ముద్ర’ను పట్టిచ్చేస్తాయి.


రచన చదివినప్పుడే ఫలానా కవిది/ రచయితది ఈ కర్తృత్వం అని పాఠకుడు  గుర్తుపట్టేలా రచన సాగితే.. అదే ఆ కవి 'ముద్ర'. 


ప్రతీ కవి, రచయిత, కళాకారుడు తనదైన సొంత'ముద్ర' స్థాపించుకున్నప్పుడే సాహిత్యంలో అతని పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. కొత్త రచయితలు పాత రచయితల నుంచి నేర్చుకోవాల్సిన అనేక సృజన లక్షణాల్లో 'ముద్ర' కూడా ఓ ముఖ్యమైన సుగుణం.


- కర్లపాలెం హనుమంతరావు 

( తెలుగు వెలుగు- ఆగష్టు 2018 సంచికలో  ప్రచురితం ' 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...