Sunday, December 12, 2021

సాహిత్యం : సరదాగా ఒక సున్నా కథ - కర్లపాలెం హనుమంతరావు

సాహిత్యం : సరదాగా 

ఒక సున్నా కథ 

- కర్లపాలెం హనుమంతరావు 


కాళిదాసుగారు ఓసారి చదరంగం ఆడుకుంటూ .. మధ్యలో తన పరిచారిక అందించిన  తాంబూలం నోట్లో పెట్టుకుని, ' అబ్బ! సున్నం ఎక్కువయ్యింది! ' అన్నాడుట! 


ఆ సమయంలో  సోటి కవి భవభూతి రాసిన 'ఉత్తరరామ  చరిత'   అనే కావ్యం అతగాడు పంపిన్ దూత  చదివి వినిపిస్తున్నాడు.  కాళిదాసు మహాకవి కాబట్టి కావ్యంలోని మంచీ చెడ్డా వివరంగా పరిశీలించి  సూచనలిస్తాడని భరభూతిగారి ఆశ.  


కావ్యం  అయితే వినిపించడం జరిగింది. కాని,  తిరిగొచ్చిన దూత భవభూతిగారు  పదేపదే అడిగిన మీదట 'మహాకవి గారి  ధ్యాసంతా ఆ చదరంగం ఆటమీదా , అతగాని పరిచారిక మహాతల్లి తెచ్చిచ్చిన  తాంబూలం మీదనేనాయ! మీ కావ్యం ఎంత వరకు విన్నాడో .. నాకయితే అనుమానమే! మధ్యలో మాత్రం  ఓ శ్లోకం దగ్గర ' సున్నం  ఎక్కువయింద'ని  ముక్తుసరిగా అన్నాడండీ ! 

' ఏదీ ? ఆ శ్లోకం ఎక్కడిదో .. చూపించు! ' అ భవభూతిగారు అడిగిన మీదట

'ఇదిగో ఈ  ' కిమపి కిమపి' శ్లోకం అని చెప్పుకొచ్చాడుట దూతగారు. 


'కిమపి కిమపి  మందం మందమాసక్తి యోగా

దవిరల కపోలం జల్పతో రక్రమేణ

అశిథిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో

రవిదిత గతయామా రాత్రి రేవం వ్యరం సీత్' 

- ఇదీ శ్లోకం. 

భవభూతిగారు కూడా కవే కాబట్టి కాళిదాసు నర్మగర్భంగా అన్నది.. దూతగారికి అర్థం కాకపోయినా తనకర్థమయింది.. 


శ్లోకంలోని  ఆఖరి పాదంలో ' ఏవం వ్యరంసీత్‌' అనే పదప్రయోగానికి బదులుగా  ‘ఏవ వ్యరంసీత్’ అని ఉండాలని  కాళిదాసుగారి  సూచన. కాళిదాసు సున్నం ఎక్కువయ్యింది అన్న మాట శ్లోకంలో ఒక ‘సున్నా’ ఎక్కువయ్యింది అన్నట్లన్న  మాట.  భవభూతిగారూ కాళిదాసు సూచన ప్రకారమే   మార్చి శ్లోకాన్ని మరింత అర్థవంతం చేశాడని కథ. 

 

కథ, దాని అర్థం కేక! కరతాళధ్వనులు మిన్నుముట్టడానికి తగినట్లే  ఉన్నాయి. అనుమానం లేదు. కానీ ఇది ఇక్కడ ఉదాహరణ కింద చెప్పడానికి కారణం  వేరే ఉంది. 


మన వాళ్లకు చరిత్ర .. కవి కాలాదుల పట్ల  బొత్తిగా పట్టింపు లుండవనే అభియోగం ఒకటి మొదటి నుంచీ కద్దు .  దానికి మరింత  బలం చేకూరేలా ఉందనే ఇంత విపులంగా చెప్పడం  ఈ  కట్టుకథ . 


భవభూతి కాలం దాదాపు ఎనిమిదో శతాబ్దం;  కాళిదాసు జీవించిన కాలం బహుశా నాలుగో  శతాబ్దం! ఈయనగారు  ఆయనగారికి  ఒక దూత ద్వారా తన కావ్యం  వినిపించడం కామెడీగా లేదూ? 😁


ఒకానొక తెలుగు చలనచిత్రంలో కూడా ఇట్లాగే భద్రాద్రి రామదాసుగారు , భక్త కబీరును   కలిసి వేదాంతచర్చలు సాగిస్తారు! అదీ సంగతి !  😁


ఇట్లాంటి కామెడీలే  చూసి చూసి  మాన్యులు శ్రీ  వెల్చేరు నారాయణరావుగారు ' I like these fantastic lifespans and anachronistic legends. Indian literature is full of them. Remember Kalidasa and Bhavabhuti and Dandin meeting together in caatu tradition?'

( Refer to the Afterword in A Poem at the Right Moment) అనేశారు. 

అన్నారంటే అనరా మరి? 


- కర్లపాలెం హనుమంతరావు 

30 - 10-2021 

బోథెల్ ; యూఎస్.ఎ

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...