Wednesday, December 8, 2021

ఈనాడు - సంపాదకీయం ఆమె గుండె చప్పుడు - కర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - సంపాదకీయం 

ఆమె గుండె చప్పుడు! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 27 -02 - 2011 - ప్రచురితం) 


'దైవం స్త్రీ జాతి పక్షపాతి. ప్రావీణ్యం సాధించిన తరవాత అంగన సృష్టికి పూనుకొన్నాడు. అందుకే ఆమె అంత సర్వాంగ సుందరంగా శోభిల్లడం ' అంటాడు రామాయణంలో వాల్మీకి. 'తమ్ములనేలు కన్నులు, సుధానిధిబోలు మొగంబు' అంటూ మొదలుపెట్టి 'తేనియల్/ చిమ్మెడు ముద్దు బల్కులును జేయని సొమ్ములు సుందరాంగికిన్' అంటూ శృంగార పారవశ్యంతో భామినుల అంగాంగ వర్ణనలకు పూనుకొన్న భర్తృహరి 'కుచములు ముక్తావళి రమ్యముల్' అనేదాకా సాగిలపడ్డాడు. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకను గూళల కివ్వనని తల్లి వాగ్దేవికి వాగ్దానం చేసే సందర్భాన కూడా 'కాటుక కంటినీరు చనుకట్టు పయింబడనేల యేడ్చెదో?' అని పోతనామాత్యుడు అన్నాడంటే... మరి ఎంత పరమ భాగవతోత్తముడయితేనేమి ..  అతగాడూ ఒక మగవాడే గదా అనిపించక మానదు. ఇది ప్రకృతి విరుద్ధం కూడా కాదంటాడు శృంగారనైషధ కర్త శ్రీనాథుడు. 'మాంచి పైలాపచ్చీసులో ఉన్న పడుచుపిల్ల చెక్కిలిమీద చిటికేస్తే యువకుల మనసులు ఉయ్యాల లూగుతాయిగానీ... చంటివాళ్లకేం చలనముంటుందీ?' అనేవారి మాటలూ కొట్టి పారవేయదగినవి  కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడంతటి మహా మాయావి సమర సమయంలో మేనమామ వాహనం కువ లయపీడం కుంభస్థలి చూసి రాధ గుండెపొంగుల తలపులతో తబ్బిబ్బులయ్యాడని జయదేవుడు గీతగోవిందమ్ చమత్కరించింది కదా ! స్త్రీ సౌందర్య సందర్శన మాత్రం చేతనే పురుష హృదయం ఉప్పుటేరులాగా ఉప్పొంగడం సృష్టిసహజం. 'కులుకు కుచ కుంభ ముల కొమ్మకును కుంభరాశి' అని అన్నమయ్య అమ్మ అలివేలు మంగమ్మను కీర్తించినా  స్తుతి అమ్మ పరంగా నాగింది కనుక  అసభ్యమనిపించదు.


అమృతం కోసం సురాసురులు క్షీరసాగర మథనానికి పూనుకో వాల్సి వచ్చింది. మానవుడు అదృష్టవంతుడు... ఏ ప్రయాసా లేకనే పెదవులకు అమృతాన్నందించే ప్రేమమూర్తి లభించింది. ఎంత భగవానుడైనా సరే- ఒకసారి భూమిమీద అవతరించిన తరువాత... తరుణంలో తల్లి చన్ను కుడవక తప్పదు. శకటాసురుని వధానంతరం ఏడుపు లంకించుకున్న బాలకృష్ణుని తన ఒడిలోకి లాక్కొని ' అలసితివిగదన్న చన్ను గుడువుమన్న సంతసపడుమన్న' అంటూ యశోద పడ్డ ఆరాటం అలవికానిది. బెజ్జ మహాదేవి తాను బిడ్డగా భావించిన పరమేశ్వరుణ్ని తలచుకుంటూ 'తల్లి లేకుండిన తన యుడు గాన/ ప్రదుడై యిన్ని వాట్లకు వచ్చే జన్నిచ్చి పలుమాఱు వెన్నయు బెట్టి/ పన్నుగా నిన్నియు బాలును పోసి/ యాకొనగా గడు పరిసి పాలిచ్చి సాకించి పెనుపదే జనని గల్గినను' అంటూ పరిపరి విధాల వాపోయింది. పులి ఎదురైనప్పుడు గోమాతకు ముందుగా గుర్తుకొచ్చింది ఇంటివద్ద ఉన్న కన్నబిడ్డ కడుపారాటమే!  ఇన్ని పాలిచ్చి ఇన్ని సుద్దులు నేర్పి ఇప్పుడే వస్తానని ఆ కన్నపేగు కోసమే పులిముందు అంతగా ఆరాటపడింది! ఊరి బైట వేద పాఠ శాలలో విద్యాభ్యాసం చేసే ఒక బ్రహ్మచారి ఎప్పటిమాదిరే మధ్యాహ్న భోజనంకోసం ఒక ఇంటిముందు జోలెపట్టి 'భవతీ భిక్షాం దేహీ ' అని పిలిచాడు.  స్నానం చివరలో ఉన్న ఆ ఇంటి ఇల్లాలు ఒంటిమీది తడిబట్టలతోనే ఆహారం తీసుకొచ్చింది. చదువు తప్ప మరే ధ్యాసా ఎరుగని ఆ బాలకుడు తల్లి ఎదురురొమ్ములు  చూసి ' ఏమిటమ్మా అవి?' అని అమాయకంగా అడిగాడు. ' పుట్టబోయే పాపాయికి దేవుడు ఇచ్చిన రెండు పాలగిన్నెలు నాయనా!' అని తెలివిగా బదులు ఇచ్చింది ' అంటారు తిరుమల రామచంద్ర. కరుణశ్రీ ఈ పాలగిన్నెలనే పొదుగుగిన్నె అని కూడా భావిస్తూ ఎంతో కరుణ రసాత్మకమైన  కవితలల్లారు . పెదవులయందమృతము మాటలయందమృతము చూపులయందమృతము అమృతంబుగల కుంభద్వయంగల స్త్రీత్వమునకు ప్రణామంబు' అంటుంది సుభాషిత రత్నావళి.


పురిటినొప్పులు తెలియని పురుష జాతికి జన్మనిచ్చి స్తన్యమిచ్చే స్త్రీకి ఆరోగ్యమనేది ఎప్పుడూ పెద్ద సమస్యే. రుతువులు, పురుళ్ళు, సంసారంలోని అనివార్యమైన బాధ్యతల ఒత్తిళ్ళూ... ఆమెనెప్పుడూ వత్తి అంచుదాకా కాలిపోయే దీపశిఖగానే చేస్తున్నాయి. పరదుఃఖ కారుణ్యం నెలత అదనపు బలహీనత. చప్పట్లకు ఎగిరిపోయే చెట్టు మీది చిలకల్లాగా ఇక్కట్లకు బెదిరిపోయి కట్టుకున్నవారిని కన్నవారినీ వదిలిపోయే చిలకల కొలికి కాదు గదా ఆమె! సంసార రథానికి ఆమె రెండో చక్రమైనప్పుడు- జీవనయానం సునాయాసంగా సాగటానికి ఆ చక్రమూ సక్రమంగా ఉండాలి గదా! కష్టంలో ముందుండే... సుఖంలో తోడుండే, విజయంలో వెనకుండే... ఎల్ల పుడూ పక్కనే ఉండే ఆమె గుండెలతో ఆడుకోవడమేకాదు- లోపలి గుండెచప్పుళ్లనూ వినటం మగవాడు నేర్చుకోవాలి. నారీనింద్యాలు అని చెప్పే పదిహేడు బలహీనతల్లో స్వ స్వస్థతపట్ల స్త్రీకి సహజంగా ఉండే నిర్లక్ష్యమూ ఆమె అనారోగ్యానికి ప్రధాన హేతువని మనోవైజ్ఞానికుల భావన. వ్యసనాలకు దూరంగా ఉండే ఆడవారి  ఆయుష్షు సైతం మగవారికన్నా తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం- రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ని తొలిదశలో గుర్తించగలిగితేనే నివారణ సాధ్యమవుతుంది. ఒకదశ తరవాత నివారణ అసాధ్యం. రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తికి కారకమైన పదార్థాన్ని వైద్యులు గుర్తించగ లిగారు. శరీరంలోని వేరే భాగాలకు క్యాన్సరు కణాలు సోకటానికి కారణమయ్యే ఈ పదార్ధం చర్యను అరికట్టగలిగే కీలక విధానాన్ని కనిపెట్టినట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేసే బ్రిటిష్ క్యాన్సర్ పరిశోధనా బృందం ప్రకటించింది. బృంద సారథి ఆర్లేన్ విల్కీ ఆశించినట్లు- 'రొమ్ము క్యాన్సర్ కణాలు వేరే అవయవాలకు వ్యాపించి సంభవిస్తున్న తొంభైశాతం స్త్రీ మరణాలు రాబోయే కాలంలో గణనీయంగా తగ్గుముఖం పట్టగలవని ఆశిద్దాం. దుఃఖం లేనిచోటే స్వర్గమని యజుర్వేదం అంటుంది. ఆ స్వర్గం పురుషుడికి దక్కాలంటే- తల్లి, చెలి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి.


- - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 27 -02 - 2011 - ప్రచురితం)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...