Saturday, December 4, 2021

ఓం సహనావవతు - ఈనాడు ఆదివారం సపాదకీయం

 సాహిత్యం : 

ఓం సహనావవతు 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆదివారం సంపాదకీయం) 


జీవవైవిధ్యం సృష్టి కళ. జీవనవైవిధ్యం మనిషి  సృజించుకొన్న కళ. సప్తవర్ణ సంశోభిత ఇంద్రచాపం మనిషి మాత్రమే ఆస్వాదించే సౌందర్యం. శృంగార హాస్య కరుణ శాంత రసాలతో మాత్రమే సంతృప్తి చెందలేదు మనిషి. వీర భయానక భీభత్స అద్భుత రౌద్ర రసాలనూ జత కలుపుకొని మరీ సంపూర్ణ భావోద్వేగానంద అనుభవాన్ని అందుకొంటున్నాడు. కట్టమంచివారి 'ముసలమ్మ మరణం' ఖండకావ్యారంభంలో మానవ భావవైవిధ్యాభిరుచిని అద్భుతంగా అద్దంపట్టే ప్రార్థన ఉంది. 'శ్రీల జైలంగు లోకముల సృష్టి యొనర్ప విరంచియై, తగం/ బాలన సేయ విష్ణువయి, వాని లయింపగ శూలపాణియై,/ లీల సరస్వతిన్ గలిమి లేమను భార్వతి గూడివెల్గు' దివ్యాలము శాంతతేజము మానవ మహార్తిని హరించే శక్తిగా కవి ప్రస్తుతించే మంచి రుచికరమైన పద్యం అది. 'అలుకనైన జెలిమినైన గ్రామంబునైన బాంధవముననైన భీతినైన దగిలి తలప నఖిలాత్ముడగు హరి జేరవచ్చు- వేరుసేయడతడు' అంటూ బమ్మెర పోతనామాత్యుడి ప్రహ్లాదుడు ప్రబోధించింది ఈ వైవిధ్యముక్తిలక్ష్య లక్షణాన్నే! త్రిమూర్తులలోని రుద్రుడిది రౌద్రముద్ర. 'కడిగి మూడవకంట కటిక నిప్పులు రాల/ గడు బేర్చి పెదవులపై గటిక నవ్వులు వ్రేల/ ధిమిధిమిధ్వని సరిద్దిరి గర్భములు తూగ/ నమిత సంరంభ హాహాకారములు రేగ' శివుడు ఆడి పాడిన శివతాండవఖేల రౌద్రరస పతాకస్థాయికి ప్రతీక. 'ఉగ్రరూపం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం / నృసింహం భీషణం భద్రం' అంటూ మృత్యువుకే

మృత్యుపై అవతరించిన నృసింహునిముందు శ్రీశంకరులు 'దాసోహం' అని తలొంచారు. అహంకారంతో, ప్రలోభంతో, భీకరాకృతితో మానసాలని పట్టి పీడించే భవబంధరాక్షసాలను వివేకమనే నఖాగ్రాలతో చీల్చి బాధోపశమనం ప్రసాదించడమే దాక్షిణ్యమూర్తి అవతార లక్ష్యం. ప్రహ్లాదుడికే ఆహ్లాదమందించిన ఆ వాత్సల్యరూపికి ఏ వివేకి అయినా దాసోహమవకుండా ఎలా ఉంటాడు? 



వివేకం మరో పేరే సంయమనం. తైత్తరీయోపనిషత్తు కాలంనుంచే మనిషి చెప్పుకుంటున్న బహుపరాక్కు 'ఓం సహనావవతు' వాక్కు. రాముడికి లక్ష్మణుడు తోడు. రావణాసురుడికి విభీషణుడు నీడ. అసహనం.. సంయమనం జతగా కలసి నడవవలసిన అగత్యం పురాణేతిహాసాలునిండా దండిగా ఉన్నవే. 'ఆసక్తే కాదు.. అసహనమూ అన్వేషణకు అవసరమైన దినుసే' అంటారు ఆస్కార్ వైల్డు. నిజమే. రుజాగ్రస్త దీనసమాజ హైన్యత్వం చూసి అశాంతి పాలయ్యాడు సిద్ధార్థుడు. ఆ తరువాతనే ముక్తిప్రస్థానంలో నడిచి తధాగతుడయింది. యుద్ధరంగంమధ్య విజయుడు విషాదయోగంలో పడ్డాడు. కనుకనే  బండినడిపేవాడి మిషతో భగవానుడు గీత బోధించింది! ధర్మానికి హాని కలగడం.. అధర్మం పెచ్చుమీరడం సహజమయితే కావచ్చు కానీ.. అదే అనివార్యమైన అంతిమ పరిణామచర్యగా మిగలడం ప్రమాదకరం. 'అభ్యుత్థాన మధర్మస్య సృజమామ్యహమ్'- అధర్మం పెట్రేగినప్పుడల్లా స్వీయసృజనతో ఆదుకొంటానని భగవంతుడంతటివాడు దిగివచ్చి మరీ భరోసా ఇచ్చిందీ బహుశా ధర్మసంస్థాపనోద్దేశంతోనే అయివుండవచ్చు. కాని పక్షంలో అలుగుటే యెరుంగని మహామహితాత్ముడు.. ఆ అజాతశత్రుడు  యలిగిననాడు సాగరాలన్నీ ఏకమైపోవా? దుష్టాత్ములు  పదివేవురు వచ్చినా చావరా! అందుకే అవాంతరాల సమయంలోనూ ప్రశాంత బుద్ధి ఎంతో అవసరం.  


విశ్వవిద్యాలయం మనస్తత్వ విభాగంలో పరిశోధనలు జరుగుతున్నాయి. పూర్వాశ్రమంలో అధికశాతం సంతృప్త జీవితం గడిపిన శాతం మధ్యతరగతి నడివయసు బృందంలో పొడసూపుతున్న కినుకలకు అధిక సామాజికాంశాలే కారణమవుతున్నట్లు తాజా పరిశోధనల సారాంశం. ప్రస్తుతజీవితంలోనూ అశాంతిపర్వమే నడుస్తున్నదని భావించే దిగువతరగతి యువబృందం సంఘర్షణలకు మాత్రం స్వల్ప వ్యక్తిగత సంఘటనలే ప్రేరణ అవుతున్నాయన్నది ఆ పరిశోధనల మరో కోణం. అలకలు, ఆందోళనలు ప్రపంచమంతటా ఏదో ఓ రూపంలో ప్రజ్వరిల్లుతున్న తరుణంలో ఈ పరిశోధనల ప్రాముఖ్యం పెరిగిందటున్నారు పరిశోధన బృందనాయకులు డాక్టర్ డేవిడ్ డి స్టెనో. దేశ ఆర్థిక వ్యవస్థమీదనే కాదు.. అంతర్జాతీయ సంబంధాలమీదా అసహన సంఘటనలు ప్రతికూల ప్రభావం ప్రబలంగా చూపిస్తున్నవని మన ప్రభుత్వ పెద్దలూ వాపోతున్నారు. మేధావులంతా గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం. 'ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీ చక్ర/ మిరుసు లేకుండగనే దిరుగుచుండు /.. ఏ ప్రేమ మహిమచే పృథివిపై బడకుండ/ కడలి రాయుడు కాళ్లు ముడుచుకొను'.. ‘ఆ మహాప్రేమ - శాశ్వతమైన ప్రేమ- అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ/ నిండియున్నది బ్రహ్మాండభాండమెల్ల' అన్నారు మన కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి! అసమ్మతి ప్రకటనకు మరెన్నో హూందామార్గాలు ఎదురుగా ఉండగా.. చిలిపి కారణాలేవో చూపి అలకపానుపు ఎక్కితే జనం దృష్టిలో చులకనయి పోరా ఎంత మేధావులు.. కవులు.. నటులు.. కళాకారులైనా! ఆలోచించవలసిన మంచి మాట!

***

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆదివారం సంపాదకీయం) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...