Wednesday, December 8, 2021

పుస్తకం ఓ మంచి నేస్తం - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం )



 వ్యాసం: 

పుస్తకం ఓ మంచి నేస్తం 

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం )


వసుచరిత్ర వంటబట్టించు కుంటే తెలుగు సాహిత్యమంతా మంచినీళ్ల ప్రాయమని  బాల వీరేశాన్ని ఎవరో బాగా నమ్మించారు. ఆ గ్రంథరాజం విలువ ఆ పిల్లవాడి కాలంలోనే రెండున్నర అణాలు. చిల్లుకానీ బిళ్ళ దర్శనానికైనా ఎన్నడో కానీ నోచుకోని బాలకందుకూరి పంతం వదల్లేదు. దినం తప్పకుండా ప్రతీ పరగడుపునా పుస్తక దుకాణ దర్శనం.. పొద్దెక్కేదాకా అక్కడే ఆ పుస్తక పఠనం! పంతులుగారి పంతం చూసి ఉదారంగా ఆ పుస్తకం ప్రదానం చేసాడు  దుకాణదారుడు. విద్య విలువ, ఆ విద్యను అందించే గ్రంథాల  ప్రాధాన్యత గురించి తవ్వి పోసినవారికి తవ్విపోసినంత . అడగడుగునా ఈ తరహా  వింతలూ.. విశేషాలా  అలరిస్తూనే ఉంటాయి.


ఆరువందల ఏళ్ల కిందట బడికి వెళ్లే పిల్లకాయల సంచుల్లో ఇప్పట్లా పుస్తకాల దిండ్లు వందలొందలు ఉండేవి కావు. ఒక్క చెక్కపలకే వాళ్లకు అప్పట్లో రాసుకునేందుకు దిక్కు. వేరే దేశాలలో  అయితే మైనం పూసిన చెక్కపలకలు. వింత వింత రాత సాధనాలు కనిపిస్తాయి పుస్తక చరిత్ర తవ్వుకు పోతుంటే!


ఏది కంటబడితే దాని మీదనే చేతి గోటితొ గీసే అలవాటు ఆదిలో మానవుడిది. గోలుకొండ కోట జైలులో కంచెర్ల గోపన్న గోడ మీద శ్రీరామ చంద్రుణ్ని దెప్పుతూ సంకీర్తనలు రాసుకున్నదీ చేతి వేళ్ల గోళ్ళతోనే! రాతిబండలు, తాటాకులు, భూర్జపత్రాలు, జంతుచర్మాలు, చెట్టుపట్టలు, కుండ పెంకులను, బండలను కూడా వదలకుండా ఒకానొక కాలంలో బండమనుషులు రాయడానికి వాడేవాళ్లు. రాత పరికరాల రూపంలో మార్పు రావడానికి చాలా కాలం పట్టింది. మధ్యలో విసుగెత్తి మనిషి ఈ రాత బెడద మనకెందుకులెమ్మని లేచిపోయి గాని ఉండుంటే!  మన తలరాతలు ఇప్పుడు మరోలా ఉండేవి కదా!


మహమ్మద్ పైగంబర్ ఖురాన్ షరీఫ్ ను గొర్రెమూపు చర్మాలను ఎండబెట్టిన ముక్కల మీదనే రాసాడుట పాపం. గ్రీకులు ఓస్ట్రక్ అనే కుండ పెంకులను పలకలుగా వాడేవాళ్లు. మన దేశంలో అయితే గణతంత్ర రాజ్యాలలో ముద్రలు వేసి ఇచ్చే నోట్లకు కర్రముక్కలను వాడినట్లు చరిత్ర. ఇదే శలాకా పద్ధతి.


పశ్చిమ దేశాలలో పైపరస్ కాగితాలకు గిరాకీ. అంత ధర పెట్టలేని బీద రచయితలు కుండపెంకులతో సరిపెట్టుకొనేవాళ్లే కాని రాత పని మాత్రం వదిలిపెట్టే ఆలోచన ఏనాడూ చేయలేదు. ఈజిప్టులో పనిచేసిన రోమన్ సైనికులు తమ ఖాతాలకు సరిపడా పైపరస్ సరుకు దొరక్కపోయినా కుండ పెంకులను పట్టుకు వేళ్లాడారే గానీ  ఖాతా లెక్కలు రాయడానికి పాలుమాలిందీ లేదు!


గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు అంటూ తెలుగు అడిదం సూరకవి ఎట్లా కోతలు కోసాడో.. తెలియదు కానీ.. మన దేశంలో మొదటి నుంచి తాటాకులదే రాత సాధనాలలలో రాజాపాత్ర. సమయానికి రాసుకునేందుకు ఆకులు ఇవ్వలేదని వేములవాడ భీముడు తాడిచెట్టు మొత్తాన్నే వేళ్లతో సహా బూడిద చేసినట్లు ఓ   కథ. ఆ కట్టుకతలను  పక్కన  పెట్టినా చరిత్రను బట్టి చూస్తే రాయిని కూడా రాజుల శాసనాలు రాయించేందుకు ఉపయోగించినట్లే రూఢీ అవుతుంది. అవే 'శిలాశాసనాలు' శాశ్వతత్వానికి నేటికీ ప్రతీక.  శిలాశాసనం అనే పదం అలా వచ్చిందే! అల మీద అక్షరాలు క్షరాలు/ శిల మీది అక్షరాలు అక్షరాలు/ అలా? శిలా? ప్రియా.. నా ప్రేమాక్షరాలకు నీ హృదయం? ' అని నేను గతంలో ఓ మినీ కవిత రాసినట్లు గుర్తు! 


క్రీస్తుకు నాలుగు వందల ఏళ్ల కిందటిదైనా మహాస్థాన్ శాసనం ఇప్పటికీ మనం కళ్లారా చూస్తున్నామంటే అందుక్కారణం అది శిల మీద చెక్కింది  కావడమే. మన భట్టిప్రోలు, అశోక శాసనాలూ శిలాలిఖితాలే. వేల ఏళ్ల కిందటి బౌద్ధ స్తూపాల మీద చెక్కిన జాతక కథలు నేటికీ చెక్కు చెదరని స్థితిలో తవ్వకాల్లో బైటపడుతున్నాయి ఎన్నో చోట్ల. ఈజిప్టులో కళా చిత్రాలు సమాధుల మీద దేవాలయ కుడ్యాల మీద రాయడం ఓ సంప్రదాయం.


రాతి పుస్తకాలు మోతబరువు. 177 పుటల బరువున్న ఈజిప్టు శిలాశాననం అసలు ప్రతి చదవాలంటే ఎవరైనా ఈజిప్టు దేశం దాకా వెళ్లి రావాలి. గవిమఠం శిలాశాసనం చదవాలంటే కొండలు.. బండలు ఎక్కి పైకిపోవాలి. అశోకచక్ర వర్తి మహానుభావుడు దాన్ని అంత ఎత్తు కొండ మీద ఎందుకు చెక్కించినట్లో? రాసే వాళ్లకి కష్టం ఎటూ తప్పదు. చదివేవాళ్లకీఇన్ని ఇబ్బందులా? 


బహుశా సీరియస్ పరిశోధకులు మాత్రమే ఆ శాసనాల జోలికి పోతారన్న ఉద్దేశముం దేమో.. చక్రవర్తి కడుపులో! పోనీ ప్రత్యామ్నాయంగా పోస్టులో పంపిద్దామన్నా ఉండవల్లి గుహశాసనాలు వంటి బండరాళ్ల శాసనాలను ఉండచుట్టేందుకైనా వీలు కావే! హేవిఁటో.. ఈ రాత కష్టాలు!


ఇన్ని రాతి కష్టాలు ఎదురయ్యాయనే కావచ్చు. పరిష్కారంగా కొంతలో కొంత బరువు తక్కువ లోహాలు కంచు, రాగి వంటివి వాడుకలోకి వచ్చింది. విదేశాలలోని చాలా ప్రార్థనాలయాలు, రాజప్రాసాదాలు ఎక్కువగా కంచు ఫలకాలతోనే కనువిందు చేస్తుంటాయి. బ్లోయిన్ నగరవాసులతో ఎట్ లీన్ ప్రభువు ఓ కంచు ఫలకంపైన చేసుకొన్న ఒప్పంద పత్రం అక్కడి ఓ చర్చి తలుపులకు పుస్తకం మాదిరి తాపడం చేయించిపెట్టారు. రాజప్రసాదం నేల కూలింది కానీ.. కంచు పుస్తకం మాత్రం నేటికీ చెక్కు చెదరకుండా ఉంది! పుస్తకమా.. మజాకానా!


మూరగండరాయడుగా శత్రుమూకల చేత మూడు గంగల నీళ్లు తాగించిన శ్రీకృష్ణదేవరాయలు మను  చరిత్ర కర్త పెద్దనామాత్యుడి కాళ్లు కడిగి ఆ నీళ్లు శిరస్సు మీద జల్లుకున్నాడు. చేత్తో కాలికి ఆ మహారాజు తొడిగిన గండపెండేరం కన్నా.. నోటితో చతుర వచోనిధి/వతుల పురాణాగమేతిహాస కథార్థ/ స్మృతి యుతుడవని పొగడటమే పెద్దన ఆధిక్యాన్ని పదింతలు గుర్తింపు. పెద్దనగారి ఆ ఆధిక్యానికి కారణం ఆ కవిగారు రాసిన మను చరిత్ర కదా! విద్యా సమం నాస్తి శరీర భూషణమ్- విద్యను మించిన అలంకారం మనిషికింకేమీ లేదన్న మాట అక్షరాలా నిజం. ఆ విద్యాప్రసాదం మన జిహ్వకు అందించి రుచి కలిగించే పళ్లెరం పుస్తకం.. తాళపత్ర గ్రంథాలైనా మరోటైనా!


అప్పటికీ మన దేశంలో రాగి లోహం మీది రాతలే ఎక్కువ.  గోరఖ్ పూర్ జిల్లా తాలుకు బుద్ధుని కాలం నాటి పాలీ లిపి తామ్ర శాసనం క్రీస్తుకు పూర్వం 450 ఏళ్ల కిందటిది. ఇప్పటి వరకు దొరికిన వాటిలో ఆ శాసనమే అతి ప్రాచీనమైనది.


తెలుగు దేశాలలో  తెలుగులో చెక్కిన తామ్ర శాసనాలయితే తామర తంపరలుగా కనిపిస్తుంటాయి. తాళ్లపాక అన్నమాచార్యుల వారు  ఆయన బిడ్డ తిరువేంగళాచార్యుల వారు చెక్కించిన సంకీర్తన రాగి రేకులే సుమారు ముపై రెండు వేలకు పై చిలుకు! రాజులుతమ వైభవ ప్రాగల్భ్యాల ప్రదర్శన కోసం, ప్రజలు భక్తిభావ ప్రకటనల కోసం బంగారం, వెండి వంటి వాటి రేకుల మీద స్తోత్రాలు చెక్కించడం ఓ ఆచారంగా వస్తున్నది అనూచానంగా. తక్షశిలలో గంగు స్తూపంలో బంగారు రేకు శాసనం, భట్టిప్రోలు స్తూపంలో వెండిరేకు శాసనం లభ్యమయ్యాయి. అన్ని కళాఖండాల మాదిరే అవీ ఇప్పుడు చివరకు బ్రిటిష్ మ్యూజియంలో తేలాయనుకోండి! అది వేరే కథ.


ఎన్ని నయగారాలు పోయినా చివరికి రాతకు కాగితమే గతి అనితేలిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నది చెట్టు బోదెల నుంచి రాబట్టే గుజ్జుతో తయారయే కాగితం. రాతకు, మోతకు, ఖరీదుకు, వాడకానికి అన్నిందాలా  అనువైనది కావడమే కాగితం విజృంభణకు ముఖ్య కారణం. 


ఇప్పుడిప్పుడే ఈ-బుక్స్ పేరుతో ఎలక్ట్రానిక్ పుస్తకాలు ఉనికిలోకి వస్తున్న మాటా నిజమే. అయినా అత్యధికులకు అచ్చు కాగితాలతో తయారయే పుస్తకాలంటేనే ముచ్చట పడుతున్నారు.


ఏ రూపంలో ఉన్నా పుస్తకాలు మనిషికి గొప్ప నేస్తాలు సుమా! దుర్బలంగా జబ్బురోగిలా ఉన్నాడన్న దిగులుతో కన్నబిడ్డ ప్రహ్లాదుణ్ని విద్యాభ్యాసంబున గాని తీవ్రమతి గాడని ఎంచి చండామార్కుల వారికి అప్పగించాడు రాక్షస రాజై ఉండీ హిరణ్యకశిపుడు. చదివిన వాడజ్ఞుండగు/ చదివిన సద సద్వివేక చతురత గలుగుం అన్న ఆ రాక్షసరాజు అప్పుడన్న మాటలు అక్షరాలా అందరికీ శిరోధార్యమే. అసురుల చేత కూడా పొగిడించుకున్న విద్య వట్టి నోటి మాటతో సాధించే కృష్ణ కుచేలుల సాందీపనీ గురుకుల విద్యా ప్రణాళికగా మాత్రమే సాగిపోలేదు. తావికి    పూవులా విద్య పుస్తకంలోకి ఒదిగిపోయింది.


'పాత చొక్కా అయినా తొడుక్కో! కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో!' అన్న కందుకూరి హితవు పాత చింత తొక్కు కింద మారడం మేలు కలిగించే పరిణామం కాదు. దుస్తుల ధారణలో చూపించే శ్రద్ధ నేటి తరం పుస్తక పఠనంలో ప్రదర్శించడం లేదు. క్రమంగా కనుమరుగయే జాతుల జాబితాలో పిచ్చుక, పావురాల మాదిరి పుస్తకమూ చేరడంలో తప్పెవరిది అన్న చర్చ కన్నా ముందు తగు దిద్దుబాటు చర్యలు వేగిరం తీసుకోవడం అవసరం.


అంతర్జాలం అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వస్తున్న మాయాజాలం. అయినా పుస్తకంలాగా చేతితో ముట్టుకొని, ఆప్యాయంగా గుండెలకు హత్తుకొని సారం గ్రహించేందుకు వీలయే వాస్తవిక ప్రపంచం కాదు అది. ఎవరైనా.. ఏమైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాగైనా.. ఏ హద్దులు, పరిమితులు, నిజ నిర్ధారణలు, వడపోతలు గట్రా లేకుండా ఏ ప్రామాణిక పరీక్షల ముందు నిలబడలేని సమాచారం అన్ని వర్గాల పాఠకులకు వయో లింగ భేదాలనేవేవీ లేకుండా అందుబాటులోకి తెచ్చేది ఈ జిత్తులమారి వర్చ్యువల్ ప్రపంచం. కల్లో.. కనికట్టో నిర్ధారణ కాని విషయాల వల్ల మంచి ఎంతో.. హాని అంతకు మించి. ఈ తరం ఆ నిజం ఎంత తొందరగా గ్రహిస్తే పుస్తకం మనుగడకు అంత మంచిది.


పుస్తక ప్రపంచంలోనూ కొన్ని బెడదలు లేకపోలేదు. అయినా సరే.. ఫేసుబుక్కు కన్నా ఏ ఫేమస్ పర్శనాలిటీని గూర్చో చర్చించే బుక్కే పాఠకుడికి ఎక్కువ లాభసాటి. చెడు పుస్తకం వడపోతలు, నిబంధనలు, పర్యవేక్షణలు, చట్టబద్ధమైన నియమాల అడ్డు గోడలు దూకుతూ ఆట్టే కాలం నిలబడేది కష్టం. కాలపరీక్షకు తట్టుకు నిలబడే విజ్ఞానానికే వుస్తక రూపంలో చదువరిముందు ప్రత్యక్షమయ్యే అవకాశం ఎక్కువ. ఇంటర్నెట్ హోరెత్తించే అగాధ సాగరమైతే.. గ్రంథలోకం హృదయాహ్లాదం కలిగించే గందర్వ లోకం అనుకోవచ్చు !


రోజంతా టీ.వీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లకే మీదు కట్టే బలహీనత ముందు పెద్దలే కట్టేసుకోవాలి . వీలున్నంత మేరకు విలువైన పుస్తక పఠనానికే సమయం ఇవ్వాలి. కన్నబిడ్డలకు తాము మార్గదర్శకులయినట్లే మంచి పుస్తకం తమకు సన్మార్గ సూచిక అని పెద్దలు గుర్తించినప్పుడే గత కాలం మాదిరి గ్రంథస్త జ్ఞానం పదహారు కళలతో పునః ప్రవర్థిల్లే అవకాశం.


ఇంటి పట్టు ఉండే అమ్మలక్కలక్కూడా ఇప్పుడు పుస్తకమంటే ఎకసెక్కెమై పోయింది. అమ్మ, అమ్మమ్మల కాలంలో మాదిరి కనీసం ఓ వారపత్రికనైనా తిరగేసే ఓపిక బొత్తిగా ఉండటంలేదు అమ్మళ్లకు. కంటి సత్తువంతా ఎన్నటికీ ఎడతెగని ఏడుపు, పెడబొబ్బల ధారావాహికాలకే  ధారపోత! ఉన్న మానసిక వత్తిళ్లకు తోడు ఉపరి దైహిక వత్తిళ్లు అంటగట్టేవి  టీవీ, మూవీమంధరలు! కొత్తగా నట్టింట చేరిన కంప్యూటరుతో కొత్త తుత్తరు. పద్దస్తమానం చెవులు కొరికే స్మార్ట్ ఫోన్ దూరభారపు చుట్టాలతో కాపురాలు కూల్చేసే దొంగచాటు ఛాటుల కన్నా.. కూలే కాపురాలను నిలబెట్టే పుస్తకాలే మిన్న కదా! అన్నుల మిన్నల కన్నులు తెరిపిడి పడితేనే తప్ప నట్టింటి పుస్తకాల గూటిలో మళ్లీ రంగనాయకమ్మ స్వీట్ హోములు , బాపూ రమణల బుడుగు సీగాన ప్రసూనాంబలు , చక్రపాణిగారి చందమామలు అలరించేది.. మేధను రగిలించేది. 


పిల్లలు తప్పని సరిగా చదివే పాఠ్యపుస్తకాల సంగతి వేరు. ఇప్పటి ఘోషంతా  వినోదంతో పాటు విజ్ఞానం, సంస్కారం, సాంఘిక దృష్టి, ప్రాపంచిక ఇంగితం  పెంపొందించే కాల్పనిక సాహిత్య పఠనం గురించి . అపూర్వ పురా  వైభవాన్ని పరిచయం చేస్తూ.. దివ్యమైన బంగరు భవితవ్యం కోసమై వర్తమానంలో ప్రవర్తించవలసిన తీరుతెన్నులను ఓ గురువులా, స్నేహితుడిలా, తాత్వికుడిలా శాసించి, లాలించి, బోధించే సత్తాగలది పుస్తకం ఒక్కటే! పొత్తం విశిష్టత నేటి తరాలకు తెలియచేసేదెవరు?


శ్రీవాణి వదనంలో నివాసమున్న వాడెన్నడూ దైన్యుడు కాలేడని శంకర భగవ త్పాదులేనాడో భాష్యంలో చెప్పుకొచ్చారు. ఆ వాణీముఖ వాస్తమ్యల వుణ్య చరి త్రలు మనకందించేవి పుస్తకాలే! మనిషి తనకు తానుగా తనకోసం తాను మనిషిగానే మెలగడానికి తయారు చేసుకొన్న గొప్ప చమత్కార మార్గదర్శి-  పుస్తకం.


చిన్నతనం నుంచే పుస్తకాన్ని పిల్లల జీవితంలో అంతర్భాగం చేయవలసిన బాధ్యత నిజానికి కన్నవారి మీదే ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో గొప్ప కలిమి గడించాలన్న అడియాసలో పడి బిడ్డల ఒడి నుంచి మంచి పుస్తకం లాగేసుకోడం మంచి పెంపకం అనిపించుకోదు. తమంతట తాముగానే మంచి పుస్తకాలని ఎంచుకొని చదువుకొనే దిశగా పసిమనసులను ప్రోత్సహించవలసిన బాధ్యత వాస్తవానికి కన్నతల్లిదండ్రులకే అందరికన్నా ఎక్కువ సుమా! వివిధ రంగాల, రుచులకు చెందిన గ్రంథాలు వారి అంతరంగాలను అలరించే తీరులో అందుబాటుకి తెచ్చినప్పుడే కదా బాలలకు వాటిపై ఆసక్తి, అభిరుచి పెరిగే అవకాశం! 


పుస్తకమే లోకంలా పిల్లలు ఎదగాలంటే ముందు ఇంటినే పుస్తక లోకంగా మార్చేయడమే మందు.


భావి జీవితంపై ఓ స్పష్టమైన వైఖరి తీసుకొనే శక్తిసామర్థ్యాలను కల్పించేవి మంచి పుస్తకాలే. కన్నవారు, అనుభవం పుష్కలంగా ఉన్నవారు అన్ని వేళలా అందుబాటులో ఉండరు. ఆ లోటు భర్తీ చేసే మంచి నేస్తాలే పుస్తకాలు. పుస్తక పఠనమంటే ఓ ఆటలా ఇంటిని ఆటల మైదానంలా తీర్చి దిద్దినప్పుడే పిల్లలలో క్రీడాస్ఫూర్తి పుంజుకునేది! ఎదర జీవితంలో ఎన్నైనా ఢక్కామొక్కీలు ఎదురు కా నీయండి.. తిరగబడి పోరాడే తత్వం పుస్తక పఠనం వల్లనే బాలల్లో గట్టిపడేది.


పుస్తకాలు చదివే వాళ్లకు.. చదవని వాళ్లకు సంస్కారంలో హస్తిమశకాంతరం తేడా. సమయానికి విలువ ఇవ్వడం. సమాజావగాహన కలిగి ఉండటం, సమ స్యలను సమర్థంగా ఎదుర్కోవడం, పరిష్కరించడంలో చురుకుదనం ప్రదర్శించడం, తప్పులుంటే ఒప్పుకోవడం, సరిదిద్దుకొనేందుకు సిద్ధంగా ఉండటం, విభిన్నంగా ఆలోచించడం, విశాల దృక్పథం కలిగి ఉండటం.. మంచి పుస్త కాలు విస్తృతంగా చదివే బుద్ధిజీవులకు సులభంగా పట్టుబడే సిద్ధవిద్యలు.


పుస్తకాల పండుగలు ఏటేటా రెండు తెలుగు రాష్ట్రాలలో కనుల పండువుగా జరుగుతూనే ఉంటాయి. తీరిక ఉన్నప్పుడు కాదు.. తీరిక చేసుకొని మరీ పుస్తకాల కొలువులని చిన్నా పెద్దా కలసి సందర్శించండి అందరూ. కొన్నయినా మంచి పుస్తకాలు కొని ఇంటికి తెచ్చుకోండి! మంచి పుస్తకం పైన మనసు లగ్నమవడానికి మంచి లగ్నం అవసరమా? 


- కర్లపాలెం  హనుమంతరావు 

12-11-2021 


( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...