Wednesday, December 8, 2021

చూసేదంతా.. !- కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 

ఖరీదైన ఆ భవంతిలో ఆధునాతనమైన సౌకర్యాల  మధ్య విశ్రాంతి దొరికినప్పుడు లోకంతీరును గురించి ఎన్నో కథలు, నవలలు అల్లి ఓ గొప్ప రచయిత్రిగా  పేరు  గడించింది శ్రీమతి రమాదేవి అతి పిన్నవయసులోనే.

ఆ రమాదేవికి పెళ్లయి ఇప్పుడో పది నెలల పసిపాప. భర్త రమణారావు ప్రాఖ్యా కంపెనీ పేరుతో సొంతంగా మాధాపూర్ మెయిన్ సెంటర్లో కంప్యూటర్ సొల్యూషన్ సంస్థ ఒకటి నడుపుతూ నిత్యం బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటాడు. ఎక్కువ కాలం విదేశీ టూర్ల మీదనే గడపాల్సిన వ్యాపారం అతగాడిది. ఇంట్లో పని సాయానికని, భార్య ఒంటరితనం తగ్గించాలన్న ఉద్దేశంతో తానే బాగా విచారించి సీత అనే ఒక పేద మహిళను ఫుల్ టైం హౌస్-మెయిడ్ కింద కుదిర్చిపెట్టాడు రమణారావు.

 

సీత ఓ అనాథ మహిళ. పెళ్లయితే అయింది కాని, భర్త ఊసెత్తితే మాత్రం ఆట్టే సంభాషణ పొడిగించదామె. తల్లి లేనందున రోగిష్టి తండ్రిని తన దగ్గరే ఉంచుకుని సాకే ఆ మహిళకు చంకలో ఓ బిడ్డ .. చంక దిగిన ఇంకో ఇద్దరు పిల్లలు! ఇన్ని సంసార బాధ్యతలు  లేత వయసులోనే  నెత్తి మీద పడటం చేత పరాయి ఇంట్లో ఆయాగా కుదురుకోక తప్పని దైన్య స్థితి సీతది.

సీత మంచి అణుకువగల మనిషి. పనిమంతురాలు కూడా. అన్ని సుగుణాలు ఒకే చోట ఉన్నవాళ్లకే లోకంలో అదనంగా పరీక్షలంటారు! ఆమె  జీవితం మీద ఓ జాలి కథ కూడా రాసి కథల పోటీలో బహుమతి పొందిన ఘనత రచయిత్రి రమాదేవిది.

 

'అలాంటి సీత ఇలాంటి నీచమైన పని చేస్తుందంటే నమ్మ బుద్ధి కావడం లేదు?!' ఇప్పటికి ఏ వంద సా్లర్లో అనుకుని ఉంటుంది రమాదేవి.  ముందు రోజు మధ్యాహ్నం తన గది కిటికీ గుండా  ఆమె చూసిన దృశ్యం అంతగా డిస్టర్బ్ చేసేసిందా రచయిత్రిని. గతంలో ఏవో కథల్లో, సినిమాలలో కల్పించి రాసుకున్న సన్నివేశాలు ఇప్పుడు అంతటా నిజమవుతున్న తీరు రచయిత్రయి ఉండీ ఆమే జీర్ణించుకోలేని పరిస్థితి!

ఎదురు డాబాఇల్లు లాయరుగారిది. ఆయనగారి పడగ్గదిలో.. పడక మీద సీతను చూసింది ముందు రోజు అపరాహ్నం పూట! ఈమె అటు తిరిగి పడుకొని.. వంటి మీది పై భాగపు దుస్తులను  స్వయంగా తన చేతులతోనే విప్పేసుకుంటోన్నది!   సిగ్గూ ఎగ్గూ లేని ఆ లాయరు మహానుభావుడు ఇటు వైపు  వంగి నిలబడి ఏదో తొంగి చూస్తున్నాడు! ఇంకాసేపట్లో ఆ మహాతల్లి పడక మీదకే నేరుగా చేరివుంటాడేమో కూడా! జుగుప్సతో అప్పటికే రమాదేవి టకాల్మని తన కిటికీ రెక్కలు మూసేసుకుంది. 

కిటికీ రెక్కలనైతే మూయగలిగింది గాని.. మనసు ఆలోచనా ద్వారాలను ఎలా మూయాలీ తెలియక సతమయిపోతున్నది నిన్నటి నుంచి రమాదేవి. కాలం గడిచే కొద్దీ ఊహల ఉధృతి పెరిగిపోసాగింది. అక్కడికీ అదుపు చేసుకునేందుకు డాక్టర్ గారిచ్చిన టాబ్లెట్ రెండు మింగింది కూడా. వాటి ప్రభావమూ అంతత మాత్రమే ఈ సారి.

‘అవ్వఁ! పట్ట పగలు! అదీ మిట్ట మధ్యాహ్నప్పూట! ఎంత తలుపులు మూసుకుంటే మాత్రం ఏ  కిటికీ సందుల గుండానో సంబడం బైటపడకుండా ఉంటుందా? ఎదిగారు ఇద్దరూ తాడి మానులకు మించి.. ఎందుకూ! ఇంగితమన్న మాట పక్కన పెట్టేసిన తరువాత ఏ కిటికీలు, తలుపులు వాళ్లనా మదపిచ్చి చేష్టల నుంచి కట్టడి చెయ్యగలవు!

అతగాడి  భార్య పోయి ఇంకా రెండు వారాలైనా పూర్తిగా నిండ లేదు. ఆయనింట జరిగిన అరిష్టానికి  ఇక్కడ పేట పేటంతా అయ్యో పాపం అని ఆక్రోశపడుతుంటే.. అక్కడ మాత్రం  ఆ సిగ్గూ శరంలేని పెద్దమనిషికి అప్పుడే ఒక ఆడతోలు కావాల్సొచ్చిందా! కక్కుర్తిలో ఆయనకూ, ఆయనింట్లో పెరిగే ఆ కుక్కలకూ ఇక తేడా ఎక్కడేడ్చింది! మగవాడు వాడికి నీతి లేకపోతె మానె.. ఆడపుటక పుట్టిన ముండకు దీనికైనా బుద్ధీ జ్ఞానం ఉండాలా.. అక్కర్లేదా?

ఇందుకా ఈ మహాతల్లి నాలుగయిదు రోజుల బట్టి ఒకే హైరానా పడ్డం! తాను ఇంకా ఇంట్లో సమస్యలేమోలే అనుకుంటుంది. అడిగింది కూడా! ఎప్పటిలా ఎదురు బదులేదీ? నవ్వేసి ఊరుకుంది నాటకాల మనిషి! ఒకే వేళకు 'బైట కాస్త పనుంది పోయొస్తాన'మ్మా అని  పర్మిషన్ తీసుకుని వెళ్లి ఆలస్యంగా రావడం ఈ ఘనకార్యానికా!

శుచి శుభ్రత, నీతి నిజాయితీ ఉందనే గదా భర్త విచారించి మరీ ఈ మనిషిని నమ్మి ఇంట్లో ఉంచి వెళ్లడం! తను విన్న దానికి తగ్గట్లే ఎంతో మెలుకువగా ఇంటి పనులన్నీ శుభ్రంగా చక్కగా చేసుకుపోయే మనిషే! ఇంతలోనే ఏ పురుగు కుట్టి చచ్చిందో!  భార్య పోయిన మగాడి పడక గదిలో పగలే దూరిపోవాలంటే ఎంత తెగింపు ఉండాలి!

'ఛీఁ..ఛీఁ! ఇట్లాంటి నీచురాలి చేతిలోనా తన బిడ్డ పెరిగి పెద్దవనే కూడదు! భయంతో వణికిపోయింది రచయిత్రి రమాదేవి. ఆ గంట సేపూ!

అది వచ్చీ రాగానే అడగవలసిన నాలుగు మాటలు అడిగి సాగనంపేయాలని ఆ క్షణంలోనే ఒక నిర్ణయానికొచ్చేసింది రచయిత్రి రమాదేవి.  

అరగంట తరువాత  తాపీగా ఇంటి కొచ్చి ఏమీ జరగనట్లే తన పనిపాటల్లో ఎప్పట్లా పడిపోయిన సీతను చూసి ఎట్లా అడగాలో అర్థమవలేదు రమాదేవికి. సాటి ఆడదానితో ఎట్లా ఇట్లాంటి మాటలు మాట్లాడడం!   ఇంత నటనా కౌశలం గల ఈ మనిషి నోటి నుంచి తాను నిజం కక్కించగలదా! భర్త రమణారావు వచ్చిన తరువాత విషయం చెప్పేస్తే ఆయనే చూసుకుంటాడు ఈ చెత్త వ్యవహారాన్ని! అయినా.. వేరే ఎవరి కాపురాల గోలో తనకెందుకు! ముందు ఇది తన కొంపకు నిప్పు రవ్వ రాజేయకుండా ఉంటే చాలు. తాను జాగ్రత్తపడాలి!' అని సర్దిచెప్పుకుంది రమాదేవి.   కథల్లో పాత్రల చేతయితే రకరకాలుగా మాట్లాడించే రచయిత్రి నిజజీవితంలో ఒక దౌర్భాగ్యకరమైన సంఘటన   నిజంగానే ఎదురైతే ఎట్లా డీల్ చేయాలో తోచక   చేష్టలుడిగినట్లయిపోయింది. ఆ పూటకు సీత ఉద్వాసన వ్యవహారం వాయిదా పడింది.  

అ రాత్రి రమణారావు రమాదేవి చెప్పిందంతా విన్నా తేలిగ్గా కొట్టిపారేశాడు

'అనుమానం పుట్టి మీ ఆడవాళ్లు పుట్టారన్న మాట నిజమే అనిపిస్తోందిప్పుడు. ఇంతకాలంగా చూస్తున్నా ఆవిడను, ఎంత ఒద్దికగా తన పని తాను చేసుకుపోతుంది! చిన్న పొరపాటైనా తన వల్ల దొర్లుతుందేమోనని  ఆమె చూపించే శ్రద్ధ నీకు కనిపించడం లేదా? ఏదో విధి బావోలేకనో, మొగుదు చేసిన మోసం వల్లనో ఇట్లా పరాయి ఇళ్లలో పడి చాకిరీ చేసే సాటి ఆడదాని మీద గట్టి ఆధారం లేకుండా అభాండాలు వేయడం దారుణం రమా!  నువ్వేగా.. అమెను దృష్టిలో ఉంచుకుని మహగొప్పగా కథోటి రాసి బహుమతి కొట్టేసింది! ఇప్పుడేమో మతి లేకుండా ఏవేవో అవాకులూ చవాకులూ కూసేస్తుంటివి!' అంటూ ఎద్దేవాకు దిగిన భర్త మీద పీకల్దాకా మండుకొచ్చింది రమాదేవికి.

'స్వయంగా నా కళ్లతో నేను చూసింది చెప్పినా మీకు నమ్మకం కలగడం లేదా? నా కన్నా  దాని మీదే మీకు ఎప్పట్నుంచి నమ్మకం ఎక్కువయిందో! అవును!  మీరూ ఓ మగాడేగా! ఇట్లాంటి ఓ ఆడది ఇంటి పట్టునే ఉంటే గుట్టుగా మోజు తీర్చుకోవచ్చని అశ కలుగుతున్నట్లుందే తమక్కూడా' అంటూ అదుపు లేకుండా రెచ్చిపోయింది ఉక్రోషంలో రమాదేవి.

'కంట్రోల్ యువర్ సెల్ఫ్ రమా! ముందీ టాబ్లెట్ వేసుకో!  ఇప్పుడు ఎన్ని చెప్పినా నువ్వు వినే మూడ్ లో లేవని అర్థమవతూనే వుంది.  మన సమస్యల మధ్య ఇప్పుడు ఈమె భాగోతం కూడా ఎందుకులే! నువ్వు చెప్పినట్లే చేద్దాంలే! మరో మంచి ఆయా దొరికిందాకా కాస్త ఓపిక పట్టు ప్లీజ్!' అంటూ భార్య కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడా మానవుడు అప్పటికి.

మర్నాడు ఎప్పటిలా అదే టైముకు సీత రమాదేవిని పర్మిషన్ అడిగింది. తమ తలాడించగానే బైటికి వెళ్లిన మనిషి మరో రెండు నిముషాలల్లో లాయరుగారి ఇంటి ముందు తేలింది. ఈమె రాకను చూసి అప్పటి వరకు అసహనంగా ఎదురు తెన్నులు చూస్తోన్న లాయరుగారి మొహంలో ఒక మాదిరి రిలీఫ్ కనిపించడం ఇద్దరూ ఇంటిలోకి పోయిన వెంటనే తలుపులు మూతబడడం.. మరో రెండు నిముషాలల్లో సీత లాయరుగారి బెడ్ రూంలో తేలడం రోజుటిలాగే యధావిధిగా సాగిపోయాయి క్రమం తప్పకుండా!

మరో అరగంట తరుతావ తరువాత సీత బెరుకుగా బ్లౌజు గుండీలు సర్దుకుంటూ బైటకు రావడం.. వెండితెర సినిమా అంత స్పష్టంగా కనిపించిందీ సారి.. సూది మొనంతైనా అనుమానానికి సందు లేకుండా!

'ఇప్పుడేమంటారో  శ్రీవారు?' అంది ఎకసెక్కంగా రమాదేవి.

అప్పటికే రమణారావును ఆమె పిలిపించి సిద్ధంగా ఉంచింది.. ఈ దృశ్యం అతనే స్వయంగా చూసి తరిస్తాడని!

రమణారావు ఏదో చెప్పబోయి తటపటాయించడం చూసి చిర్రెత్తుకొచ్చింది రమాదేవికి. నోరింత చేసుకుని  'ఇప్పటికీ  మీ సీతమ్మ తల్లి రామాయణంలోని సీతమ్మవారేనంటారు! ఆ ఎదురింటి పెద్దమనిషి కలియుగ శ్రీరామచంద్రమూర్తా!'

'మైండ్ యువర్ టంగ్ రమా! నిన్నటి బట్టి నీ మాటలు  వినీ వినీ నా సహననం చచ్చిపోయింది. నీకూ ఒంట్లో బావో లేదని   ఓపిగ్గా పడుతున్నా! ఇహ నా వల్ల కాదు! ఇంకొక్క కారుకూత  చెవిన బడ్డా నేనేం చేస్తానో నాకే తెలీదు' 

లక్ష్యపెట్టే స్థితిలో లేదు రమాదేవి 'అహాఁ!  నాకంతా  ఇప్పుడు స్పష్టంగా కళ్లక్కడుతోంది ! మనింట్లో కూడా ఓ మహా రామాయణం నడుస్తోంది. అందులో తమరే కదా  శ్రీరామచంద్రమూర్తి. అందుకే ఆ శూర్పణఖ మీ కంటికి సీతమ్మవారిలా కనిపిస్తోంది..'

'షటప్..' కొట్టేందుకు చెయ్యేత్తేడు ఓర్పు సహనం పూర్తిగా నశించిన రమణారావు.

 

ఎప్పుడొచ్చిందో సీత .. గభాలున దంపతులిద్దరి మధ్యకు  వెళ్లి నిలబడింది. ఆ దెబ్బ సీత ముఖం మీదకు విసురుగా పడ్డం.. బీపీ ఎక్కువైమ రమాదేవి కళ్ళు తిరిగి కిందకు వాలిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి!

***

మళ్లీ కళ్లు తెరిచే సరికి ఎదురుగా భర్త.. పక్కనే డాక్టర్ రామానుజం. 'పాపకు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ పనికిరాదు! చెప్పిన జాగ్రత్తలన్నీ స్ట్రిక్టుగా పాటించండి! మళ్లీ మూడు రోజుల తరువాత సేంపుల్సవీ  చూసి కానీ ఏ నిర్ధారణకూ రాలేం' అని వెళ్లిపోయాడు.. డాక్టర్ కిట్ సర్దేసుకుని.

'నా కేమయిందండీ!' అయోమయంగా అడిగింది రమాదేవి .

'నీ పాత ఫ్రీజర్సే! మళ్లీ తిరగబెట్టింది! చూసేవన్నీ నిజాలు కావు. చూడనంత మాత్రాన కొన్ని అబద్ధాలు అయిపోవు.  అందుకే నిన్ను లేనిపోనివి ఊహించుకుంటూ టెన్షన్ పడద్దనడం! పేరుకే పెద్ద రచయిత్రివి.. ప్రశాంతంగా మంచీ చెడూ తర్కించడమే  రాకపాయ ఇప్పటికీ! మూడ్రోజుల్నుంచి ఇట్లాగే బెడ్ మీద పడుంటే నేనూ, పాపా ఏమై పోవాలని'అని మంద్రస్వరంతో మందలించాడు రమణారావు.. భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని లాలిత్యం ఉట్టిపదే ప్రేమభావనతో. రమాదేవి కళ్లల్లో నీళ్ళు తిరిగాయి. గిల్టీగా అనిపించింది.  'మూడు రోజుల్నుంచీ ఫ్రీజర్సా! మరి పాపకు పాలు..'

'అదిగో మళ్లీ చింతలు మొదలు! నువ్వు నిశ్చింతగా ఉండడం అవసరం రమా! అట్లా ఉండాలనే కదా వెదికి వెదికి నేను సీతను ఎంతో కష్టపడి పట్టుకొచ్చింది!' అన్నాడు రమణారావు నిష్ఠురంగా!

ఉయ్యాలలని పసిపాప కక్కటిల్లుతుంటే  లేచి బైటికి నడిచాడు రమణారావు,

పసిబిడ్డను లాలనగా ఒడిలోకి తీసుకుని గోడ వైపుకు తిరిగి తన దుస్తులు పై భాగం  సడలించుకుంటోంది సీత.

ఆ క్షణంలోనే తాను చేసిన పొరపాటు ఏమిటో  రమాదేవికి అర్థమైంది. లాయరుగారికీ పసిపాప ఉంది. ఆ పాప తల్లి పోయి రెండు వారాలే అయింది!

తన తొందరపాటు ఆలోచనకు చాలా సిగ్గని  అనిపించింది రమాదేవికి. బొజ్జ నిండి కుడిచి, నిద్రకు పడిన పాపాయిని తెచ్చి తన బెడ్ పక్కన ఉన్న ఉయ్యాలలో బజ్జోపెట్టే సీత ఆమె కళ్లకు ఇప్పుడు నిజంగానే అన్నపూర్ణమ్మ తల్లిలా కనిపించింది.

 

 తనను దగ్గరగా పిలిచి రెండు చేతులూ పట్టుకుని కన్నీళ్లు పెట్టుకునే రమాదేవితో అంది సీత ప్రశాంతమైన మనసుతో ''ఛ.. ఊరుకోండమ్మా! తమరు పెద్దోరు! బావోదు. అయినా! ఇదేమైనా నేను మొదటి సారి గాని చేస్తున్నానా? ఉదారంగా చేస్తున్నానా? ఆ లాయరుబాబుగోరి కాడలాగే అయ్యగారి కాడా తీసుకుంటున్నాగా తల్లీ! బైటి కెళ్లేముందు మీకిదంతా చెప్పేసుంటే ఇంత కథే ఉండకపోను! ఆడముండని.. బిడియం అడ్డొచ్చింది తల్లీ!' అంది!

 'న్యాయానికి.. పసిబిడ్డకు చన్నిచ్చి ఇట్లా డబ్బులు తీసుకోడం కూడా పాపమేగా తల్లీ! కానీ.. ఏం చెయ్యాలా? గంపెడంత ఇల్లు గడవాలా!' అంటున్న సీత ఔన్నత్యం ముందు కుచించుకుపోయినట్లున్న తన వ్యక్తిత్వాన్ని చూసుకుని సిగ్గుపడింది  గొప్ప సామాజిక దృక్పథం తన సొంతమనుకుంటూ వస్తోన్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి రమాదేవి.  

'చూసేవన్నీ నిజాలు కావు. చూడనంత మాత్రాన కొన్ని అబద్ధాలు అయిపోవు' అంటూ భర్త హమేశా చేసే హెచ్చరిక మరో సారి ఆమె చెవిలో గింగురుమంది.

 ***

-కర్లపాలెం హనుమంతరావు

19 -03 =2021

(ఆంధ్రభూమి- వారపత్రిక 13 నవంబర్, 2008 లో 'కళ్లు చేసే మోసం' పేరుతో ప్రచురితం)








No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...