Sunday, December 12, 2021

నారికేళపాకం - ఆవశ్యకత -కర్లపాలెం హనుమంతరావు

 

కావ్యం ఒక జగత్తు.

లోకంలోని మిట్టపల్లాల మాదిరే కావ్యాలలోనూ ఎగుడుదిగుడులుంటాయి. అనివార్యం. కావ్యజగత్తు, బౌతిక జగత్తు అన్యోన్యాశ్రయాలు. బౌతిక జగత్తు లేనిదే కావ్యజగత్తు లేదు. కావ్యజగత్తు వినా బౌతిక జగత్తుకు వెలుగూ లేదు.

ఇహ కావ్యరసాల విషయానికి వస్తేః

గుత్తి నుంచి ద్రాక్షపండును ఇట్టే కోసి నోట్లో వేసుకోవచ్చు. అరటిపండు ఆరగించడం అంటే గెల నుండి కోయడమే కాకుండా, తోలు వలుసుచుకొనే కొంత ప్రయాస తప్పదు. కొబ్బరికాయ దగ్గరి కొచ్చే సరికే ఆ ప్రయత్నం మరింత  అవసరం. కావ్యపాకాల తంతూ ఈ తరహాలోనే ఉంటుందంటుంది అలంకారశాస్త్రం!

లోకంలో ద్రాక్షపండుతో మాత్రమే సర్దుకుపోతున్నామా మనమందరం! ప్రయత్న పరిమితిని బట్టి సాఫల్య పరిమితి. ఆ సూత్రం అవగతమయిన వారితో వాదు లేదు. కానివారితోనే లేనిపోని పేచీ. ఆనందం కోసమే కావ్య పఠన అనుకున్నప్పుడు.. ఆ ఆనంద రసానుభవానికి బుద్ధి తాలూకు వైవిధ్యం మరంత విశిష్టత చేకూరుస్తుంది.  ఆ వైశిష్ట్యంలోని అంతస్తుల అమరిక అర్థమవకో.. వద్దనుకొనే భావన వల్లనో అయోమయమంతా.

'భోజనం దేహి రాజేంద్ర! ఘృతసూపసమన్వితమ్ /మాహిషం శరచ్చంద్రచంద్రికా ధవళం దధి'అన్న శ్లోకంలోని మొదటి భాగం ఒక్కటే కాదు.. రెండో భాగమూ సమన్వియించుకోవాలి. అదీ సాహిత్యవేత్త లక్షణం.

ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, ఒక్క ద్రాక్షాపాకంలో మాత్రమే కవిత్వం ఉండాలనే  కవిత్వానికే అన్యాయం చేయడమవుతుంది. కదళీపాకం వరకు చదివి ఆనందించేవారితో కూడా కవిత్వానికి సంపూర్ణ న్యాయం జరిగినట్లు కాబోదు. నారికేళపాకం కోరుకొని ఆస్వాదించి ప్రోత్సహించినప్పుడే ఉగాది సంబర ప్రసాదం వంటి కవిత్వం రూపుదిద్దుకొనేది. అయితే ఆ అంతస్తు చేరుకోనే చదువరికి శబ్దశక్తి పట్ల అవగాహన మాత్రమే సరిపోదు.. రసనిష్ఠ సహకారమూ అనివార్యం.

నారికేళపాక రసాస్వాదనకు ప్రాచీన కావ్యజగత్తులో అగ్రతాంబూలం. ఆ గౌరవం అందుకునేటందుకు చదువరికి ముందు అవసరమయేది శబ్దార్థపరిజ్ఞానమే అయినప్పటికీ, అంతకన్నా ముఖ్యమైనది ప్రాక్తనసంస్కారం. ఇది సంపన్నమయివున్నప్పుడే నారికేళపాక రసస్వరూపాన్ని సమగ్రంగా స్వానుభవంలోకి తెచ్చుకొనే భావాత్మ బలం పుంజుకునేది. పాండిత్య శబ్దవాచ్యతా, రసికపదలాంఛనప్రాప్తీ కొరవడుతున్న వాతావరణంఎ కఠినపాకం, బీరఆఆఆపీచుక్రమమనే అలంకార శాస్త్రం ఉగ్గడించని విచిత్ర పదాలు పుట్టుకురావడానికి కారణం.

దోషం కావ్యసృజనలో లేదు. ఉన్న మెలికంతా రసాస్వాదన అసక్తత వల్ల సంభవించిందే!

- కర్లపాలెం హనుమంతరావు

22 -05 -2021

(శ్రీపాదవారి కావ్యజగత్ భావన)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...