Sunday, December 12, 2021

 

 చెత్త చల్లుడు పథకం - సరదాకే

-కర్లపాలెం హనుమంతరావు

 

చెత్తను చెత్తపదార్ధంగా భావించడం తాతల కాలం  తెలివితక్కువతనం. చెత్తనుంచి

విద్యుత్ పుట్టించవచ్చని శాస్త్రవేత్తలూ ఇప్పుడు మొత్తుకుంటున్నారు.

నిజమే కావచ్చు. కానీ నీరు, బొగ్గులా  తేరగా దొరికే వనరుల నుంచి రాబట్టే

చచ్చువిద్యుత్తు కోసం బంగారమంటి చెత్తను వృథా చేయడమా! బార్బేరియస్!

 

ముందిక్కడి పట్టపగలు దోపిడీని అరికట్టండయ్యా బాబూ! తమ బాబుల ముల్లేదో

పోగేసినట్లు దొరబాబుల తలదన్నే  దర్జాతో వీధిబంగారం చెత్తను యావత్తూ

ఎత్తేకుపోతున్నారు! బతికేందుకు బొచ్చెలు  బోలెడు బొచ్చెడు దొరికే దేశంలో

ప్రభుత్వాస్తి ‘చెత్తే’ దొరికిందా  బీదాబిక్కీ జనాలకు?  రక్షణశాఖా ఈ

అరాచకాన్ని  గుడ్లప్పగించి చూడ్డం విడ్డూరంగా ఉంది!

 

రోడ్డో, ఇల్లో ఎక్కడ పడుంటే ఏంటి? ‘చెత్త’  ప్రభుత్వాలకు మాత్రమే చెందిన

చరాస్తి. పాలకులకు మాత్రమే జనం ఉత్పత్తి చేసే చెత్తమీద గుత్తాధిపత్యం.

అన్నీ రాజ్యాంగంలోనే రాసుండాలంటే ఎట్లా?

 

ముష్టి కోటి, అరకోటి  ఖరీదైనా చేయని పాటిభూముల్లో ఎవరెవరో వచ్చిపడి

జెండాలు పాతిపోతే  దురాక్రణమలు అంటూ అంత లావు అల్లరి చేసే

ప్రభుత్వాలు తమకు మాత్రమే చెందాల్సిన బంగారమంటి చెత్త- బండ్ల కొద్దీ

బహిరంగంగా తరలించుకుపోతోన్నా నిమ్మకునీరెత్తినట్లు ఎందుకు ఉండిపోతున్నట్లో? ఇదేమన్నా ఇసుక పాలసీనా? ఎవరితో కుమ్మక్కుల కహానీలు నడుస్తున్నట్లు?

 

బొఫోర్సని, రేఫిల్సని, బొగ్గూ  భోషాణమని, చందనప్పేళ్ల నుంచి,

స్టాంపుబిళ్లల దాకా ఏ సర్కారీ సరుక్కూ దిక్కులేకపోయినా అదో దారి! వీశెల

కొద్దీ బంగారం పోసినా వీశమెత్తు తూగనంత విలువైనది సామీ చెత్తపరక! ఇదీ

లెక్కా పత్రం లేకుండా మాయమయిపోయింది ఇప్పటి దాకా!

 

గొడ్డు తినే గడ్డికే కక్కుర్తి పడ్డ ఓ సారుకు జీవితాంతం ఊచల శిక్ష వేసేసారే! చెత్త మీద

చెయ్యేసిన ఘోరానికి మరి శిక్షా స్మృతిలో ప్రత్యేకించి ఏ ఉరీ గిరీల్లేవా? డ్యామిట్!

ఉన్నా దాచిపెదుతున్నారా.. సమాఖ్య స్ఫూర్తి బండారం బాపతులా!

 

ముత్తెమంత బంగారం నొక్కేసినా  ఏ లెక్కా డొక్కకు దొరకట్లేదని ఈడీ జప్తుకు

దిగిపోతుంది గదా! చెత్త దగ్గరెందుకు మరంత తాత్సారం!

 

ఇంటి ముందున్నా,పెరట్లో గుట్టలుగా పడున్నా పేరుకు పోయిన చెత్తను జనమంతా ఇక ముందు నుంచి స్థానిక పాలకుల పరం చెయ్యాల్సిందే! ఆ రకంగా ఆర్డినెన్సు జారీ చెయ్యండి ముందు! జాప్యం చేసే కొద్దీ చెత్త వనరుల తరుగు పెరిగిపోడం ఖాయం.

 

కరోనా తరహా మాయదారి రోగాలు ఇవాళ  గలభా చేసి రేపు గమ్మున వెళ్లిపోయేవి. ఆ తరహా మహమ్మారులకు జడిసి  చెత్తను దాచేస్తే బీదా బిక్కీ సంక్షేమం మాటో?

 

మనమేమీ జపాను తరహా ధనిక వ్యవస్థలో లేం కదా! ముక్కుకు గుడ్డపీలికలు చుట్టుకోడం ఎట్లాగూ అలవాటయిందాయ! కాబట్టి,  కొంపల్లో పొగయ్యే నానాచెత్తను ఇహ పై పక్కిళ్ల పెరళ్ళ   వైపుకు నెట్టేయకుండా  బాధ్యత తెలిసిన పౌరుల్లా  లోకల్ లీడర్లకు అప్పగించడం ఉత్తమం.

 

రాష్ట్ర సర్కార్లు రెండూ వేళకు చేతిలో చిల్లుగవ్వ ఆడక పడే అపసోపాలు చూస్తున్నాం గదా!  ఎంత ఆర్థిక బాధ్యతలకు ఒప్పుకుంటే మాత్రం పాపం.. మన ఏపీ బుగ్గన సారుగారు  ఎన్ని సార్లని ఆ పథకం బకాయిలని, ఈ ప్రణాళిక వాయిదాలనీ.. ఢిల్లీ నిర్మలమ్మ చుట్టూతా రొక్కం కోసం ప్రదక్షిణాలు చేసొస్తారు!

 

చెత్త ఉత్పత్తిలో ఎట్లాగూ మన తెలుగువాళ్లకుండే ఖ్యాతి జగత్ప్రసిద్ధం!

స్మార్ట్ సిటీ పెరామీటర్ల సమయంలో  చెత్త విలువపైన సరైన  అంచనా వేయకపోవడం

 పొరపాటే. వాస్తవానికి ఏ రాష్ట్రం 'వేస్ట్' ఆ రాష్ట్రం  దగ్గరే

పోగుపడున్నట్లయితే,, ఇప్పుడిలా  కె.సీ.ఆర్ సార్  లా జిఎస్టి గట్రా

ల్లాంటి వాటిల్లో వాటాల కోసమని గలాటాలా

దా కాదు. ఏ ప్రపంచ బ్యాంకు నిధుల కోసమో ధరఖాస్తు చేసుకొనే ఖర్మా పట్టుండేది కాదు. అప్పనంగా ఏ బ్యాంకూ ‘ఆల్ రైట్! కావాల్సినంత కొట్టుకు పో!’ అనేసెయ్యదు కదా!

ఎప్పట్లానే పస్తాయింపులు తప్పవు. ఒప్పించాలంటే శక్తి కొద్దీ  దాని గేట్ల

ముందు .. చెత్తకుప్పలు గుట్టలుగా పొసేయకా తప్పదు! అందుకైనా ప్రభుత్వాల

దగ్గర ప్రజల చెత్త వనరుల రూపంలో భద్రంగా ఉండవలసిన అగత్యం ఉంది. అందుకోసమే ఇంత సోది ఇప్పుడు ఇక్కడ!

 

కొన్నాళ్ల కిందట మన  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్టీ పన్నుశాఖలోళ్లు

ఇంటిపన్ను మొండి బకాయిల వసూళ్ల కోసం ఈ చమత్కారమే దిగ్విజయంగా

ప్రయోగించారు!  ఇప్పుడు ఇదే ‘చెత్త జల్లుడు పథకం’  ఏపీలో కూడా మరింత

విస్తృత స్థాయిలో అమలవుతోంది.  ఒకానొక జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ

బ్యాంకుల  వాకిళ్లన్నిటి  ముందు తెల్లారేసరికల్లా అత్యంత  ఖరీదైన

చెత్తా చెదారాలు సంక్రాంతి పెద్ద పండుగ కలాపీలకు మల్లే  చల్లేసిన

దృశ్యాలే ఇందుకు ఉదాహరణ.

 

అలరి చిల్లరి ఆగంలా గుస్సా తెప్పిస్తాయే గాని, మూలంలో ఈ ‘చెత్త చల్లుడు

పథకం’ జగన్నాటకం వెనక విశాల  ప్రజాప్రయోజనమే ప్రధాన లక్ష్యంగా ఉందని

ప్రభుత్వ వర్గాలలో ఇప్పుడు  గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్నికల ఫ్లోలో ఇచ్చిన హామీలు కొన్నైనా అమలుపరచకపోతే ఎంత నామర్దా? కానీ ప్రభుత్వ ఖజానాలో కాణీ లేదు. నిధుల లోటు నానాటికీ పెరుగుతుండడంతో .. విధి లేక దిక్కూ దివాణం లేని జనాలకు నేరుగా కేంద్ర

బ్యాంకుల ఖజానాల నుంచే ఏ పూచీకత్తూ లేని  రుణాలు నిర్బంధంగా ఇప్పించాలని

‘చెత్త చల్లుడు పథకం’ రూపకల్పన జరగడం!  ప్రపంచ బ్యాంకు సంగతెట్లా ఉన్నా

ముందు ప్రజాసంక్షేమం కోసమైనా   ప్రభుత్వాలకిప్పుడు కట్టుకుపోయేటంత చెత్త

అవసరం.

పథకం చెత్తగా ఉందని పెదవి విరిచే ప్రబుద్ధులు ఎప్పుడూ ఉంటారు.  చెత్తను

అత్యంత ప్రజోపయోకరమైన  వనరుగా మార్చే  లక్ష్యంతో ‘చెత్త చల్లుడు పథకం’

రూపొందించిన  మహానుభావులు ఎవరో బైటపడితే బాగుణ్ణు.  పటం పెట్టుకొని

నిత్యం ఉన్నంత చెత్తతో ఆ వారిని సేవించుకునే వీలు .. బ్యాంకు రుణాలు

సాధించి ఎగేసిన అదృష్టవంతులందరికీ!

-కర్లపాలెం హనుమంతరావు

 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...