Saturday, December 4, 2021

మనిషి మహా ‘ క్రాక్ ‘ ! - కర్లపాలెం హనుమంతరావు

 


'ఏం చేస్తున్నావు?' - అడిగింది అంతరాత్మ.

పెన్‌ పవర్  పత్రిక ప్రకాశం ఎడిషన్ కోసం వ్యాసం రాసే పనిలో ఉన్నా  . ఏ అంశం మీద రాద్దామా అని బుర్ర చించుకుంటున్నా. తెగడంలే బ్రో ‘ 

'ఈ మధ్య  నువ్ రాసే చెత్తలో  మరీ తాలు తప్ప  ఎక్కువయిందంటుందయ్యా నీ రీడర్ గణం. బ్రేకింగ్ గా ఏదైనా, లైటర్ వీన్  ట్రై  చెయ్యచ్చుగా?' అని గొణిగింది అంతరాత్మ.

'ఆ సణుగుళ్లెందుకు. మనసులో ఉన్న మధనేదో బైటికే అనవచ్చుగా!'

ఫక్కుమని నవ్వి అంది అంతరాత్మ 'బాబూ! నేను నీ అంతరాత్మను. అంతరాత్మలక్కూడా అంతలా భారీ  మనసులుంటాయా? అయినా, అక్కడికి మీ మనుషులు మా అంతరాత్మం  పెట్టే  వింటున్నట్లు.. మహా బిల్టప్ ! నేను జంతువు టైప్ . నాకూ వాటికి మల్లే మనసులూ పాడూ అంటూ  నసలుండవు. ముందా సంగతి తెలుసుకోవయ్యా మహానుభావా! రచయితవి. నీకే తెలీకపోతే ఇహ పాఠకులకు నువ్వేంటి కొత్తగా చెప్పుకొచ్చేది.. నాబొంద!' అందా అంతరాత్మ. 

నవ్వొచ్చింది నాకు.. నా అంతరాత్మ మళ్లీ బొంద మాట ఎత్తేసరికి . 


నిజానికి అది  పెట్టే నస చెవినపడితే చాలు. . 'మన  పాతకాలం తెలుగు సినిమాల అంతరాత్మల్లా  శుభ్రంగా ఏ టినోపాలుతోనో  ఉతికారేసిన  ఏ తెల్లటి  వైట్ నైట్ డ్రస్ లోనో   అద్దంలో నుంచో, స్తంభం చాటి  నుంచో అడగా పెట్టకుండా తగలడి  వద్దన్నావినకుండా  నసపెట్టేస్తుంటాయ్. తెలుగు పంతుళ్ల తీరే అచ్చంగా! ఒక్కోసారి, మన టైం బాలేనప్పుడు ..  ఒకటి కాదు, రెండు  కూడా చెరో పక్కనా చేరి చెండుకు తినడం.. వాటికి  అదో సరదా. పాత్ర  ఎస్వీ రంగారావు స్టయిల్లో  చేతిలో ఉన్న పాత్రను   విసిరి గొట్టినా అద్దం ముక్కలయి చచ్చేదే కాని అద్దాని నస అన్ని గాజు ముక్కల్నుంచి వెయ్యింతలై  మన తల వక్కలయేది. మళ్లీ ఏ కమలాకర కామేశ్వర్రావు సారో వచ్చి  కల్పించుకుంటే తప్ప ఆ అంతరాత్మల ఘోష అంతమయ్యే ఛాన్సే లేదు. కొంపదీసి నువ్వూ ఇప్పుడు ఆ తరహా ప్రోగ్రామేమన్నాపెట్టుకుని దయచేయ లేదు కదా! కరోనా రోజులు!  ఎటూ బైటికి పోయే దారి  నాకుండదని   గాని పసిగట్టావా ఏందీ ఇంటలిజెన్సోడిలాగా!'

'ఆపవయ్యా సామీ ఆ పైత్యకారీ కూతలు. నువ్వేమీ ఎస్వే ఆర్వీ, ఎంటీఆర్వీ కాదులే! వట్టి ఓ మామూలు కెహెచ్చార్ గాడివి . గంతకు తగ్గ బొంత సైజులో నీ స్టేటస్సుకు తగ్గ  మోతాదులోనే నా ఆర్భాటం ఉండేది. ఇంతకీ అసలు  చెప్పాల్సిన మాట డైవర్టయి పోయింది నీ  డర్టీ డైలాగుల డప్పు చప్పుళ్ల మధ్య. మరోలా అనుకోక పోతే ఒక సలహా బాబూ! ఈ కరోనా రాతలు కాస్సేపు పక్కన పెట్టు. పోలిటిక్సు  పోట్లు పద్దాకా ఏం పొడుస్తావులే కాని,, ఇంచక్కా ఈ లోకంలో నీకు మల్లేనే హుందాగా  జీవించే జంతుజాలం గురించి ఏమన్నా ఓ నాలుగు ముక్కలు అందంగా  గిలికిపారెయ్యవయ్యా  ఈ దఫాకు! సరదాగా అందరు చదు కుంటారు!'

'జంతువుల గురించా? రాయడానికేమంత ఇంపార్టెంట్ మేటరుంటుందబ్బా? మన పాఠకులంతా అన్నీ   చదివి ఎంజాయ్ చేసినవే గదా ?  జిత్తులు, నత్త నడక, సాలెగూడు, కాకి గోల, కోడి నిద్ర, కుక్క బుద్ధి, క్రూర మృగం, హంస నడక, మొసలి కన్నీరు, కోతి చేష్టలు, పిల్లి మొగ్గలు, పాము పగ, ఉడుం పట్టు, గాడిద చాకిరీ గట్రా జంతు రిలేటెడ్  సజ్జెక్టులు అన్నీ  నీ బోటి  అంతరాత్మలు నస పెట్టించి మరీ గిలికించేసాయి కదా! ఇహ నాకు మాత్రం  కొత్తగా రాసేందుకు ఏం మిగిల్చారు గనకయ్యా నాయనా?‘

 

'ఆపవయ్యా రైటర్ ఆ పాడు అపవాదులు! అక్కడికి భాషలు, భావాలు  ఓన్లీ మీ మనుషులకే సొంతమయినట్లూ!  ఏమిటా కోతలు! మీ మనుషులున్నారే చూడు .. వాళ్లే  అసలైన జంతువులు. ఏ సాధుశీలి డ్రెస్  లోపల ఏ మేకవన్నె పులి పొంచివుందో , ఏ అరి వీర భీకర మహా విజేత గుండెల్లో 'ఉస్సో ‘  అంటేనే  ఉలిక్కి పడే  పిల్లేడ్చిందో?పుట్టింటిని గూర్చి మేనమామ ముందా  డప్పు కొట్టేదీ?   అంతరాత్మలం..  మాకానువ్వు  కొత్తగా సినిమా కతలు చెప్పి నమ్మించేదీ! ఆ  రొటీన్ టాపిక్కుల గోల మళ్లా ఇప్పుడెందు గ్గానీ, ఊపు కోసం నేనీ మధ్య  వాట్సప్ లో చదివిన వెరైటీ జంతువుల కహానీ ఓటి  చెబుతా.. చెవ్విటు పారేయ్!ఆనక నీకు ఆ యానిమల్స్ జాతి మీదుండే యనిమిటీ, గినిమిటీ మొత్తం వదిలిపోవాలి.’ 

 జంతువులేవీ అసలాలోచనలు గట్రా  చేయలేవని కదూ  మీ పుచ్చు మనుషుల పుర్రెల్లో  ఊహలు!  ఆహారం,  నిద్రా మైథునమంటి   సహజాతాలంటేనే  వాటికి ఇంటరెస్టని మీ మెంటాలాలోచనా?   జంతుజాలం భాష నీ  డీ-కోడింగుకు అందదు.కాబట్టే  కాకి కూతల వెనకుండే రంపపు కోత నీ డర్టీ  బుర్రకెక్కదు.  వాటి నాటికసలు  మాటాడమే  రాదనుకుంటే .. అది నీ మూఢత్వంరా బేటా!  వాటి మాటల సారం నీ బుర్రకెక్కి చావదు! మనిషిగా పుట్టావు కాబట్టి అన్నిటికీ   నువ్వా బ్రహ్మయ్యనే తప్పు పడతావ్! అన్నీ నీకు మాత్రమే తెలుసంటూ డబ్బు కొడతావ్!’

ఈ సారి ఏ  హిమాలమాల సైడుకో టూరుకని వెళ్ళి నప్పుడు ఆ హరిద్వారం , ఋషీకేశ్వరం దాకా వెళ్లి చూడు! టీ నీళ్ల కోసం నిన్ను వేధించాడని విసుక్కోడమొక్కటే నీకు తెలుసు. కానీ,    రక రకాల పక్షి కూతలకు, జంతు భాషలకు ఆ గడ్డం బుచోళ్లే అచ్చుపడని పదనిఘంటువులని నీకు తెలీదు.  పక్షులూ, జంతువులతో మాట్లాట్టం  వాస్తవానికి ఓ గడసరి విద్యయ్యా!  మేక చెవులు  గట్టిగా పట్టుకుని మన ఏప్రియల్ మాసం తరువాత వచ్చే నెల పేరేంటో చెప్పమని అడుగూ !

'మే' అని ఠక్కున చెప్పకపోతే  నీ పాత  చెప్పుతో నా దవడ పగల కొట్టు! చిరుగు జోడు  తెచ్చి  నా మెడకు కట్టు ‘ 

అంతరాత్మలకు మెడలు ఎక్కడేడ్చాయన్న డౌటొచ్చే లోపలే 

'సర్కార్ల  సంక్షేమ పథకాలేవన్నా ప్రజలకు మేలు చేసేవేనా  ?' అని కాకి మూకల నడిగి చూడు!  'కావు.. కావు' మనకుండా నోరు మూసుకు చావవు,  నాదీ గ్యారంటీ.  ‘! 

‘ గలగల, వలవల, గడగడల్లాంటి  జంటపదాలు మీ చెత్తు రచైతులకు  మల్లే చెత్తచెత్తగా వాడేసే  శక్తి.. గ్యాపు  లేకుండా  'కిచకిచ'లాడే  పిచ్చుకమ్మకుంటుందని తెలుసా తమకు? 'భ' అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుందో బోలెడంత డబ్బుపోసి కార్పొరేట్ బళ్లల్లో కునికే  మీ బదుద్ధాయిలకు  తెలీకపోవచ్చు కానీ.. ఏ వీధి కుక్క వీపు మీద ఓ రాయి బెడ్డ విసిరినా   'బౌ.. బౌ' అవుతుందని బోలెడన్ని సార్లుగొంతు చించుకుని మరీ  చెప్పేస్తుంది!  కప్పల్ని మింగడం తప్ప ఇంకేమీ తెలిదనుకునే పన్నగాలకు అమెరికా అధ్యక్షుల్లో  'బుష్' పేరున్న వాళ్లు  ఒకడు కాదు.. ఇద్దరున్నారన్న ఇంగితం బుసలు కొట్టి మరీ బైటపెడుతుందయ్యా మట్టి బుర్రయ్యా!  పార్వతమ్మకున్న  పర్యాయపదాలల్లో 'అంబ' ఒకటని.. నీకే కాదు..  ఆవుకూ  తెలుసు. జి.కె  మనిషి జన్మ ఎత్తిన మీకు మాత్రమే స్పషల్ క్యాలిటీ అంటూ   అస్తమానం ఇంతలావు  ఉబ్బెత్తు ఛాతీలు తెగ బాదుకుంటూ  తిరిగే మీ బోడి  మనుషు ముందు తెలుసుకోవలసవా సీక్రెటోటుంది.  ఏనుగుకి ఆంగ్లంలో నెయ్యిని ‘ ఘీ ‘ అంటారని ఏ క్రాష్ కోర్సులోనో జాయినయి బిట్టీ పట్టే   మీ భడవాయిలకన్నా   ముందే  తెలుసు – తెలుసా! ఇట్లా చెపు    చెప్పుకుంటా  పోతే ఈ జంతువుల జనరల్ నాలెడ్జుందే ఆ సబ్జెక్టుకు ఫుల్ స్టాపే కాదు.. కామా, సెమీ కోలన్లైనా  ఎక్కడ తగిలించాడామో తోచక తలలు పట్టుకోవాల తంబీ! లాస్ట్..  బట్ నాట్ ది లీస్ట్.. ఇంపార్టెంట్ పాయింటొకటుంది బ్రదర్ ! ఆ ముక్కా చెప్పక  వదిలేస్తే జంతులోకానికి అంతులేని ద్రోహం చేసినట్లే!   దటీజ్ .. నెమలీస్  ఒపీనియన్ ! ఈ మనిషిని గురించి ‘ పీకాక్!  . . పీకాక్! నువ్వేమనుకుంటున్నావో చెప్పు! ‘ అని ఎన్ని సార్లు అయినా అడుగు!  

'క్రాక్.. క్రాక్.. క్రాక్.. క్రాక్ ‘  అంటూ ఇంచక్కా  తోకూపేసుకుంటూ ఎగ్జిటయిపోతుంది ప్రతిసారీ! మనమేం చేస్తాం! చోసుడికే అన్నాళ్లకే నిలవనీడ లేకుండా పోయిన వండర్ఫుల్ వరళ్లో !

అంతరాత్మ అంతర్యం బోధపణ్ణంత  బ్లాంక్ హెడ్డు కాదిక్కడ . అంతులేని కోపంతో చేతిలోది విసిరేసా!  

పగలని అద్దంలో ‘ క్రాక్.. క్రాక్.. క్రాక్ , క్రాక్.. అంటూ  పగలబడి నవ్వుతున్న ఈ  అంతరాత్మ గాడిద నేంచేస్తే నస వదులుతుందనే  ఆలోచన నలిపేస్తుంది నన్నిక్కడ. 

వాంటెడ్ హెల్ప్ .. ప్లీజ్ . ప్లీజ్! 


-కర్లపాలెం హనుమంతరావు

29-10-2021  

బోథెల్ ; యూ.  ఎస్.  ఎ  

( పెన్ పవర్ దినపత్రిక ప్రచురితం ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...