Saturday, December 11, 2021

ఈనాడు - సంపాదకీయం - రచన - కర్లపాలెం హనుమంతరావు హర్షరుతువు

 


ఈనాడు - సంపాదకీయం 

- రచన - కర్లపాలెం హనుమంతరావు 

హర్షరుతువు 

( ఈనాడు - ప్రచురితం - 29-07-2012 ) 

హర్షరుతువు


'ముసుగు వేసిన చందాన మొగులుగప్పి కడవల నుదకంబు ముంచి తెచ్చి కుమ్మరించిన గతి' వాన కురిసిందని 'రామాయణం' రచయిత్రి మొల్ల వర్ణించింది. సుగ్రీవ పట్టాభిషేకం అనంతరం ముంచుకొచ్చిన వర్షరుతువు మూలంగా సీతాన్వేషణ వాయిదాపడి శ్రీరామచంద్రుడి విరహబాధ హెచ్చింది. మాధవుడిని ప్రతిగా కోరి గోవర్ధనగిరి సమీపాన రుణ విమోచనా తీర్ధంలో రాధాదేవి తపమాచరించే వేళ వానలుపడటం మొదలు పెట్టాయి. 'ఇంద్ర చాపంబు గాదిది మౌళి తలమున సవరించు బరి(నెమలి) పింఛంబు గాని/ బిదుర ఘోషంబు(పిడుగు ధ్వని) గాదిది పాంచజన్య సంజాత గంభీర 'ఘోషంబు గాని' అంటూ కుంభవృష్టిని ముకుందుని సృష్టిగా భావించి హర్ష పులకితాంతరంగిత అయింది తెనాలి రామకృష్ణ కవి శ్రీ పాండు రంగమాహాత్మ్యంలోని రాధాదేవి. విరహమైనా, వివశమైనా ఆధారపడేది మన మానసిక పరిస్థితిమీదే. మబ్బుపట్టడాన్ని ఎందుకో చాలా మంది అశుభ సూచనగా భావిస్తూ ఉంటారు. వానలేనిదే జీవంలేదు. 'శర్మిష్టి'లో కృష్ణశాస్త్రివారు అన్నట్లు ఇది 'మధుమాసమ్ము, ఇది వాన కారు/ ఇది వెన్నెలలవేళ, ఇది సీతుకారు' అటూ కాలచక్రం రుతుషట్కంగా విభజన జరగకపోతే జీవనవైవిధ్యానికి తావేది! జ్యోతిషం ప్రకారం చూసినా- 'వకార ఆరంభ నామధేయాల నక్షత్రం రోహిణి. రోహిణిది వృషభరాశి.  దానినుంచి మూడోది కర్కాటకం . సూర్యభగ వానుడి ఆ కర్కాటక ఆగమనం 'వనతతి(అడవులు), వరాహ, వాహా రి(నెమలి), వారణ(ఏనుగు),వర్షాభుల(కప్పలు) మనోవ్యాధులకు మహత్తరమైన ఔషధమ' ని  ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయల చమ త్కారం. దేవరాయలవారి దాకా దేనికి.. వానంటే ప్రాణం లేచిరాని దెవరికి? ఎవరు వద్దన్నా, ఎవరు కావాలన్నా కాలం పట్టించుకోదు. తన మానాన తాను క్రమం తప్పకుండా కాలచక్రాన్ని తిప్పుతుండటమే దానికి తెలిసిన పని. జ్వలిస్తే గ్రీష్మం, కురిస్తే వర్షం, చలిస్తే శిశిరు, విరిస్తే వసంతం... అంతే!


ఆచార్య గోపి అన్నట్లు 'మనిషికి ప్రకృతికీ తేడాలేని/ రుతు ప్రకో పంలో/ సమన్వయ సమ్మేళనంలా వికసించిన ప్రేమే వర్షం. వాన కురిస్తే మనసుకు కుట్టిన దుస్తులు తడిసి ముద్దవుతాయి. తుడిచిపెట్టుకుపోయిన ఆలోచనలు మళ్లీ గడ్డిలా మొలుచుకొస్తాయి. బాల్యంలో చూరునీళ్ల దుప్పట్లో దూరి అమ్మమ్మ చెప్పిన కాకమ్మ- పిచ్చుకమ్మ కథలను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొంటే- నెగడు ముందుచేరి చలి కాచుకుంటున్నంత వెచ్చగా ఉంటుంది! నిజానికి, వర్షం మనసును ఆరబె ట్టుకునే వస్త్రం.  చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడో చెలికత్తో  సరసన ఉంటే... చెట్టాపట్టగ చేతులుపట్టి ఏ చెట్టు నీడకో పరిగెడుతున్నట్లు ముచ్చట్లు ఊహించుకోండి... ముదితనం కూడా హర్షరుతువు ఆనవాళ్లు వెతుక్కుంటుంది. మామూలు మనుషులకే మతులు పోగొట్టే వర్షరుతువు మరి కవి హృదయాలను కుదురుగా ఉండనిస్తుందా! మహాకవి కాళిదాసు ' మేఘ సందేశం' మిషతో ఆషాఢమాస లీలా విలాసాలను తనివితీరా వర్ణించాడు. పాండ్యరాజు దిగ్విజయ యాత్రను ఒక్య పద్యంలో ముగించిన రాయలవారు వర్షరుతువు వర్ణనలతో ఆముక్తమాల్యద చతుర్ధాశ్వాసాన్ని ఆసాంతం తడిపివేశాడు. విశ్వనాథ, శ్రీశ్రీలనుంచి తిలక్, పులిపాటివంటి ఆధునికుల దాకా వర్షంలో తడవని వారెవరు! 'ఆకాశపు రహదారులలో/ అదిగో మెయిళ్ల తేరు' అంటూ, వానూరు దొరగారి జోరులో కృష్ణశాస్త్రి హోరె త్తిస్తే... కుందుర్తివారు నగరంలో కురిసే వాన గురించి ఓ వచన గీతమే రాసేశారు. పైలోకాన లేదు ఈ వాన సౌభాగ్యం. వర్ష తప్త  అనిర్వచనీయ అనుభవం కోసమేనేమో వటపత్రశాయి అవతారమెత్తాడు  అశేష తల్పశాయి! పోతన తన భాగవతం దశమ స్కంధంలో సోదర సమేతంగా గోపబాలురతో అడవి అంచుల్లో ఆవులను మేపుతూ గోపాలబాలుడు ఆడి పాడిన వానా వానా వల్లప్పులను పరమాద్భుతంగా వర్ణించాడు. ఏడు రాత్రులూ పగళ్లూ ఎడతెరిపి లేకుండా లోకం సమస్తాన్ని ఏకార్ణవంగా మార్చిన సంవర్తక మేఘగణ విజృంభణనూ అంతే బీభత్సంగా అభివర్ణించాడు. వృష్టి ఉండాలి నిజమే... అతివృష్టి అయినా అనావృష్టి అయినా అనర్థమే.


'అన్నమో రామచంద్రా!' అని అలమటించే చోట బీటలు వారిన పెదవులమీద నవ్వుల పువ్వుల్ని పూయించగలిగే శక్తి ఒక్క నీటిబిందువుకే సొంతం. క్షామగ్రస్త భూమాతకు ఊరట కలిగించేది అదనులో వరుణుడు చూపించే కరుణా కటాక్షాలే. అణువును ఛేదించే మనిషి చినుకును కురిపించగలడా! వివిధ ముద్రలతో నాట్య వేదిక మీద నృత్యమొనరించే నర్తకీమణుల్లాగా జీమూతగణాలు నీలాంబరంలో కదలివస్తుంటే మయూర తతులమాదిరి మనసు పురులు విప్పని మనిషి ఉంటాడా! వర్ష హర్షాన్ని అక్షరం మడుల్లోకి మళ్లించి సుసంపన్న సాహిత్యాన్ని పండించిన మహానుభావులు ఎందరో! నీరు లేనిదే బతుకే లేదు. ప్రకృతికి పచ్చదనాన్ని వాగ్దానం చేసిన సూర్యుడు మండే నిప్పుగోళమైనప్పుడు కన్నొక్కటే కురిసే మేఘమవుతుంది! వర్షాలు కురవడానికి ప్రత్యేక ప్రార్థన ఏమన్నా  ఉందేమో తెలీదు... వర్షంకోసం నాట్యం చేయడానికైనా మేము సిద్ధం:- ప్రపం చాన్ని మునివేళ్లమీద నాట్యమాడించాలని ఉవ్విళ్లూరే అగ్రరాజ్యం గుక్కెడు నీళ్లకోసం చేస్తున్న వేడుకోలు అది. పాలపుంతల్లోకి మనిషి ఎగబాకగలడేమోగాని కోరినంతనే, సమయానికి జలధరాన్నుంచి ఒక్క నీటి చుక్కను నేలకు దించలేరు.  జలధరం వేరు. జలదం వేరు. అదనుకు కురిసే మనసున్న మేఘం నేటి అవసరం.  రాయలవారు  'ఆముక్తమాల్యద'లో ఊహించినట్లు మాగాణుల్లో సాగు సాగించే రైతు పాదాలకు గండపెండేరాలు తొడిగినట్లు నీటిపాములు చుట్టుకొనేటంత వర్షధారలు కావాలి నేల తల్లికి ఇప్పుడు. 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 29-07-2012 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...