Showing posts with label Literature. Show all posts
Showing posts with label Literature. Show all posts

Sunday, December 12, 2021

కొన్ని న్యాయాలు .. కొన్ని లో కోక్తులు - కర్లపాలెం హనుమంతరావు



ఊడుగుగింజ న్యాయం 

ఊడుగుగింజలకు విలక్షణమైన గుణం ఉంది. రాలి చెట్టుకింద పడినవి మట్టిలో కలసి మృగశిర కార్తెలో ఒక్క చినుకు రాలినా చాలు  ఆ గింజలు మళ్లీ చెట్టుకే అతుక్కుంటాయి! 

ఒక పార్టీలో  నుంచి బయటకు వచ్చిన వాడు అదను చూసుకుని మళ్లీ ఆ పార్టీ లోకే గెంతేస్తే  అట్లాంటి జంపింగ్ జిలానీని 'ఊడు గింజ' లాంటోడు అనడం అందుకే. 


అక్కే చేత్ మధు విందేత కిమర్థం పర్వతం వ్రజేత్ ? 


అక్కము సంస్కృత పదం. ఇంటిమూల అని అర్థం. 

ఇంట్లో ఓ మూల  తేనెతుట్ట కనపడుతుంటే దానిని పిండుకోవాలి.  ఆ పని చేయకుండా తేనె కోసం కొండకు వెళ్లడం తెలివి మాలిన చేష్ట . వెతికేది  మన దగ్గరే ఉన్నా ఎక్కడెక్కడో గాలించే   సందర్భంలో వాడే జాతీయం ఇది . 

విజయ డయరీల వంటివి  మన రాష్ట్రంలోనే  పెట్టుకుని ఎక్కడి గుజరాత్ అమూల్  పాల కోసమో  అంగలార్చే సందర్భానికి   ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. 


3

అంధ కూప న్యాయం : 

ఒక గుడ్డి వ్యక్తి బావిలో పడితే, ఆ కబోదిని  గుడ్డిగా అనుసరించే కళ్లున్న వాళ్లూ  ఆ  బావిలోనే పడతారని చెప్పడానికి ఈ లోకోక్తి .  కూపము అనే సంస్కృత పదానికి  బావి తెలుగు అర్థం . 


అర్థజరతీయ న్యాయం: 

జరతీయ అంటే వయసు మీరిన శాల్తీ  . అర్థ జరతీయ-  అంటే సగం ముసలితనం వచ్చిన మనిషి . ఒకటి రెండు వెంట్రుకలు   మాత్రమే నెత్తిమీదివి  చూసి వయసులో ఉన్న స్త్రీ అని భ్రమపడినట్లే, నడుం మీద మడతలు రెండు  కనపడగానే వయసు ఉడిగిన స్త్రీగా భ్రమించినప్పుడు  ఈ న్యాయం వాడతారు. అంటే వస్తువులోని  ఒక పక్షపు లక్షణాన్ని బట్టి వస్తువు మొత్తానికి ఆ లక్షణం ఆపాదించే  ఆపత్తుకు    అర్థజరతీయ న్యాయం అతికినట్లు సరిపోతుంది. . 

ఫలానా రాజకీయ పార్టీ మంచిదని కొంత మంది .. కాదని  కొంత మంది 

వాదించుకోవడం వింటుంటాం . అప్పుడు ఇరు పక్షాలదీ  అర్థజరతీయ న్యాయమే అనిపిస్తుంది! 


అర్థాతురో న గణయత్  అపకర్ష దోషమ్ 

అర్థం ( డబ్బు ) మీద అత్యాశ ఉండేవాడు అవమానాలు లెక్క చేయడు - అని అర్థం. డబ్బు పిచ్చికి సిగ్గెగ్గులు  ఉండవనే  లోకం తీరును అద్దంలో చూపెట్టే సామెత ఇది. 

జైళ్లపాలవుతామన్నప్పటికీ     సిగ్గయినా లేకుండా అమ్యామ్యాలకు తెగబడతారు చాలామంది  పొలిటీషియన్లు! వాళ్లని చూసినప్పుడు  ఈ లోకోక్తి గుర్తుకొస్తుంది . 


6

అసారే  ఖలు సంసారే సారం శ్వశురమందిరమ్ 

అత్తారింటి మీద తమాషా చతురి ఇది. ఈ లోకం సారవిహీనం అయినా ( మజాగా లేకపోయినా ) .. ( శ్వశురమదిరం )   అత్తగారి ఇల్లు మాత్రం సారవంతమైనదేనట! ( అని అల్లుడిగారి ఆలోచన.. కోడలుది కాదు ) 

పాలిటిక్స్ పాడువే   అయినా మంత్రి పదవి మాత్రం మహా మజా! అనుకునేవాళ్లకు ఈ న్యాయం నూటికి నూరుపాళ్లు సరిపోతుంది  .. కదా! 😊


7

అసిధారావ్రతం - అనే మాట చాలామంది వాడుతుంటారు. దాని సరయిన అర్థం తెలుసో .. లేదో మరి! 

అసిధార అంటే కత్తకి ఉండే పదునైన  అంచు .. దాని మీద చేసే సాము చేయడానికి చాలా వడుపు అవసరం . ఆ కష్టాన్ని సూచించే న్యాయం ఈ అసిధారావ్రతం . 


8

అహి నకుల న్యాయం : 

పాము ముంగిస సామెత .  కేవలం శత్రుత్వం కన్నా పుట్టుకతోనే శత్రుత్వం ( ఆగర్భ శత్రుత్వం )  ఉంటే ఈ న్యాయం   మరింత అతుకుంది .

కాంగ్రెస్, భాజపాల మధ్య ఉండే రగడను చూసినప్పుడు ఈ అహినకుల న్యాయం గుర్తుకొస్తుంది . 


9

ఆమ్రవణ న్యాయం: 

వేరే రకాల చెట్లు చాలా ఉన్నా ..  మామిడి చెట్టు వంటి పళ్లు కాసే చెట్టు  గాని ఉందంటే. . ఆ తోటను మామిడి తోట  అనడం సహజం  . మామిడి తోట అన్నంత మాత్రాన ఆ తోటలో ఉన్నవన్నీ మామిడి చెట్లే కావాలని లేదుగా! గుంపులో ఒక విశిష్టమైన వ్యక్తిత్వం గల  వ్యక్తి ఉన్న సందర్భంలో ఆ గొప్ప వ్యక్తి పేరుతోనే గుంపు మొత్తానికి  గుర్తింపు వస్తుంది. 

ఉదాహరణకు తెలంగాణా రాష్ట్ర సమితి , ఆమ్ ఆద్మీ  పార్టీలు వంటివి ఆ పేర్లతో కన్నా  కెసిఆర్ పార్టీ , కేజ్రీవాల్  పార్టీలుగానే  ప్రసిద్ధి.. అట్లాగని  కెసిఆర్ పార్టీలో కెసిఆర్, కేజ్రీవాల్  ఒక్కరే ఉండరుగా ! ఈ భావాన్ని సూచించే సందర్భం వచ్చినప్పుడే  ఆమ్రవణ న్యాయం అనే లోకోక్తిని వాడాలనిపించేది  . 


10 

ఆహారే వ్యవహారే చ వ్యక్తలజ్జ స్సుఖీభవేత్ !

ఆహారంలో గాని, వ్యవహారంలో గాని మొహమాటం లేని వాడు సుఖపడతాడు  - అని సామెత . 

ఈ సామెత సారం రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాగ్నెట్లు బాగా వంటబట్టించుకున్నారు . కాబట్టే వాళ్లు ఆ స్థాయి దాకా ఎదిగి సుఖపడుతున్నారు. ఏమంటారు ? 

- కర్లపాలెం హమమంతరావు 

15 -09- 2021 

బోథెల్ ; యూ ఎస్ ఎ 

సాహిత్యం : సరదాగా ఒక సున్నా కథ - కర్లపాలెం హనుమంతరావు

సాహిత్యం : సరదాగా 

ఒక సున్నా కథ 

- కర్లపాలెం హనుమంతరావు 


కాళిదాసుగారు ఓసారి చదరంగం ఆడుకుంటూ .. మధ్యలో తన పరిచారిక అందించిన  తాంబూలం నోట్లో పెట్టుకుని, ' అబ్బ! సున్నం ఎక్కువయ్యింది! ' అన్నాడుట! 


ఆ సమయంలో  సోటి కవి భవభూతి రాసిన 'ఉత్తరరామ  చరిత'   అనే కావ్యం అతగాడు పంపిన్ దూత  చదివి వినిపిస్తున్నాడు.  కాళిదాసు మహాకవి కాబట్టి కావ్యంలోని మంచీ చెడ్డా వివరంగా పరిశీలించి  సూచనలిస్తాడని భరభూతిగారి ఆశ.  


కావ్యం  అయితే వినిపించడం జరిగింది. కాని,  తిరిగొచ్చిన దూత భవభూతిగారు  పదేపదే అడిగిన మీదట 'మహాకవి గారి  ధ్యాసంతా ఆ చదరంగం ఆటమీదా , అతగాని పరిచారిక మహాతల్లి తెచ్చిచ్చిన  తాంబూలం మీదనేనాయ! మీ కావ్యం ఎంత వరకు విన్నాడో .. నాకయితే అనుమానమే! మధ్యలో మాత్రం  ఓ శ్లోకం దగ్గర ' సున్నం  ఎక్కువయింద'ని  ముక్తుసరిగా అన్నాడండీ ! 

' ఏదీ ? ఆ శ్లోకం ఎక్కడిదో .. చూపించు! ' అ భవభూతిగారు అడిగిన మీదట

'ఇదిగో ఈ  ' కిమపి కిమపి' శ్లోకం అని చెప్పుకొచ్చాడుట దూతగారు. 


'కిమపి కిమపి  మందం మందమాసక్తి యోగా

దవిరల కపోలం జల్పతో రక్రమేణ

అశిథిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో

రవిదిత గతయామా రాత్రి రేవం వ్యరం సీత్' 

- ఇదీ శ్లోకం. 

భవభూతిగారు కూడా కవే కాబట్టి కాళిదాసు నర్మగర్భంగా అన్నది.. దూతగారికి అర్థం కాకపోయినా తనకర్థమయింది.. 


శ్లోకంలోని  ఆఖరి పాదంలో ' ఏవం వ్యరంసీత్‌' అనే పదప్రయోగానికి బదులుగా  ‘ఏవ వ్యరంసీత్’ అని ఉండాలని  కాళిదాసుగారి  సూచన. కాళిదాసు సున్నం ఎక్కువయ్యింది అన్న మాట శ్లోకంలో ఒక ‘సున్నా’ ఎక్కువయ్యింది అన్నట్లన్న  మాట.  భవభూతిగారూ కాళిదాసు సూచన ప్రకారమే   మార్చి శ్లోకాన్ని మరింత అర్థవంతం చేశాడని కథ. 

 

కథ, దాని అర్థం కేక! కరతాళధ్వనులు మిన్నుముట్టడానికి తగినట్లే  ఉన్నాయి. అనుమానం లేదు. కానీ ఇది ఇక్కడ ఉదాహరణ కింద చెప్పడానికి కారణం  వేరే ఉంది. 


మన వాళ్లకు చరిత్ర .. కవి కాలాదుల పట్ల  బొత్తిగా పట్టింపు లుండవనే అభియోగం ఒకటి మొదటి నుంచీ కద్దు .  దానికి మరింత  బలం చేకూరేలా ఉందనే ఇంత విపులంగా చెప్పడం  ఈ  కట్టుకథ . 


భవభూతి కాలం దాదాపు ఎనిమిదో శతాబ్దం;  కాళిదాసు జీవించిన కాలం బహుశా నాలుగో  శతాబ్దం! ఈయనగారు  ఆయనగారికి  ఒక దూత ద్వారా తన కావ్యం  వినిపించడం కామెడీగా లేదూ? 😁


ఒకానొక తెలుగు చలనచిత్రంలో కూడా ఇట్లాగే భద్రాద్రి రామదాసుగారు , భక్త కబీరును   కలిసి వేదాంతచర్చలు సాగిస్తారు! అదీ సంగతి !  😁


ఇట్లాంటి కామెడీలే  చూసి చూసి  మాన్యులు శ్రీ  వెల్చేరు నారాయణరావుగారు ' I like these fantastic lifespans and anachronistic legends. Indian literature is full of them. Remember Kalidasa and Bhavabhuti and Dandin meeting together in caatu tradition?'

( Refer to the Afterword in A Poem at the Right Moment) అనేశారు. 

అన్నారంటే అనరా మరి? 


- కర్లపాలెం హనుమంతరావు 

30 - 10-2021 

బోథెల్ ; యూఎస్.ఎ

; నిర్వచనం -నిర్వహణ - కర్లపాలెం హనుమంతరావు



సృష్టి-పునఃసృష్టి జీవనం కొనసాగింపుకు అవసరమయిన   సహజచర్యలు. మానవేతర జంతుజాలం తమ వంటి  జీవులను మాత్రమే సృష్టించ గలిగితే… ఇతర  రూపాలనూ, శబ్దాలనూ సృష్టించే ప్రతిభ మనిషికి అదనం. సంతాన సృష్టికి ప్రతిభతో పని లేదు.అవి జంతుజాలాలు కూడా చేసే సృష్టికార్యమే. ఇతరేతర శబ్ద, రూపాల పునఃసృష్టికే ప్రతిభ తప్పనిసరి. ఆ  ప్రతిభనే మనం 'సృజన' అని అనుకుంటున్నాం. ఆ ప్రజ్జ్ఞ గలవారిని  సృజనశీలురుగా గుర్తిస్తున్నాం. స్రష్టలు అని పేరు పెట్టుకుని గౌరవించుకుంటున్నాం.

కళాకారులందరూ స్రష్టలే. స్రష్టలు కన్నా  ముందు మనుషులు కూడా. మనుషులందరూ కళాకారులు కారు. కాలేరు. కొద్దో గొప్పో ప్రతి మనిషిలో కళంటూఏదో  ఒకటి దాగుండక పోదు గానీ..ఆ పిసరంత  కళయినా  బహిర్గతమైనప్పుడే అతనికి అంతో ఇంతో   కళాకారుడిగా సమాజంలో   గుర్తింపొచ్చేది. 

సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడు డిస్కార్టిస్టు ‘ఉనికి’ (Cogito ergo sum) పేరుతో ఓ సిద్ధాంత తయారుచేశాడు. దాని ప్రకారం మనిషి సృజనశీలి అయినా .. ఆ సృజనకు పొదుగు అనేది అతని 'బుద్ధి'నుంచి పుట్టుకురావాల్సిందే. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అస్తిత్వసిద్ధాంతం కూడా దాన్నే సమర్థిస్తున్నది.  

నేను అంటూ   ఒకడిని భౌతికంగా ఉండబట్టే కదా నాది అంటూ ఒక ఆలోచన ఉండే అవకాశం. ఉనికి వాదం (I exist.. therefore I think)  మనిషిని  బుద్ది విశిష్టుడిగా  కన్నా ముందుగా సృజనశీలిగా గుర్తిస్తుంది. ఇద్ది దాదాపుగా  జెన్ తత్త్వమే. మన  భారతీయుల భక్తి యోగాలకు కూడా ఈ ఉనికివాదనతోనే చుట్టరికం. 

హేతువు కన్నా  ముందు   అనుభూతికే మనిషి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూస్తున్నాం. ఎందుకిలా? అంటే .. ఏమో ఇదో అంతుబట్టని రహస్యం అంటున్నారు ఇప్పటి వరకు విశ్వవ్యాప్తంగా  ఉండే వేదాంతులంతా.  కానీ సృజన విషయం  అట్లా కాదు. స్థూలంగా  ఒక అభిప్రాయానికి రావడం కొంత సులభమే!  శ్రీశ్రీ ‘దివ్యానుభూతి’ ఖండిక తరహాలో  కవితాత్మకంగా చెప్పుకోవాలంటే   సృజన ‘సంకుల పయోధర  చ్చటా పంకిల నిబి- డాంధకార నిర్జన వీధికాంతరముల- నా చరించెడు వేళ-  ప్రోన్మత్త రీతి  అవశమొనరించు దివ్యతేజోనుభూతి’. ఇది స్వీయానుభూతి. ఆ అనుభూతినే ఎదుటివాళ్లకు ప్రసారం చెయ్యాలంటే?

లేనిదాన్ని సృష్టించడం, ఉన్నదాన్ని మరో రూపంలో సృష్టించడం, చూసిన వాటిని చూడని వాటిల్లోకీ, చూడని, చూడలేని వాటిని చూసిన వాటిల్లోకి తర్జుమా చేసి  తన్మయత్వం చెందేటట్లు చెయ్యడం, వగైరా ట్రిక్కులతో ఇది సాధ్యం.  అయితే ఇక్కడ ఒక ప్రమాదం కద్దు. ‘సరసియై చల్లనై నన్ను జలకమార్చె' అంటూ మహాకవి శ్రీశ్రీ తరహాలో కొత్తగా ఏదన్న సృజనాత్మకంగా చెప్పబోతే కొంత మంది ' ఆ సరసి ఎవరు? ఎక్కడుంటుంది? చిరునామా ఏంటి?' అని విచారణలకు దిగవచ్చు. శుద్ధ లౌకికులకు అంతుపట్టని అనేక లక్షణాలు సృజనాత్మక అంశంలో దాగుంటాయి. అవి అర్థం కాక తలపట్టుకునే ఇహలోక చింతకులకు మాత్రమే సృజన ఒక పనికిమాలిన దండుగ వ్యవహారం. నిజంగా సృజన ఒక దండగ వ్యవహారమా? 

ఆహర, నిద్ర, మైథునాధులే కాదు విరామం కూడా నిరంతరాయంగా అనుభవించలేడు మనిషి. వద్దంటే డబ్బు సినిమాలో ప్రారంభంలో పేదరికంతో అష్టకష్టాలు పడ్డ కథానాయకుడు ఒక దశ నుంచి దశ తిరిగి వద్దన్నా డబ్బు వచ్చి పడుతున్నప్పుడు రూపాయి బిళ్లను చూసి బెదిరిపోతాడు. మనిషి చపలచిత్తం మీద వ్యంగ్యాస్త్రాలు సంధించనట్లున్నా ఆ చలన చిత్రం మనిషిలోని కుదురులేని వైనాన్ని కళ్లకుకట్టిస్తుంది. నిశ్శబ్దం ఉండలేక  విసుగెత్తినప్పుడు మనిషి అందుకే శబ్దాన్ని సృష్టించుకుంది. శబ్దంతో మనసు సంక్షుభితమయినప్పుడు  సాంత్వన కోసం  ముక్కూ, మూతీ మూసుకున్ని కూర్చున్నదీ  అందుకే.   ఆ ప్రత్యేక శబ్దాలను  కవిత్వం  ఈ విశిష్ట నిశ్శబ్దాన్ని యోగాసనాలని   ఓ ప్రత్యేక నాదాన్ని సొంతంగా సృష్టించుకుని  రాగాలాపనలోకి జారుకుంటాడు.  కొత్త లయలూ, భంగిమలూ, కదలికలూ ఆవిష్కరించుకుని  నృత్యం పేరుతో సొంతలోకంలో విహరిస్తాడు. అనుకరణే కావచ్చు కానీ అనుసృజన అనిపించే చిత్రాలు, శిల్పాలు సృష్టించుకుని మురుస్తాడు. కవిదీ అదే వరస.’భావ మనియెడు నెత్తావి బలిసియున్న-మేలు రేకుల విప్పారు పూలు మేము’ అంటూ వాస్తవ జగత్తును అనుసరిస్తూనే   కొత్త కొత్త పదాలతో, వ్యక్తీకరణలతో  నూత్నప్రపంచమొకటి  సృష్టించుకుని అందులో  ఆనందాలను వెదుక్కుంటాడు. అనుకరణ కన్నా అనుసృజన మానుషకళలోని  చెప్పుకోదగ్గ గొప్ప ప్రజ్ఞావిశేషం.


అస్తిత్వ సిద్దాంతం  పైపై చూపులకి -  ప్రజ్ఞ, విజ్ఞానం అభాసాలంకారాల్లాగా ఎడపెడగా అనిపిస్తాయి కానీ అది నిజం కాదు.  మహా మేధావి ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ వయోలిన్ బ్రహ్మాండంగా వాయిస్తాడు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త భాభా చిత్రకళ ప్రావీణ్యం అత్యద్భుతం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్,  బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి చర్చిల్ చక్కటి ప్రకృతి చిత్రకారులు. కళాభినివేశమంటూ మెలుకువతో ఉండాలే గానీ బుద్ధి ఏ రంగంలో పనిచేస్తున్నా  సృజనతృష్ణ( creative urge) మరో రూపంలో  బైటపడి తీరుతుంది. ‘సృజనశీలత ఆయాచిత వరంగా దక్కిన అదృష్టవంతులు..లౌకిక వృత్తిలో రాణిస్తూనే..ప్రవృత్తి పరంగా అలౌకిక  లోకాల్లో ఆత్మానందాన్ని వెదుక్కుంటో విహరిస్తుంటార’నేది మనోవైజ్ఞానిక శాస్త్ర౦ నిర్థారించిన సత్యం.

కవి ఒక కమనీయ కావ్యం, చిత్రకారుడు ఒక   అద్భుత చిత్రం, నర్తకీమణి ఒక  రమణీయ రూపకం, సంగీతవేత్త ఒక మహత్తరమైన రాగం, శిల్పి ఒక అనల్పమైన విగ్రహం..కల్పించటానికి అహోరాత్రాలు నిద్రాహారాలను నిర్లక్ష్యం చేసి  ఎందుకంతగా శ్రమిస్తాడంటారు?! ఎన్ని కష్టనష్టాలొచ్చి పడ్డా ఆ శ్రమ నుంచీ విముక్తి కోరుకోడు ! ఎందుకు ?! ‘చల్లని వేళ సత్కవి విశాలమనంబునయందు బుట్టి సం/ ఫుల్లత నొందు హల్లకము పోల్కి నొకళ్ళ మొకళ్ళ మోలిమై/ నల్లన మేము విచ్చుచునుందుము’ అంటో  లోపల్నుంచీ ఉడుకులెత్తే సృజనశక్తి హోరెత్తిస్తుంటే ఆ వత్తిడి నుంచి  ముక్తి పొందటానికి ఇలా    ఏదో కళారూపంలో  భౌతికసృష్టి జరగాల్సిందే- కనక.


కొందరు ఎందుకంత సులభంగా  సృజనశీలులై పోగలరు? ఇంకొందరు  ఎందుకు ఎంత  తన్నుకులాడినా ఒక్క మంచి  కల్పనా చేసి వప్పించలేరు?! అనేదింకో  సందేహం. ప్రశ్నంత   సులభం కాదు సమాధానం. 


అనువంశికతో, మానసికతో, బాహ్య పరిసరాల అనుకూలతో, కార్యరూపం దాలిస్తే మరేమన్నాఇతరేతర ప్రేరేపక శక్తుల శబలతో..  ఇతమిత్థంగా ఇదీ అని నిర్థారించడం కుదరని ఇంకేవైనా  కారణాలో కావచ్చు – అనేది ప్రముఖ రసతత్త్వవేత్త  సంజీవ్ దేవ్ జీ మతం.  జన్మతః సృజనశీలత ఉండీ..పరిసరాల ప్రభావం వల్లా, ప్రతికూల పరిస్థితులవల్లా సంపూర్ణంగా వికసించని ప్రచ్ఛన్న కళాకారులు కొందరైతే..పుట్టుకతో పట్టుబడక పోయినా పట్టుదలవల్ల, అనుకూల పరిస్తితుల చలవ చేత , శిక్షణ ద్వారా రాణించిన, రాణిస్తున్న కళాకారులు ఇంకొందరు సమాజంలో మన మధ్యనే  సదా  సంచరిస్తుంటారు’అనేది ఆయన వాదం. కాదనలే౦ కదా!


ఐతే సృజనకార్యంలో తలమునకలైన వాళ్ళంతా కళాకారులే ఐనా.. సహజప్రతిభకి.. బుకాయింపు కళకి మధ్య చాలా అంతరం ఉంటుంది. అసలు కళను ఆ ‘కళే’ పట్టిస్తుంది. సహజ స్రష్ట మదిలో సదా త్యాగయ్యలో మాదిరి  ఓ ఆనందజ్వాల ప్రజ్జ్వలిస్తుంటుంది.  వీరబ్రహ్మంగారి జీవితం లో వలె బౌతిక పీడలు వాళ్ళ అంతఃచేతనను ఎంత   మాత్రం  ప్రభావితం చేయలేవు.  సందు చూసుకుని  మరీ  అన్నమాచార్యులవారి  అంతరంగ తపన లాగా ఇంకేదో  ఉత్కృష్ట రూపంలో విస్మయంగా  బైటికి తన్నుకొచ్చే తీరుతుంది. చెరసాల  పీడ  గోపన్నలోని రాగజ్వాలను మరింత ప్రజ్జ్వలింప చేయడం ఇందుకు ఉదాహరణ. 


కళాకృతులను అమితంగా ప్రేమించి ఆరాధించే కళాభిమానులు వాటి సృష్టికర్తలను  సైతం అంతే సమున్నతంగా ఊహించుకోడం సహజం. కానీ  నిజ జీవితాలను సొంత కళాసృష్టంత సమోన్నతంగా నిర్వహించుకోడం ఏ కళాకారుడికైనా ఏమంత తేలిక వ్యవహారం కాదు. తెనాలి రామలింగడు ఎద్దేవా చేసిన ‘కూరగాయల’ కళాకారులు అప్పుడూ ఉన్నారు.ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. నిజ,కళాజీవితాల  ప్రస్థానాలు సరాసరి వ్యతిరేక దిశల్లో ప్రయాణించిన నీరోలు, జౌరంగజేబులు మనకు చరిత్రలో ఉండనే ఉన్నారు. సృజనవేళే వీళ్ళు అపరబ్రహ్మలు. మిగతా వేళల  వట్టి పిండి బొమ్మలు. బ్రహ్మ రాక్షసులు. మామూలు వ్యక్తుల మాదిరే వ్యావహారిక జీవితంలో చిరుకోరికలకూ, చిట్టి పొట్టి తాపాలకూ, చిరాకులకూ, చిన్నాపెద్దా బలహీనతలకూ దాసులు.  రూకల  బొబ్బట్లు, సన్మానపు దుప్పట్లు, అహం చలి కాచుకునేందుకు  వెచ్చని  చప్పట్ల  కుంపట్లు.. వాటికోసం సిగ్గు విడిచి సిగపట్లు..! ఏటి వాలులోనే వీరి నావ వీర విన్యాసాలు. నిలువీత రాకపోతే ఎంత గజీతగాడి పోజు పెట్టినా…ఆటుపోటు లెదురైనాక   బోటు గల్లంతు..

‘ఆదరము తగ్గె దంభమాహాత్మ్యములకు

పక్షపాతపు రచనల పస నశించె

రసికులకు మీ చరిత్ర విసువు దోచె

పరువుగా నింతట బ్రబంధపురుషులార!

కదలిపొం డెటకైనను..మీకు

నేటి కావ్యప్రపంచాన చోటు లేదు’ అంటూ   కాలప్రవాహం దయాదాక్షిణ్యాలకే  అలాంటి మిడతంభొట్లగుంపు నొదిలేయడానికి మించిన మహత్తర కార్యం మరోటి లేదు.


అట్లాగని  లోకమంతా  ఆషాఢభూతుల బంధుగణంలో  నిండి ఉందన్న నిస్పృహా శుభం కాదు.    ఇంత వైవిధ్యవిలాసాలతో విలసిల్లుతున్న సృష్టి ఎన్ని లక్షల స్వచ్చమైన కళాకారుల సృజనపునాదుల మీద నిర్మాణమవుతుందో అర్థం చేసుకోవాలి. కామించిన సుందరి ‘చీ.. పొమ్మన్న్దం’దుకు గోపాలుడి నడ్డమేసుకుని జావళీలు సృష్టించిన క్షేత్రయ్యలు  ఈ కళాక్షేత్రంలో కొల్లలు. అన్నహారాలు మాని అన్నమిచ్చిన వాని పుణ్యాన్ని రోజుకోతీరులో  సంకీర్తించిన  పదపితామహులు అన్నమయ్య సాహిత్యలక్ష్మిపాదాలకి అలంకరించిన మువ్వల  మాటేమిటి!  దుండగుల కెదురుగా  నోరు తెరవాలంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్లున్న గడ్డుకాలంలో సైతం సామాజిక దురాచారాలను ఆటవెలదుల నోటితో కడిగి పారేసిన ప్రజావేదాంతి వేమన పద్యాల సంగతో! చెప్పాలంటే చేటభారతమంత. ఆ మాటకొస్తే  భారతంలో మాదిరి కళాభారతంలో కూడా ఉత్తరకుమారులున్నట్లే..ఉదాత్త కర్ణులూ..ఏకలవ్యులూ ఉన్నారు.ఉంటారు. ఎవరి దారి ఆదర్శనీయమో అనుసరణీయమో నిర్ణయించుకొనే విజ్ఞత మాత్రం ఎవరిది వారిదే.


సహృదయంతో చూడాలే కాని..నిజ జీవితాలని  సొంత  కళాకృతులను మించిన నిబద్ధతతో నిర్వహించుకున్న స్రష్టలూ .. మనకు కళాసాహిత్య రంగాలనిండా శతసహస్రాలు. అందరిలో అసామాన్యంగా వెలిగే సుగుణదీపం-  సృజన నిత్య నూతన వికాసం.  సాయంగా  .. సమీక్ష, సహనం, నిజాయితీ, నిబద్ధత. కళాజ్యోతుల నిజ జీవితాల్లో ఆలోచనల అనుభూతుల కలబోత  కొట్టొచ్చినట్లు కనిపించే మరో కిరణపుంజం.  ఉత్తమ కళాకారుడు ఉత్తమ మానవుడు కూడా అయితే సమాజానికి సదా ఆదర్శప్రాయుడమతాడు.

 చిత్తశుద్ధితో నమ్మిన జీవన ఉదాత్త సూత్రాలను  ఆచరించి చూపించిన కళావైతాళికుల చరిత్రలో మనకు ఎందరో కనపడతారు. వారి  అడుగుజాడల్లో నడవడానికి కళాకారులకు .. కవులకు ఎవరడ్డొస్తున్నట్లు?


‘నడవడకయ నడచివచ్చితి

నడచిన నే నడచిరాను నడచెడునటులన్

నడిపింప నడవనేరను

నడవడికలు చూచి నన్ను నడిపింపరయా!’అంటూ సృజన  మూర్తే కవి ,కళాకారుడి నడవడికకు  తానెంతగా ప్రాధాన్యత  ఇస్తుందో స్వయంగా వెల్లడించింది. 


పరిసరాల ప్రభావాలెంత ప్రతికూలంగా ఉన్నా స్వయంప్రతిభతో  ఆ సృజనమ్మ పిలుపునందుకుని ఎత్తుల కెదిగే ప్రయత్నం సొంతంగా  చేసుకోవడం కళాకారుడి  చేతుల్లోనే ఉంది. అవే చేతులతో సాటి సహోదరులకూ చేతనైనంత  చేయూతనిచ్చి పైకి చేదుకోవటం కూడా సృజనశీలత ఇంకా సజీవంగానే ఉన్నదని నిరూపించుకునే రుజువు . 

***


- కర్లపాలెం హనుమంతరావు 


నారికేళపాకం - ఆవశ్యకత -కర్లపాలెం హనుమంతరావు

 

కావ్యం ఒక జగత్తు.

లోకంలోని మిట్టపల్లాల మాదిరే కావ్యాలలోనూ ఎగుడుదిగుడులుంటాయి. అనివార్యం. కావ్యజగత్తు, బౌతిక జగత్తు అన్యోన్యాశ్రయాలు. బౌతిక జగత్తు లేనిదే కావ్యజగత్తు లేదు. కావ్యజగత్తు వినా బౌతిక జగత్తుకు వెలుగూ లేదు.

ఇహ కావ్యరసాల విషయానికి వస్తేః

గుత్తి నుంచి ద్రాక్షపండును ఇట్టే కోసి నోట్లో వేసుకోవచ్చు. అరటిపండు ఆరగించడం అంటే గెల నుండి కోయడమే కాకుండా, తోలు వలుసుచుకొనే కొంత ప్రయాస తప్పదు. కొబ్బరికాయ దగ్గరి కొచ్చే సరికే ఆ ప్రయత్నం మరింత  అవసరం. కావ్యపాకాల తంతూ ఈ తరహాలోనే ఉంటుందంటుంది అలంకారశాస్త్రం!

లోకంలో ద్రాక్షపండుతో మాత్రమే సర్దుకుపోతున్నామా మనమందరం! ప్రయత్న పరిమితిని బట్టి సాఫల్య పరిమితి. ఆ సూత్రం అవగతమయిన వారితో వాదు లేదు. కానివారితోనే లేనిపోని పేచీ. ఆనందం కోసమే కావ్య పఠన అనుకున్నప్పుడు.. ఆ ఆనంద రసానుభవానికి బుద్ధి తాలూకు వైవిధ్యం మరంత విశిష్టత చేకూరుస్తుంది.  ఆ వైశిష్ట్యంలోని అంతస్తుల అమరిక అర్థమవకో.. వద్దనుకొనే భావన వల్లనో అయోమయమంతా.

'భోజనం దేహి రాజేంద్ర! ఘృతసూపసమన్వితమ్ /మాహిషం శరచ్చంద్రచంద్రికా ధవళం దధి'అన్న శ్లోకంలోని మొదటి భాగం ఒక్కటే కాదు.. రెండో భాగమూ సమన్వియించుకోవాలి. అదీ సాహిత్యవేత్త లక్షణం.

ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, ఒక్క ద్రాక్షాపాకంలో మాత్రమే కవిత్వం ఉండాలనే  కవిత్వానికే అన్యాయం చేయడమవుతుంది. కదళీపాకం వరకు చదివి ఆనందించేవారితో కూడా కవిత్వానికి సంపూర్ణ న్యాయం జరిగినట్లు కాబోదు. నారికేళపాకం కోరుకొని ఆస్వాదించి ప్రోత్సహించినప్పుడే ఉగాది సంబర ప్రసాదం వంటి కవిత్వం రూపుదిద్దుకొనేది. అయితే ఆ అంతస్తు చేరుకోనే చదువరికి శబ్దశక్తి పట్ల అవగాహన మాత్రమే సరిపోదు.. రసనిష్ఠ సహకారమూ అనివార్యం.

నారికేళపాక రసాస్వాదనకు ప్రాచీన కావ్యజగత్తులో అగ్రతాంబూలం. ఆ గౌరవం అందుకునేటందుకు చదువరికి ముందు అవసరమయేది శబ్దార్థపరిజ్ఞానమే అయినప్పటికీ, అంతకన్నా ముఖ్యమైనది ప్రాక్తనసంస్కారం. ఇది సంపన్నమయివున్నప్పుడే నారికేళపాక రసస్వరూపాన్ని సమగ్రంగా స్వానుభవంలోకి తెచ్చుకొనే భావాత్మ బలం పుంజుకునేది. పాండిత్య శబ్దవాచ్యతా, రసికపదలాంఛనప్రాప్తీ కొరవడుతున్న వాతావరణంఎ కఠినపాకం, బీరఆఆఆపీచుక్రమమనే అలంకార శాస్త్రం ఉగ్గడించని విచిత్ర పదాలు పుట్టుకురావడానికి కారణం.

దోషం కావ్యసృజనలో లేదు. ఉన్న మెలికంతా రసాస్వాదన అసక్తత వల్ల సంభవించిందే!

- కర్లపాలెం హనుమంతరావు

22 -05 -2021

(శ్రీపాదవారి కావ్యజగత్ భావన)

సృష్టిలో - రాచకొండ – కధ - పై నా స్పందన - కర్లపాలెం హనుమంతరావు

స్పందన: నా స్పందన చదివే దయచేసి రచయిత రావిశాస్త్రిగారి 'కథ'  చదవమని ప్రార్థన🙏🙏

                                       ❤️❤️❤️'


 జీవితం చాలా చిత్రమైన వ్యవహారం. బతికి తీరాల్సిందేనన్న ఇచ్ఛ పెట్టి, అట్లా బతికేందుకు మళ్లీ అడుగడుగునా అడ్డంకులు  కల్పించడం .. ఇదేదో ప్రకృతి-  జీవిని  ఆటపట్టించాలని  చేసే చిలిపి చేష్టలా అనిపిస్తుంది. 

బతకడమంటే  వూరకుక్కలా ఊరకే  బతకేయడం  కాదుగా! కులాసాగా గడవాలి కాలం . ఈసురోమని ఏడుస్తూ రోజులు ఈడిస్తే  ఆ బతుకు  'బతకడం'  ఎట్లా అవుతుంది! దాని కన్నా చావు హాయి. అట్లాంటి దిలాసా జీవితం గడపాలంటే    కంటికి నిండుగా  నిద్దుర పోవాలి. వంటికి పట్టే తిమ్మిరి తీరడమూ అవసరమే ఒక ఈడు వచ్చి పోయేదాకా . తతిమ్మా సంగతులన్నీ ఆనక .. ముందైతే కడుపారా ఎప్పటికప్పుడు ఆహారం దొరకాలి. ఆహారం దొరకుబుచ్చుకోవాలనే    కోరిక నిలబడాలి. 


కోరిక  ఆకలి ప్రేరకం. ఆ ఆకలి చుట్టూతానే  జీవులు పడే నానాయాతనలూ! ఆకలి పెట్టే రకరకాల  తికమకల  కతే రావిశాస్త్రిగారు జాస్మిన్ అనే దొంగ పేరుతో సృష్టించిన ఈ 'సృష్టిలో ' ని  దొంగ తిండ్ల కథా - కమామిషూ! 

ఆకలి ఉంటేనే జీవం ఉన్నట్లు లెక్క౦టారు . అది వేళకు తీరడమే   జీవితం సజావుగా సాగుతున్నట్లని  కూడా  చెబుతుంటారు . నిజమే! ఆకలి చుట్టూతానే చీమ  జీవితం నుంచి  సింహం బతుకు వరకు పరిభ్రమించడం .. లోకంలో  నూకలు చెల్లే దాకా.ఆకలి తీరేందుకు అవసరమయ్యే ఆహారం ప్రకృతి వేరే ఎక్కడి  నుంచో తెచ్చిపడేయదుగా  జీవులకు! మీలో మీరే ఒకళ్లనొకళ్లు ఆరగించుకోమని  చేతులు దులుపుకుని చక్కా  తమాషా చూడటం దాని జబ్బు . అదిగో .. ఆ ఒకళ్ల నొకళ్ళు  స్వాహా చేసుకొనేందుకు నడిచే నాటకం పేరే ' స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్' . జీవన పోరాటం - అచ్చు తెలుగులో చెప్పాలంటే " బతకడానికి కొట్టుకు చావడం "! 

ఈ బతికేందుకు కొట్టుకు చచ్చేటప్పుడు జీవులు వేసుకొనే  ఎత్తులు ప్రైయెత్తులు .. యుక్తులు.. కుయుక్తులు చూడాలీ ! ఏ యానిమల్ కింగ్‌డమ్ లాంటి  ఛానెల్లో బైటి నుంచి చూడ్డానికైతే భలే గమ్మత్తుగా కూడా ఉంటాయి. అంత గమ్మత్తు మత్తు  ఉంటుంది  కాబట్టే అవి కథావస్తువులు అవడానికి అన్ని విధాలా  అర్హత పొందినట్లు సిద్ధాంతకర్తల   లెక్క ! 

సామాజిక స్పృహ అంటే ఈ తరహా విశేషాల పట్ల తార్కిక అవగాహన కలిగివుండటమేనంటారు. సామాజిక చైతన్యం దాని పై మెట్టు  మాట. ఎదుటి జీవి దెబ్బనుంచి తప్పుకుంటూ, ఆ ఎదుటి జీవిని  దెబ్బకొట్టడమనే లాఘవం పేరే జీవించే కళ అనుకుంటే   .. ఆ కళ .. కళ కోసమేనని కొందరు ; కాదు.. కాదు, అది జనం కోసరంరా  బాబూ !  అని ఇంకొందరు ఎడతెరిపి   ఎరక్కుండా మాటా మాటా అనుకోడం పద్దాకా చూసే పితలాటకమే! ఏ పితలాటకమయినా  ఈ ఆకలి నాటకం పాయింటు దగ్గరి కొచ్చేసరికి  అమాంతం  గప్ చిప్ .. కళకయినా, జీవికకయినా ముందు ముద్ద అవసరం కాబట్టి .


తాత్విక చింతన తరహా మంత్రతంత్రాలతో   చింతలూ చింతకాయలూ  రెండూ రాలగొట్టే    తరహా కథలు రాసే ప్రయోగం కొత్త పద్ధతిలో    కొనసాగిస్తూనే .. ఆ  వంకన మధ్య మధ్యన తన వంతు మార్కు సొంత వేదాంతంతో  ..   కథలు కాని వాటిని కూడా కథలుగ చేసి గిలిగింతలు   పెట్టడం   ఓం ప్రధమంగా ఆధునిక  తెలుగు కథానికకు  నేర్పించిన చమత్కారి   రావిశాస్త్రి . 


బతకడానికి ఒకరినొకరు చంపుకునేందుకు వేసుకునే ఎత్తులు, ముఖాముఖి  తటస్తపడితే   తప్పక దూసుకునే కత్తులు .. గట్రా ఆయా జీవులు మనసుపడి  మరీ ఏమీ చేసుకోవడం లేదనేది శాస్త్రి గారి  థియరీ.  భగవత్సుష్టికి అవసరం గనక   వైరాగ్య౦తో   మాత్రమే  ఈ హింసాకాండ కొనసాగుతున్నదని  శాస్త్రిగారు  ఎన్నో   కథల్లో చెప్పినట్లు    ఇందులోనూ చెప్పుకొస్తారు. బతకడం, తమ మీద ఆధారపడ్డవాళ్లని బతికించడం కోసమే ధ్యేయంగా  మొక్కుబడి యుద్ధాలు  జరుగుతున్నట్లు ఆయన ఉద్దేశం! 


తిండి  వేటకు బయలుదేరేముందు బొరియలోంచి బైటికొచ్చిన నక్కతల్లి చేత  బిక్కు బిక్కు మంటూ చూసే తన బుజ్జి మూడు పిల్లలకు లోకంలో బతకాల్సిన అగత్యం  గురించి , బాధ్యత, తీరుతెన్నులను   గురించి  చెప్పినప్పుడు కరుణరసం ఉప్పతిల్లడానికి కారణం హింసకు బైలుదేరిన ఆ జీవిలో    సంసార బాధ్యతే తప్పించి క్రౌర్యం ఏ కోశానా లేకపోవడమే!   'అయ్యో! పిచ్చి పిల్లల్లారా! బెంగ పెట్టుకోకండర్రా! అలా వెళ్లి ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్లకపోతే ఎలా కుదురుతుందో చెప్పండి! వెళ్లి బువ్వ తెచ్చుకోవాలా? మీరు చిన్న పిల్లలు, మీకేం తెలీదు. కష్టపడకపోతే కూడు దొరకదమ్మా! నేను కష్టపడితేనే నాకు బతుకు, మీకు బతుకు. మీరూ పెద్దవాళ్లయి, కాళ్లకి పరుగొచ్చి, పళ్లకు పదునొస్తే, మీరూ లోకం మీద పడి బతికేయచ్చు కాని , అందాకా నా కోసం మీ కోసం కూడా నేను తిరక్క తప్పదు.' అంటూ తన  పక్షంగా జీవించాల్సిన అవసరాన్ని  ' గీత ' లా   బోధిస్తుందీ కథలో తల్లినక్క . భారతంలోని బకాసురుడిని అడిగినా ఇదే పద్ధతిలో  మరింకేదో గీత   వినిపిస్తాడు .. సందేహం లేదు. ఆకలి   అంబానీనైనా  . . పనిలేని సోంబేరినైనా    ఒకే విధంగా   వేధిస్తుంది . మనీ లేదు, అసలు మానవ  జన్మే కాదు, పాపం.. బలహీనమై శాల్తీ , బతకడం బొత్తిగా చేతరాని కుంక ' అని జాలేమీ చూపించదు గదా! ఆకలి లేకపోతే ఆరాటమే ఉండదు. ఆరాటం లేకపోతే జీవించాలనే ఇచ్ఛ  పుట్టదు. బతుకు మీద  ఉండే పిచ్చ తీపి వల్లనే .. ప్రమాదం అంచున ఉన్నప్పుడు శత్రువు ఎంత బలం, బలగం కలిగి భీకరంగా   భీభత్సం చేస్తున్నప్పటికీ ..   ఆఖరి నిశ్వాస దాకా చంపే  తీరాలన్న మొండిధైర్యమే ఎంత బక్క జీవినైనా  ముందుకు తోసేది . అధైర్యపడుతూ ఓ మూలన ముడుచుక్కూర్చుంటే బలహీనమైన  జాతులు  తరిగిపోయి బలవంతుల వర్గం  సైజులో  ముదిరి జీవసమతౌల్యం దెబ్బతినేస్తుంది  కదా! ప్రకృతికి  అంతకు మించిన  ముసలం మరింకేముంది! ఎవరికోసమో కాకుండా  తన ఉనికి కోసమైనా జీవులకు కడుపులు పెట్టి, వాటిలో ఆకలి చిచ్చు పెట్టి,     ఎప్పటికప్పుడు దాన్ని ఆర్పుకు చావండి .. లేదంటే చావండి ! '  అంటూ ప్రకృతికి ఏదో  ఓ తమాషా చేయకతప్పదు! 


సృష్టిలోని జీవుల అదుపుకు ప్రకృతికి  తోచిన ఇన్ - బిల్ట్ మెకానిజం ఈ ' బతకటానికి   కొట్టుకు చచ్చే' ట్రిక్కు ఒక్కటే   ! ఈ ఆటలోని  'చావుకు  దారి తీసే  ఆహారం వేట'  పార్ట్ ను ప్రత్యేకంగా విడదీసి రావిశాస్త్రి గారు ఇక్కడి ' సృష్టిలో '   కథలో   కిక్కిచ్చేలా   చెప్పుకొచ్చారు.. ఎప్పట్లానే  తన వంతు చురకలూ  నడి మధ్యన  వడ్డిస్తో  ! కథ చివర్లో  బ్రాకెట్ లో కనిపించేవి ఈ బాపతు జౌట్ ఆఫ్  బాక్స్  చురకలే అందుకు ఉదాహరణ !  


 "కోడి పెట్టల్ని వీరన్న ఎత్తుకుపోయేడు. వాటిలో రెండింటిని వీరన్న ఇంటి నుంచి దొంగనక్క కరుచుకుపోయింది. నూకునాయుడి పది సెంట్లనూ  వీరినాయుడు  తన పదెకరాలల్లో కలిపేసుకున్నాడు.  అందు గురించి నూకునాయుడు దావా తీగా ప్లీడరు గుమాస్తా అతని డబ్బంతా ఎగేసేడు. ప్రతివాదైన వీరినాయుడు దగ్గర పెద్ద ప్లీడరుగారు అయిదువందలు (పది సెంట్ల భూమి ఖరీదే అంత) ఒడికేసేరు. వీరినాయుడి బంజరు భూమిని వీర్రాజుగారు ఆక్రమించేసేరు. ఆక్రమించుకున్న ఆస్తులన్నీ వారు తమ చిన్నభార్యవారి పేర్న పెట్టి ఉంచేరు. వాటి వల్ల వచ్చే రాబడంతా ఆవిడ తన తమ్ముడి ఇంటికి నడిపించేసింది . ఆ తమ్ముడు ఆ సొమ్మంతా తన ఉంపుడుకత్తెకి ఇచ్చేసేడు. ఆ ఉంపుడుకత్తె ఆ డబ్బంతా తనకు నచ్చినవాడికి ఇచ్చేసింది. ఆ నచ్చినవాడు సినిమా చిత్రం కోసం మెడ్రాస్ వెళ్తే తారలూ, డైరక్టర్లూ కొంత డబ్బు తినేసేరు; మిగతాది ఓ నాటుకోటి చెట్టియారు లాక్కున్నాడు.  ఊరివారి డబ్బునీ కార్మికుల కష్టాన్నీ దోచుకున్న చెట్టియార్ గారి చేత ఈ మార్వాడి దివాలా తీయించేడు. మార్వాడీగార్ని ఓ తాబీతరావారు తమ ధృతరాష్ట్రపు  కౌగిట్లో కలుపుకున్నారు. తాబీతర్లావారిని ఓ ఇంగ్లీషు కంపెనీ రాజ్యంవారు లాగుదామని చూస్తున్నారు. వీరందర్నీ ఓ అమెరికన్ సిండికేట్ సామ్రాజ్యంవారు చెరచడానికి వారి రెక్కలు పట్టుకొని గిజగిజలాడిస్తున్నారు. సిండికేట్ వారి కాలి కింద ఇసకని కొందరు జపనేయులు దొలుస్తున్నారు. వారి సీటు కింద వేరొకరు గోతులు తవ్వుతున్నారు. వార్ని మరొకరు, మరొకర్ని  ఇంకొకరు,  ఇంకొకణ్ని వేరొకడు, వేరొకణ్ని వీడు, వీణ్ని వాడు, వాణ్ని వీడు, వీణ్ని  ఇది, దీన్ని వాడు, వాణ్ని మరొకడు మరొకణ్ని వేరొ...) " ఇట్లా సాగిన దోపిడీ ధారావాహికలోని  మొదటి రెండు మూడు వాక్యాల తాలూకు ఎపిసోడే   .. వీరినాయుడి కోడిపెట్టలు మూడింటిని వీరన్న దొంగిలించడం .. వాటిలో రెండింటిని కొట్టుకుపోయిన నక్క మూడో దానికోసం  మళ్లీ రావడం.  


ఈ తిండ్లు, దొంగ తిండ్ల వ్యవహారం  చుట్టూతా  మనిషి ( వీరన్న)  పగ, జంతువు ( తల్లినక్క) జీవన పోరాటం,  పక్షి ( కోడిపెట్ట)  అంతరంగ మథనాలు ;  జీవితం , దాని  మంచి చెడ్డలు, జీవించక తప్పని దౌర్భాగ్య స్థితిగతులు, అందుకు అడ్డొచ్చే గడ్డు పరిస్థితులు , అందుక్కారణంగా ఊహించబడ్డ దేవుడి దౌష్ట్య౦ పై నిరసనలు ; ఇవే గాపు; చావు .. దాని బహుముఖ   వికృత ముఖాల  దిగ్భ్రాంతికర ప్రదర్శనల సమాహారం ఈ 'సృష్టిలో' కథా సృష్టి . నిస్సందేహంగా  రావిశాస్త్రిగారి అనేకానేక ఇతర రచనల తరహాలోనే ఉత్తమ జాతికి చెందే  కథానిక! 


బలమైన జీవి, తెలివైన జీవి   అయితే  ఇబ్బంది  ఉండదు .. ఆహార లభ్యతలో సౌలభ్యత ఎలాగూ తప్పదు.  ఆ రెండింటి  కొరవతో  జన్మ తగలప్పుడే  బతకాలంటే జీవికి చచ్చే చావు.  అట్లాంటి దౌర్భాగ్య  జీవుల పక్షం  నుంచి కూడా సాపేక్షికంగా ఆలోచిస్తే పంచతంత్రం  మించి ' పంచ్'  లు ఉండే కథలు చెప్పొచ్చన్న గొప్ప ధీమా మొదటగా తెలుగులో కల్పించింది రావిశాస్త్రేగారే. 


అధర్మాన్ని పడగొట్టి, ధర్మాన్ని నిలబెట్టే రచనలు ఎప్పుడూ  వచ్చేవే. రావాలి కూడా!  రామాయణం చదివే నాస్తికుడికైనా రావణుడే చావాలని ఉంటుంది. వాల్మీకిరుషి ఏకపక్షంగా రాముడి వైపుండటమే అందుక్కారణం. కానీ, ఎంత నికృష్ట పాత్రకైనా  పుట్టుకతోనే నీచత్వం అంటగట్టడం రచయిత పక్షపాత బుద్ధికి నిదర్శనమవుతుంది.  వెలుగు నుంచి చీకటి దిశగా ప్రస్థానించే ప్రయత్నం  అనేకానేక  కారణాల వల్ల సఫలమయి ఉండకపోవచ్చు; అసలు ఆరంభమే  అయివుండకపోవచ్చు కూడా . అయినా సరే ..ఆ దిశగా  అసలు ఏ  ప్రయాసా   కలుషాత్ముడి వైపు  నుంచి   సాగనే లేదనిపించే  రాతలను     నమ్మలేం.  కాపురుషుడి ప్రవృత్తిలోని   సానుకూల గుణo కోణం రచనకు అదనపు ఉదాత్తత ఓ అలంకరణం.

  

ఓ సానుభూతి వచనం  రచయిత వేసినప్పుడే గదా పాఠకుడి  దృష్టి దుష్టత్వం  నుంచైనా ఎంతో  కొంత నీతిసారం వడుగట్టుకుని లాభపడేందుకు వీలుడేది! బళ్లారి రాఘవాచారిగారు స్టేజి నాటకాల ప్రదర్శన సందర్భంలో దుష్టపాత్రల స్వభావంలో నుంచి కూడా ఓ వెలుగు కోణం రాబట్టే ప్రయోగాలు చేస్తుండేవారంటారు.  మంచే కాదు 'చెడు'  తాలూకు లోతులనీ నిరపేక్షంగా   తర్కించవలసిన బాధ్యత  మంచి రచయిత మీద తప్పకుండా ఉంటుంది. రావిశాస్త్రిగారి  కథల్లో.. దుర్మార్గంగా ప్రవర్తించే పాత్రల్లో  కూడా సందర్భం వచ్చినప్పుడల్లా   రగిలే  అంతర్జ్వాల  ఒకటి దర్శనమివ్వడం సాధారణ ధర్మంగా కనిపిస్తుంది. అందుకు ఈ కథలోని వీరన్న పాత్ర వ్యవహారమే  ఒక ఉదాహరణ. ఎంతో సాహసించి, ఎంతో శ్రమపడి మూడు రోజుల కిందట మూడు కోడిపెట్టల్ని  దొంగిలించాడు ఈ  'వీరన్న' . టౌనుకు పోయి అమ్మి సొమ్ము చేసుకుందామనుకునే లోపలే ఇంకేదో పోలీసుకేసు  లంపటంలో ఇరకడం  వల్ల  కుదిరింది కాదు . మూడోనాడు ఇంటికొచ్చి రెండుపెట్టలని నక్క ఎత్తుకు పోయిందని చెప్పిన పెళ్లాం వరాలమ్మమాటలను  నమ్మక రెండు దంచాడు ముందు . ఆనక పిల్లలు చెప్పిన మీదట నమ్మి మూడో పెట్ట కోసం వచ్చే నక్కకు 'దేవుణ్ణి చూపిస్తాన'ని  శపథం పట్టి  పులికోపంతో రగులుతూ పొంచి ఉన్నాడు.  ఆ సమయంలోనే  వీరన్నలో   అంతర్మథన  ఆరంభమయింది. కష్టపడి సాధించిన కోడిపెట్ట పోయినందుకు   వీరన్నకు నక్క మీద కోపంఉండనే ఉంది. రెండో పెట్టనూ అదే నక్క పొట్టన పెట్టుకున్నందుకు ఆ కోపం రెండితలయిందంటాడు రచయిత. ఆ అనడంతో ఆగిపోతే ఆయన  రావిశాస్త్రి కారు .  'తన చేత వరాలమ్మను పొరపాటున కొట్టించినందుకు ఆ నక్క మీద అతనికి మూడొంతుల కోపం వచ్చింది' అని కూడా  అనేశారు;  కనకనే ఆయన రావిశాస్త్రిగారు అయారు  . కొట్టినా సరే.. భార్య మీద ఆ భర్తకు ఎంత ప్రేమ ఉందో ఈ ప్రకటన తెలియచేస్తుంది. అదే సందర్భంలో మానవీయ కోణాన్ని  అద్భుతంగా ఆవిష్కరించే  మరో ఇట్లాంటి ఉదంతాన్ని ఉదహరించడం రావిశాస్త్రిగారిలోని ఉత్తమ కథకుణ్ణి పటం కట్టి చూపిస్తుంది . సొట్టబుర్రోడు అనే ఓ కేడీ చేసిన నేరానికి గున్నమ్మ కొడుకుని కొట్లో వేసిన ఎస్సై అది పొరపాటు అని తెలిసొచ్చిన తరువాత ఊరకే  ఉండలేక పోయాడు. ఆ సొట్టబుర్రోణ్ణి వెదికి  పట్టుకొచ్చి మరీ  మూడు రోజులు కొట్లోపెట్టి కుళ్లపొడిచాడు. కర్కోటకుడుగా  కనిపించినా  సరే .. ఎస్పై  లోని   మనిషి అపరాధభావన నుంచి తప్పించుకోలేకపోయాడని  చెప్పకనే చెప్పే ఈ తరహా మానవీయ దృకృథమే ఎంత హింసాత్మక కథనానికైనా ఉదాత్తత చేకూర్చేది. గుర్తుంచుకోదగ్గ కథలకు ఉండే ఎన్నో సు  సులక్షణాలు  ఇట్లాగే 'సృష్టిలో ' కథలో కోకొల్లలు; స్థలా భావం వల్ల అన్నింటినీ గూర్చి  చర్చించుకునే వీలు ఉండటంలేదు .. అంతే! 


ఆకలితో నకనకలాడే నక్క లాంటి ఓ బక్కజీవి  బుర్రలోని  ఆలోచనా  పరంపరను సృష్టిక్రమం వైపుకు బదులు కంటిక్కనిపించని కరుణామయుడి వైపుకు మళ్లించి కేదారగౌళ రాగంలో తిట్టాలన్నంత కోపం తెప్పిస్తాడు రచయిత ఒక సందర్భంలో  . సుఖాలు, సౌకర్యాలు వరాలుగా ప్రసాదించమని దృష్టిగోచరం  కాని  ఏ శక్తిముందు సాగిలపడతామో .. కష్టాల మీద కష్టాలు వచ్చి పడిపోతున్నప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక భగవంతుడిగా భావించే అదే అదృశ్య శక్తికి బాధ్యతా అంటగట్టి   పడతిట్టడం పరమ భాగవతోత్తమ జాతికి చెందిన కంచెర్ల గోపన్నలో కూడా చూస్తాం!  అందుకే, ఒక మామూలు బక్క నక్క   ఉక్రోషం .. నక్కగా తనను పుట్టించాడని నమ్మే సృష్టికర్త మీదకు మళ్లినట్లు చూపించడం అభూత కల్పన అనిపించదు. సరికదా అధివాస్తవికత అని కూడా అనిపించదు; అంతా వాస్తవిక జీవితంలోని విషాదపార్శ్వాన్ని  తడుముతున్న ట్లే  గుండెను కెలుకుతుంది. 


ఇంకొన్ని గంటల్లో మరో జీవికి అన్నం కాబోయే ఓ కోడిపెట్ట తన   గూడుకింద చేరి చేసుకొనే అంతశ్శోధనలో  కనిపించేది కూడా  తిట్లకు గురయే ఆ అదృశ్య భగవానుడే! నడిరాత్రి   వేళ. . భయం ఆవరించిన బ్రతుకుతో  ఆ కోడిపెట్ట. . ఇష్టంలేని స్థలం మార్పు వల్ల కలిగిన బెంగ కారణంగా    కళ్లు మూతలు పడక ఎంతకూ అర్ధంకాని  లోకం తంతును, కోడిగా బతకడంలోని సార్థకతను  గురించి వేదాంత ధోరణిలో ఆలోచించడం మనకు  ఆశ్చర్యం కలిగిస్తాయి. క్విన్ టన్టెరన్ టోన్ అనే హాలివుడ్ దర్శకుడు రక్తాలు కారే యుద్ధ సన్నివేశాలకు నేపథ్య౦లో    మతిపొగొట్టే  సుతిమెత్తని వయోలిన్ రాగాలు  వినిపించే శైలి రావిశాస్త్రి గారిది. తాను చేసే నిత్యహింస త్యాగం గురించి, తాననుక్షణం అనుభవించే  హింసాభయం  నుంచి విముక్తి గురించి  బోధివృక్షం కింది   సిద్ధార్థునికి దీటుగా  ఓ తుచ్ఛ కోడిపెట్ట చేసే తాత్విక చింతనల్లాంటి చిత్రాలు రావిశాస్త్రిగారి కథల్లో అడుగడుగునా తగులుతుంటాయి!  కథలు కాని వ్యవహారాలను కూడా  ఇట్లా కథలుగా .. అదీ మంచి కథలుగా   ఎటా మలచవచ్చో రావిశాస్త్రిగారి కథలు గురువుల్లా బోధించడం విశేషం.   బుద్ధిలో  విశిష్టుడైన    పాఠకుణ్ణి కూడా ఒక మామూలు కోడిపెట్ట తాత్వికచింతనలోకి నెట్టేసే  గొప్ప టెక్నిక్ శాస్త్రి గారిది. చదివించి, కదిలించి, ఆనక పాఠకుడిలో   ఆలోచనలు  రగిలించడం   ఉత్తమ శ్రేణి కథల లక్షణాలలో ఒకటన్న  పాశ్చాత్య లక్షణకారుల సిద్ధాంతం ఆమోదనీయమే   అయితే శాస్త్రిగారి అన్ని కథల్లా ఈ కథ కూడా నిస్సందేహంగా ఉత్తమ శ్రేణి కిందకే రావాలి  మరి.

అన్నిటికి  మించి ఈ  కథలో రచయిత గడుసుగా దాచిన మరో విశేషం. . మరణం తాలూకు  బహుముఖాల ముసుగులు  తొలగించే ప్రయాస.     గంప కింద ముడుచుక్కూర్చుని తాత్విక చింతనలో పడ్డ     కోడిపెట్టలాగానే   చల్లని చావు పిలుపు చప్పుడును మనమూ ఆలకించి అదిరిపడతాం. అదే  పెట్ట బతుకు చివరి మలుపుగా కూడా భావించేస్తాం  .  పీక నులుముడు బాధను ఎదుర్కొనేందుకు సిద్ధమై రెక్కల్లో నుంచి మెడను పాములా పైకి లేపి   భగవంతుడి మీది పగతో ఎర్ర బడ్డ  కళ్లను ఇటూ అటూ తిప్పి చూసినప్పుడు కోడిపెట్ట చావును అలకించేందుకు    మన మనసూ  ఆవేదనతో సిద్ధంగా ఉంటుందా ! ఊహించినకోడి  పెట్ట చావుకు బదులుగా ఊహించని నక్క చావును   మెరుపులా  మన మనసు మీది కొట్టి మతి పోగొట్టేస్తాడు గడుసు రచయిత ! 


కోళ్లగూటిని మూతితో, కాళ్లతో పై కెత్తి పెట్టను కరచుకుపోయే చివరి ప్రాక్షన్ ఆఫ్ సెకనులో  ఆ నక్క  మీద పచ్చని బాణాకర్ర  కత్తిలా మెరవడం, వరస మెరుపులతో  నక్కచావు రూపంలో మృత్యువు మరో కోణంలో మన కళ్లకు భీభత్సంగా కొట్టేస్తుంది! ఎంతటి  కఠినాత్ముడి గుండెనైనా బరువెక్కించే ఆ బాధాకర   క్షణాలలో ఒక క్షణమైనా చదువరని నిలువనీయడు రచయిత.. విచిత్రంగా!   అసందర్భంగా అందాల చందమామ, డాబా మీది వెన్నెలలో ప్రియురాలి సిల్కు చీర రెపరెపల చల్లగాలి, మొనలు దేలిన జోడు గుండెలతో మతిపోగొట్టే అవేవో వాటితో   పోలికలు, జీబుగా పెరిగిన తుమ్మ మొక్కలను  నీలి ముసుగుల మేల్వంశపు అభిసారికలతో ఉపమానాలు! పడుచు భార్యలు సరసాలకు పోతే మణుకులు పడిపోయినమొగుళ్లులా  చీకట్లో  బండరాళ్లు పడి ఉంటాయనడానికి నక్క అంత  నిర్దాక్షిణ్యమైన చావు  చచ్చిన దుర్ముహూర్తమే దొరికిందా రచయిత మహాశయుడికి  ! ? తన కథ చదివే పాఠకుడి పట్ల ఇంతలా వేళాకోళమవసరమా? అని రచయితను తిట్టిపోయాలనిపించాలి నిజానికి!తమాషాగా అట్లా  తిట్టుకునే  వ్యవధానం కూడా ఇవ్వకుండా అంతకు మించిన మరో   విషాద ఘట్టం  అందుకునేస్తాడా మహానుభావుడు!  నక్కపిల్లల కథ ముక్తాయింపుగా ఎత్తుకుంటాడు మహా గడుసుగా!  


కనిపించని తల్లి కోసం బెంగటిల్లి తడిగా, భయంగా, ఆకలిగా ఉన్న బుజ్జిపిల్లలకు వెన్నెల  తడిలోని రుచి, చల్లని గాలిలోని హాయి ఆకలి తీర్చడం లేదని చెప్పి జాలి కలిగిస్తాడు.అనాథపసికందుల మీద . తీరని ఆకలితో ఎంతకూ కనిపించని తల్లి జాడ కోసంగాను కష్టమొస్తే ముందు దేవుడిని ప్రార్ధించాలన్న కనీసం ఇంగితం కూడా బలపడని   కారణంగా తల్లి కోసం మాత్రమే యేడిచి యేడిచి అలిసిపోతాయా  పసికూనలు అని అనడంతో మన మనసంతా చేదయిపోతుంది   ! ఎంత ఏడ్చినా కడుపు నిండదు కాబట్టి మూడు కూనల్లో ఒకటి మొండి ధైర్యం చేసి  బొరియలో నుంచి కొంచెం పైకి ఎగబాకి, ముందు కాళ్లను బొరియ అంచున పెట్టి, ఆకలి తీర్చే ఏకైక జీవి తల్లి కోసరంగా కనిపించినంత మేరా భూలోకమంతా  పరికించి చూసి. . చూసి .. అలా చూస్తూనే ఉండిపోయిందంటాడు రచయిత .  ఏ అకలి తన చేత అపాయకరమైన ఆ దుస్సాహసం చేయించిందో అదే ఆకలి మరో జీవి .. కొండచిలువ నోట్లో నుంచి కడుపులోకి మెల్లగా లాగేసుకుందని చల్లగా రచయిత ముక్తాయించడం ఎంత విషాదం?!  .  ఎందుకు పుట్టినట్లోనంటూ మనసులో   అంతర్మధనం ఇంకా మొదలు పెట్టక  ముందే మిగతా నక్కపిల్లలు కూడా అదే దారిలో  కొండచిలువ నోరు అనే మృత్యు గహ్వరం ద్వారా సృష్టిలో  లయించుకు పోయినట్లు రచయిత ముక్తాయింపు! రక్తం కక్కి స్పృహ  తప్పిన నక్క కొనవూపిరి కొనసాగింపు స్మృతిలోకంలో ఊపిరి ఆగి కదలిక నిలబడే తుది శ్వాస  వరకూ మనోనేత్రం  అవనికపై  కదలాడిన చిత్రాలను రచయిత కవిగా మారిపోయి చిత్రించిన విధానం శాస్త్రిగారి కథలలో కామన్ గా కథను హృదయంగమంగ మార్చేస్తూ   కథాశాస్త లక్షణాలకు ఎక్కడా అందదు!  ఎండల్లో నల్లకొండనీడ , వెన్నెల్లో పైరు పచ్చగాలి, పొలాల్లో చెరకు తీపితోట , అంతకంటె ముందు అంత కంటె తల్లిపాలతీపి, మొత్తని తల్లి మూతి ముద్దు, ఆనాటి అమ్మ వెనక పరుగు, ఓనాడు మొదటి సారిగా రుచి చూసిన మొదటి కోడి ఉప్పటినెత్తురు, తియ్యటి మాంసం, మేకల్ని వేటాడిన రోజులు, తన తొలి ప్రియుడి వాడి కోరచూపులు, ప్రేమతో వాని మొత్తటి కరుపులు, కసితో అతడి వేడి కౌగలింతలు ( నక్కలు కౌగలించుకుంటాయా ?   అన్న అనుమానం కూడా రానీయడీ కవి కాని కవిరచయిత ! ), తన కడుపులో మొత్తటి శిశువుల బరువులు, తన  ప్రసవం, తన వేదన , తన పిల్లల అరుపులు వినిపించగానే తన చెవుల్లో పులకరించిన స్వర్గమే తన  గుండెలలో నుంచి పాల ధారగా ప్రవహించిన వైనం, పిల్లలతో తన ఆటలు, వాటి కోసం తాను పడ్డ యాతనలు, దుర్మార్గులతో తన పోట్లాటలు ( నక్క దుర్మార్గమైనదని మన నిర్ధారణ అయితే- ( టక్కరిగా భావించే నక్క  జాతికీ దుర్మార్గులు కొందరు తప్పలేదన్న మాట! ఎవరో ? బహుశా మన మనుషులమే అయివుండనోపు! లేకపోతే మొదటిసారి  మనిషిని చూసినప్పుడు రచయిత చెప్పినట్లు దానికి ' జుగుప్స  ' ఎందుకు కలుగడం ? ! తమ జాతి వారే అయినప్పటికీ మనుషులకు లొంగిపోయిన కుక్కలలో తన కాట్లాటలు, పూల వాసనలు, పాముల పడగలు , వానా జల్లులు , పందుల వికృతాలు, చల్లని గాలులు, నల్లని   మబ్బుల రంగుల విల్లులు , వెండిమబ్బుల వెలుగులు, ఆకలితో తన పరుగులు ( మళ్లీ ఆకలి ! ), అలసటతో తన పడకలు, ( ఈతి బాధలు వదలడం లేదు! ), అనుక్షణం ఆనందాలు, అనునిత్యం భయాలు, ఆకలి కోసం తను చేసిన హింసాకృత్యాలు  , ఎల్లప్పుడూ రక్తపాతాలు, ఓహో .. అరె.. ఏమిటిది? ఎందుకిది? ఎక్కడిది ? నన్నెందుకు  పుట్టించావు? ఎందుకిలా చంపుతున్నావు? ఎన్నెన్ని ఆశలు కల్పించావు? ఎన్నెన్ని పాపాలు చేయించావు? ఎన్నెన్ని హింసలు పెట్టావు? పెట్టించావు? ఎన్ని హింసలు ఎన్ని హింసలు! నాకెందుకీ పుట్టుక? ఎందుకీ చావు ? ఏమవుతారు దిక్కుమాలిన నా పిల్లలు? ఏ హింసలు.. ఏ హింసలు.. చావు పుట్టుకల అర్థరాహిత్యాన్ని గూర్బి   లక్షసార్లు నిలదీస్తే ఆ బాధ్యుడెవడో సమాధానం  చెప్పకోలేక గుడ్లుతేలవేయడంలాంటి ఆలోచన లేమన్నా  ఊహకొచ్చాయో  ఏమో..బాధతో  చచ్చి పోతూ కూడా నవ్వబోయి నవ్వు సగంలో ఉన్నప్పుడు చివరి శ్వాస కూడా పూర్తిగా  పోయిందేమో .. మిగిలిన అరనవ్వు అట్లాగే చచ్చిపోయిన నక్క పెదాల మీద ముద్రలాపడి మహా ముచ్చటగా వుంది నక్క ముఖం. తనయుల పాపాలకు తండ్రులు అనుభావించాలన్న సూత్రమే నిజమైతే .. తాను చేసిన పాపాలన్నింటికీ ఆ దేవుడే శిక్షలు అనుభవించాలన్న ఆలోచనా వచ్చి చచ్చిపోయ నక్క మొకంలో ఆ చిరునవ్వు మెరిసి  ఉండాలి.  నక్కలో అర్థాంతరంగా ఆగిపోయిన అంతర్మధనం  చదివే పాఠకుడిలో మొదలవడానికి రచయిత కవిత్వ౦ బాట పట్టి  యమ జిమ్మిక్కులన్నీ చేయడం చూడొచ్చు మనమిక్కడ. 

దిక్కులేని చావు చచ్చి జాతి పుట్టించిన నక్క  .. అవతల దాని పిల్లలూ కంతిరి లోకం ముఖమింకా కన్రెప్పలెత్తి చూడనైనా చూడక మునుపే మెత్తంగా చావు కంతలోకెళ్లి కనుమరుగవడం చేత - మరింత జాలి పుట్టించే నక్క చావు వీరన్న పెళ్లాం బిడ్డల మొహాల్లో మాత్రం సూర్యకాంతిలో మామిడి మొక్కలంత ప్రకాశం కలిగించాయ్! వీరన్న  కైతే  నక్కబారిన కాకుండా కోడి తన బారిన పడ్డందుకు చచ్చే ఆనందంగా ఉంది. ఆనందంతో అతగాడా ఎర్రరంగు పులిమిన తెల్లకోడిని గుండెలకు అదుముకున్నప్పుడు ఆ చావు స్పర్మకు కోడి భగభగ ఎండలో వడవడ వణికింది ! కోడి ఓనరు వీరినాయుడును వెంట బెట్టుకొనొబ్బిన పోలీసోడుతో కలిసి తన్నెత్తుకొచ్చిన దొంగ వీరన్న పోతున్నప్పుడు రాత్రల్లా నిద్ర లేని  కోడిపెట్ట ' కొత్త పరిణామం అర్ధంకాక, భగవంతుడి సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నమే పాపం' అని తీర్మానానికొబ్బి కళ్లుమూతలేసుకుని పడుకునేసింది.

ముక్తాయింపుగా శాస్త్రి గారు, రేపు ఎక్కడో ఒకప్పుడు ఎవరింట్లోనో ఒకరింట్లో చచ్చి చెడి పలావు అయిపోతుందని తేల్చేస్తాడు రచయిత. 

- కర్లపాలెం హనుమంతరావు 


20-08-2021 


బోథెల్, యూ. ఎస్. ఎ 


తెలుగు సాహిత్యంలో ముసల్మాన్ కవులు - కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక ప్రచురితం)

 తెలుగు సాహిత్యంలో ముసల్మాన్ కవులు

 

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక ప్రచురితం) 


' మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు

మాతృ భాష యొండు మాన్యము గదా

మాతృ శబ్దము విన మది పులకింపదా?

వినుత ధర్మశీల తెనుగు బాల' 

ఈ పద్యం ప్రత్యేకత రచన చేసిన కవి ఒక ముస్లిమ్ మతానుయాయుడు. ఇది   'తెనుగుబాల' శతకంలోని ఒక నీతి పద్యం. రాసింది ముహమ్మద్‌ హుస్సేన్‌ . 


పేర్లు ప్రత్యేకంగా చెప్పకపోతే  తెలుగు కవుల సృజనే అని మురిపించే సాహిత్యం  తెలుగునాట ముస్లిం కవులు, రచయితలు  సృష్టించిన మాట వాస్తవం.   వినుకొండ వల్లభరాయుడి 'క్రీడాభిరామం' తలలేని రేణుకాదేవి విగ్రహం ముందు నాటి ఊరి వెలుపలి వాడ ఆడపడుచులు నిర్వస్త్రంగా వీరనృత్యాలు చేయడం వర్ణించింది అద్భుతంగా. అదే పంథాలో అజ్మతుల్లా సయ్యద్ అనే ఓ ముసల్మాన్ కని దేవరకొండలో జరిగే జాతర దృశ్యాలను నాటి సాంఘిక పరిస్థితులు కళ్లకు కట్టేవిధంగా వర్ణించాడు.(చాటు పద్య రత్నావళి. పు. 126) 

సర్కారు ప్రకటించిన స్థలంలో జరిగే సంతలో  డబ్బున్న ఆడంగులు రకరకాల వస్త్రవిశేషాలు సందడిగా కొనుగోలు చేసుకుంటుంటే దమ్మిడీ చేత లేని లంబాడీ ఆడంగులు తమ దరిద్రానికి ఏడుపులు మొదలుపెట్టారుట. లంబాడీ తండాల ఆక్రోశానికి ధనికవర్గాలు నవ్వుకుంటుంటే  ఉడుక్కుంటూ 'మాకీ జూసి నగ్తర్/మీకీ తలిదండ్రి లేవె మీ నే తు/ప్పాకీ తీస్కొని  కొడ్తే/మాకీ పాపంబిలేద్రె..'అంటూ  ఆ బీద మహిళలు షష్టాష్టకాలకు దిగడం చదివితే నవ్వు వస్తుంది.. ఆనక  మనసుకు కష్టమేస్తుంది. తమ మతస్తులను అన్యమతానుయాయులు అవహేళన చేసే అవలక్షణాన్ని అన్యాపదేశంగా నిరసించే  కవి ప్రతిభకు జోహార్లు చెప్పాలనీ అనిపిస్తుంది.  


'సాయిబులకు తెలుగు సరిగా రాదు' అంటూ ముస్లిం పాత్రలకు 'నీకీ.. నాకీ' అంటూ తెలుగు  నాటకాలు, చిత్రాలు తరచూ హేళన చేస్తుంటాయి ఇప్పుడు కూడా.  నిజానికి నిత్య వ్యవహారంలో తెలుగు నేలల మీద.. ముఖ్యంగా దక్షిణాదిన ఏ ముస్లిమ్ మతస్తుడూ ఆ తరహా వెకిలి యాసతో మాట్లాడడు. ఏదైనా కొంత మాటలో తేడా కనిపించినా అది భాషాభేదం  వల్ల కాదు. సంస్కృతుల మధ్య ఉండే సన్నని తారతమ్యపు   పొర కారణంగా సంభవించేది. చిత్రాలలో చూపించేటంత విడ్డూరమైన ఉచ్ఛారణ  వినోదం కోసమైనా మంచి అభిరుచి అనిపించుకోదు కదా!  

తెలుగువారి హిందీ, ఇంగ్లీషు, మరే తెలుగేతర భాషలలో  కనిపించే ఉచ్ఛారణలోనూ ఓ విధమైన యాస సాధారణగా కనిపించే తీరే. వాస్తవానికి తెలుగుదేశాలలో శతాబ్దాల బట్టి తెలుగువారి సంస్కృతీ సంబంధాలలో పాలలో తేనెలాగా కలగలసిపోయిన ఘనత ఇస్లాం మతానుయాయులకు దక్కుతుంది. 


నల్లగొండ జిల్లా చిత్తతూరు గ్రామానికి చెందిన ఇమామల్లీ సాహెబ్ అని ఒక కవిగారికి కులమతాలనే వివక్ష లేదు. కవి అని తనకు తోచిన ప్రతీ సాహిత్యజీవికి అంతో ఇంతో సాయంచేయడం  ఆయన అలవాటు.  మరో సాటి కవి ఎవరో  (చమత్కార.పు.15)  సాహెబుగారి ఔదార్యాన్ని 'అల్లాతుంకు సదా యతుం సె ఖుదచ్ఛచ్ఛాహి ఫాజత్కరే/ఖుల్లాహాతుగరీబు పర్వరినిగా ఖూబస్తునాం మైసునే/అల్లాదేనె మవాఫికస్తుహర్ దూస్రే కోయి నైహై ఇమా/ మల్లీ సాహెబ్ చిత్తలూరి పుర వాహ్వా దోయిలందార్బలా ' అంటూ  ఉర్దూ మిశ్రిత ఆంధ్ర ఛందోపద్యంలో శ్లాఘిస్తాడు. 


ఆంధ్రప్రదేశ్  ముస్లిం జనాభాలో అధిక శాతానికి ఉర్దూ పలుకు నోటి వరకే పరిమితం. అందులోనూ తెలుగువారిలాగా మాట్లాడేవారే ఎక్కువమంది. రాయడం దగ్గరకొచ్చేసరికే ముస్లిముల పాత్ర అటూ ఇటూ. తెలుగు సంస్కృతితో గట్టి అనుబంధం ఉన్నప్పటికీ వాజ్ఞ్మయంలో   ఆ మేరకు బంధం ఎందువల్ల బలపడింది కాదో?!  పరిశోధకులే  నిగ్గుతేల్చవలసిన చారిత్రకాంశం  ఇది.  


ఈ సాధారణ సూత్రానికి మినహాయింపుగా ముస్లిం కవులు తెలుగులో  సాహిత్య సృజన చేసిన మాట కొట్టిపారవేయలేం. రాసిలో కాకపోయినా వాసిలో తెలుగు  సాహిత్యంతో పోటికి దిగగల సత్తా ఈ సాహిత్యానికి కద్దు. 


మరుగున పడ్డ ముస్లిం కవులను గురించి  మరుపూరు కోదండరామరెడ్డిగారు మరువలేని అంశాలు కొన్ని ప్రస్తావించారు.  దావూద్  అనే ఇస్లామిక్ కవి 'దాసీ పన్నా'  అనే కవితా ఖండిక దొరకబుచ్చుకుని చదువుకునే దొరబాబులకు ముస్లిం కవులు సాహిత్య సృష్టిలో ఒక్క ఆలోచనాధారలో మినహాయించి తతిమ్మా అన్నిటా  సమవుజ్జీలేనని అంటారు. ఒప్పుకోక తప్పదు .  


రాజపుత్రుడి రక్షణ కోసం, పన్నా తన పుత్రుణ్ని బలికావించింది. లోకపాపాల కోసం తన బిడ్డను బలి ఇచ్చానని చెప్పుకుంటున్న యొహోవా దేవుడికే ఇది పెద్ద సవాల్! ఎందుకంటే ఆయన చచ్చిపోయిన వాళ్లను కూడా బ్రతికించే శక్తి గలవాడు . కాబట్టి మూడో రోజుకయినా తన బిడ్డను సమాధిలోంచి తిరిగిలేపి తీసుకురాగలిగాడు.కాని పాపం , పన్నాకి ఆ శక్తిలేదు! అయినా పుత్ర త్యాగానికి వెనుకంజవేయలేదు. అందుకే ఆమె త్యాగమే గొప్పదని శ్లాఘిస్తూ దావూద్ హుస్సేస్ రాసిన ఈ కవిత ఎంతో కరుణరసార్ద్ర౦గ  ఉంటుంది. 

' సతత వాత్సల్యంబు జాల్వార్చి పోషింప/ 

తలపు గొన్నట్టి నీ తల్లిలేదు/ 

అఖిలార్ద్రతను నీకు నర్పించి/ 

మమతలం దలడిల్లునట్టి నీతండ్రిలేడు/

ఆత్మరక్తమై తమ్ముడంచు మించిన ప్రేమ/

నరసి పాలింప నీ అన్నలేడు/ 

రాజపుత్రుడితండు రక్షణార్హుడటంచు/ 

పరికించు పాలిత ప్రజయు లేదు/ దిక్కుదెసగలవాడవై దిక్కుగనక/

శోకసంతప్త భావనిస్తులత తోడ/ 

శత్రువుల మధ్య జిక్కిన సాంగపుత్ర/ 

నిన్ను పన్నాయె రక్షించు నిక్కమింక!'   అంటారు కవి. ఎవరి మాటలు ఏ విధంగా సాగినప్పటికీ ..  బలి అయిన   ఆ అభాగ్య బాలుడిని అడిగితే ఏమని ఉండేవాడు? అని ఆయనే మానవతా హృదయంతో కంపించి ప్రశ్నించుకుంటూ ఆ మృతబాలుడి మనోభావాలనూ కవిగా తానే వెల్లడిస్తాడు


'మీ మీ స్వార్థాల కోసరంగా నోరులేని నన్ను బలిచేశార'ని  వాదించడా? అని నిలదీస్తాడేమోనని సందేహిస్తాడు. మానవత్వం సహజలక్షణంగా లేని వ్యక్తులకు ఈ తరహా భావనలు మదిలో మెదిలే అవకాశమే లేదు.  దావూద్  సాహెబ్ కవి ముస్లిం మతానుయాయుడు అయినంత మాత్రాన మనిషిలో ఉండవలసిన అనుకంపన లేకుండా పోయిందా? 


మానవతా విలువలకు మతాలను అడ్డుపెట్టుకుని వ్యాఖ్యానించడం ఎంత పెద్ద తప్పు! అదే ఇప్పుడు దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న  అరాచకం ! ఆ దుర్మార్గాన్ని ప్రశ్నించిన ఆలోచనాపరుల పైన దేశద్రోహం అభియోగం రుద్దే జుగుప్సాకరమైన ప్రయత్నమూ యథేచ్ఛగ సాగుతున్నది! షేమ్ ఆన్ అవర్ పార్ట్! సిగ్గు పడవలసిన అమానుషత్వం!

 

ఇంత విపులంగా ఇక్కడ చెప్పుకురావడానికి కారణం ఈ పద్య గద్య సాహిత్యంలో ఎక్కడైనా మన  తెలుగు సినిమాలు హేళనచేస్తున్న లోపం కనిపిస్తున్నదా?  ఈ పుస్తకం రాసింది ఒక ముస్లిం మతానుయాయి అన్న వాస్తవం చెవినబడితే విస్తుపోమా ? పుట్టింది ముస్లిం సంప్రదాయం అనుసరించే కుటుంబంలలోనే అయినా.. దావూద్ సాహెబ్ తరహాలో  ఇస్లాం సంప్రదాయంలో నాని, హిందూ వేదాంతంలో ఊరిన ఎందరో ముసల్మాన్ కవులు చరిత్ర విస్మృతి పొరల్లోకి వెళ్లిపోయినట్లు మరుపూరివారి ఆరోపణ. ఇరవైయ్యొకటో శతాబ్దిలోకి అడుగు పెట్టినప్పటికీ  అదే వివక్ష కొనసాగడం హర్షణీయమా?


కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన చేస్తూనే తెలుగు భాషాభివృద్ధే  ధ్యేయంగా నిరంతరం కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. చివరి దశ వరకు తెలుగులో రచనలు గావించారు. ఆదర్శము  లాంటి నవలలు , అబ్దుల్ ఖాదర్ జిలాని దివ్య చరిత్రము, నాగూర్ ఖాదర్ వలీ చరిత్రము వంటి  మహాపురుషుల జీవితచరిత్రలు, ఆజాద్  చరిత్రము లాంటి దేశ చరిత్రలు, ఆఖరుకి అభినవ తిక్కన కవితా సమీక్ష వంటి లోతైన సాహిత్య విమర్శనలు సైతం ముస్లిం కవి అయినప్పటికీ  ఆయన  చేతుల మీదుగానే ఏ తెలుగు పండితుడి రచనకూ  తీసిపోని రీతిలో రూపుదిద్దుకున్నాయి! 


సాహిత్యం పట్ల  అభిరుచి అంటూ ఉండటం ఒక్కటే ముఖ్యం. ఆ ప్రధానమైన దినుసు మనదై ఉంటే దావూద్ సాహెబ్  లా రూపాయిన్నర పెట్టుబడితో  పెట్టుకొన్న కిళ్లీ బడ్డీకొట్టు కూడా మనిషిలోని అక్షర తృష్ణను రెచ్చగొడుతుంది. ఏ మతం, ఏ కులం ఆ అభినివేశపు పురోగతికి అడ్డు  కాలేవు.     

 

అలనాటి సుప్రసిద్ధ నెల్లూరు కవులు మరుపూరు కోదండరామిరెడ్డి, పిలకా గణపతిశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డివంటి  వుద్దండులు నిత్యం సాయంత్రపు  వేళలలో  తన  ‘సాహిత్య తాంబూల సేవన మంజూషా” (కిళ్లీ కొట్టుకి కవులు పెట్టుకున్న ముద్దు పేరు అది) లో చేరి, తమతమ పద్య రచనా పఠనంపై గోష్టులు గావించడం ముస్లిమైన  దావూదు కవిలో తెలుగు సాంప్రదాయక పద్యరచన పట్ల ఆసక్తిని రేకెత్తించింది . ప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారి ఆశ్రయంలో  విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే సమయానికి దావూద్ సాహేబు ఇరవైరెండు ఏళ్ల  ఆడపిల్ల తండ్రి! 


' సాయిబుకు సంస్కృతం నేర్పుతున్నందుకు రాళ్ల దెబ్బకు సిద్ధంగా ఉండమ'ని ఎన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ వెనుకంజ వేయని దుర్భావారి నిర్భీతి ఇప్పుడైనా  ఎంత మందికి ఉంటుంది? 


సంస్కృతాంధ్రాలలో మదరాసు విశ్వవిద్యాలయం  విద్వాన్ పట్టా పుచ్చుకుని  నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితుడుగా చేరి మొదటి నెల జీతం గురుదక్షిణ కింద మనియార్డరుగా దావూద్ సాహెబ్ పంపిస్తే 'నా సాయిబు శిష్యుడు విసిరిన తొలి రాయి’ అంటూ దుర్భావారు ప్రదర్శనకు పెట్టి మురిసిన మరపురానిరోజులు మళ్లీ వచ్చేనా! చిత్త పరివర్తనము, రసూల్‌ ప్రభువు శతకము, సంస్కార ప్రయాణము, సూఫీ  సూక్తులు, సాయిబాబా మీద దండకంతో సహా  ఓ కావ్యము, ఆజాద్ చరిత్రము, వచనంలో అభినవ తిక్కన కవితా సమీక్ష.. అట్లా దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియల్లో తన దైన ముద్రతో తెలుగు సాహిత్యంలో గౌరవనీయమైన స్థానం సాధించిన ఘనత దావూద్ సాహెబ్ కవిది. 

 

ఇస్లాము మతాన్ని విశ్వసించే  సాహిత్య స్రష్టలు సృష్టించినవిగా  చెప్పుకునే తెలుగు శతకాలే సుమారు మూడు పదులు . వికీపీడియాలో కనిపించే ఆ జాబితా ఆసాంతం  పరిశీలిస్తే హిందూ కవుల ధోరణిలోనే ముసల్మాను కవులూ శతక సాహిత్యంలో తమకు సుపరిచితమైన  భక్తి, తాత్విక విశేషాలనే ప్రబోధాత్మక పంథాలో  ప్రకటించినట్లు స్పష్టమవుతుంది. 


ముహమ్మద్‌ హుస్సేన్‌ అనే ముసల్మాన్ కవి   'భక్త కల్పద్రుమ శతకము'పేరుతో ఒక చక్కని శతకం రాసారు. ఈ పేరుతోనే   పదహారణాల తెలుగు కవుల (బత్తలపల్లి నరసింగరావు, మేడవరము సుబ్రహ్మణ్యశర్మ, ఖాద్రి నరసింహ సోదరులు) చేతుల మీదుగా మరో మూడు శతకాలు రూపుదిద్దుకున్నప్పటికీ   హుస్సేన్ కవి శతకం  దానికదే ప్రత్యేకం.  మొక్కపాటి శ్రీర్రామశాస్త్రిగారితో కలసి మొహమ్మద్ హుస్సేన్ రాసిన మరో శతకం 'సుమాంజలి'. హరిహరనాథ శతకము అనుగుబాల నీతి శతకము, తెనుగుబాల శతకము మరి కొన్ని! 


ఆ  దారినే సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌ అనే మరో ముసల్మాన్ కవి 'సయ్యదయ్యమాట సత్యమయ్య' మకుటంతో, గంగన్నవల్లి హుస్సేన్‌దాసు 'ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య'  మకుటంతో 'హుస్సేన్‌దాసు ముస్లిమ్ శతక సాహిత్యం సృష్టించారు. ముహమ్మద్‌ యార్‌ 'సోదర సూక్తులు', తక్కల్లపల్లి పాపాసాహెబ్‌ కవి మతవిభేదాలను విమర్శిస్తూ ' వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమేదియనె  హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట' అంటారు. 


షేక్‌ ఖాసిం 'సాధుశీల శతకము'లో  'కులము మతముగాదు గుణము ప్రధానంబు/ దైవచింత లేమి తపముగాదు/, బాలయోగి కులము పంచమ కులమయా,/ సాధులోకపాల సత్యశీల' అంటూ సుద్దిచెప్పే ప్రయత్నం చేస్తారు. షేక్‌ అలీ  గురుని మాట యశము గూర్చుబాట' అనే మకుటంతో 'గురుని మాట' శతకం రాస్తూ 'ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన /పాండితీ ప్రకర్ష పట్టుబడదు/ పరులభాష గాన భాధను గూర్చును/గురుని మాట యశము గూర్చు బాట' అన్నారంటే మతాలతో నిమిత్తం లేకుండానే సమాజ సంస్కరణల పట్ల సాహిత్య ప్రగతిశీలులందరిదీ ఒకే బాట- అన్న మాట ఖాయమైనట్లే కదా! 


సమకాలీన సమాజం  నుంచి వ్యక్తులను, వర్గాలను  రకరకాల సమూహాల  వంకతో వేరు చేసే ప్రయత్నంలోని  రాజకీయ ఎత్తుగడలతో సాహిత్యానికి, సమాజానికి నిమిత్తం ఉండదు. ఎక్కడి సంస్కృతితోనే ప్రభావితమైన శక్తులు ఇక్కడి పరిసరాల కాలుష్యానికి కారణమని దుష్ప్రచారం  నిరాటంకంగా కొనసాగినప్పటికీ లౌకిక సమాజం ఆమోదించదు.  


ముసల్మానుల సాహిత్య ప్రయాస ఇచ్ఛాపూర్వకంగా నిర్లక్ష్యానికి గురవుతున్న మాట అవాస్తవేమీ కాదు కానీ.. ఉనికి పోరాటాలు ఊపందుకున్న 1990 లకు చాలా ముందు నుంచే అన్ని దశల్లోనూ యథాశక్తి   తన వంతు ప్రతిభతో ప్రభావితం చేస్తూనే వస్తోందన్నది మొహమ్మదీయ మతం అన్నది ఒప్పుకోక తప్పని వాస్తవం. 


కుడి  నుంచి కుడి వైపుకు రాసుకు పోయే లిపి ఉర్దూ. ఎడమ  నుండి కుడికి రాయడమంటే ముసల్మానుల దృష్టిలో పెడరాతల కిందే లెక్క. ఆ తరహా రాతలను నిరసించమని వారి మతం నివారిస్తున్నప్పటికీ  పెడచెవినబెట్టి తెలుగు సాహిత్య వర్ణమాలకే గులాబిమాలలు  సమకూర్చి పెట్టిన ఘనత ఇస్లాం కవిశ్రేష్టులది.  


ఉర్దూ మాతృభాషగా ఉన్నప్పటికీ లెక్కకు  మించిన సాహిత్యవేత్తలు   తమ ప్రతిభతో తెలుగు సాహిత్యలక్ష్మికి తొడిగిన సందర్భాలు కోకొల్లలు. తెలుగు పత్రికా రంగంలో తొట్టతొలిగా పాదం పెడుతూ  1842, జూన్ 8 మొదటి 'వర్తమాన తరంగిణి' వారపత్రిక తొలి సంచికలో  'మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర భాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి' అని రాసుకున్నారు సయ్యద్‌రహమతుల్లా సాబ్!


1891 లో  నరసాపురం నుంచి  మీర్ షుజాయత్ అలీ ఖాన్  గారి ఆధ్వర్యంలో సాగిన   'విద్వన్మనోహారిణి'   తదనంతరకాలంలో వీరేశలింగంగారి 'వివేకవర్ధని' లో కలసిపోయింది. రాజమండ్రి నుండి వెలువడ్డ 1892 నాటి బజులుల్లా సాహెబ్,  'సత్యాన్వేషిణి, 1909 నాటి షేక్ అహ్మద్ సాహెబ్  'ఆరోగ్య ప్రబోధిని'  ముసల్మానుల తెలుగు పాత్రికేయ రంగంలో  చేసిన సేవలకు కొన్ని నిదర్శనాలు. 1944 లో  హైదరాబాదు నుంచి వెలువడ్డ  'మీజాన్‌' దినపత్రికకు తెలుగు ప్రసిద్ధ రచయిత అడవి బాపిరాజు సంపాదకులుగా సహకారం అందించారు.   అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుడు షేక్ మస్తాన్ గారి  'తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి 1991 లో నాగార్జున యూనివర్శిటీ లో పి.హెచ్.డి వచ్చింది. సయ్యద్ సలీం నవల '  కాలుతున్న పూలతోట' 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించింది. వేంపల్లె షరీఫ్ కథల పుస్తకం 'జుమ్మా' 2012లో కేంద్రసాహిత్య అకాడెమీ యువ అవార్డు గెల్చుకున్నది.

 

సయ్యద్ నశీర్ అహ్మద్ 'అక్షర శిల్పులు' పేరుతో 333 మంది తెలుగు ముస్లిం కవులు, రచయితల వివరాలతో 2010 లో సమాచార గ్రంథం వెలువరించడం .. తెలుగు సాహిత్య లోకంలో ఉర్దూకవుల పాత్రను తగ్గించి చూడలేమని చెప్పడంగా అర్థం చేసుకోవడం మేలు.

'సారే జహాఁసె అచ్ఛా - హిందూసితాఁ హమారా హమారా/హమ్ బుల్ బులేఁ హైఁ ఇస్‌కీ యే గుల్ సితాఁ హమారా, హమారా'('సమస్త ప్రపంచములలో  ఉత్తమైనది  మన హిందూస్థాన్.. ఇది మనదే.. మనదే!మనం దీని బుల్ బుల్ పిట్టలం సుమా!ఈ దేశం ఈ దేశమే మన ఉద్యానవనం మిత్రమా!) సెప్టెంబర్ 23, 1964 నాటి మహమ్మద్ ఇక్బాల్ పాట అయినప్పటికీ ముస్లిమ్ సోదరసోదరీమణుల మనోరథం ఇప్పటికీ ఇదే! దేశం లౌకిక తత్వానికి సంకేత సూచకంగా ఈ గీతాన్నీ  మనం మన జాతీయగీతాలలో  ఒకటిగా మలుచుకున్న లౌకిక భావం  మర్చిపోతున్నామా? 'పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలూ చెలరేగే నేడు' అంటూ  మహాకవి శ్రీశ్రీ  వాపోయాడు  వెలుగు నీడలు సినిమాలో. అరైవై ఏళ్లనాటికన్నా అధ్వాన్నంగ  ఉంది ఈనాటి పరిస్థితి!


' లుచ్ఛా జమానా ఆయా/అచ్ఛోంకో హాథ్ దేనా హర్ ఏక్ సికా/ అచ్ఛా జమానా ఫిర్ కబ్ / వచ్చేనా  చెప్పవయ్య వల్లీసాబు!' (చెడ్డవాళ్ల కాలం వచ్చింది. చెయ్యివ్వడమే ప్రతివాడు నేర్చేసుకుంటున్నది. మంచిరోజులు ఎప్పుడు వస్తాయో చెప్పవయ్యా వల్లీసాహెబూ? అని ఓ శాస్త్రులుగారు  పోయిన వాపోతకు  ఆ వల్లీసాహెబుగారు 'బందేనవాజ్ బుజురుగ్ /జిందా హై ఆజ్ తో న జీతే హమ్ ఖుదా/ బందాహి జానె వహాసబ్/గందరగోళం జమాన ఖాజాసాబూ! (దేశసేవకులు, పుణ్యపురుషులు (చేసిన మంచి పనుల వల్ల) శాశ్వతంగా ఉన్నారు. మనం అట్లా జీవించలేం. దైవభక్తుడు, సేవకుడు ఆ విషయం తెలుసుకోడం మేలు. ఇప్పడు వచ్చిందంతా గందరగోళంగా ఉండే కాలం కదా ఖాజాసాబూ?) అంటూ ఆ వల్లిసాబుగారు జవాబు ఇచ్చారని ఓ సరదా కవిత్వం.  అల్లికలో సరదా కనపడుతున్న మాట నిజమే కానీ, పద్యాలలో ప్రస్తావించిన దైన్య స్థితి మాత్రం ఈ హిందూ- ముస్లిమ్  మత భేదాల కారణంగా దేశంలోని సామరస్య వాతావరణం దెబ్బతింటుందోన్న వాస్తవం అందరం ఒప్పుకోవాలి. 


మెహబూబ్ నగర్ జిల్లా మొదటి పేరు పాలమూరు జిల్లా. కరువుకాటకాలకు ఆ జిల్లా మారుపేరు. పనిపాటలు చేసుకుని పొట్టపోసుకునే జనాభా అధికంగా ఉండేదీ అక్కడే! అనావృష్టి పరిస్థితులకు అక్కడి జనాభా తరచూవలసబాట పట్టే పరిస్థితులను కదలిపోయి 'తూఫాను వానలే తుదికి గతియాయె/ఋతుపవనాలెల్ల గతిని దప్పె/చెఱువులు కుంటలు దొరువులు జాలులు/ఇంకి నెఱ్ఱెలు వారె బంకమట్టి/వర్షాలు కురియక కర్షకులెల్లరు/ బ్రదుకుదెరువు బాసి బాధపడుచు/గొడ్డు గోదముల నెల్ల గడ్డి గాదెము లేక/దుడ్డుదమ్మిడికమ్మి దుఃఖపడుచు/లేబరై గుంపుగుంపుగ లేవసాగె/తాళములు వేసి ఇళ్లకు తల్లెచెంబు/కుదువబెట్టుచు కూటికై వదలి రిపుడు/పల్లెలెల్ల లబోమని తల్లడిల్లె' అంటూ ధుఃఖంతో జహంగీర్ మహమ్మద్ అనే ముసల్మాన్ కవి అచ్చమైన తెలుగు పలుకుబడిలో వెళ్లగక్కిన ఆవేదన ఏ ముస్లిమేతర  కవి సాధించగలిగేది ? 


కదిలితే తెలుగు కవిత, మెదిలితే తెలుగు మాటగా బతికిన ముసల్మాన్ కవుల జాబితా కదిలించాలే గాని హనుమంతుని తోకంత! విందుకు పిల్చి రోసెన్న అనే పెద్ద మనిషి పాచి అన్నం పెట్టినందుకు విస్తరి ముందు నుంచి లేచిపోతూ హుస్సేన్ మహమ్మద్ అనే రాయలసీమ కవి 'అయ్యవ! మియ్యవ!కొయ్యవ!/చయ్యన చల్దన్నమేసి సరిపుచ్చెదు రో/శయ్యా పిన్నలు పెద్దలు/కుయ్యోమనుచున్న యిట్టి గోడును గనవా!' తిట్టిపోసాడు. ఆ సందర్భంలో హుస్సేన్ సాబ్ నోటి నుంచి వెలువడిన ఆవేదన 'అక్కట దయలేదా మరి/బుక్కెడు కూటికిని కటకటంబుట్టించితిరో!/కుక్కవొ నక్కవొ తిక్కవొ!/చిక్కడు నీ వంటి లోభి సిద్ధము వినరా!' అనే ఆవేదన ఇప్పటి వాతావరణంలో ఆ మైనారిటీ జాతి ఎదురుకొనే అవమానాలకు  దర్పణం పట్టినట్లనిపిస్తుంది కదూ!   'భక్త కల్పద్రుమ శతకము కర్త మహమ్మదు హుస్సేన్ ఈ హుస్సేస్ సాబ్ అవునో కాదో తెలియదు.  సాహేబు ఎన్ని సుభాలేలినా బేగమునకు కుట్టుపోగులే! అన్నట్లుంది దేశంలో ఉర్దూ పౌరుని దైన్య స్థితి.   


-కర్లపాలెం హనుమంతరావు

23 - 99-2021 

బోధెల్ ; యూ. ఎస్.ఎ 

 

 


 

 


Friday, December 10, 2021

సాహిత్య వ్యాసం నివేదనం - కాటూరి వేంకటేశ్వరరావు సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


సాహిత్య వ్యాసం 

నివేదనం


- కాటూరి వేంకటేశ్వరరావు

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు




భావము కుదిరి, ఉపక్రమోపసంహారాలతో, రమణీయార్ధములతో, సంవాద చతురతతో నడచిన ఈ కావ్యానికి ప్రబంధ మనే నూతన' సంకేతం ఏర్పడింది. వలసినంత భావనాసమృద్ధితో, అలంకారశిల్పముతో, రసభావనిరంతరంగా, గద్యపద్యాత్మకంగా రచితమైన ప్రబంధ మనే ఈ కావ్య పరిషియ ఆంధ్ర సాహితికి సొంతమని చెప్పదగును. ఆవేలమైన భావనకు రాయల ఆముక్తమాల్యదా, అద్భుతకథాకల్పనకు సూరన కళాపూర్ణోదయం నిదానములు. కావ్యానికి కావలసిన సకలలక్షణాలు సంపాదించుకొను టేకాక, శ్రవ్యరూపాన ఉన్న ప్రథమాంధ్రదృశ్య కావ్యమని పేరుగన్నది ప్రభావతీ ప్రద్యుమ్నం. కవిరాజ శిఖామణి నన్నెచోడుడు, ఎఱన, శ్రీనాథుడు, పినవీరభద్రుడు మున్నగువా రీ స్వతంత్ర కావ్యావిర్భూతికి బీజావాపం చేసినా, దీనికి ప్రత్యేక నామరూపాలు కల్పించిన మాన్యుడు అల్లసాని పెద్దన.


భారతాదులయందువలె కథాకథనము, ధర్మోపదేశము ఈ కావ్యములందు ప్రధానము కాదు. విభావాను భావాదులచే పరిపుష్టమగు రసనిష్పత్తియే ఇందు ప్రాధాన్యము వహించును. ఈ కాలపుగ వీశ్వరులు తమయెదుట కన్పట్టు మహా రాజ్యవిభవాన్నీ, అప్పటి రాగభోగాలను, నడతనాగరీశాలను మనసులందు నిల్పికొని వానికి రూపాంతరాలు కల్పించి, రసమయమైన గంధర్వలోకాన్ని సృష్టించారు. భువనవిజయం సుధర్మగాను, తుంగభద్ర మం దాకీని గాను, విద్యానగరళ్ళం గారవతులే కథానాయికలుగాను, ఆనాటి సాహసరనికులే నాయకులు గాను వీరి కావ్యాలలో అందందు రూపాంతరం పొందిరేమో ! ఆనాటి కవులకు, ప్రజలకు హస్తప్రాప్యములైన రసభోగాలనుండి వంచితులమైన మనకు నే డా కావ్యసృష్టి వింతగా, విపరీతంగా కన్పించినా సర్వర్తుధర్మసంశోభిత మై, అద్భుతర సస్యందియైన ఆరామంవంటిది ఆనాటి సాహిత్యం.


ఈ ప్రబంధకవులలో సహజశ్లేషలకు శయ్యాసౌభాగ్యానికి రామరాజ భూషణుడు, భక్తిపారమ్యానికి ధూర్జటి, ముద్దులొలుకు పలుకుబళ్ళకు తిమ్మన, అర్థభరితమైన పదబంధానికి రామకృష్ణుడూ — ఇలా ఒకరొకరే పేరుగాంచిరి. ఆంధ్రమున మొదటి ద్వ్యర్థి కావ్యమూ, యక్ష గానమూ ఈ కాలంలో నే పుట్టినవి. ఆత్మపరము, భక్తిభరితము అయిన శతకరచనం వెనుకటికాలంలోనే ఆరంభ మైనా ధూర్జటి కాళహస్తీశ్వరశతకం అట్టిరచనలకు మకుటాయమానమయింది. మెట్ట వేదాంతులను, దాంభికులను, మూఢమానవులను ఆధిక్షేపించి, పరిహసిస్తూ వేమయోగి అలవోకగా చెప్పిన ఆటవెలదులకు లోకుల నాలుకలే ఆకులైనవి.


విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధంతో స్తమించిన పిమ్మట చోళ పాండ్య దేశాలలో రాజ్య స్థాపనం చేసికొన్న నాయక రాజులు ఆంధ్ర సాహిత్యానికి వూరు, మధుర, పుదుక్కోటలందు విస్తరిల్లిన ఈనాటి వాఙ్మయ మంతా కేవలళ్ళంగారపరమైనది. స్వయము కవియై, సర్వవిధాల కృష్ణరాయలకు దీటైన రఘునాథరాయల అనంతరమందు నాయక రాజులలోను,. వారిపిమ్మట రాజ్యమేలి మహారాష్ట్ర ప్రభువులలోను భోగపరాయణత


 విసరిలినది. ఆంధ్రజాతి జవసత్యాలు ఉడిగి, పౌరుష ప్రతాపము ల సంగతములు కాగా, మిగిలిన కామపరతనుండి ప్రభవించిన ఆనాటి కావ్యాలు సంయమం కోలుపోయి పరకీయాశృంగారానికి పట్టముగట్ట నారంభించినవి. ఈ 150 ఏండ్లలో పొడమిన సాహిత్యంలో విజయవిలాసంవంటి ఒకటి రెండు కావ్యాలు పూర్వకావ్య గౌరవాన్ని కొంత అందుకొన్నవి. యక్షగానము జై కటి ఈ కాలమందే వరి లినది. నాయక రాజులలో పెక్కురు, మహారాష్ట్రప్రతాపసింహాదులు, నాయక రాజుల సామంతులు, దండ నాధులు గూడ కావ్యములు రచించుటొకటి, పెక్కురు విదుషీమణులు కవయిత్రు లగుట యొకటియు ఈశాలమందలి విశేషాలు, గేయకవితకు ద్వితీయాచార్యు డగు క్షేత్రయ్యయు, దాక్షిణాత్యకృంగార కావ్యభూషణమైన రాధికాసాంత్వనం రచించిన ముద్దుపళనియు, ఆనాటివారే.


కోకొల్లలుగా బయలు దేరిన యక్షగానాలు, శృంగారపదాలు అభిన యిస్తూ రాజసభలలో నాట్యం చేసే వేశ్యల పదమంజీరధ్వనులే అప్పటి కావ్యా లలో ధ్వనించుచుండును. రాజాస్థానాలలో తెరపిలేకుండా సాగే కామ దేవతారాధనమే నాగరులకు అనుకార్యమై, త్యాగ భోగ రాయుళ్ళయిన నాయక రాజులే శృంగార కావ్య నాయకు లైనారా అనిపిస్తుంది. సకలేంద్రియసంతర్పణం చేసే కామపురుషార్థమహాఫలంకోసం రనికనరనారీలోకం నూటయేబదియేండు 3 ఇలా సాహిత్య సముద్రమథనం చేయగా చేయగా తుదకు రామనామామృత భాండం చేబూని వాగ్గేయకార సార్వభౌముడైన త్యాగరాజస్వామి అవతరిం చెను.


3. క్రీ. శ. 1850—1955


19వ శతాబ్ది పూర్వార్ధంలో రెండుమూడర్థాల కావ్యాలు, శ్లేష చిత్ర బంధ కవిత్వాలూ బయలు దేరినవి. హాస్యనీతిశతకాలవంటివితప్ప స్వతంత్ర కావ్యములు పొడమలేదు. దేశం క్రమంగా ఆంగ్లేయాక్రాంతమై, క్రిస్టియనుమత ప్రచారము, ఆంగ్లవిద్యాభ్యాసం ప్రబలినవి. వీనికి దోడు భౌతికదర్శనముల ప్రభావం వల్ల విద్యావంతులు ప్రత్యక్ష ప్రమాణబుద్ధులు కావొడగిరి. భారతీయధర్మము, సంప్రదాయాలు, ఆచారాలు పునర్విచారణకు పాత్రములై, స్వస్థాన వేష భాషాభి మానం సడలుటతో, సంఘసంస్కారోద్యమాలు సాగినవి. సముష్టి చిర కాలంగా తనచుట్టు నిర్మించుకొన్న ప్రాకారాలు శిథిలము లగుటయు, వానినుండి విడివడజూచే వ్యష్టి తనకే మం తాను విచారించుకోజొచ్చింది. భారతీయ ధర్మాన్ని నవీన కాలానుగుణంగా సంస్కరించుట కి ట్లొకవంక యత్నం జరుగు చుండగా, మరొకనంక ఆంగ్లప్రభుత్వ బంధనంనుండి విడివడాల చేకోర్కె బలీయ మయ్యెను. అంతట భారతీయపూర్వేతిహాసాన్ని, ధర్మ ప్రపంచాన్ని మథించి, స్వస్వరూపసాక్షాత్కారం పొందవలెననే కాండా, అభిజనాభిమానము ప్రబలమయ్యెను. ఆంగ్లభాషాకళాశాలల్లో ఆంగ్లేయసాహిత్యాన్ని అవ గాహిస్తున్న పడుచువాండ్రు ఈ రెండు ఉద్యమాల చే ప్రేరితులై అందరమైన


నివేదనం


ix


అద్భుతర సదర్శనానికి, మద్రమై, బంధనాగారపదృశమై కనిపించే బాహ్య లోకానికి పొత్తుకుదరక, తమవేదనలను చెప్పికొనుటకై మాటలను, మార్గములను


ఇంతలో తిరుపతి వేంకటకవులు ఈ కాలపువారి కష్టసుఖాలను చెప్పికొనుట కనువైన సులభసుందర శైలిచే కావ్యరచనం చేయనారంభించిరి. గురుజాడ అప్పారావు మానవధర్మాన్ని, దేశభక్తిని ముత్యాలసరమనే ఛందముచే గానము ఇట్లు దేశకాలానుగుణమైన కావ్య శైలియు, ఛందము దొరకి సంతట 20వ శతాబ్ది ప్రథమపాదమున తరుణవయస్కులు, గొంతులు విడివడినప్లై, ఆత్మనాయకములగు మధురకవితలను చెప్ప మొదలిడిరి.


పాశ్చాత్య సాహిత్య ప్రపంచమును, రవీంద్రనాథగీతావళిని ఆరగ్రోలిన సంస్కారపుష్టిచే ఆరంభమైన ఈ మధురకవితలందు అలనాటి రాయల సాహిత్యంలో లభించే అద్భుతమైనరసదర్శనం మల్లా లభించింది. అయితే ఆనాటి దర్శనం భోగభాగ్యములచే తులదూగే జీవనపొష్కల్యమునుండి లభింపగా, ఈనాటిది ప్రతికూల పవనహతినుండి ఆత్మజ్యోతిని కాపాడుకొనుటకై వాయు మండలో పరిపథాన కెగిరి, ఆచట నిర్మించుకొన్న ఏకాంతజీవనంనుంచి పుట్టింది. ఆచట కవి నిజానుభవాలకు రూపాంతరం కల్పింపగా, ఇచట కవి మనోరథాలకు రూపకల్పన జరిగింది. కాగా, అందు సంయోగ సుఖము, ఇచట తరచు విరహ పరిదేవనమాధురియు లభించినవి. మేఘదూతలోని యక్షులవంటి ఈ కవుల కా అలకానగరసుందరి దవుదువ్వులనే ఉండిపోయింది. పార్థివగంధస్పర్శ లేని ఆసుందరి ఆరాధ్య దేవతయై, పూజాపీఠ మలంకరించింది. ఆదేవిని ప్రసన్న నొనర్చుకొనుటకై వీరు పాడిన మధురకవితలలో అద్భుతమైన భావస్ఫూర్తీ, రమణీయారాలు కోకొల్లలుగా మనకు లభిస్తవి.


ఆక్మనాయకములైన మధురకవిత లోకవంక ఇట్లు చెల్లుచుండ రెండవ వంక పూర్వేతిహాసములను రసమయంగా ప్రత్యక్షం చేసే వీరకథాకావ్యాలు, పర దాస్యబంధనాన్ని సహించని దేశభక్తి గేయాలు వెలువడజొచ్చెను. స్వస్థాన స్వధర్మాభిమానములనుండి ఆవిర్భవించిన ఈజాతికావ్యములు గూడ గుణ గౌరవ ముచే పొగడ్త కెక్కినవి.


ఇవి యిటులుండ ఇంకొక తెగ కవీశ్వరులు పామరజనజీవనమాధుర్యాన్ని పదకవితలందు అందీయసాగిరి. లోకానికి అన్న పత్రం పెట్టే కర్షకభాగ్యశాలిని, సంఘానికి సుఖభోగ పరికరాలను సమకూర్చియిచ్చే మంటిపుట్టువుల వితరణాన్ని కీ ర్తించుతూ వీరు ఈశ్వరాంశను మానవత్వమందు ప్రతిష్ఠ గావింపజొచ్చిరి.


ఈ వివిధ కావ్యసృష్టి యిలా జరుగుచుండగానే గాంధీజీ భారతరాజకీయ రంగాన ప్రధానభూమిక వహించడం, స్వాతంత్య్రచ్ఛ జనసామాన్యానికి గూడా ప్రాకడం, భాషారాష్ట్రములకొరకు ఆందోళన చెందడం, స్వతంత్రభారతంలో సంఘస్వరూప మెలాఉండాలి అనే వాదోపవాదాలు చెలరేగడం, ద్వీపాంత 


రాలనుండి ఆ సేకనూతనోద్యమమారుతాలు దేశంలో వీచడం వీని యన్నిటి భావుకులు చి తవీధులందు క్రొ ఆలోచనలు పొడమినవి. దీనితో కాల్పనిక మైద రసభావసృష్టి వెనుకబడి, దేశకాలాల యథాస్వరూపాన్ని చిత్రిస్తూ, నవసంఘ స్వరూపానికి రూపరేఖలు దిదేరచనలు బయలుదేరినవి. పరపీడనాన్ని, పరోప జీవనాన్ని శపించడం, కష్టజీవులందు అభిమానాన్ని ఉద్దీపింపజేసి ఆశాజ్యోతి వెలిగించడం __ఈ కాలపు కావ్యములకు సామాన్యలక్షణా లని చెప్పవచ్చు.


భావస్రవంతి పలుపోకల పోతున్న ఈ నవీనకాలంలో తొల్లి ఎన్నతు లేనంత వైవిధ్యము, గుణబాహుళ్యం కావ్యసృష్టియందు కనిపిస్తున్నవి. భావాను గుణములైన నూతవచ్ఛందాలను కవులు వాడుతున్నారు. కొందరు వృత్తగంధి వచనరచన చేస్తున్నారు. సంస్కృతపురాణేతిహాసాలకు మళ్ళా కొందరు కేవలానువాదాలు చేస్తుంటే, కొందరు వానిని స్వోపజ్ఞంగా క్రొత్త వెలయిను న్నారు. జానపద గేయాలు, వీరకథాగేయాలు ఎక్కువగా ప్రజాదరం పొందు తున్నవి. దేశకాలాలను వ్యాఖ్యానించుటకు కొందరు శతకపద్ధతి నవలంబిస్తు న్నారు.


ఏకాలమందైనా క్రొత్తదారి త్రొక్కేవా రొకరిద్దరే ఉంటారు. తక్తిన వారొక అడుగు అటూ యిటూగా ఆధారినే పోతూ, కొంత విలక్షణతను గూడ చూపెట్టుతారు. కొందరిరచనలు ఉపజ్ఞామహితములు కాకున్నా, తత్కాల పరిస్థితులకు, ఉద్యమాలకు ప్రతిబింబాలుగా ఉంటవి. ఇలా వేయేండ్లనుంచి ఎప్పటికప్పుడు నవనవంగా వర్ధిల్లుతున్న ఆంధ్రసాహిత్యమందలి కావ్యభేదాలను, రీతులను ఇందు ప్రదర్శించుటకు యత్నించితిని. ఆంధ్రసాహిత్యంలో కేవలం మేలేర్చి కూర్చేయత్నం కాకపోవడంవల్ల, ఆంధ్రరసజ్ఞలోకానికి పరమాదర పాత్రములైన కొన్నికొన్ని రచనల నిందు చేర్చలేకపోతిని. రుచిభేదంవల్ల, పరిశీలనాలోపంవల్ల, స్థలసంకోచంవల్లకూడా ఈ కూర్పు కొంత అసమగ్రతకు పాల్పడిఉంటుంది.


నా యీలోపములను సహృదయులు మన్నింపవేడెదను. ఇతర భాషా ప్రాంతములందలి సోదరభారతీయులకు ఆంధ్ర సాహిత్య సంపద నంతటిని, శృంగ గ్రాహికగా కాకున్నా, స్థూలారుంధతీన్యాయంగానైనా ఈ గ్రథవం చూపెట్ట గలదేని కృతార్థుడ నగుదును.


- కాటూరి వేంకటేశ్వరరావు

( తెలుగు కావ్యమాల - నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

Wednesday, December 8, 2021

ప్రాకృతసాహిత్యంలో సామాన్యమానవుడు

 

 

Monday, April 5, 2021

10:44 AM

 

ప్రాకృతసాహిత్యంలో సామాన్యమానవుడు-తిరా--భారతి-75-6-౪.pdf


సకల జగజ్జంతువులకు వ్యాకరణాది సంస్కారం లేని సహజ వాక్ వ్యాపారం ప్రకృతి. ప్రకృతి సంబంధమైనది ప్రాకృతం.

పిల్లలకు, మహిళలకు ఇది సుబోధం. మేఘ వర్షిత జల స్వచ్చత దీని లక్షణం.దేశ విశేషాలను బట్టి సంస్కారాదులను బట్టి విశిష్టతను పొంది.. సంస్క్రుతాదులుగా తరువాత విభేదాలు పొందేది. రుద్రట రచిత కావ్యాలంకారానికి వ్యాఖ్యానం రాస్తు నమిసాధువు చెప్పిన వ్యుత్పత్తి ఇది.

సంస్కృతం ప్రాకృతం పరస్పారాబూతాలన్న మాట నిజమేనా?

అగ్ని మీళే పురోహితం

యజ్ఞస్య దేవ మృత్విజం

హోతారం రత్న ధాతవం- ఇది రుగ్వేదం తొలి మండలం తొలి ఋక్కు. మానవ జాతి మొదటి చందోబద్ధ సాహిత్యంగా పరిగణించేది. ఈ సంస్కృత శ్లోకానికి మూలాధారంగా ఏదైనా ప్రాకృత గాధ ఉందా? మరి సంస్కృతం సంస్కరింపబడిన ప్రాకృతంగా  నిర్ధారించుకోవడం ఎలా?! రెండూ ఒకే కొమ్మకు పూచిన రెండు పూవులు ఎందుకు కాకూడదు?

ఋగ్వేద మేధావుల భాష ఐవుండి.. ప్రాకృతం (ప్రజల భాష)దానికి సంపూర్ణ భిన్నంగా కాక.. సన్నిహితంగా ఉండే పలుకు ఎందుకు ఐ ఉండకూడదు? త్తణ- త్వవ, ఆవి- ఆయై, విహి- వఏభిః, హోహి- బోధి, విఊ- విదుః, రుక్ఖ- రుక్ష.. మొదటివి ప్రాకృత రూపాలు, రెండీవి సంస్కృత రూపాలు. రెంటికీ చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు పిషెల్ (Richard Pischell)  మహాశయుడు ఉదాహరించిన ఈ రూపాలను బట్టి సంస్కృత ప్రాకృతాలు  అసలు ఒకే పూ రేకు రెండు పార్శ్వాలనుకున్నా తప్పు లేదు.

భాష ప్రవాహిని. ఋగ్వేద భాషా జన ముఖ యంత్రంలో పడి మార్పులకు లోనవక తప్ప లేదు. ప్రాచీనతను కాపాడుకోవాలనే తపన వలన  ఋక్కులకు, పనసలకు పద పాదాలు, ఉచ్చారణ రక్షణకు ప్రాతిశాఖ్యలు పుట్టినట్లున్నాయి. 'వేద రక్షణకు వ్యాకరణం చదవాలి.లోపాగమ వర్ణ వికారజ్ఞుడే వేద రక్షణా సమర్ఢుడు.' అని పతంజలి హితవు. పాణినీ 'వేదేలోకే' అని విడదీయడం వల్ల సాహిత్య భాష, లౌకిక భాష విడిపోయినట్లు అనిపిస్తుంది.

తథాగతుడు మేధావుల మేలిమి భాషకు పోక తన ప్రామ్తీయ పాలీ భాషలో ధర్మోపన్యాసాలు చేసినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఋగ్వేద బ్రాహ్మణ  సంస్కృతాన్ని కొంచెం యాసతో కొంచెం ముఖ యంత్ర సౌలభ్యంతో వ్యవహరిస్తే తథాగతుడు వాడిన ఆ పాలీ భాష అవుతుంది అపిస్తుంది.

"యో చ నస్ససతం జంతు అగ్గిం పరచరే వనే

 ఏకంచ భావితత్తానం ముఉత్తం అపి పూజయే

 సా యేవ పూజనా సేయ్యో యమ్ చే నస్స సతం హుతం"

దమ్మ పదంలోని ఈ మూడు పాదాలు చాలు సంస్కృత ప్రాకృతాలు  ఒకే పూ రేకు రెండు పార్శ్వాలని నిర్దారించడానికి.

భాష ప్రవాహ నైజం కలది కనక ఆ ప్రాకృతంలోనూ సాహిత్య సంస్కారం కలది పై పలుకు అయింది తక్కినది అపభ్రంశం కింద జమయింది. నమిసాధువు దబాయించి చెప్పిన ఆ అప్రభ్రంశ భాషా దేశ భాషలుగా వేయి చీలకలయింది.

 

సామాన్య మానవుణ్ణి ప్రాకృత సాహిత్యం ఆదరించినట్లు సంస్కృత సాహిత్యం ఆదరించలేదు. ఆదికావ్యం రామయణం కూడా రాగ రంజితమైనదే. ప్రాకృత సాహిత్యం ప్రజారంజన చేయలేదు అన్న మాట అబద్ధమని తేలి పోలేదూ! అ దృష్టితో చూస్తే ప్రాకృత సాహిత్యం గాథా సప్తశతిది ప్రజారంజక సాహిత్యంలో అగ్రస్థానం.

 

గాథా సప్తశతికి తెలుగు గడ్డతో సంబధం ఉంది. ప్రజారంజక కవుల గాథలను సేకరించి ప్రాకృత సాహిత్య మాతకు అలంకారాలుగా కూర్చిన హాలుడు తెలుగు వాడే. పేరుకు రాజైనా ప్రాణమంతా గ్రామీణ జీవన సౌందర్యానికే మీదు కట్టిన  మొదటి శతాబ్ది ముక్తక గ్రధన మార్గదర్శి.తెలుగుల కమనీయ కల్పనా  పటిమను దిగంతాలకు చాటిన మహనీయుడు.

 హాలుడిది ప్రధానంగా రసిక దృష్టి. శృంగార రస ధుని నుంచి తొంగిచూసే సామాన్యుని జీవితం హాలుని ప్రథాన ఇతివృత్తం.

'ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని

కథలన్నీ కావాల'ని మహాకవి శ్రీ శీ ఇపుడన్నాడు గానీ క్రీస్తు శకం తొలి శతాబ్దిలోనే హాలుడు ఆ యజ్ఞం అరంభించాడు.

 

సామాన్య్డుడు అంటే ఎవరు? ప్రతి వృత్తిలోని సామాన్య గృహస్థు. రాజ సేవకుడు మొదలు.. నాపితుని వరకు.వారి దైనందిన జీవితం, దారిద్ర్యం, కరువు కాటకాలు, వాగులు, వరదలు, వానకాలపు బురద వీధులు, ఎండకాలపు మృగతృష్ణలు,  దప్పికగొన బాటసారులు, చలివెందలి చపలాక్షులు, చలికాలపు నెగళ్ళు, గొంగళ్ళు, గొంగళ్ళు అక్కర్లేని నెరజాణల మొగుళ్ళు, వసంతోత్సవాలు, మొగిల్లను చూసి నిట్టూర్పులు విడిచే ముదితలు, ఫాల్గుణోత్సవాలు, పెండ్లిండ్లు, పేరంటాలు, సతులు, అసతులు, విధవలు, వేశ్యలు, జారులు పూజారులు, వంటలు పంటలు,శిధిల దేవాలయాలు, ప్రసిథిల వలయాలు, నగలూ నాణేలు- ఒకటేమిటి.. గ్రామాలల్లోని ప్రతిదీ కావ్య వస్తువయింది.

ధర్మ శాస్త్రం నిషేధించిన ఋతుమతీ సంస్పర్శన సంగమాలను సైతం ఈ కవులు వదిలి పెట్టలేదు.

 

దారిద్ర్య చిత్రణలో ప్రాకృత కవి  నేటి కవిని ఎలా మించి పోయాడో చూడండి!

దుగ్గ అ కుటుంబఅ

కహంణ మఏ దోఇఏణ సోఢ వ్వా,

దసి ఓసరంత సలివేణ

ఉపహ రుణ్ణంవ పడవిణ (గాథాసప్తశతి 1-18)

(దుర్గ తకుటుంబాకృష్షిః

కథన్ను మయా ధౌతెన  సోఢన్యా

దశాపసరప్సలిలేన

వశ్యత రుదిత మివ పట కేన?)

కటిక దరిద్రం. ఉన్న ఒక్క గుడ్డనూ దినమూ గుంజి పులిమి ఆరవేస్తున్నారు. గుడ్డ చీకిపోయి ఇక ఉండ లేననకుంది. ఆర వేసిన గుడ్డ అంచునుంది నీరు కారుతుంది. దానిని ప్రాకృత కవి చూసాడు. హృదయం ద్రవించింది. ఈ దరిద్రపు సంసారం గుంజుకుని రావడం ఇక సహించలేనన్నట్లు ఆ గుడ్డ ఏడుస్తున్నట్లుగా ఉంది అని అంటాడు కవి.

Tuesday, November 11, 2014

12:00 PM

దరిద్రుని ఇల్లాలుకు వేవిళ్ళు.ఎన్నో కోరికలు పుడతాయి ఆ దశలో స్త్రీలకు. 'ఎం కావాలి>' అని భర్త అడిగినప్పుడల్లా భర్త అకులత్వం పోగొట్టడానికి 'మంచి నీళ్ళు' అని అడిగి పుచ్చుకునేదిట.

'దుగ్గ అఘరమ్మి ఘరిణీ

రక్ఖంతీ ఔలత్తణం పఇణో

పుచ్చిఅదోహల సద్దా

పుణోని ఉఆం విఆ కహేఇ (గా.సః 5-72)

౯దుర్గత గృహే గృహిణీ

రక్షంతీ అకులత్వం సత్యుః

పృష దోహద శబ్దా

పున రపి ఉదక మితి కధయతి)

 

పరిసర సామాన్యాంశాలను అతి సహజ మనోహరంగా అప్రయత్నంగా సులభగ్రాహ్యంగా ఉపమోత్ప్రేక్షించడంలోనే కవి కల్పనా దక్షత పరీక్షకు నిలబడేది.

ఫాలేహి అచ్చభల్లం

వ ఉఅహ కుగ్గామ దేఉలద్దరే,

హేమంత ఆల వధిఓ

విఝ్జా యంతం పలాలగ్గిం (గా.స-2-9)

పాటయ తగచ్చభల్లం

ఇవ వశ్యత కుగ్రామదేవకులద్వారే

'హేమంతకాల పథికో

విధ్మాయమానం పలాలాగ్నిం)

చలికాలం. పల్లెటూరి దేవళం ముందు ఓ బాటసారి అప్పటి వరకు చలి కాచి ఆరిన నెగడును కర్రపుల్లతో కెలకడం ఎలుగుబంటి పొట్ట చీలుస్తున్నట్లుందని కవి ఉపమోత్ప్రేక్ష.

మంట ఆరిన కాలిన గడ్డి కుప్ప పడి పోయిన  నల్లటి ఎలుగు బంటిలాగే ఉండటం.. దాని పొట్ట చిల్చినప్పుడు నిప్పులా లోపలి రక్త మాంసాలు కనిపించడం- ఎంత మనోహరంగా ఉంది కవి కల్పన!

రంధణకమ్మ నివు ణిఏ

మాజూరసు రత్తపాటలను అంధం

ముహమారు అం సి అంతో

ధూమాఇ సిహీ ణ వజ్జలఇ  (గా.స-2-24)

 

(రంధన కర్మనిపుణికే

మాకృధ్యస్య రక్తపాటల సుగంధం,

ముఖమారుతం సిబన్

ధూమాయతే శిఖీ న ప్రజ్వలతి)

కవితకు ప్రేరణ పద్మినీజాతి స్త్రీయే కానక్కర్లేదు. అనుక్షణం మన కటెదుట మసలుతూ, ఇంటి పనులలో నిమగ్నురాలైన ఇల్లాలైనా చాలు-అని ప్రాకృతకవి సిద్ధాంతమై ఉంటుంది.

ఇల్లాలు వంట చేయాలి , పొయ్యి రాజేసింది. పొయ్యి రాజుకోవడం లేదు. నిప్పు రావాడం లేదు. భర్త అంటాడూ"వంటల్లో ఆరితేరిన గడసరిదానా! ఊదడం మాను. కోపగించుకోకు. నీ ఊర్పుల కమ్మ తావిని ఆస్వాదిస్తూ అగ్నిదేవుడు మరీ మరీ ఆ  తావిని గ్రోలుదామని మండడం లేదు"

'హాసానిఓ జణో

సామలోఅ పఢమం పసూఅమాణాఏ,

వల్లహ వాహేణ ఆలం

మమ్మత్తి బహుశో భణంతేఏ  (గా.స-2-26)

(హాసితో జనః

శ్యామయాః ప్రథమం ప్రసూయమానాయాః

వల్లభ వాదేవ ఆలం

మమేతి బహుశో భణం త్యా) 

 ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాలకు మల్లే తాత్కాలికం. ప్రసవ వేదన భరించలేని బాధలో 'ఇహ మొగుడూ వద్దు.. మొద్దులూ వద్దు' అని ఆడవారు ఏడుస్తారు.అంతమాత్రం చేత వాళ్లు సంసారాలు చేయకుండా ఉన్నారా? ఉంటే సృష్టి ముందుకు సాగేది ఎట్లా?! ప్రాక్రుత కవి స్త్రీ ప్రసవ వైరాగ్యాని బహు చక్కని పద్యంలో వివరించాడు.

 

ముర్రుపాలు తాగిన కొత్త గేదె దూడకు ఎక్కడ లేని నిద్ర ఆవరిస్తుంది. ఆ ప్రకృతి ధర్మాన్ని ఓ  పరసతిని మరగిన వగలాడి పగటి నిద్రతో మహా చమత్కారంగా పోల్చిన కవి కల్పనా పటిమకు జోహార్లు అర్పించాల్సిందే!

జి హోసి ఇ తప్ప పిఅ

అణూది అహం ణేససేహి అంగేహిం

ణవసూఅ పీఅపీఅసి?  (గా.స- 1-65)

 

(యది భవసి న తస్య ప్రియా

అణుదివసం నిస్సహై రంగైః,

నవసూత పీతపీయూష

మత మహిషీ వత్సేవ కింస్వవిసి?)

గేహే హ సలోఅహ ఇమం

పహసి అవాణా వైస్స అస్సేఇ,

జాఆ సుఆ పదముబ్బిణ్ణ

దంతజుఅ లంకిఅం బోరం  (గా. స- 2-100)

(గృహ్ణీత ప్రలోకయత ఏనం

సహసిత వదనా పత్యు రర్పయతి,

జాయా నుత ప్రథమోద్భిన్న

దంతయు గళాంకితం బదరం)

ఓ పిల్లడికి పాల పండ్లు వచ్చాయి. ఆ పండ్లతో వాడు రేగు కాయను కొరికాడు. మహదానందంతో భర్త వద్దకు వచ్చింది పిల్లడి తల్లి 'ఇదిగో తీసుకోండి.చూడండి దీన్ని'  అంతో నవ్వుతూ పిల్లడు  కొరికిన -కొత్త పాలపళ్ల గాట్లున్న రేగుపండును భర్తకు చూపించింది.

 

పిల్లలకు పళ్ళు వచ్చే వరకు భార్యా భర్తలు తప్పనిసరిగా శయ్యాపథ్యం చేయాలి. ఈ లోగా కక్కుర్తి పడరాదని వైద్యక శాస్త్రం చెబుతోంది. అందుకే ఆ భార్యకు అంత ఆనందం. ఆమె నవ్వులోని అంతరార్థాన్ని కవిత్వంగా మలిచిన కవికి ఎన్ని వరహాలు పురస్కారం ఇవ్వాలి?!

 

అవిరల పడంత ణవజల

రారా రజ్జు ఘడిఅం పాత్తేణ,

అపహుత్తో ఉఖ్ఖేత్తుం

రస ఈవ మేహో మహిం ఉవహ  (గా.స- 5-36)

 

(అవిరల పతన్న సజల

ధారారజ్జుఘటాతాం ప్రయత్నేన,

అప్రభవ న్నుక్షేప్తుం

రసతీవ మేఘో మహీం పశ్యత)

 

బరువుల్ని పైకి లాగే సమయంలో ఊపుకోసం అప్రయత్నంగా నోటినుంచి శబ్దాలు చేస్తుంటారు కార్మికులు. ఈ దృశ్యాన్ని కుండపోతగా వర్షం కురిసే  సమయంలో వినిపించే మేఘ గర్జనలకు సమన్వయిస్తూ కవి చేసిన చమత్కార వర్ణన ప్రజా రంజకంగా ఎందుకుండదు! పగ్గ్గాలు పైనుంచి వదిలినట్లు వర్షం కురుస్తోంది. ఉరుములు వినిపిస్తున్నాయి. మేఘమనే కార్మికుడు సందులేకుండ భూమిని పగ్గాలు కట్టి పైకి లాగుదామనుకున్నాడు,ఎంత ప్రయత్నంచినా లాగ లేక మూలుగుతున్నాడు. ఆ మూలుగులేనుట ఉరుములు!

 

ఇక రాజకీయ ఛాయలు గల గాథలకూ కొదవ లేదు. సామాన్యుని దృష్టి కోణంనుంచి కవిత్వరీకరింపబడటమే ఇక్కడ ఎన్నదగిన అంశం.

 

ఆమ అస ఇహ్మ ఓసర

సఇవ్వఏ ణ తుహ మఇలఆం గోత్తం,

కిం ఉణ జణస్య జాఆవ్వ

చందిలం తా ణ కామేమో  (గా.స-5-17)

 

(ఆమాస్త్యో వయం

అససర పతివ్రతే న తవ మలినితం గోత్రం;

కింపున ర్వయం జనస్య జాయేవ

నాపితమ్ తావన్న కాక్ముయామహే)

 

'ఔను! మేము లంజలం. దగ్గరకు రాకు. తప్పుకో. నీ వంశం మైలపడిపోనూ! కాని మెము సామాన్య సంసారికి భార్యలం. నాపితుని మామించ లేదుగదా!' అని ఈ గాథకు అర్థం. ఈ సంభాషణ అర్థ మవాలంటే కొంత చారిత్రిక నేపథ్య జ్ఞానం తప్పని సరి. గాథాసప్తశతి ఐదవ శతకం 17వ గాథ నందవంశ మూలపురుషుని కథను ధ్వనింపచేస్తుందని శ్రి ఎన్.ఎస్. కృష్ణమూర్తిగారి అభిప్రాయం.

నందులకు పూర్వం భారపాలకులు శిశునాగులు. శిశునాగుల్లో కడపటి రాజు కాలాశోకుడు. కాలాశోకుని భార్యకు ఆస్థాన నాపితునికి సంబంధం కలిగింది. ఆ నాపితుడు కాలాశోకుని భార్య సహాయంతో, అతనిని చంపి, రాజ్యం ఆక్రమించుకొని నందవంశానికి మూలపురుషు డవుతాడు. వీడిని నాపితదాసుడని కొందరన్నారు.మహావంశ నందులు అధార్మికులని, ఉన్నత కులులు కారని ఆ స్త్రీ ఈ గథలో అంటున్నది.

 

వీధి వినోదాలు కవి దృష్టిని దాటి పోలేదు. ఒక వీధిలో మల్లుడు తప్పెట కొదుతున్నాడు. తప్పెట తాళానికి అనుగుణంగా మల్లుని భార్య నాట్యం చేస్తున్నది. ఒకర్తె మల్లుని భార్యను ఎత్తి పొడుస్తున్నది." ఓ మల్లీ! ఎంత దురదృష్టమే నీది! భర్త డప్పు కొడితే ఆడుతావు సిగ్గు లేక! అని.

ఆ ణత్తం తేణ తుమం

వఇణో వహఏణ సడహ సధేణ

మల్లి ణ లజ్జసి ణచ్చసి

దోహాగే సా అడి జ్ఞంతే     గా.స-785

 

ఆజ్ఞప్తం తేన త్వాం

సత్యా ప్రహడేన పటహశబ్దేన,

మల్లి నలజ్జసే నృత్యసి

దౌర్భాగ్యే ప్రక్టీ క్రియమాణే

(మొదటి భాగం సమాప్తం)

గాథా సప్తశతి-రెండో భాగం

గథా సప్తశతి లోని రచన కొంతైనా తెలుగు గడ్డ మీద జరిగుంటుందని పండితుల అభిప్రాయం. దీనిలోని తెలుగు పలుకులను గురించి తిరువల రామచంద్ర గారు భారతిలో విస్తృతంగా రాసారు.

 

వజ్జాలగ్గం కూదా గాథా సప్తశతిలాగా ముక్తకాల సంకలనమే. కర్త జయవల్లభుడనే శ్వేతాంబర జైనముని. 8వ శతాబ్ద్ద్దం వాడు.  తను ధర్మార్థ కోవాలానే త్రివర్గం గురించిన సుభాషితాలను సంకలించానని స్వయంగా చెప్పుకున్నాడు.

 

సువ్వన్ను వయణ పంకయ

ణివాసిణిం పణమిఊణ సుయదేవిం,

ధమ్మాఇ సుహాసి అం వోచ్చం   వ-1

 

(సర్వగ్య వదన పంకజ

నివాసినీం ప్రణమ్య శ్రుతదేవీం,

ధమ్మాది త్రివర్గ యుతం

సుజనానాం సుభాషితం పక్ష్యామి)

'కవుల వివిధ గాథలలో మేలిమిని గ్రహించి జయవల్లభమనే వజ్జాలగ్గం విధిపూర్వకంగా కూర్చాను' అన్నాడు.

 వజ్జా అంటే పద్దతి. లగ్గం అంటే సంకలనం. ఒక ప్రస్తావంలో చెప్పే గాథల పద్ధతిని పజ్జా-ప్రజ్యా అన్నానని తెలుపుకున్నాదు. ఇతడు ప్రాకృతం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. లలిత మధురాక్షరమైనది ప్రాకృత కావ్యం.నది స్త్రీలకు ఇష్టమైనది. శృంగార రసయుతం. అలాంటిది ఉండగా సంస్కృతం ఎవరు చదువుతారు? అని ఇతని ప్రశ్న.

లలిఏ మహురక్ఖర ఏ

జువౖ జణ వల్లహే ససింగారే

సంవే(?) పా ఇఅ లవ్వే

కో సక్కై సక్కఅం పఢిఉం-  29

 

పాలు పితుకడం సరిగా తెలియని వారు ఆవులను బాధ పెట్టినట్లు గాథల రసం తెలియని మోటువాళ్ళు దాన్ని ఈకకు ఈక తోకకు తోక లాగి పాడు చేస్తారని వాపోతాడీ కవి ఓ గాథలో "ఓ గాథా! నిన్ను మోటు మనుష్యులు అడ్డదిడ్డంగా చదువుతారు.చెరుకు తినడం తెలియని మోటువాళ్ళు చెరుకు నమిలినట్లు నిన్ను ఎక్కడ బడితే అక్కడ విరుస్తారు' అని కవి వాపోత.

వజ్జాలగ్గం భర్తృహరి సుభాషిత పద్యతిలో సంకలనం చేసినట్టిది. దీనిలో 96 పగ్గాలలో దాదాపు వేయి గాథలున్నాయి. సామాన్య జనుడే ఈ కవి లక్ష్యం. దరిద్రుణ్ణి, తదితరులని స్వేచ్చగా వర్ణించాడు. దరిద్రుడు అతని దృష్తిలో సిద్దులందరిలోకి మహా సిద్ధుడు.

'దీనంతి జోయసిద్ధా

అంజణ సిద్దా వి కౌని దీసంతి,

దాంద్జ జో యసిద్దం

మం తె లోఆని పచ్చంతి  -141

 

 

(దృశ్యంతే యోగసిద్ధాః

అంజన సిద్దా అపి కేచన దృశ్యంతే,

దారిద్ర్యయోగ సిద్ధం

మాం తే లోకా న ప్రేక్షంతే)

 యోగ సిద్ధులు కనబడతారు. అంజన సిద్ధులూ కనబడతారు. నాబోటి దారిద్ర్య యోగసిద్ధులు ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించరు- అని ఓ దరిద్రుడు వాపోతుంటాడుట.

 

జై నామ కహని సోక్ఖం

హూఇ తులగ్గేణ సేవఅజణస్య,

తం ఖవణాఅ సగ్గారో

హణం న విగ్గో వా సఏహి   -153

 

(యది నామ కథమపి సౌఖ్యం

భవతి తులాగ్రేణ సేవకజనస్య,

తత్ క్షపణక స్వర్గారోహణ

మివ వ్యాకుల భావసతైః)

రాజసేవకులు దంభర్మాంకులు. వస్త్ర వ్యాపారులు, పల్లెల్లో తెలివితేటలు గలవారు, వడ్డెవాళ్ళు, వైద్యులు, జ్యోతిష్కులు, మొదలైన వారి మనస్తత్వాలను బాగా చిత్రించాడీ కవి. రాజ సేవకునికి ఏదైనా సౌఖ్యం కాకతాళీయంగా వస్తే, అది క్షపణకుని స్వర్గారోహణం లాగా ఎన్నో కష్టాల తర్వాత మరణానంతరంసంభవించ వచ్చునంటాడు.  క్షపణకుడు(సన్యాసి) కి సుఖం కలిగేదెప్పుడు? మరణానంతరమే. అతని ఘనతను గ్రహిమ్చి విమానంకట్టి మోసుకుని పోతారు. వాద్యాలు మోగిస్తూ దానాలు ఇస్తారు. అతని పేర ఇలా అంత్య సంస్కారం కోసం తీసుకు వెళతారు. ఇలాగే రాజసేవకుడికీ కాకాతాళీయంగా ఏదైనా సుఖం కలిగిందీ అంటే అది మరణం తరువాతే. జీవితకాలంలో సుఖ యోగం లేదు అని కవి భావం.

 

ఒక సేవకుడు అనుకుంటాడు"మంచి పొదుగు ఉన్న మూడు ఆవులు, నాలుగు మంచి ఎడ్లు, చేతినిండా  వరికంకులు ఉంటే చాలు.. ఓ సేవా ధర్మమా, నీవు ఎక్కడన్నా సుఖం ఉండు' అని.

తంబాఉ తిన్ని సుపఓహరా ఉ

చత్తరి పక్కల ఎఇల్లా,

నిస్సన్నా రాలయ మంజరీ ఉ

సేవా సుహం కుణవు'   -160

 

(గాన స్తి సః సుపతీధరాః

చత్వారః సనర్థ బలీవర్గాః

నిష్పన్నా రాలవ మంజర్యః

సేవా సుఖం కరోతం)

గ్రామాలలోని చతురులను గురించి కవి చాలా మనస్తత్వ విచారణ చేసాడు. ఒకామె ఒక అమ్మాయిని హెచ్చరిస్తుంది" పల్లెల్లోని భేకులు బహు చతురులు. బహు కూట నిపుణులు. వారి చేతుల్లో పడ్డ వారికి స్వప్నంలో కూడా సుఖం లేదు.వారికి ఆరవ జ్ఞానం(సిక్స్త్ సెన్సు) ఉంటుంది. ఆ చూపుల్లో పడిన వాడికి సుఖం ఉండాదు'

 మేడలతో, మిద్దెలతో, ప్రాకారాలతో, శిఖరాలతో ఉండేదే కాదు.. చతురులున్న పల్లే నగర మవుతుంది.

 

తహ చంపిఊణ భరి ఆ

నిహిణా లావణ్ణ ఏత తణు అంగీ,

జహ సే చిహారతరంగా

అంగుళి మగ్గ దీసంతి   -314

 

(తథా నిసీడ్య భృతా

నిధినా లాణ్యేన తన్వంగీ,

యథా అస్యాః చికురతరంగా

అంగుళీమార్తా ఇవ దృశ్యంతే)

 

శరీర సౌందర్యం, అంగాంగ సౌష్టవానికి మించిందని ప్రాకృత కవి గొప్ప ఊహ.ఓ లావణ్య సుందరిని చూసిన అతగాడికి ఇంత్లో ధాన్యమో, పత్తో సంచుల్లోకి కూరుతున్న దృశ్యం గుర్తుకొచ్చింది.విధి ఒక తన్వంగిని లావణ్యంతో కూరి కూరి నింపాడుట. పై నుంచి నొక్కి నొక్కి కూరిన చేతుల గుర్తులే వంకుల జుట్టు అని కవి చమత్కారం! ఆహా.. ఎంత గొప్పగా ఉందీ ఊహ!

 

దాడిమఫలం వ్వ పెమ్మం

ఎక్కేసక్కేవ్వ హోఇ సకషాయం,

జావ న బీఓ రజ్జఇ

తా కిం మహ రత్తణం కుణఇ    -334

(దాడిమఫల మివ ప్రేమ

ఏకైకస్మిన్ పక్షే సకషాయం,

యావ న్న ద్వితీయే రజ్యతే

తావ త్కిం మధురత్వం కరోతి)

ప్రాకృతమని చిన్న చూపు కాని సామాన్యుని చూపు ఎంత గహ్యమైన అంశాన్నైనా తన పరిధిలోకి అనువదించుకుని అత్యద్భుతమైన అవగాహనను ప్రదర్సిస్తుంది. మేధావుల ఊహ పోహల వలె కాకుండా సామాన్య జీవి ఏక పక్ష ప్రేమని పూర్తిగా పండని దానిమ్మ పండుతో ఎంత గొప్పగా పోల్చాడో! దానిమ్మ పక్వానికొచ్చే విధానం మిగతా ఫలాలకన్నా కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. గింజలన్నీ ఎర్ర బారినదాకా పండులోకి తీపిదనం రాదు. ఒక పక్క తియ్యగా ఉండి మరో పక్క వగరుగా ఉండే లక్షణం ఒక్క దానిమ్మ పండుకే ప్రత్యేకం. ప్రేమా అంతేట. 'ఒక పక్షంలో మాత్రమే ప్రేమ ఉండి మరో పక్షంలో దానికి అనుగుణమైన స్పందన కరవైతే ఆ బంధం దానిమ్మ పండు మాదిరి సంపూర్ణమైన పక్వ ఫలం అనిపించుకోదు'అంటాడు ప్రాకృత కవి.బిఓ అన్న పదానికి విత్తనం, రెండో పక్షం రెండు అర్థాలు ఉండి గాథ చమత్కారాన్ని మరింత పెంచింది.

బింకాన్ని ప్రెమను రెండు మదగజాలతో పోల్చాడు మరో గాథలో ప్రాక్కృత కవి. బింకం ఉంటే ప్రేమ పండదు. ప్రేమ ఉంటే బింకం నిలవదు. రెండూ ఒకే చోట ఉండలేవు.. ఒకే కట్టుకు కట్టివేసిన రెండు మదాజాల మాదిరిగా.

జి మాణీ కీస పిఓ

అహన పియో కీసక్షీరఏ(?) మాణో,

మాణిణి దోని గయిందా

ఎక్క కంభే న బజ్జంతి  -355

ఒక వరలో ఇమడని రెండు కత్తులతో ప్రేమని, అహంకారాన్ని కబీర్ దాస్ కూడా పోల్చడం గమనించాలి.

పియా బాహై పేమరస

రాఖా బాహై మాన

ఎకమ్యానమేఁదో ఖడగ

దేఖా సువా , కాన'

 

పల్లెటూరి జనానికి బూతన్నా, బహిరంగ శృంగార చేష్టలన్నా సంకోచం లేకపోవడం ఈనాడే కాదు..ఆ నాడూ ఉంది. కాబట్టే వజ్జాలగ్గంలో కవి 'ఒక నవ దంపతుల వివిధ శృంగార భంగిమల్ని రాత్రంతా చూస్తూ గడిపిన  దీపం నూనె లేకపోయినా అలాగె మండుతున్నదని ఓ గాథలో  సూచ్యం చేస్తాడు.

దట్టూణ తరుణ సురఅం

వివిహ పలోఠ్ఠంత కరణసోహిల్లం,

దీఓ వి తగ్గయ మణో

గఅం వి తెల్లం న లక్ఖేఇ -319

 

(దృష్ట్యా తరుణ సురతల

వివిధ ప్రలుఠత్  కరన సహితం,

దీపోసి తద్గతమనాః

గతం మసితైలం న లక్షయతి

అని చెప్పుకొచ్చాడు.

 

తాడిచెట్టును అడ్డం పెట్టుకుని ఓ ప్రాకృత కవి  'ఓ తాడిచెట్టూ! ఎందుకు నీ ఎత్తు? సగం ఆకాశాన్ని ఆక్రమించావు. ఆకలి దప్పి తీర్చుకుందామని పాంథులు దగ్గర చేర్తారా ఏమన్నానా?' అంటూ రస హీనతని ఎద్దేవా చేస్తాడు. ప్రాకృత సాహిత్యంలో ఇలాంటి నర్మ గర్భ శృంగార  ప్రేలాపలకు కొదవే లేదు. గ్రామీణులు పని పాటల అలుపు సొలుపుల నుచి ధ్యాసను  మళ్ళించుకోడానికి వళ్ళు పులకలెత్తే మౌఖిక శృంగారాన్నాశ్రయించడం అసభ్యంగా భావించడం లేదు నాడూ నేడూ కూడా! 

కబీరు అంతటి సాధువు ఈ గాథను గుర్తుకు తెచ్చే ఖర్జూర వృక్ష దోహాను వల్లె వేస్తున్నాడు మరి

" సాథు భయా తో క్యా భయా

జై సే షేడ ఖబర్,

సంచీకో సాయా సహీఁ

ఫల తాగే అతిదూర్!"

హౌనయ్యా గొప్ప సాధువే ఖర్జూరం లాగ. పిట్ట వాలడానికి నీడ లేదు. పండ్లు కోసుకుందామంటే దూరంగా ఉన్నాయి .. అందవు"

(ప్రాకృతసాహిత్యంలో సామాన్యమానవుడు-తిరా--భారతి-75-6-౪.pdf)

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...