Saturday, December 4, 2021

ఈనాడు - మూర్హుల దినం - హాస్యం - గల్పిక రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 01 - 04-2010 న ప్రచురితం )

 



ఈనాడు - వ్యంగ్యం - హాస్యం - గల్పిక 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 01 - 04-2010 న ప్రచురితం ) 


జనాభాకన్నా ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రజాస్వామ్యం మనది. 


అరుపదులు నిండ కుండానే స్వతంత్ర సమరయోధుల పింఛ నందుకునే యోధులున్న పుణ్యభూమీ ఇదే. 


ఇక్కడ ఇడియట్ బాక్సుల అమ్మ కాలకు ఎంత లావు ఆర్థికమాంద్యాలూ అడ్డురాబోవు. 


చంద్రమండలంమీదైనా సరే చవగ్గా భూములమ్ముతున్నా రంటే కొనేదానికి కుమ్ముకునే ఆసాములు గజానికొకడున్న పూర్ణగర్భ కూడా ఇదే కదా! 


ఇంతకు మించి  మనతెలివికి గొప్ప నిదర్శనాలు ఇంకేం కావాలి?


యధా ప్రజా తధా రాజా  కదా! పాతపథకాలకే కొత్త పేర్లు పెట్టి రైలు బడ్జెట్లో మనూళ్ళ పేర్లన్నీ మమతమ్మ జెట్ స్పీ డుతో అప్పచెబుతుంటే, ఆనందం పట్టలేక చేతులు నొప్పిపుట్టేదాకా బల్లలు బాదిన ఎంపీలు- పార్లమెం టుకు మనం పంపిన ప్రతినిధులే కదా! 


కన్యాశుల్కం నాటకంలో ఒక్కడే వెంకటేశం. మనదేశ ప్రజా స్వామ్య నాటకంలో బోలెడంతమంది వెంకటేశాలు! 


వెంకటేశాలూ తిక్క శంకరయ్యలూ ఒకళ్ళనొకళ్ళు పిచ్చి పుల్లయ్యల్ని చేసుకుంటూ సంబరపడే పండుగే ఈ ఆల్ పూల్స్ డే ... అనగా చవటాయల దినం!


ఈ ఫూలును మొదట  కనిపెట్టిన మహానుభావుడు ఎవ రోకానీ మహాగడుసువాడై ఉండాలి. ఆల్‌ ఫూల్స్  డే, కొత్త ఆర్థిక సంవత్సరం- ఒకేరోజు వస్తాయి. 


ఏడాది పొడవునా మనం గడిపిన చచ్చు జీవితాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుని, రాబోయే చెత్త రోజులకు మనల్ని మనం సంసిద్ధం చేసుకోవటానికి ఈ చవటాయల దినాన్ని మించిన మంచి సందర్భం మరొకటి లేదు. హ్యాపీ ఫూల్స్ డే !


ఫూలంటే  తెలివితక్కువ దద్దమ్మని కదా అర్ధం! ఈ లోకంలో నాకన్నీ తెలుసనుకున్నవాణ్ని మించిన మూర్ఖుడు మరొకడు ఉండడు. 


మనం దున్నుకునేది మనదనుకునే భూమి ఏ పెద్దమనిషి దగ్గర లీజుకు పోయిందో తెలీదు. 


మన పేరుతో ఉన్న తెల్లకార్డు ఖచ్చి తంగా బోగస్ ది కాదని చెప్పగలిగే స్థితిలో మనం లేం. 


అంతెందుకు, మన జేబులో ఉన్న పర్సులోని వందనోట్లు నిఖార్సయినవేనని  టపీమని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? 


అందుకే అనేది... ఈ తెలివి తక్కువ లోకంలో తెలివితక్కువగా బతకటంకన్నా తెలివైన పని మరొకటి లేదని. 


తెలివి ఎక్కువైపోతే అన్నీ ఇబ్బందులే! భర్తృహరి లంతటివాడే తన సుభాషితాల్లో ముందుగా మూర్ఖుణ్ని తలచుకున్నాడు. 


నిప్పుకి నీరు, ఎండకు గొడుగు, ఏనుగుకు అంకుశం, ఎద్దు గాడిదలకు ముల్లుగర్ర, రోగానికి మందు, విషానికి మంత్రం విరుగు డుగా చెప్పిన శాస్త్రాలు కూడా చవటాయిలకు మాత్రం ఏది నివారణో చెప్పలేక చేతులెత్తేశాడాయన! 


పువ్వుతో వజ్రాన్నైనా పరపరా కోసేయవచ్చేమోగానీ, మంచిమా టలు చెప్పి మూర్ఖుణ్ని రంజింపజేయటం ఉప్పునీటి సముద్రంలో తేనెబొట్టువేసి తీపిదనాన్ని రాబట్టడమంత తెలివితక్కువదనం ఆనటం- ఎంత తెలివైన మాట!


జేబులో చిల్లు కాణీ లేకపోయినా- ఎన్నికల్లో నిలబడి నెగ్గుకురాగలమని ఎవరైనా నమ్ముతున్నారా? 


తెలుగు చిత్రాలకు ఏనాటికైనా ఆస్కారు పురస్కారాలొచ్చి తీరుతా యని ఆశపడుతున్నారా? 


టీవీ సీరియల్స్ పదమూడు ఎపిసోడ్లతో ముగుస్తాయనీ, పెట్రోలు రేట్లు ఎప్పటికైనా తగ్గుముఖం పట్టక తప్పదనీ, ప్రైవేటు పాఠశాలలు ఫీజు లేకుండా పిల్లలకు తెలుగులో పాఠాలు చెప్పే రోజులు వస్తాయనీ - మీరూ నమ్ముతున్నారా? 


కచ్చితంగా నమ్మేవారంతా కలిసి చేసుకోవాల్సిన ఘనమైన సంబరం- ఈ చవటాయల దినోత్సవం. 


విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే పాలచెంబులు పట్టుకుని పరిగెత్తేవాళ్ళూ, పూర్వజన్మల పాపాల ప్రక్షాళన కోసం బాబాల కాళ్ళతో తన్నించుకునేందుకు బ్లాకులో టికెట్లు కొనడానికి ఎగబడేవాళ్లు , బయటకు కనిపించేదంతా ఆశాశ్వతమైన తోలుతిత్తి, ఆత్రమేగాని అసలైన అంతరాత్మకు ఎన్ని అంట్ల పనులు చేసినా మైలనేది అంటుకోదని శృంగార లీలల దృశ్యకావ్యంతో ప్రబోధించే స్వాముల పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేసే పరమాణు వులు..  అంతా కలిసి ఓ 'చవటాయల సంఘం' పెట్టుకో వాల్సిన సమయం సందర్భo కూడా ఇదే!


ఎలాగూ కొత్త జనాభా లెక్కల సేకరణ మొద లైంది. ఈసారైనా మూర్ఖుల వివరాలు సమగ్రంగా సేకరించే ఏర్పాట్లు సర్కారు చేసేదిశగా ఒత్తిడి చేయటానికి, 'ముక్కోటి మూర్ఖుల ' సంతకాలు సేక రించే ఉద్యమం ప్రారంభించటానికి, చవటాయిలు చైతన్యయాత్రలు చేయటానికి ఈ దినోత్సవమే సముచితమైన సందర్భం. 


ఫోర్బ్స్ కుబేరుల టాప్ టెన్ జాబితాలో మన వాళ్ళేదో ఇద్దరు ముగ్గురు ఉన్నందుకే మురిసి ముక్కలైపోతున్నామే.  నిఖార్సైన  'పూల్స్' జాబితాను నిజాయతీగా విడుదల చేయమనండి- టాప్ టెన్ థౌజండ్లో ఒక్క పేరు కూడా పక్క దేశాలకు పోయే అవకాశం లేదు. 


నోబెల్ పురస్కారాల్లాంటివి 'దద్దమ్మ'లకూ ఇచ్చే పద్ధతి మొదలు పెడితే- ఏడాదికొక తిక్క శంకరయ్య మనదేశం నుంచీ నామినేట్ కావటం ఖాయం.


మనలోని తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేకపోవట మంత తెలివితక్కువ తనం మరొకటి లేదు. ఆందోళ నలు చేస్తేగానీ ఏదీ ఈ ప్రభుత్వాల చెవుల కెక్కదు. అందులో భాగంగానే ఈ చవలాయీల దినోత్సవానికి రెండు రోజుల ముందుగానే ఆ మూఢుల సంఘం తరు పున ఎవరో మన సమాచార శాఖ ఆంగ్లప్రతిలో గవ ర్నరు ఫొటో బదులుగా వేరొకరిది పెట్టేశారు! 


శభాష్! కార్యాచరణ అప్పుడే మొదలైందన్నమాట!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 01 - 04-2010 న ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...