Saturday, December 4, 2021

ఈనాడు - వ్యంగ్యం - హాస్యం - గల్పిక భూతల స్వర్గం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - తేదీ నమోదు కాలేదు - న ప్రచురితం )

 



ఈనాడు - వ్యంగ్యం - హాస్యం - గల్పిక 

భూతల స్వర్గం 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - తేదీ నమోదు కాలేదు -  న ప్రచురితం )  


'ధరలు భయంకరంగా పెరిగిపోయాయని, జీతాలు చాలటం లేదని, రేషన్ పూర్తిగా ఇవ్వటం లేదని, గ్యాసు వేళకు రావడం లేదని, పిల్లల చదువులు భారమయ్యాయని, కరెంటు కోతలని, నీళ్లకు కటకటగా ఉందని .. ఇలా పొద్దస్తమానం ఆపసోపాలు పడిపోతుంటావుగా ! నీ బాధ చూడలేక ఆ దేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకో  అని  అడిగితే- నువ్వేం కోరుకుంటావురా అప్పా రావ్?' 


' సర్వ రోగాలకూ నివారిణి విటమిన్ 'ఎమ్' కదన్నా! అందుకే బాధలూ, బాదరబందీలూ బందై పోవాలంటే ఏ టాటా లాగానో పుట్టించెయ్యమంటా'


'ఆ టాటా మాత్రం ఏమన్నా సుఖంగా ఉన్నాడ్రా?  పెట్టిన రూపాయి పెట్టుబడికి కనీసం పది పైసలన్నా గిట్టుబాటు అవుతుందో లేదో నని ఎన్ని నిద్రల్లేని  రాత్రులు గడుపుతు న్నాడో  నీకు తెలుసా? ఈ గొడవలనుంచి ఉపశమనంగా ఉంటుందని ఏ రాడియా లాంటి లేడీకో ఫోన్చేసి కాస్త సరదాగా అలా వంటి మీది వేసుకునే కోటు గురించో, పార్టీలో ధరించే గౌను గురించో ముచ్చట్లాడుకుంటే వాటినీ ఎవడో గిట్టనివాడు టేపుల్లో భద్రం చేసి బెదిరింపులకు దిగుతుంటాడాయే! ఆ టేపులు ఆపుకోవటానికి అంత పెద్ద టాటాకే న్యాయవ్యవస్థను ఆశ్రయించాల్సిన పరిస్థితి .. వచ్చిందా . . రాలేదా?' 


'అయితే నేను ఆ న్యాయాధికారిగానే మారిపోతే సరిపోతుందిగదన్నా, దేవుణ్ని అదే కోరుకుంటా!' 


 ' న్యాయాధికారులకూ మాత్రం కష్టాలు తక్కువట్రా! ఏదో కడుపు కట్టు కుని ఇంత దాచుకున్నా, ఏ పొడగిట్టని మీడియావాడో దాన్ని అవినీతి సొమ్మని రచ్చకీడుస్తాడు. ఆ లెక్కలు చూపలేకా, చూపించకుండా ఉండలేకా వారు పడే యాతన నీకు తెలుసా? కడివెడంత గుమ్మడైనా కత్తి పీటకు లోకువని సామెత. మీడియానా... మజాకా' 


' అయితే, ఆ మీడియావాడిగా అవతారమెత్తితే పోలేదా అన్నా! హాయిగా ఉంటుంది' 


' మీడియాకి హాయి ఆమడదూరంరా భడవా! వాళ్లుపడే బాధ ఆ పగవాళ్లక్కూడా వద్దు ! ఎంతో రిస్కు తీసుకుని ఏ కుంభకోణాన్నో  వెలికితీసినా- ఆ సంతోషం మూణ్నాళ్ల ముచ్చటే!  అన్ని వైపుల నుంచి వచ్చే ఒత్తిళ్లూ తట్టుకోవాలి. వార్తలకోసం కత్తిమీద సాము చేసేకన్నా. చక్కగా ఏ చిన్న సినిమా తీసుకుంటే... పేరుకు పేరూ, డబ్బుకు డబ్బూ' 


'మరింకేమన్నా, ఆ నిర్మాతగా మారిపోతే పోలా, ఏ

తలనొప్పులూ ఉండవ్'


' కానీ, సినిమా అంటేనే ఓ పెద్ద తలనొప్పి కదరా! జాగ్రత్తగా తీయకపోతే జనాలను పీడించిన పాపం అదనంగా చుట్టుకుంటుంది. పెద్ద నిర్మాతైనా ఫీల్డులోని  బాయికీ దడుచుకోవాలి. హీరోవరకూ ఫర్వాలేదుగాని, పది రూపాయల వడ్డీకి డబ్బిచ్చిన ఆ మాఫియావాడు ఆడటమన్నట్లాడాలి.  చివరికి ట్యాంకుబండ్ మీదనుంచీ దూకాలి. మరి దానికి సిద్ధమేనా? '


' మరైతే నేను ఆ మాఫియావాడిగా పుడతానన్నా మరో మాట లేదు. ' 


' మాఫియావాడిగా పుట్టించమని దేవుణ్ని వరమడుగుతావా! నీకసలు బుద్దుందా? వాడి బతుకేమన్నా రోజా  పూల బాట అనుకున్నావుట్రా! ఎన్ని అడ్డదార్లు తొక్కితే ఆ గడ్డి జమవుతుంది. ఎన్ని సెటిల్మెంట్లు చేసినా- సొంత లైఫ్ కే  సెటిల్మెంట్ ఉండదు. నువ్వెంత పెద్ద డాన్నైనా నేరుగా ఏ పనీ చేయడానిక్కుదర్దు . కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నా- పదివేలు జీతం రాని పోలీసువాడి ముందు చేతులు నులుపుకుంటూ నిలబడాలి.. తెలుసా!!


'అలాగైతే, నీతికీ న్యాయానికి మారుపేరైన ఆ కనపడని నాలుగో సింహం పోలీసువాడినవుతా, సమాజంలో గౌరవంగానూ ఉంటుంది'


'ఎంత చేసినా ఎవరూ మెచ్చుకోని అరవ చాకిరీ గిరీరా

బాబూ అది. అల్లర్లు, ఆందోళనల మధ్యే జీవితం తెల్లారిపోతుంది . ఏ మంత్రిగారికో తిక్కరేగిం దంటే- గుక్కతిప్పుకోలేక చావాలి.  నువ్వు ఏరికోరి ఈ కొరివితోనా  బుర్రగోక్కో వాలనుకునేది?


'నిజమేనన్నా! అసలు రాజకీయ నాయకు డిలా పుట్టాలని నాకిప్పటిదాకా ఎందుకు తట్టలేదో! ఎన్ని కలప్పుడు తప్ప ఎవరికీ ముఖం చూపించనక్కర్లేని రాజా బతుకుగదా అది! ప్రజాస్వామ్యంలో నాయకుడికి మించిన మజా ఇంకేం ఉంటుంది చెప్పు ?' 


`అంటే- ఓ నేతగా అవతారమెత్తేసి వెంటనే జనోద్ధరణ చేసిపారేస్తానంటావా! నీకు బుద్ధే కాదు, ఇంగితం కూడా లేదని తేలిపోయిందిప్పుడు' 


' ఏంటన్నా మరీ ఆ దెప్పుడు?"


' లేకపోతే ఏంటిరా!  ఈ భూమండలంలో నిత్యశంకితుడు, నిత్యదుఃఖితుడు, నిత్య రోగి, పరమ నిర్భాగ్యుడు.. రాజకీయ నాయకుడేరా! పేరుకు పెద్ద నాయకుడే అయినా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరూ వాడితో చెడుగుడు ఆడుకునేవాళ్లేగా? రచ్చబండల్లో రాళ్లు వేయించుకోవడానికి, దిష్టిబొమ్మలు కాల్పించుకోవడానికేనా ఆ హోదా మీద మోజుపడుతున్నావు? '


'పెద్దమనిషివి. ఇక నువ్వే మంచి సలహా ఇవ్వొచ్చుగదన్నా!  ఆ దేవుడొచ్చి అడిగితే నన్నేవరం కోరుకోమంటావు?' 


' రిస్కు  లేకుండా వ్యాపారాలు చేసుకునే చోటు ఒకటుంది. అక్కడ రీ ఛార్జి కూపన్లు అమ్ముకున్నా చాలు- అంబానీల కన్నా ఎక్కువ లాభాలు సంపాదించొచ్చు. రింగులు కట్టే గుత్తేదారులు అక్కడ ఉండరు. అది మీడియా సైతం చొరబడ ని వండర్ల్యాండ్ . ఫిర్యాదులు వచ్చినా మర్యాద కాపాడటానికి దేవుళ్ళలాంటి వార్డెన్ల  సేవలు అక్కడ ప్రత్యేకం.  కరవు కాలంలోనూ చిటికేస్తే మందూ, చికెన్ పలావులు ప్రత్యక్షమవుతాయి. సీఎం క్యాంపు ఆఫీ సులకైనా తప్పని కరెంట్ కోతలు, నీటి కటకటలూ అక్కడ మచ్చుకైనా కనిపించవు. ఒక్క ఐఎస్ఐ.. అంటే బాంబులేసే ఆ పాకిస్తోనోడి రౌడీలన్న మాట.. వాడిలా  ముద్ర వేయించుకుని జైలుకెళితే  చాలురా- జీవితాంతమూ  రాజీవ్ గాంధీ కొడుకుకున్నా విలాసంగా బతికేయొచ్చు' 


'అర్థమైందన్నా. ఆ చర్లపల్లి చెరసాల గురించేగా నువ్వింతగా ఊరిస్తున్నది. సరే, ఆ దేవుడొచ్చి అడిగితే రిమాండు ఖైదీగా ఆ భూలోక స్వర్గాన్ని ప్రసాదించమనే కోరుకుంటా!!


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - తేదీ నమోదు కాలేదు -  న ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...