ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం
మాయ ( దారి ) వినోదం
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ప్రచురణ తేదీ - 17 -07 - 2002 )
ఆగ్రాలో తాజ్ మహల్ ను మాయం చేసినాయన మనూరొచ్చి మేజిక్ చేస్తున్నాడు. తెలుసా?'
ఇక్కడేం మాయంచేయబోతున్నాడో! చార్మినారా... గోలుకొండా... అసెంబ్లీనా! అసెంబ్లీని మాయంచేస్తే మనకు పన్ను లేసిపెట్టే వాళ్ళెవరుంటారూ..? ఏ చార్మినార్తోనో... గోలకొండతోనే సరిపెట్టుకుంటా
డనుకుంటా!
వాటికన్నా ఊరికడ్డంగా పారే ఈ మురుక్కాలవల్ని మాయం చేసిపారెయ్ కూడదూ... పుణ్యం... పురుషార్ధం రెండూ దక్కుతాయి. '
' ఛ' వూరుకో ! ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రముఖ మెజీషనాయన... మనూళ్ళో మురుక్కాలవల్ని మాయం చేయమంటే బావుంటుందా? మొన్న జరిగిన ఫుట్ బాల్ వరల్డ్ కప్ మేచీలప్పుడు మేజిక్ చెయ్యమని జపాన్, కొరియా వాళ్ళే కోరి మరీ అడిగారీయన్ని... తెలుసా!
తెలుసులే! మా ఇండియన్స్ ఎవరూ ఆడటంలేదు కనక, నేనూ మేజిక్ చేస్తే అంత బావుండ దని చెప్పి తప్పుకున్నాడని విన్నాను. నిజ మైన దేశవిరక్తి అంటే అదీ! మొత్తం మీద ఒకటి మాత్రం బలంగా రుజువైండోయ్ భగవానూ ! ప్రపంచం మన ఆటల్ని గుర్తించటం లేదుగానీ, మన మాయల్ని మాత్రం బాగా గుర్తించినట్లు కని పిస్తోంది.
అవును మనవాళ్ళ మాయ సామాన్యమైనదా ? శూన్యంలోనుంచి బూడిదను సృష్టించే వాళ్ళూ, ఆకుల్లో నుంచి పెట్రోలు పిండే వాళ్లు, విగ్రహాలకు పాలు పట్టించేవాళ్ళూ, కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా కోకొల్ల లుగా వున్న దేశమాయ మనది. డిస్కవరీ ఛానల్ చూడలా! ఇండియా అనంగానే నాలిక్కిసూదులు గుచ్చుకొనేవాళ్ళనీ, ముళ్ళ మీద బాసింపట్టేసుక్కూర్చున్న గడ్డాల వాళ్ళనీ, కొరడాలతో వాళ్ళ ఒళ్ళు వాళ్ళే చీరే సుకునేవాళ్ళనీ తెగ చూపించేస్తుంటారు!
అవును ఒక రకంగా అదీ నిజమేగా ! పొద్దున లేచింది మొదలు పొద్దుపోయేవరకూ ఇక్కడ జరిగేటన్నిమాయలు ప్రపంచంలో ఇంకెక్కడా జరుగుతాయనుకోను. రాత్రి జేబులో వేసుకున్న చిల్లర తెల్లారిచూసుకుంటే మాయమవుతుంది . కాలేజీలో వుండాల్సిన కుర్రవాడు సినిమా హాల్లో ప్రత్యక్షమవు తాడు. పాత పేంటుల్ని, చొక్కాల్నీ క్షణంలో స్టీలుసామాను కింద మార్చేస్తుంది మా ఆవిడ. ఇవన్నీ గృహ మాయలు. సర్దుకుపోవచ్చు .
బజారుమాయ సంగతి తల్చుకుంటేనే గుండె బేజారయిపోతుంది .
మార్కెట్లో కిలో తూగిన వంకాయలు ఇంట్లో తొమ్మిదొందల గ్రాములే వుంటాయి! షాపులో తళతళ లాడుతూ మురిపించే చీర కొనుక్కొని ఇంటికి తెస్తే వెలవెల పోతుంటుంది. క్లోనింగ్.. క్లోనింగని సైంటిస్టులిప్పుడు ఊరికే చంకలు గుద్దుకుంటున్నారుగానీ, మనవాళ్ళా ట్నెక్నిక్ ఎప్పుడో పట్టేశారు. ఒరిజినల్ డూప్లికేటు కూడా తేడా తెలియని విధంగా సరుకు తయారుచేసే మెజీషియన్లు చాలామందున్నారు మన వినియోగదారుల మార్కెట్లో. ఒరిజినల్ కన్నా డూప్లికేట్ ప్రింట్ అదీ బాగుంటుందని వంద రూపాయల నోటుని చూసినవాళ్ళెవరైనా ఒప్పుకోకతప్పుడు.
ఆఫీసులో ఫైళ్ళు, జైళ్ళల్లో ఖైదీలు, వంట్లో కిడ్నీలు మాయమవటం లాంటివి మనకు అతిమామూలు మేజిక్ కిందే లెక్క. రోగాలు మాయమవాల్సింది పోలి రోగులు మాయమవటం అంతకన్నా మరీ మేజిక్ •
మేటర్ మరీ సీరియస్ గా మారుతోంది .
మిత్రమా! నేను చూసినది కేవలం వినోదానికి సంబంధించిన మాయ గురూ.. వాటరాప్ ఇండియాని చూడు! ఒక ఖాళీ చెంబులో నుండి కార్యక్రమం అయిపోయినంత సేపూ నీటిని వూరిస్తూనే ఉంటాడు ! '
ఆ టెక్నికేదో మన వాటర్ వర్క్స్ వాళ్ళకు నేర్పితే బాగుణ్ణు! వర్షాకాలంలో
కూడా వాళ్ళు వేసి బోరుల్లో నీళ్ళు రాక జనం భోరుభోరుమంటున్నారు'
'నువ్వలాగే అంటావని అనుకున్నా. కళ్ల గ్గంతలు కట్టుకుని ఒక పెద్దబోర్డు మీద మన ఐఐటి అమ్మమొగుడు ఫార్ములాన్ని చిటికెలో సాల్వ్ చేసిపారేశాడు!
కళ్ళగంతలు కట్టుకొనేగా మనవాళ్ళు పిల్లకాయల ఎమ్సెట్ .. గట్రా ప్రశ్న పత్రాలు సెట్ చేసేది! ఫలితాలు వచ్చినా వాళ్లు కట్టుకున్న గంతలు ససేమిరా విప్పునేవిప్పరు! మన విద్యావేత్తల కన్నా ఆయన గొప్ప మెజీషియనా?
ఒక అందమైన అమ్మాయిని రంపం పెట్టి పరపరా కోసి మళ్ళీ క్షణంలో అతికించి బతికించాడు తెలుసా?
ఈ రంపం కోతలు. . అందులోనూ ఈ దేశంలో అడవాళ్లకు . వాళ్ళ శీలమంత సహజమైనవేలే! పేపర్లో చదవలా.. మొన్నామధ్య .. అదేదో ఊళ్ళో ఒకావిడని శీలపరీక్ష చేసుకోమని అత్తగారూ వాళ్లూ ఒత్తిడి చేస్తే కాలే ఇనప చువ్వలని అరచేతుల్తో పట్టుకొని మరీ తన సచ్చీలాన్ని నిరూపించుకున్న మేజిక్ ; వీడియో కూడా తీశారంట భావితరాల వాళ్ళకు గైడ్ గా వుండటానికని!
వంద నోటును చూస్తూండగానే రూపాయి నోటు కింద మార్చేశాడు.. !
ప్రతిబడ్జెట్ లో ఫైనాన్స్ మినిష్టరు చేసే ఫీట్ అదేగా!
పదివేల రూపాయల కట్టను మనకళ్ళ ముందే బుట్టలో పడేసి మాయం చేశాడయ్యా మహానుభావుడూ!
పదివేలేం ఖర్మ! పది వేల కోట్లయినా ఏ బుట్టా తట్టల్లో పెట్టకుండానే చిటికెలో మాయం చేసే మహామాయ బ్యాంకులు మనదేశంలో ఎన్నిలేవు సుబ్బారావ్?
సరే ! ఇంతకీ సరదాకోసం చేసేని ఈ మాయ.. మాయకోసం చేసేది ఆ సరదా! రెంటికీ తేడా లేదంటావా వెంకట్రావ్ ?
చచ్చేటంత ఉంది. కానీ వినోదాన్ని మాయగామార్చేస్తున్నాయ్ మన సినిమాలు.. టీవీలు . అనీ పెద్ద విషాదం. ఇంతకి ఈ మాయా వినోదుడి పేరేమిటన్నావ్?
పి.సి.సర్కార్
సర్కారుకూ .. మేజిక్కీ మధ్యేదో కనిపించని లింకున్నట్లే అనిపిస్తుందయ్యా సుబ్బారావ్ !
ఎట్లా?
పి.సి. సర్కారు మేజిక్కును చూసి ఇంప్రెస్ అయే కాబోలు ..
రాత్రికి రాత్రే ఆర్టీసీ టిక్కెట్లలోని పైసల్ని మాయంచేసింది మనా ఎ.పి. సర్కార్ !
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ప్రచురణ తేదీ - 17 -07 - 2002 )
No comments:
Post a Comment